సాంకేతికత తెచ్చిన మార్పు
- Chilakamarri Rajeswari

- 6 days ago
- 3 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #SankethikathaThecchinaMarpu, #సాంకేతికతతెచ్చినమార్పు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Sankethikatha Thecchina Marpu - New Telugu Story Written By - Chilakamarri Rajeswari Published in manatelugukathalu.com on 25/01/2026
సాంకేతికత తెచ్చిన మార్పు - తెలుగు కథ
రచన: చిలకమర్రి రాజేశ్వరి
"రవీ, కొంచెం పాల పాకెట్టు తీసుకురా, సందు చివరకు వెళ్ళి" అని నిద్ర పోతున్న కొడుకును లేపింది.
"అబ్బ, ఏంటమ్మా, ఇంత పొద్దున్నే నిద్ర లేపేస్తున్నావు" అంటూ విసుక్కున్నాడు రవి.
"అది కాదురా, పాలు విరిగిపోయాయి, కాఫీ కలుపుకుందామంటే వేరే పాలు ఏమీ కనిపించలేదు ఫ్రిజ్ లో. అందుకే నిన్ను లేపాల్సివచ్చింది. ఉదయమే కాఫీ పడకపోతే, నాకు తలనొప్పి వస్తుందని తెలుసుగా. ఓపిక చేసుకొని ఒక పాకెట్ తెచ్చిపెట్టు" అంటూ బ్రతిమలాడింది రమ.
"సరే, అలాగే, ఒక్క పది నిముషాలలో పాల పాకెట్ వస్తుంది, తీసుకో, హాయిగా కాఫీ కలుపుకొని తాగు. నేను ఒక అరగంట తరువాత లేస్తాను. ఈ లోపల కంగారుగా లేపేయకు" అంటూ మళ్లా ముసుగు కప్పేసాడు రవి, రమ ఏదో చెప్ప బోతున్నా వినకుండా.
"బయటికి వెళ్ళకుండా పాలు ఎలా వస్తాయి, వీడు తేలికగా ‘పదినిముషాలలో వచ్చేస్తాయి’ అని చెప్పి పడుకొన్నాడు. ఇంక రవి నిద్ర లేచి తెస్తే కానీ, పాలు రావు, పోనీ, నేనే వెళ్ళి తెచ్చుకుందామంటే, ఈ ప్రాంతం అంతా కొత్త, ఎక్కడ, ఏవి దొరుకుతాయో తెలియదు" అనుకుంటూ ఏం చేయాలో తెలియక గది లోంచి బయటికి వచ్చి బాల్కనీ లో నిలబడింది.
రవి హైదరాబాదులో ఉద్యోగంలో చేరి ఒక మూడు నెలలు అయింది.. రమ వాళ్లు హైదరాబాదుకు దగ్గర లో ఉన్న పల్లెటూరులో ఉంటారు. ఇల్లు తీసుకున్నాను, వచ్చి ఒక వారం రోజులు ఉండచ్చు కదా అని గొడవపెడుతున్నాడని, నిన్న
హైదరాబాదు కి వచ్చింది.
ఒక ఐదు నిముషాలు గడిచిన తర్వాత, కాలింగ్ బెల్ వినిపించింది. పనమ్మాయి మధ్యాహ్నం వస్తుందని చెప్పాడు కాబట్టి, తను అయి ఉండదు, ఈ సమయంలో ఎవరొస్తారు అనుకుంటూ తలుపు తెరిచింది. ఎవరో ఒకరు పాల పాకెట్ ఇచ్చేసి వెళ్ళారు.
సరే, ఎవరన్నది తరువాత కనుక్కోవచ్చు, ముందు కాఫీ తాగుదాం అనుకొని, కాఫీ కలుపుకొని తాగింది. టిఫిన్ ఏం చెయ్యాలి అనుకుంటూ, వంటింటిలో డబ్బాలు వెతకడం మొదలుపెట్టింది.
“అమ్మా, ఏం చేస్తున్నావు? కాఫీ తాగావా, లేదా” అంటూ వచ్చాడు రవి వంటింటిలోకి.
"తాగాను లేరా, ఎవరో పాకెట్ తెచ్చి ఇచ్చారు, నువ్వు చెప్పినట్టుగానే పది నిముషాలలో. ఇంతకీ పాలు ఎలా వచ్చాయి చెప్పు" అంటూ కుతూహలంగా అడిగింది రమ.
“ఆ విషయం తరువాత చెపుతానులే, కానీ,ఇవాళ టిఫిన్ ఏం చేస్తున్నావు? అని అడిగాడు రవి.
"వంటింట్లో అంతా వెతికేసాను, నాకు ఏమీ కనిపించలేదు చేయడానికి. సరుకుల లిస్ట్ రాసిస్తాను, అవి బయటికి వెళ్లి తీసుకురా, ఇక్కడ దగ్గర లో ఏమీ దుకాణాలు ఉన్నట్టు లేవు కదా. ఈపూటకి, నేను తెచ్చిన స్వీట్, హాటు తినేసి వెళ్ళు. నువ్వు మధ్యాహ్నం మీ ఆఫీసులో భోంచేసెయ్. నేను పచ్చళ్ళు ఏవో తెచ్చానుగా, అన్నం వండుకుని వాటితో తినేస్తాలే,"
ఊరు వచ్చేముందు ఏమన్నా సరుకులు అవి తీసుకువస్తానంటే వద్దన్నావు, పోనీ, నువ్వైనా తెచ్చి రెడీగా పెట్టలేదు అంటూ, చూడు, నీకు చేసిపెట్టడానికి ఏవీ లేవు అంటూ బాధపడింది రమ.
"అమ్మా, సరుకులు ఏం కావాలో, నాకు లిస్ట్ రాసి ఇచ్చెయి. పది నిమిషాల లో నీ ముందుంచుతాను, సరేనా, నువు చేసిన టిఫిన్ తినే ఆఫీసుకి వెళతాను, నువ్వేం బాధపడకు" అని సర్దిచెప్పాడు రవి.
“ఏమోరా, పొద్దున్న పాలు ఎలా వచ్చాయిఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, అంటే తర్వాత చెపుతానన్నావు. ఇపుడేమో, ‘నీకేది కావాలంటే, ఒక పది నిముషాలలో ఇంటికే వచ్చేస్తాయి’, అని అంటున్నావు. ఏమన్నా మంత్రం వేసావా” అని నవ్వుతూ అడిగింది రమ.
రవి సమాధానం చెప్పేలోపల, కాలింగ్ బెల్ మోగింది. రవి వెళ్ళి, తలుపు తీసి, వాళ్లు తెచ్చిన సంచీ తీసుకుని, "అమ్మా, ఇదిగో, నువ్వడిగిన సరుకులు. నాకిష్టం సేమ్యా ఉప్మా. తొందరగా చేసెయి. ఆకలేస్తోంది" అని సరుకుల సంచీ అమ్మ కు అందించాడు.
"ఇపుడైనా, చెపుతావా, ఇలా నేను లిస్ట్ రాసి ఇచ్చాను, ఒక పది నిముషాలలో ఇంటికే ఎలా వచ్చాయి? నువ్వు ముందు ఆ విషయం చెప్పు, నీకు పది నిముషాలలో టిఫిన్ తయారు చేస్తాను, సరేనా" అని అంది రమ.
“అది కాదు అమ్మా, ఇపుడు చాలా దుకాణాల వాళ్లు ఇంటి వద్దకే మనకు కావలసిన సరుకులను అందిస్తున్నారు. లిస్ట్ పెట్టిన పది నిముషాలలో. మన చరవాణి లో ఆ యాప్ ను కాపీ చేసుకోవాలి, అంతే. ఇందులో మంత్రాలు, తంత్రాలు ఏమీ లేవు, చాలా సులభం, ఇపుడు అర్థమైందా” అని అన్నాడు రవి.
“అవునా, ఎంత బాగుందిరా, కొత్త ప్రదేశాలకు వచ్చినపుడు, మనకు కావలసిన సామాన్లు, అవీ ఎక్కడ దొరుకుతాయో, తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇలాంటివి ఉంటే ఎంత ఉపయోగకరంగా ఉంటాయి. ఇంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందని నమ్మలేకుండా ఉన్నాను.” అంది రమ.
“అవును అమ్మా, సాంకేతికంగా అభివృద్ధి అయితేనే దేశం అభివృద్థి పథంలో నడుస్తుంది. కాకపోతే ఆ సాంకేతికత ను మనం మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అడ్డ దారులలో డబ్బులు సంపాదించడానికి, ఇతరులను మోసం చేయడానికి ఉపయోగిస్తే, అది వినాశనానికి దారి తీస్తుంది. అలా ఉపయోగించుకొనే వీలు లేకుండా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను సైబర్ సేఫ్టీ తో జత కట్టి సాంకేతిక అబివృద్ధి అందరికీ అందుబాటులోకి తేవడానికి వీలు కలుగుతుంది.”
“అవును, రవీ, నువ్వు చెప్పింది నిజం" అని అంది రమ.
***
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.




Comments