క్షణికావేశం
- Mohana Krishna Tata

- 2 hours ago
- 4 min read

Skhanikaavesam - Telugu Tragic Family Story | Mohana Krishna Tata
క్షణికావేశం - తెలుగు విషాదకర కుటుంబ కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 16/08/2026
డబ్బు పోయినప్పుడు మనసు కుంగిపోవడం సహజం. అప్పులు, కుటుంబ బాధ్యతలు, మోసం, భవిష్యత్తుపై భయం ఒక్కసారిగా మనిషిని తీవ్ర ఒత్తిడికి గురిచేయవచ్చు. కానీ ఆ క్షణంలో తీసుకునే ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. “క్షణికావేశం” కథలో సురేష్ ఆన్‌లైన్ పెట్టుబడి మోసంలో లక్షల రూపాయలు కోల్పోయి, కుటుంబానికి ఎలా చెప్పాలో తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతాడు. ఆ క్షణికావేశంలో అతను తీసుకున్న నిర్ణయం చివరకు అతని కుటుంబాన్నంతటినీ విషాదంలోకి నెడుతుంది. డబ్బును తిరిగి సంపాదించవచ్చు కానీ ప్రాణాన్ని తిరిగి పొందలేమనే జీవిత సత్యాన్ని ఈ కథ బలంగా గుర్తుచేస్తుంది.
"ఇదిగోండి సర్... అన్ని సరుకులు ప్యాక్ చేసేశాను. ఇంకేమైనా కావాలా... చెప్పండి?"
"మంచి స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న లిక్విడ్ కావాలి."
"దేనికి సర్?"
"అదే... అదే... బాత్రూమ్ బాగా నాచు పట్టేసింది, అందుకే..."
"దానికైతే నా దగ్గర మంచి మందు ఉంది... చాలా స్ట్రాంగ్! ఎలాంటిదైనా పోవాల్సిందే... తిరుగు ఉండదు."
"అదే... అదే కావాలి నా పనికి."
"అన్నీ ప్యాక్ చేసేశాను... ఇంటికి పంపించేస్తాను లెండి. మీరు ఆఫీస్‌కి వెళ్ళండి సర్."
సురేష్ ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్ నిమిత్తం, కొత్తగా పల్లెటూరు బ్రాంచ్‌లో జాయిన్ అయ్యాడు. పెళ్ళాం అవని, ఇద్దరు పిల్లలు సిటీలో ఉన్నారు. వీలును బట్టి అప్పుడప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వీకెండ్స్‌కి వెళ్తాడు సురేష్.
అవనితో సురేష్‌కి పదిహేను సంవత్సరాల కిందట పెళ్లైంది. అప్పటివరకు కలిసి ఉన్న ఇద్దరూ, ట్రాన్స్‌ఫర్ వలన సురేష్ వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అత్తగారు మంచం పట్టడం చేత, ఆవిడను చూసుకోవడానికి అవని సిటీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పిల్లల చదువులు, అత్తమామల్ని చూసుకుంటూ ఉంది. మామగారు రిటైర్ అయి... బీపీ, షుగర్‌తో అలా ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉన్నారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన సురేష్... చాలా టెన్షన్‌గా ఉన్నాడు. మనసు అస్సలు బాగోలేదు. ఎదురుగా బాత్రూమ్ క్లీనర్ బాటిల్ చూడగానే... మనసు విపరీతంగా ఆలోచించి... ముందుగా అనుకున్న విధంగా బాటిల్ మూత తీసి తాగేశాడు. సగం తాగిన తర్వాత, గొంతు మండడం చేత ఆపేసి, బాటిల్ కింద పడేశాడు.
ఫోన్ తీసి "హలో... అవని! నా పని ఇక అయిపోయింది... ఇక వెళ్ళిపోతున్నా..." అని అంటూ సురేష్ స్పృహ కోల్పోయి కిందపడ్డాడు.
హడావిడిగా అవని మామగారితో కలిసి సురేష్ ఉన్న ఊరికి బయల్దేరింది. రెండు గంటలు పట్టింది సురేష్‌ని చూసేసరికి. వెంటనే, హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడ చూసి, పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ చెయ్యమని వాళ్ళు పంపించేశారు.
అంబులెన్స్‌లో సిటీలో ఒక పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఒక రోజు అనంతరం గండం నుంచి బయటపడ్డాడని డాక్టర్లు చెప్పడంతో ఎంతో ఆనందంలో మునిగింది అవని. జరిగిన విషయం ఎవరితో చెప్పకుండా మేనేజ్ చేసేశారు అవని, మామగారు. ఎవరైనా అడిగితే, కొత్త ఊరిలో ఫుడ్ పడక హాస్పిటల్ పాలయ్యాడని అందరితో అన్నారు.
చాలా రోజులుగా ఫ్యామిలీలో జరుగుతున్న గందరగోళం గుర్తుచేసుకుంది అవని...
ఒకరోజు సురేష్ వీకెండ్‌లో ఇంటికి వచ్చాడు. ఇంటికోసం డబ్బులు అసలు ఇవ్వట్లేదని తండ్రి నిలదీశాడు.
"నాన్నా! ఏవో ఖర్చులు ఉండడం చేత డబ్బులు ఇవ్వలేదు..."
"నా పెన్షన్ డబ్బులతో ఈ ఇల్లు ఎలా నెట్టుకురావడం చెప్పు...? మీ పిల్లల చదువులకి ఫీజు నేను ఎలా కట్టగలను?"
"ఏవండీ...! వాడిని ఏమీ అనకండి... ఇప్పుడే వచ్చాడు కదా..." అంటూ కొడుకుని వెనకేసుకొచ్చింది మంచం మీద నుంచి తల్లి.
"అవును మామగారు...! చాలా రోజుల తర్వాత ఆయన ఇంటికి వచ్చారు."
కొన్ని రోజులు పోయాక డబ్బులకి ఇబ్బంది ఎక్కువ అవడం చేత, ఇంటి రెంట్ కట్టడానికి ఇబ్బందిగా ఉందని సురేష్‌ని మళ్ళీ అడిగాడు తండ్రి. చిన్న ఇంటికి మారవలసి వచ్చిందని సురేష్‌తో చెప్పాడు.
"అసలు నీకు వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నావు...? నువ్వు మేనేజర్ స్థాయిలో ఉన్నావు... నీ జీతం అంతా ఏం చేస్తున్నావు? తాగి తగలేస్తున్నావా?"
"అలాంటిదేమీ లేదు."
"అయితే ఏమైందో చెప్పు?"
తండ్రి గట్టిగా అడిగేసరికి విషయం చెప్పాడు సురేష్...
"గత కొన్నాళ్లుగా నేను ఒక ఆన్‌లైన్ కంపెనీలో డబ్బులు కడుతున్నాను... మొదట్లో కట్టిన డబ్బులకి డబుల్ ఇచ్చారు... అది చూసి నేను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టేశాను..."
"అలాంటివన్నీ మోసాలేరా... టీవీలో రోజూ ఎన్ని చూడడం లేదు చెప్పు?"
"అదేం కాదు... నేను గొప్పవాడిని కావడం మీకు ఇష్టం లేదు... అందుకే ఇలా అంటున్నారు."
కొన్నాళ్ళు పోయాక...
ఒకరోజు...
తాను మోసపోయానని... లక్షల డబ్బు కట్టి మోసపోయానని గ్రహించాడు సురేష్. తన మొహం అందరికీ ఎలా చూపిస్తాడు? అంతా అప్పులే... బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే నిల్, అన్ని చోట్లా అప్పులే, బ్యాంకులో లోన్స్ కుప్పలుగా ఉన్నాయి.
ఇప్పుడు ఆ డబ్బంతా పోయింది. తండ్రికి ఏమని సమాధానం చెబుతాడు? తండ్రి కొట్టినా, చంపినా చంపుతాడని ఒక పక్క భయం. పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించాలి...? అని తన మనసు వేదనకు గురై, ఆ క్షణికావేశంలో చనిపోదామని నిర్ణయించుకున్నాడు సురేష్.
అప్పటికే చుట్టాలందరూ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అందరికీ అర్థం కాలేదు... అంత ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఫుడ్ పడక ఇలా అయ్యిందా అని? అవని మాత్రమే డాక్టర్‌తో మాట్లాడుతోంది. అప్పుడే డాక్టర్ ఒక విషయం చెప్పాడు... "కిడ్నీలు రెండు షాక్‌లో పాడయ్యాయి... డయాలసిస్ చెయ్యాలి... చేస్తే అంతా సెట్ అయిపోతుంది" అని. డయాలసిస్ తర్వాత సురేష్‌కి తెలివొచ్చింది, మాట్లాడుతున్నాడు.
"ఏమండీ...! ఎందుకిలా చేశారు? మీకేమైనా అయితే, మా గతి ఏం కాను?"
"ఐ యామ్ సారీ... నా పరిస్థితి అటువంటిది... మొత్తం డబ్బు మోసపోయాను."
"మీరు బతికారు... నాకు అది చాలు."
అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్లారు... కానీ అదే రోజు అర్ధరాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్... సురేష్‌కి సీరియస్‌గా ఉందని. హాస్పిటల్‌కి చేరుకున్న అవని...
"ఎందుకు డాక్టర్?" అని బాధతో అడిగింది అవని.
"అతను తాగిన మందు... చాలా పవర్‌ఫుల్! అది బ్లడ్‌లో మిక్స్ అయిపోయింది. బయట బాగానే ఉన్నా, లోపల నష్టం జరిగిపోయింది. మిగిలిన అవయవాలు ఫెయిల్ అయ్యాయి... ఐ యామ్ సారీ."
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం చేత సురేష్ జీవితమే కాక, మొత్తం ఫ్యామిలీ అంతా బలయ్యారు. డబ్బు పోతే, మళ్ళీ వస్తుంది... ప్రాణం పోతే మళ్ళీ రాదుగా...! డబ్బు ఎవరైనా సర్దుతారు... ప్రాణం ఎవరైనా పోస్తారా...? ఇది ఆలోచించలేదు.
అవని ఆ అప్పులు ఎలా తీరుస్తుందో? పిల్లల్ని ఎలా చదివిస్తుందో? అత్తమామల్ని ఎలా చూసుకుందో? ఇంత బాధ ఎలా భరిస్తుందో ఆ దేవునికే తెలియాలి.
సమాప్తం.
***
తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ











Comments