మువ్వ!
- Undavilli M
- 16 hours ago
- 8 min read

Muvva - Telugu Inspirational Story | Undavilli M
మువ్వ! - తెలుగు ప్రేరణాత్మక కథ | ఉండవిల్లి.ఎమ్
Published In manatelugukathalu.com On 01/09/2026
అడవి కేవలం చెట్ల సమూహం కాదు; ఎన్నో తరాల జీవనానికి, జ్ఞానానికి, సంస్కృతికి ఆధారం. అడవితో పెనవేసుకున్న ఆదివాసీ జీవితాల్లో ప్రకృతి విధ్వంసం ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో హృదయానికి హత్తుకునేలా చెప్పే కథ ‘మువ్వ’.
చీకటి తెరలు ఇంకా తొలగక ముందే పుడిపల్లె గ్రామం కనుచూపు మేర మంచులో కూరుకుపోయినట్లు ఉంది. పొగడ, చంప, పావలమల్లె లాంటి పూల వాసనలతో, సన్నని సవ్వడులతో మెల్లగా అడవి మేల్కొంది.
యానాదుల గూడెంలోంచి మల్లేసు, పొయ్య ఇద్దరూ భుజాన తాళ్లతో, పొగ పరికరం, వెదురు కత్తి, గుమ్మడి గిద్దె లాంటి వన్నీ పట్టుకుని ఆ మట్టి దారమ్మట మంచుని చేధించుకుంటూ బయలుదేరారు.
ఇది వరకు తేనె తెట్టెల కోసం దగ్గరలో తిరిగితే సరిపోయేది. నాయకులు, కుల పెద్దల సహకారంతో చెట్లను నరుక్కుంటూ పోతుంటే, ఇప్పుడు అడవి లోపలికంటా పోవాల్సి వస్తుంది.
పుడిపల్లె కొట్టేంగుడ మండలం లోనిది. దాని పరిధి లోని అడవంతా మాయమవుతూ వస్తుంది. గిరిజన సమూహాల్లోకి కొత్త పోకడలు వచ్చాయి. అడవి, గిరిజన సంస్కృతి అనేక ఆధునిక ప్రభావాలకి లోనవుతున్నాయి.
“అడవంతా మారిపోయింది, ఇంకెంత మారిపోద్దో!” అన్నాడు మల్లేసు.
“చెట్ల నాశనం తోటే మన జీవితాలు మసి బట్టాయి” నిర్లిప్తంగా చెప్పాడు పొయ్య.
వాళ్ళిద్దరూ లోపలి కెళ్ళే కొలదీ అడవంతా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. పక్షుల శబ్దాలు శ్రావ్యబద్ధంగా అమర్చిన సంగీత అరమరికల్లా చుట్టూ వ్యాపిస్తూ వినిపిస్తున్నాయి.
వీళ్ళకి దూరంగా చండ్ర చెట్టు ఎత్తైన కొమ్మకు తేనె తెట్టే వేలాడుతూ కన్పించింది. ఏభై, అరవై కిలోల బరువుతో ఉండేలా ఉంది. ఇద్దరూ మెల్లగా నడుస్తూ దాని దగ్గరకు చేరుకుంటున్నారు. ఎండుటాకుల మీద అడుగుల శబ్దానికి ఒక్కసారే పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఆ అలజడికి చండ్ర చెట్టు కొమ్మలన్నీ ఊగాయి. ఆ ఊగుడు తట్టుకోలేక తేనె తెట్టు తెగి పొయ్య తలమీద పడింది.
మల్లేసు “పొయ్యా!” అని గట్టిగా పిలిచే లోపే వందల తేనెటీగలు అతని శరీరాన్ని ముట్టడించాయి.
“దౌడు తీయి మల్లేసు” అన్న మాటలు గట్టిగా వినిపించి ఆగిపోయాయి. ఐదారొందల తేనెటీగలు ముళ్ళని గుచ్చేశాయి.
శ్వాస ఆడలేదు. పొయ్య కుప్పకూలిపోయాడు. మల్లేసు చట్టు పక్కల ఎవరైనా ఉన్నారేమోనని శబ్దం చేస్తూ దూరంగా పారిపోయాడు.
– – –
తండ్రి పోయిన వార్త ఎన్. జి. రంగ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సంకుకు చేరగానే, అక్కడ్నుంచి బయలుదేరి రాజమండ్రిలో దిగి రంపచోడవరం బస్సెక్కాడు. సంకు ఆందోళనతో ఉన్నాడు. తండ్రి లేడన్న విషయం అతన్ని అతలాకుతలం చేసింది.
బస్సులో ప్రయాణం చేస్తున్నాడు కానీ, ఆలోచనలు యాంత్రికంగా చుట్టు ముడుతున్నాయి. ఎన్. జి. రంగ యూనివర్సిటీలో బి. ఎస్. సి అగ్రికల్చర్ తర్వాత, ఎమ్. ఎస్. సి ఎంటమాలజీ ఆఖరి సంవత్సరం పూర్తయి, ప్రాజెక్ట్ వర్కుకోసం యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నాడు.
తల్లి రవ్వ చిన్నప్పుడే డెంగ్యూ జ్వరంతో చనిపోయింది. తను, తన చెల్లెలు మువ్వని ఇద్దర్నీ నాన్నే పెంచాడు. పోడు వ్యవసాయం, తేనె సేకరణతో ఇద్దర్నీ చదివించాడు. చెల్లి ఆరో తరగతితో ఆపేసింది. ఇంట్లో వంట తనే చేస్తుంది. తను రంపచోడవరం EMRS (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్)లో ఇంటర్ వరకు చదివాడు.
తర్వాత ఎన్. జి. రంగలో సీటొచ్చింది. అడవి బతుకుల్తో చిందర వందరైన కుటుంబానికి తన చదువు ఒక దారి చూపిస్తుందని, తన చెల్లెలు పెళ్లి చేసి, నాన్నని తన దగ్గర ఉంచుకోవాలని కన్న కలల్ని ధ్వంసం చేస్తూ, విషాద వార్తతో సంకు ఆలోచనలన్నీ స్తంభించుకుపోయాయి.
మధ్యాహ్నం ఒంటి గంటకల్లా బస్సు పుడిపల్లె చేరింది. సంకు కోసం అతని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. యానాదులతో పాటు, కోయ, కొండదొరలు అందరూ కలిసే ఉంటారు. బస్సు దిగగానే చుట్టు ముట్టి తీసుకెళ్లిపోయారు. తాటాకుల మీద తండ్రిని పరుండబెట్టి పైన వస్త్రం కప్పారు.
మువ్వని గట్టిగా కౌగిలించుకుని సంకు బోరున ఏడ్చాడు. మువ్వ అన్నను అంటుకుని వదల్లేదు. జరిగిన కథంతా చెప్పుకొచ్చి, అందరూ అతన్ని ఓదార్చారు. వాళ్ళ గూడెనికి పెద్దైన మొర్రయ్య ఆలస్యమవుతుందని, తర్వాత జరగవలసిన కార్యక్రమాల్ని వేగవంతం చేశాడు.
ఊరి చివర గుంత తవ్వి శవాన్ని అక్కడ పూడ్చారు. దానితో పాటు ఆచారంగా శవంతో పాటు అతను వాడే వేట పరికరాలు సమాధిలో ఉంచారు. అవి ఉంచినపుడు చెల్లెల్ని పట్టుకుని గట్టిగా ఏడ్చాడు సంకు. 'నీ చదువు ఈ గూడెనికి ఉపయోగపడాలి బిడ్డా' అస్తమానూ నాయన చెప్పిన మాటలు మారు మ్రోగుతున్నాయి.
కార్యక్రమం అంతా పూర్తయింది. వారం రోజులు ఇంట్లో ఆహారం వండరు. మాంసం ముట్టరు, మిగతా కుటుంబాల వారు అన్నీ అందిస్తారు. ఏడో రోజుతో ఆ తంతు ముగుస్తుంది. ఆఖరి రోజున శరీరం జంగి దేవతను చేరుకుంటుందని నమ్ముతారు. అక్కడ్నుంచి దైనందిక పనుల్లో పడిపోతారు.
తండ్రి లేని ఆ ఇంట్లో సంకు, మువ్వ ఇంకా దిగాలుగానే ఉన్నారు. కన్నీళ్లతో మువ్వ కళ్ళు ఎరుపెక్కి, నరాలు ఉబ్బాయి. చిన్నప్పుడు తల్లి పోయాక, తండ్రి చాటు బిడ్డగా పెరిగింది. తండ్రికి సహాయంగా ఉండి, వేటలో తండ్రి వద్ద అన్నీ నేర్చుకుంది. ఆ చిన్న గుండె తండ్రి నుండి ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది.
కానీ, అతను లేనప్పుడు దుఃఖాన్ని ఆపుకునే శక్తి తనకి లేదు. ఇంట్లో వంటంతా మువ్వే చేస్తుంది. తండ్రి వేటతోను, పోడు వ్యవసాయంతోనూ కుటుంబాన్ని ఈడ్స్తూ, సంకుని ప్రభుత్వమే చదివిస్తున్నా, ఖర్చులకు ఇచ్చేవాడు. ఇప్పుడు తన చెల్లెలి బాధ్యత పూర్తిగా తనే వహించి, మంచి భర్తను తీసుకురావాలి. అనేక ముసుర్లు సంకులో కలుగుతున్నాయి.
ఎర్రవ్వ ఇంటికి వచ్చాడు. సంకుకి చిన్నప్పటి జాతగాడు. “వేటకి రా సంకు, ఇంట్లో కూర్చుంటే ఏం లాభం? భయపడకురి” అన్నాడు.
“మా నాయనలా మాకు భయం లేదు, రా అన్న పోదాం!” అంది మువ్వ.
ముగ్గురు అడవిలోకి ప్రయాణమయ్యారు. గూడెం దాటి లోపలకి పోతుంటే నాయనతో కూడిన జ్ఞాపకాలు చుట్టూ ముసిరాయి. ఎంత చాకచక్యంగా తండ్రి వేట చేసేవాడు. అవి చూడ్డం, అలాంటివి నేర్చుకోవడం గొప్పగా ఉండేది. తేనె తెట్టెను తీసేటప్పుడు తమని దూరంగా ఉంచేవాడు.
అవి దాడి చేసినప్పుడు తన నెత్తిమీద గుడ్డని తీసుకుని, దగ్గర్లో కాలువ వద్దకి పరుగెత్తి అందులో దూకి, గుడ్డని నీళ్లపై వదిలేవాడు. ఆ గుడ్డ ప్రవాహంలో వెళ్ళిపోతుంటే, తేనెటీగలు ఆ గుడ్డను వెంబడిస్తూ వెళ్ళిపోయేవి. కాలువలోంచి తర్వాత లేచివచ్చి తేనెను తీసుకు వచ్చేసేవాడు.
నాన్న అనేక అడవి అనుభవాల పుట్ట. తరాల నుంచి వస్తున్న అడవి జ్ఞానంతో పెనవేసుకుపోయి, వచ్చే తరాలకి పాఠం నేర్పేవాడు. “మనం బాధల్ని అనుభవించకుండా బతుకులో పైకి ఎదగలేము” అనేవాడు.
తేనె సేకరణకు అనేక ఉపాయాల్ని వివరించేవాడు. పుట్ట తేనె తీయడంలో మహా నేర్పరి. పుట్టలోని తేనె తీయడానికి ఎలుగుబంటిని అనుసరించేవాడు. అది పుట్ట తేనెకోసం పుట్టల్లో వెతికేది. తేనున్న పుట్ట దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని పుట్ట లోపలికి చేయిపెట్టి ముక్క ముక్కలుగా పుట్టతేనెను వెలుపలికి తీసి వెనక్కు పెట్టేది. అలా పెట్టేటప్పుడు నాన్న అక్కడ గుడ్డ పరిచి ఉంచేవాడు.
ఎలుగు ఆఖరి ముక్క లాగే లోపు నాన్న అక్కడ్నుంచి పలాయనం చిత్తగించేవాడు. ఎలుగుబంటి పక్కకు తిరిగి చూడలేదు. అది పూర్తిగా వెనక్కి తిరిగే సరికి అక్కడ మా నాన్న ఉండేవాడు కాదు.
కొన్నేళ్లుగా నాన్న చెప్పే మాటలు సంకులో పదే పదే గుర్తొచ్చి మోగుతున్నాయి. వేట ఇదివరకట్లా లేదు. చెట్ల నాశనంతో అవి తగ్గిపోతున్నాయి.
వాళ్ళు ముగ్గురూ నడుచుకుంటూ గంపకాలువ కాడికి వచ్చారు. కొండ వాగు నీళ్ళతో నిత్యం ప్రవహిస్తది. గంప కాలువ ఒడ్డునుంచి, కాలువ మీదకు వాలి ఉన్న చెట్టు వద్దకు వచ్చారు. దాని మీదకు ఎర్రవ్వను, అన్నను ఎక్కించి తనూ ఎక్కింది. తను సైగ చేసినప్పుడు చటుక్కున కొమ్మ మీంచి కాలువలోకి దూకి చేపల్ని బైట వేయాలని చెప్పింది.
మువ్వ తన జేబులోని బియ్యం గิంజల్ని కొన్నిటిని నోట్లో వేసుకుని చాలా మెత్తగా నమిలి కాలువలోకి ఊసింది. చిన్న చిన్న చేపలు గుంపుగా వచ్చి వాటిని తిన్నాయి. మళ్ళీ నోట్లో బియ్యం వేసుకుని కొంచెం మొరుంగా నమిలి ఊసింది. ఇంకొంచెం పెద్ద చేపలు వచ్చి తిన్నాయి. ఈసారి ఇంకా పెద్ద పలుకులుగా నమిలి ఊసింది, పెద్ద చేపలు వచ్చాయి. రెప్ప వేసేలోపు ముగ్గురూ కాలువలోకి దూకి చేతికి దొరికిన చేపల్ని పైకి విసిరేశారు.
చెట్టు మొదల్లోంచి నారతీసి చేపల్ని వాటికి గుచ్చి తిరిగి బయలుదేరారు.
“ఇలాంటివి నాయన చాలా చేసేటోడు అన్న” అంది మువ్వ.
సంకు మౌనంగా ముందుకు నడుస్తున్నాడు. ‘నువ్వు తేనెటీగల గురించి చదువుకున్నావంట, ఏవైనా సులువు చెప్పు' అనేవాడు నాయన. అడవి శాస్త్రజ్ఞుడికి తనేం చెప్పగలను అన్పించేది. తరాలుగా వస్తున్న ఇలాంటి వేట రహస్యాల విద్య అంతరించి పోతుందేమో! పుట్టే పిల్లలు పట్నాల వైపు చూస్తుంటే, ఈ అడవులు రహస్యాలు దాచుకున్న దేవతల్లా ఎదురు చూస్తుంటాయి.
“నువ్వొస్తే గూడానికేదో చేస్తావనేటోడు నాయన”అంది మువ్వ.
“ఔ”అన్నాడు ఎర్రవ్వ.
“నాకు తెలిసింది, గూడెనికి చేయక ఎవరికి చేస్తానురా? ముందు ఈ నరకుడు ఆపాలి. మళ్ళీ అడవిని యధాస్థితికి తీసుకురావాలి” సంకు అన్నాడు.
తట్టీ తట్టని భావంతో ఎర్రవ్వ వాళ్ళ వెంట నడిచాడు. మువ్వకి అన్నేదో చేస్తాడన్న ధైర్యంతో ముసి ముసిగా నవ్వింది.
- - -
తనతో పాటు ఇ. ఎమ్. ఆర్. ఎస్ స్కూల్లో చదివిన వాళ్ళంతా అక్కడితో ఆగిపోయారు. మా గూడెంలో తనే ముందుకు వెళ్ళి చదివాడు. ఈ చదువుతో గూడెనికి ఉపయోగపడతానా అన్పించేది సంకుకి. తన చిన్ననాటి దోస్తీలతో గూడెం అంతా తిరిగాడు. ఎవరెవరూ ఎలా వ్యవసాయం చేస్తోంది, ఏమి జరుగుతున్నదీ తెలుసుకుని, వాటిమీద సుదీర్ఘంగా ఓ ప్రణాళిక తయారు చేసుకుని, అందరికీ ఈ వ్యవసాయం, వేట, అడవి వీటిమీద అవగాహన కలిగించడానికి, అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు వాళ్ళ గూడెంలోని అందర్నీ జంగమ్మతల్లి ఆలయం వద్ద అందర్నీ సమావేశ పరిచాడు. అక్కడికి ఆడా, మగ అన్ని వయసుల వాళ్ళని సంకు స్నేహితులు ఎర్రవ్వ, తూము, తంగు వీళ్లందరూ తీసుకువచ్చారు.
“ఈరోజు అందర్నీ ఇక్కడకు రమ్మని చెప్పడానికి కారణం, మన పంటలు, వేట, అడవి వీటి గురించి మనమందరం మాట్లాడుకోవడానికి. వాటిలోని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలంటే అందరం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా తేనె తెట్టెలు మన గ్రామంలో చాలా విరివిగా ఉండేవి. చెట్లు నరికేస్తుండటం వల్ల అవి తగ్గిపోయి, వాటి గురించి అడవి లోపలికంటా వెళ్తున్నాం. మనం సాగుచేస్తున్న పంటలు దిగుబడి తగ్గుతుంది దేనికో తెలుసా!?” అన్నాడు.
“మందులు సరిగా కొట్టక”తంగు పైకి లేచి చెప్పాడు.
“దానికి సరిగా మందులు కొట్టకపోవడం కాదు. పశువులు వృద్ధి చెందాలంటే అవి ఆడ, మగ సంపర్కం లేనిదే పశువులు పుట్టవు. ఆడ, మగ కలవనిదే మనుషులకు పిల్లలు పుట్టరు. మొక్కలకి కూడా తేనెటీగల వల్ల పరాగ సంపర్కం (pollination) కలగనిదే పూలు పళ్ళు అవవు, అవి దిగుబడి నివ్వవు. ఇప్పుడు ఇదివరకటి తేనెటీగ లేవి!? అవి తగ్గిపోయాయి కనుకే దిగుబడి తగ్గింది.
మళ్ళీ వాటిని వృద్ధి చేయాలి. అవి ఎందుకు తగ్గిపోయాయో తెలుసా!? మనం వాడుతున్నామే తెల్ల డబ్బాకి నీలం రంగు చుట్టి ఉండే పెస్టిసైడ్, దాని వాడకం వల్ల తేనెటీగలు అంతరించిపోతున్నాయి. ఆ మందులు కొట్టేటప్పుడు తేనెటీగలకు కళ్ళు తిరిగి పోతాయి. అవి గూళ్ళకు వెళ్ళే దారి కూడా మర్చిపోయి (నావిగేషన్) పిచ్చి పిచ్చిగా వెళ్లిపోతాయి.
అందుకే ఆ మందుని మనం వాడటం మానేయాలి. కొన్ని దేశాల్లో 'నియోనికోటినాయిడ్' అనే మందుని అమ్మకూడదని బ్యాన్ చేశారు.
“ఇవన్నీ నిజమేనా కొడకా”ఓ ముసలి అయ్య అడిగాడు.
“నిజమే! మీకు చెపితే అర్ధంకావు. కానీ, ప్రభుత్వ సంస్థలైన ICAR, NBB లాంటివి పంటల అభివృద్ధిలో ముప్పై నుంచి ఏభై శాతం వరకు అధిక దిగుబడి కలుగుతుందని పరిశోధనలో తేల్చి పదే పదే చెప్తున్నారు.
నేను కూడా వాటి గురించి చదువుకుని వచ్చినవాడినే. ఆ ఆధారాలన్నీ నాకు తెలుసు. అందుకే, అందర్నీ ఇక్కడ కలసి ఈ విషయాలు చెప్పడానికే. వినాశనం లేని సహజ అడవి వల్ల, ప్రకృతి సమతుల్యత ఏర్పడి మనుషులు ఆరోగ్యంగానే ఉండటమే కాకుండా, తేనెటీగలు వృద్ధై పంటలు పెరుగుతాయి.
మనం గొడ్డలితో చెట్లను నరికి సాగు చేసుకున్న భూమి మన ఆధీనంలో ఉంటుంది. అదే మిషన్లను తీసుకువచ్చి చెట్లను నరికితే ఆ భూమిని మనం స్వాధీనం చేసుకోవడానికి లేదనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి.
బడా స్వాములు, నాయకులు మనకి ఎరవేసి, మిషన్లతో అడవిని నరికించి, మధ్యలో మన పేర్లను వాడుకుంటూ, భూముల్ని వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు. మనం తలవంచి అన్నిటికీ లొంగిపోతే, స్వార్ధంతో అడవి నాశనంలో మనం పాత్ర వహిస్తే, రానున్న మన తరాలు మట్టి కరచుకుపోతాయి. అడవిని పదిలంగా కాపాడుకోవాలి.
వీటి లోని జంతువులు, పక్షులు, వృక్షాలు అన్నీ మన ఆస్తి. అడవి నాశనం అవ్వడం వల్లే లోపలికంటా వెళ్ళి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వేట చేయవలసి వస్తుంది. అడవి జంతువులకు హాని కలుగుతుంది. మనం అడవిని తూట్లు పొడుస్తూ ముందుకు సాగితే, వన జంతువులు జన ఆవాసాల మీదకు వచ్చేసి హానికరంగా మారుతున్నాయి. ప్రకృతి ఇచ్చిన లక్ష్మణరేఖల్ని మనం దాటకూడదు.
మనం ప్రాణాల్ని ప్రమాదపు అంచున పెట్టి నడుస్తున్నాం, ఇవన్నీ తగ్గిపోవాలంటే వృక్షాల్ని నాశనం చేయడం ఆపేయాలి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, తుమ్మెదలు ఇవన్నీ మనజాతి సంరక్షణకు తోడ్పడేవి. వాటిని కాపాడితే అవి మన పంటల దిగుబడిని పెంచుతాయి”.
ఇవన్నీ చెప్పినా, కొంతమందికి కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి, అయ్యి అవనట్టు కొందరు, అస్సలు అర్థంకాక కొందరు, ఇవన్నీ ఏవిటో ఏం జరుగుతుందో అనే భావంతో కొందరూ సంకుతో రావడానికి ఇష్ట పడలేదు. సంకు స్నేహితులు ముగ్గురు అతని వెంట రావడానికి ఇష్టపడ్డారు.
“చెడు పని ఆరంభం చేయకూడదు కానీ, ఒక మంచిపని చేయడానికి ఆలోచన దేనికీ?”అంటూ లేచాడు తూము.
సంకు తనకున్న భూమిలో కాయకూరలకు సంబంధించిన పంటల్ని విరివిగా వేశాడు. వాటితో పాటు తేనె పరిశ్రమల్ని ఏర్పాటు చేసి, భారతీయ ప్రధాన ఐదు జాతుల్లో ‘ఏపిస్ సెరానా ఇండికా’ (Apis cerana indica) జాతిని వృద్ధి చేశాడు. ఇవి చిన్నవిగా ఉండి, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని, దిగుబడిని ఇచ్చే జాతి.
అతనితో కూడిన మిగిలిన ఇద్దరూ తేనె పరిశ్రమల్ని అభివృద్ధి పరిచారు. ప్రత్యేకంగా అమర్చిన తేనె తొట్టెలే కాకుండా, చుట్టూ ఉన్న తుమ్మ, తంగేడు కంపల్లోని సహజంగా ఏర్పడిన పట్టుల్ని కూడా మువ్వ జాగ్రత్తగా చూసేది. నాన్నని చూసిన అనుభవం, అన్న తోడ్పాటుతో మువ్వ నైపుణ్యం బాగా కనబరిచింది.
ఓరోజు తుమ్మ కొమ్మల్లో అలజడితో తేనెటీగలు వలయాకారంగా నృత్యం చేస్తుంటే ' ఊ…హూ…' అనే ఫ్రీక్వెన్సీ తో కూడిన శబ్దంతో మువ్వ వాటిని తెట్టెల్లోకి వెళ్ళేలా చేసింది. సంకు ఆశ్చర్యంగా చూశాడు.
“మకరందం ఉంది, అందుకే అవి వలయాకారంగా నృత్యం చేస్తున్నాయి”అంది మువ్వ.
“ఇంకా ఎలా చేస్తాయి!?”అడిగాడు సంకు.
“వంకర టింకరగా నృత్యం చేస్తే పుప్పొడి ఉన్నట్టు” అంది మువ్వ.
నాయన ముందు తన చదువు కూడా సరిపోదనిపించింది. ఎవరికీ తెలియని జ్ఞానాన్ని నాయన దగ్గర మువ్వ నేర్చుకుంది. తనకు కేవలం 600 హెర్ట్జ్ ల శబ్దం చేస్తే స్తంభించిపోతాయని తెలుసు! కానీ, నోటితో ఈ శబ్దాన్ని వాటి ఫ్రీక్వెన్సీకి సరిపడ తాకుతూ వాటిని లోపలికి పంపించడం, ప్రకృతి నేర్పిన పాఠం. నాన్న ఇలాంటివెన్నో నేర్పించేవాడు. అయినా “నీ చదువు ఎలా ఉపయోగపడుతుందని” అడిగేవాడు.
“నాన్న దగ్గర నేర్చుకున్న ఇలాంటి వన్నీ నువ్వు మనతో ఉండే వాళ్లందరికీ నేర్పించాలి మువ్వ”అన్నాడు సంకు.
“నవ్వుతూ చూసింది మువ్వ”
మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురై, ఆందోళనలకు గురిచేసినా, సంకు అభయ హస్తంతో, ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోయారు. ఆ క్రాప్ లో పెద్దగా బెనిఫిట్ కనిపించకపోయినా, తర్వాత క్రాప్ లో మెరుగ్గా మొదలై, మూడో క్రాప్ లో వీళ్ళు అనుకున్న దానికంటే ఫలితాలు బాగా వచ్చాయి. కొన్ని రసాయనాలు తగ్గింపుతో పరాగ సంపర్కం బాగా జరిగి అధిక తేనె ఉత్పత్తి, పంటల దిగుబడి సమతుల్యంగా కుదిరాయి.
మెల్లగా ఒకరికొకరు చేతులు కలుపుతూ ముందుకు రాసాగారు. భీష్మించుకుని ఉన్నవాళ్ళు, దానిలోని ఫలాల్ని చూసి చురుగ్గా కదలి వస్తున్నారు. పుడపల్లె గ్రామం అంతా ఏకంగా సంకు ఏర్పరిచిన తేనెటీగల రక్షణ, వన సంరక్షణ మార్గంలోకి చేరారు. అందర్నీ ఉత్సాహపరచి, ఏకం చేసి, ఎప్పటికప్పుడు నోట్లో నాలుకలా అందర్నీ అతుక్కుని సంకు తిరిగేవాడు.
కొట్టేంగూడ మండలంలోని పుడపల్లెతో పాటు, మల్లంపేట, యర్రగొండపాలెం, సుగ్రీవులపుట్ట, తదితర గ్రామాలన్నీ ఇదే దారి పట్టాయి. అందరికీ కేంద్ర బిందువులా ఉండి, అందరి చుట్టూ తిరుగుతున్నాడు సంకు.
నాన్నంటే పుడపల్లె మిడిసి కొండలంత ఎత్తు అనుకునేది మువ్వ. తన అన్న నాన్నని మించిపోయినట్టు, ఆకాశమంత విస్తరించినట్టు కనబడుతున్నాడు.
లోపలి లోలకం మువ్వను తాకితేనే మువ్వ మ్రోగుతుంది; ఆధునికత, ఆదివాసీల జీవనశైలి రెండూ మిళితం అయితేనే సమాజం వికసిస్తుంది!
( ప్రకృతి విధ్వంసం జరిగితే - నిశ్శబ్ద మానవ వినాశనం కలిగిస్తుంది!)
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా: జి. లక్ష్మీశ, ఐ. ఏ. ఎస్ వారి మహా సంకల్పంతో కొహాన్స్ మరియు మల్లెతీగ సేవా సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ, 7 నవంబరు 2025
సమాప్తం.
౼౼౼౼౼
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్
ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి.
'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.
నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి.
అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం!




Comments