top of page

నేరం నాది కాదు ప్రేక్షకులది

'Neram Nadi Kadu Prekshakuladi' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

ట్రింగ్ ట్రింగ్... హాల్లో ఫోన్ ఒకటే మ్రోగుతుంది. రావు గారి అసిస్టెంటు గుర్నాధం ఫోన్ ఎత్తేడు. "హలో! రావుగారున్నారాండి? " అవతలి కంఠం అడుగుతోంది.

"భారతదేశంలో చాలా మంది రావుగార్లున్నారు... ఏ రావుగారు కావాలి మీకు ?"

" అదేం ప్రశ్నండీ ఈ ఫోన్ నెంబర్లో ఎంతమంది రావుగార్లున్నారేమిటి ? నాకు కావలసింది రమణారావు గారు " సందేహ నివృత్తి చేసేడు.

" అలా చెప్పండి... నిదరరావు గారు నిదరపోతున్నారు" చెప్పేడు గుర్నాధం. "నిదరరావుగారెవరండీ " అవతలి ఆసామీ నోరెళ్లబెట్టేడో లేదో కాని అలా అనిపించింది గుర్నాధానికి. తన భాషలో నిదరరావెవరంటే ఏమిటో వివరించి చెప్పేడు. 'ని ' అంటే నిర్మాత 'ద ' అంటే దర్శకుడు 'ర ' అంటే రచయిత అని.

" తమరెవరో చెప్పేరు కాదు" అడిగేడు ఆ పెద్దమనిషిని గుర్నాధం. అతను మోడరన్ వేవ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి మాట్లాడుతున్నానని చెప్పేడు. మోడరన్ వేవ్- మీడియం వేవ్, షార్ట్ వేవ్ లా... అనుకుంటూ "కాసేపాగి ఫోన్ చెయ్యండి.. రావుగారు లేచే వేళయింది " అన్నాడు. "మీరెవరు మాట్లాడేది?" ఈ సారి అతను ఆరా తీసాడు.

"నేనాయన అసిస్టెంట్ ని. అదిగో రావుగారు వస్తున్నారు మాట్లాడండి" అని ఫోన్ రావుగారికిచ్చేసేడు గుర్నాధం.

"ఎవరోయ్ గుర్నాధం ?" ఫోన్ అందుకున్నాడు రావుగారు.

" హలో రావూ స్పీకింగ్ "

"నమస్తే సార్"

" నమస్తే , మీరు....?"

" నేను మోడరన్ వేవ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి మాట్లాడుతున్నానండి. మీ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ సర్, కంగ్రాట్యూలేషన్స్ చెబ్దామని ఫొన్ చేసేను సార్. యూ ఆర్ రియల్లీ వెరీ లక్కీ ప్రొడ్యూసర్ కీపిటప్ ".

"థాంక్యూ వెరీమచ్" రావుగారు చెప్తుండగానే 'ఎవరో మీ అసిస్టెంట్‌ట.. అదరగొట్టెసేడనుకోండి ' అన్నాడు.

" ఆ..గుర్నాధం అని ఉన్నాడు లెండి . నేను గుర్రునాధం అంటుంటాను. ఓ ప్రక్క గుర్రు పెడుతూ నిద్రపోతున్నా , ఫోన్ మ్రోగేసరికి మాత్రం ఠంచనుగా లేచి కూచుని మాట్లాడతాడు " రావుగారు వర్ణించి చెప్పేరు.

"హ్హ..హ్హా..హ్హా...హౌ ఫనీ? మరి ఉంటానండీ. నమస్తే"

"ఓ.కే. నమస్తే ....."

ట్రింగ్...ట్రింగ్... మళ్ళీ ఫోన్ రెసీవర్ ఎత్తేరు రావుగారు.

" హలో దిసీజ్ రావు స్పీకింగ్ హియర్"

" నమస్తే అండి "

" నమస్తే " ఫోన్ లో వ్యక్తి దిల్ ఖుష్ థియేటర్ ప్రొప్రయిటర్.

"మీ పిక్చర్ బ్రహ్మాండంగా ఉంది. వరసగా హౌస్ ఫుల్. అడ్వాన్స్ బుకింగ్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అంత రష్... ఒకటే క్రేజ్" అని చెప్తున్నాడు. అతను అంతగా పొగిడేస్తూ ఉంటే రావుగారికేం మాట్లాడాలో తెలీలేదు. అతను చెప్పుకొంటూ వెళ్లిపోతున్నాడు. "మీ డైరెక్షన్ లో ఇక సినిమాలు 3 రీళ్ళు ... 6 బాక్సులు కంటిన్యూ అవవలసిందే అని... "

చాలా థాంక్స్ అండీ అదంతా ప్రేక్షకుల అభిమానమే " అన్నారు రావుగారు.

" మరి ఉంటానండీ నమస్తే" అని సెలవు తీసుకున్నాడు ఆయన.

" మంచిది నమస్తే"

' ఫోన్ ఇలా పెట్టారో లేదో మళ్ళీ ట్రింగ్....ట్రింగ్ .. విసుక్కొంటూ ఫోన్ తీసేడు రావుగారు. ఈ సారి అతనెవరో చెప్పకుండానే "కంగ్రాట్యూలేషన్స్ సర్ మీ పిక్చర్ మార్వలెస్, ఇన్నాళ్లకు ఈ తరానికి నచ్చే సరికొత్త తరహా కథ వ్రాసి మీరే డైరెక్ట్ చేసి మీరే నిర్మించిన మీ చిత్రానికి ఒకటే కలెక్షన్స్ సర్ తిరుగులేదు " అని చెప్పుకొంటూ పోతున్నాడు.

మధ్యలో ఆపి రావుగారు " థాంక్స్ ఇంతకీ మీరెవరో చెప్పనేలేదు " అన్నారు.

" సారీ సర్, మీ పిక్చర్ లోని హీరో అభిమానులమండీ..ఇక పైన మీరు నిర్మించే పిక్చర్స్ లో మా అభిమాన హీరో తో మీరే డైరెక్ట్ చేయాలని మా కోరిక."

" ఓ అలాగే తప్పకుండా " అని ఫోన్ పెట్టేసేరు రావుగారు.

"నమస్తే" అని వాళ్లు చెప్తున్నది వినిపించుకోలేదు. ........

" ఏమోయ్ మిసెస్ రావుగారూ ఎక్కడున్నారు ? " అని భార్యని పిలిచేరు రావుగారు.

" ఎంత డైరెక్టర్ నని మురిసిపోతేమాత్రం సెట్లో పిలిచినట్లు ఏమిటాపిలుపు? ఎత్తిపొడిచింది మాలతి. రావుగారి భార్య.

" అలవాటయిపోయిందోయ్ " అది సరేకాని చూసేవా? నేను వ్రాసిన కథలు, నా డైరెక్షన్ , నేను తీసిన సినిమాలు నీకు నచ్చవు. ఇప్పుడు చూడు ఒకటే ఫోన్ కాల్స్. పిక్చర్ సూపర్ హిట్ అని ఒకరంటే బ్రహ్మాండమైన డైరెక్షన్ అని మరొకరు, బ్యూటిఫుల్ స్టోరీ అని ఇంకొకరు . ఎక్కడ చూసినా హౌస్ ఫుల్... ఒకటే కలెక్షన్స్."

" చాల్లెండి సంబడం..."

రావచ్చునొ లేదో అని సంశయిస్తూ వస్తున్న గుర్నాధాన్ని " రావోయ్ గుర్నాధం చూసేవా ? నాకు ఇంట్లోనే అపోజిషన్ " అన్నారు రావుగారు.

" ప్రతి పొసిషన్ కీ ఓ అపోజిషన్ కూడా ఉంటుంది సార్" అన్నాడు గుర్నాధం.

" చూసేరా మీతో సహవాసం చేసి మన గుర్నాధానికి కూడ కవిత్వం వచ్చేస్తోంది" చురక అంటించింది రావుగారి భార్య.

" ఇంకేం నువ్వూ ఓ కథ వ్రాసి డైరెక్ట్ చేసి సినిమా తీసేయవోయ్ " అని సలహా ఇచ్చేరు రావుగారు గుర్నధానికి.

" మీదయ, అమ్మగారి చలవ ఉండాలే గాని అదెంత పనండీ ? మీరు నాకు డైరెక్షన్ ఇవ్వండి. అమ్మగారు డబ్బు సర్దుబాటు చేస్తారు. ఇంక నేను పిక్చర్ తీయడమే తరువాయి" .

" ఇలా మాట్లాడుకొంటుండగా రావుగారి అమ్మాయి జయ బయటనుండి వస్తూ "హాయ్ డాడీ కంగ్రాట్యులేషన్స్ ఫర్ ది గ్రేటెస్ట్ ఎచీవ్మెంట్. నీ పిక్చర్ అందులోనూ మొట్టమొదటిది సింప్లీ సుపర్బ్... జనం ఎగబడి పోతున్నారనుకో" అంటూ తండ్రి దగ్గరకు వచ్చి కూర్చుంది.

" థాంక్యూ బేబీ థాంక్యూ ! నువ్వొక్కర్తివే చాలు నాకు ఎంకరేజ్‌మెంట్ కి. విన్నావా గుర్నాధం! మీ అమ్మగారు నాకు ఎంత అపోజిషన్ అయినా అమ్మాయి గారు మాత్రం ఫుల్ సపోర్టు" అని చెప్తూ "బేబీ కమాన్! గెట్ రెడీ. టైమవుతుంది. 5 గం.లకు హోటల్ ఎవరెస్ట్ లో పార్టీ. ఆ తర్వాత సినీ పత్రిక విలేఖర్లతో సమావేశం. ఇదీ ఈ వేళ ప్రోగ్రాం" గుర్తు చేసేరు.

" మరి తొలి విజయం కదా ఘనంగా ఉంటుంది " అంటూ "ష్యూర్ డాడీ అయామ్ రెడీ. జస్ట్ వన్ మినిట్" అంటూ లోపలికి పరిగెత్తింది. గుర్నాధాన్ని అడిగేరు రావుగారు " నువ్వు సిద్దమేనా " అని. " నేనెవర్ రెడీ అండీ " అన్నాడు.

"మాలతీదేవి గారూ! ఎక్కండి మారుతీకారు " అంటూ పిలిచేరు రావుగారు.

"మీ రచయిత బుద్ది పోనిచ్చుకొన్నారు కాదు. పెళ్లాంతో మాట్లాడినా ప్రాస వదిలేలా లేరు . పదండి-పదండి, వచ్చేస్తున్నా. కాని ఒక్క షరతు".

"ఆ. అదేమిటో సెలవివ్వండి " అడిగేరు రావుగారు.

" కార్లో ఉన్న కాసేపయినా మీ కవిత్వం వెలగ బెట్టకుండా బుద్దిగా కూచుంటానంటేనే వస్తాను" కండిషన్ చెప్పింది.

" చిత్తం అలాగే దేవిగారి ఆజ్ణ తప్పుతుందా మరి " తలూపేరు రావుగారు. .........................................

పార్టీ తర్వాత పత్రికా విలేఖర్ల సమావేశంలో " మీ మొట్టమొదటి పిక్చర్ విజయవంతమైన సందర్భంగా "సినిమాలోకం ' పత్రిక తరపున మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగాలనుకొంటున్నాం. దయచేసి శ్రమ అనుకోకుండా చెప్తారా అని అడిగేరు.

"ఎంతమాట అడగండి ' అన్నారు రావుగారు.

" మొట్టమొదటి ప్రశ్న- మీ వెరీ ఫస్ట్ పిక్చర్ సక్సస్ కావడానికి నిర్మాతగా మీరు చేసినదేమిటి?" దానికి రావుగారు సమాధానం- "ఏముందండీ, వైద్యుడు రోగినాడి చూసి రోగం తెలుసుకుని దానికి మందు ఇచ్చినట్లు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి దానికి తగ్గ చిత్రాన్ని తీసేను"

" తొలి చిత్ర దర్శకత్వంలో ఘనంగా విజయం సాధించడంలో మీరు అవలంభించిన సూత్రాలేమిటి? కాస్త చెబుతారా ?" అని రెండో ప్రశ్నగా అడిగేరు.

"దర్శకత్వంలో గమనించవలసిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. మొదటిది దుస్తులు" అంటూ ఉండగా రావుగారి ప్రక్కనే కూచున్న జయను చూసి బైదిబై మీ అబ్బాయా సార్ ? అని అడిగేడు విలేఖరి.

" కాదు మా అమ్మాయి. నాకు మగపిల్లలు లేరు. ఆ ముచ్చటా తీరుతుంది.అదీ సరదా పడి అబ్బాయి డ్రస్ వేసుకుంటుంది " అని చెప్పగానే సారీ చెప్పేడు అతను.

"ఇట్సాల్ రైట్ తప్పేమీ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేదీ అదే. సినిమాలో హీరోయిన్ ని మగ డ్రస్ లో చూపించామనుకోండి. కొందరికి నచ్చుతుంది. పదహారణాల తెలుగు అమ్మాయిలా చూపించేమనుకోండి కొంతమందికి నచ్చుతుంది. అర్ధనగ్నంగా చూపించేమనుకోండి ఆల్ మోస్ట్ ఆల్ అందరికీ నచ్చుతుంది. ఇలా నేటి సినీ ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా ఒక్కో చోట ఒక్కోలా అందరి కోసం అన్ని రకాలుగా దుస్తులు ధరింపజేసేను. ఇకపోతే ఎక్కడో ఒక దగ్గర హీరోయిన్ దో లేక మరెవరిదైనా రేప్ సీన్ తప్పకుండా ఉండాలి. అలా ఉంటేనే రక్తి కడుతుంది. అదే సినిమాకి హార్ట్. అందులోనే ఉంది ఆర్ట్. అదికూడా కాస్త వివరముగా ప్రత్యక్ష ప్రసారంలా ఉంటేనే రీలు నిండుతుంది. మన జేబులు నిండుతాయి.డ్యూయెట్లు కూడా ఇంచుమించు వాటిలాగే తేడా తెలియకుండా ఉండాలి. క్లబ్ సాంగ్స్ ఎంత బూతువైతే అంత. క్లబ్ డాన్సులు ఎంత నగ్నంగా చూపిస్తే అంత పిక్చర్ కి హైలెట్స్. ముద్దులు చూపిస్తే మూటలే. కౌగిలింతలు చూపిస్తే కోట్లే"

" మరి మీరు రచయితగా కూడా రాణించడంలోని రహస్యం తెలుసుకోవచ్చా?"

"వెరీ సింపుల్. కథ , మాటలు, పాటలు అన్నీ నేను వ్రాసినవే. కథలో పెళ్ళికి ముందే ప్రేమలూ, పార్కుల్లో ప్రణయాలూ చూపించాలి. ఆ తర్వాత వీలుకాదు కాబట్టి ఇంక ప్రేక్షకుల చేత ఈలలు వేయించే డబుల్ మీనింగ్ డైలాగులు, కారుకూతల పాటలూ, పిచ్చిగంతుల డాన్సులు చూపిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవక ఏమౌతుంది చెప్పండి? అన్నారు రావుగారు. సినిమా తీయడంలోనూ ,డైరెక్ట్ చేయడంలోనూ కథ, మాటలు,పాటలు వ్రాయడంలోనూ తెలియని చిట్కాలెన్నో చెప్పినందుకు చాలా సంతోషించి రావుగారికి థాంక్స్ చెప్పి మరీ సెలవు తీసుకొన్నారు విలేఖర్లు. .....................

కొంపలంటుకు పోతున్నట్లు పిచిలిన భార్య పిలుపుకి గబగబా పరిగెత్తేరు రావుగారు. " ఏమిటోయ్ ఏమైంది? అంటూ కంగారు పడుతూ ఇంతా చూస్తే ఏమైందో అనుకొంటూ భయపడుతున్న రావుగారితో " మీరు ఈ సినిమా ప్రపంచంలో పడిపోయి ఇంటి సంగతేం పటించుకోవడంలేదు " . అని నేరారోపణ చేసింది ఆయన భార్య.

" అమ్మయ్య అంత గట్టిగా అరిస్తే ఇంకేమిటో అనుకొని హడలి చచ్చేను. ఏం... ఏం కావాలి నీకు ? ఏం తక్కువ చేసేనని? అన్నారు రావుగారు.

" ఇంకేం చేయాలి? మన అమ్మాయి గురించి ఎమైనా ఆలోచిస్తున్నారా?" నిలదీసింది.

" ఓహ్ అదా నీ బాధ" దాని పెళ్ళి గురించేనా నీవంటున్నది? దానికేం భాగ్యం? ఆకాశమంత పందిరి భూమాతంత మండపం చేసి నవ మన్మధుడి లాంటి పెళ్ళికొడుక్కిచ్చి చేసేద్దాం".

" ఏమండీ మన అమ్మాయి మీకా శ్రమ అక్కరేదంటుంది" అంది మాలతి.

" ఏం? "ఆశ్చర్యంగా అడిగారు రావుగారు.

" మీరు చేయక్కరలేదు.. అదే చేసుకొనేలా ఉంది అని చెప్పింది.

"ఏమిటా మాటలు ?" అని అడిగేరు రావుగారు.

"అవునండి.దాన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది". అనేసరికి " తల్లి కూతుర్ని అనవలసిన మాటలేనా?" అన్నారు .

కాని తండ్రి కూతుర్ని పెంచవలసిన తీరు ఇది కాదని చెప్పింది.

" నేనేం చేసేను ?" అని అడిగేరు .

" ఏం చేసేరో తెలీదా? అమ్మాయికి మీ చెత్త సినిమాలన్నీ చూపించడం, అవి చూసివచ్చి అది కథ అధ్భుతంగా ఉంది డైరక్షన్ అమోఘంగా ఉంది" అనడం.. దాంతో మీరు పొంగిపోయి ఉబ్బితబ్బిబ్బయిపోయి అది ఏమడిగితే అవి ఇచ్చేయడం , ఏది చెయ్యమంటే అది చేసేయడం, అంతేకాని అది ఎక్కడి కెళ్తుందో ఏం చేస్తుందో ఎప్పుడొస్తుందో పట్టించుకొంటున్నారా? ఒక్కసారైనా అడిగేరా? నేను అడిగితే మీ సినిమా పేర్లు చెప్పి తప్పించుకోవడం " అని భార్య చెప్తుండగానే నెత్తి బాదుకోవడం మొదలుపెట్టింది.

రావుగారికి అంతా అయోమయంగా ఉంది. "ఏమిటి? ఏమైంది? ఆ గోల కాస్త ఆపి ముందు అదేదో చెప్పి ఆ తర్వాత తీరిగ్గా కూచుని ఏడు " అన్నారు.

" ఏం బేబీ ఏమైంది ?" ఆత్రుతగా అడిగేరు.

" అదేం చెప్తుందండీ? నేను చెప్తాను వినండి అంటూ చెప్పడం మొదలుపెట్టింది మాలతి.

" మీరు దానికి వేయించిన మగ డ్రస్ ఎంతపని చేసిందో చూడండి. ఆ డ్రస్ లో ఎంతో సెక్సీగా ఉందని కాలేజీలో అనేవారట. అందుకని ఇది కూడా అలాగే వేసుకుని వెళ్లేదట. సినిమా హాల్లో దీని ప్రక్కనే కుర్రాళ్లొచ్చి కూచునేవారట. ఏమైనా అంటే సారీ జెంట్స్ అనుకున్నాం అనేవారట. మీ సినిమాలు చీసి తనను అందులో హీరోయిన్ లాగా తన చుట్టూ చేరే కుర్రాళ్లను హీరోలలాగా ఊహించుకొనేదట. అది గమనించిన ఓ కుర్రాడి చేతిలో బలైపోయిందండీ. మీ సినిమా కథల్లో లాగే పెళ్లికి ముందే అన్యాయం జరిగిపోయిందండి. ఈ అనర్ధానికి కారణం మీరు. మీ కథలకీ, మీ సినిమాలకో దండం. ఇకనైనా ఆ నీతిమాలిన కథలూ ప్రజల్ని వెర్రెక్కించే ఆ సినిమాలూ పాపండి. వాడెవడో తెలుసుకొని వాడికి దీన్నిచ్చి వెంటనే కట్టనెట్టే ప్రయత్నం చేయండి లేకపోతే నేను తలెత్తుకు తిరగలేను".

రావుగారికి ఇంత ఘోరం జరిగింది తన వల్లనే అని ఇప్పుడు తెలిసింది. ఇంక ఇలాంటి కథలు వ్రాసేదీ లేదు, సినిమాలు తీసేదీ లేదు, డైరెక్టు చేసేదీ లేదు అని నిర్ణయానికొచ్చేశారు. ఏదో కుర్రకారు పడి చస్తారు కదా అని ప్రేమకథలు వ్రాసేను గాని తన కూతురు అవి చూస్తుందని , వాటి ప్రభావం దాని మీద ఉంటుందనీ ఊహించలేకపోయేరు. డబుల్ మీనింగ్ డైలాగులూ , మత్తెక్కించే పాటలు , మైమరపించే డ్యూయెట్లూ , మతి పోగొట్టే క్లబ్ డ్యాన్సులు , అర్ధనగ్న అలంకరణలూ ప్రేక్షకులని ఆకట్టుకొంటాయనుకొన్నాను కాని ఆ ప్రేక్షకుల్లో నా కూతురూ ఉందన్న జ్ణాపకం లేకపోయింది. జనాన్ని వెర్రెక్కించడానికి తను చూపించిన రేప్ సీన్ లు , బెడ్రూం సీనులు తమ కూతురికి పాఠాలవుతాయనుకోలేదు. తన డైరెక్షన్ లోని సినిమాలు తన కూతుర్ని ఇలా చిత్రీకరిస్తాయని కలలో కూడా ఊహించలేదు.

" మీరు మీ కూతురి గురించే బాధపడుతున్నారు. కాని మీ సినిమాల వల్ల ఎంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారో ...నేరాలు చేసే దురాలోచన కల్గిస్తున్నారో, ఆ చేసిన నేరాల నుండి తప్పించుకొనే మార్గాల్ని ఓ ప్రక్క భోదిస్తూ ఆ నేరాల్ని సమర్ధించుకొనేలా నైతికంగా ఎలా దిగజారుస్తున్నారో మీరు ఇంకా తెలుసుకోలేదు" అన్న భార్య మాటలు నిజమేననిపించింది రావుగారికి. మన గుర్నాధం అన్నట్లు ఇటుపైన నేను నిదర రావుని కాదు " నిదరపట్టని రావుని " నా బేబీ నా నిదరని వదిలించింది. పరోక్షం గా నేను చేసిన తప్పులకు నా బేబీకి శిక్ష పడకూడదు. అనుకుంటూ గబ గబా బయటకు నడిచేరు రావుగారు.


" అందుకే ఏదైనా తనదాకే వస్తేనే గాని తెలియదు" అంది మాలతి. ( సమాప్తం )

( ఈ కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో “కార్మికుల కార్యక్రమం”లో తే.24.04.1993 దీని ప్రసారితమైంది. అమెరికాలోని తెలుగు అంతర్జాలపత్రిక “ వాస్తవం “ లో తే.14.03.2017 దీని ప్రచురితమైంది. “ఆఫ్ ప్రింట్ “ అంతర్జాలపత్రికలో తే.22.04.2017 దీని ప్రచురితమైంది. )

o

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం .

61 views0 comments

Comments


bottom of page