తోడూ-నీడా

Thodu Needa - Telugu Emotional Family Story | AyyalaSomayajula Subrahmanyam
తోడూ-నీడా - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ| అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 09/09/2026
ఆస్తి, అంతస్తుల కంటే మంచితనం, మానవత్వం, పరస్పర అవగాహనలే దాంపత్యానికి నిజమైన పునాదులని చాటిచెప్పే హృదయస్పర్శి తెలుగు కుటుంబ కథ ‘తోడూ-నీడా’. తల్లిపై కుమారుడి నిస్వార్థ ప్రేమ, అతనికి జీవితాంతం తోడుగా నిలవాలనుకునే యువతి నిర్ణయం ఈ కథకు ప్రాణం.
రాఘవ పనిచేస్తున్న ఆఫీసు ఆవరణలో చెట్టు క్రింద స్కూటీ పెట్టి తాళమేశాక ఒక రెండు నిమిషాలు తటపటాయించింది సరళ. తనకు రాఘవతో పెళ్ళి చూపులు కూడా జరిగాక తన తండ్రి అతన్ని వద్దన్నాడు. మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే అతన్ని సహాయం చేయమని అడగడానికి వెళుతోంది.
”సబబు కాదేమో” అనిపించింది.
రాఘవ చాలా మంచివాడు. మంచితనానికి మారుపేరు రాఘవ. రామం అన్నయ్య “తప్పకుండా వెళ్ళు” అని చెప్పాడు. రాఘవ ఏమీ అనుకోడు అని మరీ మరీ చెప్పాడు రామం అన్నయ్య. అన్నయ్య చెప్పింది మరోసారి గుర్తుచేసుకుంది. జేబురుమాలుతో
మొహం తుడుచుకుని ఆఫీసు వైపు నడిచింది సరళ.
రాఘవ గది కనుక్కుని వెళ్ళేసరికి అతను కంప్యూటర్ ముందు కూర్చుని దీక్షగా పని చేసుకుంటున్నాడు. వెళ్ళి ఎదురుగా నిలబడింది. అలికిడి అవ్వడంతో రాఘవ తలెత్తి ఓ క్షణంచూసి పలకరింపుగా మందహాసం చేసి “కూర్చోండి” అని అన్నాడు.
ఏమీ జరగనట్టు అతను నవ్వుతూ పలకరిస్తుంటే సరళకు ఆశ్చర్యమైంది.
“మా నాన్నగారికి ఒంట్లో బావుండలేదు. అందుకని రాలేకపోయారు. ప్రక్క ఆఫీసులో ఆయన పెన్షన్ కు సంబంధించిన పని ఉంది.” అని వివరాలు సవివరంగా చెప్పింది సరళ.
“పదండి” అని అతను పని ఆపేసి బయలుదేరాడు. ప్రక్క ఆఫీసులో సరళ తండ్రి చూసే అతను రాఘవను చూసి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించాడు.
అతనికి తాము వచ్చిన పని చెప్పాడు రాఘవ.
అతను నరసింహం ఫైల్ ను తీసి చూసి వివరాలు మొత్తం, మెయిల్ అడ్రస్ రాసిచ్చి వివరాలన్నీ మెయిల్ చేయమన్నాడు. “ఆటోమేటిక్ గా వారం రోజుల్లో ఆర్డర్ వస్తుంది. ఇంక మా రాఘవ చెప్పాక పని ఖచ్చితంగా అయిపోతుంది.” అన్నాడు చిరునవ్వుతో.
అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు. ఆఫీసు ఆవరణలో రాఘవను అందరూ ఎంతో గౌరవంగా చూడటం, ఆప్యాయంగా పలకరించడం గమనించింది సరళ.
‘నాన్న ఇతణ్ణి చేతకాని వాడిగా జమకట్టేశాడు. ఇతనలా కనబడటం లేదే?..’ అనుకుంది సరళ. అతని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది సరళకు.
“మీకు అభ్యంతరం లేకపోతే తేనీరు తాగుదామా?” అంది సరళ దూరంగా ఉన్న క్యాంటీన్ వైపు చూస్తూ.
ఎత్తైన చెట్ల నీడల్లో ఆ మధ్యాహ్నం చల్లగాలి వీస్తోంది. క్యాంటీన్ పైకప్పంతా రాలిన గుల్మొహర్ పూలు పరుచుకున్నాయి.
క్యాంటీన్ ఖాళీగా ఉంది. రాఘవ కనిపించగానే ప్రొప్రైటర్ వచ్చి మర్యాదగా వాళ్ళను తీసుకెళ్ళి కూర్చోబెట్టి టీ తీసుకురావడానికి వెళ్ళాడు.
కాసేపు ఒకదానికొకటి అతని విషయాలు మాట్లాడాక “మీ సంబంధం మా నాన్నగారికి అమ్మకూ ఇష్టం లేకపోయింది.” అంది సరళ అతని వైపు చూడకుండా.
“మరి మీ అభిప్రాయమేమిటీ?” అని రాఘవ అడగలేదు. అలా అడుగుతాడేమోనని ఆమె ఒకింత ఆశించి ఆశ నిరాశైనట్టు ఆమె ఒకసారి కిటికీ అవతల పసుప్పూల చెట్టు వైపు చూసింది.
అతనివైపు తిరిగి “నేను మీకు నచ్చానని చెప్పారట. నేనంత అందంగా ఉండను కదా; పైగా నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. అదీకాక పెళ్ళికొడుకుల డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భరించే ఓపిక మా నాన్నగారికి లేదు. నాక్కూడా కట్నాలు
ఇష్టం లేకపోవడం వల్ల నాకింకా పెళ్ళి కాలేదు. మీకెలా నచ్చాను?”.
“అందం, రంగుల గురించి నాకస్సలు తెలియదు. కొంతమంది కొలమానాలు ఏర్పరిస్తే మిగతావాళ్ళు ఇతర పద్ధతుల మాదిరిగానే వీటిని కూడా ఫాలో అయిపోతుంటారు. ఒక యువతి, ఒక యువకుడు కలిసి జీవించడానికి పరస్పర అంగీకారం మినహా మిగిలినవన్నీ అంత ముఖ్యం కాదని నా అభిప్రాయం.” అన్నాడు రాఘవ.
“మా నాన్నగారు అల్లుని ఎన్నికకు అతని ఆస్తి, ఉద్యోగం, ఇంటి బాధ్యతల గురించి
తెలుసుకునేవారు” అంది సరళ.
రాఘవ చిన్నగా నవ్వి “వాటన్నింటికీ కనీసం నేను మైలు దూరంలో ఉంటాను” అన్నాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. నిర్వికారంగా ఉన్నాడు.
“ఇతను దేని గురించి ఎక్కువగా ఆలోచించడేమో” అనుకుంటూ ఆమె రాఘవ వైపు కన్నార్పకుండా చూస్తోంది. మామూలు బట్టలు, వెనక్కి దువ్విన జుట్టు, చక్కటి పెద్ద కళ్ళు, ఆకర్షణీయమైన మొహం…
“సరిగ్గా చూస్తే మనిషి చాలా బావున్నాడు” అనుకుంది సరళ.
టీ తాగడం పూర్తయ్యింది. ఓనరు రాఘవకు దండం పెట్టి పైసలు తీసుకోలేదు. బయటికి వచ్చాక ఆమె కృతజ్ఞతలు చెప్పి తన స్కూటీ వైపు నడిచింది సరళ.
రామం — సరళకు, రాఘవకు ఇద్దరికీ దూరపు చుట్టరికం. పెళ్ళి సంబంధం తెచ్చినప్పుడు రామం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి.
“రాఘవది గవర్నమెంట్ ఉద్యోగం. నిజాయితీ గల మనిషి. ఇతరుల విషయాల్లో తల దూర్చడు. అందరికీ చేతనైనంత సహాయం చేస్తూంటాడు.
పక్షవాతం, పెద్ద వయసుతో పదేళ్ళుగా మంచం మీదున్న తల్లికి అన్ని సపర్యలూ తనే చేస్తున్నాడు… చాలా బుద్ధిమంతుడు, యోగ్యుడు.” అని.
పెళ్ళి చూపులయ్యాక నరసింహం విడిగా సమాచారం సేకరించి “రాఘవకు డబ్బు లక్ష్యం లేదు. కష్టాల్లో ఎవరైనా ఉంటే, ఎంత కొత్తవాళ్ళెవరైనా సరే ఆపదల్లో ఉన్నపుడు తన సొంత డబ్బులు ఖర్చుపెడతాడు. పేద విద్యార్థులకు చదువుకు కావలసిన సరంజామా అంతా తనే కొనిస్తాడు.
సొంత డబ్బుతో పేద విద్యార్థులకు ఫీజులు కడతాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదరోగులకు సేవచేస్తాడు. నెలాఖరుకు మిగిలేదేమి ఉండదు. మూడు గదుల చిన్న ఇల్లు. అది తప్ప ఇంకే ఆస్తి లేనే లేదు. ఒక ఇల్లు కానీ, ఒక స్థలమో అస్సలు లేదు. డబ్బులు సంపాదించాలన్న యావ, దృష్టి లేదు. ఒట్టి చేతకానివాడు” అని నిర్ధారించి ఈ సంబంధం వద్దు పొమ్మన్నాడు.
“ఇతను చేతకానివాడు కాదు, అప్రయోజకుడు కూడా కాదు. నాన్న చూపులో తేడా ఉంది. పొరపాటు పడ్డాడు నాన్న” అనుకుంది సరళ.
వారంరోజుల తరువాత రాఘవ దగ్గర నుంచి సరళకు ఫోన్ వచ్చింది. “మీ నాన్నగారి పని అయిపోయింది. మీరెప్పుడొచ్చినా తీసుకోవచ్చు. అతను ఆర్డర్ కాపీ నా చేతికిచ్చి వెళ్ళాడు. మీ ఫోన్ నంబర్, మీ రామం అన్నయ్య ఇచ్చాడు.”
అతనికి కృతజ్ఞతలు చెప్పి “స్కూల్ పనులతో ప్రొద్దున పూట అస్సలు కుదరటం లేదు. సాయంత్రం మీ ఇంటికి వచ్చి తీసుకోవచ్చా?” అని అడిగింది సరళ, ‘అలా వెళితే ఇల్లు కూడా చూడొచ్చు. అతణ్ణి ఇంకా బాగా గమనించవచ్చు’ అనుకొంటూ.
“మీ ఇష్టం” అని ఫోన్ పెట్టేశాడు రాఘవ.
“పని చేయించడమే కాకుండా ఫోన్ నంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేశాడు. మట్టి ముద్దకాదు, జడపదార్థం కాదు” అనుకుంది సరళ.
మూడు రోజుల తరువాత ఓ రోజు సాయంత్రం సరళ రాఘవ ఇంటికి వెళ్ళింది. అప్పుడే అతను తన తల్లి అన్నపూర్ణను చక్రాల కుర్చీలో తీసుకెళ్ళి పార్క్ లో తిప్పించి తీసుకు వస్తున్నాడు. రాఘవ సరళను వాళ్ళమ్మకు పరిచయం చేశాడు. ఆమె వచ్చిన పని చెప్పాడు.
సరళ ఆ మూడు గదుల ఇంటిని పరిశీలించి చూసింది. ఒకవైపు పడగ్గది, ఓవైపు వంట గది, మధ్యలో హాలు. ఖరీదైన వస్తువులు ఏవీ లేవు. వాషింగ్ మెషీన్ కూడా లేదు. పడగ్గది లో మాత్రం ఏసీ ఉంది. తల్లి గురించి పెట్టించినట్టున్నాడు. పడగ్గది ఓ చిన్న ఆసుపత్రి లాగా ఉంది. తలవైపు పైకిలేచే మంచం (ఆసుపత్రిలో ఉన్నట్టు), మందులూ, బట్టలు, డైపర్ల డబ్బాలు ఉన్నాయి. ఎటాచ్డ్ బాత్ రూమ్. అక్కడనుంచి ఫినాయిల్ వాసన వస్తోంది.
రాఘవ వంటగదిలోకి వెళ్ళాడు. సరళ అన్నపూర్ణ దగ్గర కుర్చీలో కూర్చుని “ఎలా ఉంది మీ ఆరోగ్యం” అని ఆప్యాయంగా అడిగింది.
“ఏనాడు చేసుకున్న పాపమో తల్లీ, రోగం తగ్గకుండా, ప్రాణం పోకుండా ఇలా వాడి ప్రాణం తీస్తూ వీడి నెత్తి మీద ఇలా కూర్చున్నాను.
నన్ను వెంటనే తీసుకుపో స్వామీ అని రోజూ మొక్కుతున్నా. ఆ భగవంతుడికింకా దయ రాలేదు.” అంది అన్నపూర్ణ.
“రాఘవ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా.. త్వరలోనే మీ ఆరోగ్యం బాగైపోతుందమ్మా” సానుభూతిగా, అనునయంగా మాట్లాడింది సరళ.
“పాపం పిల్లాడు.. నా పనంతా వాడే చేస్తున్నాడు. వంట చేసి ప్రొద్దున్నా, రాత్రి తినిపిస్తాడు. మందులు వేస్తాడు. రాత్రిళ్ళు ఇక్కడే చిన్న చాప వేసుకుని నన్ను కనిపెట్టుకుంటూ పడుకుంటాడు. నా సపర్యలు అన్నీ వాడే చేస్తాడు.
ఒకటేమిటి.. స్నానం చేయించడం దగ్గర నుంచి చీర కట్టి పెడతాడు. అవసరమైనప్పుడు డైపర్లు మారుస్తాడు. నాకే సిగ్గుగా ఉంది. చంటిపిల్ల
సపర్యలన్నీ నాకు చేస్తాడు. వాడి మనసు వెన్నపూస. నవనీతం కంటే మిన్న.”
“మరి ఆయన ఆఫీసు కెళ్ళినప్పుడు?”
“ఇక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమం నుంచి ఒక ఆడమనిషిని తీసుకువచ్చి పెట్టాడు. ఎందుకంటే బంధువులు, చుట్టాలనుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఆమెను కూడా కన్నతల్లి లాగా చూసుకుంటాడు.”
“మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రులనే రోడ్డు మీద వదిలేస్తున్నారు. అటువంటిది మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే మాటలా?”
“అదే తల్లి, వాడికి శాపమై కూర్చుంది. ఒక్క పెళ్ళి సంబంధం కుదరటం లేదు. నేను చెప్పుకోకూడదు కానీ, మా వాడు చాలా చాలా బుద్ధిమంతుడు. కల్మషం లేనివాడు. కానీ ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? ఆస్తిపాస్తులున్నాయా లేదా అనే చూస్తున్నారు. ‘నన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో (Old age home) లో పడెయ్యరా’ అని మొత్తుకున్నా. అస్సలు వింటేగా! అలా అంటే వాడికి కోపం వస్తుంది” అంది అన్నపూర్ణ సరళతో.
రాఘవ బిస్కెట్లు, పాలూ తీసుకువచ్చి అన్నపూర్ణకి ఇచ్చాడు. ఆమె పాలు తాగాక ఆమె కుడిచేతికి, కాలుకు మృదువుగా తైలమర్దనం చేశాడు. అతను తల్లి పనులన్నీ మనసు పెట్టి చేస్తుంటే అంతా గమనించసాగింది సరళ.
రాఘవ వద్దన్నా వినకుండా ఖాళీకప్పులు తీసుకెళ్ళి వంటింటి వాష్ బేసిన్ లో వేసి కడిగి పెట్టేసింది సరళ. ఇంటిచుట్టూ చూస్తుంటే అందమైన మొక్కలు కనబడ్డాయి. జాజితీగ, మల్లె, నందివర్ధనం, గులాబీ, నైట్ క్వీన్ మొక్కలున్నాయి. అన్నీ ధవళ వర్ణంతో మెరుస్తున్నాయి.
‘మొక్కల పెంపకంలో చాలా శ్రద్ధ ఉన్నట్టుంది’ అనుకుంది.
రాఘవ వచ్చి సరళకు నరసింహం కాగితాలు ఇచ్చాడు. సరళ కృతజ్ఞతలు చెప్పి “మీరు మీ అమ్మగారిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు” అంది.
“ఆమె నాకు అమ్మా, నాన్నా, అక్కా, అన్నా, చెల్లీ, తమ్ముడూ అన్నీ ఆమెనే. అన్నీ తనే అయి నానా యాతనలు పడి, పాతికేళ్ళు పెంచింది. అందులో నేను చేస్తున్నదెంత?” అన్నాడు.
అతని సమక్షంలో ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నట్టు అనిపించింది సరళకు. సరళ అన్నపూర్ణకు వెళ్ళి వస్తానని చెప్పి గేటు దగ్గరకు వచ్చింది. అప్పుడే ఓ పెద్ద కారు ఇంటిముందు ఆగింది. తెల్లకోటు చేతిలో పట్టుకుని ఒక డాక్టర్ గారు లోపలకొచ్చారు.
రాఘవ ఆయన్ని సరళకు పరిచయం చేస్తూ “ఈయన ప్రముఖ న్యూరోలాజిస్ట్. అమ్మను చూడ్డానికి రోజూ సాయంత్రం పూట వస్తారు” అన్నాడు మందహాసంతో.
డాక్టర్ గారు చిరునవ్వు నవ్వుతూ “అమ్మా, ఎలా ఉంది?” అని అడిగారు.
“మొండి ప్రాణం పొమ్మన్నా పోదు. నాకోసం వాడు కష్టపడటం, వాడికి పెళ్ళి కావటం లేదు.” అంది అన్నపూర్ణమ్మ నిరాసక్తంగా.
డాక్టర్ గారు పెద్దగా నవ్వి “మీరు రాఘవ సంరక్షణలో ఉండగా మీ ప్రాణం ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఈ మధ్య పెళ్ళిళ్ళన్నీ ఆలస్యంగానే అవుతున్నాయి. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. మీరు ప్రశాంతంగా ఉండాలి.” అని ధైర్యం చెప్పి బయటకి నడిచారు.
సరళ కూడా బయటకు వచ్చింది.
డాక్టర్ గారు ఆగి “ఈమెకు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నప్పడల్లా మా అమ్మకి సేవ చేసినట్లుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఐదేళ్ళక్రితం మా అమ్మగారికి పెద్ద జ్వరము వచ్చింది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. సమయానికి వైద్యం అందలేదు. నేను వచ్చేసరికి ఆమె పోయింది” అంటూ ఉండగా కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి.
చేతిరుమాలుతో కళ్ళద్దుకుని వెళ్ళొస్తానని రాఘవకు చెప్పి కారెక్కి వెళ్ళిపోయారు. సరళ కూడా వెళుతూ రాఘవ ఇంటివైపు ప్రేమపూరితమైన చూపులు చూసింది.
ఆ తరువాత రోజు సరళ రామం ఇంటికి వెళ్ళింది. రామానికి జరిగినదంతా చెప్పి “మా నాన్న రాఘవ సంబంధాన్ని ఎందుకు వద్దన్నాడు?” అని అడిగింది.
“పెళ్ళిచూపులయ్యాక నేను మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీవు ఇంట్లో లేవు. జరిగినదంతా చెబుతాను విను” అని మొత్తం విషయం చెప్పాడు.
——————————————————-
ఆ రోజు రామం వెళ్ళేసరికి ఇంట్లో నరసింహం, అతని భార్య ఇద్దరే ఉన్నారు. టీ త్రాగిన తరువాత రాఘవ విషయం ప్రస్తావించి మరోసారి ఆలోచించమన్నాడు..” అన్నాడు రామం.
“చేసుకోబోయే మనిషి ఎలాంటివాడు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేదే కదా చూస్తాం!” అన్నాడు నరసింహం.
“రాఘవను మీరు వ్యావహారిక దృష్టితో చూసి అతని మంచితనాన్ని అపార్థం చేసుకున్నారు. అతనికి మనుషులంటే అపారమైన ప్రేమ. మంచం మీదున్న తల్లిని ఎంతో జాగ్రత్తగా, ఆప్యాయంగా చూసుకుంటూ అన్ని సేవలు తనే చేస్తున్నాడు. అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు.
రాఘవను ఊళ్ళో ఎంతో గౌరవంగా చూస్తారు. ప్రతీరోజు డాక్టర్ ఇంటికొచ్చి వెళతాడు. మార్కెట్ లో అందరూ అతనికి చాలా చవకగా సరుకులు అమ్ముతారు. కొంతమంది ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. మందుల షాపుల్లో అన్నీ చాలా తక్కువ ధరలకే ఇస్తారు. ఏ దుకాణానికి వెళ్ళినా అక్కడ యజమాని ఎంతో గౌరవంగా లేచి నిలబడి దగ్గరుండి తనే సరుకులు కట్టిస్తాడు. అది అతని వ్యక్తిత్వం.” వివరించాడు రామం.
“అది సహజమైన గౌరవం కాదు. వాళ్ళు చూపించలేని మంచితనాన్ని, తల్లి పట్ల ప్రేమను అతను చూపిస్తున్నాడని అపరాధభావనతో గౌరవిస్తున్నారు. అతని పట్ల గౌరవం నిజమే. అయితే వాళ్ళు కూడా అతనిలాగా ఉండొచ్చు కదా; ఏదీ, ఎక్కడున్నారు? అదే ఋజువు. రాఘవ మరొకరిని తప్పుబట్టడు, కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళందరికీ శత్రువైపోయి ఉండేవాడు.” బదులిచ్చాడు నరసింహం.
“అయితే రాఘవ మంచితనానికి విలువ లేదా?”
“ఎందుకు లేదూ? అందరు మంచివాళ్ళలాగానే అతణ్ణి మహానుభావుని చేసి ఎత్తులో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు. ప్రపంచం మంచిని ప్రబోధిస్తుంది గానీ మంచివాళ్ళని కలుపుకోదు. ఇదే లోకం పోకడ.” అన్నాడు.
“నిజం చెప్పండి. అతను ఊరివాళ్ళ మీద ఖర్చు పెడతాడని, తనకోసం ఏమీ మిగుల్చుకోడనీ, రేపు భార్య కూడా ఆ ఇరుకు ఇంట్లో అతని తల్లికి సేవ చేయవలసి వస్తుందనీ.. ఇవేగా మీ అభ్యంతరాలు? భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి బావుండచ్చు కదా;” అన్నాడు రామం కొంచెం ఆవేశంగా.
“రాఘవ నిజంగా మంచివాడు. అందుకే నా భయం. అతని అతి మంచితనం తెచ్చిపెట్టు కున్నది అయ్యుంటే నాకు సంతృప్తిగా ఉండేది. ప్రపంచం ఇప్పట్లో మారదు. అతనికి జీవితాంతం కష్టనష్టాలు తప్పవని తెలిసీ, నా కూతురిని ఆ ఇంటికి ఎలా ఇవ్వమంటావు?” సూటిగా ప్రశ్నించాడు నరసింహం.
భార్య కలగజేసుకుని “ఇంకో సంబంధం కుదిరేట్టుంది రామం. కానీ రెండో పెళ్ళివాడని సందేహిస్తున్నాం. కుర్రాడిది మంచి ఉద్యోగం. మంచి ఆస్తిపరుడు. మేం పిల్ల సుఖం కూడా చూడాలి కదా;” అంది.
“ప్రయోజకుడు రెండో పెళ్ళివాడి కంటే తక్కువైపోయాడా? పోనీ రాఘవ సంబంధం విషయం సరళ అభిప్రాయం కనుక్కున్నారా?” అడిగాడు రామం ఇంక ఆఖరి ప్రయత్నంగా……
“మిగతావన్నీ బావున్నప్పుడే కదా అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవడం.”
ఆ తరువాత రామం కోపం తమాయించుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు.
——————————————————-
“అదీ జరిగిన కథ” అని, “నువ్వు రాఘవను కలిశావు. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు. అతని గురించి ఏమనుకుంటున్నావు?” అడిగాడు రామం.
“నాకు రెండు రోజులు కావాలి.” అని బయలుదేరింది సరళ.
నాలుగు రోజుల తరువాత ఇంట్లో మేడమీద పేపర్లు దిద్దుకుంటున్న సరళ సెల్ మ్రోగింది.
చూస్తే రామం అన్నయ్య.
“నువ్వు రాఘవ ఇంటికి వెళ్ళొచ్చావు కదా… మీ నాన్నతో మరోసారి పెళ్ళి విషయం మాట్లాడమని మా అన్నపూర్ణ పిన్ని రెండు రోజుల నుంచీ ఫోన్ చేసి నన్ను తినేస్తోంది. ఏం చెయ్యమంటావు?” నవ్వుతూ అన్నాడు.
“మా నాన్న ఈ మధ్యే మళ్ళీ కాస్త తేరుకున్నాడు. జ్వరం తగ్గి నిలకడగా ఉన్నాడు. రాఘవను కలిసిన విషయం రేపు చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా ఓ సారి మాట్లాడు” అంది సరళ.
“నువ్వేదయినా మీ నాన్నతో అనుకూలంగా చెబితేనే కదా నేను ఆయనతో మాట్లాడేది. ఇంటికి వచ్చి మాట్లాడటానికి కుదురుతుంది” అన్నాడు రామం.
“కష్టమైనా సరే, మంచితనం అంతరించిపోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరం గురించి మా నాన్నకు నేను చెబుతాను. వచ్చి మాట్లాడు. ఈసారి నాన్న తప్పకుండా ఒప్పుకోవచ్చు…. కాదు…. కాదు.. ఒప్పుకుంటారు” అంది సరళ.
———————-
స్త్రీ… పురుషుడి వెనుక ఉంటే బలం; ముందుంటే కవచం; పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తే అద్భుతం.
తోడూ-నీడా; గోరువెచ్చని పాలకు మజ్జిగచుక్కను జత చేరిస్తే క్రమంగా చిక్కబడి అది పెరుగవుతుంది. ఆ ప్రక్రియకు తెలుగులో “తోడుపెట్టడం” అని చక్కని
పేరు పెట్టారు మన పెద్దలు. ఆ మాట దాంపత్యానికి వర్తిస్తుంది.
నునువెచ్చని వయసులో ఆడ మగ ముచ్చటపడి జత కడితే, మూడు ముళ్ళతో బతుకులు ముడిపడితే, వారి మధ్య లేత వలపులు క్రమక్రమంగా ముదిరి చిక్కబడి, అది ‘అనురాగ మకరంద సుమగంధమై………
మరులు పెనవేయు మాధుర్య దృఢబంధమై, ఆడ మగ అనే రెండు పదాలు ఒకటై “దంపతి” అనే ఒక పదంగా స్థిరపడటమే —— అసలైన దాంపత్యం.”
అదే అదే ఒకరికొకరు “తోడూ-నీడా”
——శుభం భూయాత్—
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి, మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.












Comments