top of page
Original.png

పునాది రాయి

#పునాదిరాయి, #PunadiRayi, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Punadi Rayi - New Telugu Story Written By Mayukha

Published in manatelugukathalu.com on 28/02/2026

పునాది రాయి - తెలుగు కథ

రచన: మయూఖ


ఆ ఊరు సీతారామపురం. పేరుకు తగ్గట్టే ఆ ఊర్లో ప్రజలందరూ ఎంతో ప్రేమాస్పదంగా, అన్నదమ్ముల వలె ఉంటారు. ఆ ఊరి ప్రెసిడెంట్ ధర్మరాజు. ముక్కుసూటి మనిషి. కానీ మంచివాడు. ఆ ముక్కుసూటితనమే ఆయనకు 'గర్విష్టి' అనే పేరు కూడా తెచ్చింది. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఊరిలో ఒక గొడవ మొదలైంది.

**

ఒకరోజు రచ్చబండ దగ్గర ప్రజలందరితో మీటింగ్ పెట్టి "ఊరి మధ్యలో ఉన్న భూమిలో ప్రభుత్వ నిధులతో పేదలకు ఇల్లు కట్టిస్తాను" అన్నాడు ధర్మరాజు.


అదే గొడవకు కారణమైంది. ఆ భూమి ఊరు చివర ఉన్న సుబ్బయ్యతాతది. "అదేంటయ్యా! అది మన సుబ్బయ్య భూమి, దాంట్లో మీరు ఇల్లు కట్టిస్తానంటే ఎలాగ?" అన్నాడు రమణయ్య.


అందరూ ధర్మరాజు "సుబ్బయ్య స్థలం కాజేయడానికి, గవర్నమెంట్ నిధులు దొంగలించడానికి ఇలా పథకం వేశాడు" అనుకున్నారు.


"అయ్యా! ఆ భూమిలో పునాదిరాయి అంటూ పడిందంటే అది నా శవాన్ని దాటుకుంటూ వెళ్లి వేయండి. అది మా తాతల కాలంనాటి భూమి. మీరు దాంట్లో ఇల్లు కట్టిస్తానంటే నేను ఒప్పుకోను" అన్నాడు ఆక్రోశంతో సుబ్బయ్య.


సుబ్బయ్య మాటలు విని ప్రజలంతా హాహాకారాలు చేశారు. "ఇంత అన్యాయం చేస్తారా!" అని ప్రజలంతా మండిపడ్డారు. చేసేదేమీ లేక ధర్మరాజు సభ ముగించుకుని వెళ్ళిపోయాడు.


ఎలాగైనా ఆ భూమిలో ఇళ్లు లేని పల్లె ప్రజలకు ఇళ్లు కట్టించాలని కంకణం కట్టుకున్నాడు ధర్మరాజు.


ఊరంతా సుబ్బయ్యకు మద్దతుగా ఉంది. ఊరు చివర చిన్న గుడిసె వేసుకుని బతుకుతున్న తాత ఆందోళన చెప్పనలవి కానిది.


పట్టణంలో చదువుతున్న గోపికి ఈ వ్యవహారం అంతా తెలిసి నెత్తురు ఉడికిపోయింది. ఎన్నాళ్ళీ పెత్తందారి వ్యవహారాలు? దీనికి అడ్డుకట్ట వేయాలని చూశాడు.


ఆ రాత్రి సుబ్బయ్య గుడిసె దగ్గరికి వెళ్లి, "తాత! నీ భూమికి సంబంధించిన కాయితాలు చూపించు. అవి నీ దగ్గర ఉన్నాయా? నువ్వు ఒంటరి పోరాటం చేయలేవు, మనం ఎమ్మార్వో ఆఫీస్ లో కంప్లైంట్ పెడదాం, మేము అందరం నీకు సపోర్టుగా ఉంటాం, ఈ దెబ్బతో ఆ ధర్మరాజు దొరతనానికి అడ్డుకట్ట వేయిస్తాం" అన్నాడు ఆవేశంగా గోపి.


తాత కళ్ళనీళ్ళతో పాతబడి, నలిగిపోయిన దస్తావేజులు తీసుకువచ్చి చూపించాడు. "బాబు! నన్ను ఎలాగైనా కాపాడండి, నాకు న్యాయం జరిగేటట్టు చేయండి" అన్నాడు ఏడుస్తూ.


ఆ రాత్రి గ్రామంలో యువకులందరినీ సమావేశపరిచి, "తాత వ్యవహారంలో అన్యాయం జరగకుండా చూడాలని చెప్పాడు". దాంతో మర్నాడు ఉదయమే అందరూ కలిసి ధర్మరాజు ఇంటికి వెళ్లి "ధర్మరాజు డౌన్ డౌన్! సుబ్బయ్య తాతకు న్యాయం జరగాలి!" అంటూ నినాదాలతో అరిచారు.


ధర్మరాజు, వ్యవహారం ముదురుతోందని పోలీసుల్ని పిలిచాడు.


పోలీసులు లాఠీచార్జ్ చేసి అందర్నీ చెదరగొట్టారు. కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు.


ఊరి జనం అంతా సుబ్బయ్య తాత వైపే ఉన్నారు. ఆయన అమాయకత్వం, నిస్సహాయత వాళ్లని కదిలించింది. రోజూ ఊరు మధ్యలో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని, కన్నీళ్లు పెట్టుకుంటున్న సుబ్బయ్య తాతని చూసి అందరూ ప్రెసిడెంట్ ని తిట్టుకునేవారు.


విషయం తాలూకా ఆఫీస్ వరకు వెళ్ళింది. ఎమ్మార్వో కలగజేసుకుని, రెండు రోజుల్లో ఊరిలో గ్రామసభ పెట్టి అందరి సమక్షంలో ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చాడు. దాంతో అందరూ శాంతించారు.


*******


గ్రామసభ మొదలైంది. గోపి లేచి సుబ్బయ్య తరపున వాదనలు వినిపించాడు. ఆ పాత కాగితాలను ఎమ్మార్వో ముందు పెట్టి, "ధర్మరాజు ఎలా ఒక నిరుపేదను మోసం చేస్తున్నాడో" అని ఉద్వేగంగా చెప్పాడు.


ఊరి జనం అంతా చప్పట్లతో గోపిని సమర్థించారు.


ఎమ్మార్వో ధర్మరాజు వైపు తిరిగి "మీరేం చెబుతారు ప్రెసిడెంట్ గారు?" అన్నాడు.


ధర్మరాజు శాంతంగా తన చేతిలో ఉన్న ప్రభుత్వ రికార్డులు ఎమ్మార్వోకు ఇచ్చాడు. వాటిని చదువుతున్న ఆయన ఆశ్చర్యంగా చూసి, "గ్రామస్తులారా! ప్రశాంతంగా వినండి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ స్థలం సుబ్బయ్యది కాదు. ప్రభుత్వ పోరంబోకు భూమి." ఆ మాటతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. మళ్లీ ఎమ్మార్వో కొనసాగిస్తూ..


"అసలు విషయం ఏమిటంటే ధర్మరాజు గారు ఈ స్థలంలో ప్రభుత్వ గ్రాంటుతో పేదలకి ఇళ్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపారు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి" అన్నాడు.


ఊరి జనం నివ్వెరపోయారు. అప్పుడు ధర్మరాజు ఇంకో నిజం చెప్పాడు: "ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించి మా నాన్న దగ్గర తన కూతురు పెళ్లి కోసం 50 వేలు అప్పు తీసుకున్నాడు ఈ సుబ్బయ్య. మా నాన్న పోయిన తర్వాత బాకీ తీర్చమని అడిగితే, అది తీర్చకుండా నేను అతని స్థలాన్ని కాజేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నాడు. గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించాడు, మళ్లీ నా బాకీ కూడా తీర్చలేదు. ఇప్పుడు చెప్పండి సుబ్బయ్య తాత ఎటువంటి వాడో?" అన్నాడు.


ఊరంతా దిగ్భ్రాంతికి గురైంది. అమాయకుడని, నిస్సహాయుడని జాలిపడిన సుబ్బయ్య ఇంత మోసగాడా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. తన పాత అప్పును తీర్చకుండా, ప్రభుత్వ భూమిని కాజేసి ఊరినంతా తప్పుదోవ పట్టించాడని గ్రహించారు.


తాత కళ్ళల్లో ఇప్పుడు జిత్తుల మారి నక్క కళ్ళలోని కఠినత్వం మాత్రమే ఉంది.


ధర్మరాజు గోపి దగ్గరికి వచ్చి "పల్లెటూరి మనుషులంటే అమాయకులు అనుకున్నావేమో! ఇక్కడి రాజకీయాలు, ఎత్తుగడలు పట్టణంలో కూడా ఉండవు. కంటికి కనిపించే ప్రతి కన్నీటి చుక్క నిజం కాదు. తెలుసుకో తమ్ముడు" అన్నాడు.


"ఊరి మనుషులను అర్థం చేసుకోవడానికి చదువు ఒకటే సరిపోదని, జీవితం నేర్పే అనుభవం కూడా కావాలని" ఆ క్షణంలో అనిపించింది గోపికి.


******శుభం *******

మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page