top of page

మామిడి చెట్టు


'Mamidi Chettu' written by Padmavathi Thalloju

రచన : పద్మావతి తల్లోజు

"మన ఇంటిని ఎందుకు అమ్మేస్తున్నావు అన్నయ్యా? ఇది నీకు పుట్టిన బుద్దేనా!?" అంటూ కోపంగా ప్రశ్నించింది అన్న రాఘవయ్యను, వనజమ్మ. అసలే నోట్లో నాలుక లేని రాఘవయ్య, చెల్లెలి కోపానికి జడుసుకుని కొడుకు నవీన్ వైపు బేలగా చూశాడు.

నవీన్ కల్పించుకొని "ఇప్పుడు మన ఇంటి స్థలానికి బాగా డిమాండ్ వుంది అత్తయ్యా! ఎలాగూ నానమ్మ, తాతయ్య, అమ్మ ముగ్గురూ ఈ లోకంలో లేరు. నాన్న ఒంటరిగా ఎలా ఉంటారు? మాతోపాటు సిటీకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. మంచి ధరకు ఈ స్థలాన్ని అమ్మి పెడతామని అంటున్నారు. కొనేవాళ్ళు ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ కట్టుకుంటే కనీసం ఐదు కోట్లు అయినా వస్తాయి. కొనడానికి చాలామంది ముందుకు వస్తున్నారు" అన్నాడు నవీన్ ధృడంగా!

"ఆ లాభం ఏదో కొన్న వాళ్లకి వస్తుంది కానీ, మనకు కాదుగా! నా మాట విని మంచి కుటుంబానికి అద్దెకు ఇవ్వు. నెల నెల అద్దే వస్తుంది, మన ఇల్లు మనకే ఉంటుంది"అంది వనజమ్మ సముదాయింపు ధోరణిలో..

"నాన్నలాగే మీరు కూడా ఫూలిష్గా మాట్లాడకండి అత్తయ్యా! 100 ఏళ్లు దాటిన పాత ఇల్లు ఇది. రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అందులో రెంట్ కి ఉన్నవాళ్లకి ఏమైనా జరిగిందంటే, అందరం జైలుకు వెళ్లాల్సిందే!" అన్నాడు నవీన్ ఒకింత కోపంగా.

" ఒరేయ్ నవీన్! పెళ్లి సమయంలో మా నాన్నగారు పసుపు కుంకుమ కింద నాకు ఇచ్చిన ఐదు ఎకరాల పొలం నీకు రాసిస్తాను. కనీసం అది తీసుకుని అయినా ఆ ఇంటిని నాకు వదిలేయ్" అంది వనజమ్మ అంతకంటే కోపంగా!

అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె మాటలకు ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఆ పొలం ఖరీదు ఎంత లేదన్నా పది కోట్ల విలువ చేస్తుంది.

వనజమ్మ కొడుకు రోహిత్, తల్లి ఆస్తి ఎక్కడ చేజారిపోతుందోనన్న కంగారుతో

"ఏంటమ్మా ఇది! నీకేమైనా పిచ్చా? పాత ఇంటి కోసం 10 కోట్లు వదులుకుంటావా? నీకసలు డబ్బు విలువ తెలుసా!" కఠినంగా అంటూ వనజమ్మను వారించబోయాడు.

"ఇక చాలు ఆపండి రా!"అని అరిచాడు రాఘవయ్య .

"ఎలాగూ వింటున్నాము కదా అని మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. మా చెల్లి అంత తప్పుగా ఏం మాట్లాడింది? పాతబడ్డ ఆ ఇంట్లోనే మా చిన్ననాటి జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయని, డబ్బు పిచ్చి పట్టిన మీకు చెప్పినా అర్థం కాదు. చిన్నప్పుడే మేము మా తల్లిని కోల్పోయాం. పొలం పనుల్లో పడి, నాన్న మమ్మల్ని పట్టించుకునే వాడే కాదు. పెరట్లోని మామిడి చెట్టే మమ్మల్ని తల్లిలా సాకింది. ఉయ్యాల ఊపింది. తన మానుపై తల ఆన్చి, అమ్మ ఒడిలోని చల్లదనం అనుభవిస్తూ నిద్ర పోయే వాళ్ళం. మా తల్లి జ్ఞాపకాలతో పాటు, మా తల్లిలాంటి మామిడి చెట్టును కూడా దూరం చేయాలను కుంటున్నారు. మీరసలు మనుషులేనా!? మా రక్తం పంచుకు పుట్టినందుకు కేవలం మా ఆస్తులకు మాత్రమే వారసులుగా మిగిలారు. మాలో దాగిన ప్రేమ, ఆప్యాయతలకు కాదు. ఈ క్షణమే మా ఆస్తులను మొత్తం మీ పేరిట రాస్తాం, ఒక్క ఈ ఇల్లు తప్ప! కనీసం ఈ వయసులోనైనా మమ్మల్ని మా అమ్మ మామిడి చెట్టు నీడలో ప్రశాంతంగా బతకనివ్వండి" అన్నాడు ఆవేదనగా.

ఆయన మాటలకు రోహిత్, నవీన్లలో పశ్చాత్తాపం కలిగింది. మొదటిసారి వాళ్లు మనసుతో కాకుండా హృదయంతో ఆలోచించారు. ఇకముందు ఆ ఇంటిని అమ్మే ఆలోచన కూడా మనసులోకి రానివ్వమని వనజమ్మకు, రాఘవయ్యకు మాట కూడా ఇచ్చారు. వారిద్దరి సంతోషాన్ని మించిన గొప్ప ఆస్తి తమకు ఏదీ వద్దన్నారు.

"అయితే అన్నయ్యకు వండిపెడుతూ నేనూ ఇక్కడే ఉంటానురా రోహిత్!" అంటూ పెరట్లోకి పరిగెత్తి, మామిడి చెట్టును కావలించుకుని చిన్నపిల్లలా గంతులు వేస్తున్న వనజమ్మను చూసి అందరూ హాయిగా నవ్వేశారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.
36 views0 comments
bottom of page