top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 14


'The Trap Episode 14' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

తన ఇంటికి బయలుదేరుతున్నట్లు చెబుతుంది వినోదిని.

ఉండమంటుంది మంగళదేవమ్మ.

ఆఫీసుకు బయలుదేరుతున్న పరమేశ్వర్ ని ఆపి తమతో గుడికి రమ్మంటారు.


ఇక ది ట్రాప్. . పదునాల్గవ భాగం చదవండి…


మరి కొద్ది సేపటికి ఇంటిల్లిపాదీ ఆలయ ప్రాంగణం చేరుకున్నారు. గుడిలోకి ప్రవేశించక ముందు అక్కడ నిటారుగా నిల్చున్న ఆవుకి మంగళాదేవమ్మ, కామాక్షమ్మ ఇద్దరూ అరటి పళ్ళు అందించారు. వినోదిని చేత కూడా అరటి పళ్ళు తినిపించారు. అప్పుడు యెడంగా నిల్చున్న చిన్న కొడుకుని పిలిచి అతడికి కూడా పళ్ళిచ్చి ఆవుకి తినిపించమన్నారు. అప్పుడా సమయాన యెవరూ యెదురు చూడని దృశ్యం చూసి వేదమూర్తి విస్తుపోయినట్టు నిల్చుండిపోయాడు.


విశ్వం భార్య సువర్చలతో యెదురొచ్చి--“నేనెలా యిటువంటి సమయంలో ఇలా ఊడిపడ్డానని తెల్లబోతున్నావా! రాబోకు—దరి రాబోకన్నట్టు చూడకు. మంచి రోజు, అందరమూ గుడిలో కలుసుకుందామని మాటల సందర్బంలో కామాక్షి చెప్పిందిలే—మాతో బాటు వసంత కూడా వచ్చిందిలే—నువ్వొక సారి చూసి దీవించాలిగా--అందుకే తీసుకు వచ్చాను. ఆడ పిల్ల తండ్రిని. నువ్వు యెడంగా ఉన్నట్లు నేనుండ లేనుగా!”.


ఆమాట విన్నవెంటనే వసంత వెళ్ళి వినాయకం వేదమూర్తుల కాళ్ళకు నమస్కరించింది. వేదమూర్తి నోట మాట పెగలడం లేదు. తెలిసి గుడికి వచ్చాడంటు న్నాడు. మరి—పరమేశ్వర్ కి, వినోదినికీ జత చేరబోతున్నారన్నది తెలిసే వచ్చాడా! అతడికంతా అగమ్య గోచరంగా ఉంది. ఏమని చెప్పాలో యెలా స్పందించాలో తెలియక భార్య కామాక్షమ్మ వేపు చూపులు సారించాడు.


భర్త చూపుల్లోని అర్ధాన్ని గ్రహించిన కామాక్షి అక్కడ కొన్న పూజా దినుసులు అత్తగారికి అందించి వేగంగా అక్కడకు చేరుకుంది- “వచ్చేసావా వదినా! వసంత యేదీ---“ అని పరామర్షిస్తూ సువర్చలతో చేతులు కలిపింది. నాజూకుగా సన్నటి బంగారు తీగలా నిల్చున్న వసంత తట్టున తేరుకుని కామాక్షికి నమస్కరించింది.


నమస్కారం స్వీకరిస్తూ కామాక్షమ్మ భర్త వేపు తిరిగింది- “అదేమిటి అలా చూస్తు న్నారూ! మీకు తెలియ పర్చకుండానే పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాననా? ఇందులో పెద్దకార్యమేదీ లేదు లెండి. మీ చిన్ననాటి స్నేహితుడేగా—మొన్న యేదో మాటల సందర్భాన మన గుడి దర్శనం గురించి ప్రస్తావించాను. వీలుంటే వచ్చి మనతో కలవమన్నాను కూడా—ఇదంతా తమ మాతృమూర్తికి చెప్పే చేసాను లెండి. ఇంతకీ భార్యాభర్తలిద్దరూ అంత దూరం నుంచి యెందుకు వచ్చారో తెలుసా! ఇంతకు ముందు మనింటికి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళారు గాని— పరమేశ్వర్ ని, పవన్ ని, కమలాన్ని చూసారు గాని— ఇంత వరకూ మన కామేశ్వర రావుని చూడనే లేదట— అదొక కొరతగా తయారయింది వాళ్ళకు--” అంటూ దూరాన గుడి రథం వద్ద నిల్చుని తమ్ముడు పవన్ తో కబుర్లాడుతూన్న పెద్ద కొడుకుని గొంతెత్తి పిలిచింది-“ఒరేయ్ పెద్దోడా! విశ్వం అంకుల్ గారూ సువర్చల ఆంటీగారు పలకరించడానికి వచ్చారు. ఓసారి ఇద్దర్నీ పలకరించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళరా! నువ్వొక్కడివీ వస్తే చాలురా—”.


తల్లి గొంతు విని కామేశ్వర్ రావు తమ్ముణ్ణి అక్కడే ఉండమని చెప్పి పరుగున వచ్చి విశ్వం దంపతులిద్దరికీ నమస్కరించాడు. “సారీ అంకుల్! మీరు వచ్చినప్పుడల్లా నేను యింట్లో ఎక్కువ సేపు ఉండలేక పోయాను. షాపు నుండి కబురొస్తే వెళ్ళిపో యుంటాను. సారీ! షాపు వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. నాన్నగారికి వత్తాసుగా-- బుక్స్ ఆఫ్ అకౌంట్సు కూడా కమల సహాయంతో లావాదేవీల లెక్కలు చక్కబెడ్తుంటాను. ఈరోజు మంచి రోజని తమ్ముణ్ణీ వినోదినినీ దైవార్చన కోసం అమ్మా బామ్మలిద్దరూ తీసుకువచ్చారు. ఈరోజు మీరు కూడా గుడికి రావడం చాలా సంతోషంగానూ ఉంది ఆశ్చర్యంగానూ ఉంది--”


అప్పుడు కామాక్షమ్మ కొడుకుని ఆపింది. “ఇదెక్కడి సభ్యతరా పెద్దోడా! అంకుల్ యాంటీలను పలకరించావు. నమస్కరించావు. బాగానే ఉంది. మరి—వాళ్ళతో బాటు వచ్చి కుందనపు బొమ్మలా నిల్చున్న వసంతను పలకరించవా! చిన్న బుచ్చుకోదూ?”


ఆ మందలింపు విన్నంతనే కామేశ్వరరావు జెర్కింగుకి లోనయాడు. వసంతను సమీపిస్తూ నొచ్చుకుంటూ అన్నాడు--“సారీ! నేను మిమ్మల్ని చూడలేదు. పూజకు యేర్పాట్లు చూస్తూ అలా ఉండిపోయాను”


“ఇటీజ్ ఓకే రావుగారూ! కాని—యిన్నిసార్లు సారీలు చెప్తారేమిటి—అసలు మీరేమి తప్పు చేసారని—నిజానికి నేనే మీకు పెక్కు సారీలు చెప్పాలి—”


“ అతడు విస్తుపోయాడు;’మీరా! నాకా! ‘అన్నట్టు చూస్తూ--


“ఔను. నేనే మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే—నేను మీయింటికి రెండు మూడు సార్లు వచ్చాను గాని—మిమ్మల్ని పలకరించకుండానే వేడి నీళ్ళు పోసుకున్నట్టు వెళ్ళిపోయాను”


ఆ మాటకు కామేశ్వరరావుతో బాటు అందరూ నవ్వేసారు. నవ్వుతూ మనసున అనుకుంది కామాక్షమ్మ--మాట కారి. తెలివైన మాటకారి! ఎక్కడున్నా యెటువంటి చిక్కు వచ్చిపడినా బ్రతికి బట్ట కట్టేసుకుని బైట పడిపోతుంది. ఇలా అనుకుంటూ ఆమె వాళ్ళ సంభాషణకు రక్తి కట్టేటట్లు అంది- “ఇకనేం? ఇద్దరికీ పరిచయం ఐపోయిందిగా! ఇక కలసి గలగలా నవ్వుకోవడమే మిగిలింది. మీరిద్దరూ అలా చుట్టూ తిరిగి రండి. పువ్వులు కొనుక్కురండి. పురోహితుడు వచ్చి పిలుస్తున్నట్టున్నాడు. త్వరగా వెళ్లి రండి”.


ఇప్పుడు వేదమూర్తికి చాలానే అర్థమైనట్లు తోచింది. తనకు తెలియ కుండానే తన వెనుక చాలా తతంగమే సాగుతున్నట్లనిపించింది. ఇంటి ఆడాళ్ళ పెద్దరికమా-- మొత్తానికి విశ్వం,కూతుర్ని తమింటికి కోడలు పిల్లగా పంపించడానకి కంకణం కట్టుకున్నట్లున్నాడు, మరి అతడి జీవన సహచరి సువర్చల మాటేమిటి—


విద్యావంతురాలు, సీనియర్ స్కూలు టీచర్ ఐన సువర్చల కూతుర్ని తక్కువ మోతాదున చదువుకున్న కామేశ్వరరావుకి యివ్వడానికి ఒప్పుకుందా! ఒప్పుకోక యేమి చేస్తుంది--కట్టుకున్న భర్త అంత పట్టుదలతో ఉన్నప్పుడు. ఇక సూటిగా విషయానికి వస్తే-- తనలో తనకుటుంబంలో తనకే తెలియని ఉదాత్తమైన గుణాంశమేదో ఉందేమో! లేకపోతే— తనకంటే యెత్తున మనుగడ సాగిస్తూన్న ఇద్దరు చిన్ననాటి మిత్రులూ తమ కన్న కూతుళ్ళను తమింటికి యెందుకు కోడళ్ళు గా పంపడానికి పోటీపడతారు?వాళ్ళ వాళ్ల సామాజిక ఆర్థిక స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే వాళ్ళకు తగు స్థాయిలో ఉన్న సంబందాలా దొరకవూ? ఒక విధంగా చూస్తే వెతకపోయిన తీగలు కాళ్ళకు అలా అల్లనల్లన అంటుకు పోవడం చూస్తుంటే ఇదంతా ఒక పొడుపు కథలా లేదూ! ఎప్పుడో నిర్దేశించబడ్డ దైవ నిర్ణయంలా తోచడం లేదూ--


ఇదిలా సాగుతుండగా అత్తా కోడళ్ళిద్దరూ కలసి యేర్పాటు చేసిన అర్చనలూ విఘ్నాల తొలగింపు నేపథ్యంతో సాగిన గుడి ప్రత్యేక పూజలో యదురు చూడనిది మరొకటి జరిగింది. పురోహితుడి ధార్మిక సలహాతో పరమేశ్వర్ వినోదిని యిద్దరూ గర్భగుడి ముందు మాలలు మార్చుకున్నారు. పరమేశ్వర్ ముఖం ముడుచుకోకుండా కళ్లు పెద్దవి చేసుకోకుండా కిమ్మన కుండా పురోహితుడు చెప్పినట్టు వినోదిని మెడన భవ్యంగా మాలవేయడం ఇంటి పెద్దలందరికీ ఆమాంబాపతు ఆశ్చర్యం కలిగించింది.


ఇక రాబోవు వివాహమ హోత్సవం తనకు తప్పదని, అది గురితప్పని వికర్ణుడి బాణమని బాగానే తెలుసుకున్నాడేమో పరమేశ్వర్!


కాని-పెద్దల ఆదేశాలను భవ్యంగా పాటిస్తూన్న అతడి మనసున మరొకటి కూడా తగిలి దూసుకుపోయింది; ఇరు కుటుంబాల పొసగమికి అంతుబట్టని సామాజిక ఆర్థిక అగాధానికి పొడసూపబోయే ట్రైలర్ ఆరంభమయే సమయం ఇదేనేమో--కొందరికి చెప్తే అర్థం కాదు. అనుభవిస్తేనే బోధపడుతుంది. రాచ మర్యాదలకు ఆశపడితే ఎదురొచ్చే అవమానాలకు జాతకం చూసే పురోహితులు లెక్కకడ్తారు.


ఇక వాస్తవానికి వస్తే--తమ కుటుంబా నికి ఇక అవమానాలకు లెక్కే ఉండదేమో—ఆ అవమానాల లెక్కలు తనను మాత్రం విడిచి పెడ్తాయా! తననూ వెంటాడుతూ వస్తాయేమో--అందుకోలేని తాహతుని అందుకోవాలని అర్రులు చాస్తే యెదురవబోయే పర్యావసానాలు యెలా ఉంటాయో--ఇక ముందు ఒక్కక్కొరికీ హంటింగ్ గన్ లా తెలిసొస్తాయేమో! ఇప్పటికి అందరిముందూ ఆణగి మణిగి నడచుకుంటూన్న వినోదిని సహితం రేపు ఎలా మారబోతుందో ఎవరు చెప్పొచ్చారు—అందుకేగా ముందున్నది మొసళ్ళ పండగ అన్న నానుడే పుట్టుకొచ్చింది!


అతడలా ఊహించుకుంటూ గుడి మెట్లు దిగుతున్నప్పుడు ఉన్నపళాన మొన్న జరిగిన ఉదంతం గుర్తుకి వచ్చింది. తనకు కాబోయే అత్తయ్య గారు సమయా సమయం చూడకుండా అర్థరాత్రి పూట ఫోను చేసి; యింట్లో యెన్ని ఏసీలున్నాయి, యెన్ని పాన్పులున్యాయి, కూతురు వంటగదిలో పడుకుందా లేక పాన్పుపైన పవ్వళించిందా అని అడుగుతూ తల్లినీ బామ్మ నూ ఓకుదుపు కుదిపేసిందట.


హాలులోఉన్నది ఒకే ఏసీయేగా-- బామ్మ గదిలో మాత్రం ఒకటి విడిగా ఉంది ఆమెగారి క్వరీలకు సూటిగా జవాబివ్వలేక ఒకరు తరవాత ఒకరుగా ఫోన్లు మార్చుకుని చివరన వినోదినికి అందించి తప్పుకున్నారట. అప్పటికైనా తమ యింటి వాళ్ళు తమ కుటుంబానికి ఉన్న పరిధుల గురించి తెలుసుకున్నారా! విషయం తెలుసుకున్న నాన్నగారు వెనక్కి తగ్గారా! లేదు. ఇసుమంతైనా లేదు. చిన్న నాటి నేస్తాలూ పెద్దింటి సంబంధాలే వాళ్ళకు అవసరం—మనోహరం--


మరునాడు ఉదయం పరమేశ్వర్ కను విప్పలేక అవస్థ పడుతూ పరకాయించి చూసాడు. ఇంట్లోని ఆడాళ్ళు తెగ హడావడి పడిపోతున్నారు. వాళ్ళకు వత్తాసుగా తాతయ్యా నాన్నగారూ కామేశ్వరరావూ పవన్ కూడా కంగారు పడిపోతూ కని పించారు. చీరల రెపరెపలు వినిపించి కష్టపడుతూ కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తూ హాలులోకి వచ్చి విస్తుపోతూ అడిగాడు పరమేశ్వర్ “మళ్ళీ మరొక గుడిపూజా! పవిత్రోత్సవమా?“అని.


కమలం అడ్డువచ్చి యెదురు ప్రశ్న వేసింది-“నీకెవరు చెప్పారు మరొక గుడిపూజకు వెళ్తున్నామని—’


అతడూ అదే వేగంతో స్పందించాడు-“చూస్తుంటే తెలుస్తూనే ఉందిగా! ఈ పూల మాలలు విడి పువ్వులు అగరు వత్తులు-పండ్లూ ఫలహారాలూ—ఇల్లంతా ఘుమఘుమలాడిపోవడం లేదూ—ఇంతకీ తమరెక్కడికని?”


“అంతటి పెద్ద బహువచనల ప్రకంపన అవసరం లేదు గాని, టైమయిపోతుంది—చెప్పేస్తున్నాను. హిమాలయాలలో తపస్సు చేసుకు తిరిగే కొందరు నాగ భైరవులు—కొందరు నాగ సాధువు లు యిటు వస్తున్నారట— వాళ్ళను గౌరవించి ప్రసాదం సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం కోసం వెళ్తున్నాం. ఇక నువ్వెళ్ళి నిద్రపోరా అన్నయ్యా—”


“ఇంకెక్కడి నిద్ర గాని, మరి నాగభైరవులు ప్రసాదం తిన్నగా తీసుకోరుగా! వాళ్ళకంటూ కొన్ని నియమాలుంటా యిగా! ”


కమలం అదోలా ముఖం పెట్టి బదులిచ్చింది-“తెలుసు. తిన్నగా పవిత్రత తగ్గకుండా వెళ్ళి గుడి అర్చక స్వాములకు అప్పగిస్తాం. ఇక మిగతాది వదిన్ని అడగరా అన్నయ్యా! వదినే ఈ యేర్పట్లన్నీ చేస్తుంది—”.


అతడు నమ్మలేనట్టు-“వినోదినా! “అని పైకి అనేసాడు.

“ఔను--నేనే! మరింకేమైనా అడగాలా?”వినోదిని అక్కడకు వచ్చింది ప్రశ్నవేస్తూ--


“పెద్దగా అడగటానికి యేమీ లేదు గాని—ఇవన్నీ నీకెలా తెలుసు?అంటే—అంత దూరం నుంచి హిమ పర్వత స్థానువుల వద్ద తిరిగుతుండే సాధువుల రాక గురించి నీకెలా తెలుసని. ముఖ్యంగా సాధుపుంగవులకు ఈ రీతిన సత్కరించాలన్న విషయం నీకెలా తెలుసని—’


“ఔను. తమ అనుమానం న్యాయమైనదే—వీళ్ళ రాకగురించీ వీళ్ళ కోసం చేయాల్సిన యేర్పాట్ల గురించీ నాకేమీ తెలియదు. కాని తెలుసుకుంటున్నాను. నేర్చుకుంటున్నాను. ఎవరి వద్దనుండి అంటారా—అదీ చెప్తాను. మానాన్నగారి పెద్దత్తయ్య-ఒకప్పటి స్కూలు హెడ్మిస్ట్రెస్-మేడమ్ శారదా దేవి గారి నుండి వచ్చిన ఆదేశాను సారం మేమందరమూ ఈ మంగళకరమైన యేర్పాట్లు చేస్తున్నాం. ఇంకేమైనా—”


పరమేశ్వర్ వెంటనే అడ్డుతగిలాడు-“చాలు చాలు! బోధపడింది. ఆమె గారి గురించి యింట్లో చెప్పుకోవడం విన్నాను. ముఖ్యంగా నాన్నగారికి శారదమ్మగారంటే అభిమానం. కాని-కార్పొరేట్ విద్యాసంస్థ లలో విద్య కొన సాగించి ఫారిన్ లో ఉండి విదేశీ నేపథ్యంతో చదువులు ముగించి వచ్చిన నీకు వీటి పైన యెలా ఆసక్తి కలిగిందానని—ఎప్పట్నించి కలిగిందానని--”


“ఔను. ఫ్రాంక్లీ స్వీకింగ్-మునుపు నాకు వీటి పట్ల ఆసక్తి ఉండేది కాదు. ఇటువంటివి కమలకూ అత్తగారికీ మామూలు విషయాలు కావచ్చు. నాకు మాత్రం కొత్తే--మంచివి యెప్పుడైనా యెక్కడివైనా నేర్చుకోవల సిందేగా! మోడ్రన్ లుక్ తో మోడ్రన్ చదువులు చదువుకున్నంత మాత్రాన నేను తెలుగాడపడుచును కాకపోతానా—ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక వాస్తవం ఉంది. చెప్తే నమ్ముతారో నమ్మరో తెలీదు. వింటానంటే చెప్తాను. వింటారా--’


“ఉఁ చెప్పూ—ఎందుకు విననూ!’


“నిజానికి నేనిక్కడున్నప్పుడు మన ధర్మ ఆచారాల పట్ల నాకంతటి పట్టింపు ఉండేది కాదు. విదేశాలలో ధర్మాచార్యులు ప్రవిచించిన ఉపదేశాలు విన్న తరవాతనే మన ధర్మ ఆచారాల పట్ల గౌరవమూ పట్టింపూ కలిగాయి. ఇక్కడకు వచ్చిన తరవాత మరింత పెరిగాయనవచ్చు. ముఖ్యంగా మరొకటి మనసుకి తాకింది. అక్కడకి వెళ్ళిన తరవాత అంతర్మథనానికి లోనయాను, భారత దేశంలో మనవాళ్ళు పాటించే ఆచారాలలో ఆనవాయితీలలో మన రూట్స్ అణగి ఉన్నాయని--” దానికి స్పందనగా అతడు తలూపుతూ అన్నాడు-


‘మోడ్రన్ లుక్ తో మోడ్రన్ చదువులు సాగించినంత మాత్రాన మీకు మన భారతీయ ఆచారాలపట్ల పట్టింపు లుండవని అనలేం కదా! ఎంతైనా నువ్వు తెలుగు గడ్డపైన పుట్టిన ఆడపడుచువేగా!’


“మీరలా అనలేదు. వాస్తవమే—కాని, మీ చూపులు మాత్రం మరోలా చూస్తున్నాయి. మరి దేనినో సూచిస్తు న్నాయి. ఇప్పుడని కాదు. నేనిక్కడకు వచ్చినప్ప ట్నించీ అలాగే ఉన్నాయి తమ చూపులు గిరగిర తిరుగు తూ--“ అతడేమీ అనలేదు. లోపలకు కదిలాడు. వినోదిని ఆపింది-“అలా ఉన్నపాటున కదలిపోతే యెలా మహాశయా!

అదిగో---అక్కడున్న పూల గంపను అందిచ్చి వెళ్ళండి. ”


ఇక మాటలు పెంచుకోవడం యెందుకని అతడు ఆమె మాట ప్రకారం పూల గంపను తెచ్చిచ్చి ముందుకు కదులుతూ చటుక్కున ఓసారి వెనక్కి తిరిగి చూసాడు. ఎ వుమెన్ విత్ ఎ షార్ప్ బ్రైయిన్-అండ్ విత్ ఎ షార్ప్ టంగ్—అతడలా ఊహాగానం చేసుకుంటూ గది గుమ్మం వద్దకు వచ్చేటప్పటికి కేరింత వంటి గొంతు వినిపించింది-“హాయ్ వసంతా వచ్చేసావా! వాట్ ఎ గ్రేట్ సర్ప్ రైజ్-ఇంత పెందలకడే నువ్వు రావనుకున్నాను. ”


పరమేశ్వర్ వద్దనుకుంటూనే ఓరగా చూసాడు. పట్టు చీరలో మెరిసిపోతూన్న సువర్చల ఆంటీతో వసంత నవ్వుతూ వచ్చి వినోదినిని కమలనూ కౌగలించు కుంది. ఒక్క క్షకణంలో అందాల అలలు-సంతోష నాదాలు యింటిని ఆహ్లాదకరంగా ఆక్రమించుకున్నాయి. ఇకపైన తమిల్లు ఆడాళ్ళ ఉనికితో ఆడాళ్ళ రాజ్యంగానే మారిపోతుందేమో—మరి మగాళ్ళ సంగతేమి కాను--అలా అనుకుంటూ అటు వేపు చూసేటప్పటికి కామేశ్వరరావు ఇంటి గడపకు కట్టిన తోరణాల మాటున నిల్చుని ఎవరూ చూడబోరన్న ధీమాతో కళ కళ నవ్వుతూ మాట్లాడుతూన్న వసంతను కన్నార్పకుండా చూస్తున్నాడు.


అతడికి తెలియకుండానే లోలోన ఆనందం ఉప్పెనలా కలిగింది. కనిపిస్తూన్న శకునం యింటికీ కుటుంబానికీ శుభ సూచకమే—ఎప్పుడెప్పుడు మంగళకర కార్యం ఎప్పుడు యెలా జరుగుతుందో ఇప్పటికిప్పుడు చెప్పడం సులభ సాధ్యం కాకపోచ్చు. కాని, అక్కడ అన్నయ్యా వసంతా కాకతాళీయంగానైనా ఒకరినొకరు చూపులతో పలకరించుకోవడం శుభ సంకేతం కాకపోత మరేమిటి--

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
71 views0 comments

Comments


bottom of page