top of page

మనసును దోచిన నెరజాణ


'Manasunu Dochina Nerajana' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

"అమ్మా! లంచ్ బాక్స్ పెట్టావా! కాలేజికి టైమవుతోంది" అంది జయ వాళ్ళమ్మ సరోజతో.


"ఎప్పుడో రెడీ. ఇదుగో తీసుకో ! అని బాక్స్ ను తెచ్చి ఇచ్చింది తల్లి.


దాన్ని అందుకుని 'బై' అని చెప్పి బయటకు వెళ్ళింది జయ.


ప్రతి రోజూ కాలేజీకి వెళుతూ దారిలో తన స్నేహితురాలు సుజాత వాళ్ళింటికి వెళ్లి తనని కూడా కలుపుకొని వెళ్ళటం అలవాటు జయకు.

"ఏయ్ సుజీ! సుజీ ! " అంటూ పిలుస్తూ సుజాత ఇంట్లో హాలులోకి వచ్చింది జయ.


" ఇంకా నీవు తయారు కాలేదా? మనము వెళ్ళేది కాలేజీకే. పెళ్ళి చూపులకు కాదే " అంది జయ.


"కూర్చో జయా ! వచ్చేస్తున్నా " అంది సుజాత.


కాసేపటికి సుజాత రావడం ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళడం జరిగింది.


సుజాతకు చదువు మీద కన్నా తన అందం మీద ఎక్కువ శ్రధ్ధ .ఫాషన్లంటే తెగ పిచ్చి. థనవంతులైన తల్లి తండ్రులకు ఏకైక సంతానమవటంతో ఆ ఇంట్లో సుజాత ఆడింది ఆట, పాడింది పాట. తను చాలా అందగత్తెను అనే భావం కూడా అణువణువునా ఉంది సుజాతకు. తండ్రి ప్రసాద్ పారిశ్రామిక వేత్త .తల్లి ఉమ గ్రృహిణి. కూతురు సుజాత అంటే ఆ దంపతులకు పంచప్రాణాలు. సుజాతను చాలా గారాబంగా పెంచారు. సుజాత కాలేజీ చదువు అనేది తనకు ఒక ప్రిస్టేజియస్ గా భావిస్తుంది. చూడటానికి మామూలుగా ఉండే జయ తన ప్రక్కనుంటే తన అందం మరింత రెట్టింపు అయి అందరూ తనను మరింత ప్రత్యేకంగా చూస్తారు అనే భావన సుజాతకు ఉంది . 'ధనము ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ధనముతో ఏదైనా కొనవచ్చు' అనే గర్వం చాలా ఉంది సుజాతకు.


మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన జయకు చిన్న ప్పటి నుంచీ కష్టాల విలువ, బాధ్యతల విలువ తెలుసు. జయ చామన చాయ రంగులో ఉన్నా చూడగానే బాగుంది అనే రూపం కలది. తండ్రి రామయ్య ప్రైవేటు కంపెనీలో క్లర్క్ గా పని చేస్తూ గౌరవంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి సరోజ ఉత్తమ గ్రృహిణి. ఉన్నంతలో కూతురు జయను పధ్ధతిగా పెంచుతూ తనను చదివిస్తున్నారు ఆ దంపతులు. జయ కూడా తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని కష్టపడి చదివేది. 'బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి తల్లి తండ్రులను చక్కగా చూసుకోవాలి' అనే ఆశయంతో బాగా చదివేది.


జయ కాలేజీలో ప్రతి సబ్దెక్టులోని పాఠాలను శ్రధ్ధగా విని సందేహాలు ఉంటే ఆ లెక్చరర్ లను అడిగి తెలుసుకునేది. సుజాతకు ఇదంతా చాలా చాదస్తంగా అన్పించి మనసులో జయను చూసి నవ్వుకునేది. సుజాత చూపులన్నీ ఆ కాలేజీలో అందమైన అబ్బాయిల మీద ఉండేది. వాళ్ళతో స్నేహం చేయాలని తపన పడి మాటలు కలిపేది. వాళ్ళు కూడా సుజాతతో సినిమాలు, షికార్లు చేసేవారు. ఇదంతా సుజాత తల్లి తండ్రులకు తెలిసినా అదొక స్టేటస్ గా భావించేవారు.

ఇలా కాలం గడిచిపోతోంది. రోజూలాగానే కాలేజి కని ఆరోజు కూడా జయ 'సుజీ' అని పిలుస్తూ సుజాత ఇంటికి వచ్చింది . హాలులో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఒక అందమైన యువకుడిని చూసి 'ఎవరా ' అని ఆశ్చర్య పోయింది జయ. అతను కూడా జయ మాట విని తలెత్తి చూశాడు. ఇద్దరి చూపులూ కలిశాయి. జయ సిగ్గుతో తలదించుకుని అక్కడే ఉన్న వేరొక కుర్చీలో కూర్చుంది. సాదాసీదాగా ఉన్నా జయ ముఖంలోని కళ అతని చూపును దాటిపోలేదు. సిగ్గుపడుతూ ఉన్న జయ మరింత ముగ్ధమనోహరంగా అనిపించింది అతనికి. ఈలోగా సుజాత వచ్చింది.


"జయా ! ఇతను నా బావ సుధీర్. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈరోజే వచ్చాడు". అని జయతో, "బావా! ఈమె నా స్నేహితురాలు, నా క్లాస్ మేటు జయ. " అని సుధీర్ తోను ఇద్దరి గురించి ఒకళ్ళనొకళ్ళకు పరిచయం చేసింది సుజాత. జయ, సుధీర్ లు నమస్కార ప్రతినమస్కారాలు చేసుకున్నారు .తర్వాత సుజాత, జయ‌ కాలేజీకి వెళ్ళారు.


ఎందుకో వాళ్ళు వెళ్లిన వైపే కాసేపు అలా చూస్తూండిపోయాడు సుధీర్ . ' జయ ఆ పేరెంత బాగుంది. పొడవైన జడతో , అందంగా పొందికగా ఉన్న రూపం. ఈ కాలం హంగులూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంది ' అని మనసులో అనుకున్నాడు సుధీర్.


జయ కాలేజి నుంచి ఇంటికి వెళ్ళినాక ఆ రాత్రి సుధీర్ రూపాన్ని, అతని నమస్కరించిన సన్నివేశాన్ని గుర్తుతెచ్చుకుని మనసులో సంతోషించింది.


సుధీర్ అక్కడ ఉన్న పదిరోజులలో జయకు సుధీర్కు మాటలు కలిశాయి. ఆరోజున సుధీర్ బెంగళూరుకు బయలుదేరే రోజు. సుధీర్ తన ఫోన్ నెంబరు జయకు ఇచ్చి ఆమె నెంబరును కూడా తీసుకున్నాడు. ఇదంతా సుజాత గమనిస్తూ 'ఇందులో ఏమముందిలే ! ఈకాలంలో ఇలాంటివి మాములే కదా! ' అనుకుంది.


సుధీర్ బెంగళూరుకు వెళ్ళాక తరచూ జయకు ఫోన్లు చేయడం , అరమరికలు లేకుండా చాలా సేపు మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్యన మరింత చనువు పెరిగింది. సుధీర్ మీద ఇష్టం ప్రేమగా మారింది జయకు. కొన్నాళ్లకు సుధీర్ ఈ ఊరికే తన ఉద్యోగాన్ని బదిలీ చేయించుకోవడం, వేరే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం అన్నీ చకచకా జరిగాయి. సుజాత, వాళ్ళ పేరెంట్స్ తమ ఇంట్లో ఉండమన్నా సున్నితంగా వద్దని చెప్పాడు సుధీర్. జయాసుధీర్ లు తరచూ కలుసుకొనేవారు.


కొన్ని రోజులకు కాలేజీలో పరీక్షలు ముగిసి మంచి మార్కులతో డిగ్రీ పాసయింది జయ. సుజాత మామూలు మార్కులతో పాసయింది. పై చదువులు చదవాలని ఉన్నా ఇంక ఆర్థిక స్ధోమతలేక బాంకు పరీక్షలు వ్రాసి బాంకులో ఉద్యోగం పొందింది జయ. ఇంక తన కాళ్లమీద తను నిలబడి తల్లితండ్రులను చూసుకోవచ్చు అని సంతోషించింది. జయకు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఆమెని అభినందించాడు సుధీర్.


సుజాతకు సుధీర్ తో పెళ్ళి చేయాలని సంకల్పించి సుజాత అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని తర్వాత సుధీర్ తో చెబుదామనుకున్నారు ప్రసాద్ గారు. తన గారాల కూతురు సుజాతను మేనల్లుడికిచ్చి పెళ్ళి చేస్తే తన కళ్ళ ముందే కూతురు, అల్లుడు ఉంటారు ,తన తదనంతరం ఆస్తిపాస్తులను కూడా చూసుకుంటాడు అని ఆశించారు ఉమ, ప్రసాద్.


సుధీర్ ను చేసుకోవడం తనకు ఇష్టమే అని చెప్పింది సుజాత. సంతోషంతో సుధీర్ అభిప్రాయాన్ని అడిగారు ప్రసాద్ దంపతులు. "తను సుజాతను ఆ ద్రృష్టి తో ఎప్పుడూ చూడలేదని, ఆమెపై తనకు ఆ ఉద్దేశ్యం లేదని చెప్పి , తను జయను ప్రేమిస్తున్నట్లు చెప్పి, ఆమెకు ఇష్టమైతే తనను పెళ్ళి చేసుకుంటాను " అని తన నిర్ణయాన్ని చెప్పాడు సుధీర్.


సుధీర్ నిర్ణయాన్ని విని బాధపడ్డారు సుజాత, తల్లి తండ్రులు. సుధీర్ జయను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పి ఆమె నిర్ణయాన్ని అడిగాడు. జయ కూడా సుముఖత తెలిపింది. వీళ్లిద్దరి పెళ్లికి అంగీకరించారు జయ తల్లితండ్రులు.


రిజిస్టర్ మారేజ్ చేసుకుని విడిగా కాపురం పెట్టారు జయా సుధీర్ లు. హాయిగా ఉద్యోగాలను చేస్తూ, సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. కొన్నాళ్లకు సుజాతకు వేరే సంబంధం చూసి వివాహం జరిపించారు ఉమ, ప్రసాద్ లు.


తమ ప్రేమ గెలిచినందుకు సంతోషించారు జయా సుధీర్ లు. వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతోషించి మనసులోనే ఆ భగవంతుడికి క్రృతజ్ణతలను తెలుపుకున్నారు సరోజ దంపతులు.

మరుసటి ఏడాది జయకు పండంటి కొడుకు పుట్టాడు. వాడికి 'మనోజ్ ' అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వాడు తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తూ ఆహ్లాదపరుస్తున్నాడు. ఇప్పుడు మనోజ్ కాన్వెంటుకు వెళుతున్నాడు.


వాడు చదువులోనే కాక ఆటపాటలలో కూడా ప్రతిభను కనబరుస్తున్నాడు. కాలం సాఫీగా గడిచిపోతోంది. మరో నాలుగు సం...లకు వయో భారం చేత జయ తల్లి తండ్రులు క్రమేణా గతించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు జయ గర్భవతి అయి నెలలు నిండినాక చక్కటి ఆడపిల్లను కన్నది. ఆ పాపకు ' రమ్య ' అని పేరుపెట్టుకున్నారు. వీళ్ళు ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్ళేముందు రమ్యను కేర్ సెంటర్ లో , మనోజ్ ను స్కూలు లోను దించి సాయంత్రం ఇంటికి వస్తూ వాళ్ళను తెచ్చుకుంటున్నారు. రమ్య తన ముద్దుముద్దు మాటలతో అలరిస్తూ పెద్దదవుతోంది.


రమ్యకు ఐదవ సం.. రాగానే తనను మనోజ్ చదువుతున్న స్కూలులో చేర్చారు. ప్రతి రోజూ సాయంత్రం ఆఫీసుల నుంచి రాగానే ఇద్దరూ దగ్గరుండి వాళ్ళ చేత హోమ్ వర్కు చేయించడం ,ఆ తర్వాత వాళ్ళ ఆటపాటలు, ముద్దు ముచ్చట్లతో గడపడం, ఆ తర్వాత డిన్నర్ ,నిద్ర ఇలా రోజులు హాయిగా గడిచిపోతున్నాయి.


జయా, సుధీర్ లు తమ ఆఫీసులలో లోన్లు తీసుకుని మంచి ఇల్లు కొనుక్కున్నారు. ఒక శుభముహూర్తాన బంధుమిత్రులను, స్నేహితులను, సహ ఉద్యోగస్తులను పిలిచి వేడుకగా గ్రృహప్రవేశం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఫంక్షన్ కు సుజాత తన భర్త, కొడుకుతో, తల్లితండ్రులతో వచ్చింది. సుజాత కొడుకుకు కూడా జయ కొడుకంత వయస్సే.


జయాసుధీర్ లు వాళ్ళను చక్కగా ఆహ్వానించి నూతన వస్త్రములతో సత్కరించారు. అందరూ ఆరోజు సంతోషంగా గడిపి ఎవరిళ్ళకు వాళ్లు వెళ్ళిపోయారు.


కాలం వేగంగా గడిచిపోతోంది. .మనోజ్, రమ్య హైస్కూలు చదువులకొచ్చారు. వాళ్లు చదువులో బాగా రాణిస్తున్నారు. రెండు సం.. తర్వాత సుజాత తల్లి తండ్రులు వయోభారం చేత గతించారు. ఆ సమయాన జయా, సుధీర్ లు వెళ్లి సుజాతను ఓదార్చి జరగవలసిన కార్యక్రమాలన్నీ సుజాత భర్త చేత సక్రమంగా జరిపించి తమ ఇంటికి తిరిగి వచ్చారు.


జయకు బాంకు ఆఫీసరుగా ప్రమోషన్ వచ్చింది. పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ డబ్బుని జాగ్రత్తగా దాస్తున్నారు.



ఒక సాయం సంధ్యా సమయాన 'మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే ' అని రాగయుక్తంగా పాడుతున్న జయ పాటను వింటూ "జయా! నీవు నా మనసును దోచిన నెరజాణవు. నీ ప్రేమతో జయించి ప్రేమ పంజరంలో ఖైదీని చేశావు సుమా ! " అని పరవశంతో జయను దగ్గరకు తీసుకున్నాడు సుధీర్.


భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగి పోయింది జయ.

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని .చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గ్రృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను .నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


140 views0 comments

Comentários


bottom of page