పచ్చదనం
- Veluri Sarada

- 3 hours ago
- 3 min read

Pachhadanam - Telugu Inspirational Story | Mayukha
పచ్చదనం - తెలుగు ప్రేరణాత్మక కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 28/04/2026
కిరణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పుడో కొన్న స్థలంలో నాలుగు గదుల డాబా కట్టాడు. ముందువైపు అంతా ఖాళీ స్థలం వదిలేశాడు. అక్కడ చిన్నచిన్న గదులు కట్టి అద్దెకి ఇవ్వాలని అతని ఆలోచన.
కిరణ్ ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాస్ ముందువైపు చిన్నచిన్న గదులు కట్టి అద్దెకి ఇచ్చేశాడు. నెలకు 10,000 అద్దె వస్తోంది. అది చూసిన తర్వాతే కిరణ్‌కు కూడా ఆ ఆలోచన వచ్చింది.
***
ఒకరోజు మిట్టమధ్యాహ్నం కిరణ్ ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఎక్కడా చిన్నపాటి నీడ కూడా లేకపోయింది. కాలనీ అంతా 'కాంక్రీట్ జంగిల్' అయిపోయింది. కిరణ్ చాలా అలసిపోయి చెట్టు నీడ కోసం చూశాడు. ఎక్కడా నిలువ నీడ లేకపోవడంతో ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చేసాడు.
రాత్రి భోజనం చేస్తూ భార్య సరోజతో ఇలా అన్నాడు: "మనం ముందువైపు గదులు కట్టట్లేదు."
"ఎందుకండీ? 10,000 అద్దెలు వస్తాయి కదా! ఎందుకు వద్దంటున్నారు?"
"ఎందుకంటే మనం డబ్బుల కోసం పరుగు పెడుతున్నాం, కానీ ముందుముందు గాలి కోసం, నిలువ నీడ కోసం క్యూలో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది."
"అదేంటి? గాలి కోసం, నీడ కోసం నిలబడాలా? మరీ చెబుతారు!"
"కరోనా సమయంలో గుర్తుందా! ఆక్సిజన్ సిలిండర్ల కోసం అందరూ పరుగులు పెట్టారు. స్వచ్ఛమైన గాలి లేక, చెట్లు నరికి గాలిని కలుషితం చేశాం. అందుకే ముందువైపు గదులు కట్టకుండా మొక్కలు పెంచుతాను. స్వచ్ఛమైన గాలిని అందరం పీల్చుకోవచ్చు," అన్నాడు.
సరోజ మాట్లాడలేదు. దీన్ని ఎలా ఆపుదామా అని చూస్తోంది.
***
మర్నాడు ఉదయం నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి కిరణ్ ముందువైపు స్థలంలో నాటాడు. సరోజ ముందే చెప్పడంతో పక్కింటి శ్రీనివాస్ వచ్చి,
"ఒరేయ్! ఎందుకురా ఈ పిచ్చి పని? హాయిగా నెలకు 10,000 వస్తుంటే దాన్ని వదులుకుంటావా? నేను మంచి మేస్త్రీని చూస్తాను, గదులు కట్టేయ్!" అన్నాడు శ్రీనివాస్.
"లేదురా, నా అభిప్రాయం మారదు," అన్నాడు క్లుప్తంగా.
చేసేదేమీ లేక శ్రీనివాస్ వెళ్ళిపోయాడు.
మొక్కలు కొద్దికాలంలోనే పెరిగి పెద్దవయ్యాయి. వాటి మీద పక్షులు వాలి, పక్షుల కిలకిల రావాలతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది.
కిరణ్ పిల్లలు ఇద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి తమ తోట చూపిస్తున్నారు.
శ్రీనివాస్ పిల్లలు కూడా వచ్చి, "అంకుల్! మేము కూడా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చా?" అన్నారు.
"ఓ ష్యూర్! తప్పనిసరిగా రండి. మీ పిల్లలందరూ ఆడుకుంటారనే ఇలా ఏర్పాటు చేశాను," అన్నాడు కిరణ్.
తోట మధ్యలో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశాడు. సరోజ ముందు గొణగింది కానీ, అందరూ తమ తోటను ప్రశంసిస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉంది.
ఒకరోజు మధ్యాహ్నం కరెంటు పోతే కిరణ్ కుటుంబం అంతా తోటలో సేద తీరింది.
శ్రీనివాస్ వేడికి తాళలేక, గాలి లేక ఉసూరుమంటూ ఇంట్లోనే కూర్చున్నాడు. తను ఎంత తప్పు చేశాడో అప్పుడు తెలుసుకున్నాడు.
ఈ పచ్చదనాన్ని చూసి కాలనీ అసోసియేషన్ వారు "ఇంటికి ఐదు చెట్లు" చొప్పున పథకం పెట్టి అందరూ నాటాలి అనడంతో, కొద్దికాలంలోనే ఆ కాలనీ అంతా 'గ్రీనరీ'గా మారి కనులకు ఎంతో ఇంపుగా ఉంది. కాలనీలో ఖాళీ ప్రదేశాలన్నీ పచ్చని చెట్లతో నిండిపోతున్నాయి. కాలనీవాసులందరూ ఇంతటి మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన కిరణ్‌కు సన్మానం చేశారు. కిరణ్ మాట్లాడుతూ, "నేను కూడా ముందు అందరిలాగే ఆలోచించి ఇంటి ముందు గదులు కట్టాలని అనుకున్నాను. కానీ ఒకరోజు ఎండలో వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన చెట్లు లేక, నిలువ నీడ లేక చాలా అవస్థ పడ్డాను. మన నగరం అంతా 'కాంక్రీట్ జంగిల్'లా అయిపోతోంది. అందుకే మార్పు తేవాలనే ఉద్దేశంతో మా ఇంటి నుంచే మొక్కలు పెంచడం జరిగింది."
"ప్రభుత్వం మొక్కల పెంపకానికి మొక్కలను ఇచ్చినా మనం వాటిని నిర్లక్ష్యం చేసి వదిలేస్తున్నాం. కొంతమంది ధనవంతులు స్వచ్ఛమైన గాలి అందక ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం వేసిన విత్తనమే భావితరాలకు వృక్షమై చల్లని నీడనిస్తుంది. పర్యావరణ సమతౌల్యానికి చెట్లు కూడా ఒక భాగమే! ఒక విత్తనం నాటితే అది చెట్టు అవుతుంది; అదే ఒక ఆలోచనను స్ఫురింపజేస్తే అది భావితరాలను మార్చేస్తుంది," అన్నాడు హర్షధ్వానాల మధ్య కిరణ్.
వాతావరణ సమతౌల్యానికి మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
******శుభం *******
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.









Comments