top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'The Trap Episode 10' New Telugu Web Series


(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదవ భాగం

గత ఎపిసోడ్ లో

చనిపోయిన తమ కూతురు సుభాషిణి పుట్టిన రోజున వరూధిని ఇంటికి వెడతారు భువనేష్, ప్రభావతులు.

మందాకినిలో తమ కూతుర్ని చూసుకోవాలనుకుంటారు.

వరూధిని, ఆఫీసుకి వెళ్లకుండా వాళ్ళతో గడుపుతుంది


ఇక ది ట్రాప్.. పదవ భాగం చదవండి…


ఆరోజు పరమేశ్వర్ యేదో ప్రోజెక్ట్ ప్రిపరేషన్ లో బిజీగా పని చేసి ఇల్లు చేరేటప్పటికి ఆలస్యమైంది. గుమ్మం వద్ద మట్టి దివ్వెలు పెడ్తూ తులసీ స్తుతి పాడుతూంది తల్లి- “యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవతా:”


కాని— అదే సమయాన ఇంట్లోపల నుంచి తండ్రి కేకలు వినిపించడం గమనించి స్టన్నయాడు. వేదమూర్తికి కోపం వస్తే పట్టలేడని అతడికి తెలుసు. ఆపు కోవడానికి ప్రయత్నిస్తే మరింతగా రెచ్చిపోతుంటాడని కూడా తెలుసు. మొత్తానికిది మంగళకర సాయంత్రమనేదా లేక భీతావహ వాతావరణ మనేదా-- ఇలా తడబడుతూ త్వర త్వరగా బూట్సు విప్పి లోపలికి చొచ్చుకు వెళ్లాడు పరమేశ్వర్. అక్కడ తమ్ముడు పవన్ భీతిల్లే వదనంతో ఒదిగి ఒదిగి జంకుతూ ఏదో విషయంపై తండ్రికి నచ్చచెప్పడానికి అవస్థ పడుతున్నాడు. దగ్గరకు వెళ్ళింతర్వాత తెలిసింది, తండ్రి తమ్ముణ్ణి యెడాపెడా వాయిస్తున్నాడని-


“చచ్చు తెలివి తేటలు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడచుకో! లేకపోతే ఏమవుతుందో తెలుసు కదూ? మీ బాబు నీకంటే ముందు పుట్టాడన్నది గుర్తు పెట్టుకో— తొక్కేస్తానని చెప్పను గాని చీల్చేస్తా!”


అప్పుడు కలుగ చేసుకున్నాడు పరమేశ్వర్ తండ్రికి గ్లాసులో మంచి నీళ్లు పోసి అందిస్తూ- “ఏమైంది నాన్నగారూ! కాని తప్పేమైనా చేసాడా! ”

“ఇంకేమి కావాలి? ఏమి జరక్కూడదో అదే జరిగేటట్లుంది. ఇద్దరన్నయ్యలున్నారు. ఇవన్నీగమనిస్తున్నారా!”


“ఏమి గమనించలేదంటున్నారు నాన్నా! చెప్తే కదా తెలుస్తుంది? ”

“అవన్నీ ఈ వయసులో నా నోటమ్మట చెప్పాలన్న మాట. కర్మ! కోమటి కోదండం రెండవ కూతురు ప్రణీత లేదూ— ఆ పిల్లతో ఈ మధ్య మీ తమ్ముడు మరీ క్లోజ్ ఫ్రెండు షిప్పుతో మెసలుతున్నట్టున్నాడు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఒకటే పకపకలూను విక వికలూను-”


కోపంగా ఉన్న తండ్రిని శాంతపర్చడం కోసం పరమేశ్వర్ అన్నాడు- “మీరు అనుకుంటున్నది వాస్తవం కాకపోవచ్చు నాన్నగారూ! ఇటువంటి విషయాలలో ధైర్యం కావాలి. వాడికి అంతటి ధైర్యం ఉండదు నాన్నా!”

“నోర్మూస్తావా! ఇటు వంటి విషయాలలో ధైర్యం కాదు కావలసింది. పెడ బుధ్ది ఉంటే చాలు— అప్పుడే అనుకున్నాను వీడు మునుపులా టాకీలకు పోకుండా తరచుగా గుళ్ళూ గోపురాలు తిరుగుతున్నప్పుడే— ఆ పిల్ల యెప్పుడెప్పుడు మన షాపుకి వస్తుందో— అప్పుడు వీడు యేదో ఒక నెపంతో దుకాణం నుండి బయటకు వచ్చేస్తుంటాడు. భవ్యంగా ఆ పిల్ల కొన్న సామాను స్వయంగా తీసుకు వెళ్ళి బయట పెడ్తుంటాడు. ఆ పిల్ల అడక్కుండానే మంచినీళ్ళ గ్లాసు అందిస్తుంటాడు. కళ్ళు మూసుకుని పాలు తాగుతూన్న పిల్లి వాటం అన్నమాట— అవన్నీ నాకు తెలియదనుకుంటున్నాడేమో—”

“ఐనా— నేను మళ్లీ అదే చెప్పబోతున్నాను నాన్నా! ”


వేద మూర్తి అదేమిటన్నట్టు పరమేశ్వర్ కళ్లలోకి చూసాడు-


“అదే నాన్నా! పవన్ అటు వంటి విషయాల జోలికి వెళ్ళడు. ఎటొచ్చీ— వాడిది కాస్తంత ఫ్రెండ్లీ టైప్. అంచేత— వాడు అందరితో కలివిడిగా ఉంటాడు. మాలా కాకుండా, అవసరం ఉన్నా లేకున్నా యెక్కువగా నవ్వుతుంటాడు. ఆలయ దర్శనం మాటంటారా- వాడికి దైవభక్తి కాస్తంత అధికమని మనకు తెలిసిందే కదా-- ఇక మీరు లోపలకు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. వాడి సంగతేమిటో నేను చూసుకుంటాను—”


కొడుకు మాటకు తలొగ్గుతూ తలూపుతూ లోపలకు వెళ్ళిపోయాడు వేదమూర్తి. అప్పుడు అతడు పవన్ వేపు తిరిగి దగ్గరగా నడచి వచ్చాడు.


“నాకేమీ తెలియదనుకోకు. మీ మధ్య బోలెడంత ఉండక పోవచ్చు. కాని— ఎంతో కొంత ఉండ వచ్చన్నది నాకు తోస్తూంది. ఆరోజు మీరిద్దరూ యేమి చేస్తున్నారు— తుంపర పడుతున్నప్పుడు ఇద్దరూ చింత చెట్టుక్రింద కూర్చుని హిమ క్రీము తినడం లేదూ! అది నేను చూడ లేదూ— మీరు తప్ప యెవరైనా వర్షంలో తడుస్తూ హిమ క్రీము తింటారా? ”

“అటువంటిదేమీ లేదురా అన్నయ్యా! జస్ట్ ఫ్రెండ్స్- అంతేరా! నన్ను నమ్మరా! నాన్నలా మరీ టచ్చీగా సందేహ పడకురా! ”


“రేపటి సంగతి యెలా ఉంటుందో చెప్పలేను గాని—ఇప్పటికి నిన్ను నమ్ముతున్నాను. రెండే రెండు జ్ఞాపకం ఉంచుకో! నీ వల్ల ఎవరికీ హాని కలగకుండా చూసుకో—రెండవది, నీ కంటే ముందు నేనూ కామేశ్వరరావు ఉన్నామన్నది ప్రెండ్ షిప్ మజాలో పడి మరచిపోకు—ఇదిగో! నీకు మొన్నెప్పుడో కవరు వచ్చినట్లుంది. తీసుకో—” అని అందించి కదలి వెళ్ళిపోయాడు.

పవన్- “నాకా! ”అని అందుకుంటూ కవరు విప్పాడు. కళ్ళు ఫెళ్ళున మెరిసాయి. అందులో ఏడు వేల క్రిస్ప్ రూపాయ నోట్లున్నాయి.

పుష్య మాసం. పుష్యమి నక్షత్ర పౌర్ణమి. మహావిష్ణు తీర్థ ముక్కోటిని గురువారం నాడు స్థల అర్చక స్వాముల ఆధ్వర్యాన మిక్కిలి భక్తి శ్రధ్ధలతో ఊరి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్తలు జరిపించారు. నగరం నలుమూలల నుంచీ పుణ్య తీర్థానికై పెక్కుమంది ముత్తయిదువులు గృహిణులు కన్యలూ హాజర యారు. పూజలూ పునస్కారాలు ఎంత వైభవంగా జరిగాయంటే ప్రముఖ ప్రజా ప్రతినిధి ఒకరు వెండి బోనం సమర్పించి వెళ్ళాడు, భక్తులందరీకీ ప్రసాదాలు పంచిపెట్టడానికి ప్రత్యేకంగా యేర్పాట్లు చేసి-- మొత్తానికి అదొక మహా కుంభాభిషేకంలా పరిపూర్ణత సంతరించుకుంది. పరిపూర్ణ భక్తి స్రవంతి ప్రవహిస్తున్నప్పుడు నింగిలోనూ భూమిలోనూ ధవళ కాంతులు విరాజిల్లక మానవు కదా!


తీర్థ ముక్కోటి పూజలకు ఇద్దరు సహోద్యోగులతో హాజరయి, తెలిసిన ఆలయ సిబ్బంది సహ కారంతో ప్రసాదాలు పొట్లం కట్టి ఇద్దరు సహోద్యోగులకూ అందచేసి వాళ్ళను క్షేమంగా గృహాభి ముఖులను చేసి ఇల్లు చేరాడు పరమేశర్. ఇంటిల్ల పాదికీ భవ్యంగా ప్రసాదాలు అరటి ఆకుల్లో పంచి పెట్టి ఇంటి లోగిలివేపు నడిచేటప్పుడు ఇంటి ముందు కారు సర్రున చప్పుడు చేస్తూ వచ్చాగింది. మిత్రులిద్దరూ ఇండ్లకు సాగకుండా

ఇటు తనను వెతుక్కుంటా వచ్చేసారేమో!


వాళ్ళను సాగనంపుతున్నప్పుడు తను చెప్పే పంపించాడుగా అనువైన సమయం చూసి ఇంటికి తీసుకు వచ్చి ఇంటిల్లపాదికీ పరిచయం చేసి విందు భోజనాలతో సాగనంపుతానని;వీలుంటే, అర్జునుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసిన మల్లెల తీర్థం కూడా తీసుకె ళ్తానని-- మరెందుకిప్పుడు తనకోసం వచ్చారో-- అతడలా పలు విధాల తలపోస్తూ గడపదాటి సూటిగా చూసేటప్పటికి తెలుసుకున్నాడు; అది మిత్రులెక్కి వెళ్ళిన అదే రంగు తెల్ల కారయినా యిప్పుడింటి ముందా గినది అదే కారు మాత్రం కాదని-- అందులోనుంచి ఇద్దరు భార్యా భర్తలతో బాటు పొడవైన నాజూకైన అమ్మాయి కూడా దిగింది.


కమలతో బాటు అమ్మానాన్నలిద్దరూ వడి వడిగా రోడ్డుపైకి వచ్చి- “రండి రండి! మీకోసమే యెదురు చూస్తున్నాం. గుడిలో తీర్థ పూజలు జరిగిన తరవాత యిటు రావడం మరచి అటే వెళ్ళి పోయుంటారనుకున్నాం. ”


దానికి వాళ్ళిద్దరూ నవ్వుతూ స్నేహపూర్వకంగా యేదో చెప్పి ఇంటి వేపు రాసాగారు. కను చూపు మేర వచ్చేటప్పటికి గుర్తు పట్ట గలిగాడు పరమేశ్వర్- వాళ్ళిద్దరూ దివాకర్ అంకుల్ దంపతులని. ఆ అమ్మాయి మరెవ్వరో కాదు వాళ్ళ పెద్ద కూతురు వినోదిని.


అప్పుడెప్పుడో కాలేజీలో చూసిన రూపానికిప్పుడు కొంచెం తేడా-- ఇక అలా నిల్చుని దూరంగా ఒదిగి నిల్చోవడం బాగుండదని పరమేశ్వర్ కామేశ్వరరావుతో బాటు వెళ్ళి నమస్కారం పెట్టి వినోదినిని మాత్రం హాయ్- అన్న సంబోధనతో పలకరించా డు. కామేశ్ మాత్రం తల వంచి నమస్కరించి అందరికీ దూరంగా ఒదిగి నిల్చున్నాడు; ఖరీదైన నేపధ్యం గల బంధుమిత్రులకు కాస్తంత యెడంగా ఉండటం దేనికైనా మంచిది కదా- అన్న ధోరణితో—


ఇంట్లోపలకు వస్తూనే దివాకర్ పరమేశ్వర్ ని మెచ్చుకోలుగా పలకరించాడు- కష్టమైన విషయమైనా యిష్టమైన జాబ్ ని అందుకున్నందుకు. వినోదిని యెక్కువ మాట్లాడలేదు గాని, క్లుప్తంగా కంగ్రాట్స్- అంది. అల్పాహారాలు తీసుకుంటూ ఆవుపాలతో కలిపి చేసిన కాఫీలు తాగుతూ మాటా మంతీ మాట్లాడుకుని ఇక బయల్దేరుతాముంటూ లేచారు. అప్పుడు కారు డ్రైవర్ చప్పున వెళ్ళి కారులోనుంచి ట్రావలింగ్ బ్యాగు తెచ్చి హాలు మధ్య పెట్టాడు.


బ్యాగు కొంచెం పెద్దదిగానే ఉండటం చూసి పరమేశ్వర్ అనుకున్నాడు- “అందులో ఏమున్నాయో! ”అని మనసున అబ్బుర పడుతూ—


కాని, మరి కొద్ది సేపట్లో అతడికి షాక్ పైన షాక్ తగిలింది. అందరివద్దా వెళ్లొస్తామంటూ వాళ్ళు ట్రావిలింగ్ బ్యాగుతో బాటు వినోదినిని కూడా విడిచి పెళ్ళిపోయారు. అతడు అనుకోకుండా గట్టిగానే అన్నాడు- “వినోదినీ! మీ డాడ్ మామ్ వెళ్ళిపోతున్నారు ! ”


అప్పుడు వేదమూ ర్తి అడ్డుకున్నాడు. “ఎందుకురా అలా గాభరా పడిపోతున్నావు! మనమందరమూ ఓసారి వాళ్ళింటికి వెళ్ళి రావాలని ప్లాను వేసాం. కాని— వీలు కాలేకపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా వినోదినిని, వినోదిని పెద్దమ్మ కూతురునీ కొన్నాళ్ళు మన వద్ద ఉండి వెళ్ళమన్నాం. వినోదిని అక్కయ్య తులసి యేవో పనుల వల్ల ఇప్పుడిక్కడకు రాలేకపోయింది. తరవాత ఎప్పుడో వస్తుందిలే—


ఇక యిప్పటి మాట—వినోదిని కొన్నాళ్ళు మనింట్లో మనతోనే ఉంటుంది. మనూరు చుట్టూ విస్తరించి ఉన్న గుళ్ళూ గోపురాలూ- వీలుంటే మల్లెల తీర్థమూ చూసి వెళ్తుంది. ఇందులో మీ అన్నాదమ్ములిద్దరికీ ఏ బాదరా బందీ ఉండదు. దగ్గరుండి కమలం చూసు కుంటుంది. తులసి గాని రాగలిగితే పనిలో పనిగా త్రిపురాలయం దర్శించి ఇద్దరూ వెళ్ళిపోతారు. నువ్వు మాత్రం ఒక పని చేయి, నీకు గాని వీలుంటే— వినోదినికి డిజిటలైజేషన్ అడ్వాన్సుడ్ అవేర్ నెస్ ప్రాక్టీసులో చేదోడుగా ఉండు. మనూరులో యిక్కడేదో కొత్తగా మల్టీ నేషనల్ డెటా సెంటరు ఆరంభించా రటగా- అక్కడ చేరాలని వినోదిని అనుకుంటుంది”.


అతడేమీ అనలేదు. ఔనూ అనలేదు. కాదూ అనలేదు. ఊరుకున్నంత సౌఖ్యమూ బోడి గుండంత సుఖమూ- లేదన్న నానుడిని మననం చేసుకుంటూ--


అప్పుడు వేదమూర్తి నిశ్శబ్ద అలలను రేపాడు- “అదేమిట్రా అలా మన్ను తిన్న పాములా ఊరకుండిపోయావూ! ఎవరైనా టెక్నికల్ ప్రొఫేషనల్ వద్దకు వెళ్ళ మంటావా? ”


ఇక తప్పదన్నట్టు ఎట్టకేలకు పరమేశ్వర్ నోరు తెరిచాడు, “అవసరం లేదు నాన్నగారూ! ఇప్పిటికే ఓసారి పెద్దన్నయ్యకు తెలిసిన టిక్నికల్ ఫ్రొఫెసర్ కి ఇబ్బంది కలుగ చేసాం. మళ్ళీ యెందుకు ఆయనను టాక్స్ చెయడం. నేనే వీలున్నంత లాకల్ కండీషన్స్ కు తగ్గట్టు పుషప్ చేస్తాను”అని లోపలకు కదలబోయాడు పరమేశ్వర్.


అప్పుడు కొడుకుని ఆపాడు. వేదమూర్తి- “ఒప్పుకున్నావు—సంతోషం. కాని—ఒకటి. నీకు తెలుసో తెలియదో గాని-- అమ్మాయిలు సాధారణంగా సున్నితంగా ఉంటారు. చెదరని నవ్వు ముఖంతో మెసలుకో—లేకపోతే, దూరంగా తొలగిపోతారు. ఇది తెలిస్తే-- దివాకర్ నొచ్చుకుంటాడు, మరొకటి—వినోదిని అదేదో అకాడమిక్ కోర్సు కోసం ఫారిన్ వెళ్ళొచ్చిన అమ్మాయి. ఇక్కడి వర్కింగ్ అవసరాలకు సరిపోయేలా షార్ట్ టార్మ్ కోర్సులా బాగా తయారు చేయి. ఇది గుర్తుంచుకో! ”


అతడు తలూపుతూ వినోదిని వేపు ఓసారి చూపు సారించి లోపలకు వెళ్ళిపోయాడు. మొత్తానికి మిత్రులి ద్దరూ ద్రోణ భీష్మాచార్యుల్లా యింట్లో రాజ తంత్రం చేయబోతు న్నారన్నమాట! తలచుకుంటే- దివాకర్ అంకుల్ వినోదినిని యూరప్ కో అమెరికాకో పంపించి పై స్థాయి టెక్నికల్ కోచింగ్ ఇప్పించలేడూ—ఇంకా చెప్పలంటే, ఇంకెక్కడికో యెందుకు—ఇండియాలోనే ప్రతిష్ఠాత్మక టెక్నికల్ స్కూలులో చేర్పించలేడూ- అంతా యెత్తున ఉన్న వాళ్ళ యెత్తుగడలు.


ప్రొద్దుట తన గదిలో డ్రెస్పప్పయి కాస్తంత జాస్మైన్ సెంటుకూడ చిలకరించుకుని హాలులోకి వచ్చాడు పరమేశ్వర్. సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చిన పవన్ అన్నయ్యను ఆశ్చర్యంగా చూస్తూ నిల్చు న్నాడు. అది గమనించిన పరమేశ్వర్ అడిగా డు- “అదేమిట్రా అలా విస్తుపోతూ నిల్చున్నావు! ఏదో చెప్పాలను కుంటున్నట్టున్నావు. ముందు రెప్పలు వాల్చి చూడు”


“చెప్పాలనే వచ్చానురా అన్నయ్యా! ఇప్పుడు నిన్నిలా చూసి నోట మాట రాకుండా నిల్చున్నాను. ఏది ముందు చెప్పాలో తెలియక ఇలా- “


పరమేశ్వర్ నవ్వుతూ దగ్గరకు వచ్చి అన్నాడు- “నాకు వెళ్ళడానికి టైముందిలే! రెండూ ఓకేసారి చెప్పు. వింటాను”


"థేంక్స్ రా అన్నయ్యా! నన్ను మరచిపోకుండా నాకు ప్యాకెట్ మనీ యిచ్చినందుకు—”

“ఓ- అదా! సరే—మళ్ళీ చెప్తున్నాను విను- ఇది పలకరించే వయసు. చూపులు నలు దిక్కులా సారించే ప్రాయం. రంగులు మెరిస్తే పరవశించిపోయే వయసు. నీకు నువ్వు కొట్టుకుపోకుండా చూసుకో—ముఖ్యంగా ఎవరికీ హాని కలగకుండా చూసుకో- ఇంత కంటే ముఖ్యం- నాన్న నీ పైన కన్నేసి ఉంచారు. గుర్తుంది కదూ? ”


పవన్ తలూపాడు.


“ఉఁ ఇక రెండవది చెప్పు”


“నేనెప్పుడూ అనుకోలేదురా అన్నయ్యా మనింట్లో ఒకడు యిలా టిపి టాప్ గా నెక్ టై కట్టుకుని వెళ్తాడని—“ “ఇందులో సంబరపడిపోవడానికేముందిరా తమ్మూ! నిజనికి నేను మెడన కట్టుకున్నది పైకి నాజూకుగా కనిపించే తుండు గుడ్డ. తెల్లవాడు ఈ తుండుగుడ్డను స్టయిల్ గా మడత పెట్టి యిచ్చాడు. బ్రో- అని- నెక్ టై- అని పేర్లు పెట్టి మనకంట గట్టాడు. అంతే –”

“మరయితే—ఈ నెక్ టైని అంత పకడ్బందీగా కట్టుకోవడమెందుకురా అన్నయ్యా? ”


“కారణం ఉంది. చెప్తాను విను. కొన్ని కంపెనీలకు, కొన్ని వ్యాపార సంస్థలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇదేమో—మా కంపెనీ మేనేజ్మెంటు నిర్దేశించిన డ్రెస్ కోడ్—’


అప్పుడు ప్రక్కనుండి కమల గొంతు వినిపించింది. “లేత పచ్చటి టైతో బాగున్నావురా అన్నయ్యా! కాని—టై- సరిగ్గా కుదురుగా బిగించలేదంటుంది వదిన!”


ఆ మాట తో అతడు గిర్రున తల తిప్పి చూసాడు. వినోదిని వయ్యారంగా వంపు తిరిగిన విల్లులా నిల్చుని చూస్తూంది. “నాకలా అనిపించలేదే—బాగానే కట్టుకున్నానే—”


ఈసారి కామాక్షమ్మ కలుగచేసుకుంది- “కొత్త కదరా! ఆదిలో అటూ యిటుగా అలాగే ఉంటుందిలే—“అని వినోదిని వేపు తిరిగి అంది- “ఏంవమ్మా! ఈ టైలూ బ్రౌలూ మీ యింట్లో వాళ్ళకు అలవాటేగా- నువ్వెళ్ళి కుదురుకునేలా సర్ద కూడదూ—”


వినోదిని తనను సమీపించడానికి రాకుండా తగ్గు తుందనుకున్నాడు పరమేశ్వర్. కాని—అలా జరగలేదు. ఆమె మందగమనంతో నిదానం గా నడచి వచ్చి అతణ్ణి చప్పున ముందుకు లాగి, టైని బిగుతుగా బిగించి అడిగింది “ఎలాగుంది? ”


అతడు కాసేపాగి బాగుందన్నాడు.


“అంతేనా? థేంక్స్ చెప్పే అలవాటు లేదా! ”అని వెనక్కి తిరగబోయింది.


ప్పుడు కమలం అందుకుంది- “అదేం క్వరీ వదినా! ఇంత చిన్నదానికి థేంక్స్ చెప్తారేమిటి? నువ్వింకా పెద్ద పెద్దవి యెన్నో చేయాల్సి ఉంది. అప్పుడు చిన్నన్నయ్య కృతజ్ఞతలు చెప్పకపోతే వాడిచేత అమ్మే చెప్పిస్తుంది.. ఇప్పుడు పనిలో పనిగా మరొక పని చేసి పెట్టు.


వంట గది చప్టాపైన కాఫీ పోసిన ఫ్లాస్కు ఉంది, విసుక్కోకుండా రెండు కప్పుల కాఫీ తీసుకురా!”


వినోదిని యేమీ చెప్పకుండా లోపలకు వెళ్ళింది, కాసేపు తరవాత నాలుగు కప్పుల నిండా కాఫీ తీసుకు వచ్చింది ప్లేటులో పెట్టి-- . కమలం పెద్దరికం చూపిస్తూ మరొక చెణుకు విసిరింది- “ఫ్లాస్కునుండి కాఫీ పోసుకు రావ డానికి ఇంత ఆలస్యమా! మా అన్నయ్య కోసం ఫ్రెష్ గా చేసి తీసుకురాలేదు కదా? ”


ఆమె కాదంటూ తల అడ్డంగా ఆడిస్తూ అంది- “అదేమీ లేదు. పిల్లి దొడ్డికెళ్లి నట్లుంది. అది శుభ్రం చేసి ఫ్లాస్కునుండి కాఫీ పోసి తీసుకు వస్తున్నాను. అందుకే—’

పరమేశ్వర్ తో బాటు అందరూ ఆమె వేపు విడ్డూరంగా చూసారు. “నువ్వు పిల్లి దొడ్డి తీసావా వినోదినీ! నువ్వు చెప్తే కమలమో నేనో వచ్చితీయమూ? ” కామాక్షమ్మ అడిగింది.


“నోరు లేని జీవి- పిల్లి దొడ్డి యెత్తినంత మాత్రాన మైల పడిపోనులే ఆంటీ! ”


కామాక్షమ్మ యేమీ అనలేదు. చేతిలో ఉన్న కాఫీ కప్పునుండి సగం సాసర్లో పోసి వినోదినికి అందించింది. ఆ గెశ్చర్ లో పెను అర్థమే దాగి ఉందని కమల గ్రహించింది. తన వంతు కాఫీ తాగడం పూర్తిచేసి ఖాలీ గ్లాసుని అక్కయ్యకు అందిస్తూ అటు వెళుతూ అన్నాడు పవన్- “థేంక్స్ వదినా! ”అని.


వినోదిని నవ్వింది- “ఇంత చిన్నదానికి అంతటి పెద్ద థేంక్సా పవన్! ఇంకా యెన్నో చేయాల్సి ఉంది—అప్పుడు చెప్దువు గాని హోల్ సేల్ గా—”


పరమేశ్వర్ మాటా పలుకూ లేకుండా అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయాడు- మళ్ళీవస్తానంటూ—మనసున తికమకపడ్తూ— పారిశ్రామిక వేత్త దివాకర్ అంకుల్ సుపుత్రి వినోదిని పిల్లి దొడ్డి తీసిందా! అతడికి నమ్మశక్యం కాకుండా ఉంది. వినోదిని నిజంగానే తమ కుటుంబ పరిసరాలతో మమేకం ఐపోవడానికి ప్రయత్నిస్తుందా లేక అలా ఐపోతున్నట్లు భావన చూపిస్తుందా!

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
28 views0 comments

Comments


bottom of page