కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Jivitha Sathyam' Written By Sita Mandalika
రచన: సీత మండలీక
కెరీర్ ముఖ్యమే. కానీ అందుకోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టకూడదని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం
"వాణీ, బి. ఇ. ఫలితాలు వచ్చేయి. చాలా మంచి రాంక్ తో పాస్ అయ్యేవు. ఇక పెళ్లి
సంబంధాలు చూడ మన్నావా తల్లీ" అంటూ సత్యవతి కూతురిని కొంచెం భయపడుతూనే ప్రశ్నించింది.
"అమ్మా! ఇప్పటికే నీకు ఎన్నో సార్లు చెప్పేను. గ్రాడ్యుయేషన్ తో నా చదువు పూర్తి
అవలేదు. నేను ఇంకా ముందుకి పోవాలి. ఇప్పట్లో నేను పెళ్లిని గురించి ఆలోచించను" అని జవాబిచ్చింది వాణి విసురుగానే.
"అమ్మలూ! కొంచెం నా మాట కూడా విని ఆలోచించు. మాకు నువ్వు ఒక్కర్తివే. నీ
పెళ్లి అయిపోతే మేము నిశ్చింతగా ఉంటాము నీ తెలివి తేటలకి వ్యక్తిత్వానికి తగిన మ్యాచ్ మాత్రమే వెతుకుతాము. ఈ అబ్బాయి బి. ఇ. చేసి చాలా మంచి కాలేజీ లో ఎం. బి. ఏ చేసేడు. నాకు నాన్నకి ఈ సంబంధం బాగా నచ్చింది మనం సరే అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానంది పిన్ని. మంచి కుటుంబం. నువ్వు కూడా ఒకసారి ఫోటో చూడు తల్లీ. నీకు కూడా అతను నచ్చుతాడు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది" అంది సత్యవతి.
"అమ్మా, మీకు నా పెళ్లి మీద ఆశ ఉండచ్చు. కానీ నాకు కెరీర్ ముఖ్యం. జీవితం లో అనుకున్నవన్నీ సాధించేక పెళ్లి చేసు కుంటాను. నేను అమెరికా లో ఒక మంచి యూనివర్సిటీ లో ఎం. ఎస్. చెయ్యాలి. తరవాత చదువో, జాబో ఇంకా నిశ్చయించుకోలేదు. ఇన్ని ఆలోచనలు మనసు లో ఉండగా ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకోగలనమ్మా" అంటూ నిలదీసింది వాణి.
“అమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకుని భర్త తో పాటు అమెరికా వెళ్లి
చదుకోవచ్చుగా? దానితో మా బాధ్యత, నీ కోరిక తీరుతాయి కదా" అని ఒకే మాట గట్టిగా చెప్పి అక్కడనుండి వాకింగ్ కి బయల్దేరేడు వాణి తండ్రి శ్రీధర్.
ఏమీ చెప్పలేక కళ్ళల్లో నీళ్లు నింపుకుంది వాణి. ఈ పరిస్థితి కి మనసంతా
భారమయిపోయింది సత్యవతికి.
వారం రోజుల తరవాత వాణికి ఒక మంచి యూనివర్సిటీ లో ఎం. ఎస్. లో సీట్
వచ్చింది. కూతురి తెలివితేటలకు తల్లి తండ్రులు మురిసిపోయేరు. నెలరోజుల తరవాత వీసా ఇంటర్వ్యూ, మరో రెండు నెలల్లో అమెరికా ప్రయాణం.
రెండేళ్లు ఇట్టే గడిచిపోయేయి. వాణి స్నేహితులకి చాలా మందికి పెళ్ళిళ్ళయిపోయేయి ఈ రెండేళ్లలో. కొంత మంది పెళ్ళిళ్ళయిపోయి భర్తల తో ఇండియా వచ్చేసేరు.
ఎం. ఎస్. అయ్యేక ఉద్యోగం వేటలో పడింది వాణి. తనకి నచ్చిన జాబ్ లో జాయిన్
అయ్యింది.
ఇండియా వచ్చి ఇంక పెళ్లి చేసుకుని హాయి గా ఉండు అని తల్లి తండ్రులు మళ్ళీ
పెళ్లి మాట ఆరంభించేరు
"అమ్మా ఎం. ఎస్. చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇండియా వచ్చి ఎలా పెళ్లి
చేసుకుని ఉండగలను" అంటూ నిలదీసింది వాణి
" అంటే ఏమిటి పెళ్లే చేసుకోవా”కొంచెం గట్టిగానే అడిగింది సత్యవతి.
" నా ఉద్దేశం అది కాదమ్మా సరిఅయిన మ్యాచ్ దొరికితే తప్పక చేసుకుంటాను"
అని అమ్మని సంతోషపెట్టింది.
ఇక కూతురు పెళ్లి చేసుకుంటాననగానే గంపెడంత ఉత్సాహం తో మేరేజ్ వెబ్
సైట్ లో వెతకడం మొదలు పెట్టేరు సత్యవతి, శ్రీధర్. చాలా సంబంధాలు చూసి పెళ్లి కొడుకు చదువు, ఉద్యోగం చూసి తల్లి తండ్రుల ని సంప్రదించి పెళ్లి కొడుకు ఫోటోలు, ప్రొఫయిల్ వాణికి పంపించే వారు. రోజూ అమ్మ నాన్న పంపించిన వివరాలు చూడడానికికూడా సమయం ఉండేది కాదు. తన ధ్యాస అంతా తన కెరీర్ మీదనే.
కంపెనీ లో తన పనిని మెచ్చుకుని బాస్ పొగుడుతూ ఉంటారు ఇంకా పై చదువులు చదవాలి, ఉన్నత శిఖరాలు చేరాలి. ఇలా ఉండేవి తన ఆలోచనలు.. అమ్మ, నాన్నలకి
జవాబివ్వలేక ఏదో సెలవు రోజుల్లో ఒకటి రెండు ప్రతిపాదనలు చూసి పెళ్లి కొడుకు తో మాట్లాడి ఆ అబ్బాయి తనకి సూట్ అవడని జవాబు చెప్పేది వాణి. ఇంక వాణి పెళ్లి మనం చెయ్య లేమని నిశ్చయించుకుని అక్కడ తనే చూసి చేసుకుంటుందని వాణి కి అదే చెప్పేరు.
అదే మంచి అదను అనుకుని రెండేళ్ల తరవాత ఆలోచిద్దామని వాయిదా వేసింది వాణి. ఈ రెండేళ్లలో తనలో చాలా మార్పులు వచ్చేయి. తను పూర్తిగా అమెరికన్ లా
తయారయ్యింది. ఇండియా వెళ్లి పది రోజులుండి వచ్చింది. తల్లి తండ్రి తనని చూసి
సంతోషించి నా ముభావం గా ఉన్నారు. వాళ్ళ మనసు లో ఇంకా పెళ్ళవలేదనే బాధ తెలుస్తోంది.
ఉద్యోగం లో పై పైకి పోడం కోసం జాబులు మారుతూనే ఉంది వాణి. అలాగే మరొక ఐదేళ్లు
గడిచేయి. ఇప్పుడు వాణి చాలా మంచి పొజిషన్ లో ఉంది. అప్పుడే తనకి 35 ఏళ్ళు వచ్చేయి. స్నేహితులందరూ పెళ్ళిళ్ళయి జీవితాల్లో స్థిర పడ్డారు.
మరి తను … ఎదో మనసులో వెలితి. మార్పులేని ఒంటరి జీవితం. ఆఫీస్ నించి ఇంటికి వెళ్తే అంతా సూన్యం. ఇలాంటి పరిస్థితి లో ఆఫీస్ లో పని చేస్తున్న మోహన్ పరిచయం అయ్యేడు. మోహన్ తెలివైన వాడు, అందగాడు. అందరి తో సీరియస్ గా ఉండే తను
మోహన్ తో పరిచయం పెంచుకుంది. మోహన్ జీవితం లో ఉన్నత భావాలు కల వాడు. మోహన్ ని పెళ్లి చేసుకుని జీవితం లో సెటిల్ అయితే బాగుండునని ఒక ఆలోచన వచ్చింది. మోహన్ తనకంటే నాలుగేళ్లు చిన్నవాడు. అయినా ఈ దేశం లో ఇలాంటివి పెద్దగా పట్టించు కోరు అని మనసుని సమర్ధించుకుంది వాణి.
ఒక వారం రోజుల తరవాత మోహన్ తనకి ఒక ఇన్విటేషన్ కార్డు
ఇచ్చేడు. తనతో కూడా ఒక అందమైన అమ్మాయి ఉంది. పేరుకు తగ్గట్టే ఆమె పేరు విద్యుల్లత అని, తనకి కాబోయే భార్య అని, పది రోజుల తరవాత వాళ్ళ పెళ్లి అని చెప్పేడు. ఆమె తనకి ఐ. ఐ. టీ లోను, ఎం. ఎస్. లోను క్లాస్ మేట్. పెళ్లి తరవాత మూడేళ్లు బ్రేక్ తీసుకుంటుందని చెప్పేడు. ఒక్క సారి షాక్ అయిన వాణి కన్ గ్రాట్యులేషన్స్ అని చెప్పి రూమ్ కి వెళ్లి పోయింది.
వాణి మనసంతా పాడైపోయింది. తను ఎన్ని ఊహించుకుంది.. ఏమైంది. పెళ్లి నా ఇష్టం అంటూ అమ్మ నాన్న ని బాధ పెట్టింది. ఏ వ్యక్తి కయినా అమ్మ నాన్నలతో చిన్న తనం రోజులు ఎంతో తీయగా గడిచి పోతాయి. తనకూ అలాగే అయింది. తరవాత చదువు, బతకడానికి ఉద్యోగం, తనతో కష్ట సుఖాల లో పాలు పంచుకోడానికి ఒక తోడు. అది ఆడయినా మొగయినా ఎంతో అవసరం. ఆ వ్యవస్థ నే పెళ్లి అనే పేరు తో పెద్దలు ఇద్దరు వ్యక్తులని ఒకటి చేస్తారు. వీటి అన్నిటి కలయిక తో కష్ట సుఖాలు అనుభవిస్తూ ప్రతి ఒక్కరూ జీవించవలిసిందే.
అంతే గాని తన లాగ ఒక కెరీరే ముఖ్యం అనుకుని పెళ్లి అనే మధుర ఘట్టాన్ని సమయానికి ఆహ్వానించక ఆలస్యం
చేస్తే మిగిలింది ఇదుగో ఒంటరితనం. ఇంటికి రాగానే మళ్ళీ సూన్యం ఎదురు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : సీత మండలీక
నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది
కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది
.
Comments