top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 13


'The Trap Episode 13' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


గత ఎపిసోడ్ లో

వరూధిని, మందాకినిలతో డిన్నర్ కి వెళ్తాడు భువనేశ్.

ఆ రాత్రి ప్రభావతి ఇంటికి రాకపోవడంతో వరూధిని భువనేశ్ ఇంట్లో పడుకుంటుంది. అతనికి దగ్గరవుతుంది.


ఇక ది ట్రాప్. . పదమూడవ భాగం చదవండి…


ఆరోజు సాయంత్రం వినోదిని, కమలంతో కలసి పెరడు చెట్లకు నీళ్ళుపోసి, కొన్ని మొక్కలకు ట్రిమ్మింగ్ చేసి, వంటగది లోకి వెళ్ళి కామాక్షమ్మ అందించిన నాలుగు టీ- కప్పులు ప్లేటులో పెట్టుకుని మంగళ దేవమ్మ గదిలోకి వచ్చింది. అక్కడ వినాయకం కూడా మంగళ దేవమ్మ ప్రక్కన ఉండటం చూసి- “హాయ్ తాతగారూ! ఎప్పుడొచ్చారు? అసలు మాకళ్లబడకుండా యెలా చప్పుడు లేకుండా రాగలిగారు?“ అని అడుగుతూ పెద్దలిద్దరికీ టీ- కప్పులు అందించింది. వినాయకం గట్టిగా నవ్వాడు-

“ ఇంకా నయం—ఎందుకు వచ్చారు? వచ్చారే అనుకో.. మా అవ్వగారి గదిలోకి యెలా వచ్చారు— అని అడగలేదు. ఏది యేమైతే నేమి—నీకు బదులివ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి చెప్తాను. ఊరుకి వెళ్ళి ప్రాతకాలం నాటి బందువుల్ని చూసొచ్చాను. ఎవర్నని అడక్కముందే చెప్పేస్తాను— మీ చిన్నవ్వ.. అంటే మంగళాదేవమ్మ చెల్లెలు మీనాక్షిని చూసొచ్చాను. నిజానికి నువ్వు చెప్తే నమ్ముతావే లేదో గాని—నేను మీనాక్షినే పెళ్ళి చేసుకోవలసింది. మధ్యన మంగళ దేవమ్మ శివపూజలో యెలుగులా దూరి కార్యం పాడు చేసింది. చెల్లిని ప్రక్కకు తోసి నన్ను యెగరేసుకు పోయింది—లేకపోతే—నేనిక్కడ కాదు. అక్కడుందును—“.

ఆ మాట విన్నంతనే మంగళా దేవి కస్సుమంది- “మహా మన్మథుడు చూడూ— సొక్కి పడిపోయాను. నిజానికి ఈ మన్మథ రూపుడే తోటలోకి పిలిచి వెన్నెల భోజనం తిందామని కింక పెట్టేవాడు. నావెంట పడేవాడు. అదంతా మరచిపోయినట్టున్నాడు ఈ పెద్దమనిషి—”

అప్పుడు కమలం వాళ్ళ మధ్యకు వచ్చి నిల్చుంది- “ఇక చాలించండి ఈ కొట్లాటలూ ముచ్చట్లూ— అప్పట్లో పోలిగామీ ఉండటం చట్ట ఉల్లంఘన కాదు కదా— ఎంచక్కా ఇద్దరక్కా చెల్లెళ్ళనూ కిడ్నేప్ చేసి తీసుకొచ్చేయ వలసిందేగా- ! మాకు ఇద్దరు బామ్మలుండే వారు కదా! ఇల్లు ఇంతకంటే రప్చర్ గా ఉండేది కదా..”

మంగళాదేవమ్మ యేమీ అనలేదు. మనవరాలిని దగ్గరకు పిలిచింది- రహస్యం చెప్తానంటూ— కమల దగ్గరకు వచ్చింది—చెప్పు బామ్మా అంటూ—మంగళాదేవమ్మ యేమీ చెప్పలేదు. చట్టున నెత్తిపైన మొట్టి కాయ పెట్టింది.

“సరిగ్గా చదివి మార్కులు తెచ్చుకోవు గాని—ఇటువంటి కబుర్లంటే తిరుపతి లడ్డూలా యెగరేసుకుని నములు తావు. నీ కోసమూ మీ అన్నదమ్మలు కోసమూ గుడి జాతర నుండి యేదో మీ తాతయ్య తెచ్చినట్టున్నాడు. అదిగో—అక్కడుంది సంచీ- తీసుకు వెళ్ళు—”.

అబ్బ.. అని నెత్తి నిమురుకుంటూ-- “నేను వెళ్ళను. తాతయ్యతో ఉంటాను.” అని కదలి వెళ్ళి మిడిల్ స్థాయిన ఏ. సీ మిషన్ వేసింది. వినోదిని నవ్వుతూ కమలాన్ని అక్కున చేర్చుకుంటూ అంది- “అవ్వా! మీకొకటి చెప్పాలని వచ్చాను. మీరేమో—తాతయ్యగారితో గొడవకు దిగారు. చెప్పేదా?”.

ఉఁ అంటూ టీ తగాడం పూర్తిచేసి- ఖాలీ కప్పు చేతికి అందిస్తూ ప్రశ్నార్థకంగా చూసింది విషయం యేమిటన్నట్టు-- “ఇంట్లోనుంచి ఫోను వచ్చింది అవ్వా-- ”

“ఇందులో కొత్తేముందమ్మా! ప్రతి రోజూ ఫోన్లు వస్తూనే ఉన్నాయిగా-- అందులో మీ పెద్దమ్మ కూతురు తులసి సంగతి చెప్పనే అక్కర్లేదు-- ఉఁ విషయం చెప్పు. ”

“అమ్మ, యిక చాలు.. యింటికి బయల్దేరమంటుంది. అన్నీ సర్తుకుని సిధ్ధంగా ఉంటే కారు పంపిస్తా మంటుంది. ”

ఆ మాట విన్నంతనే మంగళాదేవమ్మ ముఖం మారిపోయింది. “అంత తొందరేమొచ్చిందమ్మా! వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు. మరొక మూడు రోజులుందువు గాని—అందులో యిప్పుడిప్పుడేగా నా పాదాల పగుళ్ళు సర్దుకుంటున్నాయి— నాకు కెమికల్ క్రీములు పడవంటే నువ్వేగా స్పెషల్ గా నాకోసం కొబ్బరినూనెలు హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు పట్టిస్తున్నావు. ఇప్పుడు పగుళ్ళ నుండి రక్తం కారడం తగ్గిపోయిందిగా—ఇప్పుడు యిలా వెళ్ళిపోతే యెలాగమ్మా? అంతేకాక—మీ ఆంటీ నిన్ను భవానీ అమ్మవారి గుడికి తీసుకు వెళ్ళి వివాహ ఘడియలు అనుకూలంగా ఉండటానికని యేవో ప్రత్యేక అర్చనలు చేస్తానని కంకణం కట్టుకున్నట్లుంది. ఇది నీకు తెలుసా తెలియదా!”

“ఆంటీ అర్చనలేవో చేయిపిస్తానన్నది నాకు తెలుసు అవ్వా! ఇవే అర్చనలు మా ఊరి అమ్మవారి గుడిలో కూడా చేయొచ్చంటుంది అమ్మ—”

“అదెలా సాధ్యం? మీ అమ్మకు తెలియక పోతే గమ్మున ఉండమను. అర్చనలు పూర్తి చేయాలంటే నువ్వుంటే మాత్రం చాలదు. నీతో బాటు ఆ కంప్యూటర్ హీరో కూడా ఉండాలిగా! ఇంతకూ ఇదంతా మీ ఆంటీగారు యెలా చేయిపిస్తుందనుకునేవు— సిధ్ధాంతి గారి ఆలోచన ప్రకారమే-- ”

ఆ మాటతో వినోదిని ఊరకుండిపోయింది. ఖాలీ కప్పుల్ని అందుకుని వంట గదిలో పెట్టి వచ్చి-- పనిలో పనిగా కర్పూరం పసుపు కలిపిని ద్రావకాన్ని తీసుకు వచ్చి మంగళాదేవమ్మ పాదాలకు పట్టించ సాగింది. అప్పుడు వినాయకం చెణుకు విసిరాడు- “ఇంటి కోడలు కాకముందే కలవారి అమ్మాయి నుండి పనులు లాక్కుంటున్నారన్నమాట. ఇది పెద్ద అన్యాయం. నేను ఆక్షేపిస్తున్నాను”.

కమలం నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూనే నవ్వసాగింది. అప్పుడు వినోదిని కూడా నవ్వు తేరల్ని ఆపుకోలేక పోయింది.

***

ఆరోజు సోమవారం. పరమేశ్వర్ స్నానం చేసి వచ్చి పెరడు తోటలోని తులసి కోటకు నమస్కరించి, తొందరగా నడచుకుంటూ పూజాగది లోకి ప్రవేశించి అంతే తొందరగా విఘ్నేశ్వర స్తుతి- “శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే..” పఠించడం పూర్తిచేసి నుదుట సన్నగా విబూధి పూసుకుని డ్రెస్సప్పయి వచ్చి వంట గదిలోకి ప్రవేశించాడు; ఆకలేస్తూంది—తినటానికేమైనా పెట్టమని తల్లిని అడుగుతూ--

మొదట కమలం వచ్చింది. అతడు చెల్లిని పురమాయించాడు, త్వరగా టిఫిన్ పెట్టమని. ఆమె తల అడ్డంగా ఆడిస్తూ సైగ చేసింది వెనుక తల్లి వస్తుందని హావభావం చూపిస్తూ— కమలం చెప్పినట్టే కామాక్షమ్మ వచ్చి కొడుకుని లేవమంది. అతడు ఆశ్చర్యంగా చూసి, “ఆకలేస్తుందంటే కూర్చున్న వాడిని లేవమంటావేమిటమ్మా! త్వరగా పెట్టు డ్యూటికి వెళ్ళాలి.

“మాకు తెలుసు నువ్వు డ్యూటీకోసమే వేగిర పడుతున్నావని. ఉద్యోగం దొరక్క ముందు కూడా నువ్విలాగేగా వేగిర పాటుతో చదువులని గ్రంథాలయాలని తొందర పడుతూ మమ్మల్ని తొందర పెట్టేసేవాడివి. మమ్మల్ని యెప్పుడైనా నింపాదిగా టీవీ సెట్టు ముందు కూర్చోనిచ్చేవాడివా! ఇప్పుడు కూడా అదే హడావిడా? ముందు లేచి లోపలకు రా! నాన్నా, మీ తాత య్యా నీకోసం యెదురు చూస్తున్నారు. ”అంటూ కదలి వెళ్ళిపోయింది కామాక్షమ్మ.

ఇక చేసేది లేక పరమేశ్వర్ లేచి కాసిని మంచినీళ్ళు నోట్లో పోసుకుని తల్లిని వెంబడించాడు. అక్కడ నెలకొన్న గంభీర వాతావరణం గమనించి యెదురు కాబోయేది సీరియస్ సిట్వేషనేనని తేల్చుకున్నా డు.

మొదట వేదమూర్తే అడిగాడు- “ఈరోజు నువ్వు గుడికి వెళ్ళాలని మీ బామ్మా అమ్మా చెప్పారా లేదా?”

పరమేశ్వర్ వెంటనే స్పందించాడు- “సోమవార వ్రతాలకూ మంగళ వారం వ్రతాలకూ తీరుబడిగా వెళ్ళేంత సమయం నాకు లేదు నాన్నగారూ! నేను పని చేస్తున్నది కార్పొరేట్ వ్యవస్థన్నది ఇంట్లో వాళ్ళు మరచిపో తున్నట్టున్నారు. ప్రతి నిమిషాన్నీ డబ్బుతో విలువ కడ్తారు. శ్రమను వృధా పోనివ్వకుండా ఎన్ క్యాష్ చేస్తారు. మాకు టార్గెట్లుంటాయి. అందులో-- ఈరోజేమో ఆఫీసులో మేజర్ ప్రోజెక్ట్ లాంచింగ్ ఉంది. త్వరగా వెళ్లాలి”.

అప్పుడు వినాయకం కలుగ చేసుకున్నాడు, “నువ్వు చెప్పింది మేం విన్నాం. ఇక మేం చెప్పేది నువ్వు వింటావా! ”

తాతయ్య ముందు పరమేశ్వర్ భవ్యంగా తలూపాడు.

“ఈరోజు మనం గుడికి వెళ్ళబోతున్నామన్న విషయం నీకు మీ అమ్మ చెప్పిందా లేదా---”

మళ్ళీ తలూపాడతను-

“అంటే—నీకు తెలుసన్నమాట. ఇక రెండవ విషయం- టార్గెట్లు ఔట్ పుట్లూ కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ కోసమే కాదు. అటువంటి టార్గెట్లు జీవితానికీ ఉంటాయి. గుర్తుంచుకో!

ఇక—మూడవది—మేజర్ ప్రోజెక్ట్ లాంచింగ్ యెన్ని గంటలకు— ఇప్పటికిప్పుడే లాంచ్ చేస్తారా! ”

పరమేశ్వర్ బదులివ్వలేదు. తాతయ్య మనవణ్ణి భల్లూకపు పట్టుతో బిగించినట్టున్నాడు. ఇప్పుడు పరమేశ్వర్ ది కదల్లేని స్థితి.

“తెలిసిపోయింది. నువ్వు నిదానంగా కూడా ఆఫీసుకి వెళ్ళవచ్చని. నువ్వు గదికి వెళ్ళి ప్యాంటూ షర్టూ విప్పి, పదహారణాల తెలుగువాడిలా పంచె కట్టుకుని జుబ్బావేసుకుని రా—ఇప్పుడు ఆలస్యం సమ్మతం కాదు”.

ఇక మాట్లాడి ప్రయోజనం ఉండబోదని తెలుసుకున్నాడేమో— తలాడిస్తూ బైటకు కదిలాడు. ఈసారి వేదమూర్తి కొడుకుని ఆగమన్నాడు. అతడాగి తండ్రిని సమీపించాడు-

“ఏదో తప్పీ జారీ మన కుటుంబంలో చదువున్న వాడివనిపించుకున్నావు. అంత మాత్రాన నీకంతా తెలుసనుకోకు— వినోదిని మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి కాదు. నీతో సమానంగా చదువుకున్నది. హై క్లాస్ కాలేజీలలో ఉత్తీర్ణత సాధించిన విద్యావంతురాలు. తలచుకుంటే— ఓసారి పత్రికలో గాని ఆన్ లైన్ యాప్ లో గాని ప్రకటన యిస్తే ఆ పిల్ల చేతిని అందుకోవడానికి నూరుమంది అబ్బాయిలు నలుమూలల నుంచీ స్పందిస్తారు. నీకు నువ్వు గొప్పగా ఫీలయిపోతూ తిక్క తిక్కగా ప్రవర్తించకు—“

దీనికి పరమేశ్వర్ ఠఫీమని స్పందించాడు- “ఇక్కడే—ఇక్కడే అసలు పాయింటుంది. ఇప్పుడు అదే పాయింటుని మీరుగా చెప్పారు. తలచుకుంటే ప్రకటన గాని యిస్తే వినోదిని వంటి సొంపైన అమ్మాయి కోసం నూరు మంది క్యూలోకి వచ్చి నిల్చుంటారు. అటువంట ప్పుడు నా పైన గురి పెట్టడం దేనికి—అన్నయ్య ఉండగా నన్ను వెంబడించడం దేనికి-”

“ఇక్కడాగు అతి తెలివి చూపించడం మానుకుని— నీకే కాదు— ఇంట్లో వాళ్ళందరకూ తెలుసు కారణమేమిటో! దివాకర్ నా చిన్న నాటి దోస్త్. మన కుటుంబంతో బంధుత్వం పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇది మనో రాగానికి ముడిపడిన విషయం. ఇది మీబోటి సాంకేతిక జీవుల కంప్యూటర్ కు తెలియక పోవచ్చు. నీ కంప్యూటర్ మెదడుతో ఈ చిన్న విషయం గురించి ఆలోచించు. ఈ సంబంధం వల్ల ఎక్కువ యెవరికి ప్రయోజనం? వాళ్ళకా మనకా-- ఇక ఆఖరి విషయం. నీ పెళ్లి సంబంధం ఖరారయిపోతే చిక్కు ముడి విడిపోయినట్టు మీ అన్నయ్య పెళ్ళి సంగతి కూడా తానుగా తేలిపోతుంది. నీకు నువ్విప్పుడు అశ్వ మేధ యాగాల్ని పూర్తి చేసిన మయూర ధ్వజుడిలా ఫీలయిపోకుండా పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితుల గురించి కూడా ఆలోచించడం నేర్చుకో— సర్దుబాటు అలవర్చుకో-- “

పరమేశ్వర్ ముందుకు వచ్చాడు- “ఇక నేనొకటి చెప్పేదా నాన్నగారూ! ”

ఉఁ అని తలూపాడు వేదమూర్తి.

“నేనిప్పుడేమి చెప్పినా విని తెలుసుకోతగ్గ మూడ్ లో లేరు మీరు. ఏమరుపాటున కొంచెం ప్రతికూలంగా చెప్పినా తండ్రీ కొడుకులిద్దరూ భరింపరాని అసహనంతో ఊగిపోతూ నన్ను చితకబాదినా చితక బాదుతారు. ఇక చెప్పడం ముగిస్తాను. నడుస్తూ నడుస్తూ యేమరు పాటున జారి పడిపోతే మళ్ళీ లేచి మట్టీ మన్నూ దులిపేసుకోవచ్చు. కాని— తెలిసి గుంతలో పడితే మనల్ని ఆ బొడ్రాయమ్మ వారు కూడా కాపాడరు. వాళ్ళ కుటుంబంతో మనం యేవిధంగానూ సరితూగలేం. ఒక ఉదాహరణ యిస్తాను. మొన్న మొన్న మనింటికి వచ్చిన ఆ అమ్మాయి కొనిచ్చిన పెట్టుడు చీరల్ని కట్టుడు చీరల్నీ వద్దనకుండా ఇంట్లోని ఆడాళ్ళందరూ చేతులు చాచి అందుకున్నారు. అందుకుని యింట్లోని పెద్దవాళ్ళందరూ వినోదినిని వేనోళ్ళ పొగిడి ఆకాశానికి యెత్తేసారు కూడాను. ఇదీ మనింటి పరిస్థితి. . ”

అప్పుడు కామాక్షమ్మ గట్టిగా కలుగ చేసుకుంది- “నోరు మూస్తావురా మొండి వెధవా! చదవక ముందు బాగానే ‘కాకరకాయి' అనేవాడట నీబోటి వాడు. చదవడం పూర్తి చేసిన తరవాత కీకర కాయని చెప్పనారంభించాడట. ఆ పిల్ల కోసం నీకేమి తెలుసురా? ప్రేమతో మా పెద్దరికం పట్ల ఉన్న గౌరవంతో నిండు మనసుతో యిచ్చిన గుడ్డలవి. అందుకే నేనేకాక మీ చెల్లీ మీ బామ్మగారు కూడా తీసుకున్నారు. అందరూ పిల్లను దీవించారు కూడాను— ఇప్పుడు అసలు విషయం విను. ఆ పిల్లనుండి తీసుకోవడమే కాదు- ఆ పిల్లకోసం మా పరిధిలో ఉన్నంత మేర గద్వాల్ పట్టుచీర కొనుంచాం వెళ్ళేటప్పుడు యివ్వడానికి. ఆ పిల్ల తలచుకుంటే పది పట్టు చీరలు కొనుక్కోగలదని మాకు తెలుసు. కాని— మేము ప్రేమతో యివ్వబోయే చీరకు సమాన మవగలదా! చెప్పరా-- నీకిష్టముంటే పెళ్ళి చేసుకో— లేకపోతే- నీదారిన నువ్వుపో! అంతే కాని— ఆ అమ్మాయిని గాని యేదైనా ఎత్తి పొడుపుగా అన్నావంటే నేనూరుకోను”

ఇక అక్కడ నిల్చోవడం సబబు కాదనుకున్నాడేమో— పరమేశ్వర్ గది విడిచి వెళ్ళి పోయాడు. వినాయకం మీసాల మాటున ముసి ముసిగా నవ్వుకున్నాడు. వేదమూర్తి భార్య వేపు మెచ్చుకోలుగా చూసాడు.

------------------------------------------------------------------------------


ఇంకా వుంది..



------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



116 views0 comments

Kommentare


bottom of page