top of page

అమ్మా! కాసేపు అగు'Amma Kasepu Agu' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

కాసేపు ఆగమన్నాడు విశ్వం మాస్టారు.

కానీ అతని కూతురు లత ఆగలేదు. దాని ఫలితం ఎంతటి విషాదమో ఈతరం రచయిత్రి ధనలక్ష్మి గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.

“కామాక్షీ! అమ్మాయి రెడీ అయిందా... లేదా? పెళ్లి వారు వచ్చే వేళ అయింది…” అడిగాడు విశ్వం మాష్టారు.

“అయిందండీ. మీరు హడావిడి పడకుండా కాస్త కుదురుగా ఉండండి. ఈ మజ్జిగ తీసుకోండి” అని విశ్వం చేతికి గ్లాసు ఇచ్చారు కామాక్షి.

“మన అమ్మాయికి సరైన పెళ్లి సంబంధం. ఇది కనుక సెట్ అయితే మన బిడ్డ సంతోషంగా ఉంటుంది” అన్నాడు విశ్వం

“మనకెందుకు సెట్ కాదండీ? చిన్నప్పటి నుంచి మనం అనుకున్న సంబంధం కదా! పైగా మీ ప్రాణ స్నేహితుడి కొడుకు” అంది కామాక్షి.

“నిజమే కావచ్చు. కాకపోతే అబ్బాయి ఇప్పుడు అమెరికా లో ఉండి వచ్చాడు కదా. మన అమ్మాయి నచ్చుతుందో లేదో అని అనుమానం”

“మన అమ్మాయి ఎందుకు నచ్చదండీ. మన ఇంటి మహాలక్ష్మి అండీ”.

“చూద్దాం కామాక్షీ”

వీరి సంభాషణ మొత్తం విన్నది రూమ్ లో ఉన్న లత.

‘రూంలో బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. ఎలాగైనా నా మనసులో మాట నాన్నకు చెప్పాలి’ అని ధైర్యం తెచ్చుకొని " నాన్నగారూ! నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఎమ్మెస్ చేయాలని ఉంది . నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నేను MS చేసి, జాబ్ తెచ్చుకొన్న క్షణం మీరు ఎవరిని చూపించినా సరే, నేను వివాహం చేసుకోవడానికి సిద్ధం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్నా” అని తన మనస్సులోని మాటను ధైర్యంగా చెప్పింది.

“చూడు తల్లీ! ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది”.

“అది కాదు నాన్నా! ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించి చెప్పండి.. ప్లీజ్ నాన్నా!”

“నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు. అంతే! ఇది ఫైనల్. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు” అని గట్టిగా మాట్లాడడంతో లత సైలంట్ అయింది..

పెళ్లి వాళ్ళు రావడం, వాళ్లకి లత నచ్చడం, పెళ్లి తేదీని ఫిక్స్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

రెండు రోజుల తరువాత లతని కలవడానికి తన ఫ్రెండ్ సుమ వచ్చింది.

" కంగ్రాట్యులేషన్స్ లతా! ఢిల్లీ యూనివర్సిటీలో నీ

సీట్ కన్ఫర్మ్ అయింది. నీ కల నెరవేరబోతోంది..

ఏమైంది లతా! నేను గుడ్ న్యూస్ చెప్పినా ఎందుకు నువ్వు డల్ గా ఉన్నావు????” అంది సుమ.

తనకి ఫిక్స్ చేసిన పెళ్లి గురించి , తనకి వాళ్ళ నాన్నకి

మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా చెప్పింది లత.

" చూడు లతా! ఇది నీ జీవితం. పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ ఉమెన్ గా ఉండి పోవాలి. నీకంటూ ఏ గుర్తింపు అనేదీ ఉండదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది.ఇక నీ ఇష్టం” అని చెప్పి వెళ్ళిపోయింది సుమ .

లత ఆలోచనలో పడింది .

సుమ చెప్పింది నిజం. నా జీవితం ఇప్పుడు నా చేతిలోనే ఉంది.పెళ్లి దేముంది? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. వెళ్లి పోవడానికి ప్లాన్ వేసుకొంది..

తనకు సంబంధించిన వస్తువులను ఇంటి వెనక వైపు నుండి సుమ ద్వారా ఇచ్చి పంపించింది.

“అమ్మా! నేను బ్యూటీపార్లర్ కి వెళ్లి వస్తాను” అంది తల్లితో.

“అమ్మా లతా! కాసేపు ఆగు. ఈ కార్డు తీసుకొని నీకు కావలసినవి ఏవైనా కొనుక్కో” అని తన ఏటీఎం కార్డ్ ఇచ్చారు విశ్వం.

ఆ మాట వినగానే తన నాన్న ప్రేమ ను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి లతకి.

“నీతో ఓ విషయం చెప్పాలి అమ్మా” అన్నాడు విశ్వం

‘అమ్మో! నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నాన్న ప్రేమ ను చూసి నా నిర్ణయం మార్చేసుకుంటాను’ అని మనసులో అనుకొని “నాన్నా! నేను అర్జెంట్ గా పార్లర్ కి వెళ్లాలి. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు” అంది

“అయితే త్వరగా ఇంటికి రా అమ్మా! నీకు ఒక మాట చెప్పాలి” అన్నారు విశ్వం.

“సరే నాన్నా!” అంటూ బయటకు వెళ్ళింది లత.

అలా వెళ్లిన లత నేరుగా ఢిల్లీకి వెళ్లింది. హాస్టల్లో చేరిపోయింది సుమ ఏమో పై చదువులకు లండన్ వెళ్ళిపోయింది.ఇంటికి ఫోన్ చేయాలి అంటే తనకు ధైర్యం సరిపోలేదు. తన బంధువులకు ఎవరికి ఫోన్ చేసినా తనని తిడతారు అని ఫోన్ చేయడం మానేసింది.

తన డైలీ లైఫ్ లో బిజీగా మారిపోయింది.

కొద్ది రోజులు అయిన తరువాత ఇంటికి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది తప్ప ఎవరూ తీయడం లేదు.... అలా చాలా సార్లు చేసింది... కొద్ది రోజులు అయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఆన్సర్ వచ్చింది.

నేను గోల్డ్ మెడల్ తీసుకొని ఇంటికి వెళితే నాన్నకు నా మీద కోపం ఉండదు అని ఆలోచించి… బాగా చదవి ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తను అనుకున్నట్టు గోల్డ్ మెడల్ తీసుకుంది. తన పేరు పత్రికల్లో పడింది..

ఎంతో సంతోషంగా, గర్వంగా ఇంటికి వెళ్ళింది. డోర్ బెల్ కొట్టడానికి లత చేతులు వణుకుతున్నాయి...

డోర్ బెల్ కొట్టగానే ఎదురుగ ఉన్న వాళ్ళ మామయ్యని చూసి షాక్ అయింది.

భయపడుతూనే “మామయ్యా! నాన్న ఎక్కడ ఉన్నారు…” అని అడిగింది

అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు...

“మామయ్యా! నా మీద మీకు కోపం ఉంది అని తెలుసు.

నా భవిష్యత్ కోసం తప్పలేదు. నేను యూనివర్శిటీ ఫస్ట్ వచ్చాను. నా పేరు కూడా పేపర్ లో పడింది. చూడండి కావాలంటే” అని తన పర్సు ఓపెన్ చేయ బోయింది.

“నీ పేరు చాలా రోజుల ముందే పడిందమ్మా పత్రికలో... పారిపోయిన విశ్వం మాస్టర్ గారి కూతురు అని” పేపర్ లత మొహం పై వేశాడు...

లత తన క్లాస్మేట్ సహాయంతో ఢిల్లీ కి వెళ్ళింది. తను థాంక్స్ చెప్పుతూ అతనిని హగ్ చేసుకొంది. ఆ పిక్ ని ఎవరో తీసి పేపర్లో వేశారు.

లత ఏడుస్తూ “మామయ్యా! ఇదంతా అబద్ధం. అతను నా ఫ్రెండ్. నాన్న ఎక్కడున్నాడు చెప్పండి . ఇదంతా నాన్నకి చెప్పాలి.నాన్నా! నాన్నా!... అని లత పిలుస్తుంటే వాళ్ల మామయ్య " మీ నాన్న గారు కావాలి కదా. ఇలా రా" అంటూ ఒక రూం లోకి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్న గారి ఫోటో కి దండేసి ఉంది.

“మీ నాన్న చనిపోయారు . తనకు క్యాన్సర్. తను చనిపోతున్నారు అని తెలిసి, నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని భావించి, నీకు పెళ్లి చేయాలని నిర్ణయించారు . తను బ్రతికి వుండగానే నీ పెళ్లి చూడాలని భావించారు. కానీ నువ్వు నీ స్వార్థం కోసం పెళ్లి కొద్దీ రోజులు ఉంది అనగా వెళ్లి పోయావు...

ఎవరో మీరు గిట్టని వాళ్ళు పేపర్లో నీ ఫోటోను వేసి మీ నాన్న పరువును తీసారు.పెళ్లి వారు , ఇరుగుపొరుగు అన్న మాటల వల్ల మీ నాన్న గారు గుండె నెప్పితో త్వరగానే చనిపోయారు. దీనికి కారణం నువ్వే..” అన్నాడు మామయ్య

లత కింది పడి “క్షమించు నాన్నా! అని గట్టిగా గుండెలు పగిలేలా ఏడ్చింది.

కొద్ది సేపు అగి, “అమ్మ ఎక్కడ మామయ్యా!” అని అడిగింది.

“ఇక్కడ” వాళ్ళ అమ్మ వచ్చి లతను కొట్టింది..

“ఆ రోజు మీ నాన్న గారు త్వరగా రమ్మన్నారు కదా? ఎందుకో తెలుసా...??? పెళ్లి వారితో మాట్లాడాను..పెళ్లి అయిన తరవాత నువ్వు చదువుకోవడానికి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు” అని నీకు చెప్పడానికి....

నువ్వు మీ నాన్న ప్రేమను అర్థం చేసుకో లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన ప్రతి కోరికను తీర్చిన మీ నాన్నఒక్క నీ చదువు ఎందుకు వద్దన్నాడు అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుని నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకుని వెళ్లిపోయావు. ఆ రోజు కాసేపు ఆగి ఉంటే ఇంత అనర్థం జరగకుండా ఉండేది కదా” అంటూ ఆవిడ ఏడ్చారు...

లత వాళ్ళ నాన్న ఫోటోని బాధ గా చూస్తూ మెడలో ఉన్న గోల్డ్ మెడల్ ని ఫోటో వద్ద ఉంచి “దీని ఖరీదు మీ ప్రాణం నాన్నా!” అని గుండె పగిలేలా ఏడ్చింది.

***సమాప్తం***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

డాక్టర్ సంధ్య

లోకం తీరు.. పాపా ?? బాబా??

మేఘన- వందన- ఓ - మేకు

నీ ప్రేమకై వేచి చూస్తున్న నేను

అసలైన గుర్తింపు

నేను.. నాన్న.. ఓ చీమ కథ

నేను.. నాన్న.. ఓ నాటకం

నా మనసు దోచిన చెలికాడు...

మార్పు

గీతా సుబ్రహ్మణ్యం

స్వీట్స్ నేర్పించే నీతి...

మోడరన్ నాన్నమ్మ చెప్పిన సోక్రటీస్ కథ

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


465 views0 comments
bottom of page