top of page

పంచ “పండు “ లు

Updated: May 30, 2023


'Pancha Pandulu' - New Telugu Story written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

'పంచ పండులు' తెలుగు కథ


పంచ పండులు పేరు చెప్పగానే పెనుగొండ ప్రజలు అందరూ ఒక్కసారి ఉలిక్కిపడతారు.

“అమ్మో, ఆళ్లా..చిచ్చర పిడుగులండి బాబూ” అంటాడు లింగాల వీధి వీర్రాఘవులు నాయుడు.


“ఆళ్లు లేకపోతే ఏ సంబరానికైనా హుషారు ఉండదయ్యా” అంటాడు అబ్బీసురెడ్డి.

“హుషారా, గాడిదగుడ్డా? ఆ ఐదుగురి అల్లరి భరించలేమయ్యా” అంటాడు షాహుకారు చంటి.


ఎందుకంటే ఐదేళ్ళక్రితం శ్రీరామనవమి కి ఐదు వీశెల బెల్లం పట్టుకెళ్ళి ఇంతవరకూ డబ్బులు ఇవ్వలేదని అతని బాధ. ఎప్పుడు డబ్బులు అడిగినా ‘రాములోరి ఖాతాలో రాసుకో. ఏదోరోజున ఆయన వచ్చి నీ బాకీ తీరుస్తాడు’ అని వెటకారంగా అన్న జామ్పండు గాడిని చూస్తే వళ్ళు మండిపోతుంది చంటికి. పండుగాళ్ళు బెల్లం పట్టుకెళ్ళిన సంగతి నాయుడికి, రెడ్డికి కూడా తెలుసు. అది గుర్తుకొచ్చి ఇద్దరూ నవ్వుకుంటారు.


మా ఊళ్ళో జమా జేట్టీల్లాంటి ఐదుగురు కుర్రాళ్ళు వున్నారు.


వాళ్ళే సత్యనారాయణ, సూర్యనారాయణ, జనార్ధన్, పాపారావు, రామారావు. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని ‘పండూ’ అని పిలుస్తారు.


అలా వాళ్ళు సత్తిపండు, సూరిపండు, జాంపండు, పనసపండు,రాంపండు గా మారిపోయారు.


అయితే వాళ్ళలో పనసపండు గాడు సినిమా యాక్టర్ రమణారెడ్డి లా ఉంటాడు.

చిన్నప్పుడు బొద్దుగా ఉండేవాడు. పెద్దయ్యాక మనిషి చిక్కిపోయాడు. ‘మా వాడికి చదువు ఎక్కువై వేడిచేసి ఇలా అయిపోయిం'దంటాడు వాళ్ళ నాన్న వెంకటరావు. జాంపండు గాడు చిన్నప్పుడు పచ్చగా, బక్కగా ఉండేవాడు. ఎలిమెంటరీ చదువు అయ్యాక మనిషి బొద్దుగా, రేలంగిలా తయారయ్యాడు.


’మా వాడికి మార్టేరు సుందరరామయ్య గారి దగ్గర హోమియో మందు వాడాక కండ పట్టాడు’ అంటాడు వాళ్ళ నాన్న సత్యానందం.


‘మార్టేరు హోమియో మందు కాదు, మార్టేరులో కోడి పకోడీలు తినడం మొదలెట్టాక జాంపండు గాడు బలిసాడు’ అని అక్కసుగాఅంటాడు సత్యానందం ఇంటిపక్కన ఉండే భూషణం.


వాళ్ళు ఇద్దరికీ ఒక్క రోజు కూడా పడదు. ప్రతి చిన్నవిషయానికీ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. ఆ వీధిలో వాళ్లకు రోజూ అదొక ఉచిత సినిమా.


బజారులో జరిగే గణపతి నవరాత్రులు, దసరా సంబరాలు, కాలవ గట్టున జరిగే షష్ఠితీర్థం, లింగాలవీధిలో జరిగే భావన్నారాయణ ఉత్సవాలు, సంతమార్కెట్లో జరిగే

శ్రీరామనవమి ఉత్సవాలు అన్నీ చోట్లా మన ‘పంచ పండులు’ ఉంటారు. హడావిడి చేస్తారు.


బొడ్డు వారి కొట్టు ఎదురుగా ఉన్న పీర్ల పంజా దగ్గర జరిగే ముస్లింల పండగలకు, సిద్ధాంతం రోడ్ లో ఉన్న చర్చిలో జరిగే క్రిస్ మస్ పండుగులకూ మన వాళ్ళు వెళ్తారు. వాళ్లకి మత బేధాలు లేవు. అందరూ ఒకటే. అందరికీ సాయం చేయాలి.

అదీ వాళ్ళ పాలసీ.


ఇంతకీ వీళ్ళు ఏం చదువుతున్నారంటే, జమీందారు గారి హై స్కూల్ లో పదవతరగతి చదువు తున్నారు. వచ్చే ఏడు పదకొండో తరగతికి వస్తారు. లింగాలవీధిలో ఉన్న గున్నయ్య మాస్టారి ఎలిమెంటరీ స్కూల్ లో ఐదవతరగతి చదివేటప్పుడే వీళ్ళ వీరగాధలు వెలుగులోకి వచ్చాయి. కాలవఅవతల ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న తుమ్మచెట్ల నుంచి జిగురు తెచ్చి ఆడపిల్లలు కూర్చేనే నేలబల్లల మీద రాయడం, బల్లల మీద కూర్చున్న ఆడపిల్లల బట్టలకు తుమ్మజిగురు అంటుకోవడం, వాళ్ళు కెవ్వు మని

అరవడం, విషయం తెలుసుకున్న గున్నయ్య మాస్టారు ‘ఐదుగురు పండు’లకు బడితె పూజ చేయడం చాలా వేగంగా జరిగిపోయాయి.


సాయంత్రం ఇంటికి వెళ్ళాకా ఐదుగురు వీరులకు వాళ్ళ తల్లితండ్రులు మరోమారు దేహశుద్ధి చేయడంతో ‘ఇంక భవిష్యత్తులో ఆడపిల్లల జోలికి వెళ్లకూడదని’ గట్టిగా నిర్ణయించుకున్నారు.


కానీ కుక్కబుద్ధి, ఎలా మారుతుంది? మారదు గాక మారదు. పండుగాళ్ళు ఐదుగురు ఎనిమిదో తరగతిలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. బజారులోని పెద షావుకారి కూతురు ఎనిమిదో తరగతిలో చేరింది. అదీ మన పండుగాళ్ళు ఉన్న సెక్షన్లో. అంతే. ఐదుగురిలోనూ గొప్ప మార్పు వచ్చింది. ఆ బంగారు బొమ్మ దృష్టిలో పడాలని నానా పాట్లు పడ్డారు. రోజూ రెండు సార్లు లక్స్ సబ్బుతో మొహం రుద్దారు. వాళ్ళ చెల్లెళ్ళు వాడుకునే ‘జాలీ’ పేస్ పౌడర్ దొంగతనంగా కాగితంలో పొట్లం కట్టి తెచ్చుకుని, స్కూల్ గ్రౌండ్ లోకి వెళ్లి మొహానికి రాసుకునేవారు.


అందరిలోకి చురుగ్గా ఉండే ‘పనసపండు’గాడు ఒకరోజు సుహాసిని దగ్గరకు వెళ్లి

‘నా పెన్సిల్ మొన విరిగిపోయింది. నీ పెన్సిల్ ఒకసారి ఇవ్వవా? సైన్సు బొమ్మ వేసుకుని ఇచ్చేస్తాను’ అని అన్నాడు.


సుహాసిని వాడికేసి చిరాగ్గా చూసి ‘మీ బెంచీలో ఎవరి దగ్గరా పెన్సిల్ లేదా? నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావ్?’ అంది.


పనసపండు గాడు అమాయకచక్రవర్తి లా మొహం పెట్టి ’మా వాళ్ళు ఎవరిదగ్గరా పెన్సిల్ లేదు. సరస్వతి తోడు’ అని కుడిచెయ్యి నెత్తిమీద పెట్టుకుని ప్రమాణం చేసాడు. సుహాసిని ఒక్క క్షణం ఆలోచించి, కంపాస్ బాక్స్ లోంచి పెన్సిల్ చెక్కుకునే బర్మా తీసి వాడికిచ్చి ‘పెన్సిల్ చెక్కుకుని మళ్ళీ పట్టుకురా’ అని చెప్పింది.


అలాగే అని బుద్ధిగా పెన్సిల్ చెక్కుకుని, తిరిగి బర్మా సుహాసినికి ఇచ్చాడు పనసపండు. మిత్రబృందం వాడ్ని హీరోగా చూసారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సైన్సు మాస్టారు నేమాని శాస్త్రి గారు క్లాసు లోకి రాగానే అసిస్టెంట్ లీడర్ కామాక్షి, మాస్టారు దగ్గరకు వెళ్లి పనసపండు సుహాసిని దగ్గరకు వచ్చి వెళ్ళిన సంగతి చెప్పింది.


నేమాని శాస్త్రిగారు పనసపండు బెంచీ దగ్గరకు వచ్చి అందరి కంపాస్ బాక్స్ లు చెక్ చేసారు. మిగతా నలుగురు దగ్గరా పెన్సిళ్ళు ఉన్నాయి. వెంటనే బెత్తం తీసుకుని పనసపండు ని నాలుగు వడ్డించి ‘ఆడపిల్లల దగ్గరకు వెళ్లి వెకిలి వేషాలేస్తే చర్మం వలిచి చెప్పులు కుట్టేస్తాను’ అని వార్నింగ్ ఇచ్చి గోడకుర్చీ వేయించారు.


పనసపండుకి జరిగిన అవమానానికి మిగతా నలుగురు ‘పండు’లకు కోపం వచ్చింది. కామాక్షికి ఎలా బుద్ధి చెప్పాలా? అని ఆలోచించి ఒక ప్లాన్ వేసారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో ఆడపిల్లలు అందరూ బయటకు వెళ్ళినప్పుడు జాంపండు గాడు ‘దురదగుండ’ ఆకు తెచ్చి కామాక్షి పుస్తకాల సంచిలో పెట్టాడు. తర్వాత కామాక్షి వచ్చి పుస్తకాల సంచీలో చెయ్యిపెట్టి సోషల్ పుస్తకం తీసుకుంది. కానీ చెయ్యి అంతా దురదగా ఉండి, గోక్కోవడం మొదలుపెట్టింది. కాసేపటికి అర్ధం అయ్యింది ఎవరో తన సంచీలో దురదగుండ ఆకు పెట్టారని. సోషల్ మాస్టారు సీతారామరావు గారికి చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది కామాక్షి. డ్రిల్ మాస్టారు గదిలో కొబ్బరినూనె ఉంటుంది రాసుకోమని చెప్పి, ఆమెని ఇంటికి పంపేసారు.


ముందు జాగ్రత్తగా పనసపండు మధ్యాహ్నం బడికి రాలేదు. ఎవరు ఈ పని చేసారో కనిపెట్టలేక పోయారు సోషల్ మాస్టారు. సుహాసిని దృష్టిలో పడాలన్న ‘భావన’ పంచపండులలో బలంగా నాటుకుపోయింది. ఉదయం వందే మాతరం ప్రార్థన పాడేటప్పుడు, ఈ ఐదుగురు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ‘సుహాసిని సుమధురభాషిణీ’ అని అందరూ పాడుతున్నప్పుడు, మన పంచపండులు ‘సుహాసిని’ అని గట్టిగా అనేవారు. ఐదువందల మంది విద్యార్ధినీ, విద్యార్ధులలో ఎవరు అలా గట్టిగా అన్నారో తెలిసేది కాదు. కానీ మర్నాడు కూడా ‘సుహాసిని’ అని గట్టిగా వినిపించేసరికి హెడ్ మాస్టారికి అనుమానం వచ్చింది.


మూడోరోజు ఈ గట్టిసౌండ్ ఎనిమిదోతరగతి విద్యార్ధుల నుంచి వస్తోందని డ్రిల్ మాస్టారు తాతారెడ్డి కనిపెట్టి హెడ్ మాస్టార్ కి చెప్పారు. నాల్గోరోజు ఇద్దరు డ్రిల్ మాస్టార్లు, మరో ఇద్దరు స్కౌట్ మాస్టార్లు కాపు కాసి , పంచపండుల్ని పట్టేశారు. ప్రార్థన పూర్తి అయ్యి అందరూ క్లాసుల్లోకి వెళ్ళగానే సత్తిపండు, సూరిపండు, జాంపండు, పనసపండు, రాంపండు లను హెడ్ మాస్టర్ గదిలోకి తీసుకెళ్ళారు మాస్టర్లు. ఒక్కొక్కరికి పది బెత్తం దెబ్బలు, వంద గుంజీలు బహుమానంగా ఇచ్చారు హెడ్ మాస్టారు.


బడిలో అల్లరి చేస్తున్నా ఇళ్ళ దగ్గర మాత్రం చుట్టుపక్కల వారికి సాయంగా ఉంటున్నారు పంచ పండులు. కన్యకాపరమేశ్వరి గుడి పక్కనే ఉండే రత్తమ్మ మామ్మ గారి నూతిలో బకెట్ పడిపోతే ఆవిడ పనసపండు గాడినే పిలిచేది. వాడు వచ్చి గేలం వేసి ఐదు నిముషాలలో బకెట్ పైకి తీసేవాడు. ఒకోసారి నూతి గట్టుమీద పెట్టుకున్న దేవుడి పూజాసామగ్రి , గంట, చిన్నరాగిపళ్ళెం, ఇత్తడి కుంది నూతిలో పడిపోయేవి. అప్పుడు కూడా పనసపండు, జాంపండు గాడిని తోడు తీసుకుని వచ్చి నూతిలోకి దిగి రత్తమ్మ మామ్మ గారి పూజాసామగ్రి వెతికి తెచ్చేవాడు.


జాంపండు, పెద్ద పగ్గం మామిడిచెట్టుకు కట్టి రెండో కొస నూతిలోకి వదిలేవాడు. పనసపండు ఆ తాడు పట్టుకుని నూతిలోకి దిగేవాడు. పని పూర్తి అయ్యాక తాడు పట్టుకుని పైకి వచ్చేవాడు. ముందుజాగ్రత్తగా జాంపండు, రత్తమ్మ మామ్మగారు కూడా తాడుపట్టుకునే ఉండేవారు. ఆ వీధిలో ఎవరి నూతిలో బకెట్ పడిపోయినా పనసపండు గాడి చేయూత తప్పనిసరిగా ఉండేది.


జనార్ధనస్వామి గుడి ముందున్న గోపాలం మాస్టారి దొడ్లో అరటిచెట్ల గెలలకు, గోనె సంచులు కట్టాలంటే ఆయన రాంపండు గాడినే పిలిచేవారు. వాడు సూరిపండు గాడిని

తోడుతీసుకుని మాస్టారి ఇంటికి వచ్చేవాడు. సూరిపండు నిచ్చెన పట్టుకుంటే, రాంపండు నిచ్చెన ఎక్కి అరటి గెలలకు సంచులు కట్టేవాడు. ఒకసారి కోతులు వచ్చి రెండు గెలల అరటికాయలు తినేశాయి.అప్పటినుంచి మాస్టారు ముందుచూపుతో గెలలకు సంచులు కట్టిస్తున్నారు. అరటిపళ్ళు మగ్గాక, మొదటి అత్తం జనార్ధనస్వామి గుడిలో ఇచ్చేవారు. తర్వాత వీళ్ళు ఇద్దరికీ చెరో రెండు పళ్ళు ఇచ్చేవారు. రాంపండు “మాస్టారూ ఇంకో అరటిపండు ఇవ్వరా?” అని అడిగేవాడు.


‘ఎందుకు? ఇంటికి పట్టుకెళ్తావా?’ అడిగారు మాస్టారు. చిన్నగా నవ్వుతూ ”మేం ఐదుగురు స్నేహితులం అండి. మీరు ఇంకో పండు ఇస్తే ఇదుగురం తలోటి తింటామండి”

అన్నాడు రాంపండు.


గోపాలం మాస్టారు భార్య, రాఘవమ్మ గారు ‘పిల్లడు ఇంకో పండు అడిగితే అన్ని ప్రశ్నలు ఎందుకు?” అని భర్తని విసుక్కుని లోపలకు వెళ్లి ఒక అరటిపండు తెచ్చి ఇచ్చేవారు. ఏది దొరికినా ఐదుగురు సమానంగా తీసుకునేవారు ‘పంచపండులు’.


లింగాలవీధిలో, కొవ్వూరివారి వీధిలో ఎవరికి హోమియో మందులు కావల్సినా సత్తిపండు, మార్టేరు గణపతి హోమియో స్టోర్స్ కి వెళ్లి మందులు తెచ్చేవాడు. అప్పుడప్పుడు పనసపండు ని సైకిల్ మీద తోడు తీసుకువెళ్ళేవాడు. ఒక వేసవికాలం రోజుల్లో, వెండ్ర వారివీధిలో గౌరమ్మ పశువుల పాకకు నిప్పు అంటుకుంది. కామాక్షిగుడి ముందు కూర్చుని ‘పులీ మేక’ ఆడుతున్న పంచపండులు అదిచూసి గబా గబా వెళ్లి పాకలోంచి గేదెలను బయటకు తీసుకువచ్చారు. తర్వాత ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు పోసి మంటలు ఆర్పారు.గౌరమ్మ మొగుడు శంకరం, చెల్లెలు ఇంటికి పాలకొల్లు వెళ్ళాడు. సమయానికి వచ్చి పశువుల్ని కాపాడారని ఆ వీధిలో వాళ్ళు అందరూ మిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.

******

పంచ పండులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు బాగా రాసారు. ఆ ఆనందాన్ని గుర్తుగా ఉంచుకోవాలని మినర్వా టాకీసులో కృష్ణ నటించిన ‘గూడచారి నూటపదహారు’ సినిమాకు రెండో ఆటకు వెళ్ళారు. ఎనిమిదో తరగతి వరకూ నేల టికెట్టు కి వెళ్ళే వాళ్ళు.


తొమ్మిదో తరగతినుండి బెంచీ టికెట్టుకి వెళ్తున్నారు ఐదుగురు. ప్రతీ పాటకు జాంపండు గాడు, పనసపండు గాడు ఖయ్యి మని ఈలలు వేసి ఆనందపడ్డారు. మిగతా ముగ్గురికి ఈలలు వేయడం రాదు. ఇంట్రవెల్ లో చల్లారిపోయిన మసాలావడలు తిన్నారు. వంటిగంటకు సినిమా వదిలాక కాలవగట్టు రోడ్ మీద నడుచుకుంటూ వచ్చి పెద్ద వంతెన కింద ఉన్న గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రిజల్ట్స్ వచ్చాకా ఎవరు ఎక్కడ కాలేజీలో చేరతారన్న ప్రశ్న వచ్చింది.


“నేను తణుకు కాలేజీలో చేరతాను. మా మావయ్య ఇంటిదగ్గర ఉండి చదువుకుంటాను. మా అమ్మ, మా మావయ్యతో మాట్లాడింది. ఆయన సరే అన్నాడు.మరి నువ్వు ?” పనసపండు ని అడిగాడు జాంపండు.


“నేను నర్సాపురం లో చేరతాను. మా పెదనాన్న టేలర్ హై స్కూల్ లో టీచర్. వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను” అన్నాడు పనసపండు. సత్తిపండు,సూరిపండు భీమవరం కాలేజీ లో చేరతామన్నారు.


రాంపండు ఎక్కడా చేరనని, తనకి దగ్గరి ఊళ్లలో చుట్టాలు ఎవరూ లేరని, హాస్టల్ లో ఉండి చదువుకునే స్తోమతు లేదని చెప్పాడు. మిగతా నలుగురూ కాసేపు బాధపడ్డారు రాంపండు కాలేజీ లో చేరడం లేదని.


తర్వాత టాపిక్ మళ్ళీ ‘గూడచారి’ సినిమా మీదకు మళ్ళింది. కృష్ణ యాక్షన్ బాగా చేసాడని ఐదుగురూ తీర్మానించారు. రేలంగి, రమణారెడ్డి ల హాస్యం గురించి మాట్లాడుకున్నారు.


ఇంతలో వంతెన మీద నుంచి ఎవరో ‘దభీ’ మని కాలవలో పడిన శబ్దం అయ్యింది.

అందరూ ఉలిక్కి పడ్డారు. “వొరేయ్, ఎవరో మనిషి ములిగిపోతోందిరా” అని సత్తిపండు కాలవలో దూకేసాడు. వాడి వెనకే రాంపండు దూకేసాడు. ఇద్దరూ ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న మనిషిని పట్టుకుని వడ్డుకు లాక్కొచ్చారు. కాలవరేవులోని పెద్దమెట్టు మీద పడుకోబెట్టారు ఆ మనిషిని.


’ ఆడమనిషి రా ‘అన్నాడు పనసపండు.


‘ఎవరైతే ఏంటి? ముందు ప్రాణాలు కాపాడాలి’ అన్నాడు జాంపండు. సూరిపండు ఆ అమ్మాయి పొట్టమీద రెండు చేతులూ పెట్టి నొక్కాడు. కొద్దిసేపటికి ఆమె నోట్లోంచి నీళ్ళు బయటకు వచ్చాయి. జాంపండు, పనసపండు తమ జేబుల్లోని కర్చీఫులు తీసి ఆ అమ్మాయి అరికాళ్ళు తడిలేకుండా తుడిచి, తమ చేతులతో ఆమె పాదాలు గట్టిగా రుద్దసాగారు. సూరిపండు మరోసారి ఆమె పొట్టమీద గట్టిగా నొక్కాడు. ఆమె నోట్లోంచి మళ్ళీ నీళ్ళు వచ్చాయి. కొద్దిగా మూలగసాగింది. సూరిపండు తన కర్చీఫ్ తో ఆమె చేతులు తడి లేకుండా తుడిచి, చేతులు గట్టిగా రుద్దాడు. సత్తిపండు, రాంపండు తమ తడిబట్టలు పిండుకుని, మరలా అవే వేసుకుని, ఆ అమ్మాయికేసి ఆందోళనగా చూస్తున్నారు.


కొద్దిసేపటికి ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. చుట్టూ ఉన్న అబ్బాయిల్ని చూసి సిగ్గుపడింది. లేవబోతే, సూరిపండు “అక్కా,నెమ్మదిగా లే” అని ఆమె భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు.


“నన్ను ఎందుకు బతికించారు?” అని ఏడవడం మొదలుపెట్టింది.


ఆమె మెళ్ళో మంగళసూత్రాలు చూసి ఆమెకి పెళ్లి అయ్యిందని గ్రహించారు మిత్రులు.

“ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏం వచ్చింది అక్కా?” అడిగాడు జాంపండు.


ఆమె కళ్ళు తుడుచుకుని చెప్పింది.


“మాది పక్కనే ఉన్న ఏలేటిపాడు గ్రామం. చిన్నప్పుడే మా అమ్మా,నాన్న చనిపోతే మావయ్యే పెంచి పెద్దచేసాడు. ఈ ఊరి అబ్బాయితో పెళ్లి చేసి, మా అమ్మ పేరు మీద ఉన్న రెండెకరాలు కట్నంగా ఇచ్చాడు మావయ్య. మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ తల్లీ, తండ్రి మాట జవదాటరు. మా ఆయన రెండేళ్ళ క్రితం

పనికోసం దుబాయ్ వెళ్ళారు. అప్పటినుంచీ నా కష్టాలు మొదలయ్యాయి. ఇంటిపనంతా నాచేత చేయిస్తూ తిండి కూడా సరిగా పెట్టడం లేదు మా అత్త. మా మావయ్యా, అత్తయ్య హైదరాబాద్ లోని కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు. ఎవరితో మాట్లాడినా పెడర్ధాలు తీసి నన్ను హింసించేది మా అత్త.


మా మావగారు మా అత్తకు ఎదురు చెప్పరు. నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. మా అత్త పెట్టే చిత్రహింసలు పడలేక కాలవలో పడి నా బతుకు అంతం చేసుకోవాలనుకున్నాను. కానీ మీరు అడ్డుపడ్డారు” చిన్నగా ఏడవసాగింది ఆమె.


ఆమె బాధ చూసి మిత్రులు అందరూ ఆవేదన చెందారు.


”అక్కా, మా నాన్న గారు, మునసబు రామిరెడ్డి గారు బాగా ఫ్రెండ్స్. నువ్వు మా ఇంటికిరా. మా నాన్నగారు నిన్ను మునసబు గారి దగ్గరకు తీసుకెళ్ళి నీ సమస్య పరిష్కారం చేస్తారు” అన్నాడు సత్తిపండు.


“వద్దు వద్దు.. మా ఇంటి గొడవలు నలుగురికీ తెలిశాయని మా ఆయన నన్ను దూరం పెడతారు” అంది కంగారుగా ఆమె.


ఈలోగా ఇద్దరు పెద్దవాళ్ళు బాటరీ లైట్ వేసుకుని కాలవగట్టుకి వచ్చారు. ఆ అమ్మాయిని, చుట్టూ ఉన్న అబ్బాయిల్ని చూసి కంగారుపడ్డారు. పెద్దాయన “రా అమ్మా. మన ఇంటికి వెళ్ళిపోదాం” అని ఆ అమ్మాయితో అన్నాడు.


ఆయన, ఆ అమ్మాయి మావగారని గ్రహించారు మిత్రులు. ‘ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారు? చంపేస్తారా మా అక్కని’ కోపంగా అడిగాడు జాంపండు.


పెద్దాయన భార్య ముందుకు వచ్చి, ఆ అమ్మాయి చేతులు పట్టుకుని ‘నన్ను క్షమించమ్మా. నిన్ను చాలా బాధపెట్టాను. ఇంక నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్ము’ అంది.


సూరిపండు పెద్దాయన మొహంకేసి పరిశీలనగా చూసి ‘మీరు తేతలవారి వీధిలో ఉంటారుగా’ అన్నాడు.


పెద్దాయన ‘అవునని’ తలూపాడు.


పిల్లలు తమని గుర్తు పట్టారని పెద్దాయన, భార్య గ్రహించి వాళ్లకు నమస్కరించారు. ”బాబూ, ఈ విషయం నలుగురికి తెలిస్తే తలెత్తుకుని బతకలేం. మా కోడల్ని మంచిగా చూసుకుంటాం. మీరు ఎవరికీ చెప్పకండి” అన్నారు.


ఆ అమ్మాయి “తమ్ముళ్ళూ, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా అత్తా, మామ నన్ను బాగా చూసుకుంటామని చెప్పారుగా. మీరు ఈ సంగతి ఎవరికీ చెప్పమని నాకు మాట ఇవ్వండి.” అని చెయ్యి చాపింది.


మిత్రబృందం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.


“సరే అక్కా. నువ్వు కాలవలో పడిన సంగతి ఎవరికీ చెప్పం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి మీద వొట్టు.” అని అయిదుగురూ ఆమె చేతిలో చేయివేసి ప్రమాణం చేసారు.


పనసపండు పెద్దాయన కేసి తిరిగి ”అక్కకి ఎవరూ లేరని అనుకుంటున్నారు. ఇవాల్టి నుంచి అక్కకు ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారని గుర్తు పెట్టుకోండి. ఏమైనా తేడా వస్తే

ఊరుకోం. మా పెదనాన్న గారి అబ్బాయి, అంటే మా అన్నయ్య తణుకులో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వాడితో చెబుతాను” అని అన్నాడు.


పెద్దాయన భార్య కంగారుగా ”అటువంటిది ఏం ఉండదు బాబూ. అందరం మంచిగానే ఉంటాం” అంది.


ఆ అమ్మాయి అత్తా, మామలతో కలిసి వెళ్లి పోయింది.


జాంపండు, పనసపండు కేసి తిరిగి ’మీ అన్నయ్య తణుకులో ఇనస్పెక్టరా? ఇన్నాళ్ళూ చెప్పలేదేం?’ అన్నాడు. పనసపండు చిన్నగా నవ్వుతూ’ వాళ్ళని బెదిరించడానికి అలా అన్నాను. అంతే’ అన్నాడు. అంతా సజావుగా జరిగినందుకు ఐదుగురు ఆనందించి ఇళ్ళకు వెళ్ళిపోయారు. నాలుగురోజులు పోయాకా ఎలా తెలిసిందో ఊళ్ళో వాళ్లకు తెలిసింది, ‘పంచ పండులు’ ఎవరో అమ్మాయి కాలవలో దూకితే, బయటకు తీసి రక్షించారని.


ఎంతో మంది అడిగారు వాళ్ళని ‘ఎవరా అమ్మాయని?’.


కానీ ఎవరికీ వాళ్ళు చెప్పలేదు తాము రక్షించింది ఫలానా అమ్మాయని.

సత్తిపండు, సూరిపండు డిగ్రీలు అయ్యాక హైదరాబాద్ లో ఉద్యోగాలలో కుదురు కున్నారు. జాంపండు చెన్నై లో, పనసపండు బెంగుళూరు లో ప్రైవేటు కంపనీలలో పనిచేస్తున్నారు. రాంపండు పెనుగొండలోనే ఉండి, అకౌంట్స్ రాస్తూ జీవిస్తున్నాడు.


సంక్రాంతి పండుగకు అందరూ తప్పకుండా కలుసుకుని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటారు. పైకి అల్లరి పిల్లలుగా కనిపించినా, గ్రామంలో చాలా మందికి ఉపకారం చేసి మెప్పు పొందారని ఇప్పటికీ పెనుగొండలో ‘పంచ పండులు’ గురించి చెప్పుకుంటారు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

1 Comment


సత్యనారాయణ మూర్తి గారు రాసిన "పంచ పండు" ల కధ చాలా బాగుందండి.

అలాంటి సానుకూలత నేడు మనుషుల్లో కొరవడుతున్నది.

రచయితకి అభినందనలు - Madduri Bindumadhavi

Like
bottom of page