అమ్మా క్షమించు
- Addanki Lakshmi

- 8 hours ago
- 6 min read
అమ్మా క్షమించు, అద్దంకి లక్ష్మి, తెలుగు కుటుంబ కథ, సవతి తల్లి, తల్లి ప్రేమ, మాతృత్వం, కుటుంబ విలువలు, భావోద్వేగ కథ, Emotional Telugu Story, Family Story Telugu, Motherhood, Stepmother Love

Amma Kshaminchu - Telugu Emotional Family Story| Addanki Lakshmi
అమ్మా క్షమించు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 16/07/2026
అమ్మ ప్రేమ రక్తసంబంధంతో మాత్రమే పరిమితం కాదు. ప్రేమతో పెంచే ప్రతి మహిళ హృదయంలో మాతృత్వం సహజంగా ఉంటుంది. "అమ్మా క్షమించు" కథలో సవతి తల్లి అని ద్వేషించిన కమల, తన త్యాగం, ప్రేమ, ఆప్యాయతతో చివరికి సుధ మనసును ఎలా గెలుచుకుందో హృదయాన్ని కదిలించేలా చిత్రించారు.
"డాడీ! డాడీ! ఈ ఆంటీ ఎవరు? నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మా ఇంటికి?"
హాల్లో హోం వర్క్ చేసుకుంటున్న సుధ తండ్రి దగ్గరికి వెళ్లి అమాయకంగా అడుగుతోంది.
"ఈవిడ! ఈవిడ మీ అమ్మ సుధా. ఈరోజు నుంచి అమ్మా అని పిలవాలి."
నారాయణరావు సుధను దగ్గర తీసుకుని ప్రేమగా చెబుతున్నాడు.
"రామ్మా సుధా! నా దగ్గరకు" అంటూ చేతులు చాచింది ప్రేమగా కమల.
"ఛీ నీవెవరు, నేను రాను పో" అంటూ తండ్రిని గట్టిగా పట్టుకుంది ఏడేళ్ల సుధ.
ఇంతలో వంటింట్లోంచి మంగమ్మ హారతి పళ్ళెంతో వచ్చి,
"రండి బాబు గారు, అమ్మగారు," అంటూ ఇద్దరికీ హారతినిచ్చింది.
"ఆంటీ, ఈవిడెవరో మనకు తెలియదు పొమ్మను" అంటూ అరుస్తోంది సుధ కోపంతో.
మంగమ్మ, "అలా అనకమ్మ, ఈవిడ నీకు అమ్మ అవుతుంది. అమ్మా అని పిలవాలి. నీ గురించే మీ నాన్నగారు ఈ కొత్త అమ్మని తీసుకువచ్చారు" అంటూ సుధను దగ్గర తీసుకుని సముదాయించింది.
"రండి అమ్మగారు" అంటూ కమలను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది మంగమ్మ.
"ఇలా రా సుధా" అంటూ తండ్రి పిలిచాడు.
"నేను రాను పో!" అంటూ సుధ తన రూమ్ లోకి వెళ్లిపోయి తలుపు వేసేసుకుంది కోపంతో.
నారాయణరావుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. మేనమామ ఇంట్లో పెరిగాడు.
మామయ్య, అత్తయ్య చాలా బాగా చూసేవారు. చదువులో మంచి తెలివితేటలు ఉండడం వల్ల మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు, బ్యాంకులో ఆఫీసర్ గా చేరాడు.
మామయ్య కూతురు శాంత, పనుల్లో యాక్టివ్ గా ఉండేది. చదువులో అంత శ్రద్ధ చూపేది కాదు. డిగ్రీ పాసయ్యింది.
మామయ్య తన కూతుర్ని ఇచ్చి నారాయణరావుకి పెండ్లి చేశాడు. వారి సంసారం హాయిగా జరుగుతోంది.
సుధ పుట్టింది, శాంత ఆరోగ్యం క్షీణించసాగింది.
క్యాన్సర్ భారిన పడింది. నారాయణరావు లోన్స్ తీసుకుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆమెకి వైద్యాన్ని ఇప్పించాడు. కానీ దురదృష్టవశాత్తు సుధకి ఐదేళ్లు వచ్చేసరికి శాంత కన్నుమూసింది.
అత్తయ్య, మామయ్య మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా కోరారు. నారాయణరావుకి ఇష్టం లేదు. కొత్తగా వచ్చిన ఆ పిల్ల తన కూతుర్ని సరిగ్గా చూస్తుందో లేదో అని భయం.
అందుకనే తనకు దూరపు బంధువు మంగమ్మను తెచ్చి పెట్టుకున్నాడు. ఆమెకు ఎవరూ లేరు. 50 ఏళ్లు ఉంటాయి. పిల్లను చూస్తుంది, వంట వండుతుంది, ఇల్లంతా చూసుకుంటుంది.
అప్పుడప్పుడు సుధ అమ్మ కావాలని ఏడ్చేది. ఇప్పుడు పెద్దయిన తర్వాత కాస్త జ్ఞానం వచ్చింది. మీ అమ్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ రాదు అని చెప్తుంటే అర్థం చేసుకుంది.
మంగమ్మను ఆంటీ అని పిలుస్తుంది. చెప్పినట్లు బుద్ధిగా ఉంటుంది, బాగా చదువుకుంటుంది. నారాయణరావుకి ఏమీ ప్రాబ్లం లేదు.
ఆఫీసులో కమల అనే ఆవిడ ఎప్పటి నుంచో పని చేస్తోంది. ఆమె తండ్రికి తక్కువ జీతం. ఇద్దరు చెల్లెళ్ళకి చదువు చెప్పించి, పెళ్లిళ్లు చేసింది. కుటుంబ బాధ్యతలలో తండ్రికి సహాయంగా ఉండేది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని బాగా పోరుతున్నారు.
'నీకు నచ్చిన వాడిని చేసుకో. మేము పెద్దవాళ్ళం అయిపోయాము. ఎప్పుడో మేము కన్నుమూస్తే నీకు తోడు నీడ ఉండాలి కదా" అంటారు తల్లిదండ్రులు. చెల్లెలు కూడా చెప్పారు, "అక్కా! పెళ్లి చేసుకో. తల్లిదండ్రుల బాధ్యత మేము కూడా చూస్తాము. ఇప్పటికైనా నీవు ఫ్రీగా అవ్వు. అన్ని బాధ్యతలు కొడుకులా నెరవేర్చావు కదా. మా సంసారాలలో మేము హాయిగా ఉన్నాము. నువ్వు ఒక ఇంటి దానివైతే మాకు సంతోషం."
ఆమెను ఆఫీసులో అందరూ గౌరవంగా చూసేవారు.
ఆఫీసులో పనిచేసే నారాయణరావు స్నేహితుడు రవి ఒకసారి, "నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కదా! ఆమెకు కూడా ఇప్పుడు బాధ్యతలు తీరిపోయాయి. నీవు ఎంత కాలం ఒంటరిగా ఉంటావు? ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిస్తే నువ్వు ఒంటరివాడైపోతావు. ఆమె కూడా అదే పరిస్థితిలో ఉంది కదా. ఆమెను నువ్వు చేసుకో" అంటూ సలహా ఇచ్చాడు.
ఇద్దరితోనూ మాట్లాడి ఒప్పించాడు. ఒక శుభ ముహూర్తంలో రిజిస్టార్ ఆఫీస్ కి వెళ్లి ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటి నుంచి మొదలైంది గొడవ.
సుధకు కమలంటే ఏమాత్రం ఇష్టం లేదు.
తన తల్లి స్థానంలో ఆమె ఉందని మనసులో చాలా ఈర్ష్యగా ఉండేది.
కమల సుధను ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేది.
మంచి మంచి డ్రెస్సులు కొని తెచ్చేది.
"నీవు తెచ్చినవి నాకు నచ్చదు. నీవంటే నాకు ఇష్టం లేదు. నాకు వద్దు పో!" అంటూ మొహం మీద గిరవాటు పెట్టేది.
"అన్నము పెడతాను రా అమ్మా" అంటే,
"నువ్వు పెట్టొద్దు, నాకు ఆంటీయే పెట్టాలి. నీ చేతి వంట నాకు ఇష్టం లేదు!" అంటూ కోపంగా వెళ్ళిపోయేది.
నారాయణరావు సందిగ్ధంలో పడ్డాడు. జీవితం కొంత ప్రశాంతంగా నడుస్తుందనుకుంటే సుధ ఇట్లా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. అనవసరంగా కమలని ఈ రొంపిలోకి దింపాను అనుకుని బాధపడతాడు.
"పర్వాలేదండి, చిన్నపిల్లలు అట్లాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని లోటు మనము తీర్చలేము కదా!" అంటూ అతనిని సముదాయిస్తుంది.
ఎన్ని విధాలుగా తన దగ్గరకు తీసుకుందామన్నా సుధ మనసులో కమల పట్ల ఈర్ష్య భావం తొలగిపోలేదు.
బీటెక్ చదివిన తర్వాత మంచి కంపెనీలో జాబ్ సెలక్షన్ దొరికింది.
ఆఫీసులో పనిచేసే కిరణ్ తో ప్రేమలో పడింది సుధ.
ఇరు కుటుంబాల వాళ్లకి సంబంధం నచ్చింది. పెండ్లి శుభలేఖల వరకు వచ్చింది.
పెళ్లి శుభలేఖల మీద అడ్రస్సులు రాస్తూ పోస్టులో వేయాలి.
కమల, నారాయణరావు ఇద్దరూ అడ్రస్సులు రాస్తున్నారు.
"నీవేమీ రాయవద్దు. నువ్వేమీ మా అమ్మవి కాదు" అంటూ సుధ కోపంగా వచ్చిందక్కడికి.
వెంటనే మంగమ్మ, "అట్లా అనకూడదు అమ్మా, ఆమె మీ పిన్ని.
నీ పెళ్ళి అంటే చూశావా పిన్నికి ఎంత సంతోషంగా ఉందో."
"ఈమెకేముంటుంది? ఈమేమైనా నా సొంత తల్లా?" కోపంగా అంది సుధ.
నారాయణరావు ఇంక సహించలేకపోయాడు. వెంటనే లేచి వచ్చి రెండు తగిలించాడు చెంప మీద. కోపంగా "ఏమిటే కూస్తున్నావు!
ఏదో చిన్న పిల్లవి కదా అని ఎప్పటికప్పుడు ఊరుకుంటే మరీ మితిమీరి పోతున్నావు.
నీ తల్లి పోయిన తర్వాత కమల వచ్చి నిన్ను సొంత తల్లి కన్నా ప్రేమించింది. నీ గురించి ఎన్ని త్యాగాలు చేస్తోందో నీకేం తెలుసు? మీ అమ్మ వైద్యానికి నేను అప్పుల్లో మునిగి ఉన్నాను. అవన్నీ తీర్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది.
కమల వచ్చి నాకు అన్ని విధాలా సహాయపడింది. ఈ రోజు నీ పెళ్లి ఇంత వైభవంగా 15 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నామంటే అదంతా మీ పిన్ని చలవే.
తాను దాచిన డబ్బంతా నీ పెళ్లికి ఖర్చు పెడుతుంది.
నీకేం తెలుసు ఆమె త్యాగగుణం? నాకు పిల్లలు వద్దండి, ఒకవేళ నాకు పిల్లలు పుడితే నేను సుధని సరిగా చూడలేనేమో, సుధనే నేను కన్న కూతురిగా అనుకున్నాను, నా మనసు మారకుండా నేను పిల్లల్ని కనను అని చెప్పింది.
ఒక తల్లి కన్న పిల్లని మరో చేతిలోకి తీసుకుని, కన్న తల్లి కన్నా ఎక్కువగా నిన్ను చూసుకుంది. ఈ రోజున నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయిస్తోంది అంటే అదంతా కమల చలవే. వాళ్లు చాలా కట్నకానుకలు అడిగారు, సుధకి ఇష్టమైన పెండ్లి చేయండి, డబ్బు ఖర్చయినా పరవాలేదని తన బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ చేసి నీ పెళ్లికి ఇచ్చింది.
పెద్ద వయసు వచ్చే కొలది తెలుసుకుంటావని అనుకున్నాను. ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు." అంటూ నారాయణరావు కోపంగా అరిచాడు.
"అయ్యో, కోపం తెచ్చుకోకండి. చిన్నపిల్ల, దానికి ఇవన్నీ తెలియదు" అంటూ కమల,
సుధకు తల తిరిగిపోయింది. తండ్రి చెప్తున్న మాటలన్నీ విని, 'అయ్యో తాను ఎంత మూర్ఖురాలు! పిన్ని అంత మంచిదాన్ని పట్టుకొని తను ఎప్పుడూ ఏడిపించేది' అని వెంటనే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.
"అమ్మా, నన్ను క్షమించు" అంటూ కమల కాళ్ళ మీద పడింది సుధ.
కమలకు కన్నీళ్లు పర్యంతమయ్యాయి. సుధను కౌగలించుకొని,
"పర్వాలేదు సుధా! ఇప్పటికైనా నువ్వు తల్లి ప్రేమను అర్థం చేసుకుంటే నాకు అదే చాలు" అంటూ కమల కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
తల్లీకూతుర్లను చూసి, ఇప్పటికీ నారాయణరావు మనసుకి ఆనందమైంది.
"అమ్మా సుధా!
ఆడదాని మనసు ఎప్పుడూ ప్రేమతో నిండిపోయి ఉంటుంది. కంటేనే పిల్ల కాదు, పెంచిన వారి మీద కూడా అంతే మమకారం ఉంటుంది. ప్రతి ఆడదాని మనసులోనూ తల్లి ప్రేమ నిండి ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా అమ్మా అని పిలిచామా, ఆమె మనసులో ప్రేమ ఉప్పొంగిపోతుంది తల్లిలాగా. మీ పిన్ని ఎన్ని త్యాగాలు చేసిందో నీకు అర్థమైందా" అంది మంగమ్మ.
ఇప్పటికి సుధకి తల్లి ప్రేమ అర్థమైంది.
***
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,










Comments