అహం బ్రహ్మాస్మి
- Madhupatra sailaja Uppaluri

- 8 hours ago
- 8 min read
తెలుగు ఆధ్యాత్మిక కథ, భక్తి కథ, తాత్విక కథ, వేదాంత కథ, విష్ణు కథ, దైవానుభూతి, ఆత్మజ్ఞానం,దరిద్ర నారాయణ సేవ, తెలుగు కుటుంబ కథ, Telugu Spiritual Story, Telugu Devotional Story, Vedanta Story Telugu, Mana Telugu Kathalu

Aham Brahmasmi - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri
అహం బ్రహ్మాస్మి - తెలుగు ప్రేరణాత్మక కథ| మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 20/06/2026
మనలో చాలామంది భక్తి అంటే దేవాలయాలు, పూజలు, తీర్థయాత్రలు, వ్రతాలు అని భావిస్తుంటారు. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటి? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? గుడిలోనా, గుండెలోనా?
"అహం బ్రహ్మాస్మి" కథ ఈ ప్రశ్నలకు హృదయాన్ని తాకే సమాధానం చెబుతుంది.
ప్రతి శనివారం నిరుపేదలకు అన్నదానం చేస్తూ, సేవలోనే దైవాన్ని దర్శించే విష్ణు ఒక రోజు రామాలయంలో పొందిన అపూర్వమైన అనుభవం అతని జీవితానికే కాదు, ఈ కథ చదివే ప్రతి ఒక్కరి ఆలోచనలకు కొత్త వెలుగును అందిస్తుంది.
భక్తి, మానవత్వం, సేవ, వేదాంతం కలిసిన ఈ అద్భుత కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది — భగవంతుడు కేవలం విగ్రహాల్లోనే కాదు, ప్రతి జీవిలోనూ ఉన్నాడని.
మరి విష్ణుకు రామాలయంలో దేవుని స్థానంలో తన ప్రతిబింబమే ఎందుకు కనిపించింది? ఆ దివ్యానుభూతి వెనుక ఉన్న "అహం బ్రహ్మాస్మి" అనే మహావాక్య రహస్యం ఏమిటి?
తెలుసుకోవాలంటే ఈ ఆధ్యాత్మిక కథను తప్పక చదవండి.
“శారదా! విష్ణు ఇంకా ఆఫీసు నుండి రాలేదా?” అని అత్తగారు సత్యవతి అడిగిన ప్రశ్నకి సమాధానంగా “అత్తయ్యా! ఈరోజు ఏ వారమో చెప్పండి?” అంటూ ఎదురు ప్రశ్నించింది శారద.
“ఈరోజు శనివారం కదా! ఉదయమే సుప్రభాతం కూడా రేడియోతో పాటు పాడుకున్నాను” అంది సత్యవతి.
“మరి శనివారంనాడు మీ అబ్బాయిగారు చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర కూర్చున్న బిచ్చగాళ్ళకు ఇవ్వటానికి ఫలహారాలు చేయించుకెడతారుకదా. మర్చిపోయారా! పొద్దున్నే అయిదు కిలోల పులిహార చేసి ఇచ్చాను. దాన్ని అందరికీ పంచితేనేగాని ఆయనకు ఇల్లు గుర్తుకు రాదు” అంది శారద.
“అవునే శారదా! ఆ దానధర్మాలు పూర్తయితేనేగాని విష్ణు ఇంటికి రాడు కదా. ఆ మాటే మర్చిపోయాను. ఏదో మీ మామయ్యగారి పుణ్యమా అని గంగా పుష్కరాలకు కాశీ వెళ్ళి, గంగా స్నానంచేసి విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణమ్మను, విశాలాక్ష్మిని దర్శించుకున్నాను. మీ మామయ్యగారు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలకు కూడా నన్ను తీసుకెళ్ళారు. ఇప్పుడు మా తోటికోడళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలసి గోదావరి పుష్కరాలకి బస్సు చేయించుకుని రాజమండ్రికి వెడుతున్నారు. వాడు ఇంటికి రాగానే ఓ మాట చెప్పి, ఒప్పుకుంటే వాళ్ళతోకలసి రాజమండ్రికి వెడితే గోదావరి స్నానం కూడా పూర్తవుతుందని నా మనసు ఉవ్విళ్ళూరుతోందే” అంది సత్యవతి.
“అత్తయ్యగారు! మీరు చాలా అదృష్టవంతులు. మామయ్యగారితో కలసి తీర్ధయాత్రలు చాలానే చేశారు. మా పెళ్ళయ్యాక మేం కనీసం తిరుమల వెళ్ళి ఆ ఏడుకొండలవాణ్ణయినా దర్శించుకోలేక పోయాం. ఎప్పుడు వెడదామన్నా ఆయన ఆ జనంలోకి రాలేను. తోసుకుంటూ, నెట్టుకుంటూ దైవదర్శనం చేసుకోవాలా? దరిద్రనారాయణులకి ఓ ముద్దపెడితే సంతోషంతో వెలిగిపోయే వారి ముఖంలో ఆ గోవిందుని దర్శనం అవుతుందంటూ ఇలా ప్రతి శనివారంనాడు ఇంట్లో ప్రసాదాలు వండించి గోవిందునికి నివేదించి, తీసుకెళ్ళి గుడిదగ్గర బిచ్చగాళ్ళకు పెట్టి ఆత్మానందాన్ని పొందుతూంటారు.
‘నా పూజాగదిలో ఉన్న గోవిందుని ఓ అరగంటసేపు తనివితీరా చూసుకుంటూ, మనసారా గోవిందనామాలు పాడుకుంటూంటే నా జన్మ ధన్యమయ్యిందనుకుంటాను. అదే నాకు తృప్తినిస్తుంది. నాకది చాలు’ అంటారాయన. అసలు ఇలాంటి మనోభావాలున్న ఈయనతో కలసి నేను జీవితంలో తీర్ధయాత్రలు చేయగలనా చెప్పండి అత్తయ్యగారు?” అంది శారద. భర్త ప్రవర్తన, స్వభావం మారవని తెలిసినా ఆ సామాన్య ఇల్లాలు తన బాధని అత్తగారితో పంచుకుంది.
“వంట పూర్తయ్యింది. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే సమయం కూడా అవుతోంది. ఈయన ఇంకా రాలేదు. ఈ రోజు గుళ్ళో ఎక్కువమంది ఉన్నారేమో?” అంది శారద.
“ఔనే శారదా! మనం వాడిని తప్పు పట్టకూడదు. మా మామగారు కూడా ఏ గుడికీ వెళ్ళేవారు కాదు. ఇల్లే కైలాసం అనేవారు. తన దేవుడు తన గుండెల్లోనే ఉన్నాడని ఆయన గట్టిగా నమ్మేవారు. ఎదుటివారి అవసరాలను గుర్తెరిగి వారు అడగకపోయినా తనకు తోచిన సాయమందించే వారు. వీడికి ఆ తాతగారి పోలికే వచ్చింది కాబోలు. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే రక్తదానం చేయటం, ఆఫీసులో అటెండర్ కొడుకు చదువుకి కాలేజీ ఫీజులు కట్టటం, మన ఎదురింటి పనిమనిషి కూతురి వివాహానికి పెద్ద మొత్తంలో సాయమందించటం వంటి పనులు వీడు చేస్తూండటం మనం చూస్తూనే ఉన్నాంగా.
పైగా ‘అమ్మా! నాన్నగారి పెన్షన్‌లో నీకు కావలసినంత వాడుకుని కొంతైనా నా ధర్మకార్యాలకి సాయమందించవే’ అని ముందరికాళ్ళకి బంధమేస్తూ ఉంటాడు పిచ్చిసన్యాసి. పోన్లేవే పతియే ప్రత్యక్ష దైవమన్న ఆర్యోక్తిని అనుసరిస్తూంటే వాడు చేసే పుణ్యఫలంలో నీకూ సగభాగం వస్తుంది కదా” అంది సత్యవతి నవ్వుతూ.
“మీ అబ్బాయిని మీరు బాగా సమర్ధిస్తారు అత్తయ్యగారు” అంది శారద ఉక్రోషంగా.
వీళ్ళ మాటలలోనే పిల్లలొచ్చేశారు. ఓ అరగంటకు విష్ణు వచ్చాడు. “గుళ్ళో బాగా జనాలు ఉన్నరేమిట్రా? బాగా ఆలస్యమయ్యింది” అంది సత్యవతి కొడుకునుద్దేశించి.
“లేదమ్మా! నేను వాళ్ళందరికీ ముందే చెప్పాను కదా. అందులోనూ వారంవారం ప్రసాదాలు కూడా పెడుతున్నాను. వాళ్ళంతా సమయానికి అక్కడకు జేరతారు. వెళ్ళిన పావుగంటకే నే తీసుకెళ్ళిన ప్రసాదాలు అయిపోయాయి. కానీ ఇంతలో ఓ పిల్లాడు, ఒక బిచ్చగాడి దగ్గరకు వచ్చి “అయ్యా తొందరగా పద. అమ్మకి జ్వరం వచ్చింది” అంటూ ఏడుస్తూ అతన్ని లాక్కెడుతున్నాడు. నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళి, ఆ తల్లిని ఆటోలో డాక్టర్‌గారి దగ్గరకు తీసుకెళ్ళి మందులిప్పించి వచ్చేసరికి ఈ సమయమయ్యింది. ఈ రోజు ఆఫీసులో ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బు ఆ కుటుంబ అవసరానికి ఉపయోగపడింది శారదా” అన్నాడు విష్ణు.
“చూశారా మీ అబ్బాయి వాలకం?” కళ్ళతోనే అత్తగారికి సైగచేస్తూ అంది శారద.
“ఒరేయ్! మరీ ఇంతగా దానధర్మాలు చేస్తే ఎట్లారా? నాలుగు డబ్బులు రాగానే, రేపు అన్నది లేకుండా ఈ విధంగా ఖర్చు పెట్టేస్తే, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉంటాయి. వాటి కోసం ఎవర్ని అడగాలి” అంది సత్యవతి.
అమ్మ మాటలకు “ఏమీ ఫరవాలేదమ్మా! మా అమ్మే నాకో ‘రిజర్వు బ్యాంక్’” అంటూ నవ్వుతూ లోపలికెళ్ళాడు విష్ణు.
అంతా భోజనాలు చేసాక “ఒరేయ్ విష్ణూ! లక్ష్మి పిన్నివాళ్ళంతా కలసి బస్ మాట్లాడుకుని, గోదావరి పుష్కర స్నానానికి రాజమండ్రి వెడుతున్నారురా. నువ్వెలాగూ నన్ను ఆ పుష్కర స్నానానికి తీసుకెళ్ళవు. ఆ జనాలు, రద్దీ తట్టుకోలేనని గొడవ పెడతావు. నాకేమో ఆ పుష్కర స్నానం మీదే ధ్యాసంతా. నాకూ వయస్సు అయిపోతోంది. ఈ రోజున్న ఓపిక రేపు ఉంటుందో లేదో చెప్పలేను. అందుకే నన్ను పిన్నీవాళ్ళతో పంపిస్తే, ఆ స్నానమేదో చేసి వస్తాను” అని ఆశగా అడిగింది సత్యవతి.
“అమ్మా! నాన్నగారితో కలసి ఎన్ని పుష్కర స్నానాలు చేసావే?. నీవు చేయని యాత్ర ఏమైనా ఉందా? ఇంకా తృప్తి కలగలేదామ్మా?. నిన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపటం నాకు ఇష్టంలేదు. నేనే నిన్ను ఆ స్నానానికి తీసుకెడతాను. దగ్గరుండి మరీ స్నానం చేయిస్తాను. హాయిగా నిద్రపో” అన్నాడు విష్ణు.
“శారదా! మనం పుష్కరాల మొదటి రెండురోజులలోనే వెళ్ళి స్నానం చేసి వచ్చేద్దాం. ఆతరువాత అయితే రద్దీ బాగా పెరుగుతుంది. నా స్నేహితునికి కడియంలో నర్సరీ, ఫాంహౌస్ ఉన్నాయి. వాడెప్పటినుండో రమ్మనమని గొడవచేస్తున్నాడు. అవకాశం వచ్చిందిగా. వాడిని చూసినట్లు అవుతుంది, అమ్మ కోరికా తీరుతుంది. వాడికి ఫోన్ చేస్తే అన్ని ఏర్పాట్లను వాడే చూసుకుంటాడు” అని చెప్పాడు విష్ణు.
అలా గోదావరి పుష్కరాల మొదటి రోజునే విష్ణు కుటుంబం రాజమండ్రి వెళ్ళి నదీ స్నానం తెల్లవారుఝామునే చేసివచ్చిన తరువాత, పుష్కర ఘాట్ దగ్గరగా వున్న దేవాలయాలను పిల్లలతో కలసి దర్శించుకుంటున్నారు అత్తాకోడళ్ళు. విష్ణు మాత్రం ముసలివారిని, పిల్లలను ఘాట్‌లోని మెట్లపై పడిపోకుండా చేత్తో పట్టుకుని, నెమ్మదిగా నదీస్నానం చేయటానికి సహాయపడుతున్నాడు.
“బాబూ! సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి మమ్మల్ని స్నానం చేయిస్తున్నాడనుకుంటున్నాం. నీకా భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి” అని ధన్యవాదాలు చెపుతున్నారు సహాయం పొందినవాళ్ళు.
ఇంతలో “ముఖ్యమంత్రిగారు వస్తున్నారు. ఘాట్‌ని ఖాళీ చేయండి” అని మైక్‌లో ప్రకటన చేసారు. అంతే! ఎక్కడినుండి వచ్చారోగాని వందమంది పోలీసులు ఒకేసారి ఆ ఘాట్‌లోకి వచ్చి యాత్రికులను ఖాళీచేయించటం మొదలుపెట్టారు. ఈ హడావిడి చూసిన విష్ణు భార్యాపిల్లలు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని ఘాట్‌కి దూరంగా వచ్చేశాడు.
కాసేపటికే ముఖ్యమంత్రిగారు పరివారంతో ఘాట్‌కి వచ్చి పుష్కర స్నానం చేశారు. “పుష్కరుడు ఈ ఘాట్‌కే వచ్చుంటాడు. అందుకే అంతటి పెద్దమనిషి ఈ ఘాట్‌లోనే స్నానం చేసారు. మనం మాత్రం పవిత్ర స్నానానికి మరెక్కడికో ఎందుకు వెళ్ళాలి?” అనుకుంటూ యాత్రికులందరూ ఒకేసారి తండోపతండాలుగా పుష్కర్ ఘాట్‌కి చేరుకున్నారు.
ఒక్కసారిగా అలలవోలే వచ్చిన యాత్రీకులను అదుపులో పెట్టటం సాధ్యంకాక రక్షక భటులు చేతులెత్తేసారు. తొక్కిసలాట జరిగిపోయింది. చాలామంది గాయపడటంతోపాటు కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు. అంబులెన్స్ వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రులకు చేరవేస్తున్నాయి.
“ఇది అనుకోకుండా వచ్చిన ఆపదకాదు. పుష్కరాల పేరిట జరిగిన ఏర్పాట్లలోని లోపం, అధికారుల అలసత్వం, యాత్రీకుల మూర్ఖత్వం కారణంగా అమాయక ప్రజలు చనిపోవటం, గాయపడటం జరిగింది” అని విష్ణు గట్టిగా అనుకున్నాడు.
గాయపడ్డవారికి తాను కూడా చేతనైన సాయమందించి, సంఘటనాస్థలం నుండి బయిటకు తీసువచ్చి, వారికి మజ్జిగ పాకెట్స్, నిమ్మరసం ఇస్తున్నాడు.
కొంచెం దూరంలోని ఓ మంటపంలో కూర్చున్న విష్ణు భార్య, తల్లి “ఆ గోదావరి తల్లి దయవల్లే తమకు ప్రమాదం తప్పింది” అని అనుకున్నారు.
మరునాడు “‘పుష్కరస్నానం’ అయ్యిందిగా, దగ్గరలోని గుళ్ళు చూసొద్దాం” అంది సత్యవతి.
“ఈ పుష్కర యాత్రికులతో గుళ్ళనీ రద్దీగా ఉంటాయి. నేను పిల్లలు ఇక్కడే ఉండి నర్సరీలను చూస్తాం. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి” అన్నాడు విష్ణు.
“పూలమొక్కలు చూడటానికి మన హైదరాబాద్‌లో చాలా ప్రదేశాలే ఉన్నాయి. మేం మాత్రం దగ్గరలోని నాలుగైదు గుళ్ళు చూసివస్తాం” అంది శారద. కోడలిమాటలకు వత్తాసు పలికింది సత్యవతి.
విష్ణు స్నేహితుడు ఓ డ్రైవర్‌నిచ్చి వాళ్ళని పంపాడు. విష్ణు, పిల్లలు ఉండిపోయారు. పూలతో విరాజిల్లుతున్న నర్సరీను పిల్లలకు చూపిస్తూ ఒక్కో పూలమొక్క గురించి వివరిస్తూ చుట్టుపక్కల పారుతున్న పంట కాలువలను చూపిస్తూ పిల్లలకు వినోదం కలిగించాడు విష్ణు.
మధ్యాహ్నం లంచ్ సమయమయ్యింది. శారదావాళ్ళు రానేలేదు. డ్రైవర్‌కి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు విష్ణు. “పుష్కర యాత్రీకులతో గుళ్ళనీ కిక్కిరిసి ఉన్నాయి. మేం తిరిగి రావటానికి ఇంకా ఓ గంట సమయం పట్టవచ్చు” అని చెప్పాడు డ్రైవర్.
ఉదయం నుండి తోటలన్నీ తిరిగితిరిగి ఉన్నారేమో, పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు.
శారదావాళ్ళ కారు వచ్చేసరికి మూడుగంటలు దాటింది సమయం. సత్యవతి డస్సిపోయి స్పృహతప్పేలా ఉంది. “పెద్దామె కదా! ఎందుకంతసేపు క్యూలో నుంచోబెట్టావు? అమ్మకు క్యూలైన్‌లో ఏమైనా అయితే పరిస్థితి ఏమిటి? ఏమిటా మూఢభక్తి? అంటూ కేకలేస్తున్న భర్త కోపానికి శారద దగ్గర సమాధానమే లేదు.
విష్ణుకి ‘సారి’ చెప్పి, “మీరు అన్నం తిన్నారా?” అని అడిగింది శారద.
“లేదు, నేను మీ కోసమే ఎదురుచూస్తూ, పిల్లలకి మాత్రం భోజనం పెట్టేసాను” అన్నాడు విష్ణు.
ముగ్గురికి అన్నం వడ్డించింది శారద. ఒక ప్లేట్ తీసుకెళ్ళి బయిట ఉన్న డ్రైవర్‌కి ఇచ్చి “అన్నం తిను బాబు. మా వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చావు” అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందించాడు విష్ణు.
“ఏమండి! అన్నం కాస్త తగ్గుతుందేమో?” అంది శారద. “ పళ్ళున్నాయిగా. ఈ రోజుకి కాస్త పెరుగన్నం, అరటిపండుతో సరిపెట్టుకుంటాను” అన్నాడు విష్ణు.
“బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఆయన మాట జవదాటకూడదు” అని చెంపలు వాయించుకుంది శారద. ఆ రోజు రాత్రికే బయలుదేరి హైదరాబాద్ వచ్చేసారు. ప్రయాణపు బడలిక పదిరోజులైనా తగ్గలేదు సత్యవతికి. అయినా లేని ఓపిక కూడదీసుకుని ఫోనులో అందరికి తమ రాజమండ్రి పుష్కర యాత్ర గురించి చెపుతూనే ఉంది.
ఓ రోజు విష్ణుతో శారద “ఏమండీ! ఒకసారి తిరుమల వెళ్ళోద్దామండి” అంది.
“నాకు అక్కడికి రావటం ఇష్టముండదని నీకు తెలిసే అడుగుతున్నావా శారదా? అమ్మా, పిల్లలను నేను చూసుకుంటాను. నీకు తెలిసినవారెవరైనా వెడుతూంటే నువ్వు కూడా వెళ్ళు” అన్నాడు విష్ణు.
“లేదండి, పోయిన నెలలో అత్తయ్యగారికి సుస్తీ చేసి మంచమెక్కిన సందర్భంలో నేను అంగప్రదక్షిణ చేయాలని మొక్కుకున్నాను. మీ అమ్మగారి కోసమే కదా నేను తిరుమలకు వస్తానని మొక్కుకున్నది” అంది శారద.
“శారదా! ఎన్నెన్నో సమస్యలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని మన మనోధైర్యంతో ఎదుర్కోవాలేగానీ, ఇలా మొక్కులు, ప్రదక్షిణాలు, జనాలలోకి వెళ్ళటం, తోసుకోవటాలు, చిరాకుపడటాలు వద్దేవద్దు. మన తీర్ధయాత్రకు పెట్టే ఖర్చుతో ఇక్కడి పేదల కన్నీరు తుడిచి వారి ఆకలి బాధను తగ్గించటానికి ఉపయోగిస్తే ఆ వేంకటేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. మన చిక్కడపల్లిలోని ఆలయం వారంలో నాలుగురోజులు ఖాళీగా ఉంటుంది. ఆ రోజులలో నీవు వెళ్ళి నీ మొక్కును తీర్చుకోవచ్చు” అన్నాడు శాంతంగా విష్ణు. భర్త మాటలను విని మౌనంగా ఉండిపోయింది శారద.
ఓ పెళ్ళిరోజున ఉదయానే కాఫీ కప్పును భర్తకు అందిస్తూ “ఏమండీ ఈ రోజు రామాలయానికి కెళ్దామండి. ఇవాళ బుధవారం కదా. గుళ్ళో కూడా రద్దీ ఎక్కువగా ఉండదు. గుడినుంచి రాగానే భోజనం చేసి అఫీసుకెళ్ళవచ్చు” అంది శారద.
“సరే” అనక తప్పలేదు విష్ణుకి. “భక్తులు ఏ రోజు తక్కువగా వస్తారో తెలుసుకున్నట్లుగా ఈ రోజు ఎక్కువ రద్దీ ఉండదని కూడా చెప్పింది” అనుకుంటూ బీరువా తీసి ఓ పదిరూపాయిల కట్టను బ్యాగ్‌లో పెట్టుకుని “ఇక వెళ్దామా?” అని అడిగాడు విష్ణు.
అతను డబ్బులు తీసుకున్నది ఎందుకో అర్ధమైన శారద మౌనంగా ఊరుకుంది. ఏమైనా అంటే అసలుకే మోసం వస్తుంది అనుకుంటూ భర్తవెంట రామాలయానికి బయలుదేరింది.
విష్ణుతో కలసి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలుచేసి దైవ దర్శనానికి ఆలయంలోకి వెళ్ళింది శారద. ఎదురుగా అలంకరణతో కనులవిందుగా ప్రకాశిస్తున్న దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని పూజారిగారికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు ఇచ్చి అర్చన చేయమని చెప్పింది శారద.
ఆనందంతో కన్నులనుండి జాలువారుతున్న నీటిని తుడుచుకోకుండా అలా తదేకంగా మూలవిరాట్టుని చూస్తూ నిలబడి పోయాడు విష్ణు. అతనికి చిత్రంగా అక్కడ రాముడు కనిపించటంలేదు. పెద్ద నిలువుటద్దంలో చూస్తున్నట్లుగా తన ప్రతిబింబమే కనిపిస్తోంది. ఏమిటో ఈ మాయ? రామాలయంలో రాముడు కనిపించటంలేదేమిటి? అలాగే చాలాసేపు చూసాడు. అర్చన పూర్తయ్యింది. తీర్ధప్రసాదాలు తీసుకుని బయిట మంటపంలో కూర్చున్నారు భార్యాభర్తలు.
ఆఫీసుకెళ్ళి తిరిగి వస్తూ వేంకటేశ్వరస్వామి గుడికెళ్ళి పూజారిగారికి విషయం చెప్పి కారణం అడిగాడు విష్ణు.
అంతా విన్న ఆయన “అంతా మీ భ్రాంతి. రాముడక్కడే ఉంటాడు. ఉన్నాడు” అని చెప్పారు. “నా దగ్గర ఒక పెద్దమనిషి ఫోను నంబర్ వుంది. ఆయన ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి అనేక మందికి సందేహాలను నివృత్తిచేస్తూంటారు. ఆయనేమైనా మీఅనుభవానికి వివరణ ఇవ్వగలరేమో ప్రయత్నించండి” అంటూ ఆయన ఫోను నంబర్ ఇచ్చారు.
“ముందుగా ఫోను చేసి ఆయనకు తన గురించి, తాను చేసే పనులగురించి చెప్పి రామాలయంలోని తన అనుభవం గురించి వివరించి అనుమతిస్తే వచ్చి కలుస్తాను” అని చెప్పాడు విష్ణు. ఆయన అంగీకారం తీసుకుని వారి ఇంటికి వెళ్ళి కలిశాడు.
“ఓ అయిదు నిమిషాలలో తనకు రామాలయంలో ఎదురైన అనుభవం గురించి చెప్పి రాముడుండాల్సిన స్థానంలో అద్దంలో చూసుకుంటున్నట్లుగా నా ప్రతిబింబం కనిపించటమేమిటి? దాని పరమార్ధం ఏమిటి?” అని అడిగాడు విష్ణు.
“ఆలయం ఎంత పవిత్రమైనదో చూడండి. మనం ఆలయంలోకి వెళ్ళి బయిటకు వచ్చేసరికి ‘బూడిద విభూతి అవుతుంది. నీరు తీర్ధం అవుతుంది. బియ్యం అక్షింతలు అవుతాయి. కొబ్బరి ప్రసాదమవుతుంది’. ఇలా సామాన్యమైనవన్నీ అసమాన్యమైనవిగా మారతాయి. ఇన్ని మారినా ఆలయంలోకి వెళ్ళి మారకుండా బయిటకు వచ్చేది మనిషి మాత్రమే. అందుకే మారాల్సింది మనిషి మాత్రమే” అన్నారాయన.
“మీ భక్తి చాలా అరుదైనది. మీ బాహ్య ప్రవర్తనను గమనించిన అందరూ మిమ్మల్ని నాస్తికుడనుకుంటారు. కానీ మీ భక్తి అంతర్ముఖమైనది. నిరుపేదలలో పరమాత్ముణ్ణి చూస్తున్నారు. భిక్షుకులలో ఆ నారాయణున్ని దర్శించుకుంటున్నారు. మీ గుండెగుడిలో ఆ రాముణ్ణి పెట్టుకుని పూజించుకుంటున్నారు.
ఆ పరబ్రహ్మ సృష్టిలోని ప్రతిదానిలో నారాయణుని అంశ ఉంటుందని తెలుసుకున్న జ్ఞాని మీరు. అందుకే గుడిలో మీకు దేవుని స్థానంలో మీ రూపమే కనిపించింది. ‘అహం బ్రహ్మాస్మి’ అన్న పదానికి నిర్వచనం ఆ దృశ్యంద్వారా దేవుడు మీకు చెప్పకనే చెప్పాడు. మీ లాంటివారు నూటికోకోటికో ఒకరుంటారు. అందరిలోనూ ఇంతటి పరిపక్వత, వేదాంత జిజ్ఞాస ఉండకపోవచ్చును. మీ జీవితంలో మీరు ఈ మార్గాన్ని విడిచిపెట్టకండి.
భక్తికి చాలా రూపాలుంటాయి. 'నేను ' అనేదే లేదీ ప్రపంచంలో. అందరిలోనూ పరమాత్మను చూడగలిగితే ఈ మత ఘర్షణలు, కల్లోలాలు ఉండవు కదా?
ఓ ప్రశ్న అడుగుతాను చెప్పండి. మీరు చూసినప్పుడు దేవుడి వెనుక అద్దం ఉందా? దేవుడి ముందే అద్దం ఉందా? దేవుడి వెనుక అద్దం ఉంటే ఆ దివ్య మంగళ రూపుడి దర్శనం అయ్యేది. దేముని ముందర అద్దం పెట్టారనుకుంటే మరి మీ భార్యకు రాములవారి విగ్రహమే కనిపించింది కదా!
“అహం బ్రహ్మాస్మి” అన్న పదానికి అర్ధంగా మీకు మాత్రమే దేవుని విగ్రహానికి బదులు మీ రూపం కనిపించింది. అంటే స్వామివారు మీ భక్తికి ప్రసన్నుడై, మిమ్మల్ని అనుగ్రహించారని పరమార్ధం బాబూ. ధన్యజీవివి” అంటూ దీవించారు.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.









శైలజ గారి కథ 'అహం బ్రహ్మాస్మి' ఆత్మ, పరమాత్మ వేరుకాదని చెప్పే అద్వైత వేదంతాన్ని చక్కగా అందరికీ అర్ధం అయ్యేలా హృదయాన్ని తాకే కథలా అల్లేరు. కథ, కథనంలో రచయిత్రి పరిణితి కనబడుతుంది. చక్కటి ఆలోచింపచేసే కథను అందించినందుకు అభినందనలు.