top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 10

Writer: Yasoda PulugurthaYasoda Pulugurtha



'Manushulu' Marali Episode 10'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక 

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.


సుప్రజ ఆడపడుచు సరళ, భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్, తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. 



నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.


మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు. వెళ్ళినప్పటినుండి డబ్బులు చాలడం లేదని మాధవి భర్త శేఖర్ ని సహాయం అడుగుతూ ఉంటాడు. కొద్ది రోజులకే మాధవి విలువ తెలిసివచ్చింది ఆమె అత్తగారు ప్రసూనాంబకి. జరుగుతున్న విషయాల గురించి కొడుకు రమేష్ తో ఆవేశంగా మాట్లాడుతాడు ప్రసాదరావు.


తిరిగి మాధవి దగ్గరకే వస్తారు వాళ్ళు.


సుప్రజ విలువ తెలుసుకుంటుంది ఆమె అత్తగారు. సరళ కూడా తప్పు తెలుసుకుని అత్తగారిని క్షమాపణ కోరుతుంది.

నీరజ అత్తామామలు కాశీకి ప్రయాణం అవుతారు.

ట్రైన్ లో పరిచమైన వారు కోడలితో తమ ఇబ్బందులు చెబుతూ ఉంటారు. 


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 10 చదవండి.. 



ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసుకోవాలని ఉవ్విళ్లూరాను. నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు. 


యాత్ర ముగిసిన తరువాత తిరిగి ఇంటికి రావాలని లేదు. కాశీలోనే ఉండిపోయి ఆ కాశీవిశ్వనాధుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్లు అశ్రుపూరితలైనాయి. 


పోనీ వృధ్దాశ్రమానికి వెళ్లిపోతామురా అబ్బాయి అంటుంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు. వాడి ముఖం చూసే మేము ఎక్కడకీ కదలలేక పోతున్నాం. 


సరోజిని కి ఆవిడ మాటలు ఎంతో బాధ కలిగించాయి. కాశీ వెళ్లి చూసి వస్తామంటే నీరజ తనకు వచ్చిన మొత్తం బోనస్ ఇచ్చేస్తూ హాయిగా వెళ్లి చూసి రండంటూ అన్నీ దగ్గరుండి సర్ది పదే పదే జాగ్రత్తలు చెపుతూ పంపించింది. ఉద్యోగం చేస్తున్నా ఏనాడూ ఇది నా డబ్బు అనుకుంటూ స్వార్ధంగా ఆలోచించకుండా ఇంట్లో సమస్తం చూసుకుంటూ చక చకా అన్ని పనులూ చక్కపెట్టుకునే నీరజ కళ్లముందు మెదిలాడింది. నీరజ ఎంత మంచిది. శ్రీలక్ష్మి గారి కోడలు లాంటిది కాదు నీరజ. ఇంట్లో తన ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న భయంతో తను చాలా స్వార్ధంగా ప్రవర్తించేది. ఏనాడూ నీరజ చేసిపెట్టిన వంట బాగుందని అనేదికాదు.


శ్రీలక్ష్మి గారు “మీరు అదృష్టవంతులండీ, మీకోడలు ఎంత రుచిగా చేసిందోనంటూ నీరజను మనసారా పొగిడింది. తను ఏనాడూ నీరజ దగ్గర ఆ మాట అనలేదు. 


కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు సరోజిని దంపతులు. ప్రతీ రోజూ గంగా స్నానాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో కాశీవిశ్వేశ్వరుని దర్శనం, ఆ పవిత్రమైన గంగానదిలో స్నానాలు, కళ కళలాడిపోయే ఆ గంగా హారతులు, దీపాల తోరణాలు సరోజినీ దంపతుల మనస్సులలో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. మధ్య మధ్యలో వేణూ, నీరజా ఫోన్ చేస్తూ యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నారు. 


ఆరోజు రాత్రి సరోజిని కి బ. పి ఎక్కువై శరీరం అంతా తూలిపోతున్నట్లుగా అనిపించింది. ఒక రాత్రి వేళ బాత్ రూమ్ కి వెళ్లాలని చూస్తే ఇదీ పరిస్థితి. భర్తను లేపింది. భర్త సుబ్బారావు కి కాస్త కంగారు ఎక్కువే. శ్రీలక్ష్మి గారెకి ఫోన్ చేయమంటావా అని అడిగాడాయన. ఏమీ వద్దండీ, మందుల బేగ్ లో పక్క అరలో చూడండి. ఇలా ఎప్పుడైనా బి. పి ఎక్కువై కళ్లు తిరిగినప్పుడు ఏదో టాబ్లెట్ వ్రాసిచ్చాడు డాక్టర్. దాని అవసరం ఎప్పుడూ రాలేదు. వేణు ఆ టాబ్లెట్ కొన్నాడో లేదో, బేగ్ లో చూడండి అనేసరికి పక్క అరలో నుండి ఒక చిన్న కవర్ తీసాడు. దానిమీద నీరజ వ్రాసింది. బి. పి బాగా ఉంటే వేసుకునే టాబ్లెట్ అని. అది చూడగానే సరోజిని ఇదేనండీ టెల్మా, పేరు మరచిపోయాను చూసారా, కొంచెం ఆ టేబ్లట్ మంచినీళ్లు ఇవ్వండంటూ వాటిని అందుకుని టాబ్లెట్ వేసుకుంది. ఆ వణుకు కళ్లుతిరగడం తగ్గి ఆవిడ హాయిగా పడుకున్నారు. 


మరునాడు కాఫీ తాగుతూ భర్తతో “చూసారా మన నీరజకు ఎంత గుర్తో. ఈ టేబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో చూసి తెప్పించి జాగ్రత్తగా బేగ్ లో పెట్టడమే కాదు, పైన పేరు కూడా వ్రాసింది. లేకపోతే ఎంత హడావుడి అయ్యేదో కదా అనగానే అవును సరోజినీ నేను చాలా కంగారు పడ్డాను ఆ క్షణంలో. పోనీలే కోలుకున్నావు మన కోడలి మూలాన. అంతేనా కాశీవిశ్వనాధుని దయవల్లనంటావా అని హాస్యంగా అడిగాడాయన. బంగారం లాంటి కోడలిని ఇచ్చిన ఆ దేవదేవునికి ఎప్పుడూ రుణపడే ఉంటానండీ అందావిడ. 


కార్తీక మాస దర్శనాలు అవి అన్నీ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. శ్రీలక్ష్మీ, నారాయణ మూర్తీ వాళ్ల తిరుగు ప్రయాణం మరో నాలుగు రోజుల తరువాత. లక్ష్మి గారూ, మీ కోడలిలో మంచి మార్పు తప్పక వస్తుంది, మీరు ఆనందంగా ఉండాలని ఆ కాశీ విశ్వేశ్వరుని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండండంటూ వీడ్కోలు తీసుకున్నారు. 


తిరిగి వచ్చాకా ప్రయాణపు బడలికతో నాలుగురోజులు విశ్రాంతి తీసుకున్నారు. “అమ్మాయ్ నీరజా, కాస్త ఉసిరికాయ తొక్కు తీసి నూరి ఇంగువ పోపు పెట్టు. వంకాయ అల్లం పచ్చిమిర్చి కారంతో అదేదో సంతర్పణ కూర అంటావు చూడు, చిట్టి వడియాలు వేపి కలుపుతావు. అది చేయి తల్లీ. మిరియాల చారు చారుపొడం వేసి బాగా చేస్తావు కదా. కాస్త చారు కూడా పెట్టు. ఏమిటో అక్కడ సరియైన భోజనం లేక అల్లల్లాడిపోయాం. నీ చేతి వంట తినాలని ఉవ్విళ్లూరుతూ వచ్చాననగానే నీరజ ఆశ్చర్యపోయింది. తన వంట తినాలని చేసిపెట్టమని మరీ అడుగుతోంది అత్తయ్య. కలకాదు కదా అనుకుందో క్షణం. 


ఆరోజు నుండి సరోజిని కూరలు తరిగివ్వడం, పైపనులు లాంటివే చేస్తూ నీరజ కే ఇంటి బాధ్యతను అప్పగించేసారు. ఎవరొచ్చినా ఇంటికి మా కోడలే చేసిందని గొప్ప పనిమంతురాలని చెపుతున్నారు. సరోజిని కి ఇప్పుడు మనసెంతో ప్రశాంతంగా ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఉంది. ఖాళీ సమయంలో భర్తతో కలసి గుడులు, పుణ్యక్షేత్రాలూ దర్శించుకుంటూ కొడుకు కోడలి కుటుంబంతో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. 



ఒకరోజు ఎందుకో శ్రీలక్ష్మీ, నారాయణ మూర్తిగారూ గుర్తొచ్చారు. తనే ఎప్పుడైనా ఫోన్ చేస్తానని చెప్పింది ఆవిడతో. ఏదో పనుల హడావిడిలో పడిపోయి మరచిపోయింది. పాపం ఎలా ఉన్నారో ఏమిటోననుకుంటూ ఫోన్ చేసింది. ఆవిడ భర్త ఫోన్ ఎత్తాడు. శ్రీలక్ష్మి గారికి ఇస్తారా ఫోన్ అనగానే ఆవిడ పోయి నెలరోజులైందమ్మా అన్నారాయన. షాకైంది సరోజిని. అయ్యో ఏమైందండీ అనగానే మనసులో ఏదో బెంగ పెట్టేసుకుందమ్మా. హార్ట్ ఎటాక్ వచ్చి పోయిందని చెప్పాడాయన. దగ్గరగా ఇరవై రోజులు సన్నిహితంగా గడిపింది ఆవిడతో. ఆవిడ మరణాన్ని జీర్ణించుకులోకపోతోంది. ఎదురుదెబ్బలు తగిలితే మనం బెదిరిపోకూడదు, ఏ పరిణామానికి మనం చెదిరిపోకూడదంటారు. కానీ ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటూ జీవిస్తారు? ఇంట్లో వాళ్లే ఛీ కొడుతుంటే ఆ జీవితం నరక ప్రాయమే. భగవంతుడా నాకూ మా వారికి మంచి తనాన్ని అర్ధం చేసుకుంటూ సర్దుకుపోయే స్వభావాన్ని ప్రసాదించు చాలు, అంతకంటే అష్టైశ్వర్యాలేమీ వద్దని మవసులో దేవుడిని ప్రార్ధించుకుంది. 


“హాయ్ నీరూ, ఏమిటంత సంతోషంగా ఉన్నావ్, ఏదైనా శుభవార్త ఉందా అంటూ సుప్రజ, మాధవి నీరజను అడిగారు. “శుభవార్తే సుమా. మా అత్తగారిలో గొప్ప పరివర్తన వచ్చిందోయ్. నాకే ఆశ్చర్యంగా ఉంది”. 


అప్పుడు మనం ఒక సారి అనుకున్నాం గుర్తుందా నీరూ. జీవితంలో ఎదురయ్యే అనుభవాలనుండే మనిషి పాఠాలను నేర్చుకుంటాడని. 


అందరూ మారలేరు సుప్రజా. అందరూ తమ తప్పులను తెలుసుకుంటూ మారితే లోకం ఇలా ఎందుకుంటుంది? కన్న తల్లి తండ్రులను సరిగా పట్టించుకోని పిల్లలు, ఈ వృధ్దాశ్రమాలు, అత్తా కోడళ్ల తగాదాలు, ఆత్మహత్యలు ఎందుకుంటాయి? ప్రతి వ్యక్తి తన వైఖరిని తాను విశ్లేషించుకోవాలి. తనలోని తెలివి తేటలను, బలహీనతలను, లోపాలను, అవకాశాలను, భయాలను, భ్రాంతులను తెలుసుకొని వాటిని విశ్లేషించి తన ప్రగతికి అవసర మయ్యే వాటిని పెంపొం దించుకొని తన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వాటిని విడిచి పెట్టాలి. ఇది ఎవరికి వారే చేసుకోవడం మంచిది. 


నిజమే మధూ, మార్పు అంటే ఉన్నది పోగొట్టుకోవడం అనే భావన నుండి బయటపడి, కొత్త వాటిని ఎలా గెలుచుకోవాలో అన్వేషించే మార్గమే మార్పు అని గ్రహించాలి. 


బాగుంది అయితే. కనీసం మన కుటుంబ సభ్యులలో కొందరిలోనైనా పరివర్తన వచ్చింది వారు చవిచూసిన అనుభవాలవల్ల. సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చక్కని అవగాహన ఉండాలి. నేటి తరపు అత్తా కోడళ్ళల్లో చాలామంది ఎంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని వింటున్నాం. కానీ కొంత శాతం వరకు మాత్రమే. అందరూ అలా ఉండడం లేదు. అందరూ మారినప్పుడే కదా నవ సమాజ నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి. నీరజ మాటలకు సుప్రజ, మాధవి క్లేప్స్ కొడుతూ అభినందించారు. లంచ్ టైమ్ ముగిసింది. పదండి మన సీట్లకు అనుకుంటూ ముగ్గురూ లేచి తమ విభాగాలవైపు నడిచారు. 

========================================================================

                                                       ***శుభం***


మనుషులు మారాలి ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి యశోద పులుగుర్త  గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









 
 
 

Comments


bottom of page