top of page
Original.png

ఆనందమానందమాయే మహాదానందమాయే

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

“సంక్రాంతి సంబరాలతో కళకళలాడుతున్న తెలుగు పల్లెను భావోద్వేగంగా చూస్తున్న మహదేవరావు”
“సంక్రాంతి సంబరాలతో కళకళలాడుతున్న తెలుగు పల్లెను భావోద్వేగంగా చూస్తున్న మహదేవరావు”

Anandamanandamaye mahadanandamaye | Telugu Emotional Story | Nallabati Raghavendra Rao

ఆనందమానందమాయే మహాదానందమాయే | తెలుగు భావోద్వేగ కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 21/05/2026



అమెరికాలో తన కొడుకు ఇంట్లో ఉన్న మహదేవరావు కంగారుగా షెల్పుల్లో, బీరువాల్లో ఉన్న సామాన్లు చిందరవందరగా కింద పడేస్తూ ఏదో వస్తువు గురించి వెతుకుతున్నాడు.


''రామాపురంలో... బాబాయి తప్పించి ఎవరూ లేరు కదా. అనవసరంగా ఎందుకు వెళ్లడం, ఖర్చు దండగ. వాట్సాప్‌లో మాట్లాడితే సరిపోతుంది కదా! అంటున్నాడు నిన్నటి నుండి మన అబ్బాయి. వాడన్నది నిజమే. 15 సంవత్సరాలు అయితే మాత్రం... వెళ్లి ఆ ఊరు చూస్తేనే కాని ఉండలేరా? కాస్త ఆలోచించండి. ఏమిటి అలా కంగారుపడుతూ వెతుకుతున్నారు, నాకు చెప్పండి?'' అన్నది భార్య జగదీశ్వరి ఇంట్లోంచి వచ్చి.


''నా తులం తూకం బంగారు ఉంగరం కనిపించడం లేదే?''


''ఏది... ఆ విఘ్నేశ్వరుడి బొమ్మదా? ఆ మధ్యన లూజుగా ఉందన్నారు. అది ఎప్పుడూ వేలు నుండి తీసి ఎక్కడ పెట్టారు, కదా. చిన్నప్పుడు మీకు, మీ తమ్ముడిగారికీ మీ నాన్నగారు ఒకేసారి చేయించారని చెప్తుండేవారు. అయినా మీకు బొత్తిగా అశ్రద్ధ. దానికి తోడు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయాయి.''


''హుష్! కాస్త ఆపుతావా? వెతుకుతున్నాను కదా!''

చిరాకు పడుతూ అన్నాడు మహాదేవరావు. 

****


వాలు కుర్చీలో కూర్చున్న మహదేవరావు ఇండియాలో రామాపురంలో ఉన్న అతని తమ్ముడు సహదేవుడికి ఫోన్ చేశాడు. ఉంగరం కనిపించకుండా పోయిన విషయంతో సహా విశేషాలన్నీ మాట్లాడుకోవడం అయ్యాక, మహదేవరావు తమ్ముడితో తన ఆరోగ్య పరిస్థితి చెప్తూ... ''ఒరేయ్ తమ్ముడూ, నాకు ఈ మధ్య కాస్తంత ఆరోగ్యం బాగుండలేదురా. లక్షణాలనుబట్టి నాకు పచ్చకామెర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. అబ్బాయికి చెప్తే ఈ అమెరికాలో హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయిస్తాడు. నాకదేమో ఇష్టం లేదు. అందుకనే మన రామాపురం వద్దాం అనుకుంటున్నా. అక్కడ వెల్లసావరం డాక్టర్ గారు మూడు వారాలు పసరు మందు ఇచ్చి, రోగాన్ని తగ్గించేస్తున్నారు కదా. అందుకనే రేపు డిసెంబర్లో మేమిద్దరం మన రామాపురం వచ్చేస్తాం. ఓ నెల రోజులు మన పల్లెటూరులో ఉండాలని ఉందిరా. అయితే, 15 సంవత్సరాల క్రితమే... రామాపురంలో ఉన్న నా ఇల్లు అమ్మేశాను కదా. ఇప్పుడు నెల రోజులు మీ ఇంట్లో ఉండాలంటే నీకు కొంచెం ట్రబుల్ అవుతుందేమోనని ఆలోచిస్తున్నానురా.'' అంటూ చెప్పాడు.


''అదేంటి అన్నయ్యా! నా ఇల్లు చిన్నదైనా నువ్వు, వదిన నా ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే, అదే సమయంలో ఒక నెల రోజులు మీ మరదలు, పిల్లలతో అచ్యుతాపురం వాళ్ళ అమ్మగారింటికి సంక్రాంతి సెలవులు కనుక, వెళ్తానంటుంది. ఫోన్లో మాట్లాడిస్తానులే. మీరు వచ్చేయండి. నువ్వు ఈ పల్లె వాతావరణంలో గడిపి చాలా సంవత్సరాలైంది కదా. ఆటవిడుపుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒక నెల రోజులు ఉంటే నీ వ్యాధులన్నీ తగ్గిపోతాయి.'' అంటూ అన్నగారిని ఆహ్వానించాడు.


''అన్నట్టు అక్కడ సంక్రాంతి సంబరాలు ఇదివరకటిలా జరుగుతున్నాయా?'' అడిగాడు మహదేవరావు.


''ఏమి సంక్రాంతి సంబరాలు, అన్నయ్యా! నా మొఖం! 12 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు బొత్తిగా మచ్చుకి కూడా కనిపించడం లేదు.''


''సరే కానీ, నువ్వు ఒక పని చేయరా. సంక్రాంతి నెల పెట్టేటప్పటికి మేము వస్తాం. ఆ నెల రోజులు రకరకాల వేషాలు వేస్తూ మన పల్లెటూళ్ళలో ప్రతి వీధి తిరిగే ఆ వేషగాళ్ల ఫోన్ నంబర్లు జాగ్రత్త పెట్టి ఉంచు.'' అంటూ చెప్పాడు.


''వాళ్ళ అడ్రస్‌లు ఎలా దొరుకుతాయి, అన్నయ్యా! పొట్ట కూటి కోసం ఎక్కడికో వలసలు పోయారు. ఆ వేషాలు, విద్యలు, పాటలు, పద్యాలు అవన్నీ మర్చిపోయి ఉంటారు కూడా. మన రైతు చిట్టిసింహాద్రి నాయుడుకి అప్పట్లో వాళ్ళతో బాగా పరిచయం ఉండేది. అతని దగ్గర ఏమైనా వాళ్ళ ఆచూకీ ఉందేమో కనుక్కుంటానులే.'' అన్నాడు తమ్ముడు సహదేవుడు.


*****


తను పుట్టి పెరిగిన రామాపురం పల్లెటూరుకు వెళ్లడానికి, అక్కడ దగ్గర్లోని వెల్లసావరంలో పచ్చకామెర్లకు మందు తీసుకోవడానికి అతి బలవంతంగా తన కొడుకు, కోడలు చేత ఒప్పించుకొని మొత్తానికి తన భార్యతో రామాపురం వచ్చాడు, అమెరికా నుండి మహదేవరావు. వచ్చిన తర్వాత రోజే పచ్చకామెర్లకు మందు కూడా వెళ్లి తెచ్చుకున్నాడు.

ఆ మరునాడే సంక్రాంతి పండుగ నెల పట్టారు. తెల్లవారుజామునే లేచి తమ్ముడితో ఆ పల్లెలో నాలుగైదు వీధులు తిరిగాడు మహదేవరావు. ఏవి అప్పటి ఆనందాలు, సంతోషాలు! నీరసంగా, నిస్తేజంగా కనిపిస్తుంది తన పల్లె. వీధిలో ఆవుపేడతో శుభ్రంగా కల్లాపి చల్లి, రకరకాల రంగురంగుల ముగ్గులు పోటాపోటీగా పెట్టేవారు ఒక్కరు కూడా కనపడలేదు.


''తమ్ముడూ... ఆ చిట్టిసింహాద్రి నాయుడు నంబరు కావాలిరా.'' తమ్ముడు దగ్గర నంబరు తీసుకున్నాడు మహదేవరావు.


''పని జరగదు, అన్నయ్యా! ఆ వేషగాళ్ల గ్రూపులన్నీ కలిపి చాలా ఉంటాయి. ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉంటారు. వారందరి గురించి తిరగడం, బతిమలాడడం, వాళ్లకు ఒక్కొక్క పార్టీకి ఐదు వేలు, పది వేలు ముందస్తు నజరానాగా ఇచ్చి... 'ఈ నెల అంతా మీరు వేషాలు కట్టండిరా!'... అంటూ వాళ్ళని కాళ్లు, చేతులు పట్టుకుని బతిమలాడటం. ఇదో పెద్ద తతంగం అయిపోతుంది. ఈ వయసులో ఇదంతా నీకు అవసరమా? అందులోనూ పచ్చ కామెర్ల వ్యాధి ఉన్నవాడివి. విశ్రాంతి తీసుకోవాలి.'' అంటూ అన్నగారిని నెమ్మదిగా వారించాడు సహదేవుడు. అయితే, ఉప్పు లేని కూరలా పండగ రోజులు అలా నిస్సత్తువగా గడవడం మహదేవరావు గుండెను తొలిచేస్తుంది.

. ఇదో పెద్ద తతంగం అయిపోతుంది. ఈ వయసులో ఇదం తా నీకు అవసరమా. అందులోనూ పచ్చకామెర్లు వ్యాధి వాడివి. విశ్రాంతి తీసుకోవాలి.. '' అంటూ అన్నగారిని నెమ్మదిగా వారించాడు సహదేవుడు. అయితే.. ఉప్పు లేని కూరలా పండగ రోజులు అలా నిస్సత్తువగా గడవడం మహదేవరావు గుండెను తొలిచేస్తుంది. 


మహాదేవరావు ఏదో గుర్తొచ్చినవాడిలా, ''అన్నట్టు ఒరేయ్ తమ్ముడూ... మన చిన్ననాటి ఫ్రెండ్‌ భరత్ కుమార్ అంబాలాల్ ఎక్కడ ఉంటున్నాడురా?'' అడిగాడు నడుస్తూ.


''వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మన పక్క ఊరు కాకినాడలో 'గాయత్రి జ్యువెలర్స్' అని పెద్ద గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడు,'' చెప్పాడు సహదేవుడు.


***


అలా నిస్తేజంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా సంక్రాంతి పది రోజుల్లోనే వచ్చేస్తుంది. ''తమ్ముడూ... ఇంట్లో వంట పనులు మీ వదిన చూస్తుంది. మిగిలిన ఈ పది రోజులు ఈ పల్లె వాతావరణం అంతా మరొక్కసారి చూసి ఆనందం పొందాలి అని నాకు ఆశగా ఉంది. కనుక మళ్లీ ప్రతి రోజు మనం ఒక్కొక్క వీధి తిరుగుదాం. ఏమైనా పండుగ వాతావరణం మొదలైందేమో చూద్దాం,'' అంటూ మహదేవరావు తన తమ్ముడు సహదేవుడిని ఒప్పించి మొట్టమొదటగా పసలవారి వీధికి తీసుకువెళ్లాడు.


వాళ్ళిద్దరికీ దూరంగా ఎదురుగా చిడతలు వాయించుకుంటూ, పాట పాడుకుంటూ హరిదాసు రావడం చూసి ఆశ్చర్యపోయాడు సహదేవుడు. మహదేవరావు తను కూడా మహా ఆనందపడుతూ... ''అదిగోరా తమ్ముడూ... హరిదాసు. ఎంతో అందంగా తయారై మెడలో దండ, చేతిలో చిడతలు, నెత్తి మీద రంగురంగుల కలశపాత్ర. ప్రతి గుమ్మం దగ్గర కూర్చుంటూ, కలశపాత్రతో బియ్యం, డబ్బులు కూడా వేయించుకుంటున్నాడు. అబ్బా! చూడరా!'' అంటూ దూరంగా వస్తున్న హరిదాసుని చూపించాడు సహదేవుడికి.

''అవును.'' అంటూ అన్నగారి వైపు విస్మయంగా చూస్తూ అన్నాడు సహదేవుడు. మహదేవరావు మౌనంగా తమ్ముడితో నడవడం మొదలుపెట్టాడు. సహదేవుడు ఇంకా ఆశ్చర్యంలో నుంచి తీరుకోలేదు. '12 సంవత్సరాలు కనుమరుగైపోయిన ఈ హరిదాసు ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చాడబ్బా?' అన్న అనుభూతితో నడుస్తున్నాడు అన్నగారి వెంట సహదేవుడు.


***


ఆ మరునాడు నుండి అందమైన అమ్మాయిలు తెల్లవారుజామునే రంగురంగుల ముగ్గులు పెట్టడం మొదలెట్టేశారు.

''అమ్మా... తల్లి లక్ష్మక్క... సుబ్బాయమ్మక్క... పప్పుదాకలో పడిపోతున్నానమ్మో!'' అనుకుంటూ కొమ్మదాసరి బలుసువారి వీధిలో హడావుడి చేస్తూ వెళ్తున్నాడు.

''అబ్బా! చూడరా! అదిగోరా మన కొమ్మదాసరి. నెత్తిన కుచ్చుటోపితో చేతిలో చిన్న జూకతో వచ్చేశాడు!'' కొమ్మదాసరి కన్నా తనే ఎక్కువ హడావిడి చేస్తున్నట్టు చెప్పాడు సహదేవుడికి మహదేవరావు.


''అంబ పలుకు, జగదాంబ పలుకు... అమ్మ పలుకు, గూట్లో చిలకమ్మ పలుకు... గోదాట్లో చేపమ్మ పలుకు.''

''హమ్మయ్య! మన బుడబుక్కల నరసయ్య వచ్చేశాడు. పెద్ద తలపాగా, భయంకరమైన మీసాలు, డమరుకం. అమ్మో... చొక్కా మీద చొక్కా... దాని మీద ఇంకో చొక్కా!'' అంటూ ఆనందంగా ముచ్చటపడుతూ అన్నాడు మహాదేవరావు. అలా ప్రతిరోజు ఆనందాలే.

అమ్మో.. చొక్కామీదచొక్కా.. దానిమీద ఇంకో చొక్కా.. " అంటూ ఆనందంగా ముచ్చటపడుతూ అన్నాడు మహ దేవరావు.... అలా ప్రతిరోజు ఆనందాలే. 

''ఊరంతా సంక్రాంతి సందడి. పిల్లల సరదా ఆటలు. అమ్మలక్కల ముగ్గులు. ప్రతి ఇంట్లో ఆడపడుచులు నోములు నోచే సరదాలు. అమ్మో... ఇలా ఆకాశం వైపు చూస్తే ఎన్నెన్ని రంగుల గాలిపటాలో! తమ్ముడూ, ఇదేరా నేను కోరుకున్న మన పల్లె!'' పరవశిస్తూ అన్నాడు మహాదేవరావు.

''చూడరా! గంగిరెద్దులవాడి గోల, తమ్ముడూ! ఎంతో ముచ్చటగా బూర ఊదుతూ ఎద్దుని ఆడిస్తున్నాడు. అది డాన్స్ కడుతుంది. ఇటు నక్కలోళ్లు కూడా వచ్చేశారు. ఇదిగో కోతిని ఆడించుకుంటూ మన ఊరు రాములమ్మ. ఇంకా మన ఊరి రామాలయం దగ్గర చెక్కభజన కూడా మొదలైపోయిందిరా! అమ్మో అమ్మో... ఊరంతా పిండివంటల సువాసన. అదిరిపోతుందిరా!''

''ఉండరా! ఉండు... ఆ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల సందళ్లు, అమ్మలక్కల పేరంటాలు. అబ్బో... ఓ పక్క కర్రసాములు... ఈ పక్క గారడీ వాళ్లు. అమ్మో! నా పల్లెకి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. మిలమిలలాడిపోతోంది. ఇదన్నమాట రామాపురం అంటే!''... అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు. వాళ్ల గుండెల నిండా పదిరోజుల ప్రత్యక్ష ఘటనల మధుర, ఆనందాల అనుభూతులే.


''అమ్మో! వీళ్ళందర్నీ బతిమలాడి రమ్మంటే లక్ష రూపాయలు ఖర్చు. వీళ్ళందరికీ బుద్ధిపుట్టి వచ్చి ఉంటారు!'' మనసులో అనుకున్నాడు సహదేవుడు.


***


ఆ రోజే మహాదేవరావు, జగదీశ్వరి అమెరికా ప్రయాణం. రాజమండ్రిలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్‌లో దిగాలి అనేది వాళ్ల ప్రయాణం. స్టేషన్ కి వచ్చి కొద్దిసేపట్లో బయలుదేరబోతున్న ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. సహదేవుడు వాళ్లిద్దరికీ సెండాఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ దగ్గర నిలబడి అన్న, వదినతో మాట్లాడుతూ ట్రైన్ బయలుదేరడానికి సమయం ఉండడంతో దూరంగా ఉన్న షాపులో బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు కొని వాళ్లకు ఇవ్వాలని వెళ్ళాడు. అవి కొంటుండగా చిట్టిసింహాద్రి నాయుడు కనిపించి... ''సహదేవుడు గారు, మీ అన్నయ్యగారు ఉన్నారా, అమెరికా వెళ్లిపోయారా?'' అంటూ అడిగాడు.

''ఈరోజే వెళ్తున్నాడు. కానీ, నిన్ను మా అన్నయ్య కలిశాడా?''

''అదేంటండి బాబూ... మీకు చెప్పలేదా? మీరు ఒక రోజు మండపేట ఏదో పని మీద వెళ్లారట, కదా. ఆ రోజు మీ అన్నయ్యగారు నన్ను కలిశారు. విషయం చెప్పారు. ఆ రోజు మొత్తం మేమిద్దరం నా బండి మీద చుట్టుపక్కల గ్రామాలు తిరిగి, ఇదిగో ఈ సంక్రాంతి వేషగాళ్లను అందరిని కలిశాము. వాళ్లందరినీ మీ అన్నయ్యగారు బతిమాలి, చాలా డబ్బులు ఇచ్చి ఈ సంక్రాంతి పండుగను ఇలా కళగా నడిపించారు అన్నమాట. అమ్మో! నేను చూస్తుండగా ఆ ఒక్క రోజు ఇంచుమించు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారండి వీళ్ళ గురించి. ఉండండి. నేను వేరే ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళాలి. నా ట్రైన్ వెళ్లిపోయేలా ఉంది.'' అంటూ గబాగబా వెళ్లిపోయాడు చిట్టిసింహాద్రి నాయుడు.

సహదేవుడికి కొంచెం అర్థమైంది. బరువుగా అడుగులు వేసుకుంటూ అన్నగారు కూర్చున్న బోగీ కిటికీ దగ్గరకు సమీపించాడు. అతని వదిన కొంచెం దూరంలో బోగీలో నిలబడి, తెలిసున్న ఎవరితోనో మాట్లాడుతోంది.

''అన్నయ్యా, నీకు మన పల్లె మీద ఇంత అభిమానం ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదరా?'' అంటూ అడిగాడు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ సహదేవుడు.


''ఉండొచ్చురా, తమ్ముడూ... కానీ నేటి కాల పరిస్థితుల ప్రభావం ప్రకారం నీళ్లు ఏ వాలుకు ప్రవహిస్తే, ఆ వాలుకు మన వయసులో వాళ్లు వెళ్లిపోతూ ఉండాలిరా!'' అంటూ తమ్ముడు కళ్లల్లోకి చూస్తూ తన జేబులోంచి ఒక ప్లాస్టిక్ పొట్లం తీసి ప్లాట్‌ఫామ్‌ మీద పడేశాడు.

''అదేమిటి అన్నయ్యా? ఆ పొట్లం వెల్లసావరం పచ్చకామెర్ల మందు కదా! నువ్వు మింగలేదా?'' నుదురు చిట్లిస్తూ అడిగాడు సహదేవుడు.

''నాకు పచ్చ కామెర్లు వస్తే కదరా, మింగడానికి!'' అంటూ ముసిముసిగా నవ్వాడు మహదేవరావు. ఇంటికి చేరాక క్షేమంగా వెళ్లినట్టు నీకు ఫోన్ చేసి చెప్తాను, కదా. ఇదిగో ఆ విఘ్నేశ్వరుడి బంగారు ఉంగరం దొరికింది అనుకో, ముందు నీకే ఫోన్ చేసి చెప్తాలే.'' మహదేవరావు అంటుండగా, ట్రైన్ కదులుతుంది.

'ట్రైన్ కొంచెం దూరం వెళ్లాక, మహదేవరావు తన వేలును చూసుకుంటే ఒక తులం బంగారపు విఘ్నేశ్వరుడి ఉంగరం ఉంది. తనకు... తన తమ్ముడు సహదేవుడికి తన తండ్రి ఒకేసారి చేయించిన తమ్ముడి వేలి ఉంగరం అది.'

''నా చెయ్యి పట్టుకున్నట్టే పట్టుకొని తన ఉంగరం... నాకు తెలియకుండానే నా వేలికి పెట్టేశాడేంటి చెప్మా, వీడు?'' అనుకున్నాడు నవ్వుకుంటూ అదోరకమైన మానసిక ఆనందంతో మహాదేవరావు.

అక్కడ... ప్లాట్‌ఫామ్‌ మీద సహదేవుడు తన ఉంగరం వేలు తేలికబరుచుకున్న తృప్తితో మహా సంతోషంగా ఉన్నాడు.

15 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి వచ్చి మళ్ళీ తిరిగి వెళుతున్న తన అన్నగారిని తాను సంతోష పెట్టినందుకు, రాగాలు తీసుకుంటూ ఇంటి దారి పట్టాడు, తెగ మురిసిపోతూ.


           ***********    


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page