top of page
Original.png

పార్కింగ్ పరంధామయ్య

5 hours ago
6 min read

పార్కింగ్ పరంధామయ్య తెలుగు నీతి కథలో అపార్ట్‌మెంట్ పార్కింగ్ వద్ద డాక్టర్ గౌరవ్‌కు అడ్డుగా కారు పెట్టిన పరంధామయ్య – నిర్లక్ష్యం, మానవత్వం, సంస్కారం గురించి సామాజిక సందేశాత్మక కథ.

Parking Parandhamayya - Telugu Moral Story | Sritha

పార్కింగ్ పరంధామయ్య - తెలుగు నీతి కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 16/11/2026


చదువు, హోదా కంటే మన ప్రవర్తనలో కనిపించే సంస్కారమే గొప్పదని చాటిచెప్పే కథ ‘పార్కింగ్ పరంధామయ్య’. చిన్న నిర్లక్ష్యం కూడా ఇతరుల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో తెలియజేసే సందేశాత్మక కథ.


“చదువు ఉంటేనే సంస్కారం ఉన్నట్టు కాదు. మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు, మన ప్రవర్తనలో ఎంత సంస్కారం కనిపిస్తుందనేదే ముఖ్యం.

ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ జీవితంలో మన సంస్కారం ఎక్కడ కనిపిస్తుందంటే… పార్కింగ్‌లో!


ఇది పూర్తిగా ఊహాత్మక కథ. ఈ కథ చదివిన తర్వాత ఎవరైనా తమకు కేటాయించిన పార్కింగ్‌లోనే వాహనాలు పార్క్ చేస్తే, శ్రితగా నాకు చాలా సంతోషం.”


హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కౌశిక్, కుటుంబంతో కలిసి ఉండేవాడు. కొడుకు చదువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు. కనకరావుకు మంచి ఉద్యోగం.


కౌశిక్‌ గ్రామంలో చదువుకున్నాడు. వ్యాపారము చేసేవాడు. కొడుకు ఇంటర్మీడియట్‌కు వచ్చేలోపే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కొడుకును తానే స్కూల్‌, కాలేజీకి తీసుకెళ్లి తీసుకురావాలనే ఉద్దేశంతో కారు నడపడం నేర్చుకున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు.


పక్క ఫ్లాట్‌లో పరంధామయ్య ఉండేవాడు. ఆయన బ్యాంక్‌ ఆఫీసర్‌. బ్యాంక్‌ ఆఫీసర్‌ అని చెప్పడం వల్ల ఆ ఉద్యోగాన్ని తక్కువ చేసి చెప్పడం కాదు. పెద్ద ఉద్యోగంలో ఉన్నవాళ్లకు చాలా విషయాలు తెలుసు, ఎదుటివాళ్లను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుందని అందరూ అనుకుంటారు కదా!


పరంధామయ్య, కౌశిక్‌ల పార్కింగ్‌ స్థలాలు పక్కపక్కనే ఉండేవి.


కానీ పరంధామయ్య ఎప్పుడూ తనకు కేటాయించిన పార్కింగ్‌లో కారు పెట్టేవాడు కాదు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేవాడు. కొన్నిసార్లు తన టూ వీలర్‌ను అడ్డంగా పెట్టేవాడు. ఎవరైనా చెప్పినా పట్టించుకునేవాడు కాదు.


ఒకసారి అందరూ కలిసి చెప్పగా,

“నేను చదువుకున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను. కోఆపరేట్ చేయాలి. మీకు మా ప్రాబ్లమ్స్ ఏం తెలుస్తాయి? Cooperation is the key element in this type of gated community societies,” అన్నాడు పరంధామయ్య.


అతని మాటలతో విసిగిపోయిన వాళ్లు చివరికి,

“సరేలే… మనకెందుకు గోల?” అనుకుని ఎవరి పని వాళ్లు చూసుకునేవారు.


మీలో చాలామందికి ఎంసెట్ ప్రాధాన్యత, నీట్ ప్రాధాన్యత తెలుసు కదా!

ఆ రోజు నీట్ ఎగ్జామ్ రోజు. నీట్ పరీక్షకు పిల్లలు ప్రిపేర్ అవుతారో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రులు మాత్రం చాలా బాగా ప్రిపేర్ అవుతారు.


పక్క ఫ్లాట్‌లో ఉంటున్న కనకారావు వాళ్ల కొడుకును కూడా ఆ పరీక్షకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఉదయాన్నే అత్యవసరమైన పని రావడంతో కౌశిక్‌తో, “కౌశిక్, నువ్వు పిల్లాడిని తీసుకెళ్లి డ్రాప్ చేసి రాగలవా? నేను పికప్ చేసుకుంటాను. ఇదేమో ఎమర్జెన్సీ వచ్చింది,” అన్నాడు.


“సరే,” అన్నాడు కౌశిక్.


ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర సరిగ్గా పట్టలేదు. పిల్లాడు పరీక్ష రాస్తున్నాడా అన్నట్టుగా వాళ్లే పరీక్ష రాస్తున్నట్టు టెన్షన్ పడ్డారు.

ఉదయం కారు తీసుకెళ్లడానికి వచ్చేసరికి పరంధామయ్య కారు వాళ్ల కారుకు వెనుక అడ్డంగా పెట్టి ఉంది.


కారు తీయమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. చివరికి అతని ఇంటికి వెళ్లి అడిగారు.


“పరంధామయ్య గారు, కారు కొంచెం తీయగలరా? పిల్లాడికి నీట్ ఎగ్జామ్ ఉంది,” అన్నారు.


“నేను బయటికి వచ్చేశాను. మూడు రోజులు రాను. ఇప్పుడు కారు తీయడం కుదరదు,” అన్నాడు ఫోన్లో..


“పోనీ స్పేర్ కీస్ ఇవ్వండి. ఎవరితోనైనా తీయించుకుంటాను,” అన్నాడు.


“ఏదో చేసుకోండి. కారు లేకపోతే వెళ్లలేరా?” అన్నాడు పరంధామయ్య ఫోన్లో.


ఎలాగోలా కౌశిక్ ఇద్దరినీ నీట్ పరీక్షకు తీసుకెళ్లాడు.

మూడు రోజుల తర్వాత పరంధామయ్య వచ్చి తన కారు తీశాడు. కనీసం సారీ కూడా చెప్పలేదు.


పైగా కౌశిక్‌తో,

“ఏంటి? కారు అడ్డం పెడితే వేరే కారులో వెళ్లలేరా? డబ్బు కోసం ఆలోచించారా?” అన్నాడు.


కౌశిక్ ఏమీ మాట్లాడలేదు.

మనసులో మాత్రం,

“నీకు దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా చూపిస్తాడు,” అనుకున్నాడు.


కౌశిక్ భార్య స్నేహితులు శాంతి, అమ్మణ్ణి, అవని, అనిత, శ్రీదేవి కూడా ఈ విషయం తెలిసి చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష రోజు జరిగిన సంఘటన వాళ్లను చాలా బాధించింది.


అయినా పరంధామయ్య స్థాయికి తాము దిగకూడదని అందరూ ఊరుకున్నారు.

అదే అపార్ట్‌మెంట్‌లో గౌరవ్ కూడా ఉండేవాడు. ఉదయం పని మీద బయటికి వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకూడదనే మనస్తత్వం ఉన్నవాడు. అయితే ఏదైనా తప్పుగా కనిపిస్తే నేరుగా చెప్పే స్వభావం.


ఒకరోజు గౌరవ్ కౌశిక్‌తో,

“అన్నా, నా కార్ పార్కింగ్ చాలా దూరంగా ఉంది. నువ్వు అప్పుడప్పుడు కార్ తీస్తావు కదా! నీ కార్ పార్కింగ్ ప్లేస్‌లో నేను పెట్టుకుంటాను. నాది కింద సెల్లార్‌లో ఉంది. నువ్వు పెట్టుకుంటావా అన్నా?” అన్నాడు.


“సరే, దానికేం ముందులే. గౌరవ్, పెట్టుకో,” అన్నాడు కౌశిక్.


గౌరవ్ తన కారును కౌశిక్ పార్కింగ్‌లో పెట్టుకున్నాడు.

ఒకరోజు పరంధామయ్య గౌరవ్ కారుకు అడ్డంగా తన కారును పెట్టాడు.


గౌరవ్ వెళ్లి,

“పరంధామయ్య, నా కార్ పార్కింగ్‌కి ఇలా అడ్డంగా ఎలా పెడతారు? ఇది నా పార్కింగ్ ప్లేస్ కదా.” అన్నాడు.


“నేను ఒక్క నిమిషం ఆగితే నాకు చాలా పనులు ఆగిపోతాయి. నాకు అంత టైం ఉండదు,” అన్నాడు పరంధామయ్య.


“నాకు కూడా పనులు ఉంటాయి. కానీ ఎవరి పార్కింగ్ వాళ్లు ఉపయోగించుకోవాలి కదా.”


“అయ్యో, ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ ఎందుకు? కాస్త అడ్జస్ట్ చేసుకోండి.”


“అడ్జస్ట్‌మెంట్ అంటే ఎప్పుడూ ఎదుటివాళ్లే చేయాలా? మీ కార్ మీ పార్కింగ్‌లోనే పెట్టుకోవాలి.”


“నాకు మానర్స్ నేర్పించాల్సిన అవసరం లేదు. నాకు ఏది ఎలా చేయాలో నాకు తెలుసు.”


“మానర్స్ గురించి నేను చెప్పడం లేదు. ఎక్కడ మీ పార్కింగ్ ఉందో అక్కడే కార్ పెట్టుకోండి అంటున్నాను.”


చివరికి పరంధామయ్య తన కారు తీశాడు.


కొంతకాలం గడిచింది.

ఒకరోజు గౌరవ్‌కు చాలా అర్జెంట్ పని వచ్చింది. బయటికి వెళ్లడానికి కారు దగ్గరకు వచ్చేసరికి మళ్లీ పరంధామయ్య కారు అడ్డంగా ఉంది.


“పరంధామయ్య, దయచేసి కారు తీయండి. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను వెళ్లకపోతే పెద్ద సమస్య అవుతుంది,” అన్నాడు గౌరవ్.


“నా కారు ఎక్కడ పెట్టాలో నేను నిర్ణయించుకుంటాను. నీకు ఎంత అర్జెంట్ అయినా అది నా సమస్య కాదు. నేను నా పని అయిపోయే వరకు కారు తీయను,” అన్నాడు పరంధామయ్య.


“నాకు నిజంగా చాలా అత్యవసరమైన పని ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి.”


“ప్రతిసారీ ఎవరో ఒకరు అర్జెంట్ అంటారు. నాకు కూడా నా పనులు ఉంటాయి. నేను కారు తీయను.”


గౌరవ్ ఇక వాదించకుండా కౌశిక్ దగ్గరకు వెళ్లి, “అన్నా, స్కూటీ ఇస్తావా? నాకు చాలా అర్జెంట్ పని ఉంది,” అన్నాడు.


కౌశిక్ వెంటనే స్కూటీ ఇచ్చాడు.

గౌరవ్ స్కూటీ తీసుకుని బయటికి వెళ్లబోతుండగా పరంధామయ్య మళ్లీ తన కారును ముందుకు తెచ్చి అడ్డంగా పెట్టాడు.


“ఏంటి గౌరవ్? నా పార్కింగ్ ప్లేస్‌లోంచి స్కూటీ తీసుకెళ్తున్నావా?” అన్నాడు.


“నాకు ఇప్పుడు మీతో వాదులాడే టైం లేదు పరంధామయ్య. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను వెళ్లాలి.”


“నీకు అర్జెంట్ అయితే నాకు ఏంటి? ఇక్కడ నుండి వెళ్లలేవు, నువ్వు ఇంకో దారిలో వెళ్లిపో.”


“దయచేసి ఇలా చేయకండి. నాకు నిజంగా చాలా అర్జెంట్. నాకు ఆలస్యమైతే చాలా సమస్య అవుతుంది.” 


“నేను ఇప్పుడే కారు తీయను. నువ్వు వెళ్లాల్సిందే అయితే ఇంకో దారి చూసుకో.”


గౌరవ్ ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ సాయంత్రం పరంధామయ్య ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి.

పరంధామయ్య కొడుకు ఉదయం కాలేజీకి వెళ్లాడు. దారిలో యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.


ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ సమయానికి హాస్పిటల్‌కు చేరుకోలేకపోయాడు. కొన్ని నిమిషాల ఆలస్యం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.


డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతని రెండు కాళ్లను కాపాడలేకపోయారు. చివరికి రెండు కాళ్లను తొలగించాల్సి వచ్చింది.


కౌశిక్, గౌరవ్, మిగతావాళ్లు పరంధామయ్య ఇంటికి వెళ్లారు.

పరంధామయ్య ఏడుస్తూ,

“ఆ డాక్టర్ ఒక్క నిమిషం ముందే వచ్చుంటే నా కొడుకు కాళ్లు ఉండేవి. నా కొడుక్కి ఇలా ఎందుకు జరిగింది?” అన్నాడు.


కౌశిక్ మెల్లగా,

“పరంధామయ్య… ఈరోజు గౌరవ్‌కి కూడా చాలా అర్జెంట్ పని ఉందని అన్నాడు కదా. మీ కార్ అడ్డంగా ఉండడంతో వెళ్లడానికి ఆలస్యం అయింది,” అన్నారు.


పరంధామయ్య వెంటనే,

“అయినా పార్కింగ్ కోసం నా పనులు వదులుకోవాలా? ఎవరి పార్కింగ్ కోసం నేను నా పనులు ఆపుకోవాలి? అందరూ వాళ్ల వాళ్ల పని చూసుకుంటే సరిపోతుంది. నా కారును ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు,” అన్నాడు.


గౌరవ్ నిశ్శబ్దంగా అతని వైపు చూశాడు.

“పరంధామయ్య… నేను ఈరోజు ఉదయం ఎందుకు అంత అర్జెంట్‌గా వెళ్లాలని అడిగానో తెలుసా?


నేను డాక్టర్‌ని.

మీ అబ్బాయిని హాస్పిటల్‌కు తీసుకొచ్చినప్పుడు ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్‌ని నేనే.

ఉదయం నేను మిమ్మల్ని ఎంత బతిమాలానో మీకు గుర్తుందా? నాకు చాలా అర్జెంట్ పని ఉందని చెప్పాను. కానీ మీరు మీ కారు తీయలేదు.

చివరికి కౌశిక్ ఇచ్చిన స్కూటీ మీద నేను బయలుదేరాను.


అక్కడికి చేరేసరికి మీ అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. మేము ఎంత ప్రయత్నించినా అతని కాళ్లను కాపాడలేకపోయాం.


నేను కొంచెం ముందే చేరి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ ఇప్పుడు జరిగింది మార్చలేం.


మీ అబ్బాయి గురించి నాకు ఉదయం ఏమీ తెలియదు. ఈరోజే తెలిసింది.

కానీ ఒక విషయం మాత్రం నిజం పరంధామయ్య…

ఉదయం మీరు నా పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకుని మీ కారు తీసి ఉంటే, నేను ఇంకొంచెం ముందే హాస్పిటల్‌కు చేరుకునేవాడిని.


కౌశిక్ ఇచ్చిన స్కూటీ వల్ల అయినా నేను సమయానికి చేరుకోగలిగాను. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది,” అన్నాడు గౌరవ్.

పరంధామయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు.


ఉదయం తాను గౌరవ్‌తో అన్న మాటలు అతని చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపించాయి.

“నీకు అర్జెంట్ అయితే నాకు ఏంటి?…”


తన కొడుకు వైపు చూశాడు.

ఆ మాటలే ఇప్పుడు తన గుండెల్లో గుచ్చుకున్నాయి.

“నేను… నేను ఇలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు గౌరవ్…” అని ఏడుస్తూ అన్నాడు పరంధామయ్య.


గౌరవ్ ఏమీ మాట్లాడలేదు.

కౌశిక్ నిశ్శబ్దంగా పరంధామయ్య భుజంపై చేయి వేశాడు.

“పరంధామయ్య… మనకు చిన్నగా అనిపించే నిర్లక్ష్యం ఎదుటివాళ్ల జీవితంలో ఎంత పెద్ద సమస్యకు కారణమవుతుందో మనకు తెలియదు,” అన్నాడు.


పరంధామయ్య తన కొడుకు వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు.

ఆ రోజు అతనికి మొదటిసారి అర్థమైంది—

పార్కింగ్ ఒక చిన్న విషయం కావచ్చు. కానీ ఎదుటివాళ్ల అవసరాన్ని పట్టించుకోకుండా చేసే చిన్న నిర్లక్ష్యం… ఎప్పుడు ఎంత పెద్ద పరిణామానికి దారితీస్తుందో మనకు తెలియదు.


మనిషి ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆ చదువు, ఆ ఉద్యోగం, ఆ స్థాయి ఎందుకు?


సంస్కారం మనం ఎంత చదువుకున్నామో చెప్పదు…

ఎదుటివారి కోసం మనం ఎంత ఆలోచిస్తామో చెబుతుంది.

ఆ రోజు నుంచి పరంధామయ్య తన కారును తనకు కేటాయించిన పార్కింగ్‌లోనే పెట్టడం మొదలుపెట్టాడు.


ఎందుకంటే అతనికి చివరికి అర్థమైంది—

“నా కారు నేను ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు” అనే మాట కంటే… “నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు” అనే ఆలోచనే నిజమైన సంస్కారం.


ఇది ఊహాత్మక కథ. కానీ పార్కింగ్ వల్ల గొడవలు, మనస్పర్థలు, కలహాలు చాలానే జరుగుతాయి. ఎవరికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో వాళ్లు వాళ్ల వాహనాన్ని పెట్టుకుంటే, అందరికీ ప్రశాంతంగా ఉంటుంది.


సంస్కారం మన చదువులో కాదు… మన నడవడికలో కనిపిస్తుంది.


***








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page