top of page

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5


'Manasuloni Prema Episode 5/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha

'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5/6' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు.


అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది.


మురారి తల్లి మరణిస్తుంది. తన పెళ్లి బావతో ఫిక్స్ అయినట్లు చెబుతుంది నందిని.

ఆఫీసులో 'టెస్టింగ్ టీం లీడ్' లీవ్ లో ఉందని, ఆమె బదులు తన అసిస్టెంట్ వచ్చి మాట్లాడుతుందని మురారితో చెబుతాడు అతని అసిస్టెంట్.


ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 5 చదవండి..


ఆరోజు ఆదివారం, సమయం సాయంత్రం ఆరుగంటలు. శీతాకాలం. మలిసంధ్యకాంతులతో పుడమి కెంజాయిరంగు లీనుతోంది.


జూబ్లీహిల్స్ లోని “లిటిల్ ఇటలీ” రెస్టారెంట్ లో మురారి, చైత్రా ఇద్దరూ టేబుల్ కి ఎదురెదురుగా కూర్చున్నారు.


“అబ్బ, పది సంవత్సరాల తరువాత నిన్ను చూస్తున్నాను మురారీ ? నీలో పెద్దగా మార్పు లేదు కానీ మరింత రంగుదేలి స్మార్ట్ గా కనిపిస్తున్నావు. బట్ నైస్ టూ సీయూ, ఎలా ఉన్నావు, ఎందుకు నన్ను కలవాలని ఇక్కడకు పిలిచావు?"


“నేను బాగానే ఉన్నాను చైత్రగారూ”.


“చైత్రా అను చాలు”.


“థాంక్యూ, ఆ మధ్య మన క్లాస్ మేట్ అభిరామ్ కి ఫోన్ చేసాను. అభీ గుర్తున్నాడు కదూ చైత్రా?"


“ఓ, అభీ గుర్తులేకపోవడం ఏమిటి మురారీ? 'ఎర్ర తేలంటూ' నిక్ నేమ్ తో పిలిచేవాళ్లం కదా”. గుర్తొచ్చిందో ఏమో ఫక్కుమంటూ నవ్వేసింది. నవ్వుతుంటే ఆమె బుగ్గలమీద ఏర్పడిన డింపుల్స్ చూడడానికి ఎంతో ముచ్చటగా అనిపించాయి.


“కాలేజ్ విడిచి వెళ్లిపోయాకా మన క్లాస్ మేట్స్ ఎవ్వరితో నాకు కాంటాక్ట్స్ లేవు చైత్రా. చాలా మంది యూ. ఎస్, మరో దేశాలకు వెళ్లి పోయారని తెలిసింది. నీ గురించి సడన్ గా గుర్తొచ్చి అడిగాను. నీవు ఇండియాలోనే ఉన్నావన్నట్లు మిగతా వివరాలేమీ తెలియవన్నాడు. యూ. ఎస్ నుండి ఇండియా వచ్చేసారేమో అనుకున్నాను”.


“నేను నీకు గుర్తు రావడం, నా గురించి మన అభీని వాకబు చేయడం నిజంగా వింతే సుమా” అంటూ చైత్ర జోక్ చేసింది.


"అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, నిన్ను సడన్ గా మా ఆఫీస్ లోనే చూడడం. నీవేమిటిక్కడ అనుకుంటూ ఆశ్చర్యపోయాను చైత్రా".


"ఒకొక్కపుడు అనుకోనివే ఎదురౌతూ అద్భుతాలు జరిగిపోతాయి మురారీ. పాత స్నేహితులను కలిసినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. నాకు కూడా నీలాగే ఎవరితో కాంటాక్ట్స్ లేవు. అందరికీ దూరంగా ఉంటూ నా ప్రపంచంలోకి ఎవరినీ రానీయకుండా కట్టడి చేసుకున్నాను".


'మీ అందరి లాగ నాకు వెంటనే జాబ్ రాలేదు. ఎమ్ టెక్ చదువుదామా అనుకున్నాను. కానీ ఏకాగ్రత పెట్టలేనేమో అనిపించి ఒక సంవత్సరం పాటు ఏవో ఆ కోర్సులూ ఈ కోర్సులూ అనుకుంటూ చేసాను. లక్కీ గా బాంబే లో 'డాటామేటిక్స్' లో జాబ్ వచ్చింది. ఆరు సంవత్సరాలుగా అక్కడే చేస్తూ ఉండిపోయాను. ఎందుకో ఛేంజ్ కావాలనిపించి మీ కంపెనీకి అప్లై చేసాను. నేను ఎక్స్ పెక్ట్ చేయని ఆఫర్ వచ్చిందని ఇక్కడ చేరిపోయాను'.


“ఒంటరిదాన్ని, ఎక్కడ వస్తే ఏముందని వచ్చేసాను. అదే ఫేమిలీ ఉంటే కదలడం కష్టం కదా?"


“ఒంటరిదానివేమిటి చైత్రా? నీ భర్త పిల్లలూ యూ. ఎస్ లో ఉన్నారా?”


“అసలు ఉంటేగా నీవు చెప్పిన వాళ్లు?"


“అంటే?” అతని భృకుటి ముడిపడింది.


చైత్ర మాట్లాడలేక తలదించుకుంది.


"నీకు అభ్యంతరం లేకపోతే, నీ వ్యక్తిగత విషయాలు అడుగుతున్నానని అనుకోపోతే ఏమైందో చెపుతావా చైత్రా” అర్ధ్రంగా అడిగాడు.


"నాకు వినోద్ తో పెళ్లియిన మాట వాస్తవం మురారీ. కానీ పేరుకి మాత్రమే ఆ పెళ్లి. ఏమిటో అమ్మా నాన్నగారికి అప్పుడు అమెరికా సంబంధం అంటే మోజు. నేనేదో అక్కడ మహారాణీలా సుఖపడిపోతానని, కాళ్లదగ్గరకు వచ్చిన సంబంధం అంటూ ఆనందపడుతూ పెళ్లిచేసారు. పెళ్లైన మొదటి రోజునే నాకు అతను తన గురించి వివరంగా చెప్పేసాడు. అతని తండ్రి బలవంతం మీద నన్ను చేసుకున్నానని, అతను అక్కడ తన కొలిగ్ అయిన పంజాబీ అమ్మాయిని ప్రేమించానని, సహజీవనంలో ఉన్నానని చెప్పాడు. ఆమెను విడిచి నీతో కాపురం చేయలేనని చెప్పాడు. పొరపాటు జరిగిపోయిందని, దానికి పరిహారంగా నన్ను యూ. ఎస్. లో ఎమ్. ఎస్ చదవడానికి స్పాన్సర్ చేస్తానని, అలాగే కావలసినంత డబ్బు ఇస్తానన్నాడు. నాకు ఇష్టమైనట్లుగా బ్రతికే ఏర్పాటు చేస్తానన్నాడు. నేను అక్కడకు రానన్నాను. డివోర్స్ ఇచ్చేయమన్నాను".


'ఏ హడావుడీ, గొడవ లేకుండా ఆ బంధం నుండి విముక్తి అయిపోయాను మురారీ. కానీ దురదృష్టవశాత్తూ వినోద్ ఇప్పుడు లేడు'.


"అంటే?"


"నాకు డివోర్స్ వచ్చి ఆరునెలలు అయింది అప్పటికి. ఒక రోజు మా నాన్న కంగారు పడుతూ నాతో చెప్పారు. వినోద్, అతను ప్రేమించిన అమ్మాయి తో వీకెండ్ కి ఏదో ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లి ఉదయం ఏడున్నరకు తిరిగి వస్తుండగా ఆ సమయంలో భారీగా మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ వాళ్లు ఉన్న కారుని వేగంగా ఢీ కొట్టడంతో వాళ్లిద్దరూ అక్కడికక్కడే చనిపోయారుట అని.


ఈ వార్త న్యూస్ పేపర్ లోనూ, టీవి ఛానళ్లలోనూ వచ్చింది కూడా. పాపం వాళ్ల పేరెంట్స్ బాధ వర్ణానాతీతం. మా నాన్న అయితే ఒకటే కళ్లనీళ్లు పెట్టుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఆ అమ్మాయి స్తానంలో నీవే ఉంటే? అందుకనే ఏమో భగవంతుడు నిన్ను ఆ బంధం నుండి దూరం చేసాడు, నీవు మాకు దక్కావంటూ పదే పదే అంటూ ఉండేవారు. ఏమిటో భగవంతుని లీలలనుకున్నాను.


"ఓ, సో సారీ, పూర్ ఫెలో వినోద్"


"అవును మురారీ. అమ్మా నాన్నా బాధపడ్తూ ఉండేవారు. నేను కూడా ఎన్నాళ్లని బ్రేక్ అయిపోయిన నా వివాహం గూర్చి ఆలోచిస్తూ కూర్చుంటాను? మనసు ఒక్కటే డైవర్ట్ చేసుకోవడం కాదు, ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా జీవించాలనుకున్నాను. ఏవో కొన్ని కోర్సులు చేసి లక్కీగా ముంబైలో జాబ్ సంపాదించాను. నాన్న మరో పెళ్లి చేసుకోమన్నారు. చేసుకోనన్నాను. నాకు ఈ స్వేఛ్చా జీవితం బాగానే ఉంది. మళ్లీ పెళ్లి అంటే భయంగా ఉంటుంది. వచ్చే వ్యక్తి యొక్క అభిప్రాయాలూ నావీ కలవాలి. ఇరువురికీ పరస్పర అవగాహన లేకపోతే మళ్లా జరగరానిది ఏదైనా జరిగితే? నాకు ఒకసారి అనుభవం అయినందుకు ప్రతీ చిన్న విషయమూ సందేహంగానే ఉంటుంది మురారీ".


“ నా కథ తో వాతావరణాన్ని బరువెక్కించానేమో కదూ?"


"అదేమీ లేదులే చైత్రా"!


"ఇంకా ఏమిటి సంగతులు మురారీ? కంపెనీలో నీకు మంచి పేరుందని తెలిసింది. నీవు ఎలాగైనా జీనియస్ వి. అప్పుడు చదువే లోకంలా ఉండేవాడివి. ఇప్పుడు ఆఫీస్ లో 'పని రాక్షసుడివని' బిరుదు కొట్టేసావు. ప్రాజక్ట్ మేనేజర్ వి. అమ్మో.. రాక్షసుడి ఎదురుగా నేను” అంటూ గుండెల మీద చేతులు వేసుకుంటూ భయం నటిస్తున్న చైత్రనే చూస్తూ నవ్వేసాడు మురారి.


“హమ్మయ్య! నిన్ను నవ్వించ గలిగాను. నీ గురించి చెప్పు మురారీ? నీ భార్యా, పిల్లలు హేపీ లైఫ్ కదూ?"


మురారి మౌనం వహించాడు. అతని అంతరాత్మ ‘ఇంక జాప్యం చేయకు మురారీ, మంచి అవకాశం, చైత్ర పట్ల నీ అంతరంగం లోని అభిప్రాయాన్ని చెప్పే’యమంటూ హెచ్చరిస్తోంది.


“ఏం మాట్లాడవే మురారీ? పోనీ నేనే మాట్లాడతాను లే. కాలేజ్ లో చదువుకునేటప్పుడు నీవంటే నాకు ఎంత అడ్మైరో తెలుసా మురారీ? ఎంత బ్రిలియంట్ గా మేన్లీ గా ఉండేవాడివి? నీతో చనువుగా ఉండాలనిపించేది. కానీ నీవు దూర దూరంగా ఉంటూ నాకా అవకాశాన్ని ఇచ్చేవాడివి కాదు. నేను ఎంత మందిలో ఉన్నా నీవు నా వైపే ప్రత్యేకంగా చూసేవాడివి. నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా ఉండేవి నీ చూపులు.


ఆ రోజులు ఎంత బాగుండేవో కదూ మురారీ? ఏ బాధ్యతలూ బాధలూ లేని రోజులు. ఎంతో జాలీగా గడచిపోయేవి. పెళ్లైనా అలాగే ఉన్నావా? నీ శ్రీమతి నీకు మాట్లాడే అవకాశ మివ్వకుండా తనే అంతా మాట్లాడేస్తోందా ఏమిటీ” అంటూ ఫక్కున నవ్వింది, 'జలతారు వెన్నెల జాలువారినట్లుగా'.


చైత్ర నవ్వుకి మురారి పరవశించిపోతున్నాడు.


“మరోసారి అతని అంతరంగం ‘ఎందుకు సందేహిస్తావు.. మురారీ?’ అంటూ గుర్తుచేసింది.


“ఏమీ లేదులే చైత్రా? అసలు నా జీవితంలోకి ఇంతవరకూ ఏ అమ్మాయికీ చోటివ్వలేదు. పెళ్లి చేసుకోలేదు”


“వ్వాట్?”


మురారికి ధైర్యం వచ్చేసింది.


“అవును చైత్రా అప్పట్లో నిన్ను నేను గాఢంగా ప్రేమించాను. ఇప్పటికీ నిన్ను అలాగే ఆరాధిస్తున్నాను. నమ్ముతావా?" అన్నాడు మురారి.

========================================================================

ఇంకా వుంది...


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
33 views0 comments
bottom of page