గీతల్లో ప్రాణం

Geethallo Pranam - Telugu Inspirational Story | Dr. Lakshmi Raghava Kamakoti
గీతల్లో ప్రాణం - తెలుగు స్ఫూర్తిదాయక కథ | డా. లక్ష్మీ రాఘవ కామకోటి
Published In manatelugukathalu.com On 09/11/2026
వృద్ధాప్యం వల్ల చేతులు సహకరించకపోయినా కళపై ప్రేమను వదులుకోని ఓ చిత్రకారుడి జీవితంలో AI సాంకేతికత కొత్త ఆశను తీసుకొచ్చింది. కానీ కళతో పాటు నిజాయితీని కూడా కాపాడుకోవాలనే సందేశాన్ని అందించే హృదయస్పర్శి కథ ఇది.
“సత్యమూర్తి గారూ, మీరు మా పత్రికలో కథలకు బొమ్మలు వేయగలరా సార్?” అని అడిగాడు ఒక వారపత్రిక యజమాని. సత్యమూర్తి లాంటి వారిచేత బొమ్మలు వేయిస్తే పత్రిక అమ్మకాలు బాగుంటాయన్నది ఆయన ఉద్దేశం.
“సారీ, వేయలేను. కథలు చదివి వాటికి అనుగుణంగా బొమ్మలు రూపొందించాల్సి వస్తుంది. అలా కాకుండా నా భావాలకు స్వేచ్ఛ నిచ్చే అవకాశం ఉందని “రూప” మాసపత్రిక ముఖచిత్రాలకు వేస్తున్నాను.
అంతేనండీ.” పత్రిక యజమాని ముఖంలో నిరాశ కనిపించింది. “అన్నట్టు ఇంకో వారంలో నా చిత్ర ప్రదర్శన ఉంది, చూడండి” అని సత్యమూర్తి అనగానే, ‘సరే’ నంటూ లేచాడు ఆయన.
సత్యమూర్తి చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కుంచె నుంచి జాలువారే రంగులు కేవలం రూపాలను మాత్రమే కాదు, మనుషుల మనస్సుల్లోని భావాలను కూడా పలికించేవి.
ఆకలితో బిడ్డకు ముద్ద పెడుతున్న తల్లి కళ్లలోని ఆర్ద్రత, కొడుకు రాక కోసం గుమ్మంలో ఎదురుచూసే తండ్రి చూపుల్లోని ఆశ, వృద్ధాప్యపు ఒంటరితనం... ఆయన చిత్రాల్లో ప్రాణం పోసుకునేవి. అందుకే ఆయన చిత్రాలకు దేశవిదేశాల్లో మంచి పేరుంది.
వయసు పెరుగుతున్నా చక్కటి క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన చిత్రాలతో ముందుకు సాగాడు సత్యమూర్తి.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు... ఒకరోజు తెల్లని కాన్వాస్ ముందు కూర్చుని, మనసులో స్పష్టంగా ఉన్న రూపాలను కాన్వాస్‌పైకి తెచ్చేందుకు కుంచెను పట్టుకోబోతే... వేళ్లు నిలకడలేక గీతలు తప్పుతుంటే గుండె పట్టేసినట్టు అయింది.
ఒళ్లంతా చెమటలు... "ఎందుకిలా?" అన్న ఒక్క ఆలోచనతో సత్యమూర్తి చేతులు వణకడం మొదలైంది. రెండు రోజులు ఆగి మళ్లీ ప్రయత్నించాడు.
కుంచె పట్టుకుంటే గీతలు అదుపు తప్పేవి. మనసులో అద్భుతమైన దృశ్యాలు రూపుదిద్దుకుంటున్నా, వాటిని కాన్వాస్‌పైకి తీసుకురాలేకపోతున్నాడు.
తీవ్రమైన జబ్బులు లేవని తెలుసుకున్నా, మానసికంగా వయసు మార్పులను అంగీకరించడం కష్టమైంది. ఒకప్పుడు ఆయన చిత్రాల కోసం ఎదురుచూసిన అభిమానులు, కొత్త చిత్రాల గురించి అడగడం తగ్గించారు.
తనలోని కళాకారుడు ఇంకా బతికే ఉన్నాడని నిరూపించుకోవాలనే తపన మాత్రం తగ్గలేదు. ఒకరోజు మనవరాలు నిహారిక ఆయన బాధను గమనించింది.
“తాతయ్యా! ఇప్పుడు AI సాయంతో మన ఆలోచనలకు చిత్రరూపం ఇవ్వొచ్చు. నీ పాత చిత్రాల శైలి ఆధారంగా కొత్త చిత్రాలు సృష్టించవచ్చు.
ప్రయత్నిద్దాం అంటే నేను హెల్ప్ చేస్తాను?” అంది. అసలే నిస్సహాయతలో ఉన్న సత్యమూర్తికి అదేదో తన కళకు ప్రత్యామ్నాయంలా కాకపోయినా చూద్దాం అనుకుంటూ నిహారికతో “చూపించు ఒకసారి” అన్నాడు.
తాతయ్య గదిలోనే తన ల్యాప్‌టాప్ పెట్టుకుని మొదట AI గురించి వివరించి, అది పనిచేసే విధానాన్ని చూపింది. ఒక వారంలో ఇతరుల చిత్రాలను ఎంతగా అనుకరించగలదో చూపితే ఆశ్చర్యపోయాడు.
చివరికి తను వేసిన చిత్రాలను అనుకరించడం చూసి నివ్వెరపోయాడు. డూప్లికేట్ ఏదో తానే గుర్తుపట్టలేనంతగా అయ్యింది. ఇంకాస్త ముందుకు పోయి తన మనసులో ఉన్న ఊహాచిత్రాన్ని వివరించి వేయమన్నాడు.
అతని వివరణను బట్టి మూడు రకాలైన చిత్రాలను ఇచ్చింది. ఇది సత్యమూర్తికి నమ్మలేని నిజం. ఒక చిత్రకారుడు తన ఊహా చిత్రాన్ని తన అభిరుచిని, ఆలోచనను బట్టి మారుస్తాడు తప్ప... ఇంకో చిత్రాన్ని అదే ఊహతో వేయడు.
అంటే ఇక్కడ మార్పు ఎలా ఉంటుందో చూసే ఛాయిస్ కూడా దొరుకుతోంది!!! సత్యమూర్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిహారిక తలమీద చేయి వేసి “ఎంత అద్భుతాన్ని చూపావురా నాన్నా!” అన్నాడు కళ్లల్లో ప్రేమ నిండుగా.
తాతయ్యకు నచ్చేలా తను చూపినందుకు గర్వపడింది నిహారిక. “మీ వయసు వాళ్లు ఇప్పటి సాంకేతికతను యాక్సెప్ట్ చేస్తారనుకోలేదు తాతయ్యా...” అంది ఇష్టంగా చూస్తూ. “నిజమే, కానీ ఇదంతా చూశాక నాకు నమ్మకం కలిగింది.
నిహారికా, ఇది నాకు నేర్పగలవా తల్లీ?” అన్నాడు సత్యమూర్తి అభ్యర్థనగా. “తప్పకుండా తాతయ్యా. నీవు ఓపిగ్గా నేర్చుకుంటానంటే ఎందుకు చెప్పను?” అంది ఆనందంగా.
“నేను ఇది నేర్చుకుంటున్నానని ఎవరికీ చెప్పకూడదు తల్లీ. మాట ఇస్తావా?” “తప్పకుండా తాతయ్యా, ఎప్పటికీ ఎవరికీ చెప్పను, సరేనా?” అంది నిహారిక భరోసాగా.
ఒక నెలలోనే సత్యమూర్తి మెళకువలన్నీ నేర్చుకున్నాడు. మొదట్లో నిహారిక కొంత సహాయపడినా చివరకు తానే తన అనుభవంతో దృశ్యాలను ఊహించి, రంగుల అమరికను సూచించి, AI సహాయంతో చిత్రాలు రూపొందించడం ప్రారంభించాడు.
అలా వచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తూ తనదైన విధానంలో టచ్అప్ ఇస్తూ పోయాడు.
మళ్లీ ఆయన పేరు వినిపించసాగింది. కొత్త చిత్రాలకు ప్రశంసలు వచ్చాయి. ఓ ప్రముఖ చిత్ర ప్రదర్శనకు ఆహ్వానం కూడా అందింది. ఆ ప్రదర్శనలో ఆయన చిత్రం బహుమతి గెలుచుకుంది. అభినందనలు వెల్లువెత్తాయి. పత్రికల్లో ఆయన పేరు వచ్చింది.
చాలాకాలం తర్వాత సత్యమూర్తి ముఖంలో ఆనందం తొణికిసలాడింది. తనపై ఉన్న గొప్ప చిత్రకారుడనే ముద్రను కాపాడుకోగలిగాననే సంతోషం ఆయనలో నిండింది.
అయితే ఆ చిత్రాలు రూపొందించడంలో AI సహాయం తీసుకున్నాననే విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు.
నిహారిక తాతయ్యకు కలిగిన సంతోషానికి కారణమైనందుకు గర్వపడింది. ప్రదర్శన ముగియబోతున్న సమయంలో ఒక యువకుడు సత్యమూర్తి దగ్గరకు వచ్చాడు.
“మీ చిత్రాల్లోని భావవ్యక్తీకరణ అద్భుతం. ఈ వయసులో కూడా మీ చిత్రాలు మరింత అద్భుతంగా మారాయి. నాకు కూడా చిత్రకళ అంటే ఇష్టం. నేర్చుకుంటే మీలాంటి వారి దగ్గరకి రావాలి.
నేర్పుతారా?” అని మెచ్చుకుంటూ అడిగాడు. ఆ మాటకు సత్యమూర్తి కొద్దిగా ఇబ్బందిగా చిరునవ్వు నవ్వాడు. “తప్పకుండా. కానీ ఇప్పట్లో తీరిక లేదు” అన్నాడు.
ఆ యువకుడు వెళ్లిపోయాక ఆయన మనసులో ఏదో అలజడి మొదలైంది. తన చేతులు ఇప్పుడు కుంచెకు సహకరించడం లేదు.
తాను రూపొందించిన కొత్త చిత్రాల వెనుక ఉన్న సాంకేతికతను చెప్పలేడు. నిజం చెబితే తనపై ఉన్న గౌరవం తగ్గిపోతుందేమో... ఇంతలో మరో వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు.
“సత్యమూర్తి సార్, నా పేరు గోపాల్. మా అమ్మకు మీ చిత్రాలంటే చాలా ఇష్టం ఉండేది.
ఆమెతో గడిపిన ఒక జ్ఞాపకం నా మనసులో చెరిగిపోకుండా ఉంది. ఆ జ్ఞాపకాన్ని మీరు చిత్రంగా వేస్తే నా జీవితంలో అత్యంత విలువైన సంపదగా దాచుకుంటాను, నా అభ్యర్థనను మన్నించండి” అన్నాడు నమ్రతగా.
ఆ మాటలకు సత్యమూర్తి మనసు కదిలింది. గోపాల్ తల్లి గురించి చెప్పిన వివరాలు విన్నాడు.
ఒక వర్షపు సాయంత్రం, తల్లి తనను ఒడిలోకి తీసుకుని తల తుడుస్తూ, ఆప్యాయంగా చూస్తున్న దృశ్యం అది. సత్యమూర్తికి తన తల్లి గుర్తొచ్చింది.
ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్న రోజులు గుర్తొచ్చాయి. వెంటనే అతని జ్ఞాపకాన్ని చిత్రంగా మలచాలనే తపన కలిగింది. కానీ చేతులు సహకరించలేదు.
మరోసారి AI సహాయం తీసుకున్నాడు. గోపాల్ ఇచ్చిన ఫోటో ఆధారంగా అతని తల్లి ముఖాన్ని దిద్దుతూ అతను వివరించిన జ్ఞాపకానికి రూపమిచ్చాడు.
చిత్రం అద్భుతంగా వచ్చింది. చిత్రం పూర్తి అయ్యిందని ఫోన్ అందిన వెంటనే గోపాల్ సత్యమూర్తి ఇంటికి వచ్చాడు. అతను చిత్రాన్ని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
“చాలా బాగుంది సార్! కానీ...” అంటూ ఆగిపోయాడు. “ఏమైంది?” అడిగాడు సత్యమూర్తి ఆతృతను అణచుకుంటూ... “సార్, మీ పాత చిత్రాలు నాకు బాగా గుర్తున్నాయి. ఈ చిత్రంలో మీ శైలి కనిపిస్తున్నా, మీ కుంచె పలికించే ఆ ఆత్మీయత మాత్రం కనిపించలేదు.
అంటే ఈ చిత్రంలో రూపం ఉంది, రంగులున్నాయి. కానీ ఆ తల్లి తన బిడ్డను నిజంగా తాకుతున్న అనుభూతి మాత్రం కలగడం లేదు. ఇంతకుమునుపు మీ చిత్రాల్లో ఆ అనుభూతి ఉండేది సార్.
సారీ ఇలా చెప్పినందుకు, ఏమీ అనుకోకండి” అన్నాడు మెల్లిగా. ఆ మాటలు సత్యమూర్తి హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి. తన చిత్రాలను తాను ఎన్నోసార్లు చూసుకున్నాడు. అందరూ మెచ్చుకున్నారు.
కానీ ఈరోజు మొదటిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు. తాను కాపాడుకుంటున్నది తన కళనా? తన పేరా? తన చేతులు సహకరించడం లేదన్న నిజాన్ని అంగీకరించడానికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? తన కళాకారుడనే గుర్తింపు పోతుందన్న భయంతో, తనకు సాధ్యమవుతున్న కొత్త సృజనను కూడా నిజాయితీగా పరిచయం చేయలేకపోతున్నాడా? గోపాల్ వెళ్ళిపోయాక సత్యమూర్తి గారు నిహారికను దగ్గరకు పిలిచారు.
"నిహారికా, నువ్వు నామీద ప్రేమతో చూపించిన ఈ AI... వయసైపోయి మూలనపడ్డ నా ఊహలకు నిజంగా ఒక కొత్త ఊపిరినిచ్చిందిరా.
కానీ, దీన్ని నా చేతి విద్య అని అబద్ధం చెప్తూ 'గొప్ప ఆర్టిస్ట్' అనే ముద్ర వెనుక దాక్కోవడం నా మనస్సాక్షికి నచ్చడం లేదు..." నిహారిక తాతయ్య చేతులు పట్టుకుని, "తాతయ్యా! మీలోని కళాకారుడు మళ్లీ సంతోషంగా ఉండాలని ఈ సాంకేతికత నేర్పించాను.
మీరు దాన్ని ఇంత బాగా ఉపయోగించుకుంటారని అనుకోలేదు. కానీ ఇప్పుడు మీ మనసులో ఇంత సంఘర్షణ కలుగుతుందని కూడా ఊహించలేదు...” అంది దీనంగా.
సత్యమూర్తి నిహారిక భుజం మీద చేయి వేసి ‘కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి తల్లీ’ అనగానే నిహారిక అక్కడి నుండి బయటకు వెళ్ళింది. నిహారిక వెళ్ళాక తన పాత చిత్రాల ముందు కూర్చున్నాడు సత్యమూర్తి. ప్రతి చిత్రం వెనుక ఒక జ్ఞాపకం ఉంది.
ప్రతి గీత వెనుక ఒక అనుభూతి ఉంది. తన చేతులు వణకకముందు, ఆ భావాలను కుంచెతో పలికించడానికి ఎంత తపించేవాడో గుర్తొచ్చింది. ఇప్పుడు తన పేరు నిలబెట్టుకోవాలనే తపనలో, ఆ కళ పట్ల తనకున్న నిజాయితీనే కోల్పోతున్నాడని అనిపించింది.
మరుసటి రోజు గోపాల్‌కి ఫోన్ చేశాడు. “గోపాల్, నిన్న చిత్రం గురించి నీ అభిప్రాయాన్ని చెప్పాక నేను జవాబు ఇవ్వలేకపోయాను. ఈరోజు మాత్రం జవాబు నీతో చెబితే తప్ప కుదరదు అన్న నిర్ణయానికి వచ్చాను.
గోపాల్, నా చేతులు ఇప్పుడు ముందులాగా సహకరించడం లేదు. ఇటీవలి చిత్రాల్లో AI సహాయం తీసుకున్నాను. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. నా పేరు నిలబెట్టుకోవాలనే కోరికతో నిజాన్ని దాచాను. నీవు గుర్తించావు... అది చెప్పినందుకు థాంక్స్ గోపాల్.”
“నేను కలుస్తాను సార్” అంటూన్న గోపాల్ మాటలు వినలేదు కానీ, ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన మనసుకు ప్రశాంతత వచ్చింది.
ఇన్నాళ్లు తను మోస్తున్న 'పెద్ద ఆర్టిస్ట్' అనే ముసుగు ఒక్కక్షణం తొలగిపోగానే, భుజాల మీద ఎవరో పెద్ద బరువు దించినంత హాయిగా అనిపించింది.
సాయంత్రం గోపాల్ వస్తే సత్యమూర్తి మౌనంగా ఆహ్వానించాడు. “సార్, మీ చిత్రాలలో మార్పు గమనించే మిమ్మల్ని మా అమ్మ చిత్రం కోసం అడిగాను.
మీరు ఈ వయసులో ఇలా నిజాన్ని ఒప్పుకోవడం ఎంతో సంతోషం వేసింది. సార్, ఒకప్పుడు మీ చిత్రాల్లోని ఆత్మీయత కోసం మిమ్మల్ని అభిమానించాను. ఇప్పుడు మీ నిజాయితీని ఇంకా ఎక్కువగా గౌరవిస్తున్నాను” అన్నాడు ఆప్యాయంగా సత్యమూర్తి చేతుల్ని పట్టుకుని.
సత్యమూర్తి మనసు చాలా తేలిక అయ్యింది. తర్వాతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాల గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా నిజాన్ని దాచలేదు.
తన పాత చిత్రాలు తన చేతి కృషితో రూపుదిద్దుకున్నవని, ఇటీవలి చిత్రాల్లో AI సహాయాన్ని ఉపయోగించానని వివరించాడు. కొంతమంది ఆశ్చర్యపోయారు.
మరికొందరు నిరాశపడ్డారు. ఇంకొందరు ఆయన అనుభవాన్ని, కొత్త సాంకేతికతను కలిపి సృజన కొనసాగించడాన్ని అభినందించారు. సత్యమూర్తి అందరి స్పందనలనూ ప్రశాంతంగా స్వీకరించాడు.
ఆ రాత్రి తన చిత్రాల గదిలో కూర్చుని, వణుకుతున్న చేతులతో పాత కుంచెను నెమ్మదిగా తడిమాడు.
తనకు ఇక మునుపటిలా చిత్రాలు వేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ కళపై తన ప్రేమను, తన అనుభవాన్ని, తన నిజాయితీని మాత్రం కోల్పోవాల్సిన అవసరం లేదని అర్థమైంది.
ఇన్నాళ్లూ ఇతరుల కళ్లలో గొప్ప చిత్రకారుడిగా కనిపించాలనే తపనతో తన మనస్సాక్షి అడిగిన ప్రశ్నను తప్పించుకున్నాడు. ఇప్పుడు మాత్రం తనకు తానే సమాధానం చెప్పుకోగలుగుతున్నాడు.
తనపై ఉన్న ముద్రను కాపాడుకోవడం కంటే, తన మనస్సాక్షి ముందు తలెత్తుకుని నిలబడటమే నిజమైన కళాకారుడి గౌరవమని తెలుసుకున్నాడు.
కిటికీలోంచి వెన్నెల గదిలోకి ప్రవహిస్తోంది. సత్యమూర్తి ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. ఆ వెన్నెలలో ఆయన పాత చిత్రాలన్నీ మళ్లీ ప్రాణం పోసుకున్నట్లుగా కనిపించాయి.
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి కొన్ని ఇతర రచనలు:
డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు
సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.
ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.
గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.
కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .
అనేక సంకలనాలలో కథలు.
కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.
రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ













Comments