సేవ్ ది టీచర్
Save The Teacher - Telugu Social Article | Seeda Nagaraju
సేవ్ ది టీచర్ - తెలుగు సామాజిక వ్యాసం | సీదా నాగరాజు
Published in manatelugukathalu.com on 29/10/2026
‘సేవ్ ది టీచర్’ సీదా నాగరాజు రచించిన సామాజిక చైతన్య కథనం. ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, సమాజంలో తగ్గుతున్న గౌరవం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఉపాధ్యాయులను రక్షించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది.
విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం
నహి వంధ్యా విజానాతి గుర్వీ ప్రసవవేదనం — అన్నారు పెద్దలు.
విద్వాంసుల కష్టాలు విద్వాంసులకు మాత్రమే తెలుస్తాయి. గొడ్రాలికి ప్రసవ వేదన తెలియనట్లు, విద్వాంసులు కానివారికి విద్వాంసుల కష్టాలు తెలియవు కదా!
ఏ ఉపాధ్యాయుని పరిస్థితి చూసినా ఏమున్నది గర్వకారణం? నేటి ఉపాధ్యాయుల స్థితిగతులు సమస్తం పరపీడన పరాయణత్వం! అవునంటారా? కాదంటారా?
విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాల కోసం పాఠశాలకు వచ్చే రోజులు పోయాయి.
ఉపాధ్యాయులే పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం "బడి పిలుస్తుంది" అంటూ పల్లెటూర్లలో పర్యటనలు చేసే పరిస్థితి దాపురించింది.
ఈ మధ్యన ఒక ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడం కోసం ఊరి రచ్చబండ దగ్గర గుంజీలు తీసిన సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అప్పుడెప్పుడో ఒక ఉపాధ్యాయుడు పిల్లలని స్కూల్‌కి పంపించండి అంటూ నిరసన దీక్షో, నిరాహార దీక్షో చేసినట్లున్నారు.
ఏతావాతా తేలిందేమంటే చదువుల కోసం పిల్లలు పాఠశాలకు రావడం లేదు; ఉపాధ్యాయులే పిల్లల కోసం వీధుల్లోకి వస్తున్నారు.
ప్రజల వద్దకు పాలన అన్నట్లు పిల్లల వద్దకు పాఠశాలే కదలి వస్తుందేమో!
ఒకప్పుడు "బ్రతకలేక బడిపంతులు" అంటే అవునా! అని నమ్మలేక నిర్ఘాంతపోయేవాళ్లం.
ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితే నయమనిపిస్తుంది. అప్పట్లో ఉపాధ్యాయులు అంటే సమాజంలో గౌరవం ఉండేది, విద్యార్థులకు భయభక్తులు ఉండేవి. నేడు అవన్నీ మృగ్యం.
నేడు ఉపాధ్యాయుడు అంటే... ఒక బానిస. ఏ పని చెప్పినా చేయాల్సిన కట్టు బానిస.
జనాభా గణన చేయాలన్నా, ఓటర్ల లిస్టులు సవరించాలన్నా, ఎన్నికలు నిర్వహించాలన్నా... ఒకటేమిటి, సర్వం సహా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులకు మొదటి బాధ్యుడు ఉపాధ్యాయుడే.
మధ్యాహ్న భోజనాల కోసం సరుకులు తెప్పించుకోవాలి, తెప్పించుకున్న సరుకులు సరిచూసుకోవాలి, రోజువారీగా సరుకులు వండేవారికి అందించాలి.
దగ్గరుండి మరీ వంటలు వండించాలి. దగ్గరుండి మరీ వంటలు సవ్యంగా వడ్డించేలా చూడాలి.
పిల్లలందరూ చక్కగా తినేలా చూడాలి, పౌష్టికాహారం తిని ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలి. రోజూ మరుగుదొడ్లు దగ్గరుండి కడిగించాలి, శుభ్రం చేయబడిన మరుగుదొడ్ల ఫోటోలు తక్షణమే అప్‌లోడ్ చేయాలి.
ఇవన్నీ కాదన్నట్లు రోజూ ఏదో ఒక స్టేట్‌మెంట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలి.
మధ్యలో ఆధార్ అప్‌డేషన్, 'తల్లికి వందనం' వెరిఫికేషన్, నామినల్ రోల్స్ ప్రిపరేషన్, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు... ఇలా ఎన్నో... ఎన్నెన్నో...
వీటికి అంతేక్కడ? ఇవన్నీ చేస్తూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలి, సిలబస్ సకాలంలో పూర్తి చేయాలి.
చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతూ ప్రైవేట్ క్లాసులు నిర్వహించాలి. పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి... కానీ తిట్టకూడదు, కొట్టకూడదు, కనీసం గట్టిగా మందలించకూడదు!
మందలిస్తే చాలు విద్యార్థి తల్లిదండ్రులు, వారి బంధుబలగం, మీడియా మూకుమ్మడిగా ఉపాధ్యాయుల మీద దాడి చేస్తున్నారు. ఉపాధ్యాయులని అవమానిస్తున్నారు.
బండబూతులు తిడుతూ దేహశుద్ధి చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే గురువు ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తున్నారు.
వారి వృత్తిధర్మాన్ని వారు సక్రమంగా నిర్వహించాలంటే భయపడేలా చేస్తున్నారు. నేడు వారంతా ప్రాణభయంతో బ్రతుకుతున్నారు.
విద్యార్థులు ఏ కారణం చేత ఏ అఘాయిత్యం చేసుకున్నా, ఎక్కడికి పారిపోయినా బాధ్యత మాత్రం ఉపాధ్యాయునిదే అవుతోంది, నింద పాఠశాల మీదే పడుతోంది.
అందుకే "సేవ్ ది టీచర్" — ఉపాధ్యాయుడిని రక్షించండి. తనకు కూడా స్వేచ్ఛనివ్వండి, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనివ్వండి.
విద్యాదానం అనే మహత్తర యజ్ఞంలో ఉపాధ్యాయుడిని సమిధగా వాడుకుని సమాధి చేయకండి.
నేటి సమాజంలో మంత్రులుగాను, శాసనసభ్యులుగాను, అధికారులుగాను, ప్రభుత్వ సేవకులుగాను, వ్యాపారస్తులుగాను, రైతులుగాను జీవనం సాగిస్తున్న సమస్త ప్రజానీకం ఎవరో ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఓనమాలు నేర్చుకున్న వారే, డిగ్రీలు పుచ్చుకున్న వారే! వారందరికీ తెలియదా... ఉపాధ్యాయులు మందలించడం ద్వారా మంచి చేస్తున్నారో లేక చెడు చేస్తున్నారో?
మొన్నటికి మొన్న ఒక అఖిల భారత సర్వీసు అధికారి బెత్తం పుచ్చుకుని మరీ తన చిన్ననాటి గురువు దగ్గరకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి, మరీ ఆ బెత్తంతో సుతిమెత్తగా కొట్టించుకున్నాడు.
ఇలాంటి సన్నివేశాలను యూట్యూబ్‌లో చూసి మురిసిపోతున్నాం, కానీ మన పిల్లవాడిని ఏ ఉపాధ్యాయుడైనా మందలించాడో మనం ఊగిపోతాం.
సదరు ఉపాధ్యాయుడిపై ప్రళయతాండవం చేసేస్తాం. ఇదెక్కడి న్యాయం?
ఘనత వహించిన కొందరు నేతలు కష్టపడి టెట్‌లు, డీఎస్సీలు రాసి, ఇంటర్వ్యూలు గట్రా పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధ్యాయులను "పేపర్ లీక్, రిజర్వేషన్‌లో అవకతవకలు" అంటూ సంవత్సరం నుండి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
కోర్టులలో పిల్స్ ద్వారా, జెన్-జెడ్ పేరుతో నిరసనల ద్వారా వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగానికి భద్రత లేకుండా పోయింది, ఉంటుందో ఊడుతుందో తెలియని సందిగ్ధంలో జీవనం సాగిస్తున్నారు.
ఇది ధర్మమా?
నీట్ పేపర్ లీకు గురించి నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' మెగా డీఎస్సీలో కష్టపడి పరీక్షలు రాసి, పరీక్షలలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సంపాదించుకున్న వేలాదిమంది ఉపాధ్యాయుల నియామకం అంతా ఒక స్కామ్ అంటూ, అవకతవకలు జరిగాయంటూ రోజుకొక తీరుగా నిందలు వేస్తూ, గోబెల్స్ ప్రచారం చేస్తూ జెన్-జెడ్ పేరుతో నిరసన దీక్షలు నిర్వహిస్తూ... సంవత్సరం నుండి ఉద్యోగం చేసుకుంటున్న వారిని మానసిక క్షోభకు గురిచేస్తూ కోర్టు కేసులతోనూ, బూటకపు ఫిర్యాదులతోనూ వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న రాజకీయ సంస్థ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాట్లో యువతకే తెలియాలి!
సదరు రాజకీయ సంస్థ అత్యున్నత పదవుల (గ్రూప్-1) నియామకం కోసం నిర్వహించే పరీక్షను కూడా అందరూ అసహ్యించుకునే స్థాయికి దిగజార్చినా ఎందుకు మిన్నకున్నాట్లో? వారికి ఏమైనా పరిమితులు ఉన్నాయేమో! లేదంటే పక్షపాతం ఉందో అర్థం కావడం లేదు.
ఇప్పటికైనా కళ్లు తెరవండి! వేలాది ఉపాధ్యాయులను కాపాడండి, వారికి ఉద్యోగ భద్రత కల్పించండి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నీచ రాజకీయాల కోసం కలుషితం చేస్తున్న దుండగుల దుష్ట పన్నాగాల నుండి ఉపాధ్యాయులను కాపాడండి!
సేవ్ ది టీచర్!
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.







Comments