top of page

జ్ఞానోదయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Jnanodayam' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ)

అత్తమామలు, ఆఖరికి కన్నతల్లి కూడా భారమనుకుంది ఆమె.

కానీ వాళ్ళు లేని లోటు తెలుసుకుంది.

పెద్దల విలువ గుర్తించింది.

ఈ కథను ప్రముఖ రచయిత్రి B. లక్ష్మీశర్మ త్రిగుళ్ళ గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం

ఉదయం ఏడున్నర కావొస్తుంది. వంటపనిలో హడావుడిగా ఉంది శశికళ.

భర్తకు ఆఫీసు టైం అవుతుందన్న తొందర. అయిదేళ్ళ కొడుకు బన్నిని భర్త వెళుతు వెళుతూ స్కూల్‌లో దింపివెళతాడు. అందుకని వాడిని లేపాలన్న తొందర ఒకవైపు. బన్నిని లేపి వాడిని తయారుచేసేటప్పటికి అలిసిపోతుంది శశికళ. వాడు నవ్వుతూ లేచాడంటే సరే, లేదంటే ఇకవాడితో కుస్తీ పట్టాల్సిందే, ఓ పట్టాన వినడు. వాడన్నదే కావాలంటాడు.

ఇడ్లీ చేస్తే నేను తినను అని మొండికేస్తాడు. పోని పాలు బ్రెడ్ అన్న తినరా అంటే అది వద్దంటాడు. వాడికి ఏమి తినిపించాలో అర్ధంకాక నానా హైరానా పడుతుంటారు శశికళ, ఆమె భర్త రమేశ్ .

ఇక అయిదో నెల పూర్తి అయి ఆరోనెలలోకి వచ్చింది శశికళ కూతురు. వీళ్ళిద్దరిని పంపించేసరికి పాపలేస్తుంది. పాప ఎక్కడ తొందరలేస్తుందోనని గబగబా పనంతా చేసుకుంటుంది. ఒకవేళ ముందే లేచిందంటే ఆ రోజు పనంతా ఆగిపోతుంది. గీ గీ అని ఒకటే ఏడుపు. ఎత్తుకుంటే తప్పా ఊరుకోదు. అందుకే అయిదుగంటలకే లేచి హడావుడి పడుతూ పనంతా కానిచ్చుకుంటుంది.

శశికళ కూడా సాప్ట్ వేర్ , రమేశ్ సాప్ట్ వేర్. ఇద్దరు ఉదయం వెళితే సాయంకాలానికి గాని రారు. పాప పుట్టినప్పటినుండి సెలవుల్లో ఉంది. ఇంకోవారం రోజులైతే తనుకూడా ఆఫీసుకు వెళ్లాలి. ‘పాపను ఎవరు చూసుకుంటారు? పాపను వదిలి ఎలా వెళ్లాలి’ అనే ఆలోచనలతో బుర్ర పాడయిపోతుంది శశికళకు. కొంచెం అతిగా ఆలోచించే రకం.

ఓ పట్టాన కొలిక్కిరానివ్వదు ఏ విషయాన్నైనా. రమేశ్ అయితే భార్య ఏదంటే అది అనవలసిందే కానీ, ఆయనకంటూ స్వంతనిర్ణయం తీసుకునే హక్కులేదు. ఆమె ఏది చెబితే దానికి తలవూపాలి. ఈ రోజు ఎందుకో బాగా చికాకుగా ఉంది శశికళకు.

“ ఏమండి… ఏమండి.. ఎంతసేపు స్నానం చేస్తారు, బాత్రూంలోనుండి వస్తారా లేదా? కూనిరాగాలు తీసుకుంటూ కూర్చుంటే ఇక్కడెవరు చేస్తారు మీ వంతు పనులన్నీ,” అంటూ కోపంగా తలుపుల మీద దడదడకొట్టింది. పాపం లోపల రమేశ్ జలకాలాటలో మునిగి ఉన్నాడేమో, భార్య కేకలతో మత్తు దిగిపోయినవాడిలా గబగబా తువాలు నడుముకు బిగించుకుని బయటకు వచ్చాడు.

“ ఏమైంది శశి… అంత కంగారుపడుతున్నావు పాపలేచిందా,”?అడిగాడు తయారైవచ్చి.

“ లేకపోతే ఏంటండీ … ఎంతసేపయింది మీరు బాత్రూంలో దూరి, బాబును లేపి స్కూల్‌కు తయారుచెయ్యాల లేదా? ఒక్కదాన్ని ఎన్నని చేస్తాను, పాప లేచిందంటే దానితోనే సరిపోతుంది, చెబితే తప్పా చెయ్యరు ఏపని రోజు చెపుతూనే ఉన్నానా? వెళ్లండి.. వెళ్ళి బాబును లేపి తయారుచెయ్యండి,” అంటూ కస్సుమని లేచింది భర్తమీదకు.

“ ఓరేయ్… బన్నిబాబు లేవరా స్కూల్‌కు టైం అవుతుంది,” అంటూ దుప్పటితీసి గారాబంగా లేపుతుంటే, వాడులేచి దుప్పటి లాక్కొని. “ నేను లేవను , నేను స్కూల్‌కు పోవను,” గట్టిగా అరుస్తూ మళ్ళి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.

“ మాబాబు కదూ! లేవరా, మీ అమ్మే అంటే అమ్మకంటే రెండాకులు ఎక్కువే ఉన్నావురోయ్, పడుకున్నది చాలుగానీ పద స్నానంచెయ్యాలి,” అమాంతంగా లేపి కూర్చోబెట్టాడు.

“ అమ్మా … నేను స్కూల్‌కు పోను, నేను చెల్లితో ఆడుకుంటాను ,” గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు బన్ని.

“ ఏమైంది బాబు ఎందుకేడుస్తున్నావు? ఏమండి ఏమన్నారు వాడిని కొట్టారా

ఏంటి,” భర్తవైపు కోపంగా చూస్తూ బన్నిని దగ్గరకు తీసుకుంది. జరిగిన విషయం చెప్పాడు రమేశ్ .

“ ఓహో అదా సంగతి, అబ్బ మీకేం తెలియదు మీరుండండి, బన్నీ… నువ్వు స్కూల్‌కు వెళ్ళావంటే నీ కోసం నేను చిన్న సైకిల్ తెచ్చిస్తాను, నిన్ను మీ నాన్న రోజు అలా పార్కు వరకు తీసుకవెళ్ళి నీకు సైకిల్ ఎలా తొక్కాలి నేర్పుతాడు సరేనా, మరి నువ్వులేచి గబగబా తయారవుతావా,” కొడుకును బుజ్జగిస్తూ అంది.

“ బలెబలే నాన్న అమ్మ నాకు సైకిల్ కొంటుందట, అమ్మ మంచిది కదా నాన్న,” తల్లికి ముద్దిచ్చి తండ్రి చేతినిపట్టుకుని బాత్రూంలోకి తీసుకవెళ్ళాడు. ముక్కుమీద వేలువేసుకుని తల్లికి తగ్గ తనయుడివిరా అనుకున్నాడు మనసులో రమేశ్ .

“ శశి … ఏమాలోచించావు పాప గురించి , రాత్రి భోజనాల దగ్గర అడిగాడు రమేశ్ .

“ అదే అర్థంకావడం లేదు, ఆలోచించి ఆలోచించి నాకు కోపం పెరిగిపోతుందేమో అనిపిస్తుంది, వాడికైతే బాధలేదు ఎందుకంటే వాళ్ళ స్కూల్‌లో చాలా మంది పిల్లలను సాయంత్రం అయిదువరకు ఉంచుతున్నారట, ఉద్యోగం చేసే తల్లి తండ్రులందరు కలిసి టీచర్లను ఏర్పాటుచేసారట ఎక్సట్రా టైంకోసమని, డబ్బులు పోయినా సరేనని అనుకున్నారట, వాళ్ళు వచ్చి తీసుకపోయే వరకు వాళ్ళే బాధ్యతగా చూసుకుంటారట,

నాకు బాగానే అనిపించింది బన్నీతో సమస్యలేదు మనకు, చిన్నదానితోనే వచ్చింది. పసిపిల్ల.. దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు దొరికితే బాగుండు, అదే టెన్షన్ గా ఉంది,” అంది.

“ శశి.. నేనొకమాట చెప్పనా! మన చిన్నదాన్ని నువ్వు చూసినట్టుగా ఎవరు చూడలేరు, మనమెంత డబ్బులిచ్చినా ప్రేమగా చూస్తారని మాత్రం అనుకోను, అందుకని మా అమ్మను గానీ, మీ అమ్మనుగానీ కొన్నాళ్ళు పసిదాని కోసం రమ్మందాము, వాళ్ళయితే కంటికి రెప్పలా కాపాడుతారు, ఏమంటావు శశి,” అడిగాడు

ఒప్పుకోదని తెలుసు రమేశ్ కు.

“ అమ్మ బాబోయ్… మీ అమ్మను పిలవటమా! వద్దు బాబు, నా పెళ్ళైన కొత్తలోనే మీ అమ్మకు నాకు పడేది కాదు, ఎప్పుడు ఏదో ఒకదాని కోసం గొడవపెట్టుకునేది, మీ అమ్మను భరించడం నా వల్ల కాదు, అయినా మీ అమ్మకు అంత ఓపిక ఎక్కడుంది పసిపిల్లను చూసేంత, నన్నడిగితే ఆమెకు ఆ పల్లెటూరు బాగుంటుంది, మీ తమ్ముడి వాళ్ళు , ఆమె బాగానే కలిసుంటున్నారు కదా! అక్కడే ఉండనివ్వండి . ఇక్కడకు మాత్రం వద్దు,” అంటూ ఖరాఖండిగా చెప్పింది.

“పోనీ… మీ నాన్న ఎలాగు రిటైర్మెంట్ అయ్యారు, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు కదా! మీ వదిన ఇంట్లోనే ఉంటుంది. ఆమె పిల్లలను ఆమె చూసుకోగలదు, అందుకని మీ అమ్మా నాన్నలను రమ్మందాము,” అన్నాడు రమేశ్. వాళ్ళనైతే ఒప్పుకుంటుందేమో అనుకుని.

“ అబ్బో మీరు గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నారు, ఎవరువచ్చినా మనకు ఖర్చు అవుతుందే తప్పా మనకొచ్చేదేమి ఉండదు, మా అమ్మా నాన్నను పిలిస్తే మనకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు, మనిద్దరం కనుక ఏదో ఉన్నదితిని ఆఫీసుకు వెళుతున్నాము, వాళ్ళు ఉన్నారనుకొండి అన్నీ కావాలి ఏది లేకున్నా బాగుండదు. అయినా మనం కష్టపడి సంపాదిస్తున్నది అందరికి పంచిపెట్టడానికా చెప్పండి? పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి, మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలనే కదా ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నది, ఈ మాత్రం దానికి నేనే ఉద్యోగం మాని ఇంట్లోఉంటే సరిపోతుంది, వాళ్ళను వీళ్ళను పిలిచి మనకు ప్రశాంతత లేకుండా చేసుకునే బదులు, ఖర్చులు కలిసివస్తాయి నా పిల్లను నేను సరిగా చూసుకున్నానన్న తృప్తి ఉంటుంది,” అంది కోపంగా.

“ మరేం చేద్దామనుకున్నావు? నీ మనసులో ఏం అనుకుంటున్నావు చెప్పురా

శశి,” అడిగాడు ప్రేమగా.

“ మా ఆఫీసువాళ్ళట ఒక పాపకు వాళ్ళు సగం డబ్బులు ఇస్తారట ఎక్కడన్నా కేర్ సెంటర్‌లో వేస్తే, ఇంకా సగం మనం కట్టుకుంటే సరిపోతుంది కదా! నిన్ననే మా స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం, అంతేకాదు తనకు తెలిసిన వాళ్ళెవరో వాళ్ళ పాపను ఒకావిడ దగ్గరకు పంపిస్తున్నారట, ఆవిడ ఫోన్ నెంబరు ఇచ్చింది. ఆవిడను రేపు మనింటికి రమ్మన్నాను. చూద్దాం ఆవిడ వచ్చాక,” అంది పక్కమీద వాలిపోతూ.

అనుకున్నట్టుగానే పాపను చూసుకునే ఆమె వచ్చింది. అన్ని మాట్లాడుకుని పాపను పంపే ఏర్పాటు చేసుకున్నారు. తృప్తిగా ఆఫీసుకు వెళ్ళిరావడం మొదలైంది శశికళకు.

ఇప్పుడు ప్రశాంతంగా ఉంది రమేశ్ శశికళకు. ఉదయం పాపను బాబును దింపేసి, సాయంత్రం వచ్చేటప్పుడు ఇద్దరిని తీసుకొని వస్తారు, రమేశ్ శశికళది ఇద్దరిది పక్క పక్కనే ఆఫీసు కావడం వల్ల ఇద్దరు కలిసే వస్తారు. ఒకరోజు ఆఫీసులో ఉండగా శశికళ స్నేహితురాలు సుధ ఫోన్ చేసింది.

“ హలో శశి.. బాగున్నావా” అడిగింది సుధ.

“. హలో సుధ నేను బాగున్నాను, ఏమైందే అసలు ఈ మధ్య ఫోన్ లేదు కనిపించడం కూడా మానేశావు, అప్పుడెప్పుడో పాప బారసాలకు వచ్చావు మళ్ళి కనిపించనేలేదు, ఏం అంతగా బిజీ అయిపోయావు,” అంది శశికళ.

“ ఏమో శశి … ఆఫీసు ఇల్లు పిల్లలు, అత్తయ్య మామయ్య పెద్దవాళ్ళు వీళ్ళందరిని చూసుకునే సరికి అలిసిపోతున్నానుకో, అది సరేగానీ …ముందు నాకు విషయం చెప్పు?

నీ పాపను ఎవరు చూస్తున్నారు చెప్పు?,” అడిగింది సుధ.

“ ఎందుకేమిటి ? నీకావసరం లేదుగా.. ఎవరన్నా అడిగారా పిల్లలకోసం, మా

ఆఫీసు కొలిగ్ తెలిసినామే ఉంది. ఆమె దగ్గరకు పంపుతున్నాను, హాయిగా ఉంది సుధ మాకు, లేకపోతే పాపకోసమని మా అత్తగారినో మా అమ్మగారినో పిలవడం నాకు ఇష్టంలేదు, ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము. నీలా హైరానా పడొద్దనుకున్నాము,” అంది నవ్వుతూ.

“ ఓహో ఆదా సంగతి … నాకర్ధమైందిలే గానీ, ముందు నీ పాపను

పంపుతున్న ఆవిడ దగ్గరకు వెళ్ళి చూడు, ఆవిడ దగ్గర నీ పాప ఉందోలేదో

తెలుస్తుంది. ఎందుకంటే నేనీరోజు నీ పాపను రోడ్డు పక్కన ఒక బిచ్చగత్తే చేతిలో చూసాను, నేనేలా గుర్తుపట్టాను అంటావా? నువ్వు పాప పోటోలు పంపుతుంటావు, అందులో నేను పాపకు బారసాలకు వచ్చినప్పుడు ఇచ్చిన ప్రాక్ వేసుకుని ఉంది, నాకు బాగా గుర్తుంది నువ్వు ఆ ప్రాక్ వేసినప్పుడు పంపిన పోటో చూసాను కదా! అందుకే గుర్తుపట్టాను, నాకేం చెయ్యాలో అర్ధంకాలేదు వెళ్ళి పాపను తీసుకొద్దామా అనుకున్నాను, తీరా వెళ్ళాక నీ పాప నీ దగ్గరనే ఉందంటే లేనిపోని రిస్కులా అనిపించి నీకు ఫోన్ చేసా, నేనుకున్నదే నిజమైంది నువ్వు త్వరగా వెళ్ళు,” అంది అడ్రస్‌ చెబుతూ.

ఒక్కసారిగా చెమటలు పట్టేసాయి శశికళకు. బోరుబోరున దుఃఖం పొంగుకొస్తుంది. దేవుడా! సుధ చెప్పినట్టు ఆ బిచ్చగత్తె వద్ద వున్నది నా కూతురు కాకుండా చూడు స్వామి. అంటూ మనసులోనే దేవుళ్ళందరికి దండాలు పెట్టుకుంటూ, రమేశ్ కు ఫోన్ చేసి చెప్పింది.

ఇద్దరు కలిసి హడావుడిగా బయలుదేరారు. ఏదైతే కాకుడదని కోరుకుంటుందో తీరా అక్కడకు వెళ్ళి చూసేసరికి పై ప్రాణాలు పైననే పోయినట్టనిపించి కళ్లుతిరిగి కిందపడిపోయింది శశికళ. రమేశ్ కంగారుపడుతూ నీళ్ళు చల్లి లేపి కూర్చోబెట్టాడు.

పాపం ఆ బిచ్చగత్తెకు ఆ పాప వీళ్ళ పాపని తెలియక అలానే చూస్తూ, రమేశ్ దగ్గరకు వచ్చింది.

“బాబు… తల్లిలేని బిడ్డా ధర్మం చెయ్యండి బాబు,” చెయ్యి చాపింది డబ్బుల కోసమని.

రమేశ్ లో ఆవేశంతో ఆ బిచ్చగత్తే చెయ్యి దొరకబుచ్చుకున్నాడు. అమాంతంగా తన బిడ్డను లాక్కుంది శశికళ. అంతలోకే ట్రాఫిక్ పోలీసు వచ్చి, విషయమంతా విని ఆ బిచ్చగత్తెను బెదిరిస్తూ అడిగాడు పోలీసు.

“ ఏయ్ ఈ పాపను ఎక్కడినుండి తీసుకవచ్చావు? నీ వెనక ఎంతమంది ఉన్నారు?

ఇంకా ఎంతమంది పిల్లలను తీసుకవచ్చారు? మర్యాదగా చెప్పావా సరేసరి! లేదంటే తీసుకపోయి బొక్కలో వేసి కొడుతుంటే నువ్వే నిజం ఒప్పుకుంటావు చెప్పు,” లాఠీ ఊపుతూ అడిగాడు.

“ నీకు దండం పెడతా నాకేం తెలువదు సార్, గా లక్ష్మమ్మ అనే ఆమె ఎక్కడినుండి వస్తుందో కూడా మాకు తెలువదు సార్, పొద్దున పొద్దుననే వచ్చి మాకు ఇట్టాంటి పిల్లలను ఒప్పచెప్పి పోతుంది, మేము ఈ పిల్లలను పట్టుకుని పైసలు వసూలు చేసి ఆమెకిస్తే, ఆమె మాకు రోజుకు వంద రూపాయలు ఇస్తది దొరా! గంతే తెలుసు మాకు.

ఆమె ఎవరో ఈ పిల్లలు ఏడినుండి వచ్చినారో కూడా మాకు తెలువదు, పొట్టకూటికోసం బతికేటోల్లం.. పసికూనలుంటే కొంచెం పైసలెక్కువ దొరుకుతాయాని మాకు ఆస, ఇంతకన్నా మేమే పాపం ఎరుగము సారు! నన్నొదిలెయ్యండి.. ఇంకెప్పుడు ఇట్టాంటి పని సెయ్యను ,” అంటూ కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలుకుంది పోలీసును.

“ సరే ముందు నువ్వు పోలీసు స్టేషన్‌కు పద, ఆమెవరో మేము పట్టుకునేదాకా నువ్వు అక్కడే ఉందువుగానీ,”అంటూ జీపులో తీసుకునిపోయాడు.

పాపను తీసుకొని సరాసరి పాపను చూస్తున్నావిడ దగ్గరకు వచ్చారు. పాపను శశికళను కార్లోనే కూర్చోపెట్టి లోపలకు వచ్చాడు రమేశ్ .

“ ఆంటీ … అని పిలిచాడు. లోపల పనిలో ఉందేమో గబగబా బయటకు వచ్చింది ఆవిడ. రమేశ్ ను చూడగానే మొహం పాలిపోయింది. నిలువెల్లా వణికిపోయింది ఒళ్ళంతా చమటలతో తడిసిపోయింది.

“ఏంటి బాబు ఈ వేళప్పుడు వచ్చారు,” అంది తడబడుతూ.

“ మేము కొంచెం అర్జంటుగా ఊరెళ్ళాలి, పాపను తీసుకవెడదామని వచ్చాను, పాప పడుకుందా,” అడిగాడు రమేశ్ .

“ ఆ అది… అది పాపను ఇప్పుడే మా మనవరాలు అలా ఎత్తుకుని వాళ్ళింటికి వెళ్ళింది, మీరు పదండి బాబు నేను తీసుకొని మీ ఇంటికి వస్తాను,” ఏమాత్రం అనుమానం కాకుండా సర్ది చెప్పింది. రమేశ్ కోపాన్ని ఇంకాపుకోలేక పోయాడు. ఆవిడ చెంపమీద ఒక్కదెబ్బ ఇచ్చాడు. కళ్ళు బైర్లు కమ్మాయి ఆమెకు. పరిస్థితి అర్ధమైపోయింది. లేచి పరుగెత్తబోయింది. ఈలోగా ఫోలీసు జీపు వచ్చి ఆమెను అరెస్ట్ చేసారు బిచ్చగత్తె చెప్పిన సాక్ష్యంతో.

శశికళ ఏడుస్తూ పాపను ముద్దాడింది. వెంటనే సుధకు ఫోన్ చేసింది.

“ హలో సుధా… అవతలి వైపు ఫోన్ ఎత్తగానే బావురుమంది శశి.

“ ఏయ్ శశి … ఏమిటే చిన్నపిల్లలా ఆ ఏడుపు, నీ పాప దోరికిందా? అడిగింది

ఆత్రుతగా.

“ సుధా… ఆ పాప నా పాపనే, నువ్వు గానీ చూడకపోయి ఉంటే నా పాప బిచ్చగత్తెలా మారిపోయేదేమో, ఆ దేవుడే నీ రూపకంగా నా బిడ్డను నాకు దక్కేలా చూసాడు, సుధా! ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను,” అంది గొంతు బొంగురుపోగా.

“ చూడు పిచ్చి శశి … నాకేమి నువ్వు ఋణపడిలేవుగానీ, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఎవరికి రక్షణ అనేది, నీకేమో ఎవరి అంటుసొంటు పట్టదు. ఒంటరిగా ఉండే సంసారాలకు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళకు ఇదొక గుణపాఠం కావాలి, వెంటనే మీ వారికి చెప్పి మీ అత్తయ్యనుగానీ, మీ అమ్మనైనా పిలిపించుకో. వాళ్ళకు పెట్టే పిడికెడు తిండి నీకేం తక్కువకాదు. అర్ధమైందా?,’ అంటూ బుద్దిచెప్పింది సుధ.

జ్ఞానోదయం అయినదానిలా ఫోన్ పెట్టేసి రమేశ్ దగ్గరకు వెళ్ళింది.

“ ఏమండి! మనం అత్తయ్యను తీసుకొద్దామండి” అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే.

ఆశ్చర్యంగా చూసాడు భార్య వైపు.

“ అవునండి! నిజమే చెబుతున్నాను, ఇన్నాళ్ళు పిచ్చిగా ఆలోచించాను డబ్బే

ముఖ్యమనుకుని. డబ్బుంటే చాలు ఏ పనైనా చేయించుకోవచ్చు అనుకున్నాను, అందరు ఉంటే లేనిపోని ఖర్చులు అవుతాయనుకున్నాను గానీ, నా బిడ్డ చేత బిచ్చం అడిగించే పరిస్థితి వస్తుందనుకోలేదు. నన్ను క్షమించండి, పదండి మనం అత్తయ్యను తీసుకుని వద్దాం,” అంది జీవితంలో ఓడిపోయినా దానిలా.

రమేశ్ మహదానందంగా ఉంది. ఇన్నాళ్ళకు తన భార్యలో కలిగిన మార్పుకు లోలోన సంతోషించాడు. ఈ విధంగానైనా మా అమ్మను తీసుకరాగలుగుతున్నాను అనుకున్నాడు.

“ కానీ శశి … మా అమ్మకు నీకు మళ్ళి గొడవలు మొదలైతే నువ్వు తట్టుకోగలవా? పోనీ ఒకపని చేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నా, నువ్వే ఉద్యోగం మానివేసి పిల్లలను చూసుకోరాదు,” అన్నాడు భార్యను ఉడికించడానికి.

“ బలేవారండి మీరు… నేను ఉద్యోగం మానివెయ్యటం ఏంటి? మీకంటే నా జీతం ఎక్కువ తెలుసా మీకు, అంత జీతం వదిలిపెట్టి ఇంట్లో ఊరికే కూర్చోని ఏం చేస్తాం, అప్పుడంటే నా బుద్ది గడ్డితిని అత్తయ్యను వద్దనుకున్నాను, ఇప్పడర్ధమైంది కదా! అత్తయ్యతో నేనే అనుకూలంగా ఉంటే సరిపోతుంది, డబ్బులకు డబ్బులు మిగులుతాయి, పసిపిల్ల హాయిగా నానమ్మ చేతిలో పెరుగుతుంది,” అంది సంతోషంగా.

“ పద అయితే ఇప్పుడే వెళ్ళి అమ్మను తీసుకుని వద్దాము,” అంటూ తొందరచేసాడు రమేశ్ . మళ్ళి ఎక్కడ భార్య మనసు మారుతుందోనని.

॥॥ శుభం॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.



లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


38 views2 comments
bottom of page