top of page
Writer's pictureDhanalakshmi N

డాక్టర్ సంధ్య

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



'Doctor Sandhya' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

డాక్టర్ రూపంలో దేవుళ్ళే కాదు, కామాంధులు కూడా ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం గల మనిషి లాగా అందరి ముందూ చలామణి అవుతున్న డాక్టర్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఓ లేడీ డాక్టర్ కథ...

@@@@@@@@@@@@@@@@@@@@

" హే. . . హుర్రే! నేను కోరుకున్న హాస్పిటల్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. రేపు ఉదయం నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు" సంతోషంగా అంది సంధ్య.

" హల్లో సంధ్య ! మేఘాలలో తెలిపోవడం తగ్గించి కాస్త భూమి మీద నిలబడటం నేర్చుకో" అన్నాడు ఆమె బావ రవి.

" పో బావ ! నువ్వు ఎప్పుడూ ఇంతే.. నేను హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు” అని బుంగమూతి పెట్టుకుని తన రూంకి వెళ్లిపోతుంది సంధ్య.

" రేయ్ రవి ! ఎందుకు రా తనని ఎప్పుడు చూసినా అట పట్టిస్తూ ఉంటావు? తన కల నెరవేరుతుంది అని సంతోషంగా ఉంటే నువ్వు ఏంట్రా అలా బాధ పెట్టావు తనని " అంది అతని అత్తయ్య.

" అత్తయ్యా! నేను సరదాగా అన్నాను... తనకి కూడా తెలుసు.. ఉరికే మీ ముందర నన్ను ఇరికించాలి అని ఇలా అలిగి వెళ్ళింది. నాతో పాటు రండి. కావాలంటే చూడండి. లోపల చాక్లేట్ తింటూ డాన్స్ చేస్తూ ఉంటుంది " అన్నాడు రవి.

నిజంగానే తన రూంలో చాక్లేట్ తింటూ డాన్స్ చేస్తూ ఉంటుంది సంధ్య. వీళ్లు వచ్చినది కూడా చూడదు.

" నటకిరీటి! ఒక క్షణం నేను కూడా నిజం అనుకున్నా!” అంది అతని అత్తయ్య నవ్వుకుంటూ.

ఇంతలో ఫోన్ రావడంతో ఆమె బయటకు వెళ్ళింది. వెంటనే రవి సంధ్యని వెనక నుండి హగ్ చేసుకొని “ కంగ్రాట్యులేషన్స్ బుజ్జి.. నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి.. రేపు ఉదయం నేను నిన్ను డ్రాప్ చేస్తాను " అన్నాడు

" థాంక్స్ బావ.. అలాగే నాకు ట్రీట్ కూడా ఇవ్వాలి. మొన్న నువ్వు రివీల్ చేసిన అక్రమ మందుల సరఫరా చేస్తున్న ముఠా న్యూస్ కి మంచి స్పందన వచ్చింది. నీకు కూడా మంచి న్యూస్ రిపోర్టర్ గా పేరొచ్చింది. నీ ధైర్యంతో ఎంతో మంది జీవితాలు బాగుపడేలా చేశావు కదా! నాకు అందుకే ట్రీట్ కావాలి" అంది సంధ్య.


" రేపు సాయకాలం నీ పని అవ్వగానే అటు నుండే వెళదాము. సరేనా" అన్నాడు రవి.

మరుసటి రోజు హాస్పిటల్ కి వెళ్లి, ఎండి ని కలిసి, డ్యూటీ లో జాయిన్ అయింది సంధ్య.

ఒక రోజు లంచ్ చేస్తుంటే డాక్టర్ విక్రాంత్ వచ్చి పలకరించారు. 'నేను ఇక్కడ గైనకాలజిస్ట్' అంటూ చేయి చాపారు.

సంధ్య కూడా ఆయన సీనియర్ డాక్టర్ కదా అన్న ఉదేశ్యంతో చేయి చాపింది. .

డాక్టర్ విక్రాంత్ తను చేతిని పట్టుకున్న విధానం చూసి మొదట అనుమానం వచ్చినా, తనే తప్పుగా అపార్థం చేసుకుందో ఏమో అని సైలెంట్ అయిపోయింది.

ఇంకోరోజు సంధ్య రౌండ్స్ కి వెళ్ళి వస్తుంటే ఒక నర్సు ఏడుస్తూ Dr. విక్రాంత్ క్యాబిన్ నుండి రావడం గమనించి “ఏంటి విషయం?” అని అడిగింది.

ఆ నర్సు ‘డాక్టర్ తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు’ అని చెప్పింది.

“ఈ విషయం మనం వెళ్లి ఎండీ గారికి ఫిర్యాదు చేద్దాము” అంటే ఆ నర్సు “నేను ఆల్రెడీ చెప్పాను మామ్. సర్ గారు నమ్మడం లేదు!!!! పోనీ నేను వేరే చోట ఉద్యోగం చేసుకుందామంటే నా సర్టిఫికెట్స్ ఇక్కడ లాక్ అయిపోయాయి. ఎటూ కాకుండా అయిపోయాను... ఈ డాక్టర్ రోజురోజుకీ హద్దు మీరుతున్నారు” అని చెప్పి కన్నీరు మున్నీరైంది. తనని ఓదార్చి, సాయం చేస్తానని మాట ఇచ్చింది సంధ్య.

‘ఏం చేస్తే ఈ డాక్టర్ నిజ స్వరూపం బయటకి తీసుకురాగలను?’ అని ఆలోచిస్తుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏడుస్తూ వెళ్ళడం గమనించి తన వెనుకాల వెళ్తుంది సంధ్య .

" ఆ లేడీ, ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఉన్న బెంచ్ మీద కూర్చొని, తన కడుపు పైన చేయి పెట్టుకొని ఏడుస్తూ వుంది, ‘ఏంట్రా ఈ మనుషులు ఇలా హీనంగా మారిపోతున్నారు’ అనుకుంటూ. సంధ్య ఆమె దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడుగుతుంది.

ఆమె బాధ పడుతూ “డాక్టర్ విక్రాంత్ చెక్ చేస్తాను అన్న వంకతో చేతులు ఎక్కడెక్కడో వేస్తున్నాడు. ఈ విషయం నా భర్తకు చెబితే నేనే తప్పుగా అనుకున్నానని అంటున్నారు. పైగా ఆ డాక్టర్, నా భర్త బెస్ట్ ఫ్రెండ్స్.

‘నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా’ అంటూ నా మాటలు తోసిపారేస్తున్నాడు. ఎవరికి తెలిసినా తెలీక పోయినా, ఒక అమ్మాయికి తెలుస్తుంది- తనని ఎవరు ఏ ఉద్దేశంతో పట్టుకున్నారు అని. ఈ రోజు వాడు ముద్దు పెట్టపోయాడు. అందుకే వాడిని కొట్టాను. ఆ కోపంతో వాడు నామీదే చాడీలు చెబుతాడు. ఆయన వాడు చెప్పే మాటలే నమ్మి, నన్ను తిడతారు. అందుకే బాధపడుతున్నాను

వాడు ఎప్పుడో మా వారికి ఆర్ధికంగా సహాయం చేసాడట. అందుకని అయన వాడికి వేల్యూ ఇస్తున్నాడు. నేను ఏం చేయాలి” అని ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది.

సంధ్య ఆమెకు హెల్ప్ చేసి, “మీరు ఈ రాంగ్ స్టెప్ తీసుకోకండి. నేను ఆ డాక్టర్ నిజ స్వరూపం మీ ఆయనకే కాదు, ప్రపంచానికి తెలిసేలా చేస్తా” అంటూ రవికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతనికి ఒక ప్లాన్ చెప్పి, తను హాస్పిటల్ కి వెళ్ళి వంట్లో బాగాలేదని హాఫ్ డే లీవ్ తీసుకొంది.

రవి ,సంధ్య పల్లెటూరి భార్యాభర్తల్లాగా రెడీ అయి వస్తారు. సంధ్య తన మొహం కనపడకుండా ముసుగు వేసుకుంది. సంధ్య మెడలో ఉన్న చైన్ కి కెమెరాని కనెక్ట్ చేస్తారు.

వారిద్దరూ డాక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళారు.

" డాక్టర్ బాబు! మా ఇంటి అవిడికి కడుపులో రెండు రోజులు నుంచి నొప్పి అని విలవిలాడుతోంది. కాస్త చూసి పుణ్యం కట్టుకోండి” అని అడుగుతాడు రవి

విక్రాంత్, సంధ్యను చూసి ‘ఎందుకు ముసుగు వేసుకున్నారు?’అన్నాడు.

“మా ఊరి సంప్రదాయం బాబు! తాళి కట్టిన వాడికి తప్ప పరాయి పురుషులకు మొహం చూపించకూడదు” అన్నాడు రవి.

“సరే! లోపలికి రండి. చెక్ చేస్తాను” అన్నాడు విక్రాంత్. రవికి సైగ చేసి వెళ్ళుతుంది సంధ్య.

లోపల విక్రాంత్ తనని ఎలా టచ్ చేస్తున్నాడో, కావాలనే తనని హద్దు మీరిన మాటలు అనడం, ఇన్ డైరెక్ట్ గా తనని ఇబ్బంది పెట్టడం... ఇవన్నీ లైవ్ లో అన్ని ఛానెల్స్ లో కనపడేలాగా చేస్తారు...

సంధ్యకు కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. రవి కాక ఇంకొకరు అలా పట్టుకోవడం ఆమెను చాలా బాధించింది. అయినా కూడా తన బాధను భరించింది.

వాడు ఇంకా శృతి మించుతున్న టైం లో హాస్పిటల్ ఎం డి బయటనుండి “విక్రాంత్! బయటకు రా” అని గట్టిగా అరుస్తాడు.

బయటకు వచ్చిన విక్రాంత్ తో “ఏమి చేస్తున్నావు అసలు? హాస్పిటల్లో నువ్వు చేసిన నిర్వాకం అంతా ఇపుడు లైవ్ లో వస్తుంది” అని తన రూమ్ లో ఉన్న టీవీని ఆన్ చేస్తాడు.

నమ్మి టెస్టింగ్ కి వచ్చిన గర్భవతులను లైంగికంగా వేధిస్తున్న డాక్టర్….

డాక్టర్ రూపంలో ఉన్న కామాంధుడు...

ఇలా రకరకాలుగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు మీడియా వాళ్ళు , గతంలో ఆ డాక్టర్ వల్ల బాధపడ్డ వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చి, నానా హడావిడి చేస్తుంటారు.

సంధ్య కోసం రవి లోపలకి వెళ్ళితే తాను ఆ డాక్టర్ టచ్ చేసిన ప్రతిచోటా వాటర్ పోసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.

“ప్లీజ్ ఏడువకురా! నువ్వు చేసింది చాలా మంచి పని. నువ్వు చేసిన సాహసం వల్ల, ఇంకెవరూ ఈ ప్రాబ్లెమ్ లేకుండా ఉంటారు” అని హగ్ చేసుకొని, వెన్ను నిమరుతాడు రవి.

ఇంతకు ముందు సంధ్య దగ్గర తన బాధ చెప్పుకున్న లేడీ, ఆమె హస్బెండ్ కూడా విక్రాంత్ ని తిడుతూ ఉంటారు. ఇంకొంత మంది ఆడవాళ్లు విక్రాంత్ ని కొడుతూ ఉంటే, సంధ్య వాళ్ళను ఆపుతుంది.

విక్రమ్ వైపు చూస్తూ “చూసావు కదా ఆడవాళ్ళ శక్తి ఏంటో ! నా అనుకుంటే ప్రాణం ఇస్తాం. అలాంటి ఆడవాళ్ళ పైన చిన్న చూపు చూపిస్తే కాళికామాత అవతారం ఎత్తి మరీ నీ అంతు చూస్తాము. గాట్ ఇట్?” అంటుంది.

హాస్పిటల్ ఎండీ మీడియా వాళ్లతో మాట్లాడుతూ “విక్రాంత్ చేసిన పనికి మేము సిగ్గు పడుతున్నాము. తాను మాత్రమే అలాంటి వాడు. మిగతా మా డాక్టర్లంతా మంచి వారు . ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయకుండా విక్రాంత్ ని డిస్మిస్ చేస్తూ , తన డాక్టర్ లైసెన్సుని రద్దు చేసేలాగ మా డాక్టర్ కమీటీ తో మాట్లాడతాను” అన్నాడు .

సంధ్య చూపిన తెగువను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు. .

సంధ్య తన పరిజ్ఞానంతో సేవ చేస్తూ మంచి డాక్టర్ గా అందరి ప్రశంసలు అందుకుంది...

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.




96 views0 comments

Comments


bottom of page