top of page
Original.png

సమాజ హితానికి ఏఐ

13 hours ago
5 min read

ఏఐ సాంకేతికతతో గుడి పరిసరాల్లో చెత్త సమస్యను పరిష్కరించిన యువకులు రవి, వంశీ – సమాజ హితానికి ఏఐ తెలుగు కథ

Samaaja Hithaniki AI- Telugu Social Story | Mayukha

సమాజ హితానికి ఏఐ - తెలుగు సామాజిక కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 13/10/2026


సాంకేతికతను వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా ఉపయోగించవచ్చని చాటిచెప్పే స్ఫూర్తిదాయక కథ “సమాజ హితానికి ఏఐ”.


"అమ్మా! నేను గుడికి వెళ్తున్నా!"


"ఏమిట్రోయ్! ఎప్పుడూ లేనిది, ఇప్పుడు కొత్తగా!"


"అదేంటమ్మా అలా అంటావ్! నాకు ఖాళీ లేకగానీ, లేకపోతే గుడికి వెళ్లకుండా ఉంటానా!"


"అవునులే! మొన్నా మధ్యన ఎగ్జామ్స్ రాశావు కదా, రిజల్ట్స్ వచ్చే టైమ్ అనుకుంటా! దేవుడి మీద ఆ మాత్రం భయం, భక్తి ఉండాల్లే!"


"సర్లే అమ్మ! ఎప్పుడూ నన్ను ఎగతాళి చేయడమే నీ పని!"


నవ్వుకుంది సరోజ, కొడుకు రవి మాటలు విని.


రవి బీటెక్ మూడో సంవత్సరం పరీక్షలు రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు.


పక్క వీధిలో కొత్తగా శివాలయం కట్టారు.


ఎక్కడైనా రామాలయాలు ఎక్కువగా ఉంటాయి కానీ, శివాలయాలు తక్కువ.


అటువంటిది పక్క వీధిలోనే శివాలయం రావడం, దానికి తగ్గట్టు గుడిలో పూజారి గారు ఎంతో భక్తిశ్రద్ధలతో నమక, చమకాలతో తెల్లవారుజామునే రుద్రాభిషేకం చేయడంతో అందరూ ఎంతో శ్రద్ధగా గుడికి రావడం, దీపాలు పెట్టుకోవడం జరుగుతోంది.


సరోజ కూడా రోజూ గుడికి వెళ్లి అభిషేకం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తోంది.


కానీ ఈ వీధికి, పక్క వీధికి మధ్యలో ఖాళీ స్థలం ఉండడంతో ప్రతివాళ్లూ అక్కడ చెత్త వేయడం జరుగుతోంది. గుడిలోకి వెళ్లాలంటే ఆడవాళ్లు ఆ చెత్త తొక్కుతూ వెళ్లవలసి వస్తోంది.


పైగా కుక్కలు ఆ చెత్తంతా లాగేయడంతో రోడ్డంతా చాలా అసహ్యకరంగా ఉంటోంది.


ఒకరోజు సరోజ గుడి నుంచి ఇంటికి వస్తుంటే, కుక్కలు దెబ్బలాడుకుని చెత్తంతా చిందరవందర చేశాయి. అవి తొక్కుకుంటూ రావడం సరోజకు ఎంతో బాధ కలిగించింది.


ఇంటికి వచ్చి భర్త రమణతో, "గుళ్లోకి వెళ్లినా ప్రశాంతత లేదండి! ఇంటికి వస్తుంటే ఆ రోడ్డంతా చెత్తతో నిండిపోయింది.


చుట్టుపక్కల వాళ్లకేనా బుద్ధి ఉండక్కర్లేదా! రోడ్డుమీద చెత్త వేస్తారా? అందునా గుడి పక్కన... ఛీ ఛీ!" అంది బాధగా.


"లేదు సరోజ! చుట్టుపక్కల వాళ్లు కాదు, ఎవరో దూరం వాళ్లు బండిమీద వెళ్తూ చెత్త సంచులు విసిరేస్తున్నారట, మొన్న పూజారి గారు చెప్పారు."


"అయ్యో అలాగా! దీనికి ఏదో పరిష్కారం చూడాలండి!"


ఒకరోజు గుడి కమిటీ సభ్యులు పూజారి గారితో కలిసి, మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వెళ్లి చెత్త గురించి ఫిర్యాదు చేశారు.


తక్షణమే ఆయన స్పందించి మైక్ పెట్టించారు. "చెత్త వేస్తే వెయ్యి రూపాయలు జరిమానా!" అని మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపించేది.


దాంతో కొత్తలో చెత్త వేయడం మానేశారు కానీ, మళ్లీ మామూలే అయిపోయింది.

రవి రోజూ గుడికి వెళ్తున్నాడు.


"ఏమిటోయ్! నీ పుత్రరత్నం రోజూ గుడికి వెళ్తున్నాడు, దేవుడి కోసమా? దేవత కోసమా?" అన్నాడు హాస్యంగా రమణ.


"అవున్లేండి, 'యద్భావం తద్భవతి' అన్నారు పెద్దలు. మీరు మాత్రం తక్కువ తిన్నారా! రోజూ నేను గుడికి వెళ్లి వస్తుంటేనే కదా నన్ను చూసి పెళ్లి చేసుకున్నారు! అయినా అప్పుడు దేవతనయ్యాను, ఇప్పుడు దెయ్యాన్ని అయ్యాను" అంది కినుకుగా.


"చాల్లే! నువ్వు ఎప్పుడూ నా దేవతవే!"


"సర్లేండి, 'అయిపోయిన పెళ్లికి ఎవడో కొత్తగా బాజా కొట్టినట్టు'... అలా ఇప్పుడు మనది ఎందుకు కానీ, అయినా మీరు ఎప్పుడూ వాడిని ఏదో అనాలని చూస్తారు! నేను చెప్తున్నాను మనవాడు శ్రీరామచంద్రుడే! ఈ రోజుల్లో ఉండవలసినవాడు కాడు.


మన వీధి చివర రామకృష్ణ గారి అబ్బాయిని చూడండి! ఎప్పుడు చూసినా ఎవరో అమ్మాయిని వెంటేసుకు తిరుగుతాడు, ఒకసారి కనిపించిన అమ్మాయి మళ్లీ కనిపించదు, కాలేజీలో ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు చూసినా సినిమా హాళ్లు, పార్కుల్లోనే తిరుగుతాడు.


పాపం ఆ పిల్లాడి తల్లి కొడుకు విషయాలు చూసి లబోదిబోమంటుంది. ఆయన మాత్రం గర్వంగా 'మా అబ్బాయి అందరితో సోషలైజ్ అవుతాడు' అని చెప్పుకుంటాడు.


కాలనీలో అందరూ ఆ అబ్బాయి గురించే మాట్లాడుకుంటారు" అంది సరోజ.


"సరిపోయింది! రామకృష్ణ గురించే చెప్పావ్! 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?' ఆయన రాసలీలలు ఎన్నో! పాపం ఆవిడ ఆ తల్లి కొడుకుల్ని ఎలా భరిస్తోందో! అయినా మన అబ్బాయి గురించి నాకు తెలీదా!? ఎంత ఉపన్యాసం ఇచ్చావ్! ఊరికే సరదాగా అన్నానులే!" అన్నాడు రమణ నవ్వుతూ.


"వాడు గుడి దగ్గర చెత్త గురించి కమిటీ వాళ్లతో మాట్లాడుతున్నాడు, మైకు పెట్టినా ఉపయోగం లేకపోతోంది... వేరేదేదో చేయాలి అనుకుంటున్నాడు" అంది సరోజ.


రవి తన ఫ్రెండ్ వంశీతో కలిసి "ఏఐ" సహాయంతో వాళ్లు అనుకున్న పథకాన్ని మున్సిపల్ కమిషనర్‌కు, ఆ ప్రాంత పోలీస్ ఎస్ఐకి చెప్పారు.


వెంటనే కమిషనర్ స్పందించి ఆ ప్రాంతంలో పవర్‌ఫుల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.


ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ల ఫోటోలు క్లిక్ అయ్యి, వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఉన్న మానిటర్‌లో కనిపించి, వాళ్ల ఫోటో కింద ఆధార్ కార్డు నంబరు వచ్చేటట్టు ఏఐ సహాయంతో ఏర్పాటు చేశారు.


ఎప్పుడైతే ఆధార్ కార్డు కనిపిస్తుందో, దాని కింద ఉన్న ఇంటి అడ్రస్‌కు పోలీసులు చలానాలు పంపించేటట్లు ఏర్పాటు చేశారు.


ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందోనని రవి, వంశీ ఆందోళన పడ్డారు.

పొద్దుటే రవి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మానిటర్ చూశాడు.


ఒక్కొక్కళ్లు బండిమీద వచ్చి క్యారీ బ్యాగులతో చెత్త వేసి వెళ్లడం కనిపించింది. పవర్‌ఫుల్ కెమెరాలు అవడంతో వాళ్ల మొహాలు చాలా క్లియర్‌గా కనిపించాయి.


వాళ్లు ఈ చుట్టుపక్కల వాళ్లు కాదు... ఆధార్ కార్డు పరిశీలిస్తే రెండు కాలనీలకు అవతల ఉన్న కాలనీవాళ్లు. వెంటనే పోలీసులు వాళ్ల ఇంటికి చలానాలు పంపించారు.


మున్సిపల్ కమిషనర్ తన కింద సిబ్బందిని ఆ కాలనీకి పంపి పర్యవేక్షించమన్నారు.


సిబ్బంది వెళ్లి అక్కడ వాళ్లతో మీటింగ్ పెట్టి, "ఈసారి రోడ్డు మీద చెత్త వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని కమిషనర్ గారు హెచ్చరించమన్నారు" అని చెప్పారు.


దాంతో కాలనీవాళ్లు, "మాకు డస్ట్‌బిన్లు పెట్టారు కానీ, మేము వాటిలో చెత్త వేసినా ఎవరూ తీసుకువెళ్లట్లేదు.


వాటిని కుక్కలు లాగేసి చిందరవందర చేస్తున్నాయి. మీరు రెగ్యులర్‌గా చెత్త తీసుకెళ్లండి... మేము వేరే దారి లేక గుడి దగ్గర ఖాళీ స్థలంలో చెత్త వేయవలసి వస్తోంది" అని చెప్పారు.


అంతటితో ఆ సమస్య తీరింది. గుడి చుట్టుపక్కల పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. అందరూ స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.


మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఎస్ఐ దీనికి అంతటికీ కారణమైన రవి, వంశీలను అభినందించడానికి గుళ్లో సభ ఏర్పాటు చేశారు.


ముందుగా పోలీస్ ఎస్ఐ మాట్లాడుతూ... "ఇంత మంచి పని చేసిన వంశీ, రవిలను అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో యువత టెక్నాలజీని వాడుకుంటున్నారు.


కానీ మంచి పని కోసం వాడుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు! కానీ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది సైబర్ నేరాలు చేస్తున్నారు.


విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యి డబ్బు కోసం చైన్ స్నాచింగ్, దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలల దగ్గర చాక్లెట్ల రూపంలో చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు.


కొంతమంది పెడ్లర్లు కాలేజీల దగ్గర, ఆఫీసుల దగ్గర చేరి, అమాయకులైన వారికి డ్రగ్స్ అలవాటు చేసి, వారి నైతిక పతనానికి కారణం అవుతున్నారు. ఈ మాఫియాలో కొంతమంది అమాయకులు కూడా బలి అయిపోతున్నారు.


నా కజిన్ కాలేజీలో చదివేటప్పుడు ఈ ఊబిలో దిగి, పైకి రాలేక, నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.


మీరు తప్పటడుగులు వేయకండి, తల్లిదండ్రులకి కడుపుకోత మిగల్చకండి! ఇక్కడ చాలామంది యువత ఉన్నారు కాబట్టి చెబుతున్నాను... ఎవరైనా ఇటువంటి మాఫియాలోకి పొరపాటున ఇరుక్కున్నా బయటకు వచ్చేయండి.


మీ అందరికీ మేము అండగా ఉంటాం" అంటూ ముగించారు ఎస్ఐ.

చప్పట్లతో ఆవరణ అంతా మారుమోగిపోయింది.


తర్వాత మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... "ఈ రోజుల్లో యువత టెక్నాలజీని వాడుకుంటున్నారు.


కానీ ఇలా పదిమందికి ఉపయోగపడేలా, సమాజాన్ని ముందుకు నడిపించేలా టెక్నాలజీని ఉపయోగించి మంచి పని చేసేవాళ్లు కొంతమందే ఉన్నారు. మీలాగే అందరూ కూడా సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలి.


ముఖ్యంగా చెప్పేది... ఈ పరిసరాలన్నీ మీవి, మీరు వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకుంటే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వచ్చి పరిసరాలను కలుషితం చేస్తాయి. అందుకని అంతా శుభ్రంగా ఉంచండి.


ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను... ఈసారి ఎవరైనా ఎక్కడైనా చెత్త వేస్తే చలానాలు రాయడం కాదు, డైరెక్ట్‌గా జైల్లోనే పెట్టిస్తాను జాగ్రత్త!" అంటూ ప్రజల హర్షధ్వానాల మధ్య ముగించారు మున్సిపల్ కమిషనర్.


మున్సిపల్ కమిషనర్ ఆ ఖాళీ స్థలంలో మొక్కలు నాటించి అక్కడ పచ్చదనాన్ని చేకూర్చారు. ఒక ఏడాది అయ్యేటప్పటికీ అక్కడ ఒక పార్కు తయారయింది. పెద్దవాళ్లు, పిల్లలు గుడికి వెళ్లి అక్కడ నుంచి పార్కుకి వచ్చి కొంతసేపు సేద తీరుతున్నారు.


ఇంత ఘన పరిణామానికి కారణమైన రవి, వంశీల పేరు మీద పూజారి గారు రోజూ ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తున్నారు. "శివయ్యా! నేను ఇంతకంటే ఆ పిల్లలకి ఏమీ ఇవ్వలేను" అనుకున్నారు.


అందరూ రవిని మెచ్చుకుంటుంటే సరోజ, రమణలకు ఎంతో గర్వంగా ఉంది. ఆ శివయ్య మహిమో, ప్రజల ఆశీస్సులో కానీ రవి మంచి మార్కులతో ఉత్తీర్ణత చెంది క్యాంపస్ సెలక్షన్స్ లో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు.


"చదువుకున్న విజ్ఞానాన్ని సామాజిక బాధ్యతతో జత చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని, యువత ఆలోచనలే దేశాభివృద్ధికి అసలైన ఇంధనమని రవి, వంశీలు చాటిచెప్పారు."



***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


శారద

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page