top of page

అరణ్య రోదన

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Aranya Rodana' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari


రచన: పెండేకంటి లావణ్య కుమారి


మనుషులు చేసే పనుల వల్ల అడవి జంతువులు పడే కష్టాల రోదనను అరణ్య రోదనన్న పేరుతో చిన్న కథగా వ్రాసాను. *** వేసవికాలం అనగానే సూర్యుడి వేడి, ఆ తాపం తగ్గించుకోటానికి జనాలు ఏ.సీలలో సేదతీరటం, అలాగే వారు తాగే టెంకాయ నీరు, రకరకాల కూల్డ్రింక్సే గుర్తుకొస్తాయి. మనం మనుషులం కాబట్టి కృత్రిమంగా ఎన్నో తయారు చేసుకుని వేడి బాధను తగ్గించుకుని ఉపశమనం పొందుతుంటాము. మరి కేవలం ప్రకృతి మీద ఆధారపడి జీవించే జంతువుల సంగతో... వాటికి అడవిలో దొరికే నీరు మాత్రమే ఆధారం. సంవత్సర, సంవత్సరానికీ పెరుగుతున్న, కాదు మనుషులు పెరిగేలా చేస్తున్న ఎండ తీవ్రతతో అడవులలోని జంతువులు ఎప్పుడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయని ఎంతమందికి తెలుసు. మామూలుగా ప్రాకృతికంగా జరిగే పర్యావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటే మనమెవ్వరమూ కంగారు పడవలసిన అవసరం లేదు. అది ఒక చక్రంలా జరుగుతూ వుంటుంది, అంటే ఎలా మార్పులు వచ్చాయో అలాగే సర్దుకుంటూ వుంటాయి కూడా. కానీ అదే అసహజంగా కొన్ని శతాబ్దాలలో జరగాల్సిన పర్యావరణ మార్పులు కేవలం కొన్ని సంవత్సరాలలో జరుగుతుంటే కచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం వుంది. నిజానికి నేడు మనం జీవించే విధానం పర్యావరణ నాశనకారిగా మారి అత్యధిక సూర్యతాపం భూమిని చేరేలా చేస్తుందనాలి. నేడు మానవుల ప్రపంచమొక కర్బన కర్మాగారమై భూవాతావరణంలో వాయు, నీటి, నేల కాలుష్యాలను దినదినానికి పెంచిపోషిస్తోంది. దాని వల్ల భూమి చుట్టూ వుండి, భూవాతావరణాన్ని రక్షించే కొన్ని వాయువులు కరిగి పోయి, వాతావరణంలో అనేక మార్పులతో పాటూ వేడి కూడా పెరిగేలా చేస్తున్నాయి. దానికి ఒక్కరని కాదు ప్రతొక్కరమూ కారణమే. అలాగే ప్రతొక్కరమూ కోరుకుని, పూనుకుంటే వాతావరణ సమతుల్యాన్ని రక్షించగలం. అలా ఇప్పుడుండే జీవజాతులు హాయిగా, అనుకూలంగా జీవించటానికి వీలు కల్పించగలం. దాన్ని సాధించటానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు, కానీ కొన్ని అనవసర సుఖాలను త్యజిస్తే చాలు. రానున్న భవిష్యత్తులో భారతదేశంలో సూపర్ సైక్లోన్లు విధ్వంసం సృష్టించే అవకాశముందనీ, 2020లో దక్షిణాసియాలో వచ్చిన దానికంటే 250 రెట్లు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందనీ, ముందుగానే జాగ్రత్త పడమని శాస్త్రవేత్తలు ఇండియాను హెచ్చరిస్తూ, తీర ప్రాంతాలలోని వారు చాలా నష్టపోతారంటున్నారు. కారణం వాతావరణంలో చోటు చేస్కుంటున్న పెను మార్పులనీ, ఇప్పటికీ మించిపోయింది లేదు, చక్కదిద్దమని తెలుపుతున్నారు. మనమేమాత్రమైనా ప్రయత్నిస్తున్నామా అనిపిస్తుంది. మనం చేసే దానికి మనం మాత్రమే నష్టపోతే, చేజేతులారా చేస్కున్నారని వదిలేయ వచ్చు. కానీ మనుషులు చేసే దానికి ప్రకృతి లోని జీవజాతులన్నిటికీ ముప్పు ఏర్పడుతోంది. దీనికి బాధ్యులు మనుషులే, దీన్ని సరిదిద్దే బాధ్యత కూడా మనుషులదే కదా. పెద్ద, పెద్ద జంతువులే కాదు, మనుషులు కలిగించే కాలుష్యాల వల్ల ఎన్నో చిన్న, చిన్న కీటకాలు సైతం అంతరించిపోతున్నాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది తేనెటీగల గురించే. తేనెటీగలు అంతరిస్తున్నాయంటే భూమి అంతరించే కాలం దగ్గరపడినట్టే అంటారు. అడవి తేనెటీగల శాతం ఇప్పటికే చాలా తగ్గిపోయింది. ఇవి తగ్గిపోతే అడవిలో పరాగసంపర్క క్రియ తగ్గుతుంది, దాని వల్ల అడవులూ నశిస్తాయి. అయితే మనుషులుండే ప్రాంతాలలో మాత్రం ఇలాంటి కీటకాలు, కాలష్యం వల్లనే కాక రాత్రి సమయాల్లో మనం వాడే విద్యుద్దీపాల వెలుగు వల్ల, మన ఫోన్లు పని చేయటానికి వాడే ఎలెక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్సు వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు పడి చనిపోతున్నాయి. వెలుగును చూసి రాత్రికి, పగలుకు తేడా తెలియక ఎంతగానో స్టెస్సుకు గురవుతూ, అలాగే ఎలెక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్సును, వాటి సహ కీటకాల నుండి అందిన సిగ్నల్సుగా తికమక పడి ఇబ్బందుల పాలవుతూ చనిపోతున్నాయి. ఇంక ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే అడువులలో వుండే చిన్న జీవాల నుండి పెద్ద, పెద్ద జంతువుల వరకు తిండికి, నీటికి ఎద్దడిని ఎదుర్కొంటూ వుంటాయి. అందుకే అవి ఆహారం, నీటిని వెతుక్కుంటూ వలసలు వెళ్తూ జీవిస్తుంటాయి. కానీ సంవత్సరం, సంవత్సరానికీ 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి పోతుంటే ఎలాంటి జీవాలైనా నశించక తప్పటంలేదు. దశాబ్దం, దశాబ్దంకి అంతరించిపోయే జంతువుల సంఖ్య పెరిగి పోతూనే వుంది. అడవులలో నీరు దొరకక కౄర జంతువులు సైతం ఊర్లలోకి రావటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతోంది. అడవి జీవాలు ఎలా ఇబ్బందుల పాలవుతుంటాయో తెలిపే ఒక చిన్న కథ ఇది. అదో చిన్న అరణ్యం... మరి పెద్ద, పెద్ద అరణ్యాలు చిన్న, చిన్నవిగా మనం చేసేసాముగా... చైత్రం పూర్తయ్యి, వైశాఖమాసం అడుగు పెట్టేలోపే ఆ సారి అధిక ఉష్ణోగ్రతతో విపరీతమైన ఎండలు. మామూలు కన్నా తొందరగానే అడవిలో లభించే ఆహారం, నీరు అడుగంటి పోయాయి. చిన్న, చిన్న జంతువులు సైతం తగు విధంగా వాటి స్థాయిలో ముందు జాగ్రత్తలు తీస్కున్నా కూడా అకాల ఎండ తీవ్రతతో ఎన్నో నేల రాలిపోతున్నాయి.

మామూలుగా అడవి జంతువులు ఎండాకాలం వస్తుందనగా నీరు దొరకని ప్రదేశాలు వదలి నీరుండే ప్రదేశాలకు వలసలు వెళ్తుంటాయి. మళ్ళీ వర్షాలు పడ్డాక అక్కడ నీటి నిలువలు బాగా పెరిగి, అవి అక్కడ నివసించటానికి ఇబ్బందులు మొదలవ్వగానే మళ్ళీ తమ పాత ప్రదేశానికి తిరిగి వస్తుంటాయి. ఇదంతా ఒక చక్రంలా జరుగుతూ వుంటుంది. వాటికీ ప్రకృతికి మధ్యనున్న అవినాభావ సంబంధమది. మానవులు తెలివి మీరి ప్రకృతిని ఎదిరించి కృత్రిమ కట్టడాలతో, కృత్రిమ వెలుగులతో పశుపక్ష్యాదులను తికమక పెట్టేస్తున్నారు. అడవులన్నా కనీసం వాటికి వదిలేయక ఎంత చెక్కా మాకు సరిపోదు, మీతో మాకేంటి అన్న నిర్లక్ష్యంతో ఏటికి ఏడు చెట్లను నరుక్కుంటూ పోతున్నారు, జంతుజాలానికి తిండిని, నీడను దూరం చేస్తున్నారు. వాతావరణ సమతుల్యాన్ని పాడుచేస్తున్నారు. దానికి భారీమూల్యం చెల్లించుకోక తప్పక పోవచ్చు. అది మానవుల వినాశనమే కావచ్చు కూడా. ఆ విధంగానే ముందున్న పెద్ద అడవి మధ్యలో ఒక హైవే రోడ్డు వేయబడింది. ఇంకొంచెం దూరంలో ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ వేయబడింది. అంతే ఆ పెద్ద అడవి కాస్తా రెండుగా చీలి రెండు చిన్న, చిన్న అడవులయిపోయాయి. కారణం, 24 గంటలూ హైవే మీద వేగంగా వాహనాలు వెళ్తూనే వుండటం. అంత వేగంగా వెళ్ళే వాహనాల మధ్యలోంచి అడవి మృగాలు అటు వైపుకు, ఇటు వైపుకు తిరగటం చాలా కష్టసాధ్యమైపోయింది. ఇప్పుడు హైవేకి అటు వైపున్న అడవిలో ఒక పెద్ద సెలయేరు కొండపై నుండి జాలువారుతూ వుంటుంది. అన్నీ ఎండి పోయినా, తీవ్ర ఎండాకాలంలో కూడా కొన్నైనా నీళ్ళు దాంట్లో వుండి అడవి జంతువుల దాహార్తిని తీర్చే గంగమ్మ తల్లది. అందుకే ఎండాకాలంలో నీటి కోసం ఆ హైవే దాటటానికి ప్రయత్నించి ఎన్నో జంతువులు చని పోసాగాయి. అలా అక్కడి జంతువులక్కడే, ఇక్కడి జంతువులు ఇక్కడే అన్నట్టుగా మిగిలి పోయాయి. అటు వైపుకు వెళ్ళలేక, ఇక్కడి ఎండాకాలపు నీటి ఎద్దడికి తట్టుకోలేక, ఆ హైవే కట్టినప్పటి నుండి ఇటువైపున్న జంతువులు చాలానే చనిపోసాగాయి. అలాగే ప్రతి ఏడూ వర్షాకాలంలో వరదల ఇబ్బందితో అటువైపున కూడా చాలానే జంతువులు చనిపోసాగాయి. ఇలా అడవి జంతువుల జనాభా బాగా తరిగిపోసాగింది. ఆ విషయాన్ని అటవీశాఖావారు ఆ సంవత్సరం జంతువుల జనాభా లెక్కలు చూసినప్పుడు కానీ కనుక్కోలేక పోయారు. జనాభా ఘననీయంగా తగ్గటానికి కారణాన్ని ఆన్వేషించి తెలుసుకున్నారు. దాని ఫలితమే ఆ ఎండాకాలంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అడివంతా విస్త్రుతంగా పరిశీలిస్తూ పెద్ద జంతువులను హైవే దాటించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. లేదంటే అడవిలోనే ఒక చెరువును(అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులాంటి దాన్ని కట్టి) ఎండాకాలంలో నీటి నిలువలు వుండేలా చూడాలని నిశ్చయించుకుని, దానికి అయ్యే ఖర్చు అంచనా వేసి పై అధికారులకు పంపారు. కానీ అంత ఖర్చు పెట్టటానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. ఆ ఎండాకాలం మామూలుకంటే రెండు డిగ్రీల ఎండ వేడి పెరిగి ఎప్పటికన్నా రెండు వారాల ముందే జంతువులు నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయి. తమ వంతుగా పరిస్థితులను అంచనా వేయటానికి తిరుగుతున్న ఒక ఫారెస్ట్ ఆఫీసర్ జీపు ముందు ఒక అయిదు ఏనుగుల మంద హైవే వైపుగా వెళ్తున్నది గమనించి, జీపును నెమ్మది చేసి అవి హైవే దాటాలనుకుంటున్నాయా లేక ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోటానికి వాటి వెనుకే వెళ్ళ నారంభించింది వారి జీపు. ఆ జీపులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్లు వున్నారు. వారు ఎనిమిది కిలోమీటర్ల దూరం నుండి వాటి వెనుకే వస్తున్నారు. ఆ ఏనుగుల మందలో ఒక గున్నేనుగు, రెండు పెద్ద ఏనుగులు, ఇంకో రెండు కొంచెం చిన్న ఏనుగులున్నాయి. చూస్తుంటే అవన్నీ ఒక కుటుంబం అనిపిస్తుంది. ఆ పెద్ద ఏనుగులలోని ఆడ ఏనుగు గర్భంతో వుంది. నేలపై తిరిగే జంతువులలో ఏనుగులే అత్యధిక గర్భధారణ కాలం కల జంతువులు. ఇవి 18 నుండి 22 నెలల పాటూ గర్భాన్ని మోస్తాయి. ఆ ఏనుగు కూడా నిండు చూలాలులా కనిపిస్తుంది. ఏనుగులు గర్భంలోనే సంపూర్ణంగా అన్ని అవయవాలు తయారయ్యాకే జన్మిస్తాయి. దాని వల్ల పుట్టాక అవి తల్లితో పాటు తిరగటం ప్రారంభిస్తాయి. అందుకే వాటి గర్భధారణ కాలం అంత ఎక్కువ. నిజానికి ఆ ఏనుగులు ఇంకో మూడు వారాల వరకూ వలస వెళ్ళే అవసరం లేదనీ, అలాగే ఒక వారంలో ప్రసవం అవుతుందని అంచనా వేసుకున్నాయి. కానీ ఇంతలో అడవిలో మామూలు కంటే తొందరగా నీటి ఎద్దడి ప్రారంభమై అకస్మాత్తుగా అవి వలసబాట పట్టవలసి వచ్చింది. అలా ఆ ఏనుగులు వెళ్తుండగా అకస్మాత్తుగా గర్భంతో వున్న ఆడ ఏనుగు దాహంతో సొమ్మసిల్లి క్రిందికి వాలి పోయింది. జీపులో నుండి ఆఫీసర్ బైనాక్యులర్తో అంతా గమనిస్తూ వున్నాడు. అలాగే ఒక అసిస్టెంట్ కెమెరాలో ఇదంతా వీడియో తీస్తున్నాడు. అప్పుడు చూడాలి ఆ మగ ఏనుగు, ఇంకా మిగిలిన ఏనుగుల బాధ, అన్నీ దాని చుట్టూ చేరి తొండాలతో కుదుపుతూ లేపటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంక గున్న ఏనుగైతే వాళ్ళ అమ్మనే దీనంగా చూస్తూ వుంది. అది చూస్తున్న వీరికి కూడా కళ్ళలో నీళ్ళు తిరగ సాగాయి. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్లతో మీరు జీపులో వెనక్కు వెళ్ళి రెండు డ్రమ్ముల నీళ్ళు, ఏనుగులకు ఏవైనా పండ్లు కానీ, గ్లూకోజ్ ప్యాకెట్లు కానీ తీసుకురండి. అలాగే మనకు కూడా మూడు పెద్ద బాటిల్లతో నీళ్ళు, తినడానికి ఏమైనా తీసుకురండి. ఈ రోజు ఏమైనా కానీ వీటిని హైవే దాటించాకే మనము తిరిగి వెళ్ళేదని స్థిరంగా చెప్పాడు. మీరు నీళ్ళు తీసుకు వచ్చేసరికి గంట పైనే పడుతుంది, ఈ లోపల నేను ఈ పెద్ద బాటిల్ లోని నీటిని ఆ ఏనుగుకు పట్టించి, కొద్దిలో, కొద్దిగానైనా సేద తీరుస్తానన్నాడు. వాళ్ళు వెంటనే తిరిగి వెళ్ళి పోయారు. ఆఫీసర్ బాటిల్ తీస్కోని ఆ ఏనుగుల దగ్గరకు వెళ్ళటం మొదలెట్టాడు. కొంచెం దూరంలో వుండగా పెద్ద ఏనుగు ఆఫీసర్ని గమనించి, అతని మీద దాడి చేయబోయింది. ఆఫీసర్ వెనక్కి తిరిగి పరుగెత్తే తొందరలో బాటిల్ పడిపోయింది. కొంచెం దూరం ఆఫీసర్ని పరిగెత్తించాక అది తిరిగి వెనక్కు వెళ్ళిపోయింది. అది అలా పరుగెత్తించటానికి కారణం, ఆఫీసర్ భుజానికి వున్న తుపాకీ అని తర్వాతతనికి అర్థమయ్యింది. ఇంక చేసేది లేక అవి చేసే పనిని దూరం నుండే వీడియో తీస్తూ అసిస్టెంట్ల కొరకు ఎదురు చూడసాగాడు. పాపం! అన్ని ఏనుగులూ కొంచెం సేపు సొమ్మసిల్లిన ఏనుగును లేపటానికి ప్రయత్నించాయి. అది సోలిపోతోంది, ఇంక వాటికి అర్థమయ్యింది, దానికి నీళ్ళు చాలా అవసరమని. అక్కడికి కొంత దూరంలో ఒక చెలిమలాంటిది వుంది. దాంట్లో నీళ్ళు ఎండిపోయాయి కానీ కొంచెం మట్టిని తవ్వి చిన్న గుంతలాగా చేస్తే కొంచెం నీరు వస్తుంది కానీ పూర్తి బురదగా వుంటాయి నీరు. ఏవో ఒకటి, వాటి దాహాన్ని తీర్చుకోటానికీ, దేహాన్ని చల్లబరుచుకోటానికి వాటికిప్పుడు అవే మహా ప్రసాదం. చిన్న ఏనుగులలో ఒక దాన్ని ఆడ ఏనుగుకు తోడుగా వుంచి, మిగిలిన మూడూ చెలిమ దగ్గరకు వెళ్ళి, తమ నోళ్ళు తడుపుకుని, ఒళ్ళంతా బురదను బాగా పులుముకుని, ఆ బురద నీటినే తమ తొండాలలో నింపుకుని వచ్చి ఆడ ఏనుగు గొంతులో పోసాయి. ఆఖరికి ఆ గున్న ఏనుగు కూడా తెచ్చి పోసింది. అవి అంటించుకు వచ్చిన బురదను దాని శరీరానికి లేపనంగా పూసాయి. తర్వాత పెద్ద ఏనుగు ఆ ఆడ ఏనుగు పక్కనే కూర్చుని తొండంతో బురదను రుద్దుతూ, దాని చెవులతో విసరసాగింది. వాటి సాహచర్యాన్ని చూస్తున్న ఆఫిసర్కు చాలా ముచ్చటేసి, మనుషులకన్నా ఇవే నయం అనిపించింది. తర్వాత ఆ పెద్ద ఏనుగు అక్కడ వుండగా మిగిలిన మూడూ మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చాయి. ఇంతలో జీపులో అసిస్టెంట్లు డ్రమ్ములతో నీళ్ళు తీస్కొచ్చారు. అందులో ఒక డ్రమ్ము తీస్కెళ్ళి వాటికి కొంచెం దూరంలో వుంచి, వాటి ముందరే నీటిని కొంచెం త్రాగి చూపించారు. ఆ నీటిలో వాటికి శక్తి కొరకు గ్లూకోజ్ కూడా కలిపారు. ఏవో కొన్ని అరటి పండ్లుంటే అక్కడ పెట్టి దూరంగా వెళ్ళిపోయారు. అవి మొదట కొంచెం తటపటాయించినా, తర్వాత పెద్ద ఏనుగు పోయి త్రాగి, మిగిలిన వాటిని త్రాగమని సైగ చేసింది, అన్నీ వచ్చి నీళ్ళు కడుపు నిండా త్రాగాక ఆ ఆడ ఏనుగుకు కూడా నీరు పట్టించాయి. కొంచెం సేపటికి ఆడ ఏనుగు లేచి నిలబడింది. మళ్ళీ అన్నీ ప్రయాణం మొదలెట్టాయి. వాటి వెనుకే జీపులో వీరు కూడా వెళ్ళ సాగారు. అవి హైవే దగ్గరకు చేరే సరికి సాయంకాలం అవుతుందని అంచనా వేసిన ఆఫీసర్, అక్కడికి దగ్గరలోని టోల్ గేటుకి సమాచారం అందించారు. ఇలా ఫలానా ప్రదేశంలో, ఫలానా సమయంలో వెళ్ళే వాహనాలను తాము చెప్పేవరకు నిదానంగా నడపమని వాహనదారులకు హెచ్చరిక చేయమని చెప్పారు. టోల్గేటు వారి సహకారంతో వీరు హైవే దగ్గరకు చేరేసరికి, అక్కడ వెళ్ళే వాహనదారులు నిదానంగా వెళ్ళడం గమనించారు. ఏనుగులు హైవే దగ్గరకు రాగానే ఆఫీసర్ వాహనాలను ఆపి ఏనుగులను హైవే దాటించాడు. వాటితో పాటు జీపులో వెనుకగా అవతలి వైపు అడవికి వీళ్ళూ వెళ్ళారు. చీకటి పడ్డాక, అవి ప్రయాణించలేక ఎక్కడ ఆగిపోయాయో అక్కడ ఇంకో డ్రమ్ము గ్లూకోజ్ కలిపిన నీరు వాటికి కనపడేలా పెట్టి. ఆఫీసర్ వాళ్ళు వెనక్కు తిరిగి వచ్చి, టోల్గేట్ వారికి సమాచారం అందించారు. ఇదంతా తీసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా ఎంతగానో రెస్పాన్స్ వచ్చి అడివి జంతువులకు సమ్మర్ స్టోరేజీ కట్టాలని వీడియో చూసిన అందరూ ప్రభుత్వానికి విన్నపాలుగా మెసేజీలు పెట్టారు. అలాగే ఆ వీడియోకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వారు బహుమతి కూడా ఇచ్చారు. దాన్ని ఆ ఆఫీసర్ ఈ జంతువుల సహాయనిధికి విరాళంగా ఇవ్వగా అది కూడా వైరల్ అయ్యి గూగుల్, యూట్యూబ్ వారు, ఆ వీడియోకు నెల రోజుల్లో ఎన్ని వ్యూవ్లు వస్తే అన్ని రూపాయలు ఆ జంతువుల సహాయనిధికి ఇస్తామని ప్రకటించారు. దానితో ఎంతోమంది ఆ వీడియో చూసి అభినందించారు. ప్రభుత్వం కూడా వెంటనే ఆ జంతువుల రక్షణార్థం పనులు మొదలెట్టటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విధంగానైనా జంతువులకు సహాయం చేసి, మానవులు తమకు ఇంకా మానవత్వం వుందని నిరూపించుకున్నారు. తాము చేసిన తప్పుకు బాధ్యతగా తమకు చేతనైన ఇంకో పరిష్కారంతో జంతువుల నీటి ఎద్దడిని తీర్చారు. ఇంక మీదట ఆ అడివి జంతువులు హైవే దాటే పని లేకుండా వున్న చోటనే హాయిగా వుంటాయని ఆశిస్తూ ఇక్కడితో కథ ముగిస్తున్నాను. ---సమాప్తం---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


52 views2 comments

2 Comments


Narenderkumar K • 6 hours ago

Nice

Like

Narenderkumar K • 11 days ago

Good on forest subject

Like
bottom of page