ఒకరికొకరు
ఒకరికొకరు, కుటుంబ కథ, భార్యాభర్తల అనుబంధం, వృద్ధాప్యం, తల్లిదండ్రులు, పిల్లలు, భావోద్వేగ కథ, తెలుగు కథ, నయన కస్తూరి

Okarikokaru - Telugu Emotional Family Story | Nayana kasthuri
ఒకరికొకరు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | నయన కస్తూరి
Published in manatelugukathalu.com on 26/07/2026
పిల్లలను ప్రేమగా పెంచి, ఉన్నత చదువులు చెప్పించి, జీవితంలో స్థిరపడేలా చేసిన తల్లిదండ్రులు... వృద్ధాప్యంలో వారిని చూడాలనే ఒక్క కోరికతో ఎదురు చూస్తుంటారు. కానీ పిల్లల బాధ్యతలు, ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు వారిని దూరం చేస్తాయి. అలాంటి సమయంలో చివరి వరకు ఒకరికొకరు తోడుగా నిలిచేది భార్యాభర్తల అనుబంధమే అని హృదయాన్ని హత్తుకునేలా చెప్పే కథే "ఒకరికొకరు".
"ఏవండీ, పిల్లలేమైనా ఫోన్ చేశారా, ఈ రోజు?" నీరసంగా అడిగారు రాజ్యలక్ష్మిగారు.
"రాత్రేకదా మాట్లాడింది? చేస్తారులే. కంగారుపడకు" అని భార్య అధైర్యపడకూడదని చెప్పారు భర్త రామనాథంగారు.
"ఎప్పుడు బయలుదేరుతారో తెలుస్తుంది కదా అని అడుగుతున్నానండీ!" అంది భార్య రాజ్యలక్ష్మి.
"వస్తారులే రాజ్యం! నిన్న రాత్రేకదా మనం చెప్పాము వాళ్లకి, నీకు ఒంట్లో బాగాలేదని? అంతలా కంగారుపడకు. కాస్త ఓపికపట్టు రాజ్యం" అని అనునయించారు రామనాథంగారు.
"ఓపిక పడుతూనే ఉన్నానండీ! చూసేవాళ్లకు ఏమి తెలుస్తుందండీ, పడేవాళ్ల బాధ? ఏ క్షణమైనా నా గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగా ఉంది. ప్రాణం పోయేలోగా పిల్లల్ని కళ్ళతో ఒకసారి చూసుకుందామని నా ఆశ. ఇలా ఆశపడటం నా తప్పంటారా? మీరే చెప్పండి!" అని భర్తను నిలదీసింది రాజ్యలక్ష్మి.
"తప్పేమీకాదు రాజ్యం! ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు కనిపెంచిన పిల్లల్ని రమ్మని పిలవడానికి తల్లిగా నీకు హక్కుంది. నేను పిల్లలతో ఈ రోజు మాట్లాడుతాలే" అని భార్యకు భరోసా ఇచ్చాడు రామనాథం.
రామనాథంగారు రిటైర్డ్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి. రాజ్యలక్ష్మిగారు ఆయనకు అనుకూలవతి అయిన భార్య. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ముగ్గురికీ మంచి చదువు-సంధ్యలు లభించాయి.
పెద్దకొడుకు పూనాలో మంచి ఉద్యోగం సంపాదించుకోగా, చిన్నకొడుకు బొంబాయిలో ఒక మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కూతురు కూడా బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరింది. ముగ్గురు పిల్లలకు మంచి మంచి సంబంధాలు చూసి, వివాహాలు చేసి, తమ బాధ్యతలను తీర్చుకున్నారు తల్లిదండ్రులు.
కోడళ్లు కూడా మంచి ఉద్యోగస్తులే. ముగ్గురు పిల్లలకు ఇద్దరేసి పిల్లలు పుట్టారు. విశాలమైన తమ స్వంత ఇంట్లో ఉంటూ, ఆయనకు పెన్షన్ సమృద్ధిగా వస్తుండటంతో దేనికీ లోటు లేకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వారి జీవితం వారు తృప్తిగా గడుపుకుంటున్నారు.
అలా రోజులు సాఫీగా సాగిపోతుండగా ఒక రాత్రి రాజ్యలక్ష్మిగారికి ఆకస్మాత్తుగా గుండెల్లో నొప్పి రాగా, ఆవిడను హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి, గుండెలో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి, వెంటనే స్టెంట్స్ వేయాలని, పిల్లలకు చెప్పి, వాళ్లు వచ్చేదాకా ఆగటానికి సమయం లేదని వెంటనే స్టెంట్స్ వేశారు.
ఎలాగూ స్టెంట్స్ వేయడం అయిపోయింది, అమ్మ బాగానే ఉంది తర్వాత వెళ్ళవచ్చని పిల్లలు ముగ్గురూ తల్లిని చూసే పనిని వాయిదా వేసుకున్నారు. కానీ రాజ్యలక్ష్మిగారికి ఉన్నట్టుండి బిపి, షుగరు పడిపోయి, నీరసపడిపోయి, ప్రాణం పోయేముందు ఎలాగైనా పిల్లల్ని ఒకసారి చూడాలని గట్టిగా పట్టుబట్టింది.
వాళ్లు తమ పిల్లలకు పరీక్షల సమయం కావడంచేత, ఆఫీస్ పనులతో తమకు సెలవులు దొరక్కపోవడం చేత రాజ్యలక్ష్మిగారిని చూడటానికి వెంటనే రాలేకపోయారు.
ఆరోజు రామనాథంగారు కొడుకులకు, కూతురికి అమ్మని చూడటానికి వెంటనే తప్పక రమ్మని చెప్పాలనుకున్నారు. ముందుగా పెద్ద కొడుకుతో చెప్పారు.
"మీరు అంతగా చెప్పాలా నాన్నా? అమ్మకి బాగాలేకపోతే నేను పరిగెత్తుకుని రానా? లీవ్ దొరకట్లేదు నాన్నా! ఈ నెలంతా నేను చాలా బిజీ!" కొడుకు సంజాయిషీ.
"పోనీలేరా! అమ్మ మిమ్మల్నీ, పిల్లలనీ చూడాలనుకుంటోందని అడిగానురా అంతే!" నాన్న చెప్పిన కారణం.
"వచ్చేనెల సెలవు దొరకగానే తప్పక వస్తా నాన్నా!" అని కొడుకు చెప్తుంటే "అమ్మో, మీరు వెళ్తే నేనొక్కర్తిని ఆఫీసుకెళ్తూ పిల్లల్ని చూసుకోలేను బాబోయ్!" అన్న కోడలి మాటలు వెనుకనుండి రామనాథంగారికి వినిపించి, "అలాగేలేరా, అబ్బాయీ! చూద్దాములే, అప్పటి సంగతి" అని ఫోన్ పెట్టేశారు.
భార్యకి అన్నం పెట్టిన తర్వాత వెయ్యవలసిన మందులు వేసి, పడుకోమని చెప్పి, చిన్న కొడుకుతో మాట్లాడారు. ఆనాడు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. కోడలు పిల్లల్ని గట్టిగా చదివిస్తోంది.
"చిన్నా! ఎప్పుడు బయలుదేరుతారురా? మీ కోసం అమ్మ ఎంతగానో ఎదురుచూస్తోందిరా" అన్న నాన్నతో, "నిన్ననే బయలుదేరుదామనుకున్నా నాన్నా! కానీ అనుకోకుండా తనకి క్యాంపు పడింది! పిల్లల్ని వదిలి రావడం కష్టం కదా? తను వచ్చాక వస్తాను నాన్నా! అమ్మకెలా ఉంది ఇప్పుడు?" అడిగాడు చిన్నా.
"కోడలు క్యాంపు కెళ్ళలేదని, ఇంట్లోనే ఉందని నాకు తెలుసులేరా చిన్నోడా!" అనుకుని, "సరేలేరా నీకు, కోడలుకి వీలైనప్పుడే రండి" అని చెప్పి, ఫోన్ పెట్టేశాడు.
గదిలోకి వెళ్లి భార్య ఏమిచేస్తోందో చూశాడు. నిద్రపోతోంది. "పోనీలే! పడుకుంది. అది లేచేలోగా కూతుర్ని కూడా అడుగుతాను. అది ఏమంటుందో చూద్దాము. కనీసం కూతురైనా వస్తానంటే రాజ్యం సంతోషిస్తుంది" అనుకుంటూ కూతురికి ఫోన్ చేసి, "అమ్మకేమీ బాగాలేదమ్మా! వీలైనంత తొందరగా రా తల్లీ! అమ్మ సంతోషిస్తుంది" అని పిలిచాడు.
"నాకూ అమ్మని చూడాలనే ఉంది నాన్నా! కానీ నిన్ననే మా అత్తగారు వచ్చారు. ఆవిడకి కూడా ఒంట్లో అంత బాగుండలేదు. ఆవిడని ఒక్కర్తిని ఇంట్లో వదిలి రాలేను. అలా వాళ్ళమ్మని వదిలేసి వెళ్తే మా ఆయన ఫీల్ అవుతారు, బాగుండదు. అందుకని ఇప్పుడు రాలేను. అత్తయ్య వెళ్ళాక వస్తా నాన్నా!" అంది కూతురు.
"సరేనమ్మా, మీ అత్తగారు ఉన్నప్పుడు వదిలేసి రావడం పద్ధతి కాదులే! వీలైనప్పుడే వద్దువుగాని" అని, ప్రొద్దుటే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరు నుండి రాజ్యంతోటి, తనతో ఫోన్లో మాట్లాడి, రాజ్యం ఆరోగ్యం గురించి అడగటం గుర్తుకు వచ్చి, "ఆహా, రాజ్యం! మన పిల్లలు ముగ్గురూ ముగ్గురేనే!" అని అనుకున్నారు మనసులో.
కానీ వెంటనే తన భార్య ఆశించిన దాంట్లో తప్పేమీ లేదు. అలాగని తమ పిల్లలు ప్రవర్తించిన తీరూ క్షమించరాని నేరమనడానికీ లేదు. వాళ్ళ జీవితాలు వాళ్లవి. వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లలు, వాళ్ళ చదువులు చూసుకోవాలి మొదటిగా! అని ఆయన గ్రహించారు.
సాయంకాలం భార్యను లేపి, ఒక గ్లాసులో పాలు పోసి, అందులో ప్రోటీన్ పౌడర్ వేసి కలిపి ఇచ్చాడు.
"అయ్యో నేను మీకు చెయ్యాల్సిందే పోయి, ఈ వయసులో మీ చేత చేయించుకుంటున్నాను. ఏవండీ నన్ను క్షమించండీ!" నొచ్చుకుంది రాజ్యలక్ష్మి.
"చాల్లే నీ మాటలు రాజ్యం! నేను కాకపోతే ఎవరు చేస్తారే నీకు? రేపు నాకేదైనా వస్తే నువ్వు చెయ్యవా ఏమిటీ?" ప్రశ్నించారు రామనాథంగారు.
"అయ్యో ఆ మాటనకండి! మీకేమీ రాకూడదు. మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి" అంది తన చేతితో సున్నితంగా ఆయన నోటిని మూస్తూ.
ఆయన చిరునవ్వుతో "ఏమీ రాదులేవే! మనకి ఏమొచ్చినా ఒకరికి ఒకరం ఉంటాము. నీకు నేనూ, నాకు నువ్వూ! సరేనా? పిల్లలు.... వాళ్ళకి వీలైనప్పుడు వస్తారు, కానప్పుడు వెళ్తారు. వచ్చినప్పుడు సరదాగా కలిసి ఉందాము.
వాళ్ళు వెళ్లేటప్పుడు సంతోషంగా పంపుదాము. వాళ్ళ మీద బెంగపెట్టుకోకు. వాళ్ళ జీవితాలకి మనం అడ్డు కాకూడదు. సరేనా? మన భార్యాభర్తల బంధం మన చివరిదాకా మనకి తోడుగా ఉంటుంది" అని భార్య రాజ్యలక్ష్మికి విశదీకరించాడు భర్త రామనాథం.
"సరేనండీ! మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా చెప్పండి" భర్త మాటకు అంగీకరించింది భార్య.
------సమాప్తం------
నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:
నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నయన కస్తూరి
నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలు రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.










Excellent story
Emotional story
పెద్ద వయసులో, ఆరోగ్యం సహకరించనప్పుడు, పిల్లలు తమవద్ద ఉండాలని కోరుకోవడం సహజం. కానీ వాళ్ళ జీవన సమరంలో ఎదురయ్యే సవాళ్లతో వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ధైర్యంగా ఒకళ్ళకి ఒకళ్ళు చివరి వరకు తోడుగా ఉండటం సమంజసం అని చక్కగా చెప్పేరు నయనగారు.చక్కని కథ.