top of page
Original.png

రైతన్న ఆలోచన

Jun 20
4 min read

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ ప్రేరణాత్మక తెలుగు కథ 'రైతన్న ఆలోచన' కథలో కూరగాయలు అమ్ముడవక ఇబ్బందులు పడుతున్న రైతు మాధవయ్య తన వినూత్న ఆలోచనతో విజయాన్ని సాధించిన చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ ప్రేరణాత్మక తెలుగు కథ 'రైతన్న ఆలోచన' కథలో కూరగాయలు అమ్ముడవక ఇబ్బందులు పడుతున్న రైతు మాధవయ్య తన వినూత్న ఆలోచనతో విజయాన్ని సాధించిన చిత్రం.

Raithanna Alochana - Telugu Inspirational Story | Bhanupriya

రైతన్న ఆలోచన - తెలుగు ప్రేరణాత్మక కథ | భానుప్రియ

Published In manatelugukathalu.com On 20/06/2026


నిన్నటి నిశీధిని తరిమికొడుతూ, ఉషోదయపు ఉషస్సు కొత్త ఆశను రేకెత్తిస్తూ మాధవయ్యను వేకువజామున లేపింది. 


"శారద, నేను కూరగాయలు తీసుకుని పట్నం పోతున్నాను. వీటిని అమ్ముకుని రాత్రికి వస్తాను" అని చెప్పి బయలుదేరుతున్న మాధవయ్యతో, "సరే కానీ, గుడిసెలో సరుకులు, బియ్యం నిండుకున్నాయి. ఈ రోజైనా దేవుడు కరుణించి కూరగాయలన్నీ అమ్ముడైపోతే ఇంటికి సరుకులు తీసుకురా" అని నిర్లిప్తతతో, బాధపడుతూ భర్త మాధవయ్యకు చెబుతుంది శారద. 


"సరేలే, నిన్నటిలా ఈరోజు గడవకుండా కొంతైనా గిరాకీ రాకపోదా" అంటూ, నెత్తి పైన కూరగాయల భారాన్ని, ఎదలో సంసార భారాన్ని మోస్తూ రెండు, మూడు కిలోమీటర్ల దూరం ఉన్న పట్నానికి బయలుదేరుతాడు గంపెడు ఆశతో.


ఎప్పటిలాగానే సూపర్ మార్కెట్ ముందు రోడ్డుపై తను కూర్చునే ప్రదేశంలో వెళ్లి తన కూరగాయల వ్యాపారాన్ని మొదలుపెడతాడు. 


రెండు, మూడు గంటలైనా, సాయంత్రమైనా కంఠశోష తప్ప ఎలాంటి గిరాకీ తన దరి చేరలేదు. 


అలా తన కళ్లు ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ పై పడగా, "ఏంటి! ఈ జనాలు తాజాగా, స్వశక్తితో నా చేతులతో పండించిన ఈ తాజా కూరగాయలను వదిలేసి, ఆ ఫ్రిడ్జ్లలో నెలల కొద్దీ నిల్వ ఉంచిన కవర్లలో అందంగా చుట్టేసి పెట్టే కూరగాయలను ఇంతలా ఇష్టపడుతున్నారు? ఏమిటో దేవుడా! ఈ విచిత్రం" అంటూ నెత్తిపై చేతులు పెట్టుకొని దిగాలుతో సాయంత్రం వరకు ఓపికతో కూర్చుంటాడు.


ఇక లాభం లేదు, చీకటి పడుతోంది, బేరాలు రావడం లేదని బాధపడుతూ, ఖాళీ కడుపుతో, ఖాళీ జేబుతో ఇంటి దారి పడతాడు. 


మాధవయ్య రావటం చూసిన శారద ఆతృతతో,

"ఏమయ్యా వచ్చావా! తొందరగా సరుకులు ఇవ్వు. ఈరోజు ఉన్న కొద్ది బియ్యంతో పిల్లలకు వండి పెట్టి, తినిపించి పడుకోబెట్టాను. మీరు వచ్చినాక చేద్దామని ఎదురుచూస్తున్నాను" అని చెప్పగానే మాధవయ్యకు కంటినీరు ఆగలేదు. 


ఏడుస్తూ ఒక్కసారిగా కింద కూలబడిపోయి, నెత్తిపై చేయి పెట్టుకొని బాధపడుతుండటంతో, "అయ్యో! ఏమైందయ్యా? ఎందుకు అలా బాధపడుతున్నావు?" అని కంగారు పడుతున్న శారదకు,

"ఏం చెప్పాలి శారద! ఈరోజు కూడా బేరాలేవీ రాలేదు. సంవత్సరం నుంచి మీకు సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇక నా బతుకు దండుగ. నేను అసమర్థుడిని, నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నాను" అంటూ బాధపడుతున్న మాధవయ్యను, "ఏం చేస్తాం అయ్యా! మన తలరాత అలా ఉంది. ఉన్న కొంచెం పొలంలో కష్టపడి కూరగాయలు పండించి అమ్ముకుందామని మనం అనుకుంటే, ఆ దైవం కూడా మనల్ని కరుణించడం లేదు.


మీరు బాధపడకండి. ఈ గంజి నీళ్లైనా తాగుదాము" అని ఇద్దరూ తాగి, పడుకుందామని పడుకోగా మాధవయ్య బాధతో ఆలోచనలో పడతాడు. 


'ఏమిటిది! నా భార్య పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను. చాలా రోజుల నుంచి గిరాకీలు కూడా రావడం లేదు. దీనికి తోడు ఎరువులు తెచ్చిన దుకాణదారుడు, పైసలు తెచ్చిన వెంకటేశ్వర్లు ఎల్లుండి వరకు తమ అప్పు ఎలాగైనా సరే తీర్చాలని గట్టిగా అడిగారు కదా! ఏం చేయాలో నాకు తోచడం లేదు' అంటూ తనలో తానే మధనపడుతూ, 'ఇక నావల్ల ఏదీ కాదు' అనుకుంటూ, 

తనకు తెలియకుండానే, 'ఇక నాకు ఏ దారి లేదు. నేను ఏమీ చేయలేను. ఇంకా ఆత్మహత్యే శరణ్యం' అని 

అటకపై తాడు కోసం చేయి పెట్టి వెతుకుతుండగా, చెయ్యికి ఏదో డబ్బా తగిలి కింద పడిపోగా, 'ఏమిటిది? ఏముంది ఈ డబ్బాలో?' అని చూడగా, 

'ఓహో ఇదా! ఇది రమేష్ గాడు మా ఇంటికి వచ్చినప్పుడు అటకపై మర్చిపోయాడు కదా. మళ్లీ వచ్చినప్పుడు ఈ ఫోన్ తీసుకుంటాలే బాబాయి, ఆ ఫోన్ సరిగా పనిచేయడం లేదు అని' చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకుంటాడు. 


ఏదో పరధ్యానంలో ఉండి ఫోన్ ని నొక్కగా, ఒక రీల్ వెనుక ఒక రీల్ చూసిన మాధవయ్య, "ఏమిటో, ఏం తిక్క జనమో ఏమో! ఇంట్లో వండింది, ఏం తిన్నది, ఏం చేసింది... ఇలా ప్రతిదీ ఇలా పెడుతున్నారా!" అంటూ ఆ ఫోన్ పక్కన పెట్టి, అటకపై తాడును వెతికి పట్టుకొని చనిపోదామని తాడును బిగించుకుంటుండగా, ఒక్కసారిగా తన మెదడులోకి ఆ ఫోన్ లోని విషయాలు గుర్తొచ్చాయి. 


"అవును, జనాలందరూ ఈ ఫోన్లో ఏవేవో తమ విషయాలు, అనవసర విషయాలన్నీ, వార్తలన్నీ పెడుతున్నారు కదా! 


నేను ఈ ఫోన్లో వ్యవసాయం గురించి, నేను, ప్రతి రైతన్న పడుతున్న కష్టం గురించి వివరంగా చెప్పి వీడియో పెట్టి, 'ఈ వీడియో చూసినాకనే కూరగాయలు కొనండి' అని ఒక బోర్డు పెట్టి తన కూరగాయల వ్యాపారాన్ని నడుపుదాము" అనే మెరుపు ఆలోచన మాధవయ్యకు రాగానే, ఈ ఒక్క ప్రయత్నం చేద్దామని రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆలోచించి 

'ఒక రైతు కలుపు తీయటం, దుక్కి దున్నే రోజు నుంచి, కుప్పలూర్చి పంట చేైతికి వచ్చే వరకు ఎలాంటి కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నాడో, అవన్నీ వీడియోలో చూపించాలని' మనసులో అనుకొని,

 

తెల్లారేసరికి లేచి ఊర్లో కుర్రాళ్లతో ఫోను ఎలా వాడాలి, ఎలా వీడియో తీయాలి అని తెలుసుకుని, ఆ కుర్రాళ్లతో తన ఆలోచన తెలుపగా, 'ఇలాంటి వీడియోలు చాలా మంది తీస్తారు' అని తన ఆలోచనను తోసివేయగా 

'ఎవ్వరేమనుకున్నా సరే, నా చివరి ప్రయత్నం నేను చేస్తాను' అంటూ తన మనసులో దృఢంగా సంకల్పించుకొని, పంట కాలంలో రైతు పడే కష్టాన్ని, అతని నిద్రలేని రాత్రులను, రైతు కాయలు కాసే చేతులను, పచ్చని పంట కోసం తన ఆవేదనను, పరిస్థితిని చాలా హృద్యంగా కళ్లకు కట్టినట్టుగా ప్రతి విషయాన్ని వీడియో తీసి పట్నానికి బయలుదేరుతాడు వ్యాపారానికి.


దేవుని మొక్కుకొని, 'ఈ నూతన సంవత్సరమైనా మా జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని' కోరుకుంటూ, 'వీడియో చూశాకే కూరగాయలు కొనండి' అనే ఒక బోర్డు తయారుచేసి పెట్టి చెట్టు దగ్గర ఫోన్ వీడియోను మొదలుపెడతాడు. 


మొదట ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిలో వాళ్లు వెళ్తుంటారు. 


మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరూ తన వీడియోను పట్టించుకోకపోయేసరికి "ఈ ప్రయత్నం కూడా ఇంకా వృధానేనా!" అనుకుంటూ తన మనసులో ఆవేదన పడుతుండగా, ఒకతను ఆగి చూసి, "ఇదేదో కొత్తగా ఉంది. ఏం వీడియో అబ్బాయి ఇది?" అని అలా ఆ వీడియోను ఒకరి తర్వాత ఒకరు చూస్తూ, "నిజంగా ఒక రైతు పంట పండించడానికి ఇంత శ్రమ పడుతున్నారా!" అంటూ ఒకరిద్దరు, ఇద్దరు పదుల సంఖ్యలో అలా మాధవయ్య కష్టాన్ని, ఆలోచనలను మెచ్చుకొని, చెప్పిన రేటుకు కూరగాయలన్నీ అమ్ముడైపోతాయి. 


అలా ఆరోజు రాత్రి మాధవయ్య సంతోషంతో, 'ఈ నూతన సంవత్సరం ఒక ఆలోచనతో కొత్త జీవితం మొదలైందని' అవధులు లేని ఆనందంతో కంటి నిండా నిద్రపోతాడు. 


మరునాడు కూడా చాలా తొందరగా కూరగాయలన్నీ అమ్ముడైపోయి సంతోషంతో ఇంటికి చేరుకోగా, ఇంటికి రాగానే ఫోన్ రావటంతో, 'ఇంత రాత్రిలో ఫోన్ ఎవరు చేశారబ్బా!' అని కంగారుగా ఫోన్ ఎత్తగా, "హలో మాధవరావు గారు అంటే మీరేనా!" అని అడగగా,

"హ, అవును అయ్యా. మీరెవరు?" అని అడగగా,

"మేము సీఎం ఆఫీసు నుంచి" అనగానే, "మాధవరావు కంగారుగా సీఎం ఆఫీసు నుంచా!" అని అంటుండగానే, "అవును, కంగారు పడవలసిన అవసరం లేదు. నువ్వు ఈరోజు చేసిన కూరగాయలు అమ్మే ఐడియాను నెట్ లో కొంతమంది పెట్టడం వల్ల, మీ సరికొత్త ఆలోచనను మెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అభినందించాలని" అటు నుంచి అంటుండగా, ఆ మాటలకు మాధవయ్య కళ్లను ఆనందబాష్పాలు ముంచెత్తాయి. 


"మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని, సీఎం గారు మీ కష్టాన్ని గుర్తించి మీకు పంట రుణమిచ్చి ఆదుకోవాలని అనుకుంటున్నారని, మీరు మీ పంట పత్రాలు తీసుకువచ్చి సీఎం ఆఫీసులో కలవగలరు" అని ఫోన్లో సమాచారం చెప్పగానే, మాధవయ్య ఇన్ని రోజుల నా కష్టానికి ఫలితం దక్కిందని నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాడు.


మరునాడు మాధవయ్య చుట్టుపక్కల ప్రాంతాలకు ఇంటికే తాజా కూరగాయలను చౌక ధరల్లో అందజేయాలనే ఆలోచనను కూడా ఆచరణలోకి తెచ్చి, అతి తక్కువ ధరలో అతి తాజా కూరగాయలను తన భార్య, పిల్లల సహాయంతో సకాలంలో చేరవేసి, తక్కువ కాలంలోనే అందరి మన్ననను పొంది, చావు దాకా వెళ్లిన తన ప్రయాణం ఒక్క ఆలోచనతో మలుపు తిరిగిందని అందరికీ హితబోధ చేస్తూ, ఉన్నతస్థాయికి చేరి, తనకు ఉన్నంతలో అందరికీ సహాయం చేస్తూ సాగిపోయే కొత్త ఆశలతో....

***

భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page