అందరూ మనవాళ్లే

Andharu Manavalle - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao
అందరూ మనవాళ్లే - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 16/11/2026
‘అందరూ మనవాళ్లే’ అనేది కుటుంబ బంధాలు, వృద్ధాప్యం, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, మానవత్వం చుట్టూ సాగే హృదయస్పర్శి తెలుగు కథ. కన్నబిడ్డలకంటే మమకారంతో ఏర్పడిన బంధాలు ఎంత గొప్పవో ఈ కథ చెబుతుంది.
విజయవాడ నుంచి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన రాంబాబు, "అబ్బా! ఏసీ చైర్ కార్‌లో కూడా రద్దీ ఎక్కువగానే ఉందే!" అనుకున్నాడు.
రాంబాబు విజయవాడలో ఆఫీస్ పని ముగించుకుని, హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ వచ్చి, సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రికి చేరుకుంటాడు.
తన పక్క సీటులో కూర్చొని విండో నుంచి బయటకు చూస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న అమ్మాయి, తన ఒడిలో ఉన్న ఆడపిల్ల వంక తదేకంగా చూస్తూ, మళ్లీ రైలు పెట్టెలోని జనం వంక చూస్తూ ఉంది.
ట్రైన్ కాజీపేట రాగానే ఆ అమ్మాయి రాంబాబుతో, "సార్! మా పాపకి పాలు తీసుకుని వస్తాను, సీటులో పడుకోబెట్టి వెళ్తాను, పడిపోకుండా చూస్తారా? ఐదు నిమిషాలలో వచ్చేస్తాను" అంది.
"అలాగే, త్వరగా రండి, లేదంటే నన్ను తీసుకుని రమ్మంటే తీసుకుని వస్తాను" అన్నాడు.
"వద్దు, నేను వెళ్లి తీసుకుని వస్తాను ఒక్క నిమిషంలో" అంటూ కిందకి దిగింది.
ఆడపిల్ల అనుకుంటా, కదలకుండా పడుకుంది. ఏదో మెసేజ్ రావడంతో చూసుకుంటున్న రాంబాబు, ట్రైన్ కదిలి వేగం అందుకోవడం గమనించలేదు.
ఎదురు సీటులో కూర్చున్న ఆమె, "ఏమండీ! మీ ఆవిడ ట్రైన్ ఎక్కినట్టు లేదు" అనడంతో ఉలిక్కిపడి గబుక్కున లేచి పెట్టెలో చూశాడు.
ఆవిడ కనిపించలేదు. "అంటే కావాలనే పిల్లని వదిలేసి వెళ్ళింది అన్నమాట" అనుకున్నాడు.
సికింద్రాబాద్ వచ్చింది కానీ ఆమె రాలేదు. ఎవరి దారిన వాళ్లు దిగిపోతున్నారు.
"ఈ పిల్లని ఏం చేయాలి?" అనుకుంటూ ఎత్తుకుని రైలు దిగి, ఆ స్టేషన్‌లో ఉన్న రైల్వే పోలీస్ అధికారి తన స్నేహితుడు అవడంతో అతని ఆఫీసులోకి నడిచాడు.
"రారా రాంబాబు! ఆ పిల్ల ఎవరు?" అన్నాడు ఇన్‌స్పెక్టర్ శంకర్. "అదే తెలియదు" అంటూ జరిగిన విషయం చెప్పాడు రాంబాబు.
"ఒరేయ్ రాంబాబు! రూల్స్ ప్రకారం ఈ పాపని మేము ఏదైనా శిశు సంరక్షణ కేంద్రంలో అప్పగించి విచారణ చేయాలి.
కానీ నాదొక సలహా, నీకు ఎలాగూ సంతానం లేదు కదా, ఈ పాప నీ చేతికి వచ్చింది అంటేనే నీ ఇంట్లో పెరగడానికి అని నా అభిప్రాయం.
ఇది ఒకరకంగా నేను ధైర్యం చేసి, రూల్స్‌కి వ్యతిరేకంగా నీకు ఈ సలహా ఇస్తున్నాను. నువ్వు ఇంటికి తీసుకుని వెళ్లి పెంచుకో" అన్నాడు.
"ఏమైనా లీగల్ ప్రాబ్లమ్ వస్తుందేమోరా! అనవసరంగా నువ్వు ఇరుకున పడతావు" అన్నాడు రాంబాబు.
శంకర్ అటు ఇటు చూసి, "అంతా పైవాడి లీల, నువ్వు పాపని ఇంటికి తీసుకుని వెళ్ళు" అన్నాడు.
ఆటో ఇంటి ముందు ఆగిన చప్పుడుకి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చిన కళ్యాణికి, భర్త చేతిలో బిడ్డని పట్టుకుని లోపలికి రావడం చూసి పరుగున ఎదురు వెళ్లి, రాంబాబు చేతిలోనుంచి బిడ్డని అందుకుని లోపలికి నడిచింది. "ఎవరి పాప?" అని అడిగింది పాపకి చెంచాతో పాలు పట్టిస్తూ.
జరిగింది అంతా భార్యకి చెప్పాడు. “నా ఇన్‌స్పెక్టర్ స్నేహితుడి సలహా ప్రకారం పాపను ఇంటికి తీసుకుని వచ్చాను.
అక్కర్లేదు అని వదులుకున్న ఆ తల్లి మళ్లీ రాదు, మనకి ఎంతమంది డాక్టర్స్ చుట్టూ తిరిగి మందులు వాడినా పిల్లలు లేరు. నువ్వు ఒప్పుకుంటే ఈ పాపని పెంచుకుందాం, లేదంటే రేపు ఉదయమే పోలీసులకి అప్పగించి వస్తాను" అన్నాడు భార్యతో.
"భలేవారే! మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని ఎలా వదులుకుంటాము? మీ తల్లిదండ్రులకి, మా తల్లిదండ్రులకి మాత్రం విషయం చెప్పి రహస్యంగా ఉంచమందాం.
మిగిలిన చుట్టాలు ఎప్పుడో కలిసినప్పుడు సంగతి, వాళ్లకి మన పాప అని చెప్పడమే" అంది పాపని ఒళ్లోకి తీసుకుని మురిసిపోతూ.
వారం రోజులలో శంకర్ తన పరపతి వాడి మున్సిపల్ ఆఫీస్ నుంచి పుట్టినరోజు సర్టిఫికెట్ తీసుకుని రాంబాబుకి ఇచ్చాడు. పాప పేరు రమణి.
పాప వచ్చి మూడేళ్లు, అంటే పాపకి నాలుగేళ్లు వచ్చాయి. రాదు అనుకున్న ప్రమోషన్ రాంబాబుకి వచ్చింది. ఒకరోజు రాత్రి పాపకి ఆంజనేయ దండకం చదువుతున్న భర్త దగ్గరికి వచ్చిన కళ్యాణి, "ఏమండీ! ఎందుకో నాకు రెండు రోజుల నుంచి నీరసంగా ఉంది, ఏమీ తినబుద్ధి కావడం లేదు" అంది.
"ఎక్కువగా ఆలోచించకు, రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను వస్తే నన్ను చూసి నవ్వుతోంది" అన్నాడు.
"ఏమోనండి, పాప అదృష్టం నాకు కలిసివస్తోంది అని అనిపిస్తోంది" అంది.
"సరే గానీ, రేపు వెళ్లి డాక్టర్‌కి చూపించుకో" అన్నాడు.
యథాప్రకారం రాంబాబు విజయవాడ వెళ్ళిపోయాడు.
లంచ్ తీసుకుంటున్న సమయంలో కళ్యాణి ఫోన్ చేసి, "డాక్టర్ గారు శుభాకాంక్షలు చెప్పారు" అంది.
"మంచి వార్త చెప్పావు కళ్యాణి! నీకు ఏం గిఫ్ట్ కావాలో చెప్పు" అన్నాడు రాంబాబు.
"పాపకి మంచి బట్టలు తీసుకుని రండి" అంది.
"తెస్తాను, నీకు ఏదైనా స్వీట్ తెస్తాను" అన్నాడు.
"వద్దండీ, డోకుగా ఉంది" అంది.
"అబ్బో! వేషాలు" అంటూ నవ్వేసి ఫోన్ పెట్టేశాడు.
ఇంటికి చేరిన భర్తతో, "ఏమండీ! మా అమ్మని రమ్మని అడిగాను, కొన్నాళ్లు సహాయంగా ఉంటుంది. అయితే నిక్కచ్చిగా ఒకటి చెప్పాను, నా కూతురిని ఎటువంటి పరిస్థితిలోనూ చిన్నచూపు చూడకూడదు, అలా అయితేనే రమ్మని చెప్పాను" అంది.
"ఆరో నెల వచ్చినప్పుడు పిలవాల్సింది, సరేలే" అన్నాడు రాంబాబు.
కళ్యాణి వాళ్ల అమ్మగారు వచ్చి కళ్యాణిని, పాప రమణిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది.
కళ్యాణికి మగపిల్లాడు పుట్టాడు. ఇహ ఆ ఇంట్లో ఆనందానికి కొదవలేదు. రాంబాబు కూడా సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు.
కాలం ఇట్టే గడిచిపోయింది. కూతురు, కొడుకు పెరిగి పెద్దవాళ్లు అయ్యారు. మంచి చదువులు చదువుకుని పెళ్లిళ్లు చేసుకుని, కూతురు అమెరికా, కొడుకు సింగపూర్ వెళ్ళిపోయారు. ఇంట్లో కళ్యాణి, విజయవాడలో రాంబాబు మిగిలారు.
"మీరు ఉద్యోగం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందిగా! రోజూ ఉదయం ఆరు గంటలకు బయలుదేరి రాత్రి ఎప్పుడో రావడం అవసరమా? మీకు ఈ ఉద్యోగం బాధ్యత లేకపోతే హాయిగా సింగపూర్‌లో అబ్బాయి దగ్గరికి వెళ్లి ఉండేవాళ్లం. మనవడు పుట్టినరోజుకి తప్ప మళ్లీ వెళ్లలేదు" అంది కళ్యాణి భర్తతో.
"ఉన్న ఉద్యోగం వదులుకుని ఎందుకే హైదరాబాద్ వదిలి వెళ్లడం? ఇక్కడ వంటిల్లు ఎవరి కంట్రోల్‌లో ఉంటుంది?" అని అడిగాడు.
"నాదే! వేరే వాళ్లను వంటగదిలోకి రానిస్తానా?" అంది కళ్యాణి.
"మరి సింగపూర్‌లో వంటిల్లు నీ కోడలి కంట్రోల్, నిన్ను రానివ్వదు. వాళ్లు ఏది వండితే అది, లేకపోతే నువ్వు అడిగి చేయించాలి. ఇక్కడే హాయిగా రాణిలా ఉండు. ఇంకా ఏడాది తరువాత రిటైర్ అవ్వగానే కావాలంటే అప్పుడు వెళ్దాంలే" అని హితవు చెప్పాడు.
ఆ రోజు ఉదయమే కొడుకు, కోడలు, మనవడు రావడంతో, "సంతోషంగా రండిరా! మొత్తానికి సింగపూర్ మీకు పర్మిషన్ ఇచ్చిందన్నమాట" అన్నాడు.
టిఫిన్ తింటూ తల్లికి కొడుకు రాజా చెప్పడం విన్నాడు: "మా మామగారు రిటైర్మెంట్, అందుకే వచ్చాము. ఆ తరువాత వాళ్లు కూడా మాతో వచ్చి ఉంటారు."
రాంబాబు మనసులో, "ఆయన రిటైర్ అవుతున్న విషయం మాకు చెప్పనేలేదు" అనుకున్నాడు.
కోడలు అక్కడే ఉండటంతో కళ్యాణి కొడుకుతో ఏమి మాట్లాడలేకపోయింది.
కొడుకు మామగారి రిటైర్మెంట్ సభకి వెళ్లి వచ్చాడు.
"అమ్మా! ఈరోజు మంచిదేనా?" అని అడిగాడు తల్లిని.
"మంచిదే కాకపోతే మీ మామగారు ఎందుకు రిటైర్ అవుతారు?" అన్నాడు నవ్వుతూ రాంబాబు.
"మంచి రోజునే అని అడుగుతున్నావు, ఎందుకు? సింగపూర్ వెళ్ళిపోతున్నారా?" అని అడిగాడు కొడుకుని.
అంతలో కళ్యాణి, "రాత్రి పదింటివరకు బాగానే ఉంది" అంది.
"అయితే ఇంకా అర్ధగంటే ఉంది, త్వరగా వంటగదిలోనుంచి ఇటు రా అమ్మా" అని పిలిచాడు.
తల్లిని సోఫాలో కూర్చోబెట్టి, "ఏదీ నీ చేతులు చాచు" అంటూ జేబులోనుంచి నాలుగు బంగారు గాజులు తీసి తల్లి చేతులకి తొడిగాడు.
"ఇప్పుడు నాకెందుకురా? డబ్బు దండగ" అంది కళ్యాణి లోపల సంతోషంతో.
వారం రోజులలో కొడుకు, కోడలు, అత్తామామలు సింగపూర్ వెళ్ళిపోయారు. వియ్యంకుడికి మొహం చెల్లలేదు అనుకుంటా, చెప్పకుండానే వెళ్ళిపోయాడు అనుకున్నాడు.
రాత్రి అమెరికాలో ఉన్న కూతురు రమణితో విషయం చెప్పింది. "పోనీలే అమ్మా! నాన్న రిటైర్ అవ్వడానికి ఇంకా ఏడాది ఉంది కదా, అందాకా తమ్ముడికి సహాయంగా వాళ్ల మామయ్యగారు ఉంటారు, ఆ తరువాత ఎలాగూ తమ్ముడి దగ్గరే మీరే ఉంటారుగా" అంది.
"అలాగే అంటావా? సరే మరి" అంది కళ్యాణి.
"అబ్బాయ్! వచ్చే గురువారం మీ నాన్న రిటైర్ అవుతారు, నువ్వు వస్తావా?" అంది కొడుక్కి ఫోన్ చేసి.
"గురువారం అంటే సెలవు దొరకడం కష్టం అమ్మా, నువ్వు వెళ్లి ఫొటోస్ తీసి నాకు పంపు. రిటైర్ అయిన తరువాత వచ్చిన డబ్బులు నీ పేరున డిపాజిట్ చేయించుకో, నాన్న దగ్గర ఉంటే దానకర్ణుడు అయిపోతాడు" అని ఉచిత సలహా పడేశాడు.
"వాడు అంతకంటే ఏం చేయగలడు? 'ఫస్ట్ కమ్ ఫస్ట్' అన్నట్టుగా వాడి అత్తమామలు వాడి దగ్గరకి వెళ్లి ఉంటున్నారు. ఇప్పుడు మనల్ని రమ్మంటే వాళ్లని ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చి సైలెంట్‌గా ఉన్నాడు. పోనీలే, ఇప్పుడు నాకు ఇంకా అరవై ఏళ్లేగా! ఓపిక పోయిననాడు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉందాం" అన్నాడు రాంబాబు.
కళ్యాణి భర్త రిటైర్మెంట్ ఫొటోస్ కూతురికి పంపుతూ, "మీ తమ్ముడు మరి మీ ప్లాన్ ఏమిటి అని అడగను కూడా లేదు" అని చెప్పి, రాంబాబు చెప్పింది చెప్పగానే, "అదేమిటి? మిమ్మల్ని సింగపూర్ తీసుకుని వెళ్లలేదా?" అంది రమణి.
"వాళ్లు ఉన్నారు కదా, మేము కూడా వెళ్లి వాడి పీకల మీద ఎలా కూర్చోగలం?" అంది కళ్యాణి.
ఆ రోజు ఆదివారం ఉదయం, ఇంటి ముందు ఆగిన కారులోనుంచి కూతురు మామగారు, అత్తగారు దిగడం చూసి పరుగున వెళ్లి లోపలికి తీసుకుని వచ్చారు.
"కళ్యాణి! మీ అన్నయ్యగారికి పెసరట్టు ఉప్మా నెయ్యి వేసి తీసుకుని రా" అని ఆర్డర్ వేశాడు రాంబాబు.
"ఓహో! పెసరట్టుకి తోడుగా ఉప్మా, ఇంకా చెప్పక్కర్లేదు. ఇదిగో ఆ సంచిలోనుంచి మనం తెచ్చిన కొబ్బరికాయలు మీ వదినకి ఇవ్వు, కొబ్బరి చట్నీ ఉండాల్సిందే" అన్నాడు వియ్యంకుడు విశ్వనాథం.
భోజనాలు అయిన తరువాత, "ఇదిగో చెల్లెమ్మా, బావగారు! మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము, ఇటు వచ్చి కూర్చోండి" అన్నాడు విశ్వనాథం రాంబాబు, కళ్యాణితో.
"ఏం చెప్తాడో" అనే భయంతో కళ్యాణి, రాంబాబు వచ్చి సోఫాలో కూర్చున్నారు.
"బావగారు! నాకు సూర్యాపేటలో రెండు రైస్ మిల్లులు, ఒక ఆయిల్ మిల్లు, దానికి తోడుగా కొద్దిగా పొలం ఉంది. మీకంటే ఒక సంవత్సరం చిన్న అంతే. ఈ పనులన్నీ నేను ఒక్కడినే చూసుకోలేకపోతున్నాను.
మా అబ్బాయి అంటే మీ అల్లుడు పరాయి దేశంలో ఉద్యోగం, ఎందుకురా మన వ్యాపారం చూసుకోమంటే వినలేదు. అక్కడ అంట్లు వాళ్లే తోముకుంటారు.
మొన్న మా కోడలు, అదే మీ అమ్మాయి మాట్లాడింది: 'నాన్న రిటైర్ అయ్యారు, వాళ్లిద్దరూ అక్కడ ఉండే కంటే మీ దగ్గర ఉంటే వ్యాపారంలో సహాయంగా ఉంటారు, ఒకసారి ఆలోచించండి' అని.
ఆలోచించేది ఏముంది? మా అబ్బాయి ఆస్తి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు ఎంత ఉందో, మామగారుగా మీకు అంత ఉంది. అందుకే వీలున్నంత త్వరగా మీరు, మా చెల్లెమ్మ ఇద్దరూ సూర్యాపేట వచ్చేసి, మన మొదటి అంతస్తులో ఉండి, రైస్ మిల్లుల బాధ్యత మీరు చూసుకోండి. నేను ఆయిల్ మిల్లు, పొలం పనులు చూసుకుంటాను" అన్నాడు.
"మీరు మంచి మనసుతో బాధ్యత అప్పగించినా నాది కానిది నేను స్వీకరించలేను. అందుకే నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై లక్షలు వచ్చాయి, అవి నా పెట్టుబడిగా పెడతాను. అందుకు మీరు అంగీకరిస్తే నాకు సూర్యాపేట రావడానికి ఇబ్బంది లేదు" అన్నాడు రాంబాబు.
"భలేవారే! అసలు మీ అల్లుడు, కూతురు ఆస్తి మీది కాదా? సరే, మీ ఇక్కడ పనులు పూర్తి చేసుకుని త్వరగా వచ్చేయండి. ఈలోపుగా పైన పోర్షన్‌కి రంగులు వేయిస్తాను"
అని, "చెల్లాయ్! మధ్యాహ్నం భోజనం చేసి మళ్లీ బయలుదేరుతాము.
ములక్కాడ పటోళి, వంకాయ పెరుగుపచ్చడి చేయమ్మా, మీ వదినని వంటగదిలోకి రానివ్వకు, రుచి పాడవుతుంది" అన్నాడు విశ్వనాథం.
కొడుక్కి ఫోన్ చేసి తమ ప్రోగ్రామ్ చెప్పాడు. "అదేమిటి? మీరు రిటైర్ అయిన తరువాత నా దగ్గర ఉంటాను అన్నారుగా, ఇప్పుడు ప్లాన్ మార్చారు?" అన్నాడు రాజా.
"మాకంటే వయసులో పెద్దవాళ్లు, ముందు నుంచి నీ దగ్గర ఉంటున్న వాళ్లు.. వాళ్లు ఉండగా మళ్లీ మేము వచ్చి ఉండటం సరైన పద్ధతి కాదు. అది కాక నువ్వు కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు" అన్నాడు రాంబాబు.
"భలేవారే! మా అత్తగారు మామగారు రెండు నెలలు ఉండి, ఇక్కడే మా అపార్ట్‌మెంట్‌లో వేరే పోర్షన్ తీసుకుని ఉంటున్నారు. వాళ్లకి వాళ్ల అమ్మాయితో పడటం లేదుట" అన్నాడు నవ్వుతూ.
"కన్నతండ్రికే పడకపోతే ఇహ మామగారితో పడుతుందా? అసలే నేను సాధిస్తాను అని మీ అమ్మ అంటుంది. ఇప్పటికి ఇలా కానీ, ఎప్పటికైనా నీ దగ్గరికి చేరాల్సిన వాళ్లమేగా" అన్నాడు.
- శుభం -
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.























Comments