వెన్నెల భ్రమ
- Karlapalem Hanumantha Rao

- Jun 14
- 5 min read
వెన్నెల భ్రమ, కర్లపాలెం హనుమంతరావు, తెలుగు కథ, మానసిక కథ, గ్రామీణ కథ, సస్పెన్స్ కథ, హాస్య కథ, భ్రమ, అపార్థం, ఉత్కంఠభరిత కథ, తెలుగు సాహిత్యం, చిన్న కథ, వెన్నెల, రామనాథం, జానకమ్మ, తెలుగు వెబ్ మ్యాగజైన్

Vennela Bhrama - Telugu Suspense Story | Karlapalem Hanumantha Rao
వెన్నెల భ్రమ - తెలుగు సస్పెన్స్ కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 14/06/2026
వెన్నెల భ్రమ ప్రముఖ రచయిత కర్లపాలెం హనుమంతరావు గారి ఆసక్తికరమైన మానసిక-హాస్య కథ. ఒక సాధారణ గ్రామీణ ఇంటిలో ప్రారంభమైన పరిచయం, క్రమంగా రహస్యమయమైన సంఘటనగా మారి పాఠకుడిని ఉత్కంఠలో ముంచెత్తుతుంది. వెన్నెల చెప్పిన కథలు, జానకమ్మ ప్రవర్తన, తెరిచి ఉన్న కిటికీ, అదృశ్యమైన వేటగాళ్ల కథ—ఇవన్నీ కలిపి రామనాథం మనసులో భ్రమలను ఎలా సృష్టించాయో రచయిత చమత్కారంగా చిత్రించారు. భయం, ఊహలు, అపార్థాలు మరియు చివర్లో వెలుగులోకి వచ్చే అసలు నిజం పాఠకుడికి నవ్వుతో పాటు ఆలోచనను కూడా మిగులుస్తాయి.
"మా అత్త ఇప్పుడే వస్తుందండి బాబూ, ఈలోగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం రండి!" అంది ఆ పదిహేనేళ్ల పిల్ల. పేరడిగితే 'వెన్నెల' అని చెప్పింది. ఆ వయసుకే ఆ పిల్ల ముఖంలో ఎక్కడలేని గడుసుదనం కనిపిస్తోంది.
రామనాథం ఆలోచనలో పడ్డాడు. పిల్లను మెప్పించేలా ఎలా మాట్లాడాలో అతనికి పాలుపోలేదు. అసలే నరాల బలహీనతతో బాధపడుతూ, ప్రశాంతత కోసం ఈ పల్లెటూరికి వచ్చాడు తను. ఇలా అస్సలు పరిచయం లేని కొత్తవాళ్ల ఇళ్లకు వెళ్లి కలవడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందా?
ఇక్కడికి బయల్దేరే ముందు అక్క అన్న మాటలు గుర్తొచ్చాయి రామనాథానికి. "నువ్వక్కడిదాకా వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూల ముంగిలా కూర్చుంటే నీ జబ్బు ఇంకా ఎక్కువవుతుంది. నాకు తెలిసిన వాళ్లందరికీ నిన్ను గురించి నాలుగు ముక్కలు రాసి ఇస్తున్నాను. వాళ్లంతా చాలా మంచివాళ్లు. ప్రేమగా చూసుకుంటారు."
ఇప్పుడు తను వచ్చిన జానకమ్మ గారి ఇల్లు ఆ 'మంచివాళ్ల' జాబితాలోకి వస్తుందో లేదో అని రామనాథం మధన పడుతున్నాడు. చొరవగల పిల్ల.. ముందు వెన్నెలే మాట కలిపింది.
"ఈ ఊళ్లో మీకు ఎవరైనా బాగా తెలుసా అండీ?"
"ఊహూ... ఎవరూ తెలీదు" అన్నాడు రామనాథం కాస్త నిరాశగా. "నాలుగేళ్ల క్రితం మా అక్క ఇక్కడి గుడిసత్రంలో కొంతకాలం ఉంది. తనే ఇక్కడి కొందరి పేర్లు చెప్పి ఈ ఉత్తరాలు వాళ్ళకు ఇవ్వమంది."
"దట్ మీన్స్.. మా అత్త గురించి మీకు ఏమీ తెలీదన్నమాట?" అంది వెన్నెల గడుసుగా.
"అవును, మీ అత్త పేరు, ఈ ఇంటి అడ్రసు తప్ప మరేం తెలీదు" అని ఒప్పుకున్నాడు రామనాథం. ఆ గదిని చూస్తుంటే అక్కడెక్కడో మగవారి వస్తువులు, వాళ్ళ వాసన ఉన్నట్లు అనిపించింది అతనికి.
"సరిగ్గా మూడేళ్ల క్రితం మా అత్త జీవితంలో పెద్ద దారుణం జరిగింది. అప్పటికే మీ అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా" అంది ఆ పిల్ల.
"దారుణమా?!" రామనాథం ఆశ్చర్యపోయాడు. ఇంత ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో దారుణాలు జరిగాయంటే నమ్మబుద్ధి కాలేదు.
"ఇంత చలికాలంలో కూడా సాయంకాలం పూట ఆ పెద్ద కిటికీని ఎందుకు అలాగే బార్లా తెరిచి ఉంచామో తెలుసా?" అంటూ తోట వైపు తెరుచుకుని ఉన్న ఒక పెద్ద కిటికీని చూపించింది వెన్నెల.
"మరీ అంత చలిగా లేదే! అయినా ఈ కిటికీకి, ఆ దారుణానికి సంబంధం ఏంటి?" అడిగాడు రామనాథం.
"సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున... మా మావయ్య, ఇద్దరు అత్త ఇద్దరు తమ్ముళ్లు వేటకు వెళ్లారు. వాళ్లు ఈ కిటికీ గుండానే బయటకు వెళ్లారు. ఆ పోయిన వాళ్లు పత్తా లేకుండా పోయారు. ఇప్పటి దాకా తిరిగి రానే లేదు" వెన్నెల గొంతులో సన్నటి వణుకు మొదలైంది. "అడవికి అవతల ఉన్న పెద్ద చిత్తడి నేల దాటుతుండగా ముగ్గురూ అందులో పడి కూరుకుపోయారు. వాళ్ల శవాలు కూడా దొరకలేదు. అదే పెద్ద ఘోరం!"
కాసేపు ఆగి, కళ్లు తుడుచుకుంటూ మళ్లీ అంది "పాపం మా అత్త ఇప్పటికీ వాళ్లు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని, వాళ్ల వెంటే వెళ్లిన ఆ బుజ్జి కుక్కపిల్ల కూడా మళ్ళీ కనిపిస్తుందన్న నమ్మకంతో ఉంది. అందుకే ప్రతి రోజూ చీకటిపడే వరకు ఆ కిటికీని అలాగే తెరిచి ఉంచుతుంది. మావయ్య తన తెల్లటి కోటు భుజాన వేసుకుని వెళ్లడం, చిన్న తమ్ముడు ఆమెను ఆటపట్టించడానికి ఎప్పుడూ పాడే పాటను పాడుకుంటూ వెళ్లడం... అవన్నీ అత్త ఇప్పటికీ చెప్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇట్లాంటి చలి సాయంత్రాల్లో వాళ్లు నిజంగానే ఆ కిటికీలోంచి నడిచి వస్తారేమోనని నాకూ భయం వేస్తుంటుంది..."
రామనాథం ఒళ్లు జలదరించింది. అంతలోనే జానకమ్మ గారు హడావుడిగా గదిలోకి రావడంతో రామనాథం ఊపిరి పీల్చుకున్నాడు.
"రావడం కాస్త ఆలస్యమైంది బాబూ. మా భడవాయి నీకు బోర్ కొట్టించలేదు కదా?" అంది జానకమ్మ.
"లేదు లేదు, చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది" అన్నాడు రామనాథం భయపడుతూనే.
"ఆ కిటికీ తెరిచి ఉందని మీరేం అనుకోకండి. మా వారు, తమ్ముళ్లు వేటకి వెళ్లారు, ఇప్పుడే వచ్చేస్తారు. వాళ్లు ఎప్పుడూ ఈ కిటికీ గుండానే లోపలికి వస్తారు. ఇవాళ బురదలో తిరిగి వస్తారు కాబట్టి కార్పెట్ అంతా ఖరాబవుతుంది. మీ మగవాళ్లంతా ఇంతే కదండీ!" అంటూ జానకమ్మ చాలా హుషారుగా మాట్లాడసాగింది.
కానీ రామనాథానికి ఇదంతా నరకంలాగా ఉంది.. ఆవిడ పిచ్చెక్కి మాట్లాడుతోందని అనిపించింది. టాపిక్ మార్చడానికి చాలా తంటాలు పడ్డాడు. కానీ జానకమ్మ దృష్టి మాత్రం ఆ కిటికీ వైపే! బయట తోట వైపుకే వెళ్తోంది. 'ఛా! కరెక్ట్ గా ఈ రోజే ఈ ఇంటికి రావలసిందా?' అని రామనాథం తలబాదుకున్నాడు.
తన భయాన్ని దాచుకుంటూ, "డాక్టర్లు నన్ను అస్సలు టెన్షన్ పడకూడదన్నారు. ఎటువంటి పనీ పెట్టుకోకుండా పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ తిండి విషయంలో మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కో మాటగా ఉంది..." అంటూ తన రోగాల పురాణగ్రంధం విప్పాడు రామనాథం. సాధారణంగా అప్పుడే పరిచయమైన వాళ్లకు తన రోగాల గురించి చెబితే వినాలని ఉంటుందని ఓ అపోహ అతనికి.
"అవునా..." అంది జానకమ్మ ఆవలింతను బలవంతాన ఆపుకుంటూ. కానీ అంతలోనే ఆవిడ కళ్లు ఆనందంతో మెరిశాయి. "అదిగో! వచ్చేశారు! కరెక్ట్ గా టీ టయానికే వచ్చారు. ఒళ్లంతా బురద ఎలా వస్తున్నారో చూడండి!"
రామనాథం ఒక్కసారిగా వణికిపోయి, వెన్నెల వైపు తిరిగాడు. కానీ ఆ పిల్ల కళ్లు భయంతో పెద్దవై, కిటికీ వైపు గుడ్లప్పగించి చూస్తున్నాయి! ఆ చూపు చూసి రామనాథం గుండె ఆగినంత పనైంది. వణుకుతూనే వెనక్కి తిరిగి కిటికీ వైపు చూశాడు.
మసక చీకటిలో... ముగ్గురు మనుషులు తోటలోంచి కిటికీ వైపు నడిచి వస్తున్నారు. వాళ్ల చేతుల్లో వేట తుపాకులు ఉన్నాయి. ఒకరి భుజం మీద తెల్లటి కోటు వేలాడుతోంది. వాళ్ల వెనకాలే అలసిపోయిన ఒక బ్రౌన్ కలర్ కుక్కపెల్ల నీరసంగా నడుస్తోంది.
వాళ్లు ఇల్లు చేరుకోగానే, అందులో ఒక కుర్రాడు పాత పాటను గట్టిగా హమ్మింగ్ చేయడం వినిపించింది.
అంతే! రామనాథం దెయ్యాలను చూశానని నమ్మేశాడు. ప్రాణభయంతో గది బయటకు దూకి, సింహద్వారం గుండా, గేటు దాటి రోడ్డు మీదికి పరుగు లంకించుకున్నాడు. ఆ కంగారులో అటుగా సైకిల్ మీద వస్తున్న ఒకాయన రామనాథాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న పొదల్లో పడిపోయాడు.
తెల్ల కోటు వేసుకున్న జానకమ్మ భర్త కిటికీ గుండా లోపలికి వచ్చి, "ఒళ్లంతా బురద అయిందిలే వానలకి! తొందరగా ఆరిపోయిందిలే. ఇంతకీ మేం వస్తుంటే అలా ఉరుకులు పరుగుల మీద పారిపోయింది ఎవరు?"
"ఆయనా... ఎవరో రామనాథం అంట. వింత మనిషి. వచ్చినప్పటి నుంచి తన రోగాల గురించే వాగుడు. మీరు రాగానే దెయ్యం పట్టినట్టు పరిగెత్తాడు! కనీసం వెళుతున్నానని చెప్పను కూడా లేదు. మీకు నమస్కారం కూడా పెట్టలేదు" అంది జానకమ్మ నిష్టూరంగా.
"బహుశా మన బుజ్జి చూసి భయపడి ఉంటాడు. తనకు కుక్కలంటే చచ్చే భయమని ఇందాక నాతో చెప్పాడులే. ఒకసారి కాశీలో గంగానది ఒడ్డున వీధి కుక్కల గుంపు ఈయన వెంటబడితే, ప్రాణాలు దక్కించుకోవడానికి దగ్గర్లోని శ్మశానం గోతిలో దూకాట్ట. కుక్కల కాట్లాటలు అరుపుల గోల నుంచి తప్పించు కోడానికి రాత్రంతా ఆ గోతిలోనే జాగారం చేసాట్ట ఈ పెద్దమషి. ఆ భయం ఇంకా పోనట్టుంది!" నింపాదిగా చెప్పుకు పోతోంది వెన్నెల.
"తల్లీ తండ్రీ పోయిన షాక్ నుంచి పిల్ల ఇంకా తేరుకోనేలేదు. మళ్ళీ రేపొకసారి సిటీలో డాక్టరుకు చూపించుకు రండి" అంది జానకమ్మ మొగుడితో వెన్నెల వంక జాలిగా చూస్తూ!
***
సమాప్తం.
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.










Comments