top of page

ది ట్రాప్ ఎపిసోడ్ 15


'The Trap Episode 15' New Telugu Web Series

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

కామేశ్వర రావు, వసంత గుడిలో కలుస్తారు.

పరమేశ్వర్, వినోదిని గర్భగుడి ముందు మాలలు మార్చుకున్నారు.

మరుసటి రోజు వసంత, వేదమూర్తి ఇంటికి వస్తుంది.

ఇక ది ట్రాప్.. 15 వ భాగం చదవండి…


కొన్ని పరిచయాలు క్రమక్రమంగా కాల పరివాదిని పైన వినవచ్చే శృతిలయల్లా, పొదరిండ్లలోని తీగల్లా, మాధుర్య భావనల్లా పెనవేసుకుపోతాయి. ఆ రీతిన భువనేశ్వర్, వరూధిని అదేదో అయస్కాంతం లాగినట్టు అడపా దడపా కలుసుకుంటున్నారు; కొన్నిసార్లు ప్రభావతికి తెలిసి కార్య కారణంతో--. మరికొన్ని సార్లు తాముగా యేదో ఒక నెపంతో మందాకినిని గార్డెన్ పార్కుకి తీసుకెళ్ళటానికని, ఇంకొన్ని సార్లు స్పెషల్ డిన్నర్ పార్టీలకని— మొత్తానికి, మేటర్ ఆఫ్ వైనం యేమంటే— ఇద్దరూ కలుసుకోవడమనే పరిధి నుండి తప్పించుకోలేక పోతున్నారు.


ఇద్దరి మధ్యా కుదిరిన మధుర మనోహర శారీరక మానసిక కెమిస్ట్రీయే కారణ మేమో—అది వాళ్ళిద్దరికీ తెలియకుండానే పెనవేస్తూ సాగిపోతుందేమో అనివార్యంగా, అవిచ్చిన్నంగా-- కాని— భువనేశ్ అంతరంగాన మాత్రం అలా తోచడం లేదు. ఎందుకంటే— అతడు భార్యను సొమ్య శుభ్ర తేజస్సుతో నిండిన మనసుతో ప్రేమించాడు, ఇంకా—ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది అతడి సతీమణి ప్రభావతికి చంద్రుడిలోని చల్లదనంలా ఆకాశంలోని ధవళ కాంతిలా స్పష్టంగా తెలుసు, మగాడు యెక్కడైనా దాపరికం చూపించగలడు. కాని—పడక గదిలో అతడి మనో ప్రస్థాన వైఖరిని దాచుకోలేడు కదా!


అతడు ఆ మనోప్రస్థాన వైఖరిని లోలోన దాచుకోగలిగినా జీవన సహచరి మొగలి పట్టను ఆఘ్రాణిస్తున్నట్టు పసిగట్టేయ గలదు కదా! మరి ఇదంతా ప్రభావతికి తెలియకుండా యెలా సాగుతుంది? ఎంతగా ఆమె వరూధిని కూతురు మందాకిని పట్ల మమకారం పెంచుకున్నా, వరూధిని పట్ల సుహృద్భావం పెంచుకున్నా, తన మగాడు మరొకతెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటుందా?


నిజంగా ఇదంతా ఆమెకు తెలియదా! తెలియకుండానే సాగుతుందా--ఇదీ మిలియన్ డాలర్స్ ప్రశ్న—ఇందులోని చిక్కుముడి ఎప్పుడు ఎలా వీడుతుందో మరి---


కాలం యిలా వంకర టింగరంగా సాగిపోతున్నప్పుడు పరిస్థితులు మరో వైపున సాగుతూ మలుపు తిరిగాయి. మనసు లోలోన యెంతగా లాగుతున్నా భువనేశ్ మందాకినిని గాని ఆ పిల్ల తల్లి వరూధినిని గాని రెండు రోజులుగా చూడలేక పోయాడు. ఆ యెడబాటు చిన్నదయినా వరూధిని ఓర్వలేకపోయింది. వద్దనుకుంటూనే ఓపలేక భువనేశ్ యింటికి ఫోను చేసింది. ఆమె ఊహించినట్లే భువనేశ్ లైనులోకి రాలేదు. అతడు గాని అక్కడి చుట్టు ప్రక్కల గాని ఉంటే ముబైల్ యెందుకందుకోడూ—


ఆమె ఉద్వేగాన్ని ఆపుకుంటూనే సంభాషణకు దిశ మార్చింది-- “అదేమిటి ప్రభా! మీ ఉనికీ లేదు, మీ ప్రియ సహచరుడి ఉనికీ లేదు రెండు రోజులుగా—నా పైన కినుక వహించలేదు కదా? ”


ప్రభావతి నవ్వుతూనే బదులివ్వబోయింది--“ఛే—అవేం మాటలు! ఏమయిందంటే--”


“ఆగండాగండి! ముందు మీప్రియ దత్తపుత్రిక గురించి చెప్పాలి. మిమ్మల్నిద్దర్నీ వెంటనే చూడాలంటుంది. దానికి నేనేమి చెప్పాలి”


“ఆ మాటే చెప్పబోతున్నాను. నువ్వు చెప్పనిస్తేగా-- ఒక పర్సనల్ మేటర్ విషయం లో భువనేశ్ కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు”


“పర్సనల్ మేటరా! వాళ్ళ ఊళ్ళోనుండి ఆయన బాబాయి గారు పిన్ని గారు గాని వచ్చారా? లేక మీ అత్తామామలిద్దరూ పొలం పనులూ ఊడ్పుపనులూ మానుకుని ఉన్నఫళంగా ఇంటికి వచ్చేసారా--”


“ఉఁ హూఁ—కానే కాదు. అమెరికాలో-అంటే—న్యూజెర్సీలోవాళ్ళక్లోజ్ కొలీగ్ ఒకతను ఉన్నాడుగా—అతడొచ్చాడు. అతగాడికి ఇక్కడి భారతీయ స్త్రీతో వివాహ సంబంధం కుదర్చడానికి తెగ హైరానా పడిపోతున్నాడు మా శ్రీవారు. ”


“ఎన్నారైకి పెండ్లి సంబంధమా! ఎవరితో? ”


ప్రభావతి నవ్వేసింది, “అమ్మాయి మరెవరో కాదు. నువ్వారోజు స్పెషల్ బిజినెస్ డిన్నర్ పార్టీలో మా వారికి పరిచయం చేసిన స్టార్టప్ కంపెనీ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్- సితార. వయసు ముమ్మరంలో వ్యాపార చతురతలో ఇద్దరికీ అచ్చుగుద్దినట్లు జోడీ కుదురుతుందని మావారు చెప్పారు. సితారగారినీ వాళ్ళ ఫ్యామిలీని చూసే ముందు మిత్రుడికి రెండు మూడు పుణ్య స్థలాల ను, రెండు మూడు చారిత్రక ప్రదేశాలనూ చూపిస్తానన్నారు. వీలుంటే—మావూళ్ళమ్మవారి జాతర కుకూడా తీసుకెళ్తానన్నారు”


అది విని వరూధిని ఉన్నపళాన నిట్టూర్చింది- “అంతటి పెద్ద షెడ్యూలా! సరే విషయానికి వస్తాను— నాలా సితార కూడా బిజినెస్ ఉమెన్ కదా! అందులో పెళ్ళికాని బిజినెస్ వుమన్ కదా! ఇద్దరికీ దూకుడు యెక్కువగానే ఉంటుంది. ఇద్దరి టెంపర్మెంట్సూ పొసగుతాయో లేదో--:”

“పొసగితే మంచిదే—అమ్మాయిది మంచి డైనమిక్ పర్సనాలిటీ అని విన్నాను. ఇంత చిన్న వయసులో సితార తన ముమ్మరమైన వ్యాపార చాతుర్యంతో యూనికార్న్ క్లబ్బులో అడుగు పెట్టబోతుందటగా! కంపెనీని గ్లోబల్ స్టార్టప్ గా మార్చబోతుందటగా! ”

“ ఔను. దీనికి వాళ్ళ తండ్రి వత్తాసు బాగానే ఉంది. ఇదంతా వింటుంటే నాకొకటి తోస్తూంది ప్రభా! వాళ్ళ అమెరికన్ కొలీగ్ ని యిక్కడకు రప్పించక ముందే భువనేశ్ ఇక్కడి గ్రౌండ్ వర్క్ ని బాగానే చదును చేసుంటాడు. సితారాను మానసికంగా ఒప్పుకునేలా సిధ్ధం చేసుంటాడు. మొత్తానికి మేటర్ సెటిల్ ఐపోతుందిలే!”

“ఉఁ-లెటజ్ హోప్ వర్ ది బెస్ట్—” అంటూ ఫోను పెట్టేసింది ప్రభావతి. అప్పుడామెను ఉన్నపాటున మెరుపు వంటి యోచన తాకింది- ‘పెళ్ళి గాని కుదిరితే సితారాకు పిల్లలు పుట్తారు కదూ! తనలా ఏక దళ వృక్షంలా నట్టింట మిగిలిపోదు కదూ!’


వెంటనే తల విదిలించింది. ఛే— తనలా అందరికీ యెందుకవుతుంది--- అందరు స్త్రీలూ తనవలె దురదృష్ట వంతులు కారు కదా! తను మాత్రం పిల్లలు కలగని పుష్పహీన కాదు కదా! తన సుభాషిణిని దేవర్లు పైకి తీసుకెళ్ళిపోయారు తన గురించి తలపోయకుండా-

------------------------------------------------------------------------------

జీవితం చిత్రాతి చిత్రమైన పాతాళలోక గుహవంటిది. అందుకేనేమో జీవితాన్ని పరమ పద సోపానంతో పోల్చుతుంటారు. కార్యసాధనకు ఉపక్రమించినప్పుడు విషయం దగ్గరకు వచ్చినట్లే ఉంటుంది. అనుకున్నట్లు అమరుతున్నట్లే తోస్తుంది. కాని— ఫలితం పుష్పించే సమయం యెదురైనప్పుడు తలక్రిందులై కూర్చుంటుంది. దానికి మారుగా, మరొకసారి అదే కార్యం చిత్రాతి చిత్రంగా మరొక దిశన మలుపు తిరుగు తుంది.


మైలు దూరాన ఉన్నట్లు తోచిన కార్యం గంధర్వులు స్వయంగా వచ్చి ముగించి వెళ్ళినట్టు సాఫల్యత సంతరించు కుంటుంది. మొత్తానికి ఏది సాధించాలనుకున్నా అంతటా యెగుడు దిగుళ్ళ వంపులే—ఊహించడానికి సాధ్యం కాని అడ్డంకులే-చుట్టుముట్టే సమస్యల చురకత్తులే—మరి జీవితమంటే ఇదే కదా!


మొదటి రెండు రోజులూ భువనేశ్ మిత్రుడితో కలసి బిజినెస్ సముదాయ పోష్ ప్రాంతంలో ఉంటూన్న సితారాను, ఆమె కుటుంబ సభ్యులను చూసి వచ్చాడు. అంతకు ముందు వీడియో చాట్ లో వాట్సఫ్ లో ఒకరినొకరు చూసుకున్నవారే, పలకరించుకున్నవారే— పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత ఒకరు గురించి మరొకరు తెలుసుకున్నవారే కదా! మొదటి రోజు రామునీ సితారాను ఒకే చోట ప్రక్క ప్రక్కన చూసేటప్పటికి భువనేశ్ కి చట్టున తోచింది; పొడవులో అంగసౌష్ఠవంలో మేని ఛాయలో ఇద్దరికీ ఈడూ జోడూ బహు చక్కగా కుదిరిపోయారని, బ్రతుకు పాటలో యుగళ గీతంలా విడదీయరాని పచ్చ తీగల్లా పెనవేసుకు పోగలరని. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే—అదన్నమాట..


సితార అమ్మానాన్నలు సితార మేనత్తలూ వాళ్ళ హావ భావాలను బట్టి రాము పట్ల సానుకూలంగా స్పందిస్తున్నట్లే అనిపించింది. అందరికీ కాఫీలు స్నేక్సూ సితార చెల్లెలు శ్యామలే పని వాళ్ళను ప్రక్కన పెట్టి స్వయంగా వచ్చి సర్వ్ చేసింది. అదొక సభ్యతా పూర్వక మైన సంస్కార కుటుంబ నేపథ్యానికి సంకేతం. వెళ్ళిన రెండు రోజుల్లో రాము యింట్లోవాళ్ళందరితో కలివిడిగా కలసిపోయాడు. అక్కా చెల్లెళ్ళిద్దరితో కలసి మందారాలతో తుప్లిప్ లతో వికసించిన తోటంతా కబుర్లాడుతూ కలయ తిరిగి వచ్చాడు. భువనేశ్ మాత్రం వాళ్ళతో వెళ్ళకుండా సగంలోనే ఆగిపోయి సితారా యింట్లో వాళ్ళతో కబుర్లాడుతూ గడిపాడు. అందరితో కలసి మధ్యాహ్న భోజనం చేసాడు.


మూడవ రోజు భువనేశ్ రాముతో కలసి సితారా వాళ్ళ యింటికి వెళ్ళలేదు. ఎలాగూ వయసు ప్రాంగణంలో తేజరిల్లుతూన్న ఇద్దరూ ఒక్కటవ బోతున్నారు;మధ్యన పానకంలో పుడకలా తనెందుకు-- మోడ్రన్ డేషింగ్ పర్సనాలిటీస్ కాబట్టి—వీలు చూసుకుని సాయంత్రమో, వెన్నెల కాంతిలోనో ఔటింగ్ కూడా వెళ్ళ వచ్చు కదా—


యూనికార్న్ క్లబ్బులో చేరి, గ్లోబల్ స్టార్టప్ ల వేపు దూసుకుపోతూ సెలబ్రిటీ స్టేటస్ అందుకోబోతూన్న సితారాకి అటువంటివి కొత్తేమీ కాదు కదా! టెంపర్మెంటల్ కెమిస్త్రీ గాని కుదిరితే, మరింత ముందుకు సాహసించడానికి ఇద్దరికీ మొహమాటాలూ సిగ్గు దొంతర్లూ అడ్డంకిగా నిలవ లేవు కదా! అటువంటప్పుడు అన్నీ యెరిగిన జాతక పక్షి వంటి తనెందుకు శివపూజలో యెలుగు దూరినట్లు వాళ్ళకు అడ్డంగా ప్రవేశిస్తే తను బాపుకునేదేముంది? లెట్ దెమ్ స్టార్ట్ విత్ యెన్ యెమోషనల్ ఎన్ కౌంటర్—


కటకటా! భువనేశ్ అనుకుంటున్నట్లు అటువంటిదేమీ జరగలేదు, అలా యేమీ జరగలేదని ప్రత్యక్షంగా తెలుసుకున్న భువనేశ్ ఖంగుతిన్నాడు. ఉన్నపాటున నాలుక పిడచగట్టుకుపోతే గ్లాసుడు మంచి నీళ్ళు తాగిన తరవాతే తేరుకోగలిగాడు. షాక్ ఆఫ్ దీ లైఫ్ అంటారే-- అదేనా? లేక దానికి ప్రత్యమ్నాయంగా మరొక పేరేమైనా ఉందా!


ఐదవ రోజు కంపెనీ సీనియర్ మేనేజర్ కి ముందస్తు సమాచారం అందించి రాముని కలుసుకుని రావడానికి తయారయి గడప వరకూ నడచి వెళ్ళేటప్పుడు రాము“హాయ్! ”అని యెదురుగా రావడం చూసి భువనేశ్ దాదాపు హతాశుడయాడు.


“ అదేమిటోయ్! ఉదయం నీ హోటెల్ రూముకి వస్తున్నానని నిన్నరాత్రి ఫోను చేసానుగా! మరెందుకు ఈ హఠాత్ దర్శనం? ”


“ఏం—మిత్రుణ్ణి వెతుక్కుంటూ మరొక మిత్రుడు రాకూడదా! పలకరించి వెళ్ళకూడదా? ”


“అది సరేనోయ్! రాకూడదని యెవరంటారు? కాని మేటర్ అది కాదు. నిన్న మధ్యాహ్నం రెండున్నరకు నీకు ఫోను చేసేటప్పుడు కవరేజే యేరియాలో లేనట్టు సిగ్నల్ వచ్చింది. ఏదో బోర్డాఫ్ డైరక్టర్స్ మీటింగులో ఉన్న సితారాను అడిగితే ఆమె కూడా తేలియదంది. ఇంతకీ ఆ సమయంలో యెక్కడికి వెళ్లావు? ఈ ఊళ్ళో దగ్గరి బంధువులెవరైనా ఉన్నారా! పనిలో పనిగా వాళ్ళను చూసి రావడానికి వెళ్ళావా--”


“రాము తల అడ్డంగా ఆడించాడు-“టెన్షన్ అవబోకు. అంతా చెప్తాను. రా—లోపల మాట్లాడుకుందాం”


“అదంతా తరవాత—ముందు యిది చెప్పు—నిన్న మూడు గంటల ప్రాంతాన యెక్కడికెళ్ళావు? అసలే నీకు ఊరు కొత్త—ఎన్నారైవి కూడా—నీ వద్ద డాలర్సూ యూరోలూ పుష్కలంగా ఉన్నాయనుకుని యెవడైనా నిన్ను కిడ్లాప్ చేసుకుపోతే—”


రాము మాట్లాడకుండా సోఫాలో వచ్చి కూర్చున్నాడు. ప్రభావతి నవ్వుతూ గుడ్ మోర్నింగ్ చెప్పి మంచినీళ్ళ గ్లాసు అందించి తను తరవాత వస్తానని చెప్పి, పనావిడకు అక్కణ్ణించి తప్పుకోమని సైగ చేసి లోపలకు వెళ్ళబోయింది. అప్పుడు రాము ఆమెను ఆపాడు. “మీరు వెళ్ళకండి ప్రభావతీ! మీ వారితో నేను కొన్ని విషయాలు మట్లాడాలి. మీరు వినాలి. ”


నవ్వుతూ అలాగే అని తలూపి పనావిడకు మరొక సంకేతం యిచ్చింది;అందరికీ తినడానికి తాగడానికి పట్రమ్మని-- భాగ్యం వెంటనే మెసేజ్ అందుకుని వంట గదివేపు నడచింది. ఆమె లోపలకు వెళ్ళింతర్వాత, ప్రభావతి కూడా వాళ్ళకెదురుగా కూర్చు న్న తరవాత రాము నోరు విప్పాడు మంచి నీళ్ళు సగం తాగి- “నిన్న మధ్యాహ్నం నేనెందుకు కనిపించ కుండా పోయాననేగా నీ పెను అనుమానం. చెప్తాను విను. నేను మీ చిన్నాన్న వాళ్ళ యింటికి వెళ్ళి వచ్చాను”


భువనేశ్ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు-ఎందుకని కళ్ళతో ప్రశ్నిస్తూ—నిరుత్తురుడై చూపులు సారిస్తూ --


“కారణం లేకుండా వెళతానా! మొన్న నువ్వు మీ చిన్నాన్నవాళ్లింటికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసావు కదా! అప్పుడు వాళ్లు నాకు రుచికరమైన తెలుగింటి విందు భోజనం పెట్టారా లేదా—అది నేను లొట్టలు వేసుకుని తిన్నానా-లేదా? ”


ఔనన్నట్టు తలూపాడు భువనేశ్.

“దానికి కృతజ్ఞతగా మీ చిన్నమ్మగారికి మీ బామ్మగారికీ చీరలు కొనిచ్చి దీవెనలు తీసుకుని వచ్చాను. ఇప్పుడు వెళితే మళ్లీ యెప్పుడు వస్తానో కదా అమెరికా నుండి—“


ఈసారి భువనేశ్త్ తో బాటు ప్రభావతి కూడా తెల్లబోయింది.

“అదేంవిటి రాముగారూ! మీకూ సితారా గారికి నిశ్చితార్థం జరగడానికి యేర్పాట్లు చకచకా సాగిపోతుంటేను. సిధ్ధాంతి గారితో చర్చలు పైన చర్చలు జరిగుతుంటేనూ--ఈ నెల ఇరవై లోపే మంచి ముహూర్తాలు. ఆతరవాత మార్చి వరకూ అంటే—నాలుగు నెళ్ళ వరకూ ఆగవలసిందే!


మొదట— తాంబూలాలు పుచ్చుకో వడం-నిశ్చితార్థం. ఆ తరవాత, వివాహ మహోత్సవం—వచ్చేది పెళ్ళి సీజన్ కాబట్టి ఇప్పటికే ఫంక్షన్ హాల్స్ చకచకై బుక్ ఐపోతుంటేనూ-- మీరిప్పుడు అమెరికా వెళ్ళి మళ్ళీ యెప్పుడు వచ్చేది? అందుకే ఈ యేర్పాట్లన్నీ--గొప్పింటి వాళ్ళతో సంబంధం. మనం కొంచెం ఆచితూచి నడచుకోవడం మంచిది కదా! మీరు తీరం దాటి వెళ్ళిపోయే వారు. మేం ఇక్కడే ఉండవలసిన వాళ్లం. కొంచెం శాంతంగా ముందుకు సాగండి—”


“మీరు చెప్పడం పూర్తయింది కదూ—ఇక నేను చెప్తాను. వినండి” అంటూ ముబైల్ స్క్రీనే విప్పి చూపించాడు. అది చూసి భార్యా భర్తలిద్దరూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసారు. మూడు రోజుల్లోపల న్యూ జెర్సీ వెళ్ళిపోవడానకి ఆన్ లైన్లో చేసుకున్న ముందస్తు బుకింగ్ కన్ ఫాం మెసేజ్.


“అదేమిటోయ్! నాకు చెప్ప కుండా యెలా రిటర్న్ టిక్కెట్టు బుక్ చేసుకున్నావు? ” భువనేష్ కళ్ళు పెద్దవయాయి.


‘ఇప్పుడొచ్చాగా చెప్పడానికి--’

ఇద్దరూ కొన్ని క్షణాల వరకూ ముబైల్ లోకి చూస్తూండిపోయారు. ఎట్టకేలకు భువనేశ్ నోరు తెరిచాడు. “నాట్ గుడ్ రామూ! ఇటువంటి గొప్పింటి సంబంధం ఈ జన్మలో మళ్ళీ రాదంటే రాదు. అసలు నీ ప్రోబ్లమ్ యేమిటంట? ”


------------------------------------------------------------------------------

ఇంకా వుంది..

------------------------------------------------------------------------------

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
66 views0 comments

Comentários


bottom of page