కరుణకు భాష అవసరం లేదు
- Karlapalem Hanumantha Rao

- May 22
- 3 min read
compassion story Telugu, human values Telugu, humanity Telugu story, touching Telugu story

Karunaku Bhasha Avasaram ledu - Telugu inspirational Story | Karlapalem Hanumantha Rao
కరుణకు భాష అవసరం లేదు - తెలుగు ప్రేరణాత్మక కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 22/05/2026
ప్రపంచంలో భాషలు వేరు కావచ్చు…కానీ కరుణకు, ప్రేమకు, మానవత్వానికి ఎలాంటి భాషా అడ్డంకులు ఉండవు.
“కరుణకు భాష అవసరం లేదు” కథ, ఒక అమెరికన్ నర్సు మరియు తెలుగు అమ్మమ్మ మధ్య జరిగిన చిన్న సంఘటన ద్వారా మానవత్వం ఎంత గొప్పదో హృదయానికి హత్తుకునేలా చెబుతుంది.
మాటలు అర్థం కాకపోయినా…మనసు అర్థమైతే చాలు అని గుర్తుచేసే అద్భుత కథ.
సోమవారం ఉదయం, క్లినిక్ వెయిటింగ్ రూమ్ కిటకిటలాడుతోంది. ఒక పక్క పెద్దవాళ్ళు మౌనంగా కూర్చుని ఉంటే, మరోపక్క పిల్లల అల్లరితో గది హోరెత్తుతోంది. గ్లాస్ పార్టిషన్ కు అవతల ఉన్న సెక్రటరీలు, నర్సుల ఫోన్ కాల్స్, నవ్వులతో వాతావరణం సందడిగా ఉంది.
ఎంట్రన్స్ డోర్స్ తెరుచుకున్నాయి. సుమారు పదహారేళ్ళ తెలుగు అమ్మాయి తులసి, వంగి నడుస్తున్న తన అమ్మమ్మ పార్వతమ్మను చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది.
పార్వతమ్మగారు వేసుకున్న పట్టుచీర, ఆమె ముఖంలోని ప్రశాంతత ఇట్టే ఆకట్టుకున్నాయి అక్కడి వాళ్ళను. తులసి తన అమ్మమ్మను కుర్చీలో కూర్చోబెట్టి, రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది.
కొద్దిసేపటి తర్వాత, ఒక నర్సు తలుపు తెరిచి, "పార్వతమ్మా!" అని పిలిచింది.
అమ్మమ్మగారు, మనవరాలుతో లోపలికి వెళ్ళింది.
నర్సు పార్వతమ్మను ఒక గదిలో కూర్చోబెట్టి, ఆమె వైపు చూస్తూ గట్టిగా, "మీ పేరు... పార్వతమ్మగారా?" అని అడిగింది. పార్వతమ్మ నవ్వి తల ఊపింది. డేట్ ఆఫ్ బర్త్ అడిగితే మనవరాలు చెప్పింది. కంప్యూటర్లో సరిచూసుకుంటూ పార్వతమ్మగారి చీరను చూసి, "చాలా బాగుంది" అని సైగలతో చెప్పింది నర్స్.
ఆ నర్సు పేరు జిల్, అమెరికన్. తెలుగు రాదు. పార్వతమ్మకు ఇంగ్లీష్ రాదు. జిల్ ఒక ఇంటర్‌ప్రెటర్ (అనువాదకురాలు) కోసం వెతకడం మొదలుపెట్టింది. చివరకు 'బియాంకా' అనే సహోద్యోగిని దొరికింది.
బియాంకాకు తెలుగు కొంచెం వచ్చు. ఆమె లోపలికి వచ్చి పార్వతమ్మతో మాట్లాడటం మొదలుపెట్టింది. జిల్ బియాంకా ద్వారా పార్వతమ్మగారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కంప్యూటర్లో రికార్డు చేయసాగింది.
జిల్ మనసులో ఒకటే ఆలోచన— ‘నాకు తెలుగు వస్తే, ఎంత బాగుండేది! ఈమె లాంటి పేషెంట్స్ తో నేను నేరుగా మాట్లాడగలిగేదాన్ని. ఇంటర్‌ప్రెటర్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు, సమయం ఆదా అయ్యేది. సంతృప్తితో పాటు వృత్తిలోనూ మంచి గుర్తింపు వచ్చేది’ అనుకుంది. బియాంకా తర్జుమా సరిగ్గా చేస్తోందో లేదో అని చిన్న సందేహం కూడా కలిగిందామెకు.
పరీక్ష పూర్తయింది. జిల్ కంప్యూటర్ మీది వివరాలు అన్నీ నమోదు చేసి, ఒక నిట్టూర్పు విడిచింది. పార్వతమ్మగారి వైపు మెల్లగా కంప్యూటర్ మానిటర్ తిప్పి చూపించింది. “ఈజిట్ ఓకే?” అని అడిగింది రొటీన్ గా.
జిల్ కళ్ళలోకి చూస్తూ తెలుగులో చెప్పింది పార్వతమ్మ గారు, “అమ్మా... ఈ అమ్మాయి నీకు ఏం చెప్పిందో నాకు తెలీదు. నా మాటలను మీ భాషలో చెప్పి ఉంటుంది. కానీ నా బాధను ఎలా చెబుతుంది? కానీ, నా మనసులోని మాటను నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావని నీ కళ్ళే చెబుతున్నాయి. అది చాలుతల్లీ నాకు!"
బియాంకా నవ్వుతూ, "అమ్మమ్మగారు ఏమన్నారంటే.. మీరు చెప్పిన మాటలు, రాసిన వివరాలు అన్నీ ఎలా ఉన్నాయో తెలీదుట, కానీ మీ కళ్ళలో మాత్రం ఆమె పట్ల కరుణ ఉందని తెలిసిందిట" అని అనువదించింది.
ఒక్క క్షణం స్తంభించిపోయింది జిల్. భాష కంటే మించిన భావోద్వేగాల వారధి ఒకటి ఉంటుందని ఆ క్షణమే అనుభవమైంది ఆ అమెరికన్ అమ్మాయికి.
ఆ సాయంత్రం క్లినిక్ నుండి ఇంటికి వెళ్తూ, జిల్ తన ఫోన్‌లో "తెలుగు నేర్చుకోవడానికి" ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది.
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.









Comments