top of page

ఇనప్పెట్టె గది

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Inappette Gadi' Written By Sita Mandalika

రచన: సీత మండలీక


జానపద కథల్లో ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్లొద్దంటే, రాజకుమారుడు అటు వైపే వెళతాడు.

శ్యామల పరిస్థితి సరిగ్గా అదే.

ఇనప్పెట్టె ఉన్న గదిలోకి తనను వెళ్లనివ్వక పోవడంతో శ్యామలకు వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది.

తీరా వెళ్ళాక ఏం జరిగిందో ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారి ఈ కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం

శ్యామల కొత్తగా పెళ్ళై విశాఖపట్నం నుండి రాజమండ్రి భర్త తో వచ్చి నాలుగు రోజులయింది. గృహ ప్రవేశం, వ్రతం అన్ని ఫంక్షన్లు అయి బంధువులందరూ వెళ్ళిపోడంతో ఇల్లంతా నిశ్శబ్దం గా ఉంది. అమ్మ, తనతో పాటు రాకపోడం ఎంతో బాధనిపించింది.


అవునులే పాపం! అమ్మ రెండు నెలలనించీ పెళ్లి పనులలో బిజీ ఐయిపోయింది. ఎండలో షాపింగ్, టైం కి భోజనం, నిద్ర లేక అలిసి పోయింది. పెళ్లి అవగానే హై టెంపరేచర్ వచ్చింది. ఆ కారణంగా తనతో రాలేక పోయింది.

శ్యామల భర్త శశిధర్ హైదరాబాద్ లోసాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఒక మంచి సంస్థలో జాబ్ చేస్తున్నాడు. శశిధర్ చెల్లి ఇందు. నెల రోజుల్లో ఇందు పెళ్లి ఉందని శ్యామల ని రాజమండ్రి లో ఉండమని ఇందు పెళ్లి వేళకి వస్తానని ఐదు రోజుల తరవాత హైదరాబాద్ వెళ్ళిపోయేడు శశిధర్.


ఇందు, శ్యామల, ఒకే వయస్సు వాళ్లవడం తో శ్యామలకి బాగానే గడిచిపోతోంది.

ఇందు స్నేహశీలి.తన కాలేజీ విషయాలు మొదలు ఎన్నో సంగతులు చెప్పేది .ఇద్దరూ కలిసి షాపింగ్ కూడా చేసేవారు.అత్తయ్య,మామయ్య,ఎంతో ఆప్యాయం గా చూసేవారు. శశి కూడా లేక పోడంతో తనని మరీ అభిమానించేవారు.


ఆ ఇంట్లో వీరందరూ కాక 80 ఏళ్ళ బామ్మ గారు కూడా ఉన్నారు.ఆవిడ శ్యామల మామగారు సుబ్రహ్మణ్యం గారి తల్లి. ఆవిడ శాంత మూర్తో ,కోపిష్టో శ్యామల కి అర్ధం అవలేదు.

శ్యామల ఆర్కిటెక్ట్ అవడం తో ఆ ఇంటి ప్లాన్ చూస్తే కొంచెం ఆశ్చర్యం అనిపించింది.

ఆ ఇంట్లో గదులు తక్కువ. పెద్ద పెద్ద మూడు విశాలమైన హాల్స్. మరొక ప్రత్యేకమయిన గది.


దానికి హాల్ లోంచి మాత్రమే పోవచ్చు. అది ఇంటికి మధ్యలో ఉంది రెండు వైపులా కిటికీలు ఎప్పుడూ బంద్ చేసి ఉంటాయి.గాలి వెలుతురు ఉండదు. హాల్ లోంచి ఉన్న ద్వారం తలుపులు ఎల్ల వేళల తాళం వేసి ఉంచుతారు. ఆ గది ఎదురు గా హాల్ లో బామ్మ గారి మంచం. ఆవిడ రోజులో ఎక్కువ సేపు అక్కడే గడుపుతారు. అందరికీ ఆ గది ఇనప్పెట్టె గది.


శ్యామలకి ఆ గది లో ఏముందో అన్న ఆలోచన వచ్చేది.కానీ ఎవరినీ అడగ లేక పోయింది.

ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఎవరికీ ఎంట్రీ లేదు.అన్నీ ప్రత్యేకతలే.ఒక్క అత్తయ్యగారు మాత్రం బామ్మ గారి దగ్గర తాళం తీసుకుని ఆరూం కి వెళ్లి పది నిమిషాల తరవాత తాళం వేసి బామ్మ గారికి ఇచ్చేసే వారు.ఒక సారి ఆత్రుత భరించ లేక "శశిధర్, మీరు ఆ గదిలోకి ఎప్పుడేనా వెళ్ళేరా" అని అడిగింది. అంత కన్నా ఎక్కువ అడగ లేక పోయింది. శశిధర్ అంటే ఇంకా కొంచెం బెరుకు.


"మాకు ఆ గది లోకి వెళ్లాలని ఆలోచనే ఉండదు.ఎండా కాలం కజిన్స్ అందరం కలిసే వాళ్ళంఆటలు మాటల తోనే గడిచి పోయేది.బామ్మ పిల్లలెవరూ ఆ గది లోకి వెళ్ళకూడదనేది. అది ఒక రూల్ కింద పాటించేవాళ్ళం తప్ప గదిలో ఏముందో ఎప్పుడూ చూడ లేదు" అన్నాడు శశి.


"అలాగా శశీ , నాకైతే ఆ గదికి తాళం చూస్తే లోపల ఏదో ఉందన్న కుతూహలం రోజు రోజుకి ఎక్కువైపోతోంది" .


శశిధర్ నవ్వుతూ "మాఇంట్లో ఏమైనా బంగారం బిస్కట్లు

ఉన్నాయనుకుంటున్నావా. సరే మా ఫ్రెండ్ ఫోన్ చేసేడు. బయటికి వెళ్తున్నాను" అంటూ

వెళ్ళిపోయాడు. ఆ తరవాత రోజునే హైదరాబాద్ వెళ్ళిపోయేడు.

ఇందు తనతో స్నేహం గా ఉన్నా ఆ గది వివరాలు ఎప్పుడూ చెప్ప లేదు. తను కూడా అడగడానికి ధైర్యం చెయ్యలేక పోయింది.ఇదేదో చిక్కు ముడి లా తయారయింది.

ఇందు పెళ్లి ఇంకా 15 రోజులకి వచ్చింది.ఆ వేళ 'షాపింగ్ కి వస్తావా' అని శ్యామల అత్త గారు రాజేశ్వరి శ్యామలని అడిగేరు.

'వస్తానత్తయ్యా' అంటూ ఎంతో ఉత్సాహం గా శ్యామల బయల్దేరింది. షాపింగ్

అయ్యేక ఒక హోటల్ కి వెళ్లి అల్పాహారం తిన్నాక రాజేశ్వరి శ్యామలని దగ్గరలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లింది. ఆ రోజు అత్త గారితో బాగా గడిచింది.

మర్నాడు పొద్దున్నే లేచేసరికి బామ్మ గారు అత్తయ్య గారి తో మెల్లిగా ఏదో

చెప్తున్నారు. తరవాత తను స్నానం చేసి బ్రేక్ ఫాస్ట్ కోసం కిచెన్ లో అడుగు పెడుతుంటే

అత్తయ్య మెల్లిగా చిన్న గొంతుక తో ఇందు కి చెప్తున్నారు. ఏవో కొన్ని మాటలే అస్పష్టంగా

వినబడుతున్నాయి శ్యామలకి.


"శ్యామలనివద్దు నువ్వు చేస్తేనే బాగుంటుంది"... ఆ మాటలు శ్యామలకి కొంచెం బాధ కలిగించాయి.


బ్రేక్ ఫాస్ట్ చేసి గదిలోకి వచ్చి పడుకునేసరికి శ్యామలకి ఏడుపు వచ్చింది. నిన్న ఎంత ఆప్యాయం గా చేర దీసేరు.ఈ వేళ ఇందు తో ఏదో మెల్లిగా మాట్లాడు తున్నారు. తన పేరు కూడా వినిపించింది. తనని వద్దు అని చెప్తున్నారు. తనకి బాధ అనిపించింది.

“పడుకున్నావా వదినా” అంటూ ఇందు గదిలోకి వచ్చింది.

"ఏం లేదు. కొంచెం తల నెప్పిగా ఉంది" అని జవాబిచ్చింది శ్యామల.

"పడుకున్నావా శ్యామలా? స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను. తలనెప్పి తగ్గుతుంది" అని రాజేశ్వరి గదిలోంచి బయటికి వచ్చింది.

'ఈ టైం లో శశి ఉంటే బాగుండును. పెళ్లవగానే తనతో హైదరాబాద్ వెళ్ళిపోయి ఉందును. ఇనప్పెట్టె గదిలో ఏముంటే నాకేం అనుకుంది శ్యామల .


మర్నాడు ఉదయం ఇందు ఇనప్పెట్టె గది లోకి ఒక సారి వెళ్లి మళ్ళీ స్నానం

చెయ్యగానే మరొక సారి ఆ గదిలో కొంత సేపు గడిపింది.ఆ టైం లో బామ్మ గారు కూడా వెంట వెళ్ళేరు. ఇద్దరూ ఆగదిలో 10 నిమిషాలు గడుపుతారు. ఇది రోజూ అవుతున్న ప్రోగ్రాం లా ఉంది ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైపోతోంది శ్యామలకి.

ఇందు పెళ్లి వారం రోజులకి వచ్చింది.అమ్మ నాన్న మూడు రోజుల్లో వస్తారు. అదే సమయం లో శశి కూడా వస్తాడన్న ఊహే చాలా ఆనందం గా ఉంది.

ఆ వేళ పొద్దున్నే బామ్మగారు "శ్యామలా, నువ్వు హైదరాబాద్ వెళ్లే లోపు నీకు ఒక పని చెప్తాను. చేస్తావా అమ్మా?"అని ప్రాధేయ పడుతున్నట్టు అడిగేరు .

"అయ్యో బామ్మ గారు! తప్పు కుండా చేస్తాను"అంది శ్యామల

"శ్యామలా నాతో రామ్మా అంటూ ఇనప్పెట్టె గది తాళం తీసి లోపలి తీసుకెళ్లి తలుపు దగ్గరగా పెట్టి కొంచెం రూమ్ అంతా శుభ్రం గా చీపురు తో తుడిచి పెట్టు. ఈ రూమ్ లోకి

పని మనిషి గాని పై వాళ్ళు గాని రారు. ఇందు పెళ్లి ఇంకా వారం రోజులుంది.పాపం అది

అత్తారింటికి వెళ్ళిపోతుంది. అందుకే నీకు చెప్తున్నాను. స్నానం చేసి రామ్మా! మరో పని చెయ్యాలి" అని శ్యామల కి చెప్పేరు బామ్మ గారు.


మొన్నటి రోజు అత్తయ్యగారు గది శుభ్రం చెయ్యడం తన చేత కాకుండా ఇందు ని చేయమనడం, శ్యామల వద్దు నువ్వే చెయ్యి అని చెప్పడం విని తను అర్ధం చేసుకోలేక అత్తయ్య గారి మీద కోపగించుకుంది అని బాధ పడింది శ్యామల .


తొందరగా స్నానం చేసి బామ్మ గారి తో పాటు ఇనప్పెట్టె గది లోకి వెళ్ళింది

శ్యామల. ఇనప్పెట్టెకి దగ్గిర ఉన్న గోడకి తాతగారిది ఒక పెద్ద ఫోటో పెట్టేరు. ఇనప్పెట్టె పైన ఒక పెద్ద వెండి ప్లేటు, దాని మీద అగరొత్తులు స్టాండ్ ఉన్నాయి. పక్కనే అగరొత్తులు ప్యాకెట్.

"శ్యామలా! నాలుగు అగరొత్తులు వెలిగించి ఫోటో కి దండం పెట్టుకో అమ్మా"

అంటూ చెప్పేరు బామ్మ గారు. ఆవిడ చెప్పినట్లు చేసింది శ్యామల.

"రోజూ స్నానం చేసి రూమ్ శుభ్రం చేసి అగరొత్తులు వెలిగించి తాత గారికి దండం పెట్టుకోవాలమ్మా" అని బామ్మ గారు చెప్తుంటే ఆవిడా కనుకొలకుల్లో నీళ్లు కనిపించేయి శ్యామలకి.


"తప్ప కుండా చేస్తానండి. కానీ బామ్మ గారు, నాదొక సంశయం. ఎంతో , అపురూపం గా చూసుకుంటున్న ఇనప్పెట్టెలో ఎంతో ప్రేమ తో ఏం దాచుకున్నారు? మీ నగలా.. "

అని ధైర్యం చేసి అడిగింది శ్యామల..


"ఓ అదా! అది బంగారు నగల కన్నా విలువైందమ్మా" అంటూ కొంగుకి కట్టుకున్న

తాళంతో ఇనప్పెట్టె తీసేరు.పై అరలో ఉన్న, నీట్ గా మడత పెట్టిన నల్ల కోటు తీసి

చూపెడుతూ "శ్యామలా! ఇది తాత గారి నల్ల కోటమ్మా. ఈ కోటు వేసుకుని హుందా గా రోజూ కోర్ట్ కి వెళ్లేవారు. ఆయన కి ప్లీడరీ అంటే వల్లమాలిన ప్రేమ . ఆఫీస్ లో కూర్చుని అయన చుట్టూ ఉన్న క్లయింట్ లు కేసులు విన్నవించుకుంటుంటే హాలంతా నిండి పోయి సందడి గా ఉండేది . ఆ కోటు వేసుకుని ఎంతో మందికి న్యాయం చేసే వారమ్మా. అందుకే ఆ కోటంటే నాకు గౌరవం .


అదంటే ఏదో చెప్పలేని అభిమానం నాకు. ఆయన ని మరవలేని జ్జ్ఞాపకం. ఇంట్లో తండ్రి గా పిల్లలకి ప్రేమా ఆప్యాయత పంచే వారు.న్యాయ స్థానం లో మంచి పేరు తెచ్చుకుని అందరిచేత గౌరవింపబడ్డారు. ఆ కారణం చేతే ఆయన ఇష్ట పడి కుట్టించుకున్నకోటుని ఈ ఇనప్పెట్టెలో దాచేను" అని చెప్తూ బామ్మ గారు ఇనప్పెట్టె పై అరలోంచి ఒక ప్యాకెట్ తీసి “ఇది కూడా చూడు” అంటూ దాన్ని ఓపెన్ చేసి ఒక గన్నేరు పువ్వు రంగు చీర చూపించేరు.


దాని పై జరీ బూటాలు. చూడ్డానికి చాలా అందం గా ఉంది. కానీ జరీ పువ్వులు కొంచెం కొంచెం గా ఊడి పోతున్నాయి.


"ఈ చీర మీ తాత గారు ఇష్టపడి కొన్న చీర. 'కాంతం! ఆ చీర నీకు చాలా

నప్పింది' అని చాలా సార్లు అన్నారు. ఆయనిష్టమే నా ఇష్టం. అందుకే నేను ఈ చీరని అపురూపం గా దాచుకున్నాను".


"ఇదివరకు రో జుల్లో ఇనప్పెట్టిలో బంగారం వెండి దాచేవారు. దాని తాళం తాత

గారి దగ్గరే ఉండేది. ఈ గది లోకి ఎవరూ వెళ్లేవారు కారు. ఇప్పుడు ఆ నగలేమీ లేవు గాని

అంతకన్నా విలువైన ఈ కోటు, చీర ఇందులో దాచుకున్నాను” అని కధ ముగించేరు బామ్మ గారు


శ్యామలకి ఆశ్చర్యం తో పాటు, బామ్మ గారి పట్ల, అత్తయ్యగారి కుటుంబం మీద మరింత గౌరవం కలిగింది. నేను వీళ్ళని అర్ధం చేసుకోడంలో ఎంత తప్పు చేసేను అనుకుంది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది

.

.


31 views0 comments
bottom of page