కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Saragala Samsaram' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
దీప కోసం అన్న రమేష్ ఒక మంచి సంబంధం తెచ్చాడు. వదిన సరోజ మరో సంబంధం చూసింది. రెండూ కాదని, తాను ఎంచుకున్న ధీరజ్ ను చేసుకుంది దీప.
మరి వారి జీవితం ఎలా సాగిందో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.
" దీపా ! ఇదిగో లంచ్ బాక్సు" పిలిచింది సరోజ.
" ధాంక్స్ వదినా!" అంటూ సరోజ చేతిలోంచి బాక్సును తీసుకుని హడావుడిగా ఆఫీసుకు వెళ్లింది దీప. మరి కాసేపటికి "సరూ! వెళ్లొస్తా! తలుపేసుకో " అంటూ భర్త రమేష్ కూడా ఆఫీసుకు వెళ్లాక, వీధి తలుపు వేసుకుని లోపలికి వచ్చి, మిగిలిన ఇంటిపనంతా పూర్తి చేసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాక ' దీపకు త్వరలో పెళ్లి చేస్తే బాగుండు. ఆరునెలల క్రితమే తమనందరినీ శాశ్వతంగా విడిచివెళ్ళిన అత్తగారు కూడా సంతోషిస్తారు. ఆవిడ పోయేదాకా దీప పెళ్ళి గురించే తపన పడి తన పెళ్ళి చూడాలని ఆరాటపడింది' అనుకుని అత్తగారిని తలుచుకుని గతాన్ని గుర్తుచేసుకుంది సరోజ.
అప్పుడే చదువు పూర్తయి క్రొత్తగా ఉద్యోగంలో చేరినందున "ఇప్పుడే నాకు పెళ్లి వద్దు" అని దీప చెప్పటంతో "సరే" అని ఇంట్లో అందరూ ఆవిషయం గురించి పట్టించుకోలేదు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఒకరోజున హార్ట్ ఎటాక్ తో నిద్ర లోనే దీప తల్లి చనిపోయింది. జరిగినదానికి అందరూ ఎంతో బాధపడి మిగిలిన కార్యక్రమాలన్నీ యధావిధిగా పూర్తిచేశారు. క్రమేపీ దీప, రమేష్ లు మామూలు జీవనస్ధితి లోకి వచ్చి యధావిధిగా ఆఫీసులకు వెళుతున్నారు.
'దీపకు తన బాబాయి కొడుకు వాసుతో పెళ్లి చేస్తే బాగుండు. అతను ఈ ఊరిలోనే మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధ్ధిమంతుడు కూడా. అతనితో పెళ్లైతే దీప తమ కళ్లముందే ఉంటుంది. సాయంత్రం ఆఫీసునుంచి రాగానే భర్తతో చెప్పి దీప అభిప్రాయం కూడా కనుక్కోవాలి' అనుకుంది సరోజ.
సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక భర్తకు , దీపకు టీ, స్నాక్స్ ఇచ్చి తనూ తీసుకుంది. కాసేపటికి దీప తన గదిలోకి వెళ్లి లాప్ టాప్ లో ఏదో పనిచేసుకుంటోంది. వాసుతో దీప పెళ్లి విషయమై తనకొచ్చిన ఆలోచనను భర్తకు చెప్పింది. వెంటనే "సరూ! నేను దీప పెళ్ళి విషయమై నాకొచ్చిన ఆలోచనను నీతో చెప్పి నీకు ఇష్టమైతే తన అభిప్రాయాన్ని కనుక్కుందామనుకుంటున్నాను " అన్నాడు రమేష్.
" ఏంటో చెప్పండి " అంది సరోజ.
" నా చిన్ననాటి స్నేహితుడు రమణ నీకు తెలుసు కదా ! వాడి కొడుకు ప్రసాద్ బాంకులో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రాన్సఫర్ అయి ఇటీవలే వచ్చాడు. వాడు బుధ్ధిమంతుడు కూడా. పైగా ఈ సంబంధాన్ని కలుపుకుంటే మా స్నేహబంధం ఇంకా బలపడుతుంది. దీప కూడా మన కళ్లముందే సుఖంగా ఉంటుంది. ఏమంటావు సరూ " అన్నాడు రమేష్.
లాప్ టాప్ లో పనిచేసుకుంటున్న దీపకు బయట అన్నావదినల మాటలు వినపడుతున్నాయి. తన పేరు ప్రస్తావన వచ్చేటప్పటికి 'ఏంటా' అని ఆసక్తిగా వింటున్న దీపకు అది తన పెళ్లి విషయమని అర్థమై వాళ్ల అభిప్రాయాలను విని వెంటనే వాళ్ల వద్దకు వచ్చింది దీప.
"అన్నయ్యా ! వదినా ! మీ మాటల మధ్యలో కల్పించుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నాపెళ్లి గురించి ప్రస్తావన కనుక గత రెండు నెలలుగా నేను మీతో ఒక విషయం చెపుదామనుకుంటున్నాను. నేను, మా కొలీగ్ ధీరజ్ ప్రేమించుకుంటున్నాము. అతను చాలా మంచివాడు. మా మనసులు కలిశాయి. మీ అంగీకారంతో మేము పెళ్లికి శ్రీకారం చుట్టి క్రొత్త జీవితం మొదలు పెడదామనుకుంటున్నాము " అంది దీప.
దీప మాటలను విన్న రమేష్, సరోజలు బిత్తరపోయారు. దీప ఇంకా చిన్నపిల్లే అనుకుంటున్న వాళ్లకు తన ప్రేమ విషయం సుతరామూ ఇష్టంలేక సీరియస్ గా ఎడమొఖం పెడమొఖంగా ముఖాలు పెట్టారు. వాళ్ల భావాలను గమనించిన దీప వాళ్లకు ధీరజ్ ను గురించిన వివరాలను ఇచ్చి 'రేపే ధీరజ్ ను ఇంటికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను. అతన్ని చూసి అతనితో మాట్లాడాక అతని మాట, నడవడి మీకు తప్పక నచ్చి మీరు మా పెళ్లికి అంగీకరిస్తారు చూడండి" స్ధిరంగా అంది.
ఆ మరురోజు ధీరజ్ ను ఇంటికి తీసుకొచ్చి తన అన్నావదినలకు పరిచయం చేసింది దీప. ఆతర్వాత అతని రాక పోకలతో కొన్ని రోజులకు నెమ్మది నెమ్మదిగా అతని మాట తీరు , దీప పైన అతనికున్న ప్రేమ రమేష్ వాళ్లకు అర్ధమైంది. ధీరజ్ కూడా తన తల్లి తండ్రులకు దీపను పరిచయం చేశాడు. వాళ్లకు కూడా దీప నడవడిక, ప్రవర్తన నచ్చింది . దీప మనసెరిగిన వాడిగా రమేష్ వాళ్ల ప్రశంశను చూరగొన్నాడు ధీరజ్. ఒక శుభముహూర్తాన రిజిష్టర్ ఆఫీసులో దీప అన్నావదినలు, ధీరజ్ తల్లితండ్రుల సమక్షంలో దీప, ధీరజ్ లు దంపతులయ్యి ఆ ఊరిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని క్రొత్త కాపురం మొదలుపెట్టారు.
ప్రతిరోజూ ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్లి రావడం , వారాంతంలో సాయంత్రం సరదాగా షికార్లతో అన్యోన్యంగా, సంతోషంగా సంసారం చేసుకుంటున్నారు దీప, ధీరజ్ లు. రోజులు హాయిగా
గడిచిపోతున్నాయి. ఆరోజు వాళ్ల పెళ్లిరోజు . ఆఫీసుకు ఇద్దరూ శెలవు పెట్టి ఆరోజు ప్రొద్దున్నే గుడికి వెళ్లి, ఆ తర్వాత హోటల్, షాపింగ్ చేసి ఆ రాత్రికి ఇంటికి చేరారు దీపధీరజ్ లు.
" రాగాలా - సరాగాల , హాసాలా - విలాసాలా సాగే సంసారం ఆ. . . . . సుఖజీవన సారం" అనే తన కిష్టమైన పాటను పాడుతూ దీపను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ధీరజ్. నవ్వుతూ భర్త కౌగిలిలో గువ్వలా మరింత ఒదిగిపోయింది దీప.
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments