top of page
Original.png

వీడని అనుబంధం


వృద్ధురాలు భారతమ్మను అమ్మలా ఆదరించే సరోజ, శ్రీనివాస్ కుటుంబాన్ని చూపించే వీడని అనుబంధం కథా దృశ్యం

Veedani Anubandham - Telugu Family Story | Written By Kandarpa Murthy

వీడని అనుబంధం - తెలుగు కుటుంబ కథ | రచన: కందర్ప మూర్తి

Published In manatelugukathalu.com On 11/11/2026


రక్తసంబంధం లేకపోయినా మనసుతో ఏర్పడిన బంధం జీవితాంతం నిలుస్తుందని చెప్పే హృదయస్పర్శి కథ ‘వీడని అనుబంధం’. భారతమ్మ చూపిన మాతృత్వానికి సరోజ, శ్రీనివాస్ కుటుంబం కృతజ్ఞతతో నిలిచిన తీరు ఈ కథలోని ప్రధాన మానవీయ సందేశం.


"సరోజా! వంటగది, బెడ్రూం, హాలు ఉన్న ఇల్లు మూడు వేలు అద్దె చెబుతున్నారు. బస్టాపుకి కొంచెం దూరమే అనిపిస్తోంది. ఇంటి దగ్గర నుంచి ముందుగా బయలుదేరాలి. నువ్వు కూడా చూసి ఓకే అంటే అడ్వాన్స్ ఇద్దాం," అన్నాడు శ్రీనివాస్.


శ్రీనివాస్ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. సరోజ కూడా ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా జాబ్‌లో ఉంది. వారికి ఈమధ్యనే వివాహమైంది. మధ్యతరగతి కుటుంబాలైనందున గ్రామాల నుంచి బ్రతుకుతెరువు కోసం పట్నంబాట పట్టారు.


వారిద్దరి మధ్య పరిచయం కూడా విచిత్రంగా ఏర్పడింది. సరోజ ఊళ్లో హైస్కూలు లేనందున శ్రీనివాస్ ఊరికి సైకిలు మీద వస్తుండేది. శ్రీనివాస్ కాలేజీ చదువుల కోసం సైకిలు మీద పట్నం వెళ్లేవాడు. ఊరి పొలిమేరలో వాళ్ల సైకిళ్లు ఎదురుపడేవి. 


వెనక సీటు మీద స్కూలు బుక్స్, ముందు బాస్కెట్‌లో టిఫిన్ క్యారేజీతో, రెండు జడలేసుకుని లంగాఓణీతో సైకిలు తొక్కుతూ వస్తుంటే... దారిలో శ్రీనివాస్ తదేకంగా చూస్తూ కాలేజీకి సైకిలు మీద వెళ్లేవాడు. కానీ ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు.


ఒకసారి దారిలో సరోజ సైకిలుకి పంక్చరై, టైర్లో గాలి పోయి కాలినడకన తోసుకుంటూ వస్తోంది. అది చూసి శ్రీనివాస్ తన సైకిలు ఆపి, "ఏమైంది?" అని అడిగాడు.


"టైర్లో గాలి పోయింది," అని సిగ్గుతో మెల్లిగా చెప్పింది.


శ్రీనివాస్ సైకిలు స్టాండ్ వేసి సరోజ సైకిలు టైర్ చూస్తే... ఏదో గుచ్చుకుని గాలి పోయింది. అక్కడికి సగం దూరంలో ఉంది సరోజ హైస్కూలు.


"మీకు అభ్యంతరం లేకపోతే నా సైకిలు మీద మిమ్మల్ని స్కూలు దగ్గర దింపి, మీ సైకిలు రామాలయం సైకిలు రిపేరు షాపు దగ్గర ఇస్తాను. స్కూలు అయిపోయిన తర్వాత సైకిలు తీసుకెళ్లండి. ఆ సైకిలు మెకానిక్ నాకు మిత్రుడే, మీ దగ్గర డబ్బులు తీసుకోడు," అని సరోజ సైకిలు రిపేర్‌కి ఇచ్చాడు.


తర్వాత నుంచి దారిలో ఎదురుపడినప్పుడు పలకరించుకునేవారు. శ్రీనివాస్ ఎప్పుడూ చొరవ తీసుకుని మాట్లాడింది లేదు. పిదప సరోజ హైస్కూలు పూర్తయి ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసింది. శ్రీనివాస్ కామర్స్ డిగ్రీ, తర్వాత పీజీతో పాటు అకౌంటెంట్ టెస్టులు పూర్తి చేసి, పట్నంలో ప్రైవేటు కంపెనీ అకౌంటెంట్‌గా జాబ్ సంపాదించాడు.


సరోజకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు పెద్దవాళ్లు. ఒకసారి సైకిలు మెకానిక్ సుబ్బు ఏదో పనిమీద సరోజ ఊరికి వచ్చినప్పుడు కిరాణా షాపు దగ్గర సరోజ తారసపడింది. 


మాటల సందర్భంలో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. అదే విషయం సుబ్బు తిరిగి వచ్చి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు చెప్పగా, ఇరు కుటుంబసభ్యులు అన్నీ సంప్రదించుకుని పిల్లల అంగీకారం మేరకు పెళ్లి వైభవంగా జరిపారు.


పెళ్లైన తర్వాత ఇద్దరూ పట్నంలో కాపురం పెట్టారు. ఇద్దరివీ ప్రైవేటు జాబులైనందున జీతాలు పెద్దగా రావు. ఈ కరువు రోజుల్లో సంసారాలు సాగాలంటే భార్యాభర్తలు కష్టపడాల్సిందే.

సరోజ కూడా ఇల్లు చూసి సౌకర్యంగా ఉన్నందున అడ్వాన్స్ ఇచ్చారు. 


ఒక మంచిరోజు చూసి పాలు పొంగించి అద్దె ఇంట్లోకి ప్రవేశించారు శ్రీనివాస్, సరోజ దంపతులు.


కొత్తగా పెళ్లైన దంపతులని తెలిసి ఇంటి యజమాని భారతమ్మ వారిని ఆశీర్వదించి, "మా ఇంట్లో ఉండగానే బాబునో పాపనో ఎత్తుకోవాలి," అని హాస్యమాడింది. సరోజ సిగ్గుతో ముసిముసి నవ్వులు రువ్వింది.


కొత్త సంసారం కనుక శ్రీనివాస్ పెద్దగా లగేజి తెచ్చుకోలేదు. చాప, పరుపు, తలగడలు, రోజూ వాడుక పాత్రలు, బకెట్లు వంటివి సమకూర్చాడు. వారి ఆర్థిక సమస్యలు తెలిసిన ఇంటి ఓనరు భారతమ్మ తమ ఇంటి స్టోరురూములో ఉన్న పట్టెడమంచం పైకి తీయించి, కొత్త నవారు బిగించి కొత్త దంపతుల గదికి చేర్చింది. 


ఇంకా తన ఇంట్లో వాడకుండా ఉన్న పాత్రలను శుభ్రం చేయించి సరోజకు అప్పజెప్పింది. ఆవిడ ఆప్యాయ అనురాగాలకు మురిసిపోయారు శ్రీనివాస్ దంపతులు.


రోజూ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, టిఫిన్ బాక్సులు పట్టుకుని టైము ప్రకారం ఎవరి డ్యూటీలకు వారు బయలుదేరేవారు. 


కొళాయి నీళ్లు వారు డ్యూటీలకు వెళ్లిన తర్వాత వస్తున్నాయి కనుక, భారతమ్మ వాడుక నీళ్లు డ్రమ్ములోనూ, తాగే నీళ్లు బిందెలు, ప్లాస్టిక్ కేన్లలో నింపి పెడుతుంది.


రోజులు గడుస్తున్నాయి. సెలవు రోజుల్లో భార్యాభర్తలు ఇంటి దగ్గర, అప్పుడప్పుడు సొంత ఊళ్లకు వెళ్లి వస్తున్నారు. 


సమయం చిక్కినప్పుడు సరోజకు భారతమ్మతో కాలక్షేపం జరుగుతోంది. ఆవిడ ఇంట్లో టీవీ ఉండటంతో అలా కొంతసేపు గడిచిపోతోంది. కంపెనీ ఆఫీసులో పని ఎక్కువ ఉంటే శ్రీనివాస్ ఆలస్యంగా ఇంటికి వస్తే తోడుగా ఉంటోంది.


శ్రీనివాస్ దంపతులు భారతమ్మ ఇంట్లో అద్దెకు దిగి ఆరు నెలలు దాటాయి. నెల జీతం అందగానే ఆవిడకు అనుకున్న ప్రకారం అద్దె డబ్బు ఇచ్చేస్తారు. భారతమ్మ కూడా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.


ఇక్కడ భారతమ్మ గురించి చెప్పాలి. ఆవిడ భర్త జోగయ్య రైసు మిల్లులో కూలీగా పనిచేసేవాడు. ముసలితల్లి ఉంటే ఆమెను సాకుతూ రోజులు వెళ్లదీసేవాడు. 


కొద్ది రోజుల తర్వాత జోగయ్య తల్లికి తీవ్ర అనారోగ్యం చేసింది. ఆవిడకు వెనక సహాయం ఎవరూ లేరు. జోగయ్య మిల్లు పనికి వెళ్లకపోతే ఓనరు ఉద్యోగంలోంచి తీసేస్తానని భయపెట్టేవాడు. తల్లికి డాక్టరు ఖర్చులకు బోలెడు డబ్బు అవసరమవుతోంది. తను మిల్లు పనికి వెళ్లకపోతే జీతం రాదాయె!


ఇలా ఇబ్బందులు పడుతున్న సమయంలో అదే పేటలో ఉండే కాశయ్య కూతురు భారతి, ముసలమ్మ పరిస్థితి తెలిసి రోజూ రెండు పూటలా సేవలు చేసి గంజి కాచి పోసేది. కొన్నాళ్లకు ముసలమ్మ ఆరోగ్యం కుదుటపడి తన పనులు తాను చేసుకోగలిగే శక్తి తెచ్చుకుంది.


కాశయ్య అవిటివాడు, ఏ పనీ చేయలేడు. కూతురు భారతే కూలిపనులు చేస్తూ తండ్రిని పోషిస్తోంది. జోగయ్య ముసలితల్లి, భారతి దయాగుణం, మంచితనం చూసి కోడలిగా చేసుకోవాలని కొడుక్కి చెప్పింది. భారతి సేవాభావం, మంచి గుణం తెలిసి పెళ్లికి ఒప్పుకోగా వారికి పెళ్లి జరిగి, అవిటి కాశయ్యను తమతో ఉంచుకున్నారు.


ఇప్పుడు జోగయ్య పనిచేసే ధాన్యం మిల్లులో భారతి కూడా పనికి కుదురుకుంది. భార్యాభర్తలు మిల్లు పనికి పోతే రేకుల ఇంట్లో ముసలమ్మ, అవిటి కాశయ్య ఉంటున్నారు. জোగయ్య, భారతి ధాన్యం మిల్లులో కష్టపడుతూ పండుగలప్పుడు వచ్చే బోనస్ డబ్బులు, ఇతరత్రా డబ్బులు కూడబెడుతూ ముందుచూపుగా కొంత మదుపు చేసేవారు.


కాలగమనంలో భారతి గర్భం దాల్చి మగపిల్లాడిని కన్నది. ఇప్పుడు ముసలమ్మ, అవిటి కాశయ్యతో పాటు చంటిపిల్లాడితో ఇల్లు ఇరకాటమైంది. అప్పుడు కొంచెం పెద్దఇల్లు అవసరమైంది. ఇంతలో వారి బస్తీలో ఒక రెండు గదుల ఇల్లు అమ్మకానికి వచ్చింది. 


భారతి తన మంచితనంతో ఆ ఇంటిని తక్కువ ధరకు బ్యాంకులో దాచిన డబ్బుతో కొనుగోలు చేయించింది. అందరూ కొత్త ఇంటికి మకాం మార్చారు.


కాలగమనంలో భారతి కొడుకు వెంకట్‌ను కాలేజీ చదువు చదివిస్తే, ఇంజనీరింగ్ చదివి ప్రయోజకుడై పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని కలకత్తాలో ఉంటున్నాడు. 


రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరుగా ముసలి ప్రాణాలు స్వర్గస్తులయ్యారు. తల్లిని తన వెంట రమ్మంటే... అక్కడి వాతావరణం తనకు సరిపోదని, తమ సొంత ఇంట్లోనే ప్రాణం వదులుతానని భీష్మించడంతో ఒంటరిగా తల్లిని ఇక్కడ ఉంచి, అన్ని సదుపాయాలు ఏర్పాటుచేసి వీలున్నప్పుడు వచ్చిపోతున్నాడు కొడుకు వెంకట్. 


అన్ని హంగులతో ఉన్న ప్రస్తుత ఇంట్లో ఒక భాగంలో తనుంటూ ఇంకొక భాగం అద్దెకు ఇచ్చింది భారతమ్మ.


శ్రీనివాస్ దంపతులు భారతమ్మ ఇంట్లోకి వచ్చి సుమారు సంవత్సరం అయిపోయింది. భారతమ్మతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్యలో భారతమ్మ కొడుకు కుటుంబంతో తల్లిని చూడటానికి వచ్చాడు.


భారతమ్మ కొడుకు వెంకట్ పెద్ద హోదా ఉద్యోగంలో ఉన్నా ఎంతో కలుపుగోలుగా ఉంటాడు. 


అతని భార్య మాత్రం కొంచెం గర్విష్టిలా ఉంటూ కుటుంబసభ్యులను చిన్నచూపు చూస్తుంటుంది, లేబర్ క్లాసని హేళనగా మాట్లాడుతుంది. అత్తగార్ని ఈ లేబర్ బస్తీలో ఇంటిని అమ్మేసి సిటీలో అపార్ట్‌మెంట్ తీసుకోమని చెప్పినా వినడం లేదని కోపం. 


అందువల్ల వెంకట్ బలవంతం మీద లేబర్ బస్తీకి వచ్చింది. తన కొడుకు ఈ లేబర్ బస్తీ చూడకూడదని వెంట తీసుకురాలేదు. కొడుకు కోసం భారతమ్మ కోడలితో ఘర్షణ పెట్టుకోకుండా సహనంగా ఉంటోంది.


కొద్ది రోజులు అతికష్టం మీద తల్లితో గడిపిన వెంకట్, భార్య ఒత్తిడి మేరకు తిరిగి వెళ్లక తప్పలేదు. కనీసం మనవడిని కూడా తల్లికి చూపలేకపోయానని బాధపడ్డాడు. 


భారతమ్మ మనవడిని ఫోటోలో చూసింది తప్ప, ప్రత్యక్షంగా వాడి ముద్దు మురిపాలకు నోచుకోలేకపోయింది. 


చెమటోడ్చి కొడుకు చదువుల కోసం డబ్బు ఖర్చు చేసి పెద్ద చదువులు చదివిస్తే... ప్రయోజకుడై తమను ముసలి వయసులో ఆదుకుంటాడనుకున్న ఆశలు నిరాశలయ్యాయి. 


పెద్ద కుటుంబం నుంచి వచ్చిన కోడలు చేతిలో బొమ్మలా తయారయ్యాడు. కొడుకు ఎక్కడున్నా కుటుంబంతో సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది భారతమ్మ.


శ్రీనివాస్, సరోజ వచ్చినప్పటి నుంచి వారి అన్యోన్యత, తన పట్ల చూపే ఆదరణకు భారతమ్మ ఎంతో మురిసిపోతోంది. వారికి ఎటువంటి లోటూ లేకుండా సొంత మనుషుల్లా చూస్తోంది. వారితో తన కష్టసుఖాలు మాట్లాడుతుంది.


సరోజ నెల తప్పింది, ఇప్పుడు మూడో నెల గర్భంతో ఉంది. ఆ విషయం తెలిసి భారతమ్మ మురిసిపోయింది. తన కూతురే నీళ్లోసుకున్నంత ఆనందపడింది. సరోజకు ఏది ఇష్టమో అది తెలుసుకుని తినిపిస్తోంది. నీటి బకెట్లు, మరే బరువు పనులు చేయకుండా తను సహాయం చేస్తోంది.


సరోజకు కూడా కన్నతల్లి లాంటి భారతమ్మ ప్రేమాభిమానాలు చూసి ఆనందపడుతోంది. ఎందువల్లనంటే... సరోజకు ఐదేళ్ల వయసులో తల్లి చనిపోతే తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. 


తనకు సంతానం కలగనంత వరకు తనను బాగానే చూసిన పిన్ని, తర్వాత తమ్ముడు, చెల్లి పుట్టిన తర్వాత నుంచి తనను ఏదో కారణంతో తిడుతూ బాధపెట్టేది. మరొక మార్గం లేక అక్కడే పెరిగి పెద్దదైంది. పిన్ని దగ్గర దొరకని అమ్మ ప్రేమ భారతమ్మ తీరుస్తోంది.


శ్రీనివాస్ మగపిల్లవాడే పుడతాడంటే, "లేదు... నాకు అమ్మాయే కావాలి," అని సరదాగా వాదులాడుకోవడం విన్న భారతమ్మ, "బాబూ! ఈ రోజుల్లో ఆడపిల్లే నయం అనిపిస్తోంది. 


అత్తారింట్లో ఉన్నా అమ్మానాన్నల గురించి తలుస్తుంది. కొడుకులు వయసొచ్చి పెళ్లవగానే పెళ్లాం కొంగు పట్టుకుని కనిపెంచిన అమ్మానాన్నలను దూరంగా పెడుతున్నారు. 


అందుకు నా కొడుకే సాక్ష్యం. కొడుకులు అమ్మానాన్నలను ఆదరించి చూసేది చాలా తక్కువగా వస్తారు ఈ రోజుల్లో," అంది. 


భారతమ్మ మాటలు విన్నవారు మిన్నకుండిపోయారు.

పల్లెటూళ్లో సరోజ పిన్ని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే, ఉద్యోగస్తుడితో పెళ్లి జరగడం సహించలేకపోతోంది. సరోజ భర్తతో వచ్చినా ఇదివరకులా ఆదరణ చూపడం లేదు. 


తండ్రి కూడా ఏమీ అనలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల మునుపటిలా సరోజ తండ్రిని చూడాలనుకున్నా, అక్కడ జరిగే అవమానం తలుచుకుని వెళ్లడం తగ్గించింది.


ఇప్పుడు సరోజ నీళ్లు పోసుకుందని తెలిసి ఆరో నెలలో చేసే సీమంతం వేడుకను కూడా వదిలేసింది పిన్ని. ఈ తతంగమంతా చూస్తున్న భారతమ్మ, సరోజ సీమంతం తను ఘనంగా చేస్తానని, తనకి ఆడపిల్లలు లేనందున ఆ వేడుక తన ఇంటి వద్ద చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఆమె ఉదార హృదయానికి శ్రీనివాస్, సరోజ ఎంతో ఆనందించారు.


తమ కాలనీలోని ముత్తైదువులను పిలిచి సాంప్రదాయబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా కార్యక్రమం పూర్తి చేసింది. సరోజ పిన్ని చుట్టపుచూపుగా వచ్చి మొహం కనబరిచి వెళ్లింది. సరైన సదుపాయాలు లేనందున ఊళ్లో కాకుండా సరోజ ప్రసవం టౌన్లోనే జరపాలని నిశ్చయించాడు శ్రీనివాస్. అందుకు భారతమ్మ కూడా సంతోషించింది.


సరోజకు నెలలు నిండాయి. ఏమి కావాలో అవి చేసి తినిపిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది భారతమ్మ. డాక్టరు చెప్పిన డేటుకి సరోజను నర్సింగ్ హోమ్‌లో అడ్మిట్ చేశారు. సుఖప్రసవం జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది సరోజ. భారతమ్మ మిఠాయిలు తెప్పించి బస్తీలో అందరి నోళ్లు తీపి చేసింది.


సరోజకు, బిడ్డకు దిష్టి తీసి ఇంటికి తీసుకువచ్చింది భారతమ్మ. బాలింతకు చేయవల్సిన సేవలు అందిస్తూ పాపను జాగ్రత్తగా చూస్తోంది. చుట్టపుచూపుగా భర్తతో వచ్చి చూసిపోయింది సరోజ పిన్ని. సరోజ ప్రసవం ఖర్చులు మిగిలాయని మనసులో ఆనందపడింది.


సరోజ కూతురి నామకరణం కోసం తర్జనభర్జన జరిగి, చివరకు పాప పేరు భారతమ్మ పేరు 'భారతి'గా నిర్ధారణ చేసి, ఆ వేడుక ఇక్కడే చేయాలనుకున్నారు శ్రీనివాస్ దంపతులు. సరోజ కూతురి పేరు 'భారతి'గా నామకరణం జరిగింది. భారతమ్మ తన కడుపున పుట్టిన కూతురిలా సరోజకు సపర్యలు చేస్తూ పాపను సాకుతోంది. ఈమధ్య కాలంలో సరోజకు పుట్టింటి నుంచి రాకపోకలు తగ్గిపోయాయి.


పాప భారతికి మూడేళ్లు నిండాయి. పేరుకి సరోజ తల్లి కానీ ఆలనాపాలనా చూసేది భారతమ్మే! చలాకీగా ముద్దు ముద్దు మాటలతో ఇంట్లో సందడిగా ఉంటోంది.


ఈలోపున సరోజ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) పరీక్షలు రాసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ జాబ్ సంపాదించింది. శ్రీనివాస్ కూడా అకౌంటింగ్ ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ సంపాదించాడు. ఇద్దరూ ఉద్యోగాలలో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 


శ్రీనివాస్ వెహికల్ కొన్నాడు. సరోజ కూడా డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా స్కూటీ నడపగలుగుతోంది. వారి ఉన్నతిని చూసి భారతమ్మ మురిసిపోయింది. పెళ్లైన కొత్తలో వారు వచ్చినప్పటికీ, ఇప్పటికీ వారెంత అభివృద్ధి చెందిందీ తలుచుకుంటుంది.


కూతురు భారతిని ఎలాగైనా ఐఏఎస్ చదివించాలని నిశ్చయించారు శ్రీనివాస్ దంపతులు. 


అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పునాదులు వేయడం మొదలుపెట్టారు. కాన్వెంట్‌లో నర్సరీ, లోవర్, అప్పర్ కేజీ చదువులతో ఇంగ్లీషు మీడియంలో ప్రవేశపెట్టి, చదువులో స్టాండర్డ్ మైంటైన్ చేస్తున్నారు. వేషభాషల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


భారతికి ఐదు సంవత్సరాలు రాగానే సరోజ రెండవ కాన్పులో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు భారతమ్మ ఇల్లు పిల్లలతో సందడిగా మారి ఇరుకుగా తయారైంది. 


బ్యాంకులో లోన్ తీసుకుని సిటీలో మూడు గదుల అపార్ట్‌మెంట్ ఆధునిక హంగులతో ఏర్పాటు చేసుకున్నప్పటికీ... భారతమ్మ ఇంటితో అనుబంధం వదలలేకపోతున్నారు. 


దగ్గరగా మరో ఇల్లు అద్దెకు తీసుకుందామన్నా భారతమ్మ ఒప్పుకోవడం లేదు. పిల్లలతో ఆడుతూ ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటోంది. శ్రీనివాస్ దంపతులు కూడా భారతమ్మను వదిలి ఉండలేకపోతున్నారు. 


కష్టకాలంలో తమను ఆదుకున్న అమ్మలా చూసుకుంటున్నారు.

చివరకు భారతమ్మ ఇంటిపైన మరో అంతస్తు కట్టించి అందరూ ఒకేచోట కలిసి ఉండేలా చూశారు.


ఇప్పుడు భారతి పేరున్న కార్పొరేట్ హైస్కూలు చదువు పూర్తి చేసి డిగ్రీలోకి వచ్చింది. పొలిటికల్ సైన్స్, ఇతర సబ్జెక్టులలో ప్రిపేర్ అవుతోంది. 


డిగ్రీ అవ్వగానే సిటీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ప్రవేశపెట్టి, కావలసిన స్టడీ మెటీరియల్స్ ఏకాగ్రతతో చదవడానికి బందోబస్తు చేశారు. కుమారి భారతి కూడా పట్టుదలగా ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో కృషి చేస్తూ చదువుతోంది.


ఐఏఎస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్‌లో మెరిట్ ర్యాంక్ సంపాదించగలిగింది భారతి. శ్రీనివాస్, సరోజ దంపతులతో పాటు భారతమ్మ ఆనందానికి అంతులేకుండా పోయింది. తన మనవరాలు కలెక్టరని వాడంతా సందడి చేసింది. 


బస్తీలోని కార్మిక జనం కూడా తమ బస్తీ బిడ్డ పెద్ద హోదా ఉద్యోగం సంపాదించిందని సంబరపడ్డారు.


భారతి తమ్ముడు హేమంత్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భారతికి డిప్యూటీ కలెక్టర్‌గా సొంత రాష్ట్రంలోనే అపాయింట్‌మెంట్ లభించింది. 


డిప్యూటీ కలెక్టర్ హోదాలో అమ్మానాన్నల, భారతమ్మ ఆశీర్వాదం తీసుకుంది. డిప్యూటీ నుంచి కలెక్టరు హోదాలో తన ప్రతిభను కనబరుస్తూ... బస్తీలో పెరిగినందున బడుగు, బలహీన వర్గ ప్రజల మౌలిక అవసరాలు తీరుస్తూ అందరి మన్ననలు పొందుతోంది భారతి.


భారతి తమ్ముడిని ఎం.ఎస్. చదవడానికి అమెరికా పంపింది. తనకు బంగ్లా, కారు ఇచ్చినందున తనతో పాటు వచ్చి ఉండమంటే... వార్ధక్యంలో భారతమ్మను వదిలిరావడానికి ఇష్టపడక బస్తీలోనే కాలక్షేపం చేస్తున్నారు శ్రీనివాస్, సరోజ దంపతులు.


భారతమ్మ కొడుకు వెంకట్ తల్లిని దూరం పెట్టి రాకపోకలు మానుకున్నాడు. భారతమ్మ కూడా తన అంతిమ ఘడియలు సరోజ, శ్రీనివాస్ దంపతుల సమక్షంలోనే సాగిపోవాలని కోరుకుంది.

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. 


శ్రీనివాస్, సరోజ తమ ఉద్యోగ విరమణ పొంది హాయిగా విశ్రాంత జీవితాలు సాగిస్తున్నారు. గ్రామాల నుంచి చిన్న కుటుంబాలలో, ఆర్థిక ఇబ్బందుల్లో పెరిగిన తమకు వార్ధక్యంలో ఇంతటి చక్కటి ప్రశాంత జీవితాలను ప్రసాదించిన దేవుడిని తలుచుకుని మనశ్శాంతి పొందుతున్నారు. సమాజానికి వారు చేయగలిగిన ఆర్థిక, సామాజిక సేవలు అందిస్తున్నారు.


ఇప్పుడు ముసలమ్మ భారతమ్మ వయసు ఎనభై సంవత్సరాలు. జుట్టు నెరిసి, కాలగమనంలో ఎన్నో కష్టాలు, ఒడుదుడుకులు చూసింది. 


కంటిచూపు తగ్గి, చెవులు వినిపించకపోయినా, చేతులు వణుకుతున్నా, నోట్లో దంతాలు ఊడి బోసినవ్వులతో కర్ర పట్టుకుని నడుస్తూ... ఇంకా ఏదో సేవ చేయాలని తాపత్రయపడుతోంది.


కడుపున పుట్టిన కొడుకు ఒంటరిగా వదిలేసినా... ఏ బంధం లేని సరోజ, శ్రీనివాస్ కుటుంబం ఆప్తులై, విడదీయలేని అనుబంధం ఏర్పడిందని ఆనందపడుతోంది భారతమ్మ!


- కందర్ప మూర్తి

సమాప్తం









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page