top of page
Writer's pictureYasoda Pulugurtha

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6


'Manasuloni Prema Episode 6/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha

'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6/6' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు.

అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది.

మురారి తల్లి మరణిస్తుంది. తన పెళ్లి బావతో ఫిక్స్ అయినట్లు చెబుతుంది నందిని.

ఆఫీసులో 'టెస్టింగ్ టీం లీడ్' లీవ్ లో ఉందని, ఆమె బదులు తన అసిస్టెంట్ వచ్చి మాట్లాడుతుందని మురారితో చెబుతాడు అతని అసిస్టెంట్.

ఆమె చైత్ర అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆమె భర్తతో విడిపోయినట్లు తెలుసుకుంటాడు. తాను చైత్రను ప్రేమించిన విషయం ఆమెతో చెబుతాడు.


ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 6 (చివరి భాగం) చదవండి..

"అప్పట్లో ఈ విషయం నీకు చెప్పాలంటే ఏదో బెరుకు, నీవు తిరస్కరిస్తావేమోనన్ను సంశయం. అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి అయింది. ఇంకా పరిపక్వత రాని వయస్సు. నీ పెళ్లి శుభలేఖ ఇస్తూ రమ్మనమని ఆహ్వానించావు. నీ కోసం ఒక చక్కని రాధాకృష్ణుల విగ్రహం బహుమానము గా కొన్నాను. నిన్ను ఇంక జీవితంలో చూడలేనన్న బాధ, నా తొలిప్రేమ విఫలమైందేనన్న ఒకలాంటి వైరాగ్యం నన్ను నీ పెళ్లి చూడకుండా అడ్డుకున్నాయి. నీ పెళ్లి బహుమానము అలాగే నా షోకేస్ లో అలంకరణగా ఉండిపోయింది. ఆ విగ్రహాన్ని చూస్తూ నీవెలా ఉన్నావో, అసలు నేను నీకు గుర్తు ఉన్నానా అనుకుంటూ తలపోస్తూ ఉంటాను. ఆ తరువాత ఏ అమ్మాయి నీలా అనిపించలేదు. పెళ్లిమీద విముఖతతో ఉండిపోయాను".


“నిజమా మురారీ, నమ్మలేకపోతున్నాను”.


'ఆమె కళ్లు దుఖమో, ఆనందమో తెలియని ఉద్విగ్నతతో వర్షిస్తున్నాయి'.


"నిజం చైత్రా, నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. మనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం".


''అప్పుడు కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నపుడు వెళ్లిపోయావు, మళ్లీ ఇలా మెరిసావ్. కలో నిజమో ఇంకా అర్ధంకావడంలేదు. దీన్ని నిజం చేయవూ చైత్రా"?


“నేను జీవితంలో మోసపోయాను మురారీ. ప్రేమ, పెళ్లి అనేవి నా జీవితంలో ఎండమావులే అనుకుంటూ బ్రతుకు తున్నాను. కానీ ఇలా నన్నే ఆరాధిస్తూ, నా మీద సముద్రమంత ప్రేమను తన మనసులోనే దాచేసుకుంటూ బ్రతుకుతున్న నా మురారి 'వాసంత సమీరంలా' వచ్చి తన ప్రేమతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడని ఊహించలేదు. నేను ఎంతటి అదృష్టవంతురాలిని మురారీ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్న చైత్రను అక్కడ నుండి లేపి ఆసరాగా ఆమె భుజాలచుట్టూ చేతులు వేసాడు.


''మా నాన్నకీ విషయం చెపితే ఎంత సంతోష పడ్తాడో మురారీ. మా చెల్లెలి పెళ్లి కుదిరినప్పటి నుండీ మా నాన్నకి నామీద దిగులు మరీ ఎక్కువైంది. నేను ఒంటరిగా ఉండిపోతానేమోనని. మా తమ్ముడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బెంగుళూర్ లో సెటిల్ అయ్యాడు. మా చెల్లెలికి హైద్రాబాద్ లో జాబ్ వచ్చిందని మా అమ్మా నాన్నా రెండు సంవత్సరాల క్రితం వైజాగ్ నుండి వచ్చేసి మా చెల్లెలితో ఇక్కడే ఉంటున్నారు. నాన్న రిటైర్ అయిపోయారు. మా నందిని పెళ్లి మా మమయ్య కొడుకుతో జరగబోతోంది".


'నందిని' పేరు విన్న మురారి ఒక్క క్షణం గతుక్కుమన్నాడు. "ఏ నందినీ” అంటూ అనుమానంగా అడిగాడు?


"ఏ నందిని గురించి నీకు తెలిసేమి”టంటూ చిలిపిగా అడిగింది.


"శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పనిచేసే నందిని తో నాకు పరిచయం ఉంది. అందుకని కాస్త డౌట్ వచ్చింది".


''తను మా చెల్లెలే. మా మామయ్య కొడుకూ, నందూ ప్రేమించుకున్నారు. మామయ్స కి మా నాన్న అంటే ఇష్టంలేదు మొదటినుండీ. దానికి తోడు నాకు డివోర్స్ అయిందని, మా తమ్ముడిది ప్రేమ వివాహమన్న వ్యతిరేక భావం మా కుటుంబం మీద. అదీగాక మా నాన్న తన పిల్లలకు పూర్తి స్వేఛ్చని ఇచ్చేసాడన్న ఒకలాంటి అసహనం. నందూని కోడలుగా చేసుకోడానికి అభ్యంతరం పెట్టాడు. నందూ చాలా మొండిది. బావను తప్పించితే ఎవరినీ చేసుకోనని హఠం వేసి మొత్తానికి సాధించింది. ఎలాగైతేనేమీ వారిరువురి పెళ్లికి మామయ్య అంగీకరించాడు''.


మురారి నందిని తో తన పరిచయం ఎలా జరిగిందో అంతా పూసగుచ్చినట్లుగా చెపితే చైత్ర కు నవ్వాగలేదు.

"మా నందూ మహా మొండిది. అది అనుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. మొత్తానికి నిన్ను ట్రాప్ చేసి మరీ తన పని సాధించుకుందన్నమాట. అది నీతో అలా ప్రవర్తించినందుకు తన తరపున నేను సారీ చెపుతున్నాను. నీవు మంచివాడివి కాబట్టి సరిపోయింది. ఎవరైనా అయితే దీన్నొక అవకాశంగా తీసుకుని దాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఉంటే? రోజులన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా మురారీ".

“ఇట్స్ ఓకే చైత్రా, నాకు సుతి మెత్తగా బ్రైన్ వాష్ చేసిందిలే. ప్రేమను దక్కించుకోడానికి ఎంతైనా తెగించాలని చెప్పింది. చిన్న పిల్లైనా తను చెప్పిన మాటల్లో ఎన్నో నిజాలున్నాయి. ఒక విధంగా నందిని మాటలే నాకు ధైర్యాన్ని స్పూర్తిని ఇచ్చాయి. అందుకనే నా మనసులోని ప్రేమను నీకు చెప్పగలిగాను".


"ఇప్పుడు మనిద్దరిని ఇలా చూస్తే మీ నందిని ఏమంటుందో తెలుసా చైత్రా"?


''ఏమంటుందీ?” ఉత్సుక నిండిన గొంతుకతో అడిగింది చైత్ర.


"నేను అప్పుడే అనుకున్నాను మురారి గారూ, మీరూ మీరు ప్రేమించిన అమ్మాయీ మళ్లీ కలుసుకుంటారని".


మురారి మాటలకు చైత్ర నవ్వింది.


"నీకెలా కృతజ్నతలు చెప్పుకోవాలి మురారీ? నీ మనస్సులో నా కింత స్తానం ఉందని తెలిసి ఉంటే ఎప్పుడో పరుగెత్తుకుని వచ్చి నీ చేతుల్లో వాలిపోయేదా”న్నంటూ అర్ధ్రంగా మాట్లాడుతున్న చైత్ర అరచేతిని పట్టుకుంటూ మృదువుగా తన పెదవులలతో స్పృశించాడు.

మరో వారం తరువాత ఒక మంచి రోజున మురారి, అతని అక్కా, బావా, చెల్లెలు ఆమె భర్తతో కలసి చైత్రా వాళ్లింటికి వెళ్లాడు. చైత్ర నాన్నగారు రాజశేఖర్ వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. అంతకముందే చైత్ర వాళ్ల నాన్నతో మురారి గురించి అంతా చెప్పి ఉంచింది. ఆయన ఆనందానికి అంతులేదు. చైత్ర గురించే ఆయన దిగులంతా. ఇప్పటికైనా చైత్రను చేసుకోడానికి ఒక మనసున్న వ్యక్తి వస్తున్నాడన్న ఆయన సంబరం అంతా ఇంతా కాదు. నందినికి మురారి వివరాలు ఏమీ చెప్పవద్దని దాన్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పింది తండ్రితో.


మురారీ వాళ్లకూ చైత్ర పేరెంట్స్ చూపించే ఆప్యాయతా అభిమానం, వారి సంస్కారం అవీ చాలా నచ్చాయి. చైత్ర విషయంలో ఏదీ దాచకుండా అన్నీ చెప్పారు. 'పెళ్లై ఇరవైనాలుగు గంటలు గడవకుండానే దాని వైవాహిక జీవితం అల్లకల్లోలం అయిందని బాధ పడుతూ చెపుతూంటే మురారి అక్కా బావ జరిగిపోయిన దానికి బాధపడొద్దని, అన్నీ మన మంచికే అనుకోండంటూ సర్ది చెప్పారు'.


ఇన్నాళ్లకు మురారి ఒక ఇంటివాడు అవుతున్నందుకు, అదీ తను ప్రేమించిన అమ్మాయితో అనుకునేసరికి వాళ్ల ముఖాలలో అంతులేని ఆనందం తొణికిసలాడుతోంది. ''అమ్మ ఉంటే మురారి పెళ్లి విషయం విని ఎంత సంతోషపడేదో'' అనుకుంటున్న మురారి అక్క కళ్లల్లో నుండి రెండు కన్నీటి బిందువులు రాలిపడ్డాయి.

గదిలో చైత్ర రెడీ అవుతోంది. నందిని హడావుడిగా పట్టుచీర కట్టేసుకుంటూ ''అక్కా పట్టుచీర కట్టుకోకుండా సింపుల్ గా ఈ చూడీదార్ డ్రెస్ ఏమిటే అంటూ కోప్పడింది".


"నా బదులు నీవు కట్టుకున్నావు కదా నందూ, నాకు ఈ డ్రెస్ చాల్లే అంటోంది".


"పెళ్లి చూపులు నీకా నాకా? నిన్ను చూసుకోడానికి వచ్చిన వాళ్లు ఏమనుకుంటారు? పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయే పట్టుచీరలో లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది. చిన్నమ్మాయినే చేసుకుంటాం అంటే"? అక్కని క్రీగంట కొంటెగా చూస్తూ అనేసరికి చైత్ర నందిని తలమీద సుతారంగా మొట్టింది.


"చేసుకుంటానంటే మాత్రం నీవు చేసేసుకుంటావా? పాపం ఫణీంద్ర ఏమైపోతాడే"?


"అబ్బా అక్కా, నా ముందు నీవు చిన్నదానిలా నాకు చెల్లెలులా అనిపిస్తున్నావు. పోనీ ఈ ఫాన్సీ చీర కట్టుకోవే అని బ్రతిమాలేసరికి నాకు నచ్చింది కట్టుకుని వస్తాలే గానీ, ఈలోపుల నీవెళ్లి అమ్మకు సాయం చేయవే నందూ. గంటనుండి ముస్తాబు అవుతున్నావు. ఇంక చాల్లే వెళ్లుమంటూ చెల్లెలిని గదిలోనుండి తోసేసి తలుపులు వేసుకుంది".


ఒక అయిదు నిమిషాలు తరువాత నందిని చైత్ర ఉన్న తలుపులు దబ దబా బాదేస్తూ "అక్కా తలుపుతీయవే, నీకొక సర్ప్రైజ్" అంటూ చైత్ర తలుపులు తీసేదాకా ఊరుకోలేదు.


చైత్రను తోసుకుంటూ లోపలికొచ్చిన నందూ "వచ్చిన పెళ్లికొడుకు మురారిగారక్కా అంటూ ఆనందంతో చైత్రను పట్టుకుని ఊపేసింది".


"మురారిగారా? అతనెవరో నాకే తెలియదు, నీకెలా తెలుసే?”


" అబ్బా అక్కా వివరాలు తరువాత చెపుతాను. ముందు నీవు రా అక్కా అంటూ అక్క చేయిపట్టుకుని హాల్లోకి తీసుకొచ్చింది".


చైత్ర అందరినీ చిరునవ్వుతో పలకరించింది. మురారి చైత్రను ఎందుకు అంతగా ఇష్టపడ్డాడో వాళ్లకు చైత్రను చూడగానే అర్ధం అయింది. 'ఎంత బాగుందీ అమ్మాయి అని అనుకోకుండా ఉండలేకపోయారు'.


"ఏం నందినీ మీ ఫణీంద్ర ఏమంటున్నాడు?

ఇక్కడ ఉంటాడేమోనని ఎక్స్ పెక్ట్ చేసాను" అనగానే, '' అక్కకి పెళ్లిచూపులని ఫణిని రమ్మనమన్నాను మురారిగారూ. కానీ వాళ్ల నాన్న అంటే మా మామయ్య ఫణిని వెళ్లొద్దని, పెళ్లికి ముందే అస్తమానూ అత్తవారింటికి రాకపోకలు సాగిస్తే అల్లుడిగా నీ హోదా తగ్గిపోతుందని చెప్పాడుట. మా మామయ్యకు ఛాదస్తం ఎక్కువలెండి. అందుకనే రాలేదంటూ'' సమాధానమిస్తున్న నందిని మాటలకు అందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. మా నందూ వట్టి అల్లరి పిల్ల, ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదంటూ రాజశేఖర్ అనేసరికి "నాన్నా మన నందూ గురించి మురారి కి తెలిసినంతంగా మరి ఎవరికీ తెలియదు" అన్న చైత్ర మాటలకు అక్కడ మరోసారి నవ్వులు విరిసాయి.

మురారి, చైత్రా ఇద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్ మేట్సనీ, మురారి తన అక్కను ప్రేమించాడనీ అందుకనే వివాహం చేసుకోలేదన్న విషయం విన్న నందినికి మురారి పట్ల గౌరవాభిమానాలు మరింత పెరిగాయి.

"మురారిగారూ, మిమ్మలని ఒక మాట అడగొచ్చా? అన్న నందిని వైపు ప్రశ్నార్ధకంగా అడగమన్నట్లు చూసాడు మురారి".

"మిమ్మలని చూసినపుడే నేను ఊహించాను. మీకు ఏదో ప్రేమ వ్యవహారం ఉందని, మీ ప్రేయసి మీ మనస్సులో బలంగా తిష్టవేసుకుందని. ఏదో నాటికి మీరు మీరు ప్రేమించిన అమ్మాయి నే పెళ్లి చేసుకుంటారని".

మురారి చైత్రవైపు చూసాడో క్షణం. నేను చెప్పలేదూ అన్నట్లుగా. ఆ కళ్లల్లో చైత్ర పట్ల అంతులేని ఆనురాగం. ఆ అనురాగానికి చైత్ర మనసు పన్నీటి జల్లు కురిసింది.

========================================================================

సమాప్తం.


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత్రి శ్రీమతి యశోద పులుగుర్త గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================


యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






42 views1 comment

1 Comment


sudershanap44
Jul 28, 2023

కథ బాగుంది అభినందనలు.

Like
bottom of page