top of page
Original.png

అమానవీయం!


అడవిలోని పురాతన బంగళా ముందు రాత్రివేళ కారును ఆపి చూస్తున్న వ్యక్తి, మెట్లపై నిలబడి ఉన్న మధ్యవయస్కురాలు మరియు వెనుక మంచినీటి చెంబుతో ఉన్న బాలిక

Amanaveeyam! - Telugu Mystery Story | Bhattu Venkata Rao

అమానవీయం! తెలుగు మిస్టరీ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 26/08/2026


అడవిలో దారి తప్పి, దాహంతో ఓ పాతకాలపు బంగళాను ఆశ్రయించిన వ్యక్తికి ఎదురైన అనూహ్య అనుభవమే “అమానవీయం!” కథ. చీకటితో నిండిన అడవి, ఒంటరిగా ఉన్న పురాతన బంగళా, అందులో నివసించే రాజసం ఉట్టిపడే మహిళ, ఆమెకు తోడుగా ఉన్న పదహారేళ్ల బాలిక — ఇవన్నీ కథానాయకుడిలో ఒక తెలియని భయాన్ని, అనుమానాన్ని కలిగిస్తాయి. మంచినీటి కోసం అడుగుపెట్టిన చోటే రాత్రికి ఉండమనే ఆహ్వానం రావడంతో అతని మనసులో మిస్టరీ మరింత పెరుగుతుంది. అయితే అక్కడ నిజంగా ఏదైనా అతీంద్రియ రహస్యం ఉందా, లేక మనిషి మనసులోని అనుమానం మరియు భయమే సాధారణ పరిస్థితులను అసహజంగా చూపించాయా? మానవత్వం, అపనమ్మకం, భయం, మనస్తత్వం వంటి అంశాలను ఆసక్తికరమైన మిస్టరీ వాతావరణంలో చెప్పే కథ ఇది.


అడవిలో రాత్రివేళ. చుట్టూ చెట్లూ, కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి!

హెడ్‌లైట్సు వెలుగులో స్పీడుగా వెళుతోంది కారు. ఎక్కడో తెలీకుండా దారి తప్పాను. ఎంతదూరం వెళ్ళినా నేను ఎక్కాల్సిన మెయిన్ రోడ్డు రావడం లేదు. తిరిగి తిరిగి అలసటొచ్చి, ఒక పాతకాలపు బంగళా ముందు కారుని ఆపాను.


చెడ్డ దాహంగా ఉంది. నా దగ్గరున్న వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయాయి. ఆ బంగళాలో వాళ్ళనడిగి, ముందు కాసిని మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకుని, తరువాత మిగతా సంగతి ఆలోచించుకుందాం అనిపించింది. అందుకే ఆగాను.


బంగళా చాలా పెద్దది. రాజుల కాలం నాటిది. ఇంత అడవిలో ఈ ఒంటరి బంగళా ఏమిటో... అని చూసినవాళ్ళకి సందేహం కలిగేలా ఉంది. బంగళా ముందు పది పైనే వెడల్పాటి మెట్లున్నాయి. ఎక్కి వెళ్ళి తలుపుకి బిగించి ఉన్న లావుపాటి కడియంలాంటి ఇత్తడి రింగును తలుపుకు తాకిస్తూ గట్టిగా కొట్టాను. ఆ నిశ్శబ్దంలో పెద్ద శబ్దం చేసిందది. వెంటనే లోపల్నుంచి...


"ఎవరూ? మీరేనా?" అని ఒక స్త్రీ కంఠం వినిపించింది.


"కాదండీ... కాసిని మంచినీళ్ళు ఇప్పిస్తారేమో అని తలుపుకొట్టాను!" అన్నాన్నేను.


లోపల్నుంచి బదులుగా ఏ శబ్దమూ లేదు. కొన్ని క్షణాలు ఆగాను. మళ్ళీ తలుపు కొడదామని ఆలోచిస్తుండగా, తలుపు తెరుచుకుంది.

ఒక మధ్యవయస్కురాలైన అందమైన స్త్రీ లోపల నిలబడి ఉంది.

"లోనికి రండి!" అంది.


వెళ్ళాను.


"ఇలా కూర్చోండి!" అని ఒక పాతకాలపు సోఫా చూపించింది. కూర్చున్నాను. లోపలి అంధకారంలో ఒక్కటే ఒక్క దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఆమె నడివయసు అందం చాలా హుందాగా మెరుస్తోంది. ఆ బిల్డింగుకు తగినట్లుగా, పూర్వకాలపు రాజవంశానికి చెందిన ఈనాటి తరం స్త్రీలా ఉందామె. పెదవుల మీద చిరుదరహాసంతో స్నేహంగా నా వైపు చూసింది.


"కారులో వెళుతూ దారి తప్పిపోయాను. బాగా దాహంగా ఉంది. కాసిని మంచినీళ్ళిస్తే తాగి వెళ్ళిపోతాను!" అన్నాను.


"కూర్చుని ఉండండి. అలాగే పంపిస్తాను!" అని చెప్పి ఆమె ఆ విశాలమైన గదిలోంచి ఆవల చీకటిలోకి మాయమైపోయినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.


లోపల ఉక్కగా ఉండి చెమట పోస్తున్నట్లుగా అనిపించింది నాకు. సోఫాకు కాస్త అవతలగా ఆ ఒంటరి దీపం, చీకటి సహజంగా ఉన్నట్లుగా అనిపించలేదు. అలా అనిపించడంతో ఏదో గాబరా అప్పుడే నా లోపల మొదలైందని నాకు తెలిసిపోయింది. మంచినీళ్ళ సంగతి మరోచోట చూసుకోవచ్చు, ముందిక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోవడం మంచిదేమో! - అని కూడా అనిపించింది.


ఇంతలో ఆమె వెళ్ళిపోయిన చీకటిలోంచి చేతిలో మంచినీళ్ళ చెంబుతోనూ ఇత్తడి గ్లాసుతోనూ ఒక పడుచు పిల్ల బయటికొచ్చింది. చెంబులోంచి గ్లాసులోకి నీళ్ళు నింపి నా చేతికి అందిస్తూండగా అడిగాను...

"నీవెవరు?"


"అమ్మగారికి తోడు. అన్నిటిలోనూ సాయంగా ఉంటాను!" జవాబిచ్చింది ఆ పిల్ల. పదహేనేళ్ళు ఉంటాయనిపించింది.


"ఈ బంగళా ఎవరిది? ఇంత అడవిలో ఇలా ఒంటరిగా ఎందుకుంది?" అని అడిగాను.


"మా అమ్మగారి తాతగారి తాతగారు రెండొందలేళ్ళ క్రితం కట్టించినది. అప్పుడీ అడివంతా ఆయనదే!" అని రెండు ముక్కల్లో చరిత్రంతా చెప్పేసినట్లుగా సమాధానం చెప్పిందా పిల్ల.


"అప్పుడు సరే, ఇప్పుడిలా అడవిలో ఉండడానికి భయమెయ్యదా?" అన్నాను.


"అప్పుడైనా ఇప్పుడైనా... ఎప్పుడైనా సరే, సొంతింట్లో ఉండడానికి భయమెందుకుంటది?" అని ఎదురుప్రశ్న వేసిందా చిన్నది.


'అవున్నిజమే కదా... ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడానికి భయమెందుకుంటుంది?' అని మనసులో అనుకుంటూ, గ్లాసులోని నీళ్ళు రెండు గుక్కలు తాగి, మిగిలిన నీళ్ళతో గ్లాసును వెనక్కి ఇచ్చేశాను. అందులో ఇంకా సగం నీళ్ళు మిగిలి ఉండడం చూసి...

"పూర్తిగా తాగండి..." అంది ఆ పిల్ల.


"అవసరం లేదు. దాహం తీరింది. ఇక వెళతాను. మీ అమ్మగారితో చెప్పు!" అన్నాను సోఫాలోంచి లేచి నిలబడుతూ.


"బయట బాగా చీకటి పడింది. ఇక్కడి నుండి మెయిన్ రోడ్డు చాలా దూరం ఉంది. దారి తప్పానని కదా ఇందాక చెప్పారు. దారి తెలీకుండా ఈ చీకటిలో ఎలా వెళ్ళాలని?" లోపలి నుండి హాల్లోకి వస్తూ అన్నదామె.


ఆమె ఆహార్యంలోను, నడకలోను రాజసం ఉట్టిపడడం అప్పుడు పరిశీలనగా చూసాను.


సమాధానంగా నేనేదైనా మాట్లాడే లోపలే...

"ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు వెళ్ళొచ్చు. ఇక్కడ మీకేవిధమైన ఇబ్బందీ కలగదు, నిశ్చింతగా ఉండొచ్చు!" అన్నదామె.


కానీ నాకేదో ఇబ్బందిగా అనిపించడం మొదలు పెట్టింది లోపల. ఇదంతా నిజంగా జరుగుతున్నదే. కానీ ఏదో సందేహం ఆవహించి అంతా మిస్టీరియస్‌గా, మాయగా కూడా అనిపించసాగింది. ఆమె చెప్పినట్లు ఆ రాత్రి అక్కడ ఉండిపోవడానికి సిద్ధపడడం లేదు అంతరంగం. లోపల ఏదో బెరుకు నిండిపోయింది. జరుగుతున్నదంతా నా కళ్ళెదుటే, నిజంగానే జరుగుతున్నప్పటికీ, అందులో ఏదో అసహజత్వపు అంశ గోప్యంగా ఉన్నట్లుగా నన్ను కలవరపెట్టసాగింది.


"పరవాలేదు. కార్లోనే కదా! డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు అలవాటే..." అంటూ ఆమెకు మరి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి లేచి వచ్చేసి కారులో కూర్చుని స్టార్ట్ చేసి, ఒక్కసారి బంగళా వైపు చూసాను.


నా వెనకనే నడుస్తూ మెట్ల దాకా వచ్చి, అక్కడ ఆగిపోయి నా వైపే చూస్తున్నదామె. స్త్రీ సహజమైన కరుణతో ఆమె కళ్ళు నిండి ఉండడం అంత దూరం నుంచీ నాకు కనిపించింది. నా ప్రవర్తనకు విస్తుపోయి చూస్తున్నట్లుగా అనిపించిన ఆమె విశాల నేత్రాలలోని చూపులు నా అంతరంగాన్ని బాగా ఇబ్బందిపెట్టాయి. స్టార్టు చేసిన కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాను.


కనిపించిన వైపు కారు పోనిచ్చి, ఎలాగో చాలా సేపటికి మెయిన్ రోడ్డును చేరాను.

సహజంగా ఉంటూనే అసహజంగా కనిపించే పరిస్థితులు మనిషిని తికమక పెడతాయి. ఆ తికమకలో ఒక మంచి మనిషి మానవీయంగా చేసే సహాయాన్ని కూడా సిగ్గుపడకుండా నిరాకరించేలా చేస్తాయి అని మెయిన్ రోడ్డు ఎక్కిన తరువాత తీరికగా కారును ముందుకు పోనిస్తూ, అక్కడ నా అమానవీయ ప్రవర్తనను సమర్థించుకున్నాను.


భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page