top of page
Original.png

ఈగ - తేనెటీగ

ఈగ తేనెటీగ, సురేఖ పులి, తెలుగు కథ, తెలుగు కథలు, భావోద్వేగ కథ, కుటుంబ కథ, హృదయాన్ని కదిలించే కథ, మానవత్వం, కృతజ్ఞత, మంచి మనసు, వృద్ధుల గౌరవం, తల్లి ప్రేమ, తల్లి కొడుకు బంధం, రైల్వే ప్రయాణం, నీతి కథ, ప్రేరణాత్మక కథ, తెలుగు నీతి కథ

 తేనెటీగ పువ్వు నుంచి తేనె సేకరించి ప్రపంచానికి మాధుర్యం ఇస్తుంది; ఈగ మాత్రం గాయాలనే వెతుకుతుంది. మనం ఏవారిగా జీవించాలో మనమే నిర్ణయించుకోవాలి.
 తేనెటీగ పువ్వు నుంచి తేనె సేకరించి ప్రపంచానికి మాధుర్యం ఇస్తుంది; ఈగ మాత్రం గాయాలనే వెతుకుతుంది. మనం ఏవారిగా జీవించాలో మనమే నిర్ణయించుకోవాలి.

Eega - Teneteega - Telugu Emotional Family Story | Surekha Puli

ఈగ తేనెటీగ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | సురేఖ పులి

Published in manatelugukathalu.com on 31/07/2026


ఆకలితో ఉన్న ఒక చిన్నారికి తన భోజనం ఇచ్చిన ఓ వృద్ధుడు... కానీ అదే కుటుంబం తర్వాత అతనికి చేసిన పని హృదయాన్ని కలచివేస్తుంది. సురేఖ పులి రచించిన "ఈగ తేనెటీగ" ఒక హృదయాన్ని హత్తుకునే తెలుగు కుటుంబ కథ. మానవత్వం, కృతజ్ఞత, తల్లి ప్రేమ, వృద్ధుల పట్ల గౌరవం, నిస్వార్థ సహాయం వంటి విలువలను హృద్యంగా ప్రతిబింబించే ఈ భావోద్వేగ కథ ప్రతి మనిషిని ఆలోచింపజేస్తుంది. మంచి చేసినవాడు ప్రతిఫలం ఆశించడు, కానీ కృతజ్ఞత లేని మనుషులు జీవితాన్ని ఎలా చూస్తారో ఈ కథ అద్భుతంగా చూపిస్తుంది. తెలుగు కథలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన, వినాల్సిన ప్రేరణాత్మక కథ.


ఆకలితో ఏడుస్తున్న చిన్నారికి తన భోజనం ఇచ్చాడు… కానీ అదే కుటుంబం తర్వాత చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు!

సురేఖ పులి గారి ఈగ తేనెటీగ కథను చదవండి


అధ్యాయం 1: పరిచయం – బంధాల మధ్య ఒంటరైన జీవితం 


ప్రభాకర్, అతని  సహోద్యోగి శివమణిల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. కొడుకు, కూతురు పుట్టారు. రోజులు, సంవత్సరాలు గడిచినా ఇరు కుటుంబాలు, వారి దూరాన్ని కొనసాగించాయి. 


అందరి నిరసనను సవాలుగా తీసుకుని ఉద్యోగ బదిలీ చేయించుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. పిల్లల చదువులు అయ్యాక పెళ్ళిళ్ళు చేశారు. ఇద్దరూ ఉద్యోగ విరమణ దశకు చేరుకున్నారు. 


కూతురు, అల్లుడు వారి చదువుకు తగ్గట్టు సొంత మెడికల్ షాప్ పెట్టుకుని సంతోషంగా ఉన్నారు. కొడుకు, కోడలు ఇద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్స్, మంచి ఉద్యోగాలు. ముస్సోరీ స్కూల్ సెలవుల్లో ఇంటికి వచ్చిన మనవడు శరణ్, మనవరాలు శర్మిష్ఠతో గడిపిన అపురూప సమయం ఇద్దరికీ గుర్తొచ్చి, తల్లిదండ్రుల పట్ల అదిమిపట్టిన ఆదరణ, ఆత్మీయత కోసం తపన చెందుతుంటారు.


 ప్రభాకర్ తండ్రి వేంకటేశ్వరరావు హఠాన్మరణం వల్ల శబరి ఒంటరిదై స్వస్థలంలో చిన్న కొడుకు వద్ద ఉంది.


శివమణికి అన్నదమ్ములు, తల్లిదండ్రులు లేరు. ఉన్న అక్కాచెల్లెళ్లకు శివమణి పెళ్లి తర్వాత ‘మనలో ఒక చీడపురుగు! ఎల్లప్పుడూ గుచ్చుకుంటున్న ముల్లుగర్ర!’ అనే భావన కూరుకుపోయింది. 


కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా ఫోన్ చేయరు; శివమణి ఫోన్ చేసినా ‘నెట్‌వర్క్ సరిగ్గా లేదు. మరోసారి మాట్లాడదాం!’ అని తప్పించుకుంటారు. 


ఆ ‘మరోసారి’ మళ్ళీ ఎప్పటికీ రాలేదు, వస్తుందని ఆశించడం మానేసింది శివమణి.


అధ్యాయం 2 – ఆ ఒక్క ఫోన్ కాల్... జీవితాన్నే మార్చేసింది. 


“హలో!.. నాన్న, నేను సన్నీ..” సన్నిధి తండ్రికి ఫోన్ చేసింది.


భర్త ఫోన్ తీసుకుంది శివమణి, “హలో.. సన్నీ, నేను అమ్మను. చెప్పమ్మా..”


“నువ్వు, నాన్న టిఫిన్ చేశారా? మందులు వేసుకున్నారా? వాకింగ్ అయిందా? అమ్మా, నీ మోకాళ్ళ నొప్పి ఎలా ఉంది? ఇప్పుడేం చేస్తున్నారు?” ఎడతెరిపి లేకుండా ప్రశ్నించింది సన్నిధి.


“ఏమైంది సన్నిధి? ఇలా అడుగుతున్నావు? నిన్న రాత్రి పదకొండు వరకు కబుర్లు చెప్పి.. సరేలే, మా ఇద్దరి కాఫీ-టిఫిన్, మందులు గట్రా అన్నీ అయ్యాయి. ఏదైనా ముఖ్య విషయం చెప్పాలా?”


“అవునమ్మా, నాన్న ఫ్రీగా ఉన్నారా?” కూతురు సందిగ్ధంగా అడిగింది. 


టీవీ సౌండ్ తగ్గించి, భర్త చేతికి ఫోన్ అందించింది. “నాన్నతో మాట్లాడు..” 

ప్రభాకర్ హియరింగ్ ఎయిడ్ చెవిలో పెట్టుకుని, “హలో అమ్ములు, ఏమైంది?” ప్రశాంతంగా అడిగారు.


“చిన్నాన్న ఫోన్ చేశారు, నానమ్మ ఇక లేరు. మీరిద్దరూ రావాలి.. అఫ్కోర్స్.. ప్రయాణం కష్టమైనా తప్పకుండా రండి. మీరు వచ్చాక అంతిమయాత్ర జరపాలని అనుకున్నారు. 


విషయం తెలియగానే మేము పది నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసాము. మీకు ట్రైన్, బస్.. ఏదో ఒకటి బుక్ చేస్తాను. పోనీ ఫ్లైట్ బుక్ చేయమంటారా?” పాఠం అప్పచెప్పింది.


అమ్మ..! అమ్మకు ముక్తి దొరికింది! నిట్టూర్చాడు. 


“తప్పకుండా మేము వస్తాం. నీకెందుకు శ్రమ? ధరణి బుక్ చేస్తుంది.” ప్రభాకర్ కుదురుగా అన్నాడు.


“ఇందులో శ్రమ ఏముంది నాన్న. ఇప్పుడు వదిన ఆఫీస్ పనిలో బిజీ ఉంటుంది. నేను ఖాళీ యే కదా?” సన్నిధి అడిగింది.


“అవుననుకో, సరే, బుక్ చేయి. కాచిగూడ తత్కాల్ ట్రైన్ ట్రై చేయమ్మా. తప్పని పరిస్థితి అయితే ఫ్లైట్ చూడు.” 


ప్రభాకర్ ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఆలోచించి పొదుపు చేయడం అలవాటైపోయింది.


“అదేంటి నాన్న, ఇలాంటి ఎమర్జెన్సీ లో ఫ్లైట్ బెట్టర్..” అనునయించింది సన్నిధి. 


“బెటరే, కానీ ఫ్లైట్ ఎక్కే వరకు మీ అమ్మకు ఒక తరహా గుండెదడ, టెన్షన్; ఎక్కిన తరువాత మరో తరహా భయంతో కూడిన టెన్షన్. బస్ అసలు వద్దు. ఇదివరలో మీ అమ్మ చాలా అన్‌ఈజీగా ఫీల్ అయింది. మధ్య దారిలో వాష్ రూమ్స్ నీట్‌గా ఉండవని.. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా బాధపడింది; దాంతో ఇంట్లో అందరికీ టెన్షన్!”


“అందుకే అమ్మకు వీలుగా ట్రైన్ చూస్తాను. ఒకవేళ మీకు లోయర్ బెర్త్ దొరకకపోతే..? పోనీ ఇంకా టైమ్ ఉంది, వందే భారత్ చూడనా?” సలహా ఇచ్చింది సన్నిధి.


“వద్దు. యశ్వంత్పూర్ వెళ్లి వందే భారత్ ఎక్కాలంటే చిరాకు.” గిర్రున ఫ్యాన్ తిరుగుతూ గది అంతా చల్లటి వాతావరణం ఉన్నా ప్రభాకర్ చెమటతో తడిసిపోతున్నాడు.


“సీసీ కాదు ఈసి బుక్ చేస్తాను. కమ్ఫర్ట్ ఉంటుంది.” సన్నిధి మరింత ఆందోళన పెంచింది.


“వద్దమ్మా. ఏసీ, బీసీ.. మాకు వద్దు. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో మరమ్మతులు చేసి విస్తీర్ణం, వసతులు పెంచుతున్నారని ప్రస్తుత ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు, నేను ప్రత్యక్షంగా చూశాను. వద్దు గాక వద్దు!” నిర్ధారించాడు.

“సరే, కొంచెం టైమ్ ఇవ్వండి. ఇంతలో మీరు సద్దుకుని రెడీగా ఉండండి.” సంభాషణ ముగించాలనుకుంది.


“ఓకే.. సన్నీ!” 


సంభాషణ ముగిసింది. ఆర్నెల్ల కోసం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న కొడుక్కి మెసేజ్ చేశాడు. అమ్మ గుర్తుకొచ్చింది. ప్రభాకర్ కళ్ళు మూసుకొని శూన్యం చూశాడు. 


క్రితంసారి అమ్మకు సీరియస్ అంటే ప్రభాకర్ స్వస్థలం వెళ్ళినప్పుడు శబరి తొంబై ఐదు సంవత్సరాలు దాటి జవసత్వాలు ఉడిగిపోయి ఉంది. ఇప్పుడు లేని అమ్మను తలచుకోగానే తన ప్రమేయం లేకుండానే కన్నీరు ఉబికింది.


అధ్యాయం 3: ప్రయాణం మొదలైంది... పరీక్ష కూడా మొదలైంది 


నాన్న మంచి-చెడు అన్ని సర్దుకునిపోయే తత్వం. అమ్మ చాలా సున్నితమైంది; విమానం అంటే భయం, బస్సు ప్రయాణం ఆరోగ్యరీత్యా పడదు. సన్నిధి ఆలోచించి ట్రైన్ టికెట్ ప్రయత్నించింది. 


పద్ధతి ప్రకారం ఒక రోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ కోసం చివరి క్షణంలో దొరికిన అత్యవసర అవకాశం! వదులుకోలేదు. అదే రోజుకి టికెట్లు దొరికాయి. 


కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్, రెండు టికెట్లు అప్పర్ బెర్త్! సన్నిధి టికెట్స్ వాట్సాప్ చేసింది.


శివమణి రాత్రిపూట భోజనం మానేసి చాలా కాలం అయింది. మంచినీళ్ల బాటిల్ పెట్టుకుంది. భర్తకు రాత్రుళ్లు పెరుగన్నం మాత్రమే తినే అలవాటు, అందుకే రాత్రి భోజనం కోసం పెరుగన్నం టిఫిన్ సర్దింది. 


ప్రభాకర్ క్యాబ్ బుక్ చేస్తూ రెండు డెస్టినేషన్ల ఎంపిక చేసి క్రాంతివీర రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో ధరణి ఆఫీస్ వద్ద దిగి ఇంటి తాళం చెవి ఇచ్చి విచారకరమైన వార్త తెలియజేశారు.


“మనం ముగ్గురం కార్లో వెళ్లడం బెటర్; నేను సెలవు పెడతా!” ధరణి మెడలోని ఐడి కార్డ్ తొలగిస్తూ అంది.


‘మేము పుట్టి పెరిగిన పుడమిలో మా ఇద్దరికీ మర్యాద, మన్నన లేవు’ అనుకుని, కోడలు లాంగ్ డ్రైవ్ చేయడం ఇష్టం లేక, “వద్దమ్మా, టికెట్స్ బుక్ అయ్యాయి. వెళ్ళేది పక్క రాష్ట్రం! ఒక్క రాత్రి ప్రయాణం మాత్రమే, మాకేమీ అసౌకర్యం లేదు, వెళ్లగలం. 


ప్రదీప్ వచ్చాక ఇద్దరూ కలిసి రండి” అని కోడల్ని ఇబ్బంది పెట్టక క్యాబ్ ఎక్కి ముందుకు సాగారు.


“మనకు లోయర్ బెర్త్ దొరుకుతుంది, ఎవరో ఒకరు ఉంటారు దాతలు; అంతగా అయితే, టికెట్ మాస్టర్ రాగానే రిక్వెస్ట్ చేద్దాం” అని నమ్మకంగా ఉన్నారు.


అధ్యాయం 4: ఒక పెరుగన్నం డబ్బా... ఒక మహోన్నత హృదయం 


ట్రాఫిక్ రద్దీ! మెట్రోపాలిటన్ సిటీల్లో రోడ్డు ట్రాఫిక్ పెద్ద మానసిక సమస్య; రైల్వే స్టేషన్ చేరే వరకు ఆందోళన చెందారు. రైల్వే వారి ప్రకటన మారుమ్రోగింది, గంట లేటు! లగేజ్ ట్రాలీ సహాయంతో సునాయాసంగా ఐదవ ప్లాట్‌ఫారం చేరి బెంచ్ పైన కూర్చున్నారు. 


ముద్దులొలికే పాపని ఎత్తుకుని ముచ్చటైన జంట ఖాళీ బెంచ్ కోసం అటు ఇటు చూస్తున్నారు. బెంచ్ పైన ఉన్న లగేజ్ కింద పెట్టి ఆ జంటను కూర్చోమని పక్కగా జరిగారు ప్రభాకర్ దంపతులు. ఆ జంట కళ్ళతోనే థాంక్స్ చెప్పారు. 


అతను, ఆమె కాసేపు పిచ్చాపాటి కబుర్లు తెలుగులో మాట్లాడుకున్నారు. శివమణి మాట కలిపింది. న్యూస్ పేపర్ చదవడం ఆపేసి ప్రభాకర్, అతను మాట్లాడుకున్నారు.


ఉన్నట్టుండి పాప ‘ఆకలి’ అంటూ ఏడుపు మొదలు పెట్టింది. బ్యాగ్‌లోని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది తల్లి. ‘నాకు అన్నం కావాలి’ అని మొండిగా అంది. అన్నం లేదని పాప తండ్రి నచ్చజెప్పాడు, వినలేదు. దెబ్బలు కొడతానని బెదిరించాడు.


“ట్రైన్ ఎక్కిన తరువాత అన్నం పెడతా! ఏడిస్తే ఆ పోలీస్ ఎత్తుకెళతాడు” తల్లి భయపెట్టింది. ప్రేమగా పాప వైపు చూసింది శివమణి. అమాయకంగా చూస్తూ ఆకలి మంట భరిస్తూ మౌనంగా ఏడుస్తూనే ఉంది చిన్నారి.  

“నిన్నంతా జ్వరం. అన్నం తినలేదు, కడుపు ఖాళీ. పారాసెటమాల్ వల్ల కాబోలు కడుపులో గాబరా, ఇప్పుడు జ్వరం లేదు. ట్రైన్ ఆలస్యం అనుకోలేదు, ట్రైన్ ఎక్కిన తరువాత డిన్నర్ వస్తుంది.” పాప తల్లి సంజాయిషీ ఇస్తూ బ్యాగ్‌లో బొమ్మ తీసి పాప చేతికిచ్చింది. విసురుగా బొమ్మను తిరిగి బ్యాగ్‌లో పెట్టింది పాప.


ప్రభాకర్‌కు జాలేసి హ్యాండ్ బ్యాగ్ నుండి శ్రద్ధగా తన కోసం కట్టిన పెరుగన్నం డబ్బా తెరిచి, “పాప ఆకలి అని నోరారా అడిగింది; పాపం! ఎంత ఆకలి వేస్తుందో, ఒక పూట నేను తినకపోయినా నాకేం కాదు. మీరు ఏమీ అనుకోకపోతే అన్నం తినిపించండి” అని పెరుగన్నం ఇస్తూ మృదువుగా అన్నాడు.


ఆమె, అతను ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. “ఫర్వాలేదు, తీసుకోండి” అంది శివమణి. 


పెద్దలు మీమాంసలో ఉండగా పాప పెరుగన్నం డబ్బా అందుకుని, అందులో ఒక పక్కగా ఉన్న చెంచా ఒడుపుగా పట్టుకుని ఆవురావురుమంటూ తినడం పూర్తి చేసింది. పాప ఆకలి చూసి ప్రభాకర్, శివమణి కడుపు నిండిపోయింది.


“అమ్మమ్మ, తాతగారికి థాంక్స్ చెప్పు!” ఆమె పాప వీపు తట్టింది. 


పాప సిగ్గుపడుతూ చెప్పింది. 


“అన్నదాత సుఖీభవ!” 

పాప తండ్రి సంతృప్తిగా అన్నాడు. 


ఆకలి తీరిందేమో వచ్చే గూడ్స్ ట్రైన్ బోగీలు లెక్కపెడుతూ సంతోషంగా చప్పట్లు కొట్టింది. పాప ఆనందాన్ని తల్లిదండ్రుల కంటే ప్రభాకర్, శివమణి ఎక్కువగా ఆస్వాదించారు.


అధ్యాయం 5: మంచికి ప్రతిఫలం... కృతఘ్నత 


టికెట్ కలెక్టర్ చెకింగ్ చేశాడు. “సర్, క్యాన్ యు గెట్ వన్ లోయర్ బెర్త్ సీట్ ఫర్ మై వైఫ్?” బతిమలాడాడు ప్రభాకర్.


“ఇక్కడే ఎవరినో ఒకరిని మీరు అడుక్కోండి.” తన పని కాదన్నట్టు టికెట్ కలెక్టర్ ప్రయాణీకుల చెకింగ్ నిమిత్తం వెళ్ళిపోయాడు. 


ప్రభాకర్ లోయర్ బెర్త్ కోసం వేట పూనుకున్నాడు, వేరే ధ్యాస లేదు. తోటి ప్రయాణికులు ఎవ్వరూ లోయర్ బెర్త్ సీటు దానం చేసే స్థితిలో లేరు. ఎవరికి వారే బిజీ!


పాప వాష్ రూమ్ వెళ్లి అమ్మమ్మ, తాతను చూసి ముసిముసి నవ్వు నవ్వి, “మీ వెనుక మా సీటు!” అని కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది. పాప తల్లిదండ్రులు ఇద్దరికీ లోయర్ బెర్త్! పాప తొంగి చూసి చేతిలోని చిప్స్ ‘మీకు కావాలా?’ అని సైగ చేసి అమాయకంగా అడిగింది. వద్దన్నారు.


ప్రభాకర్ పాప ఉన్న సీటు వద్దకు వెళ్ళి, “మిస్టర్! నా భార్య సీటు అప్పర్ బెర్త్! పైగా ఆమె రాత్రి రెండు, మూడు సార్లు బాత్రూం వెళ్ళాలి. ఎక్కడం దిగడం ఆవిడ వల్ల కాదు. ప్లీజ్, నా భార్యకు మీ సీటు ఇవ్వండి” అని వినయంగా అన్నాడు.


సీటు మీద దుప్పటి కప్పుతున్న అతను భార్యను కదిపి ‘ఏం జవాబు చెప్పాలి’ అని ఆమె అనుమతిని కళ్ళతో అడిగాడు.


“లేదు, లేదు.. ఇవ్వము, మాకే కావాలి. మేము చాలా రోజుల కిందట బుక్ చేశాము. పైగా మాకు పాప ఉంది. నిద్ర పోయినప్పుడు మేము ఇద్దరం పాపను ఒకరి తర్వాత ఒకరు చూసుకోవాలి. 


అప్పుడప్పుడు పాప నిద్రలో మూత్రం పోస్తుంది. నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మా ఇద్దరికీ లోయర్ బెర్త్!” అని నిరసించింది పాప తల్లి. ఆమెకు వంత పాడాడు అతను.


ప్రభాకర్, శివమణి ఇద్దరిలో వార్థక్యపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఒక మహిళా సీనియర్ సిటిజన్ కోసం కొన్ని గంటలు, కేవలం ఒక్క రాత్రి.. లోయర్ బెర్త్ మార్పిడి కోసం ఒక్క ప్రయాణికుడు కూడా సమ్మతించలేదు. 


‘జయహో రైల్వే ప్రయాణికులు!’ అనుకున్నారు.


రాత్రంతా భార్య పడే అవస్థ చూడలేకపోయాడు. 


“ఏమిటి ఈ మనుషుల తీరు, కృతఘ్నులు!!” ప్రభాకర్ కోపం అణచుకున్నాడు. 

శివమణి అప్పర్ బెర్త్ ఎక్కలేక, ప్రభాకర్ కూడా భార్యకు తోడుగా బాత్రూమ్ వద్ద దుప్పటి పరుచుకుని ఒకరినొకరు ఆనుకుని కూర్చున్నారు; మెలుకువ నిద్రావస్థలో త్రిశంకు స్వర్గాన్ని చవిచూశారు.


మహబూబ్ నగర్ స్టేషన్ వద్ద జనరల్ క్లాస్ టికెట్ తీసుకుని పలుగు-పార పనిముట్లతో కూలీల దండు స్లీపర్ క్లాస్ ఎక్కారు. ఒకటే హడావిడి! రూల్స్ చెబుతూ పద్ధతిగా డ్యూటీ చేస్తున్న టికెట్ చెకింగ్ ఆఫీసర్ ఎక్కడా కనిపించలేదు. 


కూర్చున్న ఆ చిన్న స్థలం ఇరుకైనది. రైలు ఏమీ పట్టించుకోలేదు, తన పని తాను చేసుకుంటూ వేగం పెంచింది. సిగ్నల్ పడలేదనే కారణం వల్ల మలక్‌పేట్ స్టేషన్ వద్ద ట్రైన్ చాలా సేపు ఆగి అలసట తీర్చుకుంది. కాచిగూడ స్టేషన్ వచ్చాక అల్లుడు రఘురాం అత్తమామలను పికప్ చేసుకున్నాడు.


“అత్తగారు, మీ ప్రయాణం బాగా జరిగిందా? అయినా కొన్ని గంటలే కదా, పైగా తోడు మామగారు కూడా ఉన్నారు!” అని పలకరించాడు. 


ట్రైన్లో ఎదుర్కొన్న నరకం చెప్పే ఓపిక లేక బలవంతపు నవ్వు నవ్వారు ప్రభాకర్, శివమణి.


అధ్యాయం 6: తల్లి చివరి కోరిక... కొడుకు హృదయ పరీక్ష 


“పాపం, 24 గంటలు అమ్మకు మరో స్త్రీ సేవ-సహకారం కావాలి” అదే మాట అందరి సమక్షంలో ప్రభాకర్ అన్నాడు.


“మేము చేసే చాకిరీని మీరు సేవలు లాంటి కొత్త పేరు పెడుతున్నారు. ఎక్కడ తక్కువ చేస్తున్నాం? అన్నం పెట్టలేదా? తగురీతిగా బట్టలు కట్టించలేదా? అత్తమ్మ చాదస్తం మరీ ఎక్కువైంది. ముసల్దాన్ని ఎవరు పలకరిస్తే వారికి సోది చెప్పుకుంటూ ఉంది” అని మరదలు అంది.


“ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఉండి చేసేదేమిటి అంట? మీ ఇంటికి తీసుకెళ్ళి నెత్తినెక్కించుకుని పూజలు చేస్తారా?” అని తమ్ముడు అన్నాడు.


నేను చెప్పిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించడం మామూలే! అన్న వదినలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా!? ఎప్పుడూ అనుకునే మాటే మరోసారి అనుకున్నాడు ప్రభాకర్.


“నెలనెలా మనం పంపించే డబ్బు మాత్రమే వీళ్ళకి కావాలి, మనం అక్కర్లేదు. మనం ఎంత చేసినా మనుషులకు కృతజ్ఞత ఉండదేమో!” అంది శివమణి.


“మణీ! అలా ఆలోచించకు.. మీరు డబ్బు పంపిస్తున్నది నా కోసం, అవునా? వాళ్ళ కోసం కాదు. ప్రభు! మరో మాట.. నువ్వే నా అంతిమ సంస్కారం జరిపించాలి” ఎంతో కష్టంగా చెప్పింది శబరి.

“అమ్మా! ఆ మాటలు ఇప్పుడెందుకు?” అని ముడతలు పడి మెత్తగా ఉన్న తల్లి చేతులు తన చేతుల్లోకి తీసుకుని నిమిరాడు.


“నా తృప్తి కోసం! మీరు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటారు. నా అందుబాటులో ఉంటే బాగుండును. నువ్వు నా తలకొరివి పెడితే నాకు విముక్తి! నీకు పుణ్యం దక్కుతుంది, నా బంగారం! నువ్వు నీ మనసులో ఏదో శంక పెట్టుకుని నేను చచ్చాక రావడం మానేస్తావా?” అని మాటల మధ్య వ్యవధి పెంచి మెల్లిగా అంది.


“అమ్మా! చేతులెత్తి దండం పెడతా, మంచి విషయాలు తలచుకో, సంతోషం పంచు!” అని గద్గద స్వరంతో అన్నాడు.


“నాకు విముక్తి, నీకు పుణ్యం.. అంతే! మనిద్దరికీ మిగిలేది అంతే!! నీ ఉత్తమ గుణం నాకు తెలియనిదా ప్రభు! నువ్వు ఎవరి నుండి ఏమీ ఆశించవు. 


అధ్యాయం 7: తల్లి జ్ఞాపకాల్లో... కొడుకు మహోన్నతత్వం 


అప్పుడెప్పుడో మీ నాన్న ఆక్సిడెంట్ అప్పుడు.. రక్తం కావాలంటే ఆఘమేఘాల మీద వచ్చి రక్తదానం చేసి వెళ్లిపోయావు. నీకెప్పుడు తొందర! తొందర మనిషివి నువ్వు. మీరు ఉన్న కొంతసేపు నా కాలక్షేపం కోసం ఏదో చెప్పండి, వింటాను.”


అత్తగారి కళ్ళలోని కన్నీరు చూడలేక తరుణోపాయం కోసం శివమణి, “అలెక్సా, ప్లే ఘంటసాల తెలుగు డివోషనల్ సాంగ్స్” అంది.

ఒకరోజు అర్జంటుగా మధు ఫోన్ చేసి, “నాన్నగారికి A+ రక్తం కావాలి, మీ ఇద్దరిదీ ఒకే రక్తం అందుకే..” అన్నాడు. 


ఉన్నపళంగా విమానంలో వచ్చి రక్తం ఇచ్చాక, “అన్నా, ప్లీజ్, నాన్నగారికి ఇంకా నీ మీద కోపం పోలేదు. నువ్వు రక్తం ఇచ్చిన సంగతి చెప్పొద్దు మనం” అన్నాడు. 


‘ఒక కొడుకుగా నా వంతు బాధ్యత అనుకుని చేశాను. నా పేరు దండోరా చేయాల్సిన అవసరం ఏమిటి?’ అనుకుని ప్రభాకర్ మౌనంగా ఉన్నాడు.


‘శేష శైలవాస శ్రీ వేంకటేశా, శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలివేలుమంగకు అలుక రానీయకు..’ మైమరిపించే స్వరంలో స్వరం కలిపి ఆనందంగా పాడుతూ శబరి తృప్తి చెందింది.


‘ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా..’ ఘంటసాల గారి కంఠం వింటుంటే పరమాత్ముడు కళ్ళల్లో మెదులుతున్నాడు.


“మీరు లేనప్పుడు నేను ఈ చిన్న రేడియోతో ఎలా పాట పాడించుకోవాలో తెలియదు.” శబరి నవ్వుతున్న పెదాల మధ్య అక్షరాల బరువు బాధగా వినిపించింది.


‘భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేల ఈయవు.. మాటలు రాని మృగాలు సైతం.. మంచిగా కలిసి జీవించేను. మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించెను. మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు! నీవేల మార్చవు?..’ పాటకు అనుగుణంగా శబరి పాడుతూ ఉంది, అలసిపోలేదు.


“అత్తగారిని మన వెంట ఉండనీయరు. ఇక్కడ మనల్ని ఉండనీయరు..” శివమణి దుప్పటి సరిచేస్తూ విసుక్కుంది.


మరో భక్తి గీతం మొదలైంది.. ‘నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చునో.. ఏడేడు శిఖరాలు నే నడవలేను..’ పాడుతూ ఆదమరిచి నిద్రపోయింది వృద్ధురాలు.


అధ్యాయం 8: ఆస్తి కాదు... అమ్మ ఆశీర్వాదమే గొప్పది 

శబరి ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉన్నట్లు ఉంది. గుమిగూడిన మనుషులను చూస్తుంటే తెలుస్తుంది తల్లి చనిపోయిందని. అమ్మను అలా చూడగానే ప్రభాకర్ మనసంతా మనస్తాపానికి గురి అయింది, కళ్ళల్లో తడి తుడుచుకున్నాడు. మధుకర్ అతని భార్య తరపు బంధువులు శబరి చివరి కోరికను తోసిపుచ్చారు.


“అంత్యక్రియలు నువ్వు చేయాలని నాతో గానీ, నా భార్యతో గానీ అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. నీకూ నాకూ ఏదో బీరకాయ పీచు సంబంధం ఉన్నదని సన్నిధికి తెలియజేశాను. నువ్వు వచ్చేదాకా శవం ఇంట్లో ఉండనిచ్చాను.” మధుకర్ నట్టింట్లో సభ్యత మరిచాడు.


“అన్నా, మరో విషయం! జస్ట్ క్లారిటీ కోసం. అమ్మ అంత్యక్రియలు నువ్వు చేస్తే నీకు ఆస్తిలో భాగం కావాలని ఏదైనా ప్లాన్ లాంటిది ఉంటే.. సారీ.” 


ఎంతో పెద్ద చదువు చదివి నలుగురిలో మాట్లాడే మర్యాద తెలియదా? చదువు వేరు.. సంస్కారం వేరు!

దిగ్భ్రాంతి చెందాడు ప్రభాకర్, ఒంట్లో నుండి వేడి పొగలు లేచాయి, 


“లేదు. అమ్మానాన్నల ఆస్తి.. మనిద్దరం! ఎవరి ఆస్తి వాళ్ళ దగ్గర భద్రంగా ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఏం కావాలి?” అని నెమ్మదిగా అన్నాడు.


“నీతులు చెప్పి, నిప్పు పట్టి చివరికి కర్మ ముగిశాక అర్హత ఉందని అంటూ ఎగబడితే నా ఖర్మ అని నేను నెత్తి-నోరూ కొట్టుకోవాలి” అని అన్న చెవిలో రహస్యం చెప్పాడు మధుకర్.


ఘంటసాల గారు పాడిన ‘భగవద్గీత’ కాలనీ అంతా వినేట్టు మధుకర్ లౌడ్ స్పీకర్ పెట్టాడు. కాలనీ వాసులు అందరూ వచ్చి ఐదు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు.


ప్రభాకర్ మొండి పట్టు పట్టి అమ్మ ఆత్మశాంతి కోసం అంత్యక్రియలు, శ్రాద్ధ కర్మలు చేశాడు. ‘ఇన్నాళ్ళూ భౌతికంగా దూరం అనుకున్న అమ్మ ఇప్పుడు నా మనసులో ఎల్లకాలం బతికే ఉంది; ఆస్తి కంటే అమ్మ ఆశీర్వాదం కావాలి’ అని పెద్ద కొడుకు తృప్తి చెందాడు.


సమాప్తం.

*****

సురేఖ పులి గారి కొన్ని ఇతర రచనలు:


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page