top of page
Original.png

బిందు - బ్యూటీ పార్లర్ బాధలు


బ్యూటీ పార్లర్‌కి అందంగా తయారవ్వడానికి వెళ్లింది… చివరికి పార్లర్‌లో అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వచ్చింది!

Bindu Beauty Parlour Badhalu - Telugu Comedy Story | Sritha

బిందు - బ్యూటీ పార్లర్ బాధలుతెలుగు హాస్య కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 26/08/2026


బిందు - బ్యూటీ పార్లర్ బాధలు



పార్ట్ 1 — ఢిల్లీలో బిందు కొత్త కాపురం


భాస్కర్‌కి బదిలీ కావడంతో బిందు–భాస్కర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి ఓ మంచి అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు.


బిందు మన తెలుగు అమ్మాయి. ఢిల్లీలో వాళ్ల చుట్టుపక్కల రోహన్, రష్మి, గాయత్రి, గోకుల్, అర్మాన్, జోయా, వాయోలా, వినోద్… ఇలా దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఉండేవారు.


భాషలు వేరు, టిఫిన్లు వేరు, అలవాట్లు వేరు… కానీ కబుర్లు మాత్రం ఒకటే!

ఒక ఉదయం భాస్కర్ అడిగాడు.

“బిందూ! ఏం చేస్తున్నావు?”


“ఏం చేస్తాను? పొద్దున్నే లేవగానే టిఫిన్, పూజ… ఆడవాళ్ల డ్యూటీలు ఇవే కదా!”


“ఈరోజు టిఫిన్ ఏంటి?”


“ఇడ్లీ, సాంబార్.”


“అబ్బా! మన తెలుగు టిఫిన్!”


అంతలో పక్కింటి రష్మి వచ్చింది.

“బిందూ! ఏం చేసుకున్నావు బ్రేక్‌ఫాస్ట్?”


“ఇడ్లీ సాంబార్. మీరు?”


“ఢోక్లా!”


రష్మి చాలా అందంగా, తెల్లగా ఉండేది. బిందు ఆమెను చూసి ఎప్పుడూ, “అబ్బా! ఎంత తెల్లగా ఉంది!” అనుకునేది.


“ఏంటి బిందూ అలా చూస్తున్నావు?” అంది రష్మి.


“ఏం లేదు… మీరు ఇంత తెల్లగా ఉన్నారు కదా! మీ ఢోక్లా కూడా అంతే తెల్లగా ఉంటుందేమో అనుకున్నా!”


రష్మి నవ్వేసింది.

అంతలో గాయత్రి, గోకుల్ వచ్చారు.

“మీరు ఏం చేసుకున్నారు?”


“పరాఠా, దహీ, ఆచార్!”


“అంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఫుల్ పంజాబ్ ప్యాకేజీ ఉందన్నమాట!” అంది బిందు.


అర్మాన్, జోయా వచ్చారు.

“आपने क्या नाश्ता बनाया?” అని బిందు అడిగింది.


జోయా నవ్వుతూ,

“आज तो हमने पूरी सब्जी खाई है!” అంది.


“అబ్బో! మీ టిఫిన్‌కే పండగ వాతావరణం!”


వాయోలా వచ్చి,

“మేము బ్రెడ్, ఆమ్లెట్.”


“అదేంటి? మీది ఇంటర్నేషనల్ బ్రేక్‌ఫాస్ట్!”


ఇలా అందరూ టిఫిన్లు తింటూ, పిల్లల చదువులు, స్కూల్లు, పరీక్షలు, ఇంటి సంగతులు మాట్లాడుకునేవారు.


పార్ట్ 2 — గృహప్రవేశంతో పాటు పెళ్లి!


ఒకరోజు అపార్ట్‌మెంట్‌లో కొత్తగా వచ్చిన రియా–రోహన్ వాళ్లింటి గృహప్రవేశానికి అందరినీ పిలిచారు.

రియా బిందు దగ్గరకు వచ్చి,

“అక్కా, మీరందరూ తప్పకుండా రావాలి. గృహప్రవేశంతో పాటు మా పెళ్లి కూడా!”



“అయ్యో! పెళ్లా?”

“అవును అక్కా. మాది లవ్ మ్యారేజ్!”


“అదేంటి? ఇల్లు కొత్తది… ప్రేమ పాతదా?”


అందరూ నవ్వేశారు.

“సంగీత్ కూడా ఉంది అక్కా. మీరు తప్పకుండా రావాలి.”


“సరే! మేమంతా వస్తాం.”


పెళ్లి, సంగీత్ హడావుడి మొదలైంది.

బిందు కూడా సంతోషంగా తయారవ్వాలని అనుకుంది.


అప్పుడే రష్మి బిందుని చూసి,

“బిందూ! నువ్వొకసారి బ్యూటీ పార్లర్‌కి వస్తే ఇంకా బాగా తయారవుతావు. నీ స్కిన్ చాలా బాగుంది. ఫేషియల్ చేస్తే ఇంకా మెరిసిపోతుంది. ఐబ్రోస్ కూడా కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటాయి. మనం అందరం కలిసి వెళ్దాం. సంగీత్‌కి, పెళ్లికి అందంగా రెడీ అవుదాం!”


బిందు కాసేపు ఆలోచించింది.

“అదేం పెద్ద పని? బ్యూటీ పార్లరే కదా! ఒకసారి ట్రై చేద్దాం.”


అలా బిందు తన ఫ్రెండ్స్‌తో కలిసి రజనీ’స్ గ్లో స్పా & సలోన్ — బ్యూటీ పార్లర్‌కి బయలుదేరింది.

పార్ట్ 3 — హెయిర్ కట్‌ల హంగామా


లోపలికి అడుగుపెట్టగానే—

“వెల్కమ్ మేడమ్! కమ్, సిట్ ప్లీజ్. ఏం చేయాలి?”

అని ఇద్దరు బ్యూటీషియన్లు పలకరించారు.


బిందు చుట్టూ చూసింది.

గోడలన్నీ రకరకాల హెయిర్‌స్టైల్స్ ఫొటోలతో నిండిపోయాయి.

“అమ్మో! ఇవన్నీ మనుషుల తలలేనా?”


“అవును మేడమ్!”


“అయితే ముందు నాకు ఈ ఫొటోలు అర్థం అయ్యేలా చెప్పండి!”


బ్యూటీషియన్ ఒక్కో ఫొటో చూపించింది.

“ఇది స్టెప్ కట్.”


“అది మెట్లు ఎక్కే జడా?”


“కాదు మేడమ్… హెయిర్ కట్.”


“సరే. ఇది?”


“యూ కట్.”


“అంటే జుట్టు యూ టర్న్ తీసుకుంటుందా?”


“అది కాదు మేడమ్!”


“అయితే వి కట్?”


“వి షేప్ మేడమ్.”


“అబ్బా! జుట్టుకే ఇన్ని ఇంగ్లీష్ అక్షరాలా?”


మరో ఫొటో చూపించారు.

“ఇది లేయర్ కట్.”


“లేయర్లా? ఉల్లిపాయల్ని పొరలుగా తీసినట్టు జుట్టుని కూడా పొరలుగా తీస్తారా?”


“ఇది బాబ్ కట్.”


“బాబ్ ఎవరు?”


“ఎవరూ కాదు మేడమ్. స్టైల్ పేరు!”


“అంటే జుట్టుకి కూడా పేర్లు పెడతారా?”


అంతలో బ్యూటీషియన్ బిందు జడను చూసి,

“మేడమ్, మీ జడ చాలా బాగుంది! ఫ్రెంచ్ ప్లైట్ వేసుకున్నారా?”


బిందు ఆశ్చర్యంగా,

“ఫ్రెంచ్ ప్లేటా?”


“ప్లేట్ కాదు మేడమ్… ఫ్రెంచ్ ప్లైట్!”


“అదేంటి? ఫ్రాన్స్ వాళ్లు జడ వేస్తే ఫ్రెంచ్ ప్లైట్, మనం వేస్తే?”


“సింపుల్ బ్రేడ్.”


బిందు తన జడను చూసుకుంది.

“మేమైతే దీనిని చిన్నప్పటి నుంచి ఉల్లిపాయ జడ అనుకుంటున్నాం!”

పార్ట్ 4 — స్కిన్ టోన్ కథ


బిందు వెంటనే,

“సరే, నా జడ సంగతి పక్కన పెట్టండి. ఇంకో విషయం చెప్పండి. నా ఫేస్‌కి ఏం చేస్తారు?”


“ఫేస్‌కి మేము ఏమీ చేయం మేడమ్. మా స్కిన్ ఎక్స్‌పర్ట్ వచ్చి ముందుగా మీ స్కిన్ టోన్ సెలెక్ట్ చేస్తారు.”


“స్కిన్ టోన్ సెలెక్ట్ చేస్తారా?”


బిందు కాసేపు ఆలోచించింది.

“స్కిన్ టోన్ అంటే… వాయిస్ టోన్ లాంటిదా?”


“కాదు మేడమ్!”


“మీ చర్మాన్ని చూసి మీది ఏ రకం స్కిన్ అనేది చెక్ చేస్తారు. డ్రై స్కిన్, మాయిశ్చరైజ్డ్ స్కిన్, మిక్స్‌డ్ స్కిన్, ఆయిలీ స్కిన్…”


బిందు కళ్ళు పెద్దవి చేసింది.

“అమ్మో! స్కిన్‌లో కూడా ఇన్ని రకాలా?”


“చాలా రకాలుంటాయి మేడమ్!”


“మరి నా స్కిన్ ఏ రకమో ఎలా తెలుస్తుంది?”


“మా ఎక్స్‌పర్ట్ వచ్చి మిమ్మల్ని చెక్ చేస్తారు. తర్వాత మీ స్కిన్‌కి తగ్గట్టు ఏ ప్రొసీజర్స్ చేయాలో చెబుతారు.”


అంతలో స్కిన్ ఎక్స్‌పర్ట్ వచ్చాడు.

బిందుని చూసి,

“మేడమ్, మీ స్కిన్ టోన్ చాలా బాగుంది. మీకు ఏ ఫేషియల్ అయినా సూట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నాక నేను వచ్చి ప్రొసీజర్ చేస్తాను.”


అని అసిస్టెంట్‌కి,

“మేడమ్‌కి ఉన్న ఫేషియల్స్, ట్రీట్‌మెంట్స్ అన్నీ చెప్పండి. ఆమె సెలెక్ట్ చేసుకున్నాక నాకు చెప్పండి.”


అని చెప్పి వెళ్లిపోయాడు.

అతను వెళ్లగానే బిందు,

“I know, I know! I know that I am having a very good skin tone. Thank you!”

అంది.


తర్వాత అసిస్టెంట్‌ని చూసి,

“ఏంటి అలా వెళ్లిపోయారు?”


“మేడమ్, వాళ్ల పని అంతే. స్కిన్ చెక్ చేసి వెళ్లిపోతారు. మీరు ఏ ఫేషియల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.”


పార్ట్ 5 — ఫేషియల్స్ ఫుడ్ మెనూ!


“అయితే ఏం ఫేషియల్స్ ఉన్నాయమ్మా?”


“హనీ ఫేషియల్.”


“హనీ ఫేషియలా? తేనెతో చేస్తారా?”


“అవును మేడమ్.”


“రోస్ ఫేషియల్ కూడా ఉంది మేడమ్.”


“అంటే పువ్వులతో ఫేషియలా?”


“వైన్ ఫేషియల్ కూడా ఉంది.”


“వైన్ ఫేషియలా? తాగడానికి దిక్కులేదు ఇక్కడ… ఫేషియల్‌కి కూడా వైన్ వచ్చేసిందా?”


“చాక్లెట్ ఫేషియల్ కూడా ఉంది.”


“చాక్లెట్ ఫేషియలా? తినడానికి సరిపోదా? ముఖానికి కూడా పెట్టుకోవాలా?”


“గోల్డ్ ఫేషియల్.”


“గోల్డ్ ఫేషియలా? బంగారం లెక్కేసుకుని, దాచుకుని, నగలు పెట్టుకున్నా సరిపోదా? ఇప్పుడు ముఖానికి కూడా బంగారం పెట్టుకోవాలా?”


“గోల్డ్ ఫేషియల్ చేస్తే ముఖం చాలా బాగా మెరిసిపోతుంది మేడమ్.”


“అలాగా! మరి డైమండ్ ఫేషియల్?”


“అది కూడా చాలా బాగుంటుంది మేడమ్.”


“తల్లీ! అసలు దేంతో చేస్తారు ఈ ఫేషియల్స్ అన్నీ?”


“మేడమ్, మీరు చేసుకుంటే మీ ముఖం ఇంకా గ్లో అవుతుంది.”


“పర్ల్ ఫేషియల్ కూడా చేసుకోండి మేడమ్. ముత్యంలా తెల్లగా, నిగనిగలాడిపోతారు.”


బిందు కాసేపు ఆలోచించింది.

“ఈ ఫేషియల్స్ అన్నీ ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చేసుకోవాలా?”


“అవసరం లేదు మేడమ్. మీకు నచ్చినది ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి.”


“సరే. ఎంత సమయం పడుతుంది?”


“దాదాపు ఫోర్టీ మినిట్స్… ప్లస్ ఫోర్టీ మినిట్స్.”


“ఫోర్టీ మినిట్స్ ప్లస్ ఫోర్టీ మినిట్స్ అంటే?”


“ముందు డీ-టాన్ చేయాలి మేడమ్. తర్వాత క్లెన్సింగ్, ఫేషియల్, స్క్రబ్బింగ్, మసాజింగ్… అవన్నీ కలిపి టైం పడుతుంది.”


బిందు వెంటనే,

“అసలే నాకు ఆకలి ఎక్కువ. ఆకలేస్తే ఏం చేయాలి?”


అని అడిగి,

“మీరు పెట్టే చాక్లెట్ ఫేషియల్‌లో చాక్లెట్ ఉంటే… అది ముఖానికి పెట్టేలోపే నేను తినేసేయచ్చా?”

అంది.

పార్ట్ 6 — ఐబ్రోస్ బాధలు


“సరే! ఫేషియల్ పక్కన పెడదాం. కనీసం ఐబ్రోస్ అయినా చేసుకుంటాను.”


అప్పటికే అసిస్టెంట్‌కి తల తిరుగుతోంది.

“పదండి మేడమ్… ఐబ్రోస్ చేద్దాం.”


బిందుని చైర్‌లో కూర్చోబెట్టి, ఐబ్రోస్ చుట్టూ పౌడర్ రాసి, ఏదో కొలుస్తున్నట్టుగా చూసింది.

అంతలో పక్కనే కూర్చున్న ఆవిడను బిందు చూసింది. ఆవిడ రెండు చేతులతో ఐబ్రోస్ దగ్గర ఏదో పట్టుకుని ఉంది.


“అదేంటి?”


“మేడమ్, మీరు కూడా ఇలాగే చేతులతో ఐబ్రోస్ పైన చర్మాన్ని పైకి పట్టుకోవాలి. తర్వాత ఇంకో చేత్తో కిందికి పట్టుకోవాలి.”


“అదెందుకు?”


“మా మేడమ్ వచ్చి ఐబ్రో షేప్ చేస్తారు.”


“ఐబ్రో షేప్ చేస్తారా?”


“అవును మేడమ్. ఒక్కొక్క వెంట్రుకను తీస్తారు.”


“ఏంటి? వెంట్రుక పీకుతారా?”


“అవును మేడమ్.”


“వెంట్రుక పీకితే నొప్పి వస్తుంది కదా?”


“వస్తుంది మేడమ్!”


పక్కనే ఉన్న ఆవిడ,



“నాకు కొంచెం పెయిన్ అవుతుంది. కొంచెం స్లోగా చేయండి.”

అంది.


బిందు వెంటనే,

“అయ్యబ్బో! అందం కోసం ఐబ్రోస్ పీకించుకుంటారా? పిల్లలు పుట్టడానికి మనం నొప్పులు భరిస్తాం… ఈ ఐబ్రోస్‌కి, గీబ్రోస్‌కి నేను నొప్పులు భరించను!”

అంది.

పార్ట్ 7 — వాక్సింగ్ వేదన


“మేడమ్… ఫేషియల్ వద్దన్నారు, హెయిర్ కట్ వద్దన్నారు, ఐబ్రోస్ కూడా వద్దంటున్నారు. అసలు ఎందుకు వచ్చారు మేడమ్?”


“అదే నాకూ అర్థం కావట్లేదు! బ్యూటీ పార్లర్‌కి వస్తే అందంగా తయారవుతాం అనుకున్నాను. మీరు మాత్రం ఒక్కో అందానికి ఒక్కో నొప్పి చెబుతున్నారు!”


“సరే మేడమ్. వాక్సింగ్ చేసుకోండి. చేతులకు కొంచెం హెయిర్ కనిపిస్తోంది కదా. మీరు ఈసారి మెగా స్లీవ్స్ వేసుకుంటానన్నారు కదా? వాక్సింగ్ చేస్తే చేతులు స్మూత్‌గా ఉంటాయి.”


“వాక్సింగ్ ఆ? సరే, అదేదో చేసుకుని చూద్దాం. పద!”


“వాక్సింగ్‌లో ఏం చేస్తారు?”


“ఏం లేదు మేడమ్. వాక్స్ పెట్టి, స్ట్రిప్ పెట్టి జుట్టు తీసేస్తాం. అంతే!”


“అంతేనా? సరే.”


అప్పటికే వాళ్లు వాక్స్ వేడి చేస్తున్నారు.

బిందు మాత్రం హ్యాపీగా అక్కడున్న మ్యాగజైన్లు తిరగేస్తూ కూర్చుంది.

“మేడమ్, ఈ గౌన్ వేసుకోండి. మీ డ్రెస్ పాడైపోతుంది.”


“అయ్యో! నా డ్రెస్ పాడవుతుందా? సరే, ఇవ్వండి.”


గౌన్ వేసుకుని కూర్చుంది.


అంతలో బ్యూటీషియన్ వేడి వాక్స్ తీసుకుని బిందు చేతి దగ్గరకు వచ్చింది.

“అయ్యో! అదంత వేడిగా ఉంది! నా చేతి మీద పెడతారా? నా చెయ్యి కాల్చేస్తారా?”


“మేడమ్, ఆగండి! ఇది వాక్సింగ్ వాక్స్. కాల్చదు.”


“అదేంటో నాకు తెలియదు! వేడిగా ఉంది కదా!”


“మేడమ్, మీరు ఇలా అరుస్తుంటే ఓనర్ వచ్చి మేమేదో తప్పు చేశామనుకుంటారు!”


ఇద్దరు బ్యూటీషియన్లు కలిసి బిందు చేతికి వాక్స్ పెట్టి, స్ట్రిప్ పెట్టి— “ఒకటి… రెండు… మూడు!”


“అమ్మోఓఓ!”


అంటూ లాగేశారు.


“అయ్యో! నా చెయ్యి తీసేశారా? చెయ్యి ఉందా ఇంకా?”


“ఉంది మేడమ్!”


“మరి ఇంత బాధ ఎందుకు?”


“జుట్టు తీస్తున్నాం కదా మేడమ్!”


“జుట్టు మీకు ఏం చేసింది?”


అలా ఒక్కో స్ట్రిప్ తీస్తుంటే బిందు గోల పార్లర్ అంతా వినిపించింది.

“అమ్మో! ఆపండి! నా చేతి మీద జుట్టు ఉండటం మీకేం నష్టం?”


ఎట్టకేలకు వాక్సింగ్ పూర్తయింది.

బిందు అలసిపోయి,

“ఇంక చాలు. నన్ను ఏదైనా నార్మల్ పని చేయించండి!”

అంది.


పార్ట్ 8 — పెడిక్యూర్‌లో కితకితలు


“మేడమ్, పెడిక్యూర్ చేసుకోండి. చాలా రిలాక్స్‌గా ఉంటుంది.”


“అదేంటో చూద్దాం!”

అని పెడిక్యూర్ చైర్ దగ్గరికి వెళ్లి కూర్చుంది.

ట్రే వచ్చింది. వేడి నీళ్లు వచ్చాయి.

బిందు కాళ్లు నీళ్లలో పెట్టింది.


“అబ్బా! ఇది బాగుందే!”


కాళ్లు శుభ్రం చేస్తుండగా అసిస్టెంట్,

“మేడమ్, మీ కాలు నా తొడ మీద పెట్టండి.”


బిందు ఒక్కసారిగా కాలు వెనక్కి తీసుకుంది.

“చిచ్చీ! నేను ఒకరి తొడ మీద కాలు పెట్టను. అది మహాపాపం!”


“మేడమ్, ఇలాగే క్లీనింగ్ చేయాలి. తప్పదు.”


“అంత అవసరమా?”


“అవును మేడమ్.”


బిందు అయిష్టంగా కాలు పెట్టింది.

అంతే!

“అయ్యయ్యో! నమస్కారం! నాకు గిల్లిగిల్లిగా ఉంది! కితకితలు పెడుతున్నాయి!”

అసిస్టెంట్ కాలు క్లీన్ చేస్తుంటే బిందు నవ్వుతూ కుర్చీలో మెలికలు తిరగడం మొదలుపెట్టింది.


“ఆపండి! ఆపండి! నా కాలు కాదు… నా నవ్వు కంట్రోల్ కావడం లేదు!”

ఆమె నవ్వులు విని పార్లర్‌లో ఉన్న అందరూ నవ్వడం మొదలుపెట్టారు.


పార్ట్ 9 — మెహందీతో ముగిసిన బ్యూటీ టూర్


ఓనర్ కూడా బయటికి వచ్చి రష్మిని పిలిచింది.

“అమ్మా రష్మీ! మీ బిందుని తీసుకెళ్లమ్మా. ఆమె ఏమీ చేయించుకోలేదు. కానీ మా పార్లర్‌లో ఉన్న అందరినీ నవ్వించేసింది!”


అంతలో పక్కనే ఎవరికో మెహందీ పెడుతున్నారు.

బిందు అది చూసి,

“అదేంటి?”


“మెహందీ మేడమ్.”


“దానికి నొప్పి ఉండదు కదా?”


“లేదు మేడమ్.”


“అయితే నాకు కూడా పెట్టండి!”

అని అక్కడే కూర్చుంది.


చివరికి ఫేషియల్ లేదు.

హెయిర్ కట్ లేదు.

ఐబ్రోస్ లేవు.

వాక్సింగ్ మాత్రం గోలగోలగా చేయించుకుంది.

పెడిక్యూర్‌తో కితకితలు పెట్టించుకుంది.

చివరికి రెండు చేతులకు మెహందీ పెట్టించుకుని, పార్లర్‌లో ఉన్న అందరినీ నవ్వించేసి ఇంటికి తిరిగొచ్చింది.


రష్మి అడిగింది,

“బిందూ! బ్యూటీ పార్లర్‌లో ఏం చేయించుకున్నావు?”


బిందు తన మెహందీ చేతులు చూపిస్తూ,

“బ్యూటీ ఏమీ చేయించుకోలేదు… కానీ పార్లర్‌లో అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను!”

అంది.


అదే రోజు నుంచి రజనీ’స్ గ్లో స్పా & సలోన్‌లో బిందుకి కొత్త పేరు వచ్చింది— “బ్యూటీ కస్టమర్ కాదు… కామెడీ కస్టమర్!”


మరి బిందు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చింది— “పెళ్లికి అందంగా కనిపించడానికి వెళ్లాను… పార్లర్ వాళ్లకి నవ్వులు పంచి వచ్చాను!”


శుభం.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page