చూపుల కోసం ఎదురు చూసిన చిన్నారి

Choopula Kosam Eduru Chusina Chinnari - Telugu Emotional Family Story | Mayukha
చూపుల కోసం ఎదురు చూసిన చిన్నారి - తెలుగు కుటుంబ భావోద్వేగ కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 16/11/2026
అమ్మ ప్రేమ కోసం ఎదురుచూస్తూ బాల్యంలో ఒంటరితనాన్ని అనుభవించిన పావని కథే “చూపుల కోసం ఎదురు చూసిన చిన్నారి”. తల్లిదండ్రుల వృత్తి కంటే పిల్లల భావోద్వేగ అవసరాలు ఎంత ముఖ్యమో గుర్తుచేసే హృదయస్పర్శి కుటుంబ కథ ఇది.
"అమ్మా! ఈరోజు మా రిజల్ట్స్ వచ్చాయి. నాకు 90% వచ్చింది.
మా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లు అవుతారట. నేను కూడా బైపీసీ గ్రూప్ తీసుకుంటా.
నాకు కూడా డాక్టర్ అవ్వాలని ఉంది" ఎంతో సంతోషంగా తల్లి పావనితో చెప్పింది లయ.
ఆ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. "కంగ్రాట్స్ చిన్నా! మొత్తానికి హైస్కూల్ చదువు అయిపోయింది. ఇక కాలేజీ చదువు మొదలవుతుంది.
ఇంతకీ ఎవరెవరు పాసయ్యారు? ఏమిటి విశేషాలు?" "ఈ రోజుల్లో టెన్త్ పాస్ అవ్వకపోవడం ఏంటమ్మా? అందరూ పాస్ అవుతారు కానీ, పర్సంటేజీ చూస్తారు కదా! మా ఫ్రెండ్స్ ఐదుగురికి 90% కంటే ఎక్కువే వచ్చాయి.
నా క్లోజ్ ఫ్రెండ్స్ అభి, రజిత డాక్టర్లు అవుతారట. అందుకని వాళ్ళు బైపీసీ గ్రూప్ తీసుకుంటారట. నాకు కూడా డాక్టర్ చదవాలని ఉంది.
నేను కూడా బైపీసీ తీసుకుంటా! ఏమ్మా! మాట్లాడవేం?" అడిగింది లయ. "వాళ్ళ అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లు కాబట్టి, వాళ్లకి సొంతంగా హాస్పిటల్స్ ఉన్నాయి.
వీళ్లు డాక్టర్లు అయినా అదే హాస్పిటల్లో పని చేస్తారు. మళ్లీ బయట వెతుక్కోనక్కర్లేదు.
అయినా డాక్టర్ చదువు అంటే మాటలు అనుకున్నావా? జీవితమంతా చదువుతున్నట్టే ఉంటుంది.
మెడికల్ ఫీల్డ్ అంటే సముద్రం లాంటిది. దాంట్లో మునగడమే కానీ, తేలడం ఉండదు.
ఎంబీబీఎస్ అయిన తర్వాత హౌస్ సర్జన్ చేయాలి. తర్వాత ఎండీ, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ! ఎంత పెద్ద చదువో తెలుసా!" "అయితే అమ్మా! నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆపేస్తాను" అంది లయ.
"స్పెషలైజేషన్ చేయకపోతే ఎలా? మధ్యలో ఆపకూడదు." "మరి నువ్వే పెద్ద చదువు అంటున్నావ్ కదమ్మా! అందుకే అన్నాను" అంది లయ.
"అయినా ఇవ్వాళే కదా రిజల్ట్స్ వచ్చాయి! ఆలోచిద్దాంలే!" అంటూ ఆ చర్చని అంతటితో ముగించింది పావని.
పావని కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. భర్త కరుణాకర్ కూడా లెక్చరరే.
పావని తన చిన్నతనం నుంచి తను పడ్డ కష్టం, ఒంటరితనం నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంది.
అందుకే పిల్లలతో సందడిగా ఉంటుందని, తనకి ఉద్యోగం కూడా కంఫర్టబుల్‌గా ఉంటుందని లెక్చరర్‌గా జాయిన్ అయింది.
పావనికి కూతురు డాక్టర్ చదవడం ఇష్టం లేదు. ఎందుకంటే పావని తల్లి ప్రభావతి ఆ రోజుల్లోనే పెద్ద డాక్టర్.
తండ్రి వ్యాపారవేత్త. ఇద్దరూ ఉన్నా తను ఒంటరితనంతో ఎంతో బాధపడింది. గతంలోకి వెళ్ళింది పావని. అప్పుడు పావని ఆరవ క్లాసు చదువుతోంది.
తల్లి ప్రభావతి డాక్టరు. ఎప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండేది.
పావని నానమ్మ రాధమ్మ దగ్గరే పెరిగింది. రాధమ్మ పల్లెటూర్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా రిటైర్ అయ్యి కొడుకు రాజారావు దగ్గరకు వచ్చింది.
రాజారావు బిజినెస్ చేస్తున్నాడు. నలుగురు పార్టనర్స్ ఉండేవారు. రాధమ్మకి పరోపకారం ఎక్కువ. ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథంతో ఉండేది.
"రాధ గారు! స్కూల్ అయిపోయింది రండి, ఇక వెళదాం!" అని తోటి టీచర్లు అన్నా, తెలియని పిల్లలకి సబ్జెక్టులో డౌట్స్ క్లియర్ చేసి కానీ వచ్చేది కాదు.
డాక్టర్ అయితే పేదలకు సేవ చేయొచ్చు అని డాక్టర్ని కోడలుగా తెచ్చుకుంది.
రాజారావు, ప్రభావతి ఇద్దరూ చిలకాగోరింకల్లా ఉండేవారు.
రాజారావు రోజు ప్రభావతిని హాస్పిటల్లో దింపి తను ఆఫీస్‌కి వెళ్ళిపోయేవాడు. పావని కడుపున పడ్డప్పటి నుంచి వాళ్ళిద్దరికీ గ్రహణం పట్టినట్టైంది.
బిజినెస్ పని మీద రాజారావు క్యాంప్‌కి వెళ్లేవాడు. ప్రభావతికి కూడా హాస్పిటల్లో పని ఎక్కువైంది.
ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేటప్పటికి హాస్పిటల్ నుంచి ఫోను అర్జెంటుగా రమ్మని. ఆ టైంలో ప్రభావతి అబార్షన్ చేయించుకుంటాను అని పట్టు పట్టింది.
రాధమ్మ, "వద్దమ్మా! అబార్షన్ చేయించుకోకు.
పని ఒత్తిడి ఉంటే, మీ పెద్ద డాక్టర్‌తో చెప్పి కొన్ని రోజులు సెలవు తీసుకో! నువ్వే డాక్టర్వి, నీకు చెప్పేదాన్ని కాదు" అంది.
రాజారావుకి తను తండ్రి కాబోతున్నాను అన్న ఊహే ఎంతో మధురంగా ఉంది. "నాన్న! అన్న పిలుపు ఎంత మధురంగా ఉంటుంది.
ఇప్పుడు కొడుకు నుంచి తండ్రిగా తనకి ప్రమోషన్ రాబోతోంది. ఆ చిన్నారిని తను వేలు పట్టి నడిపించాలి. బుడిబుడి అడుగులు వేయించాలి" ఇలా ఎన్నో ఊహించుకున్నాడు.
అశనిపాతంలా "అబార్షన్" అనే మాట వినడంతో చాలా కోపం తెచ్చుకున్నాడు. ఎన్నో తర్జనభర్జనలు, వాదోపవాదాలు, చర్చల మధ్య ఆఖరికి ప్రభావతి బిడ్డను కనడానికి ఒప్పుకుంది.
దానికి ఎంతో సంతోషపడ్డారు రాధమ్మ, రాజారావులు. ప్రభావతి పని తగ్గించుకుని ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం చేస్తోంది.
మంచి ముహూర్తాన పండంటి పాపకు జన్మనిచ్చింది ప్రభావతి. పాపకు మూడవ నెల వచ్చినప్పటి నుంచి హాస్పిటల్‌కు వెళ్లడం ప్రారంభించింది.
పాప ఆలనాపాలనా అంతా రాధమ్మ చూసుకుంటోంది. పావని ముద్దుముద్దు మాటలన్నీ రాధమ్మ ఎంజాయ్ చేస్తోంది. ప్రభావతి హాస్పిటల్‌కి వెళుతూ బిజీ అయిపోయింది. రాజారావు తనకున్న కొద్ది సమయాన్ని పాపతో ఎంజాయ్ చేస్తున్నాడు.
కాలం గిర్రున తిరుగుతోంది. ఈ మధ్యన ప్రభావతి ఎక్కువ సమయం హాస్పిటల్లోనే ఉంటోంది.
చిన్నారి పావనికి అందరి పిల్లల్లా వాళ్ళ అమ్మతో ఆడుకోవాలని, అమ్మ చేతి గోరుముద్దలు తినాలని ఉండేది.
"నాన్నమ్మా! నాకు అమ్మతో ఆడుకోవాలని ఉంది. అమ్మ ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండదేం?" "లేదు తల్లీ! అమ్మ పెద్ద డాక్టర్ కదా! అమ్మకి ఖాళీ ఉండదు.
అందరూ ఒంట్లో బాగోలేకపోతే ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టరే అమ్మ అయినప్పుడు అందరూ అమ్మని దేవుళ్ళలా చూస్తారు.
కనిపించని దేవుడు పైన ఉంటే కనిపించే డాక్టర్లు దేవుళ్ళు తల్లీ! అందుకని అమ్మ దగ్గర లేదని బాధపడకు! నేను ఉన్నాను కదా! నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను" అంది నచ్చజెబుతూ రాధమ్మ.
పావని ఐదవ క్లాసుకు వచ్చింది. పావని ఫ్రెండ్స్ తల్లులు కూడా డాక్టర్స్. కానీ వాళ్లు వాళ్ల పిల్లలతో బానే గడుపుతారు.
వాళ్లు "మా అమ్మతో బయటకు వెళ్ళాము, సినిమాకి వెళ్లాము" అంటే, పావనికి ఏమి చెప్పాలో తోచేది కాదు.
ఒకసారి స్కూల్ యాన్యువల్ డేకి పావని ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ నాటకం చూడడం కోసం, "మమ్మీ! నేను డ్రామాలో ఉన్నాను.
మెయిన్ రోల్ నాదే! తప్పనిసరిగా నువ్వు రావాలి! నువ్వు, డాడీ, నానమ్మ అందరూ వచ్చి నా యాక్షన్ ఎలా ఉందో చెప్పాలి" ఉత్సాహంగా అంది. "నాకు హాస్పిటల్లో పని ఉంది.
అది లేకపోతే వస్తాలే! అయినా డాడీ, నానమ్మ ఉన్నారు కదా!" అంది ప్రభావతి. "వాళ్ళు ఎప్పుడూ వస్తారు, నువ్వే రావు" అంది కినుకుగా.
"వీలు చూసి వస్తాలే!" అని అప్పటికే తప్పించుకుంది ప్రభావతి. ఆ మాటకే ఎంతో పొంగిపోయి, హుషారుగా స్కూల్‌కి రెడీ అయ్యి, రాధమ్మ దగ్గరకు వచ్చింది.
"నానమ్మా! అమ్మ ఈరోజు స్కూల్‌కి వస్తానంది. నేను స్కూల్‌కి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం అమ్మని తీసుకుని రండి" అంది సంతోషంగా పావని.
"పిచ్చి పిల్ల! దాని బాల్యం అంతా ఈ నాన్నమ్మ దగ్గరే గడుస్తోంది. నయమే నేను ఉన్నాను కాబట్టి, లేకపోతే ఏ పనివాళ్ళ దగ్గరో, ఆయాల దగ్గరో గడపవలసిన మాట.
అయినా ప్రభావతి పిల్లనయితే కన్నది కానీ, మరీ పట్టనట్టు ఉంటుంది. దాని బాగోగులు చూడదు.
నేనూ పెద్దదాన్ని అవుతున్నాను. ఆడపిల్ల దాని బాధ్యత తల్లి చూడకపోతే ఎవరు చూస్తారు?" ఆలోచనలోంచి తెప్పరిల్లి, "అలాగే వస్తాంలే!" అంటూ పనిలో పడింది రాధమ్మ.
సాయంత్రం ప్రభావతికి ఫోన్ చేస్తే, "నేను బిజీ, మీరు వెళ్ళండి" అంటూ ఫోన్ పెట్టేసింది.
స్కూల్లో ప్రోగ్రాం జరుగుతోంది. చిన్నారి పావని స్టేజి మీద నుండి ప్రేక్షకుల కేసి చూస్తోంది. తల్లి ఎక్కడా కనిపించలేదు.
తండ్రి, నానమ్మ కనబడ్డారు. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ మేకప్ చెరిగిపోతుందని బాధని నిగ్రహించుకుని, పెర్ఫార్మ్ చేసింది అనేకంటే, ఆ పాత్రలో జీవించింది.
పావని నటనకు గాను బెస్ట్ ప్రైజ్ వచ్చింది. ముభావంగా ఇంటికి వచ్చింది పావని.
తండ్రి, నానమ్మ ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నా, అంటీముట్టనట్లుగా సమాధానం చెప్పింది. "ఎందుకు అమ్మ రాదు? తను ఒక్కతే డాక్టర్ కాదు కదా! తన ఫ్రెండ్స్ తల్లులు కూడా డాక్టర్లే! వాళ్లు అందరూ వచ్చారు. అమ్మకి నేనంటే ఇష్టం లేదా? నానమ్మ లేకపోతే నేను ఏమైపోయే దాన్ని..." ఆ చిన్నారి మనసు.
మర్నాడు స్కూల్‌కి వెళ్ళినప్పుడు పావని ఫ్రెండ్స్ అన్నారు, "మీ మమ్మీ నిన్న హాస్పిటల్లో లేదట! మా డాడీ చెప్పారు! మా డాడీ కూడా అదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు కదా!" అని. ఇంటికి వచ్చిన పావని నాన్నమ్మతో చెప్పింది.
"మమ్మీకి నిన్న బిజీ ఏం లేదు. అసలు హాస్పిటల్లో లేదట. కావాలని నా ప్రోగ్రాంకి రావడం ఇష్టం లేక అలా చెప్పింది. ఛీ! బ్యాడ్ మమ్మీ!" అంది ఉక్రోషంగా. "తప్పు బంగారూ! అలా అనకు. అమ్మ బిజీ! అందుకే రాలేదు.
అమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం!" అని సముదాయించింది రాధమ్మ. కానీ పావని మనసులో తల్లి అంటే ఉన్న ప్రేమ తగ్గిపోవడం మొదలెట్టింది.
ఒకరోజు ఉరుములేని పిడుగులా ప్రభావతి ఒక వార్త చెప్పింది. హయ్యర్ స్టడీస్‌కి అమెరికా వెళ్తున్నట్లు, దానికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసినట్లు చెప్పింది.
ఆ వార్త విని కోపంతో ఊగిపోయాడు రాజారావు.
"నువ్వు ఎవరిని అడిగి అప్లై చేశావ్? ఇండియాలో లేదా ఆ చదువు? సూపర్ స్పెషాలిటీ చేయాలంటే, ఇక్కడా ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా! అయినా అర్ధాంతరంగా ముందు ఎవరికీ చెప్పకుండా ఏంటి ఈ పని?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
"నా చదువు, నా ఇష్టం. ఇందులో ఎవర్ని అడగాలి? ఇక ఇండియాలో అంటారా! నాకు ఇక్కడ చదవడం ఇష్టం లేదు! ముందు చెబితే మీరు పంపిస్తారా? అందుకే నేను చెప్పలేదు.
అయినా మీరు మాత్రం బిజినెస్ అంటూ బయట తిరగట్లేదా? నేను వెడితే తప్పా!" అంటూ విరుచుకుపడింది ప్రభావతి. "నేను బిజినెస్ పని మీద... కేవలం బిజినెస్ పనిమీద వెళుతున్నాను. నీలా తోటి డాక్టర్‌తో షికారు చేయడానికి కాదు."
"ఆహా! విషయం మీకు తెలిసిందిగా! ఇక దాచేదేముంది? అవును, నేను వేరే డాక్టర్తోటే వెళుతున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి" అంది నిర్లక్ష్యంగా భర్తతో.
"నీ లీలలు నా చెవి వరకు వచ్చినా, చదువుకున్న దానివి, పైగా డాక్టర్వి, సంకుచిత మనస్తత్వంతో ఆలోచించకూడదు అనుకుని, నిన్ను అడగడం కూడా చేయలేదు.
ఇంతకీ బరితెగించావా? సిగ్గు లేదు?" అన్నాడు కోపంగా రాజారావు. రాధమ్మ కలగజేసుకుని, "పిల్ల మొహం చూసైనా ఇక్కడ ఉండమ్మా! ఆడపిల్ల, దానికి తల్లి సహాయం చాలా అవసరం" అంది బాధగా.
"మీరున్నారుగా! అన్నీ చూడ్డానికి" అంటూ వెళ్లిపోయింది ప్రభావతి. పావనికి నాన్నమ్మే ప్రాణం అయింది.
రాజారావు కూడా బిజినెస్ వ్యవహారాలు తగ్గించుకుని పావనితోటే ఉంటున్నాడు. కాలం గడుస్తోంది.
పావని ఎమ్మెస్సీ చేసి లెక్చరర్‌గా చేరింది. చిన్నతనం నుంచి ఉన్న ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, తోటి లెక్చరర్లతో, పిల్లలతో కాలక్షేపం అవుతుందని ఈ వృత్తిని ఎంపిక చేసుకుంది.
ఒకే ఫీల్డ్ అయితే బాగుంటుందని లెక్చరర్ అయిన రాజారావుకి ఇచ్చి పెళ్లి చేశారు. కాలక్రమంలో నాన్నమ్మ, తండ్రి రాజారావు కాలం చేశారు. లయ పెద్దది అయింది.
ఇన్ని సంవత్సరాల తర్వాత తన గతాన్ని అంతా గుర్తు చేసుకుని పావని తన ఆలోచనలన్నీ కూతురితో పంచుకుంది. "అమ్మా! నీ భయాలు నాకు అర్థం అయ్యాయి.
నీకు డాక్టరు వృత్తి అంటే అయిష్టం కాదు. కానీ, అమ్మమ్మ చేసిన పనికి నువ్వు, తాత ఎలా బలి అయ్యారో! అటువంటివి ఎక్కడ పునరావృతం అవుతాయోనని కదమ్మా నీ భయం! నేను ఒట్టు వేసి చెబుతున్నాను.
నీవు, నాన్న గీసిన గీత దాటను. మన కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాను. నన్ను నమ్ము! నేను నీ పెంపకంలో పెరిగాను..." అంది ఆవేదనగా లయ.
కరుణాకర్ కలగజేసుకొని, "అలాగే తల్లీ! నీకు ఏది ఇష్టమైతే అదే చదువు. మేం అభ్యంతరం పెట్టం. ఇంత మెచ్యూరిటీతో ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది" అన్నాడు.
సంతోషంగా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్ళింది లయ.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.













Comments