దయగల గోడ
Updated: Aug 1
దయగల గోడ, దయాసౌధం, మానవత్వం, దత్తత, సేవాభావం, కుటుంబ కథ, ప్రేరణాత్మక కథ, తెలుగు కథ, మధుపత్ర, Wall of Kindness

Dayagala Goda - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri
దయగల గోడ - తెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 27/07/2026
మనిషి సంపాదించే సంపద కన్నా, పంచే దయే అతని నిజమైన వారసత్వం. అవసరం లేని వస్తువులు అవసరమైన వారికి చేరేలా చేసే 'దయగల గోడ' అనే సామాజిక ఉద్యమం నేపథ్యంగా సాగిన ఈ కథ, మానవత్వం, దత్తత, సేవాభావం, తల్లిదండ్రుల ప్రేమ, జీవన విలువలను హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరిస్తుంది. చివర్లో వెలుగులోకి వచ్చే చైతన్య జన్మరహస్యం ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకుతుంది.
“అమ్మా! కాలేజీకి సెలవలిచ్చేశారు కాబోలు చైతన్యబాబు వచ్చేశారండీ” అంటున్న నరసవ్వ మాటలకు కిచెన్‌లో కొడుకుకు ఇష్టమైన ‘మినప సున్నుండలు’ చేస్తున్న జ్యోత్స్న చేతులు శుభ్రం చేసుకుంటూ బయటకు వచ్చింది.
అతని చేతిలోని బ్యాగ్ అందుకుని, లోపలి గదిలో పెట్టి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళనందిస్తూ “బాగున్నారా బాబూ?” అంటూ కుశలం అడిగి “ఉండండి మీకు ఇష్టమైన కాఫీ కలుపుకుని వస్తాను” అంటూ వంటింటి వైపు కదిలింది నరసవ్వ.
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావటంతో చిన్నప్పటి నుండి ఆమె చేతులలోనే పెరిగాడు చైతన్య.
“ఆ!” అంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు చైతన్య.
“ఏరా చైతూ! ఈ సెలవల్లో మీ స్నేహితులను కూడా తీసుకురమ్మని నాన్నగారు నీకు ఫోన్లో చెప్పారు కదా! మరి వాళ్ళు రానన్నారా ఏమిటి?” అంటూ కొడుకును ప్రేమగా చూస్తూ అడిగింది జ్యోత్స్న.
“అడిగానమ్మా! రానన్నారు వాళ్ళు” అన్నాడు చైతు విసుగ్గా.
“ఏమయ్యిందిరా అలా ఉన్నావు? ఆరోగ్యం బాగుందా?” అంటూ ఆదుర్దాగా తలనిమురుతూ అడిగింది జ్యోత్స్న.
“అమ్మా! నేను సెలవలకు సిటీలోనే ఉంటానంటే వద్దు వచ్చేయమంటారు. ఇక్కడికొచ్చి ఏంచేయాలో నాకే తెలియదు. ఇక నా స్నేహితులను కూడా తీసుకువచ్చి వారి సమయాన్ని కూడా వృధా చేయాలా!
మన ఊళ్ళో చూపించటానికి ఇక్కడ ‘తాజ్‌మహల్’ ఏమైనా ఉందా? లేక రాజభవనాలను చూపించటానికి ఇదేమైనా ‘గ్వాలియర్’ లాంటి చారిత్రిక స్థలమా? ఏంచెప్పి వాళ్ళను రమ్మనాలి?” అన్నాడు చైతు.
అతని మాటలను వింటున్న జ్యోత్స్నకే కాక, తల్లీకొడుకుల మాటలను వింటూ వారికి కాఫీ తీసుకువస్తున్న నరసవ్వకు కూడా బాధ కలిగింది.
“అదేమిటిరా చైతూ అలా అంటావు? నీవు పుట్టినప్పటినుండి ఈ ఊరిలోనే కదరా పెరిగింది. ఈ అమ్మ మమకారం, నాన్నగారి సంస్కారం కలగలుపుకుని గోరుముద్దలుగా తిని ఇంతవాడివయ్యావు. నిన్నమొన్నటి దాకా ఇక్కడే చదువుకున్నావు. కన్నవారిని, జన్మభూమిని ప్రేమించటానికి వారికేమైనా ప్రత్యేకతలు ఉండాలా?
అయినా తాజ్‌మహల్ కన్నా, రాజప్రసాదాల కన్నా విలువైన నాన్నగారి ఆశయాలను, ఆదర్శాలను కలబోసి ఆర్తుల పాలిటి కల్పవృక్షంగా నిలబడిన ఆ ‘దయగల గోడ’ ఉందని నిజంగా మర్చిపోయావా?
నీ స్నేహితులకు దానిని చూపించాలని అనిపించలేదా? నీ చిన్నప్పుడు పేపర్లో దాని గురించి రాశారని నా దగ్గరకు పనిగట్టుకొని వచ్చి చూపించేవాడివి కదా!
ఆ తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య మీద గల అమితమైన ప్రేమకు చిహ్నంగా కట్టాడు. అలాగే రాజప్రసాదాలన్నావు, వాటిలోని కళాత్మక సృష్టిని చూసి ఆనందపడటానికి ఉపయోగపడతాయే గాని అవి ఇతరుల బాధలను తీర్చేవి కావు.
అందులోనూ వాటిలో చాలా వాటిని ఆరుగాలం కష్టించి పని చేసే రైతులను, సామాన్య ప్రజలను బాధించి వసూలు చేసిన అధిక సుంకాలతోను, జరిమానాలతోనూ అప్పటి రాజులు నిర్మించినవే.
ఇరాన్ దేశంలో ప్రారంభించబడిన ఈ ‘దయగల గోడ’ ఉద్యమం నానాటికి విస్తృతమవుతూ నేడు ప్రపంచంలోని అన్ని నగరాలలోనూ నిర్వహించబడుతోంది. చిన్నతనంలో చరిత్ర పుటలలో చదివి ఈ విషయం గురించి తెలుసుకున్న నాన్నగారు ప్రేరేపితులై అడగగా మన ఊరిలోని ఈ ‘దయగల గోడ’ను, మీ తాతగారు కట్టించారు. అప్పటి నుండి ఆ గోడ ఎంతో మంది ఆర్తుల అవసరాలను తీరుస్తోంది.
నీ ప్రతి పుట్టిన రోజున ఆ గోడ దగ్గరకు వచ్చే ప్రతివారికి నాన్నగారు నీతో భోజనం, పళ్ళు, స్వీట్లను ఇప్పించేవారు. వాటిని తీసుకున్న వారందరూ ‘మీ చిట్టిబాబు పిల్లాపాపలతో ఆనందంగా శతవసంతాలు జీవించాలి’ అంటూ నిన్ను ఆశీర్వదించేవారు.
నేను, మీ నాన్నగారు కూడా ప్రైవేట్ స్కూలు టీచర్లమే. కానీ నిన్ను పెద్ద చదువులు చదివించాలనే మా కోరికతో సిటీలోని పేరున్న కాలేజీలో చదివిస్తూ, హాస్టల్‌లో నీకు అన్ని సౌకర్యాలను సమకూర్చటానికి ప్రయత్నిస్తున్నాం.
ఆ పెద్ద ఖర్చులను భరించాలని ఆలోచించే నీ తరువాత మాకు మరలా పిల్లలొద్దని నిర్ణయించుకున్నాం. నాన్నగారి వారసుడిగా నీవు ఎంతో ఉన్నతమైన మానవ విలువలతో ఎదగాలని కోరుకున్నాం.
నీకు గుర్తుందో లేదో గానీ స్కూలుకెప్పుడూ నడిచి వెళ్ళే మీ నాన్నగారు, నీవు ఏడవ తరగతి చదువుతూండగానే నీకు సైకిల్ కొనిచ్చారు. నీవు ఎవరి దగ్గరా వెలితి పడరాదనే మా తాపత్రయం.
నాన్నగారు పనిచేసే స్కూలులోనే నీవు 10వ తరగతి దాకా చదువుకున్నావు. మీ స్కూలుకు DEO గారు వచ్చి నాన్నగారు చేసే మంచి పనుల గురించి, వారు పిల్లలకు పాఠాలను చెప్పే తీరు గురించి ఎంతగా మెచ్చుకున్నారో నీవే ఎంతో ఆనందంగా నాకు వివరించేవాడివి.
‘నీవు కూడా నాన్నగారిలా ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు తెచ్చుకో అమ్మా’ అంటూ నాన్నగారు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్న సంవత్సరం నన్ను అడిగావు.
ఆ ‘దయగల గోడ’ రూపంలో నాన్నగారు తన ఆశయాలను నెరవేర్చుకుంటున్నారని తెలిసిన నీవు మరిప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నావు?
ఇంకా రెండు రోజులలో నీ పుట్టినరోజు వస్తోంది. నీకిష్టమైన బట్టలు కొనుక్కోమని నాన్నగారు నీకు డబ్బు పంపించారు కదా. మరి కొనుక్కున్నావా? లేదా?” అంటూ టాపిక్ మార్చింది జ్యోత్స్న.
ఇంతలో ఇంటికొచ్చిన చైతన్య తండ్రి విజయచంద్ర “ఏరా పరీక్షలు అయిపోయాయా? లేక సెలవల తరువాత ఉంటాయా? సెలవలు ఎప్పటిదాకా? నీ స్నేహితులెలావున్నారు? అంటూ నవ్వుతూ కొడుకుని అడిగారు.
“నాన్నగారూ! మా స్నేహితులందరూ ‘గోవా’ టూర్‌కు వెళ్ళారు. మీరేమో ఇప్పుడు కాదు, నీకు మంచి జాబ్ వచ్చాక వెళుదువు గాని అన్నారు. మీరు, అమ్మా ఎప్పుడో BC కాలపు పద్ధతులను పాటిస్తారు” అన్నాడు చైతన్య విసుగ్గా.
“అందుకు కారణం నీకు తొందరలోనే తెలుస్తుంది గానీ, ఈసారి నీ పుట్టినరోజు అమ్మానేను కలసి నీకు జీవితంలో ఎప్పటికి గుర్తుండి పోయేలా చేస్తాం. కదా జ్యోత్స్నా” అన్నాడు విజయచంద్ర.
అలా కొడుకుని మామూలు మూడ్‌లోకి తీసుకువచ్చి కొడుకు చదువెలా సాగుతోంది, కాలేజీలో జరిగే క్యాంపస్ ఉద్యోగ వివరాలు అడిగి తెలుసుకున్నాడు విజయచంద్ర.
తాను ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులతో ఒక్కొక్కరి పుట్టిన రోజున 10 మొక్కలను నాటించి వాళ్ళతోనే ఆ మొక్కలకు పాదులు చేయించి, నీరు పోయించి, సకాలానికి ఎరువులను అందిస్తూ ఆ మొక్కలు పూలు పూసిన ప్రతిసారి వాళ్ళకు కలిగే సంతోషాన్ని చూసి తాను కూడా ఆనందపడుతున్నానని తన స్కూలు కబుర్లను కొడుకుతో పంచుకున్నాడు విజయచంద్ర.
“మన స్కూలుకు పిల్లలు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వస్తూంటారని నీకు తెలుసుకదరా! వారికి చదువుతోపాటు పచ్చని ప్రకృతిని కాపాడుకోవటంవల్ల కలిగే లాభాలను, రక్తదానం చేయటంవల్ల కలిగే ప్రయోజనాలను, నిరుపేదలకు సాయమందిస్తే వచ్చే మానసిక ఉల్లాసాన్ని వివరిస్తూ, వారిని అలాంటి మంచి కార్యక్రమాలలో పాలుపంచుకునేలా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.
పిల్లలను నెలకోసారైనా మన ‘దయగల గోడ’ దగ్గరకు తీసుకువచ్చి దాని ప్రయోజనాన్ని వారికి చెపుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తం కావాలన్నది నా చిన్న ఆశరా చైతూ” అన్నారు విజయచంద్ర.
ఆ సాయంత్రం చైతన్య స్నేహితులను కలసి వస్తానని బయటకు వెళ్ళాడు. “ఏమండీ! మన చైతు ఇదివరకటిలా లేడండి. వాడికి మన ఊరు, మన పనులు నచ్చటం లేదు ఎందుచేతనో? వాడిలో మార్పు కనిపిస్తోంది” అంది జ్యోత్స్న భర్తతో.
“సిటీలోని స్నేహితులు, కాలేజీ ప్రభావం అయి ఉంటుందిలే. వాడు తప్పక తన తప్పు తెలుసు కుంటాడు. వాడికి నచ్చినా నచ్చకపోయినా ఆ ‘దయగల గోడ’ ప్రయోజనం మనకు తెలుసు. మన ఊరిలోని వారికే కాక, చుట్టుప్రక్కల గ్రామాల వారికి కూడా అది ఉపయోగపడుతోంది.
ఆ గోడ దగ్గర ప్రజలు తమకు అవసరం లేని బట్టలు, చెప్పులు, ఇతర సామాన్లను పెట్టటం, అవసరమున్న వాళ్ళు వాటిని తీసుకువెళ్ళి వాడుకోవటం మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. మనలాంటి మధ్యతరగతి వారి కన్నా బీదాబిక్కి, కూలి పనులకు వెళ్ళలేని వృద్ధులకి అది ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే మనం చేసే పనితో చైతూకు సర్ప్రైజ్ ఇద్దాం” అన్నారు విజయచంద్ర.
ఆ రోజు చైతన్య పుట్టినరోజు. కొత్త బట్టలను వేసుకుని అమ్మానాన్నలతో గుడికి వెళ్ళి వచ్చాడు. అల్పాహారం తీసుకున్న తరువాత “చైతు మనం ఇప్పుడో చోటికి వెళుతున్నాం” అంటూ ‘దయగల గోడ’ దగ్గరకు తీసుకువెళ్ళారు జ్యోత్స్న, విజయచంద్రలు. ఎప్పుడూ చూసే గోడ ప్రక్కనే “దయాసౌధం” అన్న పేరుతో గల కొత్త ఇల్లు కనిపించింది చైతన్యకు. బంతిపూలు, మామిడాకుల తోరణాలతో అలంకరించి ఉంది.
ముందుగానే అక్కడ చేరి ఉన్న వృద్ధులు, చేతులలోని పూలను చైతన్యపై జల్లుతూ “చైతుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మా బంగారు బాబుకు వెయ్యేళ్ళ ఆయుష్షు ఆ భగవంతుడందించాలి” అంటూ ఆనందంగా దీవించారు.
“రా బాబు” అంటూ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టించి లోపలకు తీసుకెళ్ళారు. ఆ ఇంటిలో రెండు విశాలమైన గదులున్నాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తున్న చైతన్యతో “మన ఊరిలోని వృద్ధులు, ముఖ్యంగా బిచ్చగాళ్ళు ఎండకు, వానకు, చలికి బాధపడకుండా ఉపయోగపడతాయని వీటిని కట్టించాను” అన్నాడు విజయచంద్ర.
“మరి మొదటిగదిలో రెండు ఊయ్యాలలున్నాయి. అవి ఎందుకు?” అని అడిగాడు చైతన్య.
“ఇదివరకు కొందరు తల్లులు వారి దుర్భర పరిస్థితుల వల్లో, మరే ఇతర కారణాల వల్లో దుప్పట్లలో చుట్టిన అప్పుడే పుట్టిన నవజాత శిశువులను మన గోడ దగ్గర వదిలి వెళ్ళేవారు. ఎవరైనా చూసి నాకు వచ్చి చెప్పేవారు. వారిని అనాథాశ్రమాలలో చేర్పించేవాణ్ణి.
సమయానికి నాకు ఎవరూ చెప్పకపోతే, ఆ శిశువు ఏ కుక్కలకో, జంతువులకో.., అన్న ఊహ వచ్చినప్పుడు నేను నిలువెల్లా వణికిపోయేవాడిని. అలాంటి వారి కోసమే ఆ ఊయలలు పెట్టాను” అని చెప్పాడు విజయచంద్ర.
“అవన్నీ సరేనండి నాన్నగారు! నాకు సిటీలో తిరగటానికి బైక్ కొనమంటే ఏవో కారణాలు చెప్పేవారు. ఇప్పుడీ ఖర్చంతా ఎందుకు చెప్పండి?. స్థలం కొని, గదులు కట్టించి దానికి ‘దయాసౌధం’ అన్న పేరు పెట్టి బయట వాళ్ళ కోసం చేయటం అంత ముఖ్యమైన పనా?
మనమేమో రెండు చిన్న గదులలో సర్దుకుంటున్నాం. కాస్త విశాలమైన ఇల్లే లేదు మనకు. కానీ ఈ దరిద్రులకి...”
“ఆపు చైతు” అంటూ గట్టిగా అరిచాడు విజయచంద్ర, చైతన్య మాటలను మధ్యలో తుంచివేస్తూ.
వెనకనే ఉన్న నరసవ్వ “ఏమిటి చైతు బాబు? ఎవరిని దరిద్రులంటున్నావు? ఆ రోజున ఈ ‘దయగల గోడ’ దగ్గర అనాథలా పడివున్న నీవు, ఈ రోజున ఈ పుణ్యమూర్తుల ఆదరణతో వారి హృదయపు కోవెలలో దీపంలా వెలుగుతున్నావు. నిజం తెలుసుకో" అంటూ బాధతో అంది.
“నీ పుట్టుకే నీకు తెలియదు. మరో బిడ్డ ఉంటే నిన్ను బాగా పెంచలేమేమోనని ఇక తమకు పిల్లలే వద్దనుకొని, నిన్ను సొంత బిడ్డలా సాకి, నీ మీదే ఆశలు పెట్టుకున్న ఇలాంటి దేవతలతోనా అలా మాట్లాడుతున్నావు.
వారి సంస్కారాన్ని అందిపుచ్చుకుని, వారి దయాగుణాన్ని వారసత్వంగా మలచుకో బాబు” అంటూ ఆవేదనగా చైతన్య జన్మరహస్యాన్ని విప్పి చెప్పింది నరసవ్వ.
“ఏమిటి ఇది నిజమా? నేను.. ఈ ‘దయగల గోడ’ దగ్గర వదిలివేయబడ్డ అనాథనా?” అంటూ చైతన్య ఏడుస్తున్నాడు.
“బాబు! మా తాత చెప్పే ఒక్క మాట చెపుతాను వినండి. డబ్బు, హోదా ఉన్నవాళ్ళ వెనక మనుషులుంటారు. మంచి మనసు, సహాయం చేసే గుణం ఉన్నవారి వెనుక సాక్షాత్తు ఆ భగవంతుడే అండగా నిలబడతాడు” అంది నరసవ్వ. ఆమె మాటలకు చైతన్య మనోనేత్రం తెరుచుకుంది.
“నాన్నగారూ! నన్ను క్షమించండి. నరసవ్వ నాకిప్పుడు నిజం చెప్పకపోతే.. అంటూ విజయచంద్ర కాళ్ళకు చుట్టుకుపోయిన చైతన్య గద్గద స్వరంతో ఆగిపోయాడు.
“చైతన్యా! నీవు ఇంకా చిన్నవాడివేరా! ఎదిగేకొద్దీ జీవితానుభవాలే పాఠాలు నేర్పుతాయి. పద వారితో కలసి భోజనం చేద్దాం” అంటూ చైతన్యతో కలసి అడుగులు వేసాడు విజయచంద్ర.
దూరంగా మైక్‌లో “ఏ తల్లి పాడేను జోల.." అంటూ ఘంటసాల వారి గొంతు ఆర్ద్రతతో వినిపిస్తోంది.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.









Comments