top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 11


'The Trap Episode 11' New Telugu Web Series Written By Pandranki Subramani


(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదకొండవ భాగం

గత ఎపిసోడ్ లో

పవన్ ప్రేమ వ్యవహారం లో పడ్డట్లు అనుమానిస్తాడు వేద మూర్తి.

ఆ విషయం తను కనుక్కుంటానని సర్ది చెబుతాడు పరమేశ్వర్.

దివాకర్ దంపతులు వినోదినితో పాటు వేదమూర్తి ఇంటికి వస్తారు.

వెళ్ళేటప్పుడు ఏదో నెపంతో వినోదినిని అక్కడే వదిలి వెడతారు.

ఇక ది ట్రాప్.. పదకొండవ భాగం చదవండి…

భువనేశ్వర్ మేజర్ కంప్యూటర్ సిస్టమ్ అప్డేట్ చేసి రావడానికి కంపెనీ తరపున ఇండోనేషియా వెళ్ళి జూనియర్ టెక్నీకల్ స్టాఫ్ తో సెట్టింగ్సు అమర్చి అక్కడి కంప్యూటర్ సిస్టమ్ ని మెరుగు పరచి ఊరు చేరుకోవడానికి ఆరు రోజులు పట్టాయి. ఈలోపల అతడికి ఒకటి తరవాత ఒకటిగా లాభదాయకమైన సాను కూలమైన మార్పులు జరిగాయి. అతడు కొన్నిరోజులుగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని యెదురు చూసిన హయ్యర్ పోస్టు విత్ హయ్యర్ గ్రేడేషన్ తో బాటు, కొత్త కంపెనీ రూల్స్ ప్రకారం కొత్త కారు కూడా తళతళ మెరుస్తూ యింటి వాకిట నిల్చుంది.


చాలా రోజులు తరవాత ఏతెంచిన భర్త కోసం ప్రభావతి రొయ్యల బిరియాని, కోడి గుడ్లు వేపుడు కూర చేసింది. ఆ తరవాత భాగ్యానికి చేతిలో చిల్లర డబ్బులు పెట్టి పెందలకడే యింటికి పంపించేసింది. ఆ తరవాత నాట్యంలో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న ప్రభావతి సంతో షంతో తేజరిల్లుతూ ఆమెకు యిష్టమైన జానపద గీతం-’సలలిత రాగ సుధా రససారం-సర్వకళాన్మయ నాట్య విలాసం! ’ నాట్య విలాసంతో పాడి వినిపించి ముద్దుల వర్షం కురిపించి ఉన్నపాటున అతణ్ణి కౌగలి సంకెళ్ళలో బంధిస్తూ అంది- “ఇది మంచి సమయం. వసంతోత్సవం విలసిల్లే వాతావరణం. రండి! మనం వరూధిని గారింటికి వెళదాం. ”


ప్రభావతి పెదవుల్ని తన పెదవులతో ఆక్రమించిన భువనేశ్ ఉలిక్కి పడ్డట్టయ్యి ఎందుకూ అన్నట్టు కనుబొమలెగరేస్తూ చూసాడు.


“అదేమిటండీ అలా చూస్తారూ! వరూధినిగారు మన క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండండీ— కొత్త కారు కొన్నారు కదా- కాదు- కారు ప్రమోషన్ తో బాటు గెలుచుకున్నారు కదా— వరూధినిగారికి— ముఖ్యంగా మందాకినికి చూపించ వద్దూ— ఇద్దరూ సరదా పడరూ! ”


“మంచి ఐడియా! కాదనను. కాని— దానికి ఇదా సమయం? కారేమిటి పుష్పక విమానమా, గాల్లో తేలుతూ యెగిరి పోవడానికి— తరవాత నిదానంగా చూపించి రావచ్చు. అందునా— రతీ దేవిలా మిల మిల మెరిసి పోతూన్న నీతో గడపవలసిన షెడ్యూల్ చాలానే ఉంది. నాకోసం మరొకసారి సింగారించుకోవలసి ఉంది. బీ-ప్రిపేర్డ్ ఫరిట్—ఇంత సేపూ నాముందు ఒంపు సొంపులతో నాట్యమాడి రసమయ గీతం పాడి రసోద్దీపనతో నన్ను ఉఛ్ఛ ఘట్టానికి తీసుకెళ్ళిపోయి నాకిప్పుడు మూడాఫ్ చేస్తావా?”


“అబ్బ! ఎందుకండీ యింత యాబగా తయారవుతున్నారు? దానికి టైముందిగా! రాత్రి పడాలి. నక్షత్రాలు కనిపించాలి. మేను పులకించేలా వెన్నెల కాయాలి. ఈ లోపల మనం వెళ్ళి వచ్చేయమూ! ”


అతడు వెంటనే బదులివ్వలేదు. ప్రభావతి నుండి దూరంగా తొలగుతూ అన్నాడు; సాధ్యమైనంత మేర గొంతుని సరళీకృతం చేసకుంటూ-- “చూడు ప్రభా! నేను ముందే ఒకసారి చెప్పాను బుడుంగు బుడుంగని వాళ్ళింటికి వెళ్ళ కూడదని— నీ నేపథ్యం వేరు, ఆమె నేపథ్యం వేరు. నువ్వేమో పుస్తకాలు చదువుతూ పత్రికలు తిరగేస్తూ రకరకాల టీవీ సీరియల్స్ చూస్తూ తీరిగ్గా పకడ్బందీగా గడిపే పక్కా గృహిణివి. వరూధిని గారేమో బిజీ బిజినెస్ వుమెన్. ఆమె కడగంటి చూపు కోసం పెక్కు మంది వచ్చి పోతుంటారు.


సీనియర్ ఎక్సగ్యూటివ్స్ తో చర్యలు జరుపుతుంటారు. బిజినెస్ మీట్స్ కి వెళ్ళి వస్తుంటారు. ఫోన్ల పై ఫోన్లు వస్తుంటాయి. నీ రాక ఆమెగారికి అడ్డంకిగా మార కూడదు. ఇలా చెప్పాచెయ్యకుండా చట్టు చట్టున వెళుతుంటే నాలుగు సంవత్సరాలు సాగవలసిన మీ స్నేహం నాలుగు రోజుల్లో పఠ్ మని ముగిసి పోతుంది. . మరొకటి— ముఖ్యమైనది గమనించు. వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి. అవి యే అవసరాలని నన్నడక్కు. అడిగి యిబ్బంది పెట్టకు. ఇప్పటికామె సింగిల్ అన్నది మరచిపోకు—ఇది మాత్రం గుర్తు పెట్టుకో—మిగతాది నన్నడక్కు. పెళ్ళయిన దానివి. పరిస్థితి గ్రహించగలగాలి” అంటూ సోఫానుండి లేచాడు.


“ఆగండి! నా చాలెంజ్ యక్సెప్ట్ చేసిన తరవాతనే కదలండి! ”.


అతడు నివ్వెరపాటుతో చూసాడు- చాలెంజా- అని అడుగుతూ అబ్బురపడతూ--


“ఔను. చాలెంజే! ”


భువనేశ్ నవ్వుతూ చూసి అడిగాడు అదేమిటని--

“ఈ చాలెంజిలో గాని నేను గెలిస్తే మీరు నాకు మరొక పట్టు చీర కొనిపిస్తారు. ఓడిపోతే మీరు చెప్పినట్టు నేను చేస్తాను!”


”సరే—అలాగే అనుకో—కాని—చేలంజేమిటో చెప్పక ముందే చీరలూ సారెలూనా! ”


“ఓకే ఓకే! చెప్తాను. వినండి. ఇప్పుడే ఇక్కణ్ణుంచే పిలుస్తాను వెంటనే యింటికి రమ్మనమని. పిలిచిన తరవాత నేను యింట్లో ఉండను. ఐనా—వరూధిని వచ్చి ఉంటుంది—


“అతడు విస్తుపోతూ అడిగాడు- “ఇదెక్కడి పందెం? పిలిచిన తరవాత నువ్వు బయటకు వెళ్ళిపోతే ఆమెలా ఉంటుంది?”

“ఇక్కడే ఉంది అసలు విషయం- అంతస్సారం. నేను లేక పోయినా వరూధిని వచ్చి ఉంటుంది వెళ్ళి పోకుండా!”


‘అతడప్పుడు విస్తుపోతూ అడిగాడు- “వచ్చిందే అనుకో— ఎవరితో ఉంటుంది? భాగ్యం తోనా!”


“భాగ్యానికి ఈ పోటీలో యెటువంటి పాత్రా ఉండదు. ఇక్కడ ఉండదు కూడా--”


ఆ తరవాత అన్నట్టు కనుబొమలేగరేసి చూసాడతను.


“వరూధిని తన కూతురుతో వచ్చి ఉంటుంది. నేను వచ్చేంతవరకూ మీ ఆలనా పాలనా ఆమే చూసుకుంటుంది. ఎనీ డౌట్?”

“వెరీ మచ్ డౌట్— పందెంలో గెలవడానికి- ఒక అడిషనల్ చీర పొందడానికి అంత మందికి యిబ్బంది యివ్వడం సబబేనా!”


“ఇక్కడ న్యాయాన్యాయాల ప్రసక్తి లేదు. ఒకరు ఓడిపోవడం- మరొకరు గెలవడం. అంతే మిగిలి ఉంది”.


“సరే— పోటీకి సిధ్ధమవుతున్నాను. బాగా గుర్తుంచుకో— నువ్వు గాని ఓడితే- నేను చెప్పినట్టు చేయాలి చేస్తావా! ”


అప్పుడు ప్రభా వతి ‘డన్’- అంటూ బొటన వ్రేలు పైకెత్తి చూపించింది.

“ఇకపైన నా అనుమతి లేకుండా నువ్వెప్పుడూ వరూధినిగారింటికి వెళ్ళ కూడదు. మందాకినిని చూడాలనిపిస్తే నాతోనే వెళ్ళాలి. నాతోనే మరలి రావాలి. ”


ప్రభావతి నివ్వెరపాటుతో చూస్తూండిపోయింది; ఎటు తిరగాలో యెలా చెప్పాలో తెలియక-


మరి కాసేపటికి ప్రభావతి అలా వెళ్ళివస్తానని ఆటో యెక్కి వెళ్ళిపోయింది. ఎంత పట్టుదలతో మరెంత పకడ్బందీగా వెళ్ళిపోయిందంటే తన రెగ్యులర్ ముబైల్ ని సహితం విడిచి హ్యాండ్ బ్యాగుని మాత్రమే చేత బట్టుకుని సాగిపోయింది. ఇదేక్కడి పందెం? స్నేహ బంధానికి పరీక్షా!


మొదటి మెట్టుగా ప్రభావతి పందెంలో సాధించిదనే చెప్పాలి. భువనేశ్ యెదురు చూడని విధంగా వరూధిని కూతురు మందాకినిని వెంటబెట్టుకుని ఇల్లు చేరింది. మందాకినిని చూడగానే అంతవరకూ అతణ్ణి చిరాకు పరుస్తూన్న అసహనమంతా కరిగిన మంచులా మారిపోయింది. ఎదురు వెళ్ళి చేతుల్లోకి తీసుకునే ముందు మందాకిని ఆగమంటూ సైగచేసి తల వంచి భువనేశ్ కాళ్లకు నమస్కరించింది.


ఆ పిల్ల చర్యకు అతడు విస్మయం చెందాడు- “శతాయుష్మాన్ భవ:! ”అని దీవిస్తూ ఆ పిల్లను చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకున్నాడు. అప్పుడు కారు కీని డ్రైవర్ కి అందిస్తూ, తను ఫోను చేసినప్పుడు వస్తే చాలని చెప్పి పంపించి నవ్వుతూ అంది వరూధిని- “మరి నన్ను ఆశీర్వదించరా భువనేశ్! ”


“నేనా! మీకా?నేనంతటి వాణ్ణా! దానికి మేము తగువారమా--” అంటూ ఆమెకు కుడి చేతిని అందించాడు. చేతిని కలుపుతూ వాళ్ళను అక్కడే ఉండమని చెప్పి, ముందుకు కదలబోయాడు. వరూధిని అతణ్ణి ఆపింది యెక్కడికని అడుగుతూ—“మనిద్దరికీ కప్పు టీ- పాపకు బూస్ట్ కలిపి తీసుకు వస్తాను. భాగ్యం ఇప్పుడింట్లో లేదుగా“


“భలేవారే! దీనికి మీరు పనిగట్టుకుని లేవాలా! చెప్తే, మందాకిని టీ చేసి తీసుకు వచ్చేస్తుంది. ఉండండి నేను కలిపి తీసుకు వస్తాను” అంటూ చకచకా నడచి వెళ్ళి కిచిన్ యెక్కడుందో తెలుసుకుని ఇద్దరికీ రెండు కప్పుల టీలు- మందాకినికి కప్పు బూస్ట్ చేసి తీసుకు వచ్చి యిచ్చింది.


థేంక్స్- అంటూ టీ అందుకుని అదే అదనుగా అడిగాడు భువనేశ్- “సాధారణంగా మీకు హెవీ బిజినెస్ షెడ్యూల్ ఉంటుంది కదా! రెగ్యులర్ గా మీ మామగారికి రిపోర్టు చేస్తుండాలి కదా! ఈరోజు మీకు ఫ్రీ ప్రోగ్రామ్ అనుకుంటాను”

“అలాక్కాదు భువనేశ్— నాకు ప్రతిరోజు కాదు— ప్రతి గంటకూ వర్క్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు కూడా చేంబర్ ఆఫ్ కామెర్సులో గెట్ టు గేదర్ ఉంది. నేను వెళ్ళ వలసి ఉంది. మాఁవగారిని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను వెళ్ళి రమ్మనమని—’

“ఐసీ! మధ్యాహ్నం తరవాత ఏమీ ఉండదా?”

“ఉంటుంది భువనేశ్. ఇండస్ట్రియల్ మంత్రిగారితో చర్చులున్నాయి. దానికి మాఁవగారినీ మార్కెటింగ్ మేనేజర్ నీ కలసి వెళ్ళమని సూచించాను.


సాయంత్రమంటారా— బిజినెస్ బిగ్ షాట్సుతో డిన్నర్ పార్టీ ఉంది. దానిని నేను క్యాన్సిల్ చేసుకుంటాను. మన స్నేహం కోసం ఆ పాటి సర్దుబాటు చేయలేనా! ”


ఔనని తలూపాడు భువనేశ్; మనసులో అనుకుంటూ- ప్రభావతితో ఈవిడకున్నది పెవికల్ లా గట్టి నేస్తంలాగే ఉన్నట్లుంది సుమా! -


అప్పుడు ఉన్నపళాన మందాకిని గట్టిగా అరచినంత పని చేసింది- “అమ్మా! అటు చూడూ -- ఆ ఫోటోలోని గార్ల్ అచ్చు నాలాగ లేదూ?”


వరూధిని అటు గోడవేపు తలతిప్పి కొన్ని క్షణాలు చూస్తూండిపో యింది. ఆ తరవాత నిదానంగా తలూపింది- షి ఈజ్ బ్యూటిఫుల్ అంటూ--


తల్లి మాటకు మందాకిని స్పందించింది- “నాకంటే అందంగా ఉందా మమ్మీ! ”.


ఆమె నవ్వింది. “లేదు. మీరిద్దరూ ఒకేలా ఉన్నారు. ఒకేలా అందంగా ఉన్నారు—” అని కాంప్లిమెంటు ఇస్తూ భువనేశ్ వేపు చూస్తూ అడిగింది. “అదేమిటి భువనేశ్—ఎడం చెంప క్రింద యెర్రగా బొప్పి కట్టినట్లుంది. ఏమిటది?”


“నథింగ్. షేవ్ చేసుకుంటున్నప్పుడు నాకు నేను తెలుసుకోకండా యేదో ఎగ్జైటింగ్ మూడ్ లోకి జారుకున్న ప్పుడు బ్లేడు కత్తిపీటలా కోసుకుంది. ఇట్ విల్ బి ఆల్ రైట్” అని బదులిచ్చాడతను.


ఆమె అలా కాదన్నట్టు తల అడ్డంగా ఆడిచింది. “కాదు భువనేశ్. సెప్టిక్ అయే ఛాన్స్ ఉంది. అలాగే ఉండండి-“ అంటూ లేచి వచ్చి అతడి చెంపను చేతిలోకి తీసుకుంది. ఆమె ఊపిరి వేడిగా అతణ్ణి తాకుతూంది. కళ్ళు మూసుకున్నాడు. ముఖం తిప్పుకోలేని పరిస్థితి.


“ఏదీ—ప్రభావతి ఉపయేగించే మెడికల్ కిట్ యెక్కడుంది?”

అతడు చేయి చూపించాడు. అతడలా చేయి చూపించిన వెంటనే మందాకిని చెంగున లేచి వెళ్ళి కప్ బోర్డునుండి మెడికల్ బాక్సు తీసుకొచ్చి యిచ్చింది. మందాకిని చురుకుతనానికి భువనేశ్ ముచ్చుట పడ్డాడు.


“థేంక్యూ డియర్! ” అంటు ఆ పిల్ల చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంటూ అసంకల్పితంగా గోడపైకి చూసాడు. పరలోకం చేరుకున్న కూతురు సుభాషిణి తనని చూసి నవ్వుతున్నట్లనిపించింది. అప్పుడు వరూధిని కలుగ చేసుకుంది- “కూతురుతో ముచ్చట్లు తరవాత ఆడుకుందురు గాని, ముందు ముఖం నా వేపు తిప్పండి” అంటూ ముఖం తనవేపు తిప్పుకుని ట్యూబు నుండి క్రీము తీసి తడమసాగింది. మళ్లీ ఆమె వేడి ఊపిరి తెరలు తెరలుగా వచ్చి తాకనారంభించింది.


సెంటాఫ్ ది వుమన్— ఒక్కొరికీ ఒక్కొక్క విధంగా ఉంటుందని ఏదో ఆంగ్ల సినిమా డైలాగులో విన్నాడతను. ఈసారి అతడు బెరుకు తగ్గించుకుని కళ్ళు విప్పార్చి చూసాడు; వరూధిని, ప్రభ చెప్పినట్లు నిజంగానే మదుబాల లాగే ఉందా! ఏమో చెప్పడం కష్టం గాని-- అంతకంటే బాగుందేమో—


‘గంభీర సాగర గర్భంబు నందు— దివ్య దీపికలెన్నో దీపించు చుండ— అంతంబు లేని నీలాకాశమందు—శుభ్ర దీపము లెన్నో శోభిల్లుచుండ— అతి విశాలంబైన యంతరాళమున మెఱుగు దీవియ లెన్నో మెఱయుచు నుండ-‘ అంతటితో అతడి మానసిక పద్య పఠనం ఆగిపోయింది. చూపుకీ ఊహకీ మలుపు తిప్పాడు-


ముఖం తిప్పుకుంటూ-- “థేంక్స్! బైదిబై- ప్రభావతి రాత్రిలోపల ఇల్లు చేరకపోతే డిన్నర్ సంగతి యేం చేద్దాం వరూధినీ? రెస్టారెంటుకి వెళదామా! ”


వరూధిని అతడి మాటను తిప్పి కొట్టింది. ”నేనుండగా బైటి భోజనం యెందుకూ? రెగ్యులర్ గా నాకు తీరిక చిక్కక పోవచ్చేమో గాని— నేను వంట బాగానే చేస్తాను, మీ ఆవిడంత బాగా లేకపోయినా—”


“నోనో! అది కాదు నా అభిప్రాయం. వంట చేయడం బాగా తెలియకపోతే నువ్వెందుకు అబధ్ధం ఆడతావూ? కాని— నా పాయింటు అది కాదు--- చుట్టపు చూపుగా వచ్చి చేతులు కాల్చుకోవడమెందుకని— హాఁ! నాదొక ఐడియా! చెప్పేదా?”

ఉఁ అందామె.

“నీకు యెలాగూ రాత్రి డిన్నర్ కి ఆఫర్ ఉంది కదా—ఒక ఎక్స్రా హ్యండుకి అవకాశం ఉంటే—”


“గోల్డెన్ ఐడియా! ఒక ఎక్స్ ట్రా హ్యండేమిటి-- ఇద్దరిని కూడా డిన్నర్ పార్టీకి తీసుకు వెళ్ళవచ్చు. నౌ-ఫ్రెషప్ అవండి. ఈ లోపల నేనూ మందాకిని కూడా రెడీ ఐపోతాం—”

“దట్స్ రైట్—ఇప్పుడు నాకు మరొక ఐడియా వచ్చింది. చెప్పేదా?”

“చెప్పండి. ఐడియా చెప్పడానికి నా పర్మిషన్ యెందుకూ—“

“మరేం కాదు వరూధినీ—డిన్నర్ ముగించుకుని నువ్వు అక్కణ్ణించి అలా మీయింటికి వెళ్ళిపోదువు గాని”.

దాని కామె ఠపీమని స్పందించింది. “నాట్ యెటాల్! నేను ప్రభావతికి మాటిచ్చాను ఆమె ఇల్లు చేరేంత వరకూ మీతోనే మీ యింట్లోనే ఉంటానని. ఒకటి రెండు విషయాలు నాకు అనుకూలంగా వచ్చాయని యిచ్చిన మాటను జవదాట లేను”.

అతడు మాట్లాడ లేదు. నింపాదిగా లేచి వెళ్ళి దుస్తులు మార్చుకుని వచ్చి, తల్లీ కూతుళ్ళిద్దర్నీ బైటకు రమ్మనమని పిలిచి, డోర్ కి లాక్ చేసి పోర్టికో వేపు నడిచాడు. ఆడాళ్లు పైకి సాధార ణంగా నవ్వు తూ కిలకిల తుళ్ళుతూ కనిపించినా లోపల వాళ్ళది సీరియస్ మైండ్ అని అతడికి తెలుసు. కాని, వరూధినిది ఇంతటి సీరియస్ మైండా! ఇచ్చిన మాటను అంత సీరియస్ గా తీసుకుంటుందా! ఇంతకీ ఇద్దరికీ యేర్పడ్డ స్నేహం యెప్పటిదని— మొన్న మొన్నటిదేగా---

------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.48 views0 comments

Comments


bottom of page