top of page
Original.png

ప్రభాత సూరీడు

#ప్రభాతసూరీడు, #PrabhathaSureedu, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Prabhatha Sureedu - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 21/02/2026

ప్రభాత సూరీడు - తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

“ఏమండీ, మిమ్మల్నే. బయల్దేరారా, లేదా? అందరూ మీ గురించి అడుగుతున్నారు?” ఫోనులో అడిగిన శ్రీమతి ప్రశ్నకి దీర్ఘంగా నిట్టూర్చాను.


“అబ్బా! బయల్దేరాను. బస్టాండ్‌లో ఉన్నాను. బస్సు రాగానే వస్తాను, సరేనా?” అని ఫోన్ కట్ చేశాను. ఈలోగా అమలాపురం బైపాస్ బస్సు హారన్ వేస్తూ ప్లాట్‌ఫారం మీదకు వచ్చింది. ఒక్కొక్కరే బస్సు ఎక్కుతున్నారు. అయిదు నిమిషాలకు బస్సు సగం నిండింది. నేను కూడా ఎక్కి కూర్చున్నాను. ముందు ఉన్న సింగిల్ సీట్‌లో కూర్చున్నాను. నాకు ఎడమ పక్కనే సోఫా లాంటి పొడవు సీట్ ఉంది. బహుశా లాంగ్ జర్నీలలో రెండో డ్రైవర్ దీని మీద పడుకుని రెస్ట్ తీసుకుంటాడనుకుంటా.

డ్రైవర్ అందర్నీ టికెట్లు తీసుకోమని చెప్పాడు. నేను అంబాజీపేటకు టికెట్ తీసుకున్నాను. రేపు ఉదయమే మా మేనల్లుడి కొడుకు ఉపనయనం, గంగలకుర్రు అగ్రహారంలో. శ్రీమతి రెండు రోజుల ముందే వెళ్ళింది అక్కడికి. ఆమెది కొత్తపేట. ఆ ప్రాంతంలో ఏదైనా శుభకార్యక్రమం వచ్చిందంటే, రెండు రోజులు ముందు వెళ్తుంది. ఆ ఫంక్షన్ అయ్యాక మరో రెండు రోజులు ఉండి తన స్నేహితులు అందరినీ కలిసి వస్తుంది. ఇది ఆమెకు అలవాటు.


సుమారు నలభై సంవత్సరాల వ్యక్తి, చేతిలో చిన్న సంచీతో బస్సు ఎక్కి, రావులపాలెం టికెట్ తీసుకుని, పొడవు సీట్ మీద కూర్చున్నాడు. ఒంటి గంట నలభై అయిదు అవగానే డ్రైవర్ బస్సు స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి లోపలకు తొంగి చూసి, “బావగారూ! ఇంకా పది సీట్లు ఖాళీ ఉన్నాయి. కాసేపు ఉండండి” అని అన్నాడు.


“లేదయ్యా, టైం అయిపోతే కంట్రోలర్ ఒప్పుకోడు. ప్లాట్‌ఫారం ఖాళీ చేయమని అంటాడు” అన్నాడు డ్రైవర్. ఆ వ్యక్తి లేచి డోర్ దగ్గర నిలబడి, “అమలాపురం, అమలాపురం, ఏలూరు, గూడెం, తణుకు, రావులపాలెం, రండి, రండి!” అని గట్టిగా పిలిచాడు. ఒక నలుగురు బ్యాగులు పట్టుకుని వచ్చి బస్సు ఎక్కారు. ఈలోగా కాకినాడ బస్సు వాడు హారన్ కొట్టడంతో, డ్రైవర్ బస్సు రివర్స్ చేసి పాయింట్ ఖాళీ చేశాడు. కాకినాడ బస్సు వాడు వచ్చి తన బస్సు అక్కడ పెట్టాడు. నలుగురూ టికెట్లు తీసుకుని లోపలకు వెళ్లి కూర్చున్నారు. కొద్ది సేపటికి బస్సు బెంజ్ సర్కిల్ దగ్గరకు వచ్చింది. అక్కడో ఇద్దరు ఎక్కారు. వాళ్ళ బ్యాగులు అందుకుని లోపల పెట్టి వారికి సాయం చేశాడు ఆ వ్యక్తి.


అలాగే రామవరప్పాడు రింగ్ సెంటర్ దగ్గర కూడా బస్సు ఆగడం, మరో నలుగురు బస్సు ఎక్కడం, ఆ వ్యక్తి వారికి కూడా సాయం చేయడం జరిగింది. బస్సు అంతా నిండిపోవడంతో, ఇద్దరు వచ్చి ఆ వ్యక్తి పక్కనే, పొడవు సోఫా సీట్ మీద కూర్చున్నారు. ఆ వ్యక్తి ఫ్రంట్ జేబులోంచి ప్రసాదం తీసి, “బావగారూ! పొద్దున్న మన ఊరి ఫస్ట్ బస్సుకి వచ్చి, దుర్గమ్మ దర్శనం చేసుకున్నానండీ” అని డ్రైవర్‌కు ఇచ్చాడు. డ్రైవర్ ప్రసాదం కళ్ళకద్దుకుని తన సీట్ వెనక ఉన్న సంచీలో పెట్టుకున్నాడు. ఇంకో ఉండ తీసి తన పక్కన ఉన్న ఇద్దరికీ పెట్టాడు. నన్ను అడిగాడు, “బాబుగారూ, ప్రసాదం తీసుకుంటారా?” అని.


“నేను ఇక్కడే ఉంటాను. చాలా సార్లు గుడికి వెళ్లాను,” అన్నాను నేను. దానికి ఆ వ్యక్తి కళ్ళు పెద్దవి చేసి, “మీరు శానా అదృష్టవంతులు అండీ బాబూ. దుర్గమ్మ తల్లి ఊళ్ళో ఉంటున్నారు!” అని మెచ్చుకోలుగా చూశాడు. నేను చిన్నగా నవ్వాను. అతను డ్రైవర్‌తో మాట్లాడుతూనే ఉన్నాడు.


పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర బస్సు ఆగగానే, జామకాయలు అమ్మేవాళ్ళు, వేరుశెనగ కాయలు అమ్మేవాళ్ళు బస్సు ఎక్కారు. ప్రయాణీకులు కొంతమంది తమకు కావాల్సినవి కొనుక్కున్నారు. బస్సు టోల్ గేట్ దాటగానే వాళ్ళు దిగిపోయారు.


ఆ వ్యక్తి డ్రైవర్‌కేసి తిరిగి, “బావగారూ! ఏమైనా మన కడియం జామకాయల రుచి శానా గొప్పదండీ. ఈ మధ్యన డాక్టర్లు చెప్పడంతో, అందరూ జామకాయల మీద పడ్డారండీ. చూశారా, అయిదు కాయలు కవర్లో పెట్టి, యాభై రూపాయలు అంటున్నాడు. మన సైడ్ అయితే యాభైకి ఎనిమిది, పది కాయలు వరకూ ఇస్తారు,” అని అన్నాడు. డ్రైవర్ 'ఊ' కొడుతూనే డ్రైవ్ చేస్తున్నాడు.


ఈలోగా ఒక చంటి పిల్ల ఏడుస్తోంది. తల్లి ఎంత ఊరుకోబెట్టినా, ఊరుకోవడం లేదు. ఆ వ్యక్తి తన సంచీలోంచి ఒక ప్లాస్టిక్ గిలక్కాయ తీసి, చప్పుడు చేస్తూ ఆ సీట్ దగ్గరకు వెళ్ళాడు. మూడేళ్ళ పిల్ల ఏడుపు ఆపి అతనికేసి ఆశ్చర్యంగా చూసింది. “శైలమ్మా, చూశావా? మా కోడలు పిల్ల ఏడుపు ఆపింది” అని నవ్వుతూ గిలక్కాయ చిన్న పిల్ల చేతిలో పెట్టి, సంచీలోంచి మరో ఉండ తీసి “దుర్గమ్మ ప్రసాదం తీసుకో అమ్మా” అని ఆవిడకు ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషించింది.


“నువ్వు శానా మంచోడివన్నా. ఆ అమ్మ నిన్ను చల్లగా చూస్తుంది,” అంది మెరుస్తున్న కళ్ళతో. అతను నెమ్మదిగా తన సీట్ దగ్గరకు వచ్చాడు. అతని సమయస్ఫూర్తికి, పరోపకారానికి నేనూ మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.


బస్సు హనుమాన్ జంక్షన్లో ఆగింది. నలుగురు దిగారు. అయిదుగురు ఎక్కారు. సుమారు యాభై ఏళ్ళ వయసావిడ, రెండు చేతి సంచులతో ఎక్కలేక అవస్థ పడుతుంటే అతను రెండు సంచులూ అందుకుని ఆవిడకు సాయం చేశాడు. లోపల ఖాళీ లేకపోవడంతో, ఆ వ్యక్తి లేచి ఆమెకు తన సీట్ ఇచ్చాడు. తను వెళ్లి ఇంజిన్ బోనెట్‌ మీద కూర్చున్నాడు. ఆ పెద్దావిడ తాడేపల్లిగూడెంకు టికెట్ ఇమ్మంది. డ్రైవర్ టికెట్ ఇవ్వగా ఆమె డబ్బులు ఇచ్చింది.


“అమ్మా, ఇంకా పదిహేను రూపాయలు ఇవ్వండి. ఇది సూపర్ లగ్జరీ బస్సు” అన్నాడు డ్రైవర్. ఆమె పర్సు వెతికి, “లేవు బాబూ, ఇందాకే దాహం వేస్తే కూల్ డ్రింక్ తాగాను. ఇప్పుడు ఎలా?” అంది దిగులుగా.


ఆమె అవస్థ చూసి, ఆ వ్యక్తి “ఫరవాలేదు పెద్దమ్మా. నేను ఇస్తానులే” అని జేబులోంచి పదిహేను రూపాయలు తీసి డ్రైవర్‌కు ఇచ్చాడు. నేను ఆశ్చర్యంగా అతనికేసి చూశాను. బస్సు ఊళ్ళోంచి బయటకు వచ్చి బైపాస్ రోడ్ మీదకు వచ్చింది.


“బావగారూ! మొన్న కొంత మంది పిల్లలు తమ ఊరు రోడ్ బాగోలేదని స్కూల్‌కు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని వీడియో పెడితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రోడ్ వేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పారు. అన్న ఎన్.టి.ఆర్. తర్వాత, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఆయనే అనిపిస్తోంది. ఏమంటారు?” డ్రైవర్‌తో అన్నాడు ఆ వ్యక్తి. డ్రైవర్ చిన్నగా నవ్వి రోడ్ మీదే దృష్టి పెట్టాడు.


బస్సు ఏలూరులో ఆగింది. నలుగురు దిగారు. ముగ్గురు ఎక్కారు. పొడవు సీట్ మీద ఒకరికి ఖాళీ ఉంది. అయినా ఆ వ్యక్తి బోనెట్‌ మీదే కూర్చుని డ్రైవర్‌తో కబుర్లు చెబుతున్నాడు. తాడేపల్లిగూడెం రాగానే పెద్దావిడ దిగుతూ, “వస్తాను బాబూ” అని ఆ వ్యక్తికి చెప్పి దిగింది. “జాగ్రత్తగా వెళ్ళు పెద్దమ్మా” అన్నాడు ఆ వ్యక్తి. బస్సులో జనాన్ని లెక్కపెట్టి చెప్పమన్నాడు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సు చివరకంటా వెళ్లి జనాన్ని లెక్కపెట్టి డ్రైవర్‌కు చెప్పాడు. డ్రైవర్ టికెట్ కొట్టే మెషిన్ చూసి, “ఇంకో మనిషి గూడెంలో దిగాలి. కొంచెం చూడు” అని అన్నాడు.


ఆ వ్యక్తి మళ్ళీ బస్సు చివరకంటా వెళ్లి, మధ్యలో నిద్రపోతున్న యువకుడిని లేపి, “ఎక్కడికెళ్ళాలి తమ్ముడూ?” అని అడిగాడు. కళ్ళు నులుముకుంటూ, “గూడెం” అన్నాడు ఆ యువకుడు. దానికి చిన్నగా నవ్వుతూ, “అత్తారింటికి వచ్చిన అల్లుడిలా మస్తుగా నిద్రపోతే ఎలా? బస్సు గూడెం దాటింది. రా రా” అన్నాడు ఆ వ్యక్తి. ఆ యువకుడు గబగబా లేచి డ్రైవర్ దగ్గరకు వచ్చాడు. అప్పటికి బస్సు ఫుడ్స్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చింది. డ్రైవర్ బస్సు ఆపాడు. ఆ యువకుడు బస్సు దిగడం, ఆ వ్యక్తి “రైట్ రైట్” అని చెప్పి మళ్ళీ బోనెట్‌ మీద కూర్చున్నాడు.


“అక్కడ సీట్ ఖాళీగా ఉందిగా. అక్కడ కూర్చో,” అన్నాడు డ్రైవర్ చిన్నగా నవ్వుతూ.


“ఎవరైనా ఆడవాళ్లు వస్తే కూర్చుంటారు అక్కడ. వాళ్ళు బోనెట్‌ మీద కూర్చోలేరుగా,” అన్నాడు ఆ వ్యక్తి. అల్లంపురం దగ్గర పెద్ద ఆంజనేయస్వామి బొమ్మ కనపడగానే, ఆ వ్యక్తి దణ్ణం పెట్టుకుని, “ఓసారి ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు చూశానండీ స్వామిని. అబ్బో! చాలా ఎత్తు ఆ విగ్రహం,” అని అన్నాడు. ఇరవై నిమిషాలలో బస్సు తణుకు బస్సు స్టాండ్‌కు వచ్చింది.


ఆ వ్యక్తి డ్రైవర్‌తో, “టీ తాగుదాం రండి బావగారూ!” అని అనడం, ఇద్దరం బస్సు దిగడం జరిగింది. ఒక పది నిమిషాలకు ఇద్దరూ వచ్చారు. ఆ వ్యక్తి బోనెట్‌ మీద కూర్చోగానే, పొడవాటి సీట్ మీద కూర్చున్న ఒకతను “ఏరా సూరీ, బెజవాడ వెళ్ళావా?” అని అడిగాడు.


అతనికేసి తిరిగి, “అవును రమణా. నువ్వేంటి ఇలా వచ్చావు?” అని అడిగాడు సూరి. అప్పుడు తెలిసింది అతని పేరు ‘సూరి’ అని.


“మా బావమరిది స్కూటర్ మీద నుంచి పడిపోయాడు. రెడ్డి గారి హాస్పిటల్‌లో ఉన్నాడు. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. చూసి వస్తున్నాను,” అని అన్నాడు. డ్రైవర్ అందరికీ టికెట్లు ఇచ్చాడు. రమణ కొత్తపేటకు టికెట్ తీసుకున్నాడు. వాళ్ళు ఇద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. రావులపాలెం రాగానే సూరి దిగిపోయాడు. ఎందుకో అతను వెళ్ళిపోగానే, గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్ళగానే ఖాళీ అయిపోయిన సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫారంలా అనిపించింది నాకు.


బస్సు రావులపాలెం దాటి బయటకు వచ్చి రోడ్ మీద వేగంగా పోతోంది. రమణ, “డ్రైవర్ గారూ, మా సూరీడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? చాలా ఎక్కువ మాట్లాడతాడు,” అని అడిగాడు.


డ్రైవర్, “అబ్బే, అదేం లేదు. బాగానే ఉన్నాడు. మంచి కాలక్షేపం” అని అన్నాడు.


“అతనిది వెన్న వంటి మనసు అండీ. ఎవరికి ఉపకారం చేయాలన్నా, ముందు ఉంటాడు. జేబులో ఎంత డబ్బు ఉంటే అంతా ఖర్చు పెట్టేస్తాడు. రేపు గురించి ఆలోచించడు. ఉన్న ఒక్క కూతురికి, వెదిరేశ్వరం పెద్ద రాజు గారి దయతో పెళ్లి చేశాడు. రావులపాలెంలోని అన్ని ఆసుపత్రులలో అతని ఫోన్ నెంబర్ ఉంటుంది.


ఎవరికి రక్తం కావాలన్నా ఇస్తాడు. ఇప్పటివరకు యాభై సార్లు అయినా రక్తదానం చేసి ఉంటాడు,” అన్నాడు రమణ మెరుస్తున్న కళ్ళతో.


నాకు చాలా ఆసక్తిగా ఉంది సూరి గురించి తెలుసుకోవాలని. “అతను ఏం చేస్తాడు?” అడిగాను రమణను.


“కూలి పని బాబూ. అరటి తోటల్లో గెలలు నరికి సైకిల్‌కు కట్టుకుని వచ్చి మార్కెట్‌కు తీసుకువస్తాడు. రైతులు ఆ గెలలు తీసుకు వచ్చినందుకు కూలి ఇస్తారు. ఆ డబ్బులతో వాడు, వాడి పెళ్ళాం బతుకుతారు.


పెద్దరాజు గారి అరటి తోటలకు శ్రద్ధగా కాపలా కాస్తాడు. వాటి సంరక్షణ కూడా వాడిదే. వెదిరేశ్వరం గ్రామంలో పండగైనా, దేవుడి సంబరం అయినా, అతడే ముందుంటాడు. అన్నీ తానే చక్కబెడతాడు. ఆ ఊరి ‘ఆణిముత్యం’ మా సూరిగాడే,” చెప్పాడు రమణ ఉత్సాహంగా, ఆప్యాయంగా.


ఈలోగా కొత్తపేట వచ్చింది. రమణ బస్సు దిగి వెళ్ళిపోయాడు. బస్సు ముందుకు కదిలింది. నా మనస్సు ఆలోచనలో పడింది.


ప్రతి నిమిషం రూపాయలు ఎలా సంపాదించాలి? ఎవడిని మోసం చేయాలి? అని ఆలోచిస్తూ, తనూ, తన కుటుంబం బాగుంటే చాలు, అని స్వార్థంతో బతుకుతున్న మనుషుల మధ్య, నిక్కమైన నీలంలా జీవిస్తున్న ‘సూరి’ లాంటి వారు ఉండడం విశేషం.


నిజమే, ఒక సూర్యుడు కొన్ని కోట్ల మందికి వెలుగునిస్తున్నాడు. ఈ ‘సూర్యుడు’ ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతున్నాడు. “ఓహ్, యు ఆర్ గ్రేట్ సూరి!” అని అసంకల్పితంగా సెల్యూట్ చేశాను. ఈలోగా అంబాజీపేట వచ్చింది. నేను బస్సు దిగాను. నా మనసు ఎంతో ఆనందంగా ఉంది.


సమాప్తం.


*******

M R V సత్యనారాయణ మూర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page