అర్థం లేని అనుకరణ
- Munipalle Vasundhara Rani

- 3 hours ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #ArthamLeniAnukarana, #అర్థంలేనిఅనుకరణ, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 20
Artham Leni Anukarana - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 03/02/2026
అర్థం లేని అనుకరణ - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
ఆ రోజు సాయంత్రం నీలిమ స్కూల్ నుండి రాగానే అద్దం ముందు గంటల తరబడి గడుపుతోంది. తన సహజమైన జడను విరబోసుకుని, ముఖానికి ఏవో పౌడర్లు దట్టించి, తనకి అస్సలు అలవాటు లేని విధంగా ఏదో ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ లాగా వింతగా నడవడానికి ప్రయత్నిస్తోంది. పైగా ఎవరైనా ఏమైనా అడిగితే, తను ఎప్పుడూ మాట్లాడే తెలుగులో కాకుండా, విదేశీ యాసను అనుకరిస్తూ ఏదో మాట్లాడుతోంది.
అప్పుడే అక్కడికి వచ్చిన చింటు, నీలిమను చూసి కడుపుబ్బ నవ్వేశాడు. "బామ్మా, త్వరగా రా! అక్క నడక చూడు.. తన మాటలు చూడు.. మన ఇంట్లోకి ఏదో వింత జీవి వచ్చినట్టుంది.. అచ్చం సర్కస్‌లో జోకర్‌లా ఉంది!" అని గట్టిగా కేకలు వేశాడు.
చింటు అరుపులు విని బామ్మ గబగబా నీలిమ గదిలోకి వచ్చింది ఏమైంది అనుకుంటూ. చింటు చెప్పిన మాటలు వింటూ, నీలిమ పడుతున్న పాట్లు చూసి, పరిస్థితి అర్థం చేసుకుంది.
నెమ్మదిగా కుర్చీలో కూర్చుని ఇలా చెప్పడం మొదలుపెట్టింది:
"నీలిమ, నీకు నెమలి ఈకల కాకి కథ తెలుసా? అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. దానికి తన నలుపు రంగు అంటే అసహ్యం వేసేది. ఎప్పుడూ పక్కనే ఉన్న నెమళ్లను చూసి కుళ్లుకునేది. అబ్బో! అవి ఎంత అందంగా ఉన్నాయి! వాటి ఈకలు ఎంత రంగురంగులుగా మెరుస్తున్నాయి! నేను కూడా వాటిలాగే ఉంటే అడవికి రాణిని అయ్యేదాన్ని కదా అనుకునేది.
ఒకరోజు నెమళ్లు తమ ఈకలను రాల్చి వెళ్ళిపోయాయి. కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఆ రంగురంగుల ఈకలన్నీ ఏరి, తన నల్లని రెక్కలకు, తోకకు అతికించుకుంది. అద్దంలో తనని తాను చూసుకుని వావ్! నేను ఇప్పుడు నెమలిని అయిపోయాను అని మురిసిపోయింది. గర్వంతో తన కాకి స్నేహితులను చూసి ఛీ! మీరంతా నల్లగా ఉన్నారు, నాతో మాట్లాడకండి అని తరిమేసింది.
నెమ్మదిగా నెమళ్ల గుంపులోకి వెళ్లి రాజసం వలకబోయడం మొదలుపెట్టింది.
కానీ నెమళ్లకి వెంటనే అనుమానం వచ్చింది. ఏంటి ఈ నెమలి ఇంత పొట్టిగా ఉంది? తన నడక ఏంటి ఇంత వింతగా ఉంది? అని గమనించాయి. అప్పుడే ఆ కాకి ఉండబట్టలేక నెమలిలా అరవబోయి తన సహజమైన కా.. కా.. అని అరిచింది. అంతే! నెమళ్లకి విషయం అర్థమైపోయింది. నువ్వు అసలు నెమలివే కాదు, ఈకలు తగిలించుకున్న దొంగవు అని ఒక్కొక్కటిగా పొడిచి ఆ ఈకలన్నీ పీకేసి దాన్ని అడవి బయటకి తరిమేశాయి.
అవమానంతో ఏడుస్తూ ఆ కాకి మళ్ళీ తన కాకి స్నేహితుల దగ్గరకు వచ్చింది. కానీ అప్పటికే ఆ కాకి గర్వాన్ని చూసిన మిగతా కాకులు నీకు నెమళ్లే కావాలి కదా, వెళ్లు.. మా దగ్గరకు రాకు అని దాన్ని దూరం పెట్టాయి. పాపం, ఆ కాకి అటు నెమలి కాలేక, ఇటు కాకిలా ఉండలేక తన ఉనికిని కోల్పోయింది.
అలాగే నక్క కూడా చేసింది ఆ కథ తెలుసా?" అని అడిగింది. చింటు ఉత్సాహంగా, "ఆ కథ ఏంటి బామ్మా? చెప్పవా!" అన్నాడు.
అప్పుడు బామ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది, "అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి అడవిలో జంతువులన్నీ పులి అంటే భయపడుతున్నాయని, తనను చూసి ఎవరూ భయపడటం లేదని చాలా కోపంగా ఉండేది. ఒకరోజు దానికి ఒక ఆలోచన వచ్చింది. పులికి, నాకు ఆ చారలే కదా తేడా! ఆ చారలు నా శరీరం పైన ఉంటే నేను పులినైపోతాను. ఇక అందరూ నన్ను చూసి భయపడతారు అనుకుంది. వెంటనే ఒక ఇనుప చువ్వ కాల్చి ఒంటినిండా వాతలు పెట్టుకుంది. ఆ వాతలు పులి చారల్లాగే కనబడతాయని దాని ఆలోచన. కానీ ఆ వాతల వల్ల శరీరం అంతా పుచ్చిపోయి, ఆ నక్క చనిపోయింది."
అని కథ ముగించి నీలిమ గడ్డం పట్టుకుని ప్రేమగా ఇలా అంది, "నీలిమ, నీకు రిచాకి ఉన్న రంగు ఉండకపోవచ్చు, లేదా ఆమె లాంటి స్టైల్ రాకపోవచ్చు. కానీ నీ దగ్గర ఉన్న స్వచ్ఛమైన నవ్వు, నీ తెలివితేటలు, మన తెలుగు భాషలో నువ్వు పలికే తీపి.. ఇవి నీ సొంతం. నెమలి ఈకలు తగిలించుకున్నంత మాత్రాన కాకి నెమలి అవ్వదు, వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అవ్వలేదు. అన్ని విషయాలలో ఇతరులను అనుకరించడం తెలివితక్కువతనం. మనకి ఉండే ప్రత్యేకతలు వాళ్ళకి ఉండకపోవచ్చు. ఇతరులను అనుకరించడం వల్ల నీ లోపల ఉన్న నిజమైన నీలిమ చనిపోతుంది. లోకం నిన్ను నువ్వుగా చూసినప్పుడే ప్రేమిస్తుంది కానీ, వేరే వాళ్ళ కాపీలా చూస్తే నవ్వుతుంది."
బామ్మ మాటలకు నీలిమ కళ్లు తెరుచుకున్నాయి. తను చేస్తున్న వింత చేష్టలకి తనకే సిగ్గు వేసింది. వెంటనే అద్దం ముందు నుండి పక్కకు వచ్చి, తన ముఖం కడుక్కుని వచ్చి, "నిజం బామ్మా! మనకి నెమలి ఈకలు వద్దు.. నక్క వాతలు వద్దు! నేను నీలిమగానే ఉంటాను" అని తన సహజమైన గొంతుతో చెప్పింది. చింటు వెనక నుండి "అబ్బా! బతికాను.. మళ్ళీ మా నీలిమక్క నాకు దొరికింది" అని నవ్వుతూ ఆటపట్టించాడు.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments