top of page
Original.png

మనిషే దేవుడైతే

మనిషే దేవుడైతే, వినాయకుడు కథ, తెలుగు నీతికథ, పిల్లల కథ, గణపతి కథ, ప్రేరణాత్మక తెలుగు కథ, విద్య ప్రాముఖ్యత, మానవత్వం, తెలుగు కథలు, మన తెలుగు కథలు

రావిచెట్టు కింద ఉన్న గణపతి ఆలయం వద్ద వినాయకుడు చిన్నారి రూపంలో బంటీతో స్థానాలు మార్చుకుంటూ, చదువు విలువ, భక్తి, మానవత్వం మరియు బాధ్యతను తెలియజేసే భావోద్వేగ తెలుగు నీతికథకు ప్రతీకాత్మక దృశ్యం.
రావిచెట్టు కింద ఉన్న గణపతి ఆలయం వద్ద వినాయకుడు చిన్నారి రూపంలో బంటీతో స్థానాలు మార్చుకుంటూ, చదువు విలువ, భక్తి, మానవత్వం మరియు బాధ్యతను తెలియజేసే భావోద్వేగ తెలుగు నీతికథకు ప్రతీకాత్మక దృశ్యం.

Manishe Devudaithe - Telugu Devotional StoryAddanki Lakshmi

మనిషే దేవుడైతే - తెలుగు భక్తి కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 04/07/2026

 


"మనిషే దేవుడైతే" అనేది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా గొప్ప సందేశాన్ని అందించే తెలుగు నీతికథ. చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండే బంటీ జీవితంలో వినాయకుడి లీల ద్వారా వచ్చిన మార్పు ఈ కథలో ఆసక్తికరంగా ఆవిష్కరించబడింది. విద్య విలువ, మంచి స్నేహం, భక్తి, మానవత్వం, బాధ్యత, సత్ప్రవర్తన వంటి విలువలను సరదాగా, ఆలోచింపజేసే విధంగా చెప్పిన ఈ కథ ప్రతి కుటుంబం, ప్రతి విద్యార్థి తప్పక చదవదగినది.


"బంటీ! తొందరగా రారా, స్కూల్ టైమ్ అయిపోతుంది" అన్న రవి కంగారుపెట్టాడు.


"పుస్తకాలు సర్దుకుంటున్నా అన్నా" అన్నాడు బంటీ.


"అయితే నేను వెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చారు" అంటూ చకచకా వెళ్ళిపోయాడు రవి.


"తొందరగా వెళ్ళరా బాబు" అని అంటోంది తల్లి శ్రీలక్ష్మి వంటింట్లోంచి.


"వెళ్తున్నా అమ్మ, అన్న వెళ్ళిపోయాడు, నేను మా ఫ్రెండ్ రాముతో వెళ్తాను" అన్నాడు బంటీ.


"సరేలే తొందరగా వెళ్ళు, స్కూల్ టైమ్ అయిపోతుంది".


శ్రీలక్ష్మికి ఇద్దరు పిల్లలు, భర్త కంపెనీలో ఉద్యోగం.

రవి చాలా తెలివైనవాడు. ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాడు. స్కూల్లో అందరికంటే ఫస్ట్ వస్తాడు.

టీచర్లందరికీ వాడి మీద ఎంతో ప్రేమ. 12వ తరగతి చదువుతున్నాడు.


రెండోవాడు బంటీ పదవ తరగతి చదువుతున్నాడు. చదువు అంటే అసలు శ్రద్ధ లేదు.


బంటీ అంటే తల్లికి చాలా గారం.

"చిన్నవాడు" అంటూ వెనకేసుకొస్తుంది.


ఎప్పుడూ అల్లరి పిల్లలతో చేరి ఆటలు, పుస్తకం ముట్టడు. అతి కష్టం మీద పాస్ అవుతాడు.

ఎనిమిదో తరగతి రెండుసార్లు చదివాడు. ఇప్పుడు పదవ తరగతిలోకి వచ్చాడు.


పక్క పోర్షన్లో ఉన్న రాము ఆరోజు బడికి రాలేదు. వాడికి జ్వరం వచ్చింది. బంటీ ఒక్కడే స్కూల్‌కి బయలుదేరాడు.


వాడికి స్కూల్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఒక్కొక్క టీచరు వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు చెప్తుంది. ఏమీ బుర్రకెక్కదు.

హాయిగా తింటూ ఆడుకుంటే ఎంతో బాగుంటుంది అని అనుకుంటాడు.


వాడికి గోళీకాయల ఆటంటే చాలా ఇష్టం. వాడొక్కడే ఆడుకోగలడు.


స్కూల్‌కి వెళ్దామా అంటే లెక్కల టీచర్ వచ్చి "హోంవర్క్ చేశావా?" అని అడుగుతుంది. ఇంగ్లీష్ టీచర్ "ఈ స్పెల్లింగ్స్ రాశావా?" అని అడుగుతుంది. విసుగ్గా ఉంటుంది బంటీకి.


ఆ దారిలో రోడ్డుకి కొంచెం వెనకాల, చెట్ల మధ్య,

ఓ రావి చెట్టు కింద గణపతి విగ్రహం ఉంటుంది.


చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గణపతికి నైవేద్యాలు పెట్టి, దీపం వెలిగించి వెళుతుంటారు.

అందరూ మొక్కులు మొక్కుకుంటారు.



శ్రీలక్ష్మి పిల్లలకి రోజు చెప్తుంది,


"గణపతి దేవుని మొక్కుకోండి, చక్కగా మార్కులిస్తాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు" అని.


బంటీ రోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గణపతి దేవుని మొక్కుకుంటాడు. "నాకు మంచి మార్కులు ఇయ్యి దేవుడా" అని.


ఆరోజు దేవుడికి దండం పెట్టుకుంటూ,

"ఏంటి దేవుడా! నీకు ఎన్నిసార్లు మొక్కుకున్నా నాకు పాస్ మార్కులు కూడా రావు, ఒక్కొక్క సబ్జెక్టులో..

లెక్కలైతే నా బుర్రకెక్కవు, లెక్కల్లో ఎప్పుడూ జీరో మార్కులే.

అసలు చదువు అంటే ఏంటి అనుకుంటున్నావు?

మా విద్యార్థులు ఎంత కష్టపడుతున్నామో నీకేంటి? హాయిగా అక్కడ కూర్చుంటావు. అందరూ పళ్ళు, నైవేద్యాలు పెడతారు, తింటూ హాయిగా ఉంటావు.


నేను కూడా నీకు లాగే కూర్చుని అన్నీ హాయిగా తింటూ ఉండేవాడిని.

నువ్వు  ఒకసారి బడికి వెళ్లి చూడు, చదువుకోవడానికి మేము ఎంత కష్టపడుతున్నామో తెలుస్తుంది" అన్నాడు.


"అయితే బంటీ, నీకు స్కూలుకు వెళ్ళడం ఇష్టం లేదా?"

అని విగ్రహంలోంచి మాటలు వినిపించాయి.


"ఎక్కడో దాక్కుని మాట్లాడతావు ఎందుకు? నా దగ్గరకు రా!" అన్నాడు బంటీ విసుగ్గా.


వెంటనే చిన్ని వినాయకుడు, బంటీ అంత పిల్లాడై వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.


బంటీకి ఆశ్చర్యమేసింది, "అబ్బా ఎంత బాగున్నావు! నాకు లాగే తెల్లగా.. నీకు గోళీ ఆట వచ్చా?" అని అడిగాడు.


"ఆ, ఎందుకు రాదు? బాగా వస్తుంది" అన్నాడు గణపతి హుషారుగా.


"కానీ నువ్వు ఏదో చెప్తున్నావు కదా, బడి అంటే నాకు బోర్ కొడుతుంది, టీచర్లందరూ కోపం చేసుకుంటారు అని".


"నీకే, నువ్వు బాగానే ఉన్నావు, నాకే కష్టము. రోజంతా ఇలాగ బండ శిలలా కూర్చోవాలి కదా కదలకుండా" అని వినాయకుడు బాధపడుతున్నాడు.


"ఏం కాదు, నన్ను కూర్చోమంటే నేను హాయిగా కూర్చుంటా" అన్నాడు బంటీ.


"అయితే కూర్చో! నా బాధలు నీకు బాగా తెలుస్తాయి".


"నీకు బాధలు ఉన్నాయా? నీకేమిటి?" అన్నాడు బంటీ ఆశ్చర్యంగా.


"చూడు నాకు రకరకాల బాధలు, నీకైతే చదువు ఒక్కటే బాధ" అన్నాడు వినాయకుడు.


"ఏం కాదులే! నా బాధలే ఎక్కువ, స్కూల్లో టీచర్లు అప్పుడప్పుడు కొడుతుంటారు, పనిష్మెంట్ ఇస్తుంటారు" ఎంతో బాధగా అన్నాడు బంటీ.


"అయితే ఒక పని చెయ్, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చో, భక్తులందరూ వచ్చి నీకు పూజలు చేస్తారు".


బంటీకి సంతోషమేసింది. "అయితే నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు బోలెడు ప్రసాదాలు దొరుకుతాయి, ఈరోజు నేను అసలు చదువుకో అక్కర్లేదు" అంటూ ఆనందపడిపోయాడు.


బంటీ దేవుడు విగ్రహముగా మారాడు.

"అసలు కదలకూడదు జాగ్రత్త! నేను వచ్చేవరకు అక్కడే కూర్చో" అన్నాడు. బంటీ విగ్రహంగా మారిపోయాడు వెంటనే.


"అలాగే కూర్చో, నేను స్కూల్‌కి వెళ్తాను" అని వెళ్ళిపోయాడు గణపతి, బంటీ బ్యాగు పుచ్చుకొని.


ఇంతలో పూజారిగారు వచ్చారు.

"అయ్యో స్వామి! ఇవాళ నాకు లేట్ అయిపోయింది. ఇంట్లో మా ఆవిడకి జ్వరం వచ్చింది కదా, నీ పూజకు లేట్ అయిపోయింది" అంటూ నొచ్చుకున్నాడు పూజారి.


పూజా విధానం మొదలుపెట్టాడు. కనీసం ఒక గంట టైమ్ పట్టింది.

చల్లని నీళ్లు పోసి విగ్రహం అంతా కడిగాడు.

తర్వాత పాలతో కడిగాడు, తర్వాత పెరుగుతోను, తేనెతో చక్కగా కడిగాడు. మళ్ళీ నీళ్లు పోసి చక్కగా కడిగి తుడిచి, పట్టుబట్టలు తొడిగాడు, బొట్టు పెట్టాడు. పూలమాలలు వేశాడు.

విగ్రహంలో ఉన్న బంటీకి బాగా చలివేసేసింది, కానీ మాట్లాడేందుకు లేదు.


చాలాసేపు పూజ చేశాడు. శ్లోకాలు చదివాడు. గణపతి దేవుడికి నైవేద్యాలు పెట్టాడు.

ఇంతలో భక్తులు వచ్చారు. 


నైవేద్యాలన్నీ భక్తులకు పంచిపెట్టాడు, అందరూ హాయిగా తిన్నారు.


తర్వాత మిగిలిన ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయారు.


బంటీకి ఆకలేస్తోంది, తినడానికి ఏమీ లేదు.


భక్తులందరూ దేవుడికి మొక్కులు మొక్కుతున్నారు.


"మా పిల్లవాడికి 50 మార్కులు ఇంటర్లో వచ్చాయి స్వామి. వాడికి ఇంజనీరింగ్‌లో సీటు ఎలాగైనా ఇప్పించు, ఐదు లక్షలు లంచం ఇస్తానని చెప్పాను, సెక్రటరీ ఒప్పుకోవడం లేదు, ఎలాగైనా వాడి మనసు మార్చి, మా పిల్లవాడికి ఇంజనీరింగ్‌లో సీట్ తెప్పించు, నీకు పట్టు వస్త్రాలు కానుక ఇస్తాను" అని ఒకతను మొక్కుకొని వెళ్ళాడు.


"స్వామి! నిన్ను మొక్కుకొని వెళ్ళాము, పని చక్కగా జరిగిపోయింది, బ్యాంకు దోపిడీ బాగా జరిగింది, నీకు చక్కటి కోవెల కట్టిస్తాను స్వామి" అంటూ సంతోషపడ్డాడు ముఠా నాయకుడు.


అతను వెళ్ళిన వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి, "స్వామి! ఆ బ్యాంకు దోపిడీ చేసిన దొంగల్ని పట్టించు, నీకు 108 కొబ్బరికాయలు కొడతాను!" అని మొక్కుకొని వెళ్ళాడు.


ఇంకొకతను వచ్చాడు,

"మా బామ్మర్దిని పొడిచి చంపి, డబ్బంతా పట్టుకుపోయాను, నేను అడవిలోకి పారిపోతున్నాను, నా ఆచూకీ పోలీసులకు తెలియకుండా చేయి సామి, నీకు బంగారు గొలుసులు చేయిస్తాను" అంటూ మొక్కుకొని వెళ్ళాడు ఓ నేరగాడు.


ఇవన్నీ వింటున్న బంటీ ఆశ్చర్యపోతున్నాడు.

ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయా ప్రపంచంలో? అంటూ భయపడిపోయాడు బంటీ.


ఇంతలో బంటీ వాళ్ళ అమ్మ వచ్చి వినాయకుడిని మొక్కుకుంటోంది.


"పెద్ద పిల్లవాడు బాగానే చదువుతాడు స్వామి నీ దయవల్ల, చిన్నవాడు ఇంకా చెప్పిన మాట వినటంలేదు, వాడి జీవితం ఏమైపోతుందో అని భయము.

వాడి మనసుని మార్చి మంచి మార్గంలో పెట్టు స్వామి,

నీకు వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెడతాను, ఆ అల్లరి పిల్లగాళ్ళతో చేరి సరిగ్గా చదువుకోవడంలేదు దేవా" అంటూ తల్లి మొక్కుకొని వెళ్ళింది.


బంటీకి ఎంతో ఏడుపొచ్చింది, తన తల్లి తన చదువు గురించి ఎంతో బాధపడుతోంది.


ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చింది.

"రవి గాడు, మా పిల్లవాడు ఒకే బడిలో చదువుతున్నారు స్వామి. ఈసారి వాడికి తక్కువ మార్కులు వచ్చి, నా పిల్లవాడే ఫస్ట్ వచ్చేటట్టు చూడు. దేవుడా నీకు అర్చన చేయిస్తాను" అంటూ మొక్కుకుంది.


ఇది వింటూ బంటీ ఎంతో ఆశ్చర్యపోయాడు.


"ఆంటీ నిజస్వరూపం ఇదా? కనపడినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది" ఆశ్చర్యపోయాడు బంటీ.


ఇంతలో స్కూల్ టైమ్ అయిపోయింది. వినాయకుడు స్కూల్ బ్యాగ్ పుచ్చుకొని వచ్చేసాడు.


"ఏంటి, ఎలా గడిపావు బంటీ?" అని అడిగాడు గణేశుడు నవ్వుతూ.


"అమ్మో, దేవుడి పోస్ట్ నాకొద్దు, దేవుడిగా ఈ జనాలందరి కోర్కెలన్నీ మనం తీర్చలేము.


ఈ ప్రపంచమంతా మాయాలోకం, దీనికన్నా హాయిగా స్కూలుకు వెళ్లి చదువుకోవడం ఉత్తమం" అని తెలుసుకున్నాడు బంటీ.


"మరి ఏమిటనుకున్నావు?

దేవుడా! నీకే నువ్వు హాయిగా ఉంటావు అని కదా అనుకున్నావు. చూశావా.. నాకు ఎంత కష్టమో, వీళ్ళ కోర్కెలు నేను ఏమి తీర్చగలను?" అంటూ వినాయకుడు తన బాధ వెళ్ళబుచ్చాడు.


"నిజమే స్వామి, ఒక్కడు కూడా సరిగ్గా మంచి కోరికల కోరటం లేదు, వీళ్ళందరూ చాలా దుర్మార్గులు!"


వీళ్ళ మాటలు వింటేనే మనకు కోపం వస్తుంది. నీ దేవుడు పోస్ట్ నాకు వద్దు స్వామి, నేను రోజు వెళ్లి హాయిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మా అమ్మకి సంతోషం కలగజేస్తాను.


నా రూపం నాకు ఇచ్చేయి స్వామి" అన్నాడు బంటీ.


వినాయకుడు వెళ్లి తన విగ్రహంలో కూర్చున్నాడు.


బంటీ మామూలుగా వచ్చేసి,

"స్వామి! ఇక్కడి నుంచి నేను బాగా చదువుకుని మా తల్లిదండ్రులకు సంతోషం కలుగజేస్తాను" అంటూ ఇంటికి వెళ్లిపోయాడు బంటీ.


బంటీ పూర్తిగా మారిపోయాడు.

అల్లరి పిల్లల స్నేహం మానేశాడు. అన్నతో కూర్చొని శ్రద్ధగా చదువుకుంటున్నాడు.


వాళ్ళ అమ్మ మనసులో ఆనందపడింది. "స్వామిని మొక్కుకున్నాను కరుణించాడు, నా బిడ్డను సక్రమమార్గంలో పెట్టాడు, మొక్కు తీర్చుకోవాలి" అంటూ సంతోషించింది.

***

🙏 ఈ కథ మీకు నచ్చిందా?

ఈ కథలో మీకు బాగా నచ్చిన సందేశం ఏమిటో కామెంట్ చేయండి.

📚 ఈ కథను మీ పిల్లలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.

🌺 ఇలాంటి విలువలు నేర్పే మరెన్నో తెలుగు కథల కోసం manatelugukathalu.com ను నిరంతరం సందర్శించండి.


అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page