మరుగున పడుతున్న మన పర్వదినాలు : ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది

Pomaruguna Paduthunna Mana Parvadhinalu : Undralla Taddi, Atlataddi - Telugu Article | Nayana kasthuri
మరుగున పడుతున్న మన పర్వదినాలు : ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది - తెలుగు సాంస్కృతిక వ్యాసం | నయన కస్తూరి
Published in manatelugukathalu.com on 17/09/2026
మన తెలుగింటి ఆడపిల్లల బాల్యాన్ని ఆటపాటలతో, ఆనందంతో నింపిన పండుగల్లో ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది ముఖ్యమైనవి.
ఈ పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు; మన సంస్కృతి, స్నేహం, ఆరోగ్యం, ఐకమత్యానికి ప్రతీకలు.ఆధునిక జీవనశైలిలో మరుగున పడుతున్న ఈ పర్వదినాల ప్రాశస్త్యం, పూజా విధానం, సంప్రదాయాలను తెలుసుకుందాం.మన పిల్లలకు ఈ అందమైన పండుగలను పరిచయం చేసి, తెలుగు సంస్కృతిని తరతరాలకు అందిద్దాం.
మన తెలుగింటి ఆడపిల్లలు అందానికి ప్రతీకలు. ఒక్కొక్క వయసులో ఒక్కో రకంగా మనల్ని మురిపిస్తారు. చిన్న పిల్లలప్పుడు బుట్ట చేతుల గౌన్లు వేసుకుని ముద్దుగా ఉంటారు. ఇంకొంచెం వయసు వస్తే పట్టు లంగాలు జాకెట్లు వేసుకుని, పొడుగు జడలు వేసుకుని ఎంతో ముచ్చటగా ఉంటారు. ఇలా ఒక్కొక్క ఏడాది వయసు పెరిగే కొద్దీ వాళ్ళ అందచందాలతోనే కాకుండా ముద్దుమురిపాలతో, ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంటారు. వారి ప్రత్యేకమైన ఆటలు — తొక్కుడు బిళ్ళ, అష్టా చెమ్మా, చెమ్మ చెక్క లాంటి ఆటలు ఊరి వారందరినీ ఎంతో ఆకట్టుకునేవి.
ఈ ఆధునిక యుగంలో చిన్నప్పటి నుండే పోటీ చదువులు! మూడో తరగతి నుండే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ పరీక్షల ఒత్తిడి, రెంకులకై తల్లిదండ్రుల పరుగులాటలలో పడి మనం కూడా ఆడపిల్లల అచ్చట ముచ్చట మర్చిపోయి, చదువుసంధ్యలకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వడం మొదలు పెట్టాము. ఫలితంగా ఆడపిల్లల ప్రత్యేక పండగలైన 'ఉండ్రాళ్ళ తద్ది', 'అట్లతద్ది' పండగలు పూర్తిగా మరుగున పడుతున్నాయి. ఈ ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది ఆడపిల్లల పండగలు. ఈ పండగలను ఊరిలోని ఆడపిల్లలంతా కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. రంగు రంగుల దుస్తులు ధరించి, ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది నోములు నోచుకునేటప్పుడు కన్నుల పండుగగా అగుపిస్తారు.
ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద మాసంలో బహుళ తదియ నాడు అనగా సెప్టెంబర్ నెల 29వ తారీఖున వస్తుంది. సరిగ్గా ఒక మాసం తర్వాత అనగా ఆశ్వయుజ మాస బహుళ తదియ నాడు అనగా విజయదశమి తర్వాత వచ్చే తదియ నాడు అంటే అక్టోబర్ 28న అట్లతద్ది జరుపుకుంటారు. ఈ రెండు పండగలను ఎందుకు కలిపి ప్రస్తావిస్తున్నానంటే ఈ రెండు పండగలు జరుపుకునే విధానం, ప్రాశస్త్యము ఒకటే కావడమే కాకుండా ఉండ్రాళ్ళ తద్ది అట్లతద్దికి శిక్షణగా కూడా భావించబడేది. ప్రస్తుతం ముందుగా వచ్చే ఉండ్రాళ్ళ తద్ది గురించి మాట్లాడుకుని తర్వాత అట్లతద్ది ప్రస్తావించుకుందాము.
ఉండ్రాళ్ళ తద్ది రెండు రోజుల పండగ. ఈ పండగను ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల లోపు ఆడపిల్లలు జరుపుకుంటారు. అది ఆడపిల్లలు మానసికంగాను, శారీరకంగాను ఎదిగే వయసు.
మొదటి రోజు అంటే తదియకు ముందురోజు అనగా విదియనాడు ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి, తలారా స్నానం చేసి, మూడు, ఐదు లేక తొమ్మిది మంది ముత్తైదువులకు కుంకుడుకాయలు, సున్నిపిండి, పసుపు కుంకుమ, గోరింటాకు ముద్ద వాయనం ఇస్తారు. ఇది సూర్యోదయానికి ముందే జరగాలి. తర్వాత అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. దానితో మొదటి రోజు పండగ ముగిస్తుంది.
రెండవ రోజు తెల్లవారుజామున నోము చేసుకునే వారంతా లేచి, కుంకుడుకాయతో తలంటుకుని, కొత్త బట్టలు వేసుకుని, గోంగూర పచ్చడి, అన్ని కూరగాయలతో చేసిన పులుసు, పెరుగన్నం తిని, బయటకు వెళ్తారు. నోము చేసుకునే పిల్లలంతా ఒకచోట చేరి ఒకరికి ఒకరు తమ పండిన చేతులు చూపించుకుని మురిసిపోతారు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తుందని ఆనందిస్తారు. పెద్ద పెద్ద చెట్లకి ముందే వేసుకున్న ఉయ్యాలలు ఊగుతారు పాటలు పాడుకుంటూ. రకరకాల ఆటలు ఆడుకుంటారు. దాగుడుమూతలు, నేలాబండా, రంగుల రాట్నం, చెమ్మ చెక్క, ఉప్పురు గుప్ప లాంటి ఆటలు ఆడుకుని, ఆనందం మరియు ఆరోగ్యానికి కావలసిన మంచి శారీరక పరిశ్రమ పొందుతారు. తర్వాత ఇంటికి వెళ్లి, రోజంతా ఉపవాసం ఉండి, సాయంకాలం పూజకి సిద్ధం చేసుకుంటారు. చలిమిడి, పానకం, వడపప్పు, మినపట్లు, ఉండ్రాళ్ళుతో పాటు తమకు వీలైన మధుర పదార్థాలు తయారు చేసుకుంటారు.
సాయంకాలం భక్తిశ్రద్ధలతో పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మను చేసుకుని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వమని షోడశోపచార పూజలు చేసి, అన్ని నివేదనలు చేసి గౌరమ్మ మీద అనేక పాటలు పాడుకుని, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్ళు కూడా వాయనం ఇస్తారు. రాత్రి చంద్రుడిని చూసి ఉపవాస దీక్ష విరమిస్తారు. తర్వాత వచ్చే అట్లతద్ది దాకా ఆటపాటలు జరుగుతూనే ఉంటాయి.
అసలు ఈ పండగ మన పెద్దలు మనకు ఎందుకు అందించారంటే ఇది కేవలం ఏదో ఆటపాటలు ఆడుకునే వేడుక మాత్రమే కాదు. ఎండాకాలం ముగిసి శ్రావణ భాద్రపదాలు వానాకాలం. నార్లు నాటుకుని అందరూ ఆనందంగా ఉండే సమయం. సకాలంలో వానలు సరిపడా కురవాలి. దానికి దేవతలు కరుణించాలి. అందుకని సందర్భాలు కల్పించుకుని దేవతారాధన చేస్తారు. విపరీతమైన వేడి నుండి వానాకాలంలో కలిగే శీతలానికి అలవాటు పడటానికి, చేతి వ్రేళ్ళ ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటారు. వానాకాలంలో జలుబులు అవి రాకుండా మినుములతో చేసిన అట్లు, గోంగూర పచ్చడి తింటారు. పిల్లలంతా కలిసిమెలిసి ఆడుకోవడం వలన ఐకమత్యం పెంపొందుతుంది. ఒక పద్ధతి ప్రకారం చేయడం వలన ఆడపిల్లలకు క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావాలు పెరిగి, ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు.
శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు. సకల సౌభాగ్యప్రదాయిని గౌరీదేవి కనుక గౌరమ్మ పూజ, చదువులకు విజయానికి అధినేత వినాయకుని పూజ చేస్తారు. మనస్సుకు అధిపతి చంద్రుడు కనుక ఆరోగ్యకరమైన మనస్సు కోసం చంద్ర దర్శనం చేసుకుని, వ్రతకథల పుస్తకంలో ఉన్న రాజుగారు ఏడుగురు భార్యలు ఉండ్రాళ్ళ నోము నోచుకుని సౌభాగ్యవతులవడం చూసి ఆయన దగ్గర ఉండే ఒక వేశ్య కూడా ఆ నోము చేసుకుని సౌభాగ్యాన్ని పొందిన కథను చదువుకుని తమ నోముని పరిపూర్ణం చేసుకుంటారు. అప్పుడు భోజనం చేస్తారు.
ఇలా ఎన్నో పద్ధతులను నేర్పి ఎంతో వినోదాన్ని కూడా కలిగించే ఈ పండగను మరియు అట్లతద్దిని మన ఆడపిల్లలకు దూరం చేయవద్దు. అట్లతద్దికి ముందు రోజే 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలు చేతులకు పాదాలకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. పండుగనాడు తెల్లవారుజామునే లేచి, అమ్మ రాత్రే చేసివుంచిన అన్నాన్ని గోంగూర పచ్చడితో తిని అందరూ కలిసి సూర్యోదయం దాకా ఆడుకుంటారు. 'అట్లతద్దీ ఆరట్లు, ముద్దపప్పు మూడట్లు' అంటూ పాడుకుని చెట్లకు కట్టిన ఉయ్యాలలు పోటీలు పెట్టుకుని ఊగుకుని, సందడిగా జరుపుకుంటారు. స్నేహితులతో కలిసి ఒక పంక్తిలో కూర్చుని, అమ్మ కమ్మగా వేసిన అట్లు ఆవకాయతో తిని, పండుగ పూర్తి చేసుకుంటారు. అట్లతద్ది కథలో ఒక రాజకుమారి తన అన్నల సహాయంతో శ్రద్ధగా అట్లతద్ది నోము నోచుకుని, ఒక అందమైన రాకుమారుని ఏవిధంగా భర్తగా పొందినదో చదివి నోము పూర్తి చేసుకుంటారు.
చదువుసంధ్యలు చాలా ముఖ్యమే; వాటితో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలు కూడా మన పిల్లలు మరువరాదు కదా? మనలో చాలామంది సెల్ ఫోన్ల మోజులో పడి, ఇలాంటి ఆటపాటలను మర్చిపోయే ఉంటారు. కనీసం మన ఆడపిల్లలైనా ఇలాంటి చక్కటి పండుగలు చేసుకునే ఒక అందమైన అవకాశం కల్పించి, ఉండ్రాళ్ళ తద్ది, అట్లతద్ది లాంటి పండుగలు మరుగున పడకుండా కాపాడుకుందాము. కాబట్టి తల్లులందరూ ఈ ఏడాది నుండి అయినా ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు వచ్చే ఉండ్రాళ్ళ తద్ది పండుగను, ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్ది పండుగను తమ ఆడపిల్లలు జరుపుకునేలాగా చూస్తారు కదూ?
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:
నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నయన కస్తూరి
నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలు రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.










మరుగున పడిపోయిన మన తెలుగువారి గ్రామీణ పండుగల్ని మళ్లీ మనకి గుర్తుచేసినందుకు శ్రీమతి నయన గారికి ధన్యవాదాలు. మనమందరం ఈ పండుగల్ని సంప్రదాయ రీతిలో జరుపుకుని మన భావి తరాలకు కూడా వీటిని అందించే బాధ్యత మన పైన ఎంతైనా ఉంది.