కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
youtube link: https://youtu.be/d-1uaAF3W9E
'Viluva" Written By Madduri Bindumadhavi
సంతోషమంటే కేవలం డబ్బులోనో. విలాసాల్లోనో మాత్రమే దొరకదు.
మానవ సంబంధాల్లో, నిష్కల్మషమైన స్నేహం లో డబ్బుతో కొనలేని ఆనందం కలుగుతుంది.
ఈవిషయాన్ని చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు.
"ప్రియా రాత్రికి పెళ్ళికెళదాం.కాస్త నీకూ రొటీన్ వర్క్ నించి రిలీఫ్ !
ఎప్పుడూ టార్గెట్లు, ప్రాజెక్ట్ లాంచింగ్ ల గోలే కదా ! ...
ఫ్రెష్ గాలి పీల్చుకున్నట్టూ ఉంటుంది, నలుగురినీ కలిసినట్టూ ఉంటుంది" అన్నది
కూతురితో వైష్ణవి.
"అబ్బ నాకిష్టమైన కార్యక్రమం వస్తుంది టీవీలో..చూడాలి మమ్మీ. నాకు కూడా ఇవ్వాళ్ళొక్క రోజే కాస్త ఖాళీ దొరికింది. పెళ్ళిళ్ళంటేనే బోర్. అందులోనూ ముక్కూ మొహం తెలియని వాళ్ళకెళ్ళాలంటే ఇంకా బోర్! డ్రైవర్ ఉన్నాడుగా, నువ్వెళ్ళిరా. అన్నట్టు ఇంతకీ పెళ్ళెవరిది" అన్నది, ఒళ్ళు విరుచుకుంటూ... లాప్ టాప్ లో నించి తలెత్తకుండానే.
"నువ్వు పసిపిల్లగా ఉండగా నాతో కడపలో కలిసి పని చేసిన శర్మ అంకుల్ కూతురి పెళ్ళి, నాగోల్ లో" అన్నది.
"అమ్మో..అంటే దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం నీతో పని చేసినాయన కూతురి పెళ్ళా? అయినా ఇన్నేళ్ళ తరువాత నిన్నసలు ఆయన ఎలా ట్రేస్ చేశారు మమ్మీ? నీలాంటి కొలీగ్స్ ఆయనకి ఎంత మంది ఉండుంటారు? అందరినీ పిలుస్తారా?" అన్నది ఒళ్ళు విరుచుకుంటూ.
"అందరినీ కాదు. సర్వీసులో కానీ.. జీవితంలో కానీ కొంత మంది ముఖ్యులంటూ ఉంటారుగా ప్రతివారికీ? నేను కూడా అంకుల్ కి అలాంటి ఒక ముఖ్య వ్యక్తినే! మనుషుల మధ్యలో ఉండే బంధాల అవసరం, అందులో ఉండే అనుభవాల చీకటి వెలుగులు ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు. మనిషికి చదువు, డబ్బు, ఉద్యోగపు హోదాలే కాదు..అంతకంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలు. బేతాళుడి ప్రశ్నలు ఆపి, లేచి తయారవ్వు. సరదాగా అలా తిరిగొచ్చినట్టు ఉంటుంది".
"మొన్న మోజుపడి కొనుక్కున్నావు కదా...ఆ రాయల్ బ్లూ చీర కట్టుకో. ఎప్పుడూ ఆ దిండు గలీబులు( నైటీలు) వేసుకు తిరిగే దానివి ఎప్పుడు కట్టుకుందామని కొనుక్కుంటున్నావు అన్ని చీరలు! లే...లేచి తెములు" అన్నది.
*******
అప్పటికే సాయంత్రం 7 గం లు అయింది. చలి కాలం పొద్దు, చీకటి పడిపోయి రాత్రి తొమ్మిదైనట్టుంది. అప్పుడు బయలుదేరి బంజారా హిల్స్ నించి నాగోల్ వెళ్ళాలంటే...దాదాపు 23 కిలోమీటర్లు.... హీన పక్షం గంటన్నర పడుతుంది. ఇక ట్రాఫిక్ జాం ఉంటే..ఇంకో అరగంట అదనం!
ఒక్కతే బయలుదేరే జోష్ లేక, కార్లో కబుర్లు చెప్పుకోవటానికి తోడు ఒక మనిషి ఉంటుంది అని కూతురిని బయలుదేర దీసింది వైష్ణవి. 'కష్టమైనా సుఖమైనా మాట్లాడుకోవటానికి తనకంటూ ఒక మనిషి ఉండాలి అని ఈ తరానికి ఎలా అర్ధమౌతుందో'అనుకుంది స్వగతంగా!
"నేను కూడా ముందు నువ్వన్నట్టే పెళ్ళికి వెళ్ళటానికి బద్ధకించాను. వద్దనుకున్నాను కూడా. కానీ పాపం నా ఎడ్రెస్ పట్టుకుని నన్ను పెళ్ళికి పిలవటానికి ఆయన ఎంత శ్రమ పడి ఉంటారు? అదీ కాక ఈ మధ్య కాలంలో అసలు టచ్ లో కూడా లేము."
"ఆయన పిల్ల పెళ్ళి చేసి నన్ను పిలవకపోయినా, నాకు కనీసం తెలియదు. ఆ టైం కి మనం విదేశాల్లో ఉన్నామనుకో ఎటూ వెళ్ళలేం! ఇక్కడే ఉన్నానని తెలుసుకుని మరీ పిలిచారు. వెళ్ళకపోవటానికి నా దగ్గర సాకులు కూడా ఏం లేవు...ఒక్క చలికాలం రాత్రిపూట అన్నమాట తప్ప! అందుకే ఆయన చేసిన ప్రయత్నాన్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే బయలుదేరాను."
"మనుషుల మధ్యలో అనుబంధాలు సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో, మనకి ఎదురయ్యే కొన్ని ఇలాంటి ప్రయత్నాలు మనకి తెలియకుండా ఏవో సూచనలు చేస్తాయి" అన్నది కారులో కూతురితో వైష్ణవి.
"నీదంతా చాదస్తం మమ్మీ! ఎప్పుడో కలిసి పని చేసిన వ్యక్తి, మళ్ళీ జీవితంలో ఇంకోసారి నీకు కలుస్తారన్న నమ్మకం కూడా లేనప్పుడు ఈ బంధాలని మళ్ళీ తిరగతోడటంలో అర్ధం ఏమున్నది" అన్నది.
ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, పెళ్ళి హాల్ వచ్చేసింది.
"హమ్మయ్యా ఈ జిపిఎస్ ల పుణ్యమా అని ఎక్కువ వెతుక్కోకుండానే ఎడ్రెస్ దొరికింది" అనుకుంటూ లోపలికి దారి తీసింది వైష్ణవి.
శర్మ గారి బంధువులు తప్ప ఆఫీస్ కొలీగ్స్ ఎవరూ ఇంకా వచ్చినట్టు లేదు. మొహాలు గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ లోపలికి నడిచింది.
ఒక పెద్దావిడ భర్తతో సహా సోఫాలో కూర్చుని ఉన్నది. వైష్ణవిని చూస్తూనే, "బావున్నావుటే ? నీకు వీళ్ళు ఎలా పరిచయం? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి? అచ్ఛం మీ అమ్మ లాగే ఉన్నావు! దా కూర్చో" అంటూ తను జరిగి పక్కన చోటు చూపించి చేతిలో వైష్ణవి చెయ్యి గట్టిగా పట్టుకుని కంటి నిండా నీళ్ళతో పై నించి కిందికి ఆప్యాయంగా ఒళ్ళంతా తడుముతున్నట్టు చూసింది.
"నేను, శర్మ గారు కలిసి పని చేశాం అత్తయ్యా! అవును ఇప్పుడు నిన్ను చూస్తే గుర్తొస్తున్నది...ఆయన మీ చుట్టమని నాకు అప్పట్లో ఆఫీసులో చెబుతూ ఉండేవారు. నాకు కూడా నిన్ను చూస్తే భలే సంతోషంగా ఉందత్తయ్యా! నీకు ఒంట్లో ఎట్లా ఉంటున్నది"...లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ..పరిసరాలనీ, తనని తానూ మర్చిపోయి కబుర్లల్లో పడింది వైష్ణవి.
"మా చిన్నప్పుడు నువ్వూ..అమ్మా కబుర్లు చెప్పుకుంటూ మాకు బోలెడు పనులు నేర్పారు. నువ్వు సరదాగా అప్పుడు అనే దానివి గుర్తుందా అత్తయ్యా...గృహ ప్రవేశ ముహూర్తం పెట్టించుకు రమ్మంటే, మా ఆయన సత్రం ముహూర్తం పెట్టించుకొచ్చాడే ..వచ్చి పోయే వాళ్ళకి వండి వార్చలేక చస్తున్నానని! ఆ జోకులు ఇప్పుడు కూడా మేము పిల్లలతో చెప్పి నవ్వుకుంటూ ఉంటాం" అన్నది వైష్ణవి.
"అవునే మీ అమ్మ వెళ్ళిపోయి, నన్ను ఒంటరిదాన్ని చేసింది. దానికేం హాయిగా పువ్వల్లే వెళ్ళిపోయింది. అది వెళ్ళి పోయే ముందు రోజు 'దొడ్లో పూశాయి' అని బుట్టెడు మల్లె పువ్వులు పట్టుకొచ్చి నా ముందు పోసి మాల కడుతూ కూర్చుంది. మా అందరికీ తల్లో పెట్టి మురిసిపోయింది. మల్లె పువ్వులు చూస్తే మీ అమ్మే నా కళ్ళల్లో మెదులుతుంది. ఇన్నేళ్ళయినా అసలు మీ అమ్మ మరుపుకే రావట్లేదు" అని జ్ఞాపకాలలో ముంచి తేల్చి వైష్ణవిని వేరే లోకంలోకి తీసుకెళ్ళింది. అమ్మ స్మృతులతో వైష్ణవి కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి. వైష్ణవి ఒళ్ళంతా తడుముతూ 'ఒక్క హగ్ ఇవ్వవే! మీ అమ్మని హగ్ చేసుకున్నట్టుంటుంది' అని ఆవిడ చూపించే ప్రేమానురాగాల్లో తడిసి ముద్ద అయింది వైష్ణవి.
"అమ్మా....ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నాకే అమ్ముమ్మ కూతురిగా నీ పట్ల ఆవిడ చూపించిన ఆప్యాయత, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ గెశ్చర్స్ అపురూపంగా అనిపించాయి" అన్నది ప్రియ అమ్మ మొహంలో కనిపిస్తున్న కొత్త వెలుగుని కన్నార్పకుండా చూస్తూ!
ఇంతలో పెళ్ళి పెద్ద శర్మ గారు ..."మేడం బయలుదేరారా? ఎక్కడున్నారు? ఎడ్రెస్ తెలుసుకోవటం కష్టం అయిందా....కనుక్కుందామని మీకు ఫోన్ చేస్తున్నాను" అన్నారు.
"వచ్చేశానండి, ఇదిగో మీ పిన్ని గారితో మాట్లాడుతున్నాను" అన్న వైష్ణవి మాటతో, "వచ్చేశారా...అబ్బ నాకెంత సంతోషంగా ఉందో" అంటూ తన వాళ్ళందరిని పిలిచి వైష్ణవి పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని మాటలనిండా వ్యక్తపరిచారు.
మర్యాద లోపం అవుతుందేమో అని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న శర్మ గారిని చూసి "మమ్మీ నీ రాకని ఆయనెంతగా కోరుకున్నారో తెలుస్తున్నది" అన్నది ప్రియ.
పరిచయ వాక్యాలయ్యాక, డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి మెయిన్ షెఫ్ తో "వీరు మాకు బాగా కావలసిన వారు. దగ్గరుండి జాగ్రత్తగా భోజనం పెట్టండి. నేను అవతల రిసెప్షన్ సంగతి చూడాలి" అని మళ్ళీ హడావుడిగా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఆలస్యం అవుతుందని, రెండు మెట్లు ఒక సారి చొప్పున మెట్లన్నీ నిముషంలో ఎక్కేసి వెళ్ళిపోయారు.
ఇక శర్మ గారి తమ్ముళ్ళు, మేనల్లుళ్ళూ..ఒకరేమిటి అందరు నోరారా ఆప్యాయంగా మాట్లాడుతూ..రాత్రి ముహూర్తం దాకా ఉండండి అని చెప్పి చెప్పి వెళ్ళారు.
ఇంతలో "మీరు వైష్ణవి కదూ...చిన్నప్పుడు మన అమ్ముమ్మగారి ఊరు దంతలూరులో వేసవి సెలవుల్లో కలిసి ఆడుకునే వారం... నేను రామూని అని ఒకరు, నేను అమ్మన్నని అని ఒకరు, నేను వల్లిని" అని ఒకరు వైష్ణవిని చుట్టు ముట్టారు.
"మీరంతా ఈ పెళ్ళికి వస్తారని నాకు తెలియదు. మీకు శర్మగారు చుట్టమా? మా అమ్మ బాల్య స్నేహితురాలు కూడా కలిశారు. ఆవిడ ఆయనకి బంధువని అప్పట్లో చెబుతూ ఉండేవారు. కానీ ఆయనతో మీ బంధుత్వం నాకు తెలియదు" అని ఇక వారితో చిన్నప్పుడు ఆడిన కుంటి ఆట, మా తాత ఉత్తరం, దాగుడు మూతలాట, కళ్ళకి గంతలు కట్టుకుని 'వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ' ఆట....ఇలా ఒకటేమిటి... ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని మించి ఒకరు మరో లోకంలోకి వెళ్ళిపోయి అందరూ ఇంచు మించు ఆ వయసులోకి వెళ్ళిపోయి చుట్టు పరిసరాలని మర్చిపోయి హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవటం చూసిన ప్రియకి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది.
"ఎప్పుడూ సీరియస్ గా ఉండే మమ్మీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది. నిజమే మమ్మీ చెప్పినట్టు తిండి, బట్ట మాత్రమే కాదు. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, నిలబెట్టేవి చిన్నప్పటి జ్ఞాపకాలు, అయిన వారితో కాలం గడపటం. తమ పరుగుల జీవితంలో ఇలాంటివి ముఖ్యమని ఆలోచించే స్థితిలో లేము" అనుకుంది ప్రియ.
"నిజమే ఈ తరం యాంత్రికంగా, చదువే లోకంగా బతికేస్తున్నాం. మాకు ఇంత మంచి జ్ఞాపకాలు లేవు. ఇన్నేళ్ళయినా ఏ భేషజాలు లేకుండా నిర్మలమైన మనసుతో వాళ్ళు ఎంతా హాయిగా బాల్యాన్ని నెమరేసుకుంటున్నారో. మిత్రులని అనుకోకుండా కలిసిన అమ్మ మొహంలో ఈ ఆనందం, తృప్తి ఏమిచ్చి తీసికురాగలను" అనుకుంటున్న ప్రియతో...
"ఇక బయలుదేరుదామా? బాగా పొద్దుపోయింది. మనం ఇంటికి చేరేసరికి పదకొండు అవుతుంది. మళ్ళీ డ్రైవర్ గొడవ చేస్తాడు" అన్నది వైష్ణవి.
"ఫరవాలేదులే మమ్మీ, నేను అతనికి ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను. నీ ఫ్రెండ్స్ తో ఇంకొంచెం సేపు గడపాలంటే ఉందాం" అన్నది.
"వచ్చే నెల మా బాల్య స్నేహితురాలి కొడుకు పెళ్ళి ఉన్నదిట. అప్పుడు కలుద్దామనుకున్నాం. అందరూ ఈ ఊళ్ళోనే ఉంటున్నారుట. ఇక ముందు తరుచు కలుసుకోవచ్చు, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. ఇలా రాబట్టి ఈ విషయాలన్నీ తెలిశాయి."
"అసలు అప్పట్లో పెద్దయ్యాక మనం ఏమౌతామో, ఎక్కడుంటామో, ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఏమీ తెలియదు. అయినా తాము అలా ఎప్పటికీ కలిసే ఆడుకుంటామని, జీవితమంతా అలా మనం కోరుకున్నట్టే ఉంటుందని అనుకుంటాము. అదే అప్పటి అందమైన అమాయకత్వం!"
"ఎవరి జీవితంలో అయినా నిష్కల్మషమైన బాల్యంలో ఆడుకున్న మిత్రుల విలువే వేరు. స్కూల్లో, పెద్దయ్యాక కాలేజిల్లో కలిసి చదువుకున్న క్లాస్ మేట్స్ వేరు. మనం పెద్ద వాళ్ళమయ్యాక వీరిలో ఎవరు కలిసినా ఆనందమే కానీ...అమ్ముమ్మ గారి ఊళ్ళొ వేసవి సెలవుల్లో కలిసి ఆడుకున్న మిత్రులు...వారి విలువ వేరు" అన్నది వైష్ణవి కారులో చేరగిలపడుతూ!
"అవును మమ్మీ నాకు కూడా వాస్తవం ఇప్పుడే కళ్ళకి కట్టినట్టు తెలిసింది. ఇలా ఎవరైనా నీ పాత కొలీగ్స్, మిత్రులు ఆహ్వానిస్తే అవకాశాన్ని బట్టి తప్పకుండా నేను నీతో వస్తాను" అన్నది ప్రియ మనస్ఫూర్తిగా!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
Comments