ప్రవర్తన - శిక్షణ - పార్ట్ 1
- Ayyala Somayajula Subramanyam

- 2 days ago
- 6 min read
Updated: 12 hours ago
#AyyalaSomayajulaSubrahmanyam, #ప్రవర్తనశిక్షణ, #PravarthanaSikshana, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #కొసమెరుపు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pravarthana Sikshana - Part 1/2 - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 22/12/2025
ప్రవర్తన - శిక్షణ - పార్ట్ 1/2 - పెద్ద కథ మొదటి భాగం
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
పసిపిల్లల ముద్దు మాటలు, కోపతాపాలు పెద్దల్ని అలరిస్తాయి. వీలైతే వాటిని ఆడియో, వీడియోల్లో రికార్డ్ చేసి పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక చూపిస్తే అదో గమ్మత్తు. రాఘవ గారికి ఇద్దరు మగపిల్లలు. , ఒక ఆడపిల్ల. అందరికీ పెళ్ళిళ్ళయ్యి సెటిల్ అయ్యారు.
ఇందిర పెద్దది. ఇందిర భర్త శేఖర్ రిలయన్స్ రిఫైనరీలో ఇంజనీర్. బొంబాయి లో వుంటారు. వాళ్ళకు ఇద్దరు మగపిల్లలు, ప్రణవ్ కు మూడేళ్ళు, కిరణ్ కు ఏడాది. ఇందిర భర్త ఏదో ట్రయినింగ్ కోసం యుఎస్. ఆరు నెలల కోసం వెళ్తే తల్లిదండ్రుల వద్దకు విజయవాడ కు వచ్చింది.
రెండవ వాడు రవీందర్ బెంగుళూర్ లో ఇంజనీర్. అతని భార్య దివ్య కూడా సాఫ్ట్ వేర్ జాబ్. వాళ్ళకి ఒక కూతురు అపర్ణ. రెండేళ్ళు. దివ్య తల్లిదండ్రులు కూడా బెంగుళూరు లోనే కూతురు ఇంటి దగ్గర్లోనే ఉంటారు. కూతురు ఆఫీసు కెళ్ళినప్పుడు మనవరాలిని వాళ్ళే చూసుకుంటారు.
ఆఖరి వాడు రైల్వేలో ఇంజనీర్. విజయవాడ లోనే ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర అతనే ఉంటాడు. అతనికి వివాహం అయింది. భార్య పేరు ప్రసన్న. వాళ్ళకి ఒక అబ్బాయి వంశీ. ఏడాది వాడు.
రాఘవ గారు ఆర్& బీ. లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. కృష్ణలంక లో మంచి ఇల్లు కట్టుకున్నారు. బాధ్యత లన్నీ తీరిపోయాయి. ప్రొద్దున్నే వాహ్యాళి,
సాయంత్రం గుడికి వెళ్ళి వస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇంతలో పక్కఇంటిలోంచి పెద్దగా ఘర్షణ వాతావరణం వినపడింది. ఏమిటా అని చూశాడు.
పక్కఇంటిలోంచి నారాయణ గారు తన పెద్ద కొడుకు రమేష్ మీద అరుస్తున్నారు. “ఒరేయ్; ఇదేం రోగంరా; పాతికేళ్ళు వచ్చాయి. చదువు రాలేదు. పోనీ నాతో పౌరోహిత్యానికి రమ్మంటే నామోషీ; మొహం చాటేస్తావు. అమ్మకు ఇచ్చిన డబ్బులన్నీ దొబ్బేస్తున్నావు. అడ్జమైన తిరుగుళ్ళు తిరిగి ఏ అర్ధరాత్రికో కొంపకు చేరుకుంటావు. నీ కన్నా చిన్నాడు బి. టెక్. పాసయ్యి హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నీకు బుద్ధి ఎప్పుడు మారుతుందో నాకు అర్థం కావడం లేదు.”
రమేశ్ ఊరుకోలేదు. ” మాట్లాడితే వాడితో పోలిక. చదివాడు లే బి. టెక్కు. అయినా వాడిని పెంచినట్లు నన్ను పెంచారా ఏమిటీ? ఎప్పుడూ చీవాట్లు. ఏదో అడుక్కునే వాడిలాగానే చూస్తారు నన్ను. ఛీ; ఛీ; మీ కడుపున ఎందుకు పుట్టానా అని ఏడుస్తున్నాను. ”’
“ఎంత మాట అన్నావురా త్రాష్టుడా, నిజమే నిన్ను పెంచినట్లు వాడిని పెంచలేదు. నీకు అన్ని అచ్చట్లు ముచ్చట్లు జరిపాము, ఇంటికి పెద్ద కొడుకువని. లోపం మా పెంపకం కాదు. నీ బుద్ది పెడదారి పట్టింది. ఏ తల్లిదండ్రులకయినా కడుపున పుట్టిన పిల్లలందరూ సమానమే.
ఒకరు తక్కువ. ఇంకొకరు ఎక్కువ వుండరు. మా బిడ్డలు కాబట్టే నీకు ఇంకా కూడు పెడుతున్నాం. లేకపోతే ఈ పాటికి బయటకు తరిమేసే వాళ్ళం “ అంటూ కోపంగా కేకలు వేశాడు నారాయణ.
“నన్ను తగలెయ్. పిండం పెట్టు.. అయినా పిండం పెడితే సంభావన ఎవరు ఇస్తారులే. అందుకని ఆ పని కూడా చేయవు. నాకు తెలుసు”. రమేష్ రెచ్చిపోయాడు.
నారాయణకి నోటమాట రాలేదు. దిగాలుపడి కూర్చున్నాడు.
“ఒరేయ్, ఒరేయ్; నాన్నగారిని అంతంత మాటలా అనేది. మంచీ చెడూ లేకుండా. ” నారాయణ భార్య కమలమ్మ కొడుకు మీద అరిచింది.
“ఆ మాట మీ ఆయనను అడుగు. కొడుకును తన్ని తరిమేస్తాడట”.
“మీరు కూడా ఏంటండి ఆమాటలు? మనం బతికున్నంత కాలం వాడికి తిండి పెట్టక తప్పదు. ఆ తరువాత ఏమవుతుందో ఎవరికి తెలుసు? మీరు అనవసరంగా వాడిని కదినించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ”.
“అది కాదు నాబాధ. వీడు చేసిన కార్యం ఇందాకే తెలిసింది, వీడు ఈ మధ్య తాగుడు కూడా మొదలెట్టాడని. అంతేకాదు. ఎవరో రామయ్యచౌదరీ గారట. నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడట. పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తానని చెప్పాడు. పైసా సంపాదన లేదు. వీడికి ప్రేమ ఏమిటీ?పెళ్ళేమిటీ” నారాయణ గారు మొత్తుకున్నారు.
“ఏడిశాడు. నేనే చంపేస్తాను వాణ్ణి. సరే ఈయన గోల ఎప్పుడూ ఉండేది. ఆకలి అవుతోంది అన్నం పెట్టు. ”.
“కాళ్ళు కడుక్కుని రా పెడతాను” లోపలికి వెళ్ళింది కమలమ్మ.
“ఛీ; కుక్క బతుకు. ” అనుకుని కండువా దులుపుకుని నారాయణ గారు బయటకు వెళ్ళారు. ఎంత వినవద్దనుకున్నా వాళ్ళ గొడవంతా ముందు వరండాలోనే జరగటం వలన విషయం అంతా రాఘవగారి కుటుంబానికి అర్థమయింది.
నారాయణగారు పౌరోహిత్యం మీద కుటుంబ భారం సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయనకు మంచి పేరుంది. ఒకప్పటి మాటేమో గానీ ఈ రోజుల్లో పౌరోహిత్యం మీద మంచి ఆదాయమే వస్తోంది. ప్రపంచం ఎంత ముందుకు పోయినా (అనుకుందాం) వైదికకర్మలకు, పూజలకు, ఆచార వ్యవహారాలకు మబ్బు పట్టలేదు.
ఇంకా ఎక్కువగా పాటిస్తున్నారు. ఆధునిక నాగరికతలోనే సంప్రదాయాలను మేళవించి కార్యక్రమాలను జరిపిస్తున్నారు. సెల్ ఫోన్లను వాడుతున్నారు. యజమానుల ఇళ్ళవరకూ బైకులమీద పాంటు, షర్ట్ లతో వెళ్ళి అక్కడ పంచలు మార్చుకుంటున్నారు. నెట్ ను ఉపయోగించి విదేశాల్లోని కార్యక్రమాలను ఇక్కడ నుంచే చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో సంఘాలుగా ఏర్పడి పనులను పంచుకుంటున్నారు.
ప్రతిచోటా ఉన్నట్టే కొంతమంది మధ్యం, ధూమపానం మొదలగు దుర్వ్యసనాలకు అలవాటు పడి ఉండవచ్చు. మహావుంటే రెండు మూడు శాతం ఉంటారేమో. అధికశాతం వృత్తి నైపుణ్యంతో నిర్వహించి మంచిపేరు తెచ్చుకుంటున్నారు.
అయితే జ్యోతిష్యం, పౌరోహిత్యం కేవలం పుస్తక పాండిత్యం మూలాన రాణించవు. ఈ వృత్తులను జీవనోపాధిగా చేసుకున్నవారు నిర్విరామ కృషి చేయాలి. ఓ తపస్సు లాగా మననం చేయాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ రోజూ రెండు మూడు గంటలు జపం చేయాలి. అప్పుడు వాళ్ళకి కొంత అతీంద్రియ శక్తులు లభిస్తాయి. వాక్శుద్ధి ఏర్పడుతుంది. వృత్తి మీద నిబద్ధత వస్తుంది.
నారాయణగారంటే రాఘవగారికి చాలా గౌరవం ఉంది. నారాయణ గారికి ఉన్న వాక్శుద్ధి మూలాన, ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే సలహాలు చుట్టుప్రక్కల వాళ్ళందరికీ ఎంతో మంచి చేస్తుండడం మూలాన ఆయన మాటంటే అందరికీ గురి.
రాఘవ గారి కుటుంబ విషయాల్లో కూడా ఆయన అనేక సలహాలు ఇచ్చారు. అటువంటి నారాయణ గారికి ఇటువంటి కొడుకు ఏమిటా అని బాధ పడ్డారు.
రమేష్ చిన్నప్పటి నుంచి సరిగా చదువు అబ్బలేదు. కానీ తండ్రి చేసే పూజలు, వాటి విధివిధానాలు కూలంకషంగా వచ్చు. చదువు రాలేదు కానీ, మిగిలిన విషయాల్లో మంచి ప్రజ్ఞావంతుడు. తండ్రి తో పాటు కార్యక్రమాలకు వెళ్ళేవాడు. రుద్రాభిషేకాలు చాలా నియమనిష్టలతో చేయించేవాడు.
అటువంటి సమయంలో పాడుబుద్ధి ఎలాపుట్టిందో. తండ్రితో ఓ రెండేళ్ళు చక్కగా వెళ్ళాడు. వీడు ఇరవై ఎనిమిదేళ్ళకి స్థిరమైన ఉపాధి చేస్తాడని జాతకంలో ఉంది. కానీ ఇప్పుడు వీడు ఇలా తయారయ్యాడేంటీ అని నారాయణ దంపతులు తలలు పట్టుకున్నారు. రాఘవ గారు కూడా రమేష్ ని పిలిచి మంచిమాటలు చెబితే ఎలా ఉంటుందని భార్యను సలహా అడిగాడు.
“నిజమేనండి. కానీ మనం ఏం చేయగలం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. తండ్రి మాటే వినని రమేష్ మీ మాట వింటాడా, వినకపోతే అనవసరంగా మీ గౌరవం పోతుంది. ఇంటినుండి వెళ్లగొడితే కానీ వాడికి బుద్ధి రాదు”. అన్నది ఆవిడ.
“అలా వెళ్ళకొడితే ఆగం చేసి నారాయణ గారిని రోడ్డు మీదకి ఈడుస్తాడు. అది లాభం లేదు. ఇంకేమన్నా ఆలోచించాలి. ” సాలోచనగా అన్నారు రాఘవ గారు. అప్పటికి ఇద్దరూ ఊరుకున్నారు.
ఒక్కొక్కసారి ఎంత వాళ్ళకయినా బుద్ధి వక్రించి బురద గుంటలోకి లాగుతుంటుంది.
——————————-+++++++++++
తెల్లారిన తరువాత పదిగంటలకు బయటకు వెళ్దామని రాఘవగారు బయలుదేరుతుంటే నారాయణగారు గేటు తీసుకుని లోపలికి వస్తూ కనిపించారు.
“రండి, నారాయణ గారూ”- అంటూ లోపలికి తీసుకెళ్ళారు. నారాయణ గారు లోపలికి వచ్చి కూర్చున్నారు.
“ఏమిటండీ, ఏమన్నా పని వుందా?”అడిగారు రాఘవ.
“ప్రత్యేకంగా ఏమీ లేదు. నాబాధ, మనోవ్యధ మీతోకాస్త పంచుకుంటే ఉపశమనం ఏమన్నా కలుగుతుందేమోనని మీ దగ్గరకు వచ్చాను” నారాయణ గారు తన ఆవేదనను వెలిబుచ్చారు.
“మీ పెద్దబ్బాయి రమేష్ గురించేనా మీ బాధ?”
“ఔనండీ?ఎందుకూ కొరగాకుండాా పోయాడు. ఏం పాపం చేశానని మాకు ఇటువంటి వాడు పుట్టాడు. వాడు చెడుతిరుగుళ్ళు తిరిగితే మా పెంపకంలో లోపమా చెప్పండి?”
“నారాయణ గారూ; మీరు అన్నీ తెలిసిన వారు. జీవితంలో పాపం, పుణ్యం, మంచీ, చెడూ అన్నీ వుంటాయి. ఏం పుణ్యం చేశారని మీ రెండో అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు. ఈ వూళ్ళో ఇంత మంచి ఇళ్ళు కట్ట కలిగారు. మన కుటుంబాలలో సాధారణంగా పెంపకం లోపం వుండదు. ఎందుకంటే మనదగ్గర విపరీతమైన విలాసాలకు కావలసిన డబ్బు వుండదు. అలాగే పక్క దోవలు పట్టాల్సిన విపరీత దరిద్రం వుండదు. పిల్లలను మామూలుగా పెంచుతాం. ఎక్కువ గారాబం చేయం.
క్రమశిక్షణ పేరుతో ఎక్కువగా దండించం. మా పిల్లలందరినీ చదువుకో చదువుకో అని ఎప్పుడూ విసిగించలేదు. వారంతట వారే బాధ్యతగా చదువుకున్నారు. ఉద్యోగాలు తెచ్చుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు.
మీ రెండో అబ్బాయి చక్కగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకోలేదూ. మీ రమేష్ ఎందుకిలా తయారయ్యాడంటే ఆ పాపం మీది కాదు. అతనిదే. ఓ సామెత వుంది. ’ పిల్లల్ని కంటాంగానీ, వాళ్ళ రాతలను కనలేం కదా’ అని. ఇది కరక్ట్” రాఘవ ఆగారు.
“ఏం చేస్తే వాడు బాగుపడతాడో నాకు అర్థం కావడం లేదు” నారాయణగారు ఆవేదనగా అన్నారు.
“అయ్యా, నారాయణగారూ; ఆలోచించండి. మీరు మహాపండితులు. ”
“అందుకనే పండిత పుత్ర పరమ శుంఠ అయ్యాడు”.
“మీ వాడు శుంఠ కాదు. శుంఠ అంటే తెలివి తక్కువ వాడు. మీవాడు మంచి తెలివైనవాడు. కాకపోతే వున్న తెలివిని సరిగా వాడని వాడు. వక్రబుద్ధి కలవాడు. ప్రాణులన్నిటికీ ఆహార, నిద్ర, మైధునాలు సర్వసామాన్యము. కానీ భగవంతుడు ఒక్క మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడని అంటారు. దానిని ఉపయోగించేవాడు బాగుపడతాడు. ఉపయోగించనివాడు చెడిపోతాడు. మీవాడు ఈ కోవకి చెందిన వాడు. వీడిని బాగుచేయాలంచే రెండు మార్గాలున్నాయి. ఒకటి మంచిమాటలు చెప్పడం. కానీ వీడు ఆ స్థాయి ని దాటిపోయాడు. నా దృష్టిలో. ఇక రెండోది సంబంధాలను తెంచేయడం.”
“అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టమంటారా?”
“కాదు. ఇంట్లంచి పంపిస్తే మనం బాధ పడతాం. ఏమైపోయాడో అని ఆందోళన పడతాం. ఎంతైనా కన్నకడుపు కదా: అందుకని ఇంట్లో ఉంచే దిమ్మతిరిగేలా నిరసన తెలియజేయాలి. ”
నారాయణ గారిలో ఆశ కనిపించింది. “అదే ఎలా?”
“సత్యాగ్రహమే మనకు మార్గం. మీరు వాడితో పూర్తిగా మాట్లాడటం మానండి. మీ శ్రీమతి గారు కూడా అతి తక్కువగా మాట్లాడాలి. తిండిపెట్టండి. అయితే మీ ఇంట్లో ఒకమనిషిగా చూడకండి. మీరేమీ మాట్లాడకపోతే అది అతనిలో ఒక విధమైన అభద్రతా భావాన్ని, భయాన్ని కలగజేస్తుంది. ప్రతిరోజు అతని పనులకు మీరు అడ్డు పడటం, అతను మీతో వాదనకు దిగి పోట్లాడడం, అతను మీతో కవ్వించటానికి ప్రయత్నించడం చేస్తాడు. మీరు కూడా మౌనంగా వుండండి. ఇది ఒక సైకలాజికల్ చికిత్స. ఈ చర్య అతనిలో మార్పు తెస్తుందని నా నమ్మకం. ఏమీ చెయ్యకుండా వుండటం కంటే ఏదో ఒకటి చెయ్యడం మంచిది. ప్రతివాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీ రమేష్ కు కూడా దీనివలన అటువంటి మలుపు వస్తుందని ఆశిద్దాం.” రాఘవగారు చెప్పటం ఆపారు.
“మీరు చెప్పినది చాలా బాగుంది. దీనివలన వాడు బాగుపడతాడని ఆశ కలుగుతోంది.”
“కరెక్ట్. మీరు అదే ఆశతో ఉండండి ఇవన్నీ మీకు తెలియనివి కావు. తెలుసు కానీ నిరాశతో కుంగిపోయి వున్నప్పుడు ఇటువంటి ఉపాయాలు తట్టవు. నీళ్ళలో మునిగిపోతున్న వాడు ఎలా బయటపడాలో తెలియక కొట్టుకుంటాడు. అలాగే మీరు. నేను ఒడ్డున వుండి మీకు చేయూత ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను. మీ రమేష్ తప్పక బాగుపడతాడు. ఆ విధంగా పాజిటివ్ గా ఆలోచించి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీ గాయత్రి మాత మీకు తప్పకుండా మేలు చేస్తుంది. ” రాఘవగారు నమ్మకంగా అన్నారు.
“మీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది. మీరు చెప్పినట్లే చేస్తాను. వాడి ఉనికిని పూర్తిగా పట్టించుకోను. వాడు రెచ్చగొట్టినా రెచ్చిపోను. నా గాయత్రి మాత నామీద దయ చూపిస్తుంది” నారాయణ గారు నమ్మకంగా అన్నారు.
“నేను వెళ్ళి వస్తాను” అంటూ నారాయణ గారు వెళ్ళారు.
భర్తతో “అదేమిటండీ, నారాయణ గారికి అటువంటి సలహా ఇచ్చాను. ఆయన మౌనంగా ఉంటే బాగుపడతాడా? గట్టిగా దండించాలి గానీ” అన్నది రాఘవ గారి భార్య సుభద్ర.
“దండించడానికి వాడు చిన్న పిల్లాడు కాడు. వాడిని వేరే విధంగా చూడాలి. అందుకనే అలా చెప్పాను.” అన్నారు రాఘవ గారు.
ఇంకా ఉంది
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments