top of page

అడగందే అమ్మయినా పెట్టదు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Adagande Ammaina Pettadu' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి

మనిషి సంఘ జీవి.

తన సుఖాలను నలుగురితో పంచుకుంటాడు.

పార్టీలు ఇస్తాడు. ఫంక్షన్ లు చేస్తాడు.

కానీ తనకు అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినపుడు ఇతరుల సహాయం అడగరు కొంతమంది. మొహమాట పడతారు.

కానీ అడగందే అమ్మయినా పెట్టదు కదా..

అవసరానికి ఇతరుల సహాయం తీసుకోవడం లో తప్పు లేదని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు.



బాల్య మిత్రులని కలిసి, వారితో హాయిగా తనివితీరా కబుర్లు చెప్పుకుని, తిరిగి కారులో ఇంటికి బయలుదేరాడు విష్ణు.

"నేను పంజగుట్ట వైపు వెళుతున్నాను. ఆ వైపు వెళ్ళేవారెవరయినా ఉన్నారా? డ్రాప్ చెయ్యాలా" అన్నాడు మధు.

"నీ రూట్ అదే కదరా, మధు కార్లో వెళ్ళు విష్ణూ" అన్నాడు రాజేష్ .

అలా మధు కార్లో ఎక్కాడు విష్ణు.

మధు రాజేష్ కి కజిన్. విష్ణుకి పెద్దగా పరిచయం లేదు. అందుకే కార్లో పక్క పక్కనే కూర్చున్నా, పెద్దగా మాటల్లేవు వారిద్దరి మధ్య.

మధు ఎవరితోనో ఫోన్ లో కబుర్లు చెబుతు గట్టిగా నవ్వుతున్నాడు.

విష్ణుకి హఠాత్తుగా డ్రైవర్ ఎందుకో మసక మసకగా కనిపిస్తున్నాడు. 'కళ్ళ అద్దాలకి నూనె జిడ్డు అంటినట్టుంది. ఇందాక మనోహర్ మిర్చి బజ్జి చేతితో భుజం మీద తట్టబోయి, కళ్ళ జోడు మీద చెయ్యేశాడు ' అనుకుంటూ జేబులో రుమాలు తీసి తుడుద్దామనే ప్రయత్నం చేశాడు. చెయ్యి జేబులోకి సరిగ్గా వెళ్ళట్లేదు. 'ఓహొ డోసు కొంచెం ఎక్కువయినట్టుంది' అనుకుంటూ... మళ్ళీ ప్రయత్నించాడు.

ఈ లోపు కారుకి ఎవరో అడ్డం వచ్చారని డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ అడ్డం వచ్చిన మనిషి ఆడో, మగో స్పష్టంగా కనిపించలేదు విష్ణుకి.

'ఏమయింది నాకు ' అనుకుంటుండగా, ఛాతీలో నొప్పిగా ఉందనిపించింది. 'మీ ఇల్లు ఈ సందే కద సర్' అన్నారు మధు, డ్రైవర్ ఒకేసారి. విష్ణుని దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లోకెళ్ళి భార్యతో 'నాకేదో తేడాగా ఉందోయ్' అన్నాడు.

ఆ రోజు ఆదివారం. డ్రైవర్ రాడు. భర్త వాలకం చూసిన లక్ష్మి తనకి కలిగిన ఆదుర్దా మొహంలో కనబడనివ్వలేదు. భర్త విష్ణు....పైకి గంభీరంగా కనిపించే పిరికి మనిషి. తను కంగారు పడ్డట్టు కనిపిస్తే... అతను మరింత కంగారు పడచ్చు అని మనసులోనే అణిచేసుకుని... "ఆ:( ఏముండదు లెండి. ఎసిడిటీ అయుండచ్చు. 'చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి' అని మా నాన్న అంటూ ఉండేవారు. అందుకే చీకటి పడే లోపు ఓ సారి హాస్పిటల్ కి వెళ్ళొచ్చేద్దాం" అని చెప్పులేసుకుని, ఇంట్లో ఉన్న పదివేలు పర్సులో వేసుకుని, కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి బయలుదేరింది.

లక్ష్మి తలుపు లాగిన చప్పుడు గట్టిగా వినిపించి పక్క ఫ్లాట్ లో ఉండే శంకరం గారు బయటికొచ్చారు. విష్ణు వాళ్ళు బయటికెళ్ళటం చూసి 'ఆదివారం బయట పని మీద వెళుతున్నారులే' అనుకున్నారు.

*******

లక్ష్మి చూపించిన ఇన్స్యూరెన్స్ కార్డ్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి, తెలిసిన డాక్టర్ పేరు చెప్పటంతో లాంఛనాలన్నీ నిముషాల్లో పూర్తి చేసి ఇబ్బందిపెట్టకుండా వెంటనే ఎడ్మిట్ చేసుకున్నారు.

విష్ణు ఎడ్మిషన్ పూర్తి అయి, బెడ్ కేటాయించారు. అప్పుడు అవిరామంగా మోగుతున్న తన ఫోన్ తీసి చూసింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ పవన్ నించి ఐదారు మిస్డ్ కాల్స్.

"హలో పవన్ గారూ..చాలా కాల్స్ చేశారు. ఏమైనా అర్జెంటా?" అన్నది.

"ఆ:( ఏమి లేదు. మేము మీ ఇంటి వైపు వస్తున్నాము, ఇంట్లో ఉంటే ఒక సారి చూసి వెళదామని కాల్ చేశాను. చాలా సేపు నించి తియ్యట్లేదు..బిజీగా ఉన్నారా" అన్నాడు. జరిగిందంతా పవన్ కి చెప్పింది. "అయ్యో ఈ రోజు ఆదివారం కదా! డ్రైవర్ ఉన్నాడా? లేక ఒక్కరే హైరాన పడి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారా? ఒక్క కాల్ చెయ్యచ్చు కదండీ? పిల్లలు దగ్గర లేనప్పుడు ఉన్న వాళ్ళమే ఒకరికి ఒకరు తోడు! నేను ఆ ప్రాంతం లోనే ఉన్నాను, వచ్చి విష్ణుని హాస్పిటల్ కి తీసుకెళ్ళేవాడిని. ఇంతకీ డాక్టర్స్ ఏం చెప్పారు?" అంటూ "నేను వస్తాను..రాత్రికి తోడుగా ఉంటాను" అన్నాడు.

"ఇంకా టెస్ట్స్ ఏమీ చెయ్యలేదండి. ఆదివారం కదా...విజిట్స్ కి వచ్చిన డాక్టర్ వెళ్ళిపోబోతూ ఉండగా వచ్చాము. టెస్ట్స్ అయ్యాక కానీ ఏమీ చెప్పలేమన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తాను" అన్నది.

డాక్టర్ వచ్చి చూసి "రేపు మరిన్ని టెస్ట్స్ చెయ్యాలండి" అని చెప్పి వెళ్ళిపోయారు.

రాత్రి పొద్దుపోయేవరకు లక్ష్మి నించి ఫోన్ లేకపోయేసరికి, పవన్ ఉదయమే బయలుదేరి హాస్పిటల్ కి వెళ్ళాడు.

డాక్టర్ వచ్చి యాంజియో చేసి, పక్కనే ఉన్న లక్ష్మికి విడియో చూపించి..తన అనుమతితో వెంటనే స్టెంట్ వేశారు.

పవన్ వచ్చేసరికి ఆ కార్యక్రమం నడుస్తున్నది.

రాత్రంతా ఆదుర్దాతో గడిపిన లక్ష్మి మొహంలో అలసట బాగా తెలుస్తున్నది. పవన్ ని చూసి అప్పటిదాకా ఉగ్గపట్టుకున్న కంగారు గట్లు తెంచుకుని ఒక్కసారి గా కన్నీటి రూపంలో బయటపడింది.

"ఊరుకోండి లక్ష్మి గారూ... ధైర్యం గా ఉండండి. సరైన టైం కి ఆయన్ని తీసుకొచ్చారు. వైద్యం జరిగింది. ఇంక స్థిమిత పడండి. బ్రేక్ ఫాస్ట్ చేశారా? ఇదిగో ఇందిర మీ కోసం టిఫిన్ చేసి పంపింది. తినండి" అని బాక్స్ చేతికందించాడు.

"నిన్న ఆయన పరిస్థితి చూసి నిజంగా చాలా భయమేసిందండి. ఎవరికైనా ఫోన్ చెయ్యాలని, సహాయం అడగాలని తోచలేదు. ఏమీ గుర్తు కూడా రాలేదు. పక్కింటి వాళ్ళకి కూడా చెప్పలేదు. పాల ప్యాకెట్స్ బయటే ఉండుంటాయి" అన్నది.

"అదేనండి అందరం చేసే పొరబాటు! ఆ సమయంలో ఏమీ తోచదు. చిన్న విషయం కూడా గుర్తు రాదు."

"మీరు ఇడ్లీ తింటూ ఉండండి... మీకు ఒక తమాషా కధ చెబుతాను. మహా భారతంలో పాండవులని మాయా జూదం లో ఓడించి కట్టు బట్టలతో అడవులకి పంపించినప్పుడు, నువ్వు అక్కడే ఉండి కూడా 'అది మాయా జూదమనీ...కౌరవులు ఒక పధకం ప్రకారం పాండవులని మోసం చేస్తున్నారని చెప్పి ధర్మ రాజుని నువ్వు ఎందుకు నివారించలేదు' అని కృష్ణుడిని ఉద్ధవుడు ప్రశ్నించాడుట."

'ధర్మజుడు కౌరవులతో జూదం ఆడాలనుకున్నప్పుడు కానీ, ఆ పందానికి ఒప్పుకున్నప్పుడు కానీ నన్ను సంప్రదించలేదు. నా సలహా కావాలని కోరలేదు. అందువల్లనే నేను కలగ జేసుకోలేదు' అని కృష్ణుడు సమాధానమిచ్చాడుట.'

'మరి అదే సభలో వస్త్రాపహరణంతో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు, ఆవిడకి చీరలిచ్చి ఎందుకు రక్షించావు అని మళ్ళీ ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకి 'ద్రౌపది ఆర్తితో నా సహాయం అర్ధించింది. నేను తప్ప తనని ఎవ్వరూ రక్షించలేరు అని త్రికరణ శుద్ధిగా నమ్మింది. అందుకే అడిగిన వారికి సహాయం చెయ్యటం, నన్ను కోరని వారి విషయంలో కలుగ చేసుకోకపోవటం నా పద్ధతి ' అని శ్రీ కృష్ణుడు సమాధానం ఇచ్చాడుట'....ఈ కధ ఒకప్పుడు మీరే మాకు చెప్పారు గుర్తుందా" అన్నాడు.

"అలా ఒక్క మాట చెప్పి సహాయం అడిగి ఉంటే మీ పక్కింటి శంకరం గారు తోడొచ్చేవారు. ఇలా మీరు రాత్రంతా, కంగారుగా ఒంటరిగా ఉండే వారు కాదు" అన్నాడు పవన్.

"అవునండి..తలుపు చప్పుడు విని పాపం ఆయన తొంగి చూశారు కూడా" అన్నది.

"పోనీలెండి..గండం గడిచింది. మిగిలినవన్నీ తేలికగా తీసుకోవచ్చు. కానీ ఇక ముందు అవసరం వచ్చినప్పుడు (ఇలాంటిది మళ్ళీ రాకూడదని కోరుకుంటాను) మాత్రం మేమున్నామని మరచిపోకండి. "అడగందే అమ్మయినా పెట్టదని" తెలియందే ఎవ్వరం ఏం చెయ్యలేం కదా" అన్నాడు పవన్.

"అవునండీ నిజమే...చెప్పకపోవటానికి కంగారు తప్ప మరే కారణమూ లేదు" అన్నది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు



33 views0 comments

Comments


bottom of page